కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన నాయకుడైన క్రీస్తుపై నమ్మకం ఉంచండి

మన నాయకుడైన క్రీస్తుపై నమ్మకం ఉంచండి

“క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు.”మత్త. 23:10.

పాటలు: 16, 14

1, 2. మోషే చనిపోయిన తర్వాత యెహోషువకు ఏ పెద్ద బాధ్యత అప్పగించబడింది?

యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు, “నా సేవకుడైన మోషే మృతినొందెను. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి.” (యెహో. 1:1, 2) దాదాపు 40 ఏళ్లపాటు మోషేకు సహాయకునిగా ఉన్న యెహోషువ జీవితంలో ఇది ఎంత పెద్ద మార్పో కదా!

2 మోషే ఎన్నో సంవత్సరాలుగా ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తూ వచ్చాడు, కానీ ఇకపై యెహోషువ వాళ్లను నడిపించాలి. మరి ప్రజలు తనను నాయకునిగా అంగీకరిస్తారా లేదా అనే సందేహం యెహోషువకు వచ్చి ఉండవచ్చు. (ద్వితీ. 34:8, 10-12) ఒక బైబిలు రెఫరెన్సు పుస్తకం యెహోషువ 1:1, 2 వచనాల గురించి చెప్తూ, గతంలో గానీ ఇప్పుడు గానీ ఒక దేశం ఎదుర్కోగల కష్టమైన, ప్రమాదకరమైన పరిస్థితి ఏదంటే, ఒక నాయకుని స్థానంలో మరో నాయకుడు రావడం అని చెప్పింది.

3, 4. తనపై నమ్మకం ఉంచినందుకు దేవుడు యెహోషువకు ఎలా సహాయం చేశాడు? మనకు ఏ ప్రశ్న రావచ్చు?

3 యెహోషువ ఆందోళనపడడంలో అర్థం ఉంది. కానీ ఆయన యెహోవాపై నమ్మకం ఉంచి, దేవుడిచ్చిన నిర్దేశాల్ని వెంటనే పాటించాడు. (యెహో. 1:9-11) తనపై నమ్మకం ఉంచినందుకు దేవుడు యెహోషువను దీవించి, ఆయన్ని అలాగే ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత, ‘వాక్యం’ అని పిలవబడిన దేవుని మొదటి కుమారుడు అయ్యుంటాడు.—నిర్గ. 23:20-23; యోహా. 1:1.

4 నాయకత్వంలో వచ్చిన మార్పుకు అలవాటుపడడానికి యెహోవా ఇశ్రాయేలీయులకు సహాయం చేశాడు. మనకాలంలో కూడా పెద్దపెద్ద మార్పులు జరుగుతున్నాయి. అయితే ‘దేవుని సంస్థ వేగంగా ముందుకు వెళ్తుండగా, మన నాయకుడైన యేసుపై నమ్మకం ఉంచడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి?’ అనే ప్రశ్న మీకు రావచ్చు. (మత్తయి 23:10 చదవండి.) ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం కోసం, గతంలో మార్పులు జరిగినప్పుడు యెహోవా తన ప్రజల్ని ఎలా నడిపించాడో పరిశీలిద్దాం.

దేవుని ప్రజల్ని వాగ్దాన దేశంలోకి నడిపించడం

5. యెహోషువ యెరికో పట్టణానికి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? (ప్రారంభ చిత్రం చూడండి.)

5 ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటిన వెంటనే యెహోషువకు అనుకోని సంఘటన ఎదురైంది. యెరికో పట్టణం దగ్గర ఒక వ్యక్తి ఖడ్గం పట్టుకొని నిలబడడం ఆయన చూశాడు. యెహోషువ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, “నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా?” అని అడిగాడు. అందుకు ఆయన “యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాను” అని చెప్పాడు. అది విని యెహోషువ ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, దేవుని ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్న దేవదూత! (యెహోషువ 5:13-15 చదవండి.) ఈ వృత్తాంతానికి సంబంధించిన ఇతర లేఖనాల్లో యెహోవాయే స్వయంగా యెహోషువతో మాట్లాడాడని ఉన్నప్పటికీ, బహుశా దేవుడు తన తరఫున మాట్లాడడానికి దేవదూతను ఉపయోగించుకుని ఉంటాడు. ఎందుకంటే గతంలో కూడా దేవుడు తరచూ అలా చేశాడు.—నిర్గ. 3:2-4; యెహో. 4:1, 15-16; 5:2, 9; అపొ. 7:38; గల. 3:19.

