కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1918—వంద సంవత్సరాల క్రితం

1918—వంద సంవత్సరాల క్రితం

ద వాచ్‌ టవర్‌ 1918, జనవరి 1 సంచిక ఈ మాటలతో మొదలైంది, “1918వ సంవత్సరంలో ఏం జరగబోతుంది?” యూరప్‌లో మొదటి ప్రపంచ యుద్ధం ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఆ సంవత్సరం ఆరంభంలో జరిగిన కొన్ని సంఘటనలు బైబిలు విద్యార్థుల్లో అలాగే ప్రజల్లో మంచి జరుగుతుందనే ఆశను చిగురింపజేశాయి.

ప్రపంచం శాంతి గురించి మాట్లాడుతోంది

1918, జనవరి 8న ప్రెసిడెంట్‌ వుడ్రో విల్సన్‌​ అమెరికా కాంగ్రెస్‌కు ఇచ్చిన ప్రసంగంలో, “న్యాయానికి అలాగే స్థిరమైన శాంతికి” తోడ్పడే 14 విషయాలు చెప్పాడు. దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని, ఆయుధాల వాడకాన్ని తగ్గించాలని, “పెద్దా-చిన్నా దేశాలకు” సమ న్యాయం జరిగేలా “అన్ని దేశాల కోసం ఒక సంస్థను” స్థాపించాలని ప్రతిపాదించాడు. ఆయన చెప్పిన “పద్నాలుగు విషయాలు” ఆ తర్వాత నానాజాతి సమితిని స్థాపించడానికి, వర్సైలిస్‌ శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉపయోగపడ్డాయి. అలా మొదటి ప్రపంచ యుద్ధానికి తెర పడింది.

వ్యతిరేకుల ఓటమి

ముందటి సంవత్సరంలో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నప్పటికీ, * బైబిలు విద్యార్థులు శాంతి నెలకొంటుందని ఆశించారు. వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ వార్షిక బిజినెస్‌ మీటింగ్‌లో జరిగిన కొన్ని సంఘటనల్ని బట్టి వాళ్లు అలా అనుకున్నారు.

1918, జనవరి 5న జరిగిన ఆ మీటింగ్‌లో, బెతెల్‌ నుండి తీసేయబడిన కొందరు ప్రముఖులు సంస్థను తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ప్రయాణ సేవలో నమ్మకంగా కొనసాగుతున్న రిచర్డ్‌ హెచ్‌. బార్బర్‌ అనే సహోదరుడు ప్రార్థనతో ఆ మీటింగ్‌ని మొదలుపెట్టాడు. గత సంవత్సరపు సేవా నివేదిక చర్చించుకున్నాక, డైరెక్టర్ల వార్షిక ఎన్నికలు జరిగాయి. సహోదరుడు బార్బర్‌, జోసెఫ్‌​ రూథర్‌ఫర్డ్‌ను మరో ఆరుగురు సహోదరుల్ని డైరెక్టర్లుగా ప్రతిపాదించాడు. తర్వాత, వ్యతిరేకుల తరఫున ఉన్న న్యాయవాది, వేరే ఏడుగుర్ని ప్రతిపాదించాడు. వాళ్లలో బెతెల్‌ నుండి తీసేయబడినవాళ్లు కూడా ఉన్నారు. కానీ వాళ్లు ఓడిపోయారు. వాటాదారులు అత్యధిక మెజారిటీతో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ను, మరో ఆరుగురు నమ్మకమైన సహోదరుల్ని డైరెక్టర్లుగా ఎంపికచేశారు.

ఆ మీటింగ్‌కు హాజరైన చాలామంది సహోదరులు ఇలా అన్నారు, “ముందెప్పటికన్నా ఈ మీటింగ్‌లో యెహోవా దీవెనలు ఎక్కువగా రుచిచూశాం.” కానీ వాళ్ల ఆనందం ఎంతోకాలం నిలవలేదు.

ద ఫినిష్డ్‌ మిస్టరీకి వచ్చిన స్పందన

కొన్ని నెలలుగా బైబిలు విద్యార్థులు ద ఫినిష్డ్‌ మిస్టరీ పుస్తకాన్ని పంచిపెడుతున్నారు. మంచి మనసున్న పాఠకులు అందులోని బైబిలు సత్యాలకు సానుకూలంగా స్పందించారు.

