కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం నిజమే మాట్లాడాలి

మనం నిజమే మాట్లాడాలి

‘ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి.’జెక. 8:16.

పాటలు: 56, 124

1, 2. మనుషులందరికీ హాని చేయడానికి సాతాను దేన్ని ఉపయోగించాడు?

టెలిఫోన్‌, కరెంటు బల్బు, కారు, ఫ్రిజ్‌ వంటి కొన్ని ఆవిష్కరణలు మన జీవితాన్ని సులభతరం చేశాయి. గన్‌లు, మందుపాతర్లు, సిగరెట్లు, అణుబాంబులు వంటి మరికొన్ని ఆవిష్కరణలు మన జీవితాన్ని ప్రమాదంలో పడేశాయి. కానీ వీటన్నిటి కన్నా పురాతనమైనది, మనుషులందరికీ ఎంతో హాని చేసింది ఒకటుంది. అదే అబద్ధం! నిజం కాదని తెలిసినా, ఎదుటివ్యక్తిని మోసం చేయడానికి చెప్పే మాటలే అబద్ధం. మొదటి అబద్ధం చెప్పింది ఎవరో తెలుసా? అపవాది! యేసుక్రీస్తు అతన్ని “అబద్ధానికి తండ్రి” అని పిలిచాడు. (యోహాను 8:44 చదవండి.) అతను మొదటి అబద్ధం ఎప్పుడు చెప్పాడు?

2 కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏదెను తోటలో అతను ఆ అబద్ధం చెప్పాడు. ఆదాముహవ్వలు, తమ కోసం యెహోవా చేసిన అందమైన పరదైసులో ఆనందంగా జీవిస్తుండేవాళ్లు. అయితే దేవుడు వాళ్లతో, ‘మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాల్ని’ తింటే చనిపోతారని చెప్పాడు. సాతానుకు కూడా ఆ విషయం తెలుసు. అయినాసరే అతను పామును ఉపయోగించుకుని హవ్వతో ఇలా చెప్పాడు, “మీరు చావనే చావరు.” అదే అతను చెప్పిన మొదటి అబద్ధం. అంతటితో ఊరుకోకుండా, ‘మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయని, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతలవలె ఉంటారని దేవునికి తెలుసు’ అని చెప్పాడు.—ఆది. 2:15-17; 3:1-5.

3. సాతాను చెప్పిన అబద్ధం ఎందుకు చాలా హానికరమైనది? దానివల్ల వచ్చిన ఫలితమేమిటి?

3 సాతాను చెప్పిన అబద్ధం చాలా హానికరమైనది. ఎందుకంటే హవ్వ ఆ మాటలు నమ్మి పండు తింటే చనిపోతుందని సాతానుకు తెలుసు. సరిగ్గా అలాగే జరిగింది కూడా. హవ్వ ఆ తర్వాత ఆదాము యెహోవా ఆజ్ఞకు అవిధేయత చూపించి, చివరికి చనిపోయారు. (ఆది. 3:6; 5:5) అది అంతటితో ఆగిపోలేదు, ఆదాము చేసిన పాపం కారణంగా “మరణం అందరికీ వ్యాపించింది.” నిజానికి, “పాపం రాజుగా ఏలింది. ఆదాములా పాపం చేయనివాళ్ల మీద కూడా అలాగే ఏలింది.” (రోమా. 5:12, 14) అందుకే మనం పరిపూర్ణతను కోల్పోయాం, దేవుడు కోరుకున్నట్లు నిత్యం జీవించలేకపోతున్నాం. బదులుగా ‘70 సంవత్సరాలు, మరీ ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు’ బ్రతుకుతున్నాం. ఆ కాస్త జీవితం కూడా ‘కష్టాలతో, కన్నీళ్లతో’ నిండివుంటుంది. (కీర్త. 90:10, NW) దీనంతటికీ కారణం సాతాను చెప్పిన అబద్ధం!