6-8. (ఎ) దేవదూత ఇచ్చిన కొన్ని నిర్దేశాలు ఎందుకు తెలివితక్కువగా అనిపించివుండవచ్చు? (బి) దేవుడిచ్చిన నిర్దేశాలు తెలివైనవని, అవి సరైన సమయంలో వచ్చాయని ఎలా చెప్పవచ్చు? (అధస్సూచి చూడండి.)

6 యెరికోను స్వాధీనం చేసుకోవడానికి ఏం చేయాలో ఆ దేవదూత యెహోషువకు స్పష్టమైన నిర్దేశాలిచ్చాడు. మొదట్లో ఆ నిర్దేశాలు వింతగా అనిపించివుండవచ్చు. ఉదాహరణకు, సైనికులందరికీ సున్నతి చేయించమని దేవదూత యెహోషువకు చెప్పాడు. అలాచేస్తే, వాళ్లు కొన్ని రోజులపాటు పోరాడే స్థితిలో ఉండరు. కాబట్టి సైనికులకు సున్నతి చేయించడానికి అది సరైన సమయమేనా?—ఆది. 34:24, 25; యెహో. 5:2, 8.

7 ‘ఒకవేళ శత్రువులు మన గుడారాలపై దాడిచేస్తే మన కుటుంబాల్ని ఎలా రక్షించుకోగలం?’ అని సైనికులు అనుకొనివుండవచ్చు. కానీ వాళ్లు ఊహించనిది ఒకటి జరిగింది. యెరికో ప్రజలు ఇశ్రాయేలీయులపై దాడిచేసే బదులు, వాళ్లను చూసి భయపడ్డారు. “ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను” అని బైబిలు చెప్తుంది. (యెహో. 6:1) దాంతో, దేవుని నిర్దేశాలపై ఇశ్రాయేలీయులకు ఉన్న నమ్మకం మరింత బలపడివుంటుంది.

8 ఇశ్రాయేలీయులు యెరికోపై దాడి చేయకూడదని దేవదూత యెహోషువతో చెప్పాడు. బదులుగా వాళ్లు ఆరు రోజులపాటు, రోజుకోసారి పట్టణం చుట్టూ తిరగాలి, ఏడో రోజున ఏడుసార్లు తిరగాలి అని దేవదూత చెప్పాడు. దానికి సైనికులు ‘మన సమయం, శక్తి దండగ’ అని అనుకొనివుండవచ్చు. కానీ ఇశ్రాయేలీయుల అదృశ్య నాయకుడైన యెహోవాకు తానేమి చేస్తున్నాడో తెలుసు. ఆయనిచ్చే నిర్దేశాల్ని పాటించడం వల్ల వాళ్లు యుద్ధం చేయకుండానే యెరికోను స్వాధీనం చేసుకున్నారు. యెహోవా నిర్దేశాల్ని పాటించడం తెలివైన పనని గుర్తించినప్పుడు వాళ్ల విశ్వాసం బలపడింది.—యెహో. 6:2-5; హెబ్రీ. 11:30. *

9. దేవుని సంస్థ ఇచ్చే ఎలాంటి నిర్దేశాలనైనా మనం ఎందుకు పాటించాలి? ఉదాహరణ చెప్పండి.

