కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

నా నిర్ణయాన్ని యెహోవా మెండుగా ఆశీర్వదించాడు

నా నిర్ణయాన్ని యెహోవా మెండుగా ఆశీర్వదించాడు

అది 1939వ సంవత్సరం. ఒకరోజు అర్ధరాత్రి మేం గంటకన్నా ఎక్కువసేపు కారు నడుపుకుంటూ అమెరికాలో నైరుతి మిస్సోరిలోని జాప్లిన్‌ అనే చిన్న పట్టణానికి చేరుకున్నాం. ఆ క్షేత్రంలో ఉన్న ప్రతీ ఇంటి తలుపు కిందనుండి చడీచప్పుడు కాకుండా కరపత్రాల్ని లోపలికి వేశాం. ఆ పని పూర్తయిన వెంటనే వేరే గుంపుల్ని కలవడానికి బయల్దేరాం. వాళ్లను కలుసుకునేసరికి తెల్లారింది. అయితే ఆ రోజు మేం ఎందుకు అర్ధరాత్రి పరిచర్యకు వెళ్లి, హడావిడిగా తిరిగి రావాల్సి వచ్చింది? దీనిగురించి మీకు తర్వాత చెప్తాను.

నేను 1934లో పుట్టాను. అప్పటికే మా తల్లిదండ్రులైన ఫ్రెడ్‌, ఎడ్న మాలహన్‌లు 20 సంవత్సరాల నుండి బైబిలు విద్యార్థులుగా (యెహోవాసాక్షులుగా) ఉన్నారు. యెహోవామీద ప్రేమ పెంచుకునేలా నాకు సహాయం చేసినందుకు వాళ్లకు రుణపడివున్నాను. మేం ఆగ్నేయ కాన్సాస్‌లోని చిన్నపట్టణమైన పార్సన్జ్‌లో ఉండేవాళ్లం. మా సంఘంలో దాదాపు అందరూ అభిషిక్తులే. మేం కుటుంబంగా కూటాలకు, పరిచర్యకు క్రమంగా వెళ్లేవాళ్లం. ప్రతీ శనివారం మధ్యాహ్నం వీధి సాక్ష్యంలో పాల్గొనేవాళ్లం. ఇప్పుడు దాన్ని బహిరంగ సాక్ష్యం అని పిలుస్తున్నారు. కొన్నిసార్లు మేం బాగా అలసిపోయేవాళ్లం, కానీ పరిచర్య అయిపోగానే నాన్న మా అందరికీ ఐస్‌క్రీమ్‌ కొనిచ్చేవాడు.

మాది చిన్న సంఘమే అయినా పెద్ద క్షేత్రం ఉండేది. దానిలో ఎన్నో చిన్నచిన్న పట్టణాలు, పొలాలు ఉండేవి. మేం ప్రచురణలు ఇచ్చినప్పుడు కొంతమంది రైతులు డబ్బులకు బదులు తమ పెరట్లో పండిన కూరగాయల్ని, గంప కింది నుండి అప్పుడే తీసిన కోడిగుడ్లను, లేదా కోళ్లను ఇచ్చేవాళ్లు. అయితే నాన్న ప్రచురణలు తీసుకునేటప్పుడే డబ్బులు చెల్లించేవాడు, కాబట్టి ఆ రైతులు ఇచ్చినవి మా ఆహారానికి సరిపోయేవి.

ప్రచార కార్యక్రమాలు

ప్రకటనా పనిలో ఉపయోగించడానికి మా అమ్మానాన్నల దగ్గర ఫోనోగ్రాఫ్‌ ఉండేది. నేను చిన్నవాణ్ణి కాబట్టి దాన్నెలా ఉపయోగించాలో నాకు తెలిసేది కాదు. కానీ మా అమ్మానాన్నలు పునర్దర్శనాల్లో, బైబిలు అధ్యయనాల్లో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ప్రసంగాల రికార్డింగులను వినిపించేటప్పుడు వాళ్లకు సహాయం చేసేవాణ్ణి.