4. (ఎ) మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి? (బి) కీర్తన 15:1, 2 వచనాల ప్రకారం ఎవరు మాత్రమే యెహోవాకు స్నేహితులుగా ఉండగలరు?

4 సాతాను గురించి యేసు ఇలా చెప్పాడు, “అతను సత్యంలో స్థిరంగా నిలబడలేదు, ఎందుకంటే అతనిలో సత్యం లేదు.” సాతాను మారలేదు. అతను ఇప్పటికీ తన అబద్ధాలతో “లోకమంతటినీ మోసం చేస్తున్నాడు.” (ప్రక. 12:9) కానీ మనం సాతాను చేతుల్లో మోసపోయి, ఆదాముహవ్వల్లా యెహోవాతో ఉన్న స్నేహాన్ని పోగొట్టుకోవాలని కోరుకోం. అందుకే, ఈ మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి: నేడు సాతాను ప్రజల్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నాడు? ప్రజలు ఎందుకు అబద్ధాలు చెప్తారు? మనం ఎప్పుడూ నిజమే మాట్లాడతామని ఎలా చూపిస్తాం?—కీర్తన 15:1, 2 చదవండి.

సాతాను ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న విధానం

5. నేడు సాతాను ప్రజల్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నాడు?

5 మనం సాతాను చేతుల్లో మోసపోకుండా తప్పించుకోగలం. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, “సాతాను ఉద్దేశాలు మనకు తెలియనివి కావు.” (2 కొరిం. 2:11; అధస్సూచి) నేడు అబద్ధమతం, అవినీతి ప్రభుత్వాలు, దురాశతో కూడిన వ్యాపారాలతోపాటు లోకమంతా సాతాను గుప్పిట్లో ఉందని మనకు తెలుసు. (1 యోహా. 5:19) కాబట్టి అధికారంలో ఉన్న ప్రజలు ‘అబద్ధాలాడేలా’ సాతాను, అతని చెడ్డదూతలు వాళ్లను పురికొల్పడం మనకు ఆశ్చర్యం కలిగించదు. (1 తిమో. 4:1, 2) ఉదాహరణకు, కొంతమంది వ్యాపారస్థులు తాము తయారుచేసిన హానికరమైన వస్తువుల్ని అమ్మడం కోసం లేదా ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించడం కోసం వాణిజ్య ప్రకటనల్లో అబద్ధాలు చెప్తుంటారు.

6, 7. (ఎ) మతనాయకులు కూడా అబద్ధాలు చెప్పడం ఎందుకు చాలా విచారకరం? (బి) మతనాయకులు చెప్పిన ఎలాంటి అబద్ధాల్ని మీరు విన్నారు?

6 మతనాయకులు కూడా అబద్ధాలు చెప్పడం చాలా విచారకరం. ఎందుకు? ఎందుకంటే ఎవరైనా వాళ్ల అబద్ధ బోధల్ని నమ్మి దేవుడు ద్వేషించే పనుల్ని చేస్తే శాశ్వత జీవితాన్ని పోగొట్టుకుంటారు. (హోషే. 4:9) యేసు కాలంలోని మతనాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ధైర్యంగా వాళ్లకిలా చెప్పాడు, “వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! ఎందుకంటే ఒక వ్యక్తిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రాన్ని, భూమిని చుట్టి వస్తారు. అతను మీ మతంలో చేరినప్పుడు, . . . గెహెన్నాకు అర్హునిగా చేస్తారు.” అంటే నిత్యనాశనానికి అర్హునిగా చేస్తారు. (మత్త. 23:15) అలాంటి అబద్ధ మతనాయకులు ‘హంతకుడిగా’ పేరుగాంచిన వాళ్ల తండ్రైన అపవాదిని అనుకరిస్తున్నారని యేసు చెప్పాడు.—యోహా. 8:44.