9 ఈ వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? యెహోవా సంస్థ కొన్ని పనుల్ని కొత్త పద్ధతుల్లో చేయవచ్చు. వాటిని అలా ఎందుకు చేస్తుందో కొన్నిసార్లు మనకు అర్థంకాకపోవచ్చు. ఉదాహరణకు ఫోన్‌లు, ట్యాబ్‌లు వంటివాటిని వ్యక్తిగత అధ్యయనం కోసం, పరిచర్య కోసం, మీటింగ్స్‌ కోసం ఉపయోగించడం మొదట్లో మనకు తెలివైన పనిగా అనిపించి ఉండకపోవచ్చు. కానీ అవకాశం ఉన్నవాళ్లందరూ వాటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూడగలుగుతున్నాం. కాబట్టి అలాంటి మార్పులవల్ల వస్తున్న మంచి ఫలితాల్ని చూసినప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది, సహోదరసహోదరీల మధ్యున్న ఐక్యత బలపడుతుంది.

క్రీస్తు తొలి క్రైస్తవుల్ని ఎలా నడిపించాడు?

10. సున్నతి చేయించుకోవడంపై పరిపాలక సభ నిర్ణయం తీసుకునేలా పరిస్థితుల్ని ఎవరు మలుపు తిప్పారు?

10 కొర్నేలి అనే సున్నతి పొందని అన్యుడు క్రైస్తవునిగా మారి సుమారు 13 ఏళ్లు గడిచిపోయాయి. కానీ క్రైస్తవులుగా మారిన కొంతమంది యూదులు మాత్రం, సున్నతి చేయించుకోవాల్సిందే అని ఇంకా పట్టుబడుతున్నారు. (అపొ. 15:1, 2) ఈ విషయం గురించే అంతియొకయలో కొంతమంది సహోదరులు వాదించుకున్నారు. కాబట్టి దీనిగురించి పరిపాలక సభ అభిప్రాయం ఏంటో యెరూషలేముకు వెళ్లి తెలుసుకోమని పెద్దలు పౌలుకు చెప్పారు. ఆ నిర్దేశం వెనుక ఎవరు ఉన్నారు? “అలా వెళ్లాలని నాకు వెల్లడిచేయబడింది” అని పౌలు అన్నాడు. కాబట్టి ఈ సమస్యను పరిపాలక సభ పరిష్కరించేలా క్రీస్తే నిర్దేశించాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.—గల. 2:1-3.

మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘాన్ని క్రీస్తే నడిపించాడు (10, 11 పేరాలు చూడండి)

11. (ఎ) క్రైస్తవులుగా మారిన కొంతమంది యూదులు దేన్ని మానలేదు? (బి) యెరూషలేములోని పెద్దల నిర్దేశానికి పౌలు ఎలా స్పందించాడు? (అధస్సూచి కూడా చూడండి.)

11 యూదులుకాని క్రైస్తవులు సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదని పరిపాలక సభ స్పష్టం చేసేలా క్రీస్తే నిర్దేశించాడు. (అపొ. 15:19, 20) అయినప్పటికీ, క్రైస్తవులుగా మారిన యూదులు కొన్నేళ్ల వరకు తమ కొడుకులకు సున్నతి చేయించడం మానలేదు. అయితే, పౌలు ధర్మశాస్త్రాన్ని గౌరవించట్లేదనే పుకారు వ్యాప్తి చెందుతోందని యెరూషలేములోని పెద్దలకు తెలిసింది. కాబట్టి తనకు ధర్మశాస్త్రం మీద గౌరవం ఉందని అందరికీ తెలిసేలా చేయమని పెద్దలు పౌలుకు చెప్పారు. * (అపొ. 21:20-26) దానికోసం ఆయన నలుగురు వ్యక్తుల్ని తీసుకొని ఆలయానికి వెళ్లాలని వాళ్లు చెప్పారు. దానికి పౌలు, ‘ఇందులో ఏమైనా అర్థం ఉందా? సున్నతి చేయించుకోవడంపై సరైన అవగాహన లేనిది క్రైస్తవులుగా మారిన యూదులకు కదా, మరి నన్నెందుకు ఇలా చేయమంటున్నారు?’ అని వాళ్లతో అనొచ్చు. కానీ ఆయన అలా అనలేదు, ఎందుకంటే క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండాలనే పెద్దల కోరికను ఆయన అర్థంచేసుకున్నాడు. దాంతో వాళ్ల నిర్దేశాల్ని వినయంగా పాటించాడు. అయితే మనకు ఈ సందేహం రావచ్చు, ‘మోషే ధర్మశాస్త్రం యేసు మరణంతోనే రద్దు అయిపోయింది కదా, మరి సున్నతికి సంబంధించిన సమస్య అంతకాలం పాటు కొనసాగడానికి యేసు ఎందుకు అనుమతించాడు?’—కొలొ. 2:13, 14.