సౌండ్‌కారు దగ్గర మా అమ్మానాన్నలతో

నాన్న మా కారుకు ఒక పెద్ద స్పీకర్‌ బిగించి, దాన్ని సౌండ్‌కారుగా మార్చాడు. అది పరిచర్యకు బాగా ఉపయోగపడింది. ప్రజలు మా కారు దగ్గరకు వచ్చేలా చేయడానికి మొదట కాసేపు సంగీతం వినిపించేవాళ్లం, ఆ తర్వాత బైబిలు ప్రసంగాన్ని ప్లే చేసేవాళ్లం. అది అయిపోగానే ఆసక్తి ఉన్నవాళ్లకు ప్రచురణలు ఇచ్చేవాళ్లం.

ఒకరోజు కాన్సాస్‌లోని చెర్రీవేల్‌ అనే చిన్నపట్టణంలో ఉండే పార్కులోకి నాన్న సౌండ్‌కారును తీసుకెళ్లాడు. ఎందుకంటే, ప్రతీ ఆదివారం చాలామంది ఆ పార్కుకు వచ్చి సేదదీరేవాళ్లు. అయితే ఒక పోలీసు మా దగ్గరకు వచ్చి, సౌండ్‌కారును లోపలికి తీసుకురాకూడదని చెప్పాడు. దాంతో ఆ పార్కులోనివాళ్లకు వినిపించేలా నాన్న సౌండ్‌కారును పక్కవీధిలోకి తీసుకెళ్లి ప్రసంగాన్ని ప్లే చేశాడు. నాన్నతో, మా అన్నయ్య జెర్రీతో కలిసి అలా ప్రకటించడం నాకు చాలా ఆసక్తిగా అనిపించేది.

అప్పట్లో, వ్యతిరేకత ఎక్కువున్న క్షేత్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేసేవాళ్లం. మొదట్లో చెప్పినట్లు మేం అర్ధరాత్రి వెళ్లి, ఆ క్షేత్రాల్లో ఉన్న ప్రతీ ఇంటి తలుపు కిందనుండి చడీచప్పుడు కాకుండా కరపత్రాల్ని, చిన్న పుస్తకాల్ని లోపలికి వేసి వచ్చేవాళ్లం. ఆ తర్వాత, అందరం పట్టణం బయట కలుసుకుని, మాలో ఎవరినైనా పోలీసులు అరెస్టు చేశారేమో చూసుకునేవాళ్లం.

మా పరిచర్యలో భాగంగా పెద్దపెద్ద అట్టలను తగిలించుకుని పట్టణమంతా నడిచి వెళ్లడం ఆసక్తికరంగా ఉండేది. దాన్ని సమాచార ప్రదర్శన అని పిలిచేవాళ్లం. ఒకసారి సహోదరులు మా పట్టణానికి వచ్చి “మతం ఒక ఉరి, అదొక కుంభకోణం” అని రాసివున్న అట్టను తగిలించుకొని నడవడం నాకు ఇంకా గుర్తుంది. వాళ్లు మా ఇంటి దగ్గరనుండి మొదలుపెట్టి, దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు నడిచి మళ్లీ మా ఇంటి దగ్గరికి వచ్చారు. సంతోషకరమైన విషయమేమిటంటే, వాళ్లను ఎవ్వరూ అడ్డుకోలేదు, పైగా అసలు ఏం జరుగుతుందా అనే కుతూహలం ప్రజల్లో కలిగింది.

నా చిన్నతనంలో జరిగిన సమావేశాలు

మేం కుటుంబంగా సమావేశాలకు తరచూ టెక్సాస్‌ వెళ్లేవాళ్లం. నాన్న రైల్వేలో పనిచేసేవాడు, కాబట్టి మేం సమావేశాలకు, బంధువుల దగ్గరకు ట్రైన్‌లో ఉచితంగా వెళ్లేవాళ్లం. మా మామయ్య ఫ్రెడ్‌ విజ్‌మార్‌, ఆయన భార్య యులేలీ టెక్సాస్‌లోని టెంపుల్‌ అనే పట్టణంలో ఉండేవాళ్లు. 1900ల తొలినాళ్లలో మామయ్య యువకుడిగా ఉన్నప్పుడు సత్యం తెలుసుకుని, బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన నేర్చుకున్నవాటిని తన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు చెప్పాడు. వాళ్లలో మా అమ్మ కూడా ఉంది. మామయ్య జోన్‌ సర్వెంట్‌గా (అప్పట్లో ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి అలా పిలిచేవాళ్లు) సేవచేశాడు కాబట్టి సెంట్రల్‌ టెక్సాస్‌లోని సహోదరులకు ఆయన బాగా పరిచయం. ఆయన దయగా, అందరితో సరదాగా ఉండేవాడు. అంతేకాదు దేవుని సేవలో ఉత్సాహంగా పనిచేసేవాడు. ఆయన నాకు మంచి ఆదర్శం.