7 అలాంటివాళ్లు మనకాలంలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్లు పాస్టర్లుగా, మతగురువులుగా, బోధకులుగా, స్వామీజీలుగా లేదా ఇతర బిరుదులతో చెలామణి అవుతుండవచ్చు. పరిసయ్యుల్లాగే వాళ్లు కూడా దేవుని వాక్యంలోని సత్యాన్ని బోధించరు. “వాళ్లు దేవుని గురించిన సత్యానికి బదులు అబద్ధాన్ని నమ్మారు.” (రోమా. 1:18, 25) ఉదాహరణకు, ఒక్కసారి రక్షణ పొందితే ఇక రక్షించబడినట్టే అనీ, ఆత్మకు చావు లేదనీ, చనిపోయినవాళ్లకు పునర్జన్మ ఉంటుందనీ, స్వలింగ సంయోగుల జీవన విధానాన్ని అలాగే ఒకే లింగ వ్యక్తులు పెళ్లి చేసుకోవడాన్ని దేవుడు అంగీకరిస్తాడనీ అబద్ధాలు చెప్తుంటారు.

8. త్వరలో రాజకీయ నాయకులు చెప్పబోయే పచ్చి అబద్ధం ఏంటి? దానికి మనమెలా స్పందించాలి?

8 రాజకీయ నాయకులు కూడా తమ అబద్ధాలతో మనుషుల్ని మోసం చేశారు. త్వరలో, తమ వల్ల ప్రపంచమంతా “ప్రశాంతంగా, సురక్షితంగా” ఉంటుందనే పచ్చి అబద్ధం చెప్తారు. కానీ అప్పుడే “హఠాత్తుగా వాళ్ల మీదికి నాశనం వస్తుంది.” కాబట్టి లోక పరిస్థితులు బాగుపడుతున్నాయని రాజకీయ నాయకులు చెప్పే మాటల్ని నమ్మకూడదు. నిజమేమిటంటే, “రాత్రిపూట దొంగ వచ్చినట్టు యెహోవా రోజు వస్తుందని” మనకు బాగా తెలుసు.—1 థెస్స. 5:1-4.

ప్రజలు ఎందుకు అబద్ధాలు చెప్తారు?

9, 10. (ఎ) ప్రజలు ఎందుకు అబద్ధాలు చెప్తారు? దానివల్ల వచ్చే ఫలితమేమిటి? (బి) యెహోవా గురించి మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

9 నేడు అబద్ధాలు చెప్తున్నది కేవలం అధికారంలో ఉన్నవాళ్లు మాత్రమే కాదు. “అబద్ధాలాడడం అనేది మనుషులందరిలో బలంగా పాతుకుపోయిన ఒక లక్షణంగా గుర్తించబడుతోంది” అని వై. భట్టాచర్జీ రాసిన ‘మనం ఎందుకు అబద్ధాలు చెప్తాం’ అనే ఆర్టికల్‌ చెప్తుంది. మరో మాటలో చెప్పాలంటే, అబద్ధాలాడడం సహజం, సర్వసాధారణం అని ప్రజలు భావిస్తున్నారు. సాధారణంగా ప్రజలు తమను తాము సమర్థించుకోవడానికి, చేసిన తప్పుల్ని లేదా నేరాల్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలాడతారు. అంతేకాదు వాళ్లు డబ్బు కోసం లేదా లాభం కోసం అబద్ధాలు చెప్తారు. అయితే “పరిచయంలేని వాళ్లతో, తోటి ఉద్యోగస్థులతో, స్నేహితులతో, తమ ప్రియమైనవాళ్లతో” కొంతమంది చాలా తేలిగ్గా అబద్ధాలాడతారని కూడా ఆ ఆర్టికల్‌ చెప్పింది.

