మీరు ఎదురుచూస్తున్న వాటిపై విశ్వాసాన్ని బలపర్చుకోండి
“మనం ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మడమే విశ్వాసం.” —హెబ్రీ. 11:1, NW.
పాటలు: 54, 55
1, 2. (ఎ) మనం ఎదురుచూసే వాటికి, వేరే ప్రజలు ఎదురుచూసే వాటికి ఉన్న తేడా ఏమిటి? (బి) ఈ ఆర్టికల్‌లో వేటి గురించి చర్చించుకుంటాం?
యెహోవా చేస్తానని మాటిచ్చిన అద్భుతమైన విషయాల కోసం మనం ఎదురుచూస్తున్నాం. ఆయన తన పేరును పరిశుద్ధపర్చుకుని, పరలోకంలో అలాగే భూమిపై తన చిత్తం జరిగేలా చేస్తానని మాటిచ్చాడు. (మత్త. 6:9, 10) మనం ఎదురుచూస్తున్న ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు అవే. మనకు పరలోకంలో లేదా భూమిపై నిత్యజీవం ఇస్తానని కూడా యెహోవా మాటిచ్చాడు. అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! (యోహా. 10:16; 2 పేతు. 3:13) అంతేకాదు ఈ చివరిరోజుల్లో యెహోవా తన ప్రజల్ని ఎలా నడిపిస్తూ, వాళ్లకు మద్దతిస్తూ ఉంటాడో చూడాలని మనం ఎదురుచూస్తున్నాం.
2 మనం ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని ‘బలంగా నమ్మడమే’ విశ్వాసమని బైబిలు చెప్తోంది. అంటే విశ్వాసం ఉన్నవాళ్లు, యెహోవా మాటిచ్చినవన్నీ తప్పకుండా నెరవేరతాయనే నమ్మకం కలిగివుంటారని దానర్థం. (హెబ్రీ. 11:1, NW) అయితే ఈరోజుల్లో చాలామంది కొన్ని విషయాలు జరగాలని కోరుకుంటారు లేదా వాటికోసం ఎదురుచూస్తారు. కానీ అవి ఖచ్చితంగా జరుగుతాయనే నమ్మకం మాత్రం ఉండదు. ఉదాహరణకు, ఓ వ్యక్తి లాటరీ గెలవాలని కోరుకోవచ్చు, కానీ ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం అస్సలు పెట్టుకోలేడు. ఈ ఆర్టికల్‌లో, యెహోవా చేసిన వాగ్దానాలు నెరవేరతాయనే మన విశ్వాసాన్ని బలపర్చుకోవాలంటే ఏమి చేయవచ్చో తెలుసుకుంటాం. బలమైన విశ్వాసం ఈరోజుల్లో ఎలా సహాయం చేయగలదో కూడా చర్చించుకుంటాం.
3. దేవుడు మాటిచ్చినవన్నీ నెరవేరుతాయని మనమెందుకు నమ్ముతాం?
3 మనలో ఎవ్వరికీ పుట్టుకతోనే విశ్వాసం ఉండదు. విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే మన హృదయాలపై పవిత్రశక్తి పనిచేయడానికి అనుమతించాలి. (గల. 5:22) పవిత్రశక్తి, మనకు యెహోవా గురించి తెలుసుకునేందుకు సహాయం చేస్తుంది. యెహోవా సర్వశక్తిమంతుడని, జ్ఞానవంతుడని మనం అర్థంచేసుకున్నప్పుడు ఆయన మాటిచ్చిన వాటన్నిటినీ నెరవేర్చే సామర్థ్యం ఆయనకు ఉందనే నమ్మకం మనలో కలుగుతుంది. నిజానికి యెహోవా ఏదైనా చేస్తానని మాటిస్తున్నప్పుడు అది అప్పటికే నెరవేరిపోయినట్లుగా ఆయన చెప్తాడు. అందుకే ఆయన ఇలా చెప్తున్నాడు, “అవి నెరవేరాయి.” (ప్రక. 21:3-6, NW) యెహోవా ఏదైనా మాటిస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడని మనకు తెలుసు. ఆయన ‘నమ్మదగిన దేవుడు.’ అందుకే భవిష్యత్తు గురించి ఆయన చెప్పేవాటన్నిటినీ మనం నమ్ముతాం.—ద్వితీ. 7:9.
బలమైన విశ్వాసం చూపించిన ప్రాచీనకాలంలోని దేవుని సేవకులు
4. ప్రాచీనకాలంలోని దేవుని సేవకులు దేనికోసం ఎదురుచూశారు?
4 యెహోవా మాటిచ్చినవన్నీ నెరవేరతాయనే బలమైన విశ్వాసం చూపించిన 16 మంది స్త్రీపురుషుల పేర్లు హెబ్రీయులు 11వ అధ్యాయంలో ఉన్నాయి. ‘తమ విశ్వాసముతో’ యెహోవాను సంతోషపెట్టిన ఎంతోమంది ఇతరుల గురించి కూడా ఆ అధ్యాయంలో ఉంది. (హెబ్రీ. 11:39-40) యెహోవా వాగ్దానం చేసిన ‘సంతానం’ కోసం వాళ్లందరూ ఎదురుచూశారు. ఆ ‘సంతానం’ దేవుని శత్రువులందర్నీ నాశనం చేసి, ఈ భూమిని మళ్లీ పరదైసుగా మారుస్తాడనే విశ్వాసం వాళ్లు చూపించారు. (ఆది. 3:15) యెహోవా తమను తిరిగి బ్రతికిస్తాడని ఆ దేవుని సేవకులందరూ బలంగా నమ్మారు. అయితే వాళ్లు పరలోక జీవితం కోసం ఎదురుచూడలేదు ఎందుకంటే పరలోక పునరుత్థానానికి యేసు అప్పటికింకా మార్గం తెరవలేదు. (గల. 3:16) కాబట్టి వాళ్లు ఈ భూమ్మీద అందమైన పరదైసులో నిత్యం జీవించాలని ఎదురుచూశారు.—కీర్త. 37:11; యెష. 26:19; హోషే. 13:14.
5, 6. అబ్రాహాము, అతని కుటుంబం వేటికోసం ఎదురుచూశారు? వాళ్లు తమ విశ్వాసాన్ని ఎలా బలంగా ఉంచుకున్నారు? (ప్రారంభ చిత్రం చూడండి.)
5 నమ్మకమైన ఆ సేవకుల గురించి హెబ్రీయులు 11:13లో ఇలా ఉంది, ‘వాళ్లందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపక పోయినా, దూరంనుండి చూసి వందనము చేసి, విశ్వాసముగలవాళ్లై మృతి పొందారు.’ వాళ్లు కొత్తలోకం కోసం ఎదురుచూస్తూ, అందులో జీవిస్తున్నట్లు ఊహించుకున్నారు. అలాంటివాళ్లలో అబ్రాహాము ఒకడు. అతను ఆ ‘దినము చూస్తానని మిగుల ఆనందించాడని’ యేసు చెప్పాడు. (యోహా. 8:56) శారా, ఇస్సాకు, యాకోబు ఇంకా ఎంతోమంది కూడా “దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైయున్నాడో” ఆ రాజ్యం ఈ భూమిని పరిపాలించే సమయం కోసం ఎదురుచూశారు.—హెబ్రీ. 11:8-11.
6 అబ్రాహాము, అతని కుటుంబం తమ విశ్వాసాన్ని ఎలా బలంగా ఉంచుకున్నారు? వాళ్లు యెహోవా గురించి నేర్చుకుంటూ ఉండడం ద్వారా తమ విశ్వాసాన్ని బలంగా ఉంచుకున్నారు. కొన్ని సందర్భాల్లో యెహోవా వాళ్లతో దేవదూతల ద్వారా, దర్శనాల ద్వారా, కలల ద్వారా మాట్లాడాడు, వాటి సహాయంతో యెహోవా గురించి నేర్చుకున్నారు. బహుశా నమ్మకమైన వృద్ధుల నుండి లేదా ప్రాచీన రాతలు నుండి కూడా యెహోవా గురించి నేర్చుకుని ఉంటారు. అబ్రాహాము, అతని కుటుంబం యెహోవా వాగ్దానాలను ఎన్నడూ మర్చిపోలేదు, వాళ్లు వాటిగురించి లోతుగా ఆలోచిస్తూ ఉండేవాళ్లు. అలా చేయడంవల్ల, యెహోవా తన వాగ్దానాల్ని ఖచ్చితంగా నేరవేరుస్తాడనే విశ్వాసం వాళ్లలో కలిగింది. కాబట్టి తీవ్రమైన కష్టాలు, హింసలు ఎదురైనప్పుడు కూడా వాళ్లు యెహోవాకు నమ్మకంగా ఉన్నారు.
7. మన విశ్వాసాన్ని బలపర్చడానికి యెహోవా ఏమి ఇచ్చాడు? మనమేమి చేయాలి?
7 మరి, విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి మనకేమి సహాయం చేస్తుంది? భవిష్యత్తుకు సంబంధించిన తన వాగ్దానాల గురించి నేర్పించడానికి యెహోవా మనకు బైబిలు ఇచ్చాడు. మనం సంతోషంగా ఉండడానికి ఏమి అవసరమో ఆయన అందులో తెలియజేస్తున్నాడు. అందుకే మనం ప్రతీరోజు బైబిలు చదవాలి, అందులో ఉన్నవాటి ప్రకారం నడుచుకోవాలి. (కీర్త. 1:1-3; అపొస్తలుల కార్యములు 17:11 చదవండి.) అంతేకాదు తన ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుడు’ ద్వారా ఆయన మనకు “తగినవేళ” ఆహారం అందిస్తున్నాడు. (మత్త. 24:45) కాబట్టి ప్రాచీనకాలంలోని దేవుని ప్రజల్లాగే మనం కూడా దేవుని వాగ్దానాల గురించి క్రమంగా చదవాలి, లోతుగా ఆలోచించాలి. అలా చేస్తే దేవునికి నమ్మకంగా ఉండగలుగుతాం, ఆయన రాజ్యం భూమిని పరిపాలించే సమయం కోసం ఎదురుచూడగలుగుతాం.
8. విశ్వాసాన్ని బలపర్చుకునేందుకు ప్రార్థన మనకెలా సహాయం చేస్తుంది?
8 విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి ప్రాచీనకాలంలోని దేవుని ప్రజలకు ఇంకా ఏమి సహాయం చేసింది? వాళ్లు సహాయం కోసం యెహోవాకు ప్రార్థన చేసేవాళ్లు. ఆయన వాటికి జవాబివ్వడం గమనించినప్పుడు వాళ్ల విశ్వాసం మరింత బలపడింది. (నెహె. 1:4, 11; కీర్త. 34:4, 15, 17; దాని. 9:19-21) అదేవిధంగా, యెహోవా మన ప్రార్థనలు విని మనకు సరిగ్గా అవసరమైనదాన్ని సరైన సమయంలో ఇవ్వడం చూసినప్పుడు ఆయనపై మనకున్న విశ్వాసం మరింత బలపడుతుంది. (1 యోహాను 5:14, 15 చదవండి.) అంతేకాదు, మన విశ్వాసాన్ని మరింత పెంచుకునేలా తన పవిత్రశక్తిని సహాయంగా ఇవ్వమని యెహోవాను అడుగుతూ ఉండాలి.—లూకా 11:9, 11-13.
9. మనం ఏ విషయాల గురించి ప్రార్థించాలి?
9 మనం యెహోవాకు ప్రార్థిస్తున్నప్పుడు, కేవలం మన అవసరాల గురించి అడిగితే సరిపోదు. ఆయన మనకోసం ఎన్నో అద్భుతమైనవాటిని చేశాడు కాబట్టి ఆయనకు ప్రతీరోజు కృతజ్ఞతలు చెప్పాలి, స్తుతించాలి. (కీర్త. 40:5) అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరసహోదరీల కోసం కూడా మనం ప్రార్థించాలి. ఉదాహరణకు, ‘చెరసాలలో ఉన్నవాళ్ల’ గురించి, ‘నాయకత్వం వహిస్తున్నవాళ్ల’ గురించి కూడా ప్రార్థించాలి. మన ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిస్తాడో చూసినప్పుడు మన విశ్వాసం మరింత బలపడుతుంది, ఆయనకు మరింత దగ్గరౌతాం.—హెబ్రీ. 13:1-3, 7, NW.
వాళ్లు విశ్వాసం విషయంలో రాజీపడలేదు
10. ధైర్యంగా ఉంటూ యెహోవాకు నమ్మకంగా ఉండడానికి చాలామందికి ఏమి సహాయం చేసింది?
10 హెబ్రీయులు 11వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, ‘స్త్రీలు మరణించిన తమవాళ్లను పునరుత్థానం ద్వారా తిరిగి పొందారు. ఇతరులేమో హింసించబడినా, ఏదో విధంగా విడుదల పొందాలని విశ్వాసాన్ని వదులుకోలేదు, ఎందుకంటే వాళ్లు మెరుగైన పునరుత్థానం పొందాలని ఎదురుచూశారు.’ (హెబ్రీ. 11:35, NW) అవును, యెహోవా వాగ్దానం చేసిన పునరుత్థానం మీద బలమైన విశ్వాసం ఉండడంవల్ల ఎంతోమంది కష్టాల్ని సహించి ఆయనకు నమ్మకంగా ఉన్నారు. భవిష్యత్తులో ఆయన వాళ్లను తిరిగి బ్రతికిస్తాడని, అప్పుడు వాళ్లు భూమ్మీద నిత్యం జీవిస్తారని వాళ్లకు తెలుసు. నాబోతు, జెకర్యా గురించి ఓసారి ఆలోచించండి. దేవునికి నమ్మకంగా ఉన్నందుకు వాళ్లను రాళ్లతో కొట్టి చంపారు. (1 రాజు. 21:3, 15; 2 దిన. 24:20, 21) దానియేలును ఆకలితో గర్జిస్తున్న సింహాల గుహలో వేశారు, అతని స్నేహితులను మండే అగ్నిగుండంలో పడేశారు. వాళ్లు ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డారుగానీ అబద్ధ దేవుళ్లను ఆరాధించలేదు. యెహోవా తమకు పవిత్రశక్తిని ఇచ్చి ఆ కష్టాల్ని సహించడానికి సహాయం చేస్తాడనే బలమైన విశ్వాసాన్ని వాళ్లు చూపించారు.—హెబ్రీ. 11:33, 34; దాని. 3:16-18, 20, 28; 6:13, 16, 21-23.
11. విశ్వాసం కారణంగా కొంతమంది ప్రవక్తలు ఎలాంటి కష్టాల్ని సహించారు?
11 మీకాయా, యిర్మీయా వంటి ఎంతోమంది ప్రవక్తలను ఎగతాళి చేశారు, జైల్లో వేశారు. ఏలీయా వంటి మరితరులు ‘అడవుల్లో, కొండలమీద, గుహల్లో, సొరంగములలో తిరుగులాడుతూ సంచరించారు.’ వాళ్లందరూ వాటిని సహించి దేవునికి నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్లు ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మారు.—హెబ్రీ. 11:1, 36-38; 1 రాజు. 18:13; 22:24-27; యిర్మీ. 20:1, 2; 28:10, 11; 32:2.
12. అందరికన్నా పెద్ద కష్టాన్ని సహించిన వ్యక్తి ఎవరు? సహించడానికి ఆయనకు ఏమి సహాయం చేసింది?
12 యేసుక్రీస్తు అందరికన్నా పెద్ద కష్టాన్ని సహించి, యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. యేసు ఎలా సహించగలిగాడు? పౌలు ఇలా అన్నాడు, “ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.” (హెబ్రీ. 12:1, 2) ఆ తర్వాత పౌలు, యేసు ఆదర్శాన్ని “తలంచుకొనుడి” అని క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. (హెబ్రీయులు 12:3 చదవండి.) యెహోవాకు నమ్మకంగా ఉన్నందుకు యేసులాగే మొదటి శతాబ్దంలోని చాలామంది క్రైస్తవులు తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. వాళ్లలో అంతిప ఒకడు. (ప్రక. 2:13) అలాంటివాళ్లు భూమ్మీద నిత్యజీవం కోసం ఎదురుచూస్తున్న ఇతర సేవకుల్లా కాకుండా, పరలోకానికి పునరుత్థానం అవ్వడం ద్వారా ఇప్పటికే తమ బహుమానాన్ని పొందారు. (హెబ్రీ. 11:35) అవును చనిపోయిన అభిషిక్త క్రైస్తవులు, 1914లో యేసు రాజైన కొంతకాలానికి పునరుత్థానమై పరలోకానికి వెళ్లారు. వాళ్లు యేసుతో కలిసి మనుష్యులను పరిపాలిస్తారు.—ప్రక. 20:4.
బలమైన విశ్వాసం ఉన్న మనకాలంలోని దేవుని సేవకులు
13, 14. రూడాల్ఫ్ ఎలాంటి కష్టాల్ని అనుభవించాడు? వాటిని సహించడానికి అతనికి ఏమి సహాయం చేసింది?
13 మనకాలంలోని లక్షలాది దేవుని సేవకులు యేసు అడుగుజాడల్లో నడుస్తున్నారు. వాళ్లు దేవుని వాగ్దానాల గురించి లోతుగా ఆలోచిస్తూ, కష్టాల్లో సహితం ఆయనకు నమ్మకంగా ఉంటున్నారు. అలాంటి వాళ్లలో రూడాల్ఫ్ గ్రైఖెన్ ఒకడు. అతను 1925లో జర్మనీలో పుట్టాడు. అతని చిన్నప్పుడు, వాళ్ల అమ్మానాన్నలు బైబిల్లోని విషయాలకు సంబంధించిన చిత్రాలను గోడకు తగిలించేవాళ్లు. అతనిలా రాశాడు, “ఒక చిత్రంలో తోడేలు-గొర్రెపిల్ల, మేకపిల్ల-చిరుత, దూడ-సింహం కలిసి ఒకే చోట ఉన్నట్లు, వాటిని ఒక చిన్నపిల్లవాడు తోలుకెళ్తున్నట్లు ఉండేది.” (యెష. 11:6-9) భూపరదైసు గురించి ఎక్కువగా ఆలోచించడానికి, దానిపై మరింత విశ్వాసం పెంచుకోవడానికి అది అతనికి సహాయం చేసింది. దానివల్ల అతను యెహోవాకు నమ్మకంగా ఉండగలిగాడు. ఆఖరికి నాజీ రహస్య పోలీసుల చేతుల్లో, తూర్పు జర్మనీకి చెందిన కమ్యూనిస్ట్ స్టాజీ చేతుల్లో ఎన్నో ఏళ్లు దారుణంగా హింసించబడినప్పటికీ నమ్మకంగా ఉండగలిగాడు.
14 రూడాల్ఫ్ ఇంకా ఎన్నో ఇతర కష్టాల్ని కూడా అనుభవించాడు. అతని అమ్మ, రావన్స్‌బ్రూక్‌లోని కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ఉండగా టైఫస్ వ్యాధితో చనిపోయింది. అతని నాన్న, తానిక యెహోవాసాక్షిని కాదని రాసివున్న కాగితాలపై సంతకం పెట్టాడు. కానీ రూడాల్ఫ్ మాత్రం తన విశ్వాసాన్ని బలంగా ఉంచుకున్నాడు. అతను జైలు నుండి విడుదలయ్యాక ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవ చేశాడు. ఆ తర్వాత గిలియడ్ పాఠశాలలో శిక్షణ తీసుకుని, మళ్లీ ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవ చేయడానికి చిలీకి వెళ్లాడు. అక్కడ మిషనరీగా సేవ చేస్తున్న పాట్సీ అనే ఓ సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఓ సంవత్సరం తర్వాత వాళ్ల కూతురు చనిపోయింది. అది జరిగిన కొంతకాలానికి పాట్సీ కూడా చనిపోయింది, అప్పటికి ఆమె వయసు 43 ఏళ్లే. ఇన్ని చేదు అనుభవాలు ఎదురైనా రూడాల్ఫ్ మాత్రం యెహోవాను సేవించడం మానలేదు. వయసుపైబడి, ఆరోగ్యం పాడైనా అతను క్రమ పయినీరుగా, సంఘపెద్దగా సేవ చేశాడు. అతని జీవిత కథను 1997, ఆగస్టు 1 కావలికోట సంచికలోని 20-25 పేజీల్లో చదవవచ్చు.
15. హింసలు అనుభవిస్తున్నప్పటికీ యెహోవాకు ఆనందంగా సేవచేస్తున్న మనకాలంలోని సహోదరసహోదరీల ఉదాహరణలు కొన్ని చెప్పండి.
15 మనకాలంలోని చాలామంది సహోదరసహోదరీలకు తీవ్రమైన హింసలు ఎదురౌతున్నప్పటికీ యెహోవాకు ఆనందంగా సేవ చేస్తున్నారు. వాళ్లలో వందలమంది ‘కత్తి పట్టుకోనందుకు’ ఎరిట్రియ, సింగపూర్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో జైల్లో ఉన్నారు. (మత్త. 26:52) ఉదాహరణకు ఈసాక్, నెగెడె, పౌలోస్ అనే సహోదరులు 20 ఏళ్లుగా ఎరిట్రియాలోని జైల్లో ఉంటున్నారు. అక్కడ వాళ్లను క్రూరంగా హింసించారు. వాళ్లకు పెళ్లి చేసుకునే లేదా తమ తల్లిదండ్రుల మంచిచెడులు చూసుకునే అవకాశం కూడా లేదు. అయినాసరే వాళ్లు యెహోవాకు నమ్మకంగా ఉన్నారు. హింసలు అనుభవిస్తున్నప్పటికీ వాళ్ల ముఖాల్లో కనిపించే చిరునవ్వును jw.org వెబ్‌సైట్‌లో ఉన్న వాళ్ల ఫోటోలో చూడవచ్చు. దాన్నిబట్టి వాళ్ల విశ్వాసం బలంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు వాళ్ల జైలు గార్డులు సహితం వాళ్లను గౌరవిస్తున్నారు.
16. బలమైన విశ్వాసం మీకెలా సహాయపడుతుంది?
16 ఈ సహోదరుల్లా, యెహోవా ప్రజల్లోని చాలామంది జైల్లో లేరు లేదా క్రూరమైన హింసలు అనుభవించట్లేదు. కానీ చాలామంది పేదరికం వల్ల, ప్రకృతి విపత్తుల వల్ల, దేశ యుద్ధాల వల్ల బాధలు అనుభవించారు. ఇంకొంతమంది అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోషే వంటి వాళ్లను అనుకరిస్తూ యెహోవా సేవపై మనసుపెట్టేందుకు వీలుగా తమ పేరును, సంపదను వదులుకున్నారు. యెహోవా సేవ చేస్తూ సంతోషంగా ఉండడానికి మన సహోదరులకు ఏమి సహాయం చేస్తాయి? యెహోవాపై ప్రేమ, ఆయన చేసిన వాగ్దానాలపై బలమైన విశ్వాసం సహాయం చేస్తాయి. న్యాయం వెల్లివిరిసే కొత్తలోకంలో ఆయన తన నమ్మకమైన సేవకులకు నిత్యజీవం ఇచ్చి దీవిస్తాడని వాళ్లకు తెలుసు.—కీర్తన 37:5, 7, 9, 29 చదవండి.
17. మీరు మీ విశ్వాసాన్ని ఎలా బలంగా ఉంచుకుంటారు? తర్వాతి ఆర్టికల్‌లో దేనిగురించి చర్చిస్తాం?
17 మనం ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మడమే విశ్వాసమని ఎలా చెప్పవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకున్నాం. అలాంటి విశ్వాసం కలిగివుండాలంటే, మనం యెహోవాకు ప్రార్థించాలి, ఆయన వాగ్దానం చేసిన వాటిగురించి లోతుగా ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు ఎలాంటి కష్టాన్నైనా సహించగలుగుతాం. విశ్వాసం కలిగివుండడమంటే ఏమిటో వివరించే మరిన్ని విషయాలను తర్వాతి ఆర్టికల్‌లో చర్చించుకుందాం.