1941లో మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌లో జరిగిన ఒక పెద్ద సమావేశానికి మేం ట్రైన్‌లో వెళ్లాం. ఆ సమావేశంలో, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఇచ్చే “రాజుకు చెందిన పిల్లలు” అనే ప్రసంగాన్ని వినడానికి పిల్లలందర్నీ స్టేజీ ముందు కూర్చోమన్నారు. ఆ ప్రసంగం చివర్లో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌, ఆయన సహచరులు అక్కడున్న 15,000 మంది పిల్లలకు ఒక బహుమతి ఇచ్చారు. అదే, చిల్డ్రన్‌ అనే కొత్త పుస్తకం. దాన్ని అందుకున్న మేమందరం ఆశ్చర్యపోయాం.

1943 ఏప్రిల్‌లో, కాన్సాస్‌లోని కోఫీవిల్‌లో జరిగిన “చర్య తీసుకొనుటకై పిలుపు” అనే సమావేశానికి మేం హాజరయ్యాం. ఆ సమావేశంలో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల అనే కొత్త పాఠశాల అన్ని సంఘాల్లో ప్రారంభం కానుందనే ప్రకటన చేశారు. అంతేకాకుండా, ఆ పాఠశాలలో ఉపయోగించడానికి 52 పాఠాలున్న చిన్నపుస్తకాన్ని కూడా మాకిచ్చారు. కొన్ని నెలల తర్వాత, నేను ఆ పాఠశాలలో మొదటిసారి విద్యార్థి ప్రసంగం ఇచ్చాను. 1943లో జరిగిన ఆ సమావేశం నాకెంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే అప్పుడే నేనూ, ఇంకొంతమంది బాప్తిస్మం తీసుకున్నాం. సమావేశ హాలుకు దగ్గర్లో ఉన్న పొలంలోని చల్లటి చెరువు నీళ్లలో మాకు బాప్తిస్మం ఇచ్చారు.

బెతెల్‌ సేవచేయాలని నిర్ణయించుకున్నాను

నేను నా స్కూలు విద్యను 1951లో పూర్తిచేశాను. ఆ తర్వాత నా జీవితంలో ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సి వచ్చింది. మా అన్నయ్య జెర్రీ బెతెల్‌లో సేవచేశాడు, కాబట్టి నాకు కూడా బెతెల్‌కి వెళ్లాలనే కోరిక ఉండేది. దాంతో దరఖాస్తు పెట్టాను. కొంతకాలానికే, నన్ను బెతెల్‌కి రమ్మని ఆహ్వానించారు. 1952 మార్చి 10 నుండి నేను బెతెల్‌లో సేవచేయడం మొదలుపెట్టాను. నేను తీసుకున్న ఆ మంచి నిర్ణయంవల్ల దేవుని సేవ ఇంకా ఎక్కువ చేయగలిగాను.