12. సున్నతికి సంబంధించిన సమస్యను కొంతకాలంపాటు యేసు ఎందుకు అనుమతించాడు?

12 ఏదైనా కొత్త అవగాహనను అంగీకరించడానికి కాస్త సమయం పడుతుంది. క్రైస్తవులుగా మారిన కొంతమంది యూదులకు కూడా, తాము ఇక ధర్మశాస్త్రం కింద లేమనే విషయాన్ని అంగీకరించడానికి సమయం పట్టింది. (యోహా. 16:12) సున్నతి అనేది దేవునితో తమకు ప్రత్యేక సంబంధం ఉందనడానికి ఒక గుర్తనే ఆలోచన వాళ్లలో బలంగా పాతుకుపోయింది. (ఆది. 17:9-12) సున్నతి చేయించుకోకపోతే యూదా సమాజం నుండి వ్యతిరేకత వస్తుందేమోనని మరికొంతమంది భయపడ్డారు. (గల. 6:12) అయితే కాలం గడుస్తుండగా, పౌలు రాసిన ఉత్తరాల ద్వారా క్రీస్తు మరికొన్ని నిర్దేశాలు ఇచ్చాడు.—రోమా. 2:28, 29; గల. 3:23-25.

నేడు కూడా క్రీస్తే తన సంఘాన్ని నడిపిస్తున్నాడు

13. క్రీస్తు ఇస్తున్న నిర్దేశాలకు మద్దతివ్వడానికి మనకేది సహాయం చేస్తుంది?

13 నేటికీ క్రైస్తవ సంఘానికి క్రీస్తే నాయకుడు. కాబట్టి సంస్థ ఏదైనా మార్పును ఎందుకు చేసిందో మీకు అర్థంకాకపోతే, గతంలో క్రీస్తు దేవుని ప్రజల్ని ఎలా నడిపించాడో ఆలోచించండి. యెహోషువ కాలంలోనైనా, అపొస్తలుల కాలంలోనైనా ఆయన ఇచ్చిన తెలివైన నిర్దేశంవల్ల దేవుని ప్రజలు రక్షించబడ్డారు. అంతేకాదు వాళ్ల విశ్వాసం, ఐక్యత బలపడ్డాయి.—హెబ్రీ. 13:8.

14-16. మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి క్రీస్తు సహాయం చేయాలనుకుంటున్నాడని ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుడు’ ఇచ్చే నిర్దేశం ఎలా రుజువు చేస్తుంది?

14 నేడు ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుడు’ మనకు తగిన సమయంలో అవసరమైన నిర్దేశాన్ని ఇస్తున్నాడు. (మత్త. 24:45) యేసుకు మనమీద ఎంత శ్రద్ధ ఉందో అది రుజువు చేస్తుంది. నలుగురు పిల్లలకు తండ్రైన మార్క్‌ ఇలా చెప్తున్నాడు, “కుటుంబాలపై దాడి చేయడం ద్వారా సంఘాల్ని బలహీనపర్చడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి సంస్థ, ప్రతీవారం కుటుంబ ఆరాధన చేసుకోమని కుటుంబ యజమానుల్ని ప్రోత్సహిస్తూ, ‘మీ కుటుంబాల్ని కాపాడుకోండి!’ అనే సందేశం ఇస్తోంది.”