10 దీనంతటి వల్ల వచ్చే ఫలితమేమిటి? వాళ్లకు ఒకరిమీద ఒకరికున్న నమ్మకం కనుమరుగైపోతోంది, వాళ్ల మధ్యున్న సంబంధాలు పాడౌతున్నాయి. ఉదాహరణకు, భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుని దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధాలు చెప్పిందని నమ్మకంగా ఉన్న భర్తకు తెలిస్తే, అతను ఎంత గుండెకోత అనుభవిస్తాడో ఊహించండి. లేదా ఒక భర్త, ఇంట్లో ఉన్నప్పుడు తన భార్యాపిల్లలతో దురుసుగా ప్రవర్తిస్తూ, నలుగురిలో మాత్రం వాళ్లపట్ల ప్రేమ, శ్రద్ధ ఉన్నట్లు నటిస్తే, ఆ కుటుంబం పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. అలాంటివాళ్లు సాటి మనుషుల్ని మోసం చేయగలరేమో గానీ యెహోవాను మోసం చేయలేరని మనం గుర్తుంచుకోవాలి. “దేవుని కళ్లకు అన్నీ తేటతెల్లంగా, స్పష్టంగా కనిపిస్తాయి” అని బైబిలు చెప్తుంది.—హెబ్రీ. 4:13.

11. అననీయ, సప్పీరాల చెడ్డ ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

11 సాతాను మాయలోపడి దేవునికి అబద్ధం చెప్పిన ఒక క్రైస్తవ జంట గురించి బైబిల్లో ఉంది. అననీయ, సప్పీరా అపొస్తలుల్ని మోసం చేయడానికి ప్రయత్నించారు. వాళ్లు తమ ఆస్తిలో కొంతభాగాన్ని అమ్మి, వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్నే అపొస్తలులకు ఇచ్చారు. కానీ డబ్బు మొత్తం ఇచ్చేశామని అపొస్తలులకు చెప్పారు. ఎందుకంటే సంఘంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని వాళ్లు కోరుకున్నారు. కానీ వాళ్లు అబద్ధం చెప్పారని యెహోవాకు తెలుసు కాబట్టి ఆయన వాళ్లను శిక్షించాడు.—అపొ. 5:1-10.

12. అబద్ధాలాడేవాళ్లను యెహోవా ఏం చేస్తాడు? ఎందుకు?

12 అబద్ధాలాడేవాళ్లను యెహోవా ఏం చేస్తాడు? ప్రమాదకరమైన అబద్ధాలు చెప్తూ పశ్చాత్తాపపడని వాళ్లందరూ, సాతానుతోపాటు “అగ్నిగంధకాల సరస్సులో” పడవేయబడతారు. ఇంకో మాటలో చెప్పాలంటే నిత్యనాశనానికి గురౌతారు. (ప్రక. 20:10; 21:8; కీర్త. 5:6) ఎందుకంటే అబద్ధాలాడే ప్రతీ ఒక్కరు దేవుని దృష్టిలో ‘అపవిత్రులతో’ సమానం.—ప్రక. 22:15, అధస్సూచి.

13. యెహోవా గురించి మనకేమి తెలుసు? ఆయన్ని సంతోషపెట్టడానికి ఏం చేస్తాం?

13 ‘దేవుడు అబద్ధమాడడానికి ఆయన మానవుడు కాదనీ,’ ‘ఆయన అబద్ధమాడడం అసాధ్యమనీ’ మనకు తెలుసు. (సంఖ్యా. 23:19; హెబ్రీ. 6:18) ‘అబద్ధాలాడే నాలుకను’ యెహోవా అసహ్యించుకుంటాడు. (సామె. 6:16-17, NW) ఆయన్ని సంతోషపెట్టాలంటే మనం నిజమే మాట్లాడాలి. అందుకే మనం ‘ఒకరితో ఒకరం అబద్ధాలాడం.’—కొలొ. 3:9.

మనం నిజమే మాట్లాడతాం

14. (ఎ) నిజ క్రైస్తవులమైన మనకు, అబద్ధమతస్థులకు ఉన్న ఒక తేడా ఏంటి? (బి) లూకా 6:45⁠లో ఉన్న సూత్రాన్ని వివరించండి.