పత్రికల్ని, ఇతర ప్రచురణల్ని ముద్రించే ప్రింటరీలో నాకు పనిచేయాలని ఉండేది. కానీ ఎప్పుడూ ఆ అవకాశం దొరకలేదు. మొదట వెయిటర్‌గా ఆ తర్వాత కిచెన్‌లో నాకు నియామకం ఇచ్చారు. ఆ పని నాకు నచ్చింది, అంతేకాదు చాలా విషయాలు నేర్చుకున్నాను. మేం షిఫ్టులవారీగా పనిచేసేవాళ్లం, కాబట్టి పగటిపూట విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం దొరికేది. అప్పుడు నేను తరచూ బెతెల్‌ లైబ్రరీకి వెళ్లి, అక్కడున్న చాలా పుస్తకాల్ని ఉపయోగిస్తూ వ్యక్తిగత అధ్యయనం చేసుకునేవాణ్ణి. దానివల్ల యెహోవాపై నా విశ్వాసం, ఆయనతో నా స్నేహం బలపడ్డాయి. వీలైనంత ఎక్కువకాలం బెతెల్‌లో సేవచేయాలనే నా కోరిక బలపడింది. 1949లో మా అన్నయ్య జెర్రీ బెతెల్‌ నుండి వచ్చేశాడు, తర్వాత పట్రిష అనే సహోదరిని పెళ్లిచేసుకున్నాడు. వాళ్లు బ్రూక్లిన్‌లోనే బెతెల్‌కి దగ్గర్లో ఉండేవాళ్లు. కాబట్టి బెతెల్‌కి కొత్తగా వచ్చిన నాకు ఎంతో సహాయం చేసేవాళ్లు, ప్రోత్సహించేవాళ్లు.

నేను బెతెల్‌కి వెళ్లిన కొంతకాలానికే, సంఘాల్లో బహిరంగ ప్రసంగాలు ఇచ్చే బెతెల్‌ కుటుంబ సభ్యుల లిస్టులో ఇంకొన్ని పేర్లు చేర్చాలని బ్రాంచి నిర్ణయించింది. ఈ సహోదరులు బ్రూక్లిన్‌ నుండి దాదాపు 320 కి.మీ. దూరంలో ఉన్న సంఘాలకు వెళ్లి, బహిరంగ ప్రసంగం ఇచ్చి, సంఘంతోపాటు పరిచర్య కూడా చేస్తారు. ఆ లిస్టులో నా పేరు కూడా చేర్చారు. సంఘాల్ని సందర్శించడం, బహిరంగ ప్రసంగాలివ్వడం మొదట్లో నాకు కాస్త కంగారుగా అనిపించేది. అప్పట్లో బహిరంగ ప్రసంగాలు ఒక గంటపాటు ఉండేవి. నేను సంఘాలకు ఎక్కువగా ట్రైన్‌లో వెళ్లేవాణ్ణి. 1954 చలికాలంలో, ఒక ఆదివారం మధ్యాహ్నం జరిగిన సంఘటన నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు తిరిగి బెతెల్‌కు వెళ్లడానికి న్యూయార్క్‌ వెళ్లే ట్రైన్‌ ఎక్కాను. సాయంత్రంకల్లా బెతెల్‌కు చేరుకోవాలి. కానీ దారిలో బలమైన గాలులు, మంచుతో కూడిన పెద్ద తుఫాను రావడంవల్ల, కరెంటుతో నడిచే ట్రైన్‌ ఇంజిన్లు పాడైపోయాయి. దాంతో నేను న్యూయార్క్‌ చేరుకునేసరికి సోమవారం ఉదయం ఐదు గంటలైంది. అక్కడినుండి సబ్‌వే (భూగర్భ రైలు మార్గం) ద్వారా బ్రూక్లిన్‌ చేరుకున్నాను. వెంటనే కిచెన్‌లో నా పని మొదలుపెట్టాను, కాకపోతే కొంచెం ఆలస్యం అయ్యింది. రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల నేను బాగా అలిసిపోయాను. కానీ నేను పడిన ఇబ్బందులకన్నా సంఘాల్ని సందర్శించడం వల్ల, ఎంతోమంది కొత్త సహోదరసహోదరీల్ని కలవడం వల్ల పొందిన సంతోషమే ఎక్కువ.