కెనడాలో ప్రయాణ పర్యవేక్షకునిగా సేవచేస్తున్న ఇ. యఫ్‌. క్రిస్ట్‌, ఒక జంట గురించి చెప్పాడు. ఆ జంట ద ఫినిష్డ్‌ మిస్టరీ పుస్తకాన్ని చదివి, కేవలం ఐదు వారాల్లోనే సత్యాన్ని అంగీకరించింది! ఆయనిలా అన్నాడు, “ఆ భార్యాభర్తలు ఇద్దరూ దేవునికి సమర్పించుకుని, అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నారు.”

ఆ పుస్తకాన్ని అందుకున్న ఒకాయన, వెంటనే తన స్నేహితులతో దాన్ని పంచుకున్నాడు. దాంట్లోని సందేశం ఆయనకు “తగిలింది.” ఆయనిలా గుర్తుచేసుకుంటున్నాడు, “ఒకరోజు నేను వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా భుజానికి ఏదో తగిలింది. అది ఇటుక రాయి ఏమో అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా అది ‘ద ఫినిష్డ్‌ మిస్టరీ’ పుస్తకం. వెంటనే దాన్ని ఇంటికి తెచ్చుకుని మొత్తం చదివేశాను. . . . తర్వాత తెలిసిందేంటంటే, ఒక పాస్టర్‌ కోపంతో ఆ పుస్తకాన్ని కిటికీ నుండి బయటకు విసిరేశాడు . . . అతను పాస్టర్‌గా చేసిన పనుల వల్ల ఎంతమంది మారారో తెలీదుగానీ, ఈ పుస్తకాన్ని విసిరేయడం వల్ల మాత్రం చాలామంది మారారు. . . . ఆ పాస్టర్‌ కోపం వల్లే ఈ రోజు మేం దేవున్ని ఆరాధిస్తున్నాం.”

ఆ పాస్టర్‌ ప్రతిస్పందన వింతేమీ కాదు. కెనడా అధికారులు 1918, ఫిబ్రవరి 12న ఆ పుస్తకాన్ని నిషేధించారు. దాంట్లో తిరుగుబాటును రేకెత్తించే సమాచారం, యుద్ధాలకు వ్యతిరేకంగా రాసిన కొన్ని మాటలు ఉన్నాయని వాళ్లు ఆరోపించారు. కొంతకాలానికే, అమెరికా అధికారులు కూడా దాన్ని నిషేధించారు. సంస్థలో నాయకత్వం వహిస్తున్న సభ్యులకు వ్యతిరేకంగా ఆధారాలు దొరుకుతాయేమో అని ప్రభుత్వ ఏజెంట్లు బెతెల్‌ గృహాన్ని, న్యూయార్క్‌, పెన్సిల్వేనియా, కాలిఫోర్నియాలో ఉన్న కార్యాలయాలను తనిఖీ చేశారు. 1918, మార్చి 14న అమెరికా న్యాయశాఖ ద ఫినిష్డ్‌ మిస్టరీ పుస్తకాన్ని నిషేధించింది. ఆ పుస్తకాన్ని ప్రచురించడం, పంచిపెట్టడం యుద్ధ ఏర్పాట్లను నీరుగార్చడమేననీ, గూఢచర్య చట్టాన్ని వ్యతిరేకించడమేననీ న్యాయశాఖ భావించింది.

జైలు పాలయ్యారు!

1918, మే 7న న్యాయశాఖ ఎనిమిదిమంది సహోదరులపై అరెస్ట్‌ వారెంట్లు జారీచేసింది. వాళ్లెవరంటే: జొవెన్నీ డెచెకా, జార్జ్‌ ఫిషర్‌, అలెగ్జాండర్‌ మాక్‌మిలన్‌, రాబర్ట్‌ మార్టిన్‌, ఫెడ్రిక్‌ రాబ్సన్‌, జోసెఫ్‌ రూథర్‌ఫర్డ్‌, విలియమ్‌ వాన్‌ ఆమ్‌ బర్గ్‌, క్లేటన్‌ ఉడ్‌వర్త్‌. “చట్టవిరుద్ధంగా, కుయుక్తితో, ఉద్దేశపూర్వకంగా ఎదురుతిరుగుతున్నారు, అమెరికాలోని మిలటరీలో, నేవీలో పనిచేయడానికి నిరాకరిస్తున్నారు, దేశానికి అవిశ్వసనీయంగా ఉంటున్నారు” అని వాళ్ల మీద ఆరోపణ చేశారు. 1918, జూన్‌ 3న వాళ్ల మీద విచారణ మొదలైంది. వాళ్లకు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి. ఎందుకు?