14 నిజ క్రైస్తవులమైన మనకు, అబద్ధమతస్థులకు ఉన్న ఒక తేడా ఏంటి? మనం నిజమే మాట్లాడతాం. (జెకర్యా 8:16, 17 చదవండి.) పౌలు ఇలా చెప్పాడు, “మమ్మల్ని మేము దేవుని పరిచారకులుగా సిఫారసు చేసుకుంటున్నాం, . . . నిజం మాట్లాడుతున్నాం.” (2 కొరిం. 6:4, 7) అంతేకాదు “హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది” అని యేసు అన్నాడు. (లూకా 6:45) అంటే నిజాయితీగల వ్యక్తి నిజమే మాట్లాడతాడు. పరిచయంలేని వాళ్లతోనైనా, తోటి ఉద్యోగస్థులతోనైనా, స్నేహితులతోనైనా, ప్రియమైనవాళ్లతోనైనా నిజమే మాట్లాడతాడు. మనం అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండడానికి కృషిచేస్తున్నామని ఎలా చూపించవచ్చో కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.

ఈ యౌవన సహోదరి ద్వంద్వ జీవితం గడుపుతున్నట్లు మీకు అనిపిస్తుందా? (15, 16 పేరాలు చూడండి)

15. (ఎ) ద్వంద్వ జీవితాన్ని గడపడం ఎందుకు మంచిది కాదు? (బి) తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరించడానికి యౌవనులకు ఏం సహాయం చేస్తుంది? (అధస్సూచి చూడండి.)

15 మీరు యౌవనులైతే, మీ వయసువాళ్లలా ఉండాలనే కోరిక మీకుండవచ్చు. ఈ కోరిక వల్ల కొంతమంది యౌవనులు ద్వంద్వ జీవితం గడుపుతున్నారు. వాళ్లు కుటుంబ సభ్యులతో, సంఘంలోని సహోదరసహోదరీలతో ఉన్నప్పుడు నైతికంగా పవిత్రులుగా ఉన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ సోషల్‌ మీడియాలో, యెహోవాను ఆరాధించని వాళ్లతో ఉన్నప్పుడు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటారు. బహుశా బూతులు మాట్లాడడం, లోకస్థుల్లాంటి బట్టలు వేసుకోవడం, అనైతిక పదజాలం ఉన్న పాటలు వినడం, అతిగా తాగడం, డ్రగ్స్‌ తీసుకోవడం, రహస్యంగా డేటింగ్‌ చేయడం, ఇతర చెడ్డ పనులు వాళ్లు చేస్తుండవచ్చు. అలాంటివాళ్లు తమ అమ్మానాన్నలతో, సహోదరసహోదరీలతో, యెహోవాతో అబద్ధం చెప్తున్నట్టే. (కీర్త. 26:4, 5) మనం యెహోవాను ఘనపరుస్తున్నామని చెప్పుకుంటూ, ఆయన అసహ్యించుకునే పనులు చేస్తుంటే అది ఆయనకు తెలుస్తుంది. (మార్కు 7:6) కాబట్టి సామెతల్లోని ఈ మాటలు పాటించడం మేలు: “పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.”—సామె. 23:17. *

16. పూర్తికాల సేవకు సంబంధించిన అప్లికేషన్‌ నింపుతున్నప్పుడు నిజాయితీగా ఎలా ఉండవచ్చు?

16 మీరు పయినీరు సేవ గానీ, బెతెల్‌ సేవలాంటి ప్రత్యేక పూర్తికాల సేవ గానీ మొదలుపెట్టాలని అనుకుంటే ఒక అప్లికేషన్‌ నింపాల్సి ఉంటుంది. అలా నింపుతున్నప్పుడు మీ ఆరోగ్యం, మీరు ఎంచుకునే వినోదం, మీ నైతిక ప్రమాణాల గురించిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు రాయడం చాలా ప్రాముఖ్యం. (హెబ్రీ. 13:18) ఒకవేళ మీరు యెహోవా అసహ్యించుకునే లేదా మీ మనస్సాక్షిని ఇబ్బందిపెట్టే ఏదైనా పని చేసి, దానిగురించి ఇంకా సంఘ పెద్దలతో మాట్లాడకపోతే ఏం చేయాలి? వాళ్లతో మాట్లాడి సహాయం తీసుకోండి. అప్పుడు మీరు పవిత్రమైన మనస్సాక్షితో యెహోవా సేవ చేయగలుగుతారు.—రోమా. 9:1; గల. 6:1.