డబ్ల్యూ.బి.బి.ఆర్‌ స్టూడియోలో ప్రసార కార్యక్రమానికి సిద్ధపడుతూ

బెతెల్‌కి వెళ్లిన కొత్తలో, డబ్ల్యూ.బి.బి.ఆర్‌ అనే మన రేడియో స్టేషన్‌లో ప్రతీవారం ప్రసారమయ్యే బైబిలు అధ్యయన కార్యక్రమంలో నేనూ పాల్గొనేవాణ్ణి. ఆ స్టూడియోలు 124 కొలంబియా హైట్స్‌ బిల్డింగులోని రెండో అంతస్తులో ఉండేవి. ఎన్నో సంవత్సరాల నుండి బెతెల్‌లో సేవచేస్తున్న సహోదరుడు ఎ. హెచ్‌ మాక్‌మిలన్‌ క్రమంగా ఆ రేడియో కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. మేం ఆయన్ని బ్రదర్‌ మాక్‌ అని పిలిచేవాళ్లం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగాడు. బెతెల్‌లో ఉన్న యువ సహోదరులందరికీ ఆయన మంచి ఆదర్శం.

ప్రజల్లో ఆసక్తి కలిగించడానికి పంచిపెట్టిన డబ్ల్యూ.బి.బి.ఆర్‌ హ్యాండ్‌బిల్లులు

1958లో నా నియామకం మారింది. గిలియడ్‌ పట్టభద్రులతో సన్నిహితంగా పనిచేసే అవకాశం నాకు దొరికింది. వాళ్లు తమ మిషనరీ నియామకాలకు వెళ్లడానికి కావల్సిన వీసాలు, ప్రయాణ ఏర్పాట్లు చూసుకునేవాణ్ణి. అప్పట్లో విమాన ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఆఫ్రికా, ఆసియాలకు వెళ్లే విద్యార్థులు సరుకుల్ని తీసుకెళ్లే ఓడలో ప్రయాణించేవాళ్లు. కానీ తర్వాతి సంవత్సరాల్లో విమాన టికెట్‌ ధరలు తగ్గడంతో చాలామంది మిషనరీలు వాళ్ల నియామకాలకు విమానాల్లోనే వెళ్లారు.

గిలియడ్‌ గ్రాడ్యుయేషన్‌కు ముందు పట్టాలను సిద్ధం చేస్తూ

సమావేశ ప్రయాణ ఏర్పాట్లు

1961లో జరిగిన అంతర్జాతీయ సమావేశాల కోసం, అమెరికా నుండి యూరప్‌కు చార్టర్‌ విమానాలను (అద్దె విమానాలు) 1960లో ఏర్పాటు చేశాను. జర్మనీలోని హామ్‌బర్గ్‌లో జరిగిన ఒక సమావేశానికి నేను కూడా ఆ విమానంలో వెళ్లాను. సమావేశం తర్వాత నేను, ఇంకో ముగ్గురు బెతెల్‌ సహోదరులు కలిసి ఒక కారును అద్దెకు తీసుకొని, జర్మనీ నుండి ఇటలీకి వెళ్లాం. రోమ్‌లో ఉన్న బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించాం. అక్కడనుండి ఫ్రాన్స్‌కు వెళ్లి పిరనీజ్‌ పర్వతాలు దాటి, మన పని నిషేధించబడిన స్పెయిన్‌కి వెళ్లాం. మేం బార్సలోనలో ఉన్న సహోదరులకు కొన్ని ప్రచురణలు గిఫ్ట్‌ ప్యాక్‌ చేసి ఇచ్చాం. వాళ్లను కలవడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది! అక్కడనుండి మేం ఆమ్‌స్టర్‌డామ్‌కు, ఆ తర్వాత విమానంలో న్యూయార్క్‌కు వెళ్లిపోయాం.

1962లో, 583 మంది సహోదరసహోదరీలకు ప్రయాణ ఏర్పాట్లు చేసే నియామకాన్ని నాకు ఇచ్చారు. వాళ్లు 1963లో జరిగిన ప్రత్యేక అంతర్జాతీయ సమావేశాలకు హాజరయ్యారు. ఆ సమావేశ అంశం, “నిత్య సువార్త.” వాళ్లు యూరప్‌, ఆసియా, దక్షిణ పసిఫిక్‌, హోనోలులు, హవాయి, పాసడీన, కాలిఫోర్నియాలో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు. అలాగే వాళ్లు బైబిలు ప్రాంతాలైన లెబనాన్‌, జోర్డన్‌లకు వెళ్లారు. మా విభాగం వాళ్ల కోసం విమానాల్ని, హోటల్‌ సదుపాయాలను, వీసాలను ఏర్పాటు చేసింది.