వాళ్లు గూఢచర్య చట్టాన్ని ధిక్కరిస్తున్నారని అమెరికా అటార్నీ జనరల్‌ ఆరోపించింది. గూఢచర్య చట్టాన్ని “తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునే శక్తివంతమైన ఆయుధం” అని అటార్నీ జనరల్‌ పిలిచేది. 1918, మే 16న ఆ చట్టంలో సవరణ చేయడానికి కాంగ్రెస్‌ నిరాకరించింది. ఒకవేళ ఆ సవరణ జరిగివుంటే బాగుండేది. ఎందుకంటే, ఆ సవరణ ప్రకారం “హద్దులు మీరకుండా, మంచి ఉద్దేశాలతో వాస్తవాలను” ప్రచురించడం తప్పు కాదు. అయితే, ద ఫినిష్డ్‌ మిస్టరీ పుస్తకం వాళ్ల చర్చల్లో ముఖ్యాంశం అయింది. దానిగురించి, అమెరికా కాంగ్రెస్‌ అధికారిక నివేదికలో ఇలా ఉంది, “ఈ రకమైన తప్పుడు ప్రచారానికి ఒక భయంకరమైన ఉదాహరణ, ‘ద ఫినిష్డ్‌ మిస్టరీ’ అనే పుస్తకం. . . . సైనికులు దేశ ఉద్దేశాన్ని తప్పుబట్టేలా, . . . డ్రాఫ్ట్‌బోర్డుకు (యువకులను బలవంతంగా సైన్యంలో చేర్పించే ఒక బృందం) ఎదురుతిరిగేలా చేయడమే దాని ఉద్దేశం.”

1918, జూన్‌ 20న న్యాయస్థానం ఆ ఎనిమిదిమంది సహోదరుల్ని దోషులుగా నిర్ధారించింది. తర్వాతి రోజు, న్యాయమూర్తి తన తీర్పును ప్రకటించాడు. ఆయనిలా చెప్పాడు, “ఈ ప్రతివాదులు విపరీతంగా చేస్తున్న మత ప్రచారం . . . జర్మనీ సైన్యంలో విభజనలు సృష్టించడం కన్నా ఘోరమైన నేరం. . . . కాబట్టి వీళ్లను కఠినంగా శిక్షించాలి.” రెండు వారాల తర్వాత, ఆ ఎనిమిదిమంది సహోదరులకు 10 నుండి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించి జార్జియాలోని అట్లాంటా జైలుకు పంపించారు.

ప్రకటనా పని కొనసాగింది

ఆ సమయంలో బైబిలు విద్యార్థులకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI) వాళ్ల కార్యకలాపాల్ని క్షుణ్ణంగా విచారించి, వేలకొలది డాక్యుమెంట్లు ప్రభుత్వానికి అందజేసింది. అన్ని డాక్యుమెంట్లు తయారయ్యాయంటే, మన సహోదరులు ప్రకటనా పనిని ఎంత ముమ్మరంగా చేశారో అర్థమౌతుంది.

ఫ్లోరిడాలోని ఒర్లాండోకు చెందిన ఒక పోస్ట్‌మాస్టర్‌ FBIకి ఇలా ఉత్తరం రాశాడు, “[బైబిలు విద్యార్థులు] పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. వాళ్లు ఎక్కువగా రాత్రుళ్లే ఈ పని చేస్తున్నారు. . . . వాళ్లు మానకుండా ప్రచారం చేస్తూ ప్రజల్ని ఇబ్బందిపెడుతున్నారు.”

ఒక సైనికాధికారి (కల్నల్‌), సహోదరుడు ఫ్రెడ్రిక్‌ ఫ్రాంజ్‌ చేసే పని గురించి FBIకి రిపోర్టు రాