మీకిది తెలుసా?
ప్రాచీనకాలాల్లో, నిజంగా ఒకరి పొలంలోకి వేరొకరు వచ్చి గురుగులు విత్తేవాళ్లా?
మత్తయి 13:24-26 వచనాల ప్రకారం, యేసు ఇలా అన్నాడు: “పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను.” ఈ ఉపమానంలోని సంఘటన నిజంగా జరిగిందా అని కొంతమంది రచయితలు సందేహపడ్డారు. కానీ ఒకప్పుడు ప్రాచీన రోములో ఉన్న చట్టాల్ని బట్టి చూస్తే అలాంటి సంఘటనలు నిజంగా జరిగేవుంటాయని చెప్పవచ్చు.
ఓ వ్యక్తి మీద పగ తీర్చుకోవడం కోసం అతని పొలంలోకి వెళ్లి గురుగులు విత్తడం రోమా చట్ట ప్రకారం నేరమని ఓ బైబిలు నిఘంటువు చెప్తోంది. ఆ నేరం కోసం ఓ చట్టం ఉందంటే అలాంటి సంఘటనలు జరిగాయని అర్థమౌతోంది. రోమా చక్రవర్తి అయిన జస్టినీయన్ సా.శ. 533లో, తాను రాసిన డైజెస్ట్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అందులో రోమా చట్ట సారాంశాన్ని, అలాగే సా.శ. 100 నుండి సా.శ. 250 మధ్యకాలంలో పౌర చట్టంలో నిష్ణాతులైన వ్యక్తులు చెప్పిన కొన్ని మాటల్ని రాశాడని న్యాయశాస్త్ర పండితుడైన అలస్టర్ కెర్ వివరించాడు. అయితే ఆ నిష్ణాతుల్లో ఒకడైన అల్పియన్ రెండవ శతాబ్దంలో జరిగిన ఓ కేసు గురించి ప్రస్తావించాడని డైజెస్ట్ పుస్తకంలో ఉంది. అదేమిటంటే, ఓ వ్యక్తి పొలంలో ఎవరో గురుగులు విత్తడంతో ఆ పంట నాశనమైంది. అలాంటి సంఘటన జరిగినప్పుడు, పంట నష్టం రావడం వల్ల అలా గురుగులు విత్తిన వ్యక్తి నుండి నష్ట పరిహారం వసూలు చేయడంలో చట్టపరంగా రైతుకు ఉండే హక్కుల గురించి డైజెస్ట్ చర్చిస్తుంది.
ప్రాచీన రోమా సామ్రాజ్యంలో అలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టి, యేసు ఉపమానంలో చెప్పిన సంఘటన నిజజీవితంలో జరిగి ఉంటుందని చెప్పవచ్చు.
మొదటి శతాబ్దంలో యూదయలోని యూదా అధికారులకు రోమా ప్రభుత్వం ఎంత స్వేచ్ఛ ఇచ్చింది?
ఆ కాలంలో, రోమా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే ఒక రోమా అధిపతి యూదయను పరిపాలించేవాడు. అతని ఆజ్ఞను పాటించే కొంతమంది సైనికులు అతని కింద ఉండేవాళ్లు. ఆ అధిపతి ముఖ్య పనేమిటంటే రోము కోసం ప్రజల దగ్గర పన్ను వసూలు చేయడం, శాంతి భద్రతల్ని కాపాడడం. రోమీయులు ముఖ్యంగా చట్టవ్యతిరేకమైన పనుల్ని అణచివేసి, శాంతిభద్రతలకు ముప్పు కలగజేసేవాళ్లను శిక్షించేవాళ్లు. కానీ, రోజువారీ వ్యవహారాలను చూసుకునే పనిని మాత్రం స్థానిక నాయకులకే వదిలేసేవాళ్లు.
యూదులకు మహాసభే ఉన్నత న్యాయస్థానంగా ఉంటూ, యూదా చట్టానికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేది. చిన్నచిన్న న్యాయస్థానాలు యూదయ అంతటా ఉండేవి. పౌర సమస్యలను, నేరాలకు సంబంధించిన కేసులను చాలావరకు ఆ న్యాయస్థానాలే చూసుకుని ఉండవచ్చు. వాటిలో రోమా అధికారులు జోక్యం చేసుకునేవాళ్లు కాదు. కానీ నేరస్థులకు మరణ శిక్ష విధించే అధికారం మాత్రం యూదా న్యాయస్థానాలకు ఉండేది కాదు, అది కేవలం రోమా అధికారులకే ఉండేది. కానీ స్తెఫను విషయంలో మాత్రం రోమీయులు కాదుగానీ మహాసభే అతన్ని రాళ్లతో కొట్టి చంపించింది.—అపొ. 6:8-15; 7:54-60.
ఆ విధంగా యూదా మహాసభకు చాలా అధికారం ఉండేది. కానీ, ఏమీల్ షూవెరర్ అనే విద్వాంసుడు ఇలా చెప్తున్నాడు, “ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తున్నారని రోమా అధికారులకు అనుమానం వస్తే వాళ్లు ఏ సమయంలోనైనా, ఎవ్వరి అనుమతి లేకుండా వచ్చి చర్య తీసుకోవచ్చు.” అలాంటి ఒక సంఘటనే సైన్యాధికారియైన క్లౌదియ లూసియ పర్యవేక్షణలో జరిగింది. అతను రోమా పౌరుడైన పౌలును బంధించాడు.—అపొ. 23:26-30.