కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసువైపు నిలబడిన అరిమతయియ యోసేపు

యేసువైపు నిలబడిన అరిమతయియ యోసేపు

అరిమతయియ యోసేపు, తాను రోమా అధిపతి దగ్గరకు వెళ్లి ధైర్యంగా మాట్లాడగలనని అనుకోలేదు. పొంతి పిలాతుకు మహా మొండివాడనే పేరుంది. అయితే యేసును గౌరవపూర్వకంగా సమాధి చేయాలంటే ఆయన శరీరాన్ని తీసుకెళ్లడానికి ఎవరోఒకరు పిలాతును అనుమతి అడగాలి. ఏదేమైనా, యోసేపు భయపడినట్లుగా ఏమీ జరగలేదు. యేసు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆయన శరీరాన్ని తీసుకెళ్లడానికి పిలాతు అనుమతిచ్చాడు. యోసేపు బరువెక్కిన గుండెతో యేసును చంపిన స్థలానికి పరుగెత్తుకెళ్లాడు.—మార్కు 15:42-45.

  • అరిమతయియ యోసేపు ఎవరు?

  • యేసుతో అతనికున్న సంబంధమేమిటి?

  • అతని గురించి తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

మహాసభ సభ్యుడు

పవిత్రశక్తి సహాయంతో రాయబడిన మార్కు సువార్తలో, యోసేపు “మహాసభలో మంచి పేరున్న సభ్యుడు” అని ఉంది. ఈ మహాసభ యూదులకు ఉన్నత న్యాయస్థానంగా, అత్యున్నత పరిపాలనా విధానంగా ఉండేది. (మార్కు 15:1, 43) యోసేపు కూడా యూదులకు నాయకుడే కాబట్టి రోమా అధిపతిని కలిసి మాట్లాడే అవకాశం అతనికి దొరికింది. పైగా అతను ధనవంతుడు కూడా.—మత్త. 27:57.

యేసును మీ రాజుగా అంగీకరించే ధైర్యం మీకుందా?

ఒక గుంపుగా మహాసభ యేసుకు వ్యతిరేకంగా ఉండేది. మహాసభ సభ్యులు యేసును చంపాలని కుట్రపన్నారు. అయితే యోసేపుకు “మంచివాడు, నీతిమంతుడు” అనే పేరు ఉంది. (లూకా 23:50) మహాసభలోని చాలామంది ఇతర సభ్యుల్లా కాకుండా యోసేపు నిజాయితీగా ఉండేవాడు. అంతేకాదు తప్పుడు పనులకు దూరంగా ఉంటూ దేవుని ఆజ్ఞల్ని పాటించడానికి చేతనైనంత కృషిచేసేవాడు. యోసేపు “దేవుని రాజ్యం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు” అందుకే అతను యేసుకు శిష్యుడై ఉంటాడు. (మార్కు 15:43; మత్త. 27:57) బహుశా సత్యాన్ని, న్యాయాన్ని తన జీవితంలో ప్రాముఖ్యంగా ఎంచడం వల్లే అతను యేసు ప్రకటించిన సందేశానికి ఆకర్షితుడై ఉంటాడు.

రహస్య శిష్యుడు

“యోసేపు యేసు శిష్యుడు, కానీ యూదులకు భయపడి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు” అని యోహాను 19:38 చెప్తోంది. యోసేపు దేనికి భయపడ్డాడు? యూదులు యేసును ఎంతగా ద్వేషిస్తున్నారో, ఆయనపై విశ్వాసముంచే వాళ్లను మహాసభ నుండి వెలివేయాలని ఎంత కసిగా ఉన్నారో యోసేపుకు తెలుసు. (యోహా. 7:45-49; 9:22) మహాసభ నుండి వెలివేసిన వ్యక్తిని తోటి యూదులు పనికి రానివానిలా, అంటరానివానిలా చూస్తారు. అందుకే యోసేపు యేసుపై తన విశ్వాసాన్ని బయటపెట్టే సాహసం చేయలేదు. ఒకవేళ బయటపెడితే అతని హోదా, పరువు చేజారిపోతుంది.

ఇలాంటి భయాలున్న వ్యక్తి కేవలం యోసేపు మాత్రమే కాదు. “యూదుల నాయకుల్లో కూడా చాలామంది ఆయనమీద [యేసుమీద] విశ్వాసముంచారు. కానీ సభామందిరం నుండి వెలివేయబడతామేమో అని పరిసయ్యులకు భయపడి ఆ విషయాన్ని ఒప్పుకోలేదు” అని యోహాను 12:42 చెప్తోంది. నీకొదేము అనే వ్యక్తిది కూడా యోసేపు లాంటి పరిస్థితే, అతను కూడా మహాసభలోని సభ్యుడే.—యోహా. 3:1-10; 7:50-52.

యోసేపు విషయానికొస్తే, అతను యేసు శిష్యుడే అయినప్పటికీ ఆ విషయాన్ని అందరిముందు బయట పెట్టలేకపోయాడు. అలా చెప్పలేకపోవడం చిన్న విషయం కాదు, ఎందుకంటే యేసు ఇలా అన్నాడు, “మనుషుల ముందు నన్ను ఒప్పుకునే ప్రతీ ఒక్కర్ని, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. అయితే మనుషుల ముందు ఎవరైనా నన్ను తిరస్కరిస్తే, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు అతన్ని తిరస్కరిస్తాను.” (మత్త. 10:32, 33) యోసేపు నిజంగా యేసును తిరస్కరించలేదు, అలాగని తాను యేసు శిష్యుడినని చెప్పే ధైర్యం కూడా చేయలేదు. మరి మీ విషయమేమిటి? అలా చెప్పే ధైర్యం మీకుందా?

అయితే యోసేపు చేసిన మంచి పనేంటంటే, యేసును చంపడానికి కుట్ర చేసిన మహాసభతో అతనుచేతులు కలపలేదని బైబిలు చెప్తోంది. (లూకా 23:51) కొంతమంది మాత్రం, యేసును విచారిస్తున్నప్పుడు యోసేపు అక్కడ లేడని అంటారు. ఏదేమైనా, న్యాయాన్ని తప్పుదారి పట్టించడం చూసి యోసేపు ఖచ్చితంగా కృంగిపోయి ఉంటాడు. కానీ అతను చేయగలిగింది కూడా ఏమీ లేదు.

భయాన్ని అధిగమించాడు

యేసు చనిపోయే సమయానికల్లా యోసేపు తన భయాల్ని అధిగమించాడని, యేసు శిష్యులకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నాడని మార్కు 15:43⁠లోని మాటల్ని బట్టి అర్థమౌతోంది. అక్కడిలా ఉంది, “ఇతను ధైర్యం తెచ్చుకొని పిలాతు దగ్గరికి వెళ్లి యేసును సమాధి చేయడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు.”

యేసు చనిపోయినప్పుడు యోసేపు అక్కడే ఉన్నట్లు అనిపిస్తోంది. నిజానికి యేసు చనిపోయాడనే విషయం పిలాతు కన్నా ముందు యోసేపుకు తెలుసు. అందుకే యేసు శరీరాన్ని అప్పగించమని యోసేపు అడిగినప్పుడు, “యేసు చనిపోయాడో లేదో పిలాతు తెలుసుకోవాలనుకున్నాడు.” (మార్కు 15:44) ఇంతకీ యోసేపులో మార్పు ఎలా వచ్చింది? హింసాకొయ్యపై యేసు పడుతున్న వేదన చూసి, యోసేపు తనను తాను పరిశీలించుకున్నాడా? అందుకే సత్యం వైపు నిలబడాలని నిర్ణయించుకున్నాడా? అలా జరిగే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా చివరికి యోసేపు ముందడుగు వేయగలిగాడు. ఇక అతను రహస్య శిష్యుడు కాదు.

యోసేపు యేసును సమాధి చేయడం

యూదా ధర్మశాస్త్రం ప్రకారం మరణశిక్ష విధించబడినవాళ్లను సూర్యాస్తమయానికి ముందే సమాధి చేయాలి. (ద్వితీ. 21:22, 23) కానీ రోమా దేశంవాళ్లు మాత్రం నేరస్థుల శరీరాలు కుళ్లిపోయేలా కొయ్యమీదే వదిలేసేవాళ్లు లేదా లోయలోకి విసిరేసేవాళ్లు. యేసుకు అలా జరగడం యోసేపుకు ఇష్టంలేదు. యేసును చంపిన స్థలానికి దగ్గర్లో కొత్తగా తొలిచిన ఒక రాతి సమాధి ఉంది, అది యోసేపుకు చెందినది. దానిలో అప్పటివరకు ఎవర్నీ పెట్టకపోవడాన్ని బట్టి యోసేపు కొంతకాలం క్రితమే అరిమతయియ a నుండి యెరూషలేముకు వచ్చాడని, తన కుటుంబసభ్యుల కోసం ఆ సమాధిని తొలిపించి ఉంటాడని అర్థమౌతోంది. (లూకా 23:53; యోహా. 19:41) యోసేపు తన కోసం తొలిపించుకున్న ఆ సమాధిలో యేసును పాతిపెట్టడం ద్వారా ఉదారస్వభావాన్ని చూపించాడు. అంతేకాదు మెస్సీయ ధనవంతుని దగ్గర సమాధి చేయబడతాడనే ప్రవచనం కూడా నెరవేరింది.—యెష. 53:5, 8, 9.

మీకు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది యెహోవాతో ఉన్న స్నేహమా లేదా మరేదైనానా?

యేసు శరీరాన్ని కొయ్య మీదనుండి దింపిన తర్వాత యోసేపు ఆయన్ను నాణ్యమైన నారవస్త్రంలో చుట్టి తనకోసం తొలిపించుకున్న సమాధిలో పెట్టాడని నాలుగు సువార్తలు చెప్తున్నాయి. (మత్త. 27:59-61; మార్కు 15:46, 47; లూకా 23:53, 55; యోహా. 19:38-40) యోసేపుకు సహాయం చేసిన వ్యక్తుల్లో నీకొదేము పేరు మాత్రమే బైబిల్లో ఉంది, అతను యేసు శరీరం మీద పూయడానికి సుగంధ ద్రవ్యాలను తెచ్చాడు. అయితే వీళ్లిద్దరూ బాగా పేరున్న వ్యక్తులు కాబట్టి యేసు శరీరాన్ని మోసుకెళ్లడంలో, పాతిపెట్టడంలో ఇంకొందరు వాళ్లకు సహాయం చేసివుంటారు. బహుశా వాళ్లు తమ సేవకుల్ని ఉపయోగించుకుని ఉంటారు. వేరేవాళ్లను ఉపయోగించుకున్నప్పటికీ యోసేపు, నీకొదేము చేసినది చిన్నపనేమీ కాదు. ఎందుకంటే శవాన్ని ముట్టుకున్న వాళ్లెవరైనా ఏడు రోజులు కడగా ఉండాలి, వాళ్లు ఏది పట్టుకున్నా అపవిత్రం అవుతుంది. (సంఖ్యా. 19:11; హగ్గ. 2:13) దానివల్ల పస్కా పండుగ జరిగే వారంలో వాళ్లు కడగా ఉండాల్సి వస్తుంది. ఆ పండుగ ఆచారాలకు, సంబరాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. (సంఖ్యా. 9:6) యేసును పాతిపెట్టడానికి ముందుకు రావడంవల్ల యోసేపు మహాసభలోని తన తోటివాళ్ల ఎగతాళికి గురవ్వాల్సి వస్తుంది. కానీ యేసును గౌరవపూర్వకంగా సమాధి చేయడం కోసం ఎలాంటి అవమానాన్నైనా ఎదుర్కోవడానికి అతను సిద్ధపడ్డాడు. క్రీస్తు శిష్యుల్లో ఒకడిగా గుర్తించబడడానికి కూడా భయపడలేదు.

యోసేపు గురించిన చివరి ప్రస్తావన

సువార్త వృత్తాంతాల్లో, యేసును సమాధి చేయడం గురించి చెప్పినప్పుడు తప్ప అరిమతయియ యోసేపు ప్రస్తావన బైబిల్లో ఇంకెక్కడా లేదు. మరి ఆ తర్వాత అతనికి ఏం జరిగిందనే సందేహం మనకు రావచ్చు. ఏమో మనకు తెలీదు. అయితే ఇప్పటివరకు మనం పరిశీలించిన విషయాల్నిబట్టి చూస్తే, యోసేపు క్రైస్తవునిగా గుర్తించబడడానికి ఇష్టపడ్డాడని ఖచ్చితంగా తెలుస్తోంది. పరీక్షలు ఎదురైనప్పుడు అతని విశ్వాసం, ధైర్యం పెరిగాయే తప్ప తగ్గలేదు. అది మంచి సూచనే!

యోసేపు అనుభవాన్ని బట్టి మనందరం ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి: యెహోవాతో ఉన్న స్నేహానికి మనం అన్నిటికన్నా ముఖ్యమైన స్థానం ఇస్తున్నామా? లేకపోతే హోదాకు, కెరీర్‌కు, ఆస్తులకు, కుటుంబ బాంధవ్యాలకు, స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఇస్తున్నామా?

a అరిమతయియ ప్రాంతం బహుశా రామా అయ్యుంటుంది, ప్రస్తుతం దాన్ని రెంటిస్‌ (రాంటిస్‌) అని పిలుస్తున్నారు. అది సమూయేలు ప్రవక్త సొంతూరు, యెరూషలేముకు వాయువ్యాన 35 కి.మీ. దూరంలో ఉంది.—1 సమూ. 1:19, 20.