15 క్రీస్తు మనల్ని ఎలా నడిపిస్తున్నాడో గుర్తిస్తే, మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి ఆయన సహాయం చేయాలనుకుంటున్నాడని అర్థంచేసుకుంటాం. సంఘపెద్దగా సేవచేస్తున్న పాట్రిక్‌ ఏం చెప్తున్నాడో గమనించండి, “వారాంతాల్లో పరిచర్య కోసం చిన్న గుంపులుగా కలుసుకోవాలనే నిర్దేశం మొదట్లో కొంతమందికి నచ్చలేదు.” కానీ సంఘంలోని ప్రతీఒక్కరి పట్ల యేసుకు ఎంత శ్రద్ధ ఉందో ఆ ఏర్పాటు చూపిస్తుందని ఆయన చెప్తున్నాడు. ఉదాహరణకు, కొంతమంది సహోదరసహోదరీలు పరిచర్యకు వెళ్లడానికి సిగ్గుపడతారు లేదా అంతగా ఇష్టపడరు. అలాంటివాళ్లు ఈ ఏర్పాటు వల్ల చాలా ప్రయోజనం పొందారు, అంతేకాదు అది వాళ్ల విశ్వాసాన్ని బలపర్చింది.

16 పరిచర్యపై మనసుపెట్టడానికి కూడా క్రీస్తు మనకు సహాయం చేస్తున్నాడు. నేడు భూమ్మీద జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన పని అదే. (మార్కు 13:10 చదవండి.) కొత్తగా సంఘపెద్ద అయిన ఆండ్రే అనే సహోదరుడు, యెహోవా సంస్థ ఇచ్చే ఏ కొత్త నిర్దేశాన్నైనా పాటించడానికి కృషి చేసేవాడు. ఆయనిలా చెప్పాడు, “బ్రాంచి కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని తగ్గించడం, మనమెంత అత్యవసరమైన కాలంలో జీవిస్తున్నామో గుర్తుచేసింది. అంతేకాదు మన శక్తినంతా పరిచర్య కోసం ఉపయోగించాలని కూడా తెలియజేసింది.”

క్రీస్తు నిర్దేశాన్ని మనమెలా పాటించవచ్చు?

17, 18. మార్పులకు అలవాటుపడడం వల్ల వచ్చే మంచి ఫలితాలపై మనం ఎందుకు మనసుపెట్టాలి?

17 రాజైన యేసుక్రీస్తు ఇచ్చే నిర్దేశంవల్ల మనం ఇప్పుడూ అలాగే భవిష్యత్తులో ప్రయోజనం పొందుతాం. ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పులకు అలవాటుపడడం వల్ల మీరు పొందిన ప్రయోజనాలపై మనసుపెట్టండి. కూటాల్లో, పరిచర్యలో వచ్చిన మార్పుల వల్ల మీ కుటుంబం ఎలా ప్రయోజనం పొందిందో కుటుంబ ఆరాధనలో చర్చించుకోవచ్చు.

యెహోవా సంస్థలో వస్తున్న మార్పులకు అలవాటుపడేలా మీ కుటుంబానికి, ఇతరులకు సహాయం చేస్తున్నారా? (17, 18 పేరాలు చూడండి)

18 యెహోవా సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని పాటించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తాయని గుర్తుంచుకుంటే, వాటిని పాటించడం సులభం అవుతుంది, సంతోషంగా కూడా ఉంటాం. ఉదాహరణకు, ఇంతకుముందులా ప్రచురణల్ని ఎక్కువగా ప్రింట్‌ చేయట్లేదు కాబట్టి డబ్బు ఆదా అవుతోంది. అంతేకాదు, కొత్త టెక్నాలజీని ఉపయోగించడం వల్ల, ఎక్కువమందికి మంచివార్త అందుతోంది. మనం కూడా ఎలక్ట్రానిక్‌ ప్రచురణల్ని, వీడియోల్ని ఎక్కువగా ఉపయోగించగలమా? అలాచేస్తే, సంస్థ వనరుల్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించాలని కోరుకుంటున్న క్రీస్తుకు మద్దతిచ్చిన వాళ్లమౌతాం.