నా కొత్త ప్రయాణ భాగస్వామి

1963వ సంవత్సరం నాకు ఇంకో విధంగా కూడా చాలా ప్రత్యేకమైనది. జూన్‌ 29న నేను మిస్సోరికి చెందిన లైల రాజర్జ్‌ అనే సహోదరిని పెళ్లి చేసుకున్నాను. ఆమె 1960లో బెతెల్‌కు వచ్చింది. మా పెళ్లయిన వారం తర్వాత నేనూ, లైల ప్రపంచవ్యాప్తంగా జరిగే సమావేశాలకు వెళ్లాం. అప్పుడు గ్రీసు, ఈజిప్టు, లెబనాన్‌ ప్రాంతాల్ని సందర్శించాం. అక్కడనుండి విమానంలో జోర్డన్‌కు బయల్దేరాం. అయితే మన పనిపై అక్కడ ఆంక్షలు ఉండడంతో అధికారులు యెహోవాసాక్షులకు వీసాలు ఇవ్వట్లేదని తెల్సింది. కాబట్టి జోర్డన్‌కు వెళ్లాక ఏం జరుగుతుందోనని మేం భయపడ్డాం. కానీ అక్కడికి చేరుకోగానే ఆ చిన్న విమానాశ్రయంలో “యెహోవాసాక్షులకు స్వాగతం!” అని రాసివున్న ఒక పెద్ద బ్యానర్‌ పట్టుకొని మన సహోదరసహోదరీలు కనిపించారు. అప్పుడు మాకు ఎంతో సంతోషంగా, ఆశ్చర్యంగా అనిపించింది! బైబిలు ప్రాంతాల్ని సందర్శించడం నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు నివసించిన ప్రాంతాల్ని; యేసు, అపొస్తలులు పరిచర్య చేసిన ప్రాంతాల్ని చూశాం. అంతేకాదు, “భూమ్మీదున్న సుదూర ప్రాంతాలకు” వ్యాపించిన క్రైస్తవత్వం ఎక్కడ మొదలైందో ఆ ప్రాంతాన్ని కూడా చూశాం.—అపొ. 13:47.

55 సంవత్సరాలుగా లైల నా నియామకాలన్నిటిలో నమ్మకమైన భాగస్వామిగా ఉంది. మన పని నిషేధించబడిన స్పెయిన్‌, పోర్చుగల్‌ దేశాల్ని మేం చాలాసార్లు సందర్శించాం. అక్కడున్న సహోదరసహోదరీల్ని కలిసి వాళ్లను ప్రోత్సహించాం, వాళ్లకు ప్రచురణల్ని, అవసరమైన ఇతర వస్తువుల్ని ఇచ్చాం. స్పెయిన్‌లోని కాడిజ్‌ జైల్లో ఉన్న మన సహోదరుల్ని కూడా కలిశాం. వాళ్లను ప్రోత్సహిస్తూ ఒక ప్రసంగం ఇచ్చే అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషించాను.