17. వ్యతిరేకులు మనల్ని సహోదరుల వివరాలు అడిగితే ఏం చేయాలి?

17 మీరు ఉంటున్న దేశంలో మన పనిపై నిషేధం విధించారనుకోండి. అధికారులు మిమ్మల్ని అరెస్టు చేసి సహోదరుల వివరాలు అడిగితే ఏం చేయాలి? మీకు తెలిసినదంతా వాళ్లకు చెప్పాలా? రోమా అధిపతి తనను ప్రశ్నించినప్పుడు యేసు ఏం చేశాడు? ‘మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు సమయం కలదు’ అనే సూత్రాన్ని పాటిస్తూ ఆయన కొన్నిసార్లు ఏమీ చెప్పలేదు. (ప్రసం. 3:1, 7; మత్త. 27:11-14) మనకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే, మన సహోదరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా మనం వివేచన, తెలివి ఉపయోగించాలి.—సామె. 10:19; 11:12.

ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు వాస్తవాలన్నీ చెప్పాలో మీరెలా నిర్ణయించుకుంటారు? (17, 18 పేరాలు చూడండి)

18. మన సహోదరుల గురించి సంఘపెద్దలు ఏదైనా అడిగితే ఏం చేయాలి?

18 మీ సంఘంలో ఎవరైనా గంభీరమైన పాపం చేశారనుకోండి. దానిగురించి మీకు ఏవైనా వివరాలు తెలిస్తే ఏం చేయాలి? సంఘాన్ని పవిత్రంగా ఉంచాల్సిన బాధ్యత సంఘపెద్దలకు ఉంది కాబట్టి మీకు తెలిసింది చెప్పమని వాళ్లు మిమ్మల్ని అడగవచ్చు. ఒకవేళ పాపం చేసిన వ్యక్తి మీ సన్నిహిత స్నేహితుడు లేదా బంధువు అయితే ఏం చేస్తారు? ‘నమ్మకమైన సాక్షి నిజమే మాట్లాడతాడు’ అని బైబిలు చెప్తుంది. (సామె. 12:17, NW; 21:28) కాబట్టి వాస్తవాలేవీ దాచిపెట్టకుండా సంఘపెద్దలకు నిజం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. నిజమేంటో తెలుసుకునే హక్కు వాళ్లకు ఉంది. అలా తెలుసుకున్నప్పుడే, పాపం చేసిన వ్యక్తి తిరిగి యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగివుండేలా వాళ్లు సహాయం చేయగలుగుతారు.—యాకో. 5:14, 15.

19. తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

19 దావీదు యెహోవాకు ఇలా ప్రార్థించాడు, “నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు.” (కీర్త. 51:6) మనం అంతరంగంలో ఎలా ఉన్నామనేది ప్రాముఖ్యమని దావీదుకు తెలుసు. నిజక్రైస్తవులు అన్ని సమయాల్లో ‘తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి.’ అబద్ధమతస్థులకూ, మనకూ ఉన్న మరో తేడా ఏమిటంటే, మనం బైబిల్లో ఉన్న సత్యాన్ని బోధిస్తాం. పరిచర్యలో సత్యాన్ని ఎలా బోధించవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 15 యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు బ్రోషురులోని “తోటివాళ్ల ఒత్తిడిని నేనెలా తిప్పికొట్టవచ్చు?” అనే 6వ ప్రశ్న, అలాగే యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఇంగ్లీష్‌) 2వ సంపుటిలో ఉన్న “ద్వంద జీవితం—ఎవరికి తెలుసు?” అనే 16వ అధ్యాయం చూడండి.