19. క్రీస్తు నిర్దేశాన్ని మనమెందుకు పాటించాలి?

19 మనం క్రీస్తు నిర్దేశాన్ని పాటించినప్పుడు, తోటి సహోదరసహోదరీల విశ్వాసాన్ని, ఐక్యతను మరింత పెంచుతాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెతెల్‌ సభ్యుల సంఖ్యను తగ్గించడం గురించి మాట్లాడుతూ ఆండ్రే ఇలా అన్నాడు, “అలాంటి మార్పులకు అలవాటుపడే విషయంలో బెతెల్‌లో సేవచేసినవాళ్లు చూపించిన చక్కని స్ఫూర్తి నాలో నమ్మకాన్ని, వాళ్లపట్ల గౌరవాన్ని పెంచింది. ఏ నియామకాన్ని ఇచ్చినా దాన్ని ఆనందంగా చేయడం ద్వారా వాళ్లు యెహోవా రథంతో పాటు ముందుకు సాగుతున్నారు.”

మన నాయకునిపై విశ్వాసం, నమ్మకం ఉంచండి

20, 21. (ఎ) మన నాయకుడైన క్రీస్తుపై ఎందుకు నమ్మకం ఉంచవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏ ప్రశ్న చర్చిస్తాం?

20 అతిత్వరలో మన నాయకుడైన యేసుక్రీస్తు ‘తన విజయాన్ని పూర్తిచేసి,’ ‘భీకరమైనవాటిని జరిగిస్తాడు.’ (ప్రక. 6:2; కీర్త. 45:4) ఈలోపు ఆయన మనల్ని కొత్తలోకంలో జీవితానికి, అందులో మనం చేయాల్సిన గొప్ప పనికి అంటే పునరుత్థానమైన వాళ్లకు బోధించడం, భూమిని పరదైసుగా మార్చడం వంటి పనులకు సిద్ధం చేస్తున్నాడు.

21 మన నాయకుడు, రాజు అయిన క్రీస్తుపై విశ్వాసం ఉంచితే, పరిస్థితులు ఎలా మారినా ఆయన మనల్ని కొత్తలోకంలోకి నడిపిస్తాడు. (కీర్తన 46:1-3 చదవండి.) నేడు మార్పులకు అలవాటుపడడం కష్టంగా అనిపించవచ్చు, ముఖ్యంగా ఆ మార్పులు అనుకోని రీతిలో మనపై ప్రభావం చూపించినప్పుడు ఇంకా కష్టంగా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో మనశ్శాంతిని, యెహోవాపై బలమైన విశ్వాసాన్ని మనమెలా కాపాడుకోవచ్చు? ఈ ప్రశ్నను తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం.

^ పేరా 8 పురావస్తు శాస్త్రజ్ఞులు యెరికో శిథిలాల్లో ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని కనుగొన్నారు. దీన్నిబట్టి ఆ పట్టణం మీద ముట్టడి ఎక్కువ కాలంపాటు కొనసాగలేదని, అందులోని ధాన్యం నిల్వలు అయిపోలేదని అర్థమౌతుంది. యెరికోను కొల్లగొట్టడానికి ఇశ్రాయేలీయులు అనుమతించబడలేదు. నిజానికి, వాళ్లు యెరికో మీద దాడి చేయడానికి అదే మంచి సమయం. ఎందుకంటే అది కోతకాలం, పొలాల్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది.—యెహో. 5:10-12.

^ పేరా 11 2003, మార్చి 15 కావలికోట సంచికలోని 24వ పేజీలో ఉన్న “ఒక పరీక్షకు పౌలు వినయపూర్వక ప్రతిస్పందన” అనే బాక్సు చూడండి.