1969లో “భూమిపై సమాధానం” అనే సమావేశానికి వెళ్తున్నప్పుడు పట్రిష, జెర్రీ మాలహన్‌తో

నేను 1963 నుండి ఆఫ్రికా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్‌, ఫార్‌ ఈస్ట్‌, హవాయి, న్యూజిలాండ్‌, ప్యూర్టోరికోలో జరిగిన సమావేశాలకు ఏర్పాట్లు చేశాను. నేనూ, లైల వెళ్లిన కొన్ని సమావేశాలను ఎప్పటికీ మర్చిపోలేం. వాటిలో ఒకటి 1989లో పోలండ్‌లోని వార్సాలో జరిగిన సమావేశం. ఆ పెద్ద సమావేశానికి రష్యా నుండి చాలామంది సహోదరులు వచ్చారు. అదే వాళ్ల మొదటి సమావేశం! తమ మతనమ్మకాల కారణంగా రష్యాలో ఎన్నో సంవత్సరాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న మన సహోదరసహోదరీల్ని మేం కలిశాం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెతెల్‌ కుటుంబాలను, మిషనరీలను సందర్శించి, వాళ్లను ప్రోత్సహించే నియామకాన్ని కూడా నేను చాలా ఆనందించాను. మా చివరి సందర్శనంలో దక్షిణ కొరియాకు వెళ్లాం. సూవాన్‌లోని జైల్లో ఉన్న 50 మంది సహోదరుల్ని కలిశాం. వాళ్లు ఏమాత్రం కృంగిపోకుండా, యెహోవా సేవను స్వేచ్ఛగా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లను కలిసినప్పుడు మేమెంతో ప్రోత్సాహం పొందాం!—రోమా. 1:11, 12.

అభివృద్ధి సంతోషాన్నిచ్చింది

గడిచిన సంవత్సరాల్లో యెహోవా తన ప్రజల్ని ఎంతగా ఆశీర్వదించాడో కళ్లారా చూశాను. నేను 1943లో బాప్తిస్మం తీసుకున్నప్పుడు దాదాపు లక్షమంది ప్రచారకులే ఉన్నారు. కానీ ఇప్పుడు 80 లక్షల కన్నా ఎక్కువమంది 240 దేశ ద్వీపాల్లో యెహోవా సేవచేస్తున్నారు. ఈ అభివృద్ధి వెనక, గిలియడ్‌ పట్టభద్రుల కృషి ఎంతగానో ఉంది. మిషనరీలతో సన్నిహితంగా పనిచేయడం, వాళ్ల నియామకాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.

నా జీవితాన్ని యెహోవా సేవలో ఉపయోగించాలని యౌవనంలోనే బెతెల్‌కు దరఖాస్తు పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను. గడిచిన సంవత్సరాలన్నిటిలో యెహోవా నన్ను మెండుగా ఆశీర్వదించాడు. బెతెల్‌ సేవలో పొందుతున్న ఆనందంతోపాటు, 50 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా బ్రూక్లిన్‌లోని సంఘాలతో కలిసి పరిచర్య చేయడం నాకూ, లైలాకు ఆనందాన్నిచ్చింది. అంతేకాదు మేం ఎంతోమంది చిరకాల స్నేహితుల్ని సంపాదించుకున్నాం.

ప్రతీరోజు లైల ఇస్తున్న మద్దతుతో నేను బెతెల్‌ సేవలో కొనసాగుతున్నాను. నాకిప్పుడు 84 ఏళ్లు దాటినప్పటికీ ఒక అర్థవంతమైన పని చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను. అదేంటంటే, బ్రాంచి తరఫున ఉత్తరప్రత్యుత్తరాలు జరిపే పని.

ఇప్పుడు లైలతో

యెహోవా అద్భుతమైన సంస్థలో భాగంగా ఉండడం, మలాకీ 3:18⁠లోని మాటల నెరవేర్పును చూడడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆ లేఖనంలో ఇలా ఉంది, “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.” సాతాను లోకం అంతకంతకు చెడిపోవడం, ప్రజలు ఎలాంటి నిరీక్షణ-సంతోషం లేకుండా జీవించడం రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ ఎవరైతే యెహోవాను ప్రేమించి ఆయన్ని సేవిస్తారో, వాళ్లు కష్టకాలాల్లో కూడా సంతోషంగా ఉంటారు. అంతేకాదు, వాళ్లు భవిష్యత్తు విషయంలో ఒక నిరీక్షణతో జీవిస్తారు. మంచివార్త గురించి ఇతరులకు చెప్పడం నిజంగా ఒక గొప్ప అవకాశం! (మత్త. 24:14) దేవుని రాజ్యం త్వరలోనే ఈ పాతలోకాన్ని తీసేసి కొత్తలోకాన్ని తెస్తుంది. ఆరోజు కోసం మనం ఎంతగా ఎదురుచూస్తున్నామో కదా! అప్పుడు భూమ్మీదున్న ప్రతీఒక్కరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు, శాశ్వతకాలం జీవిస్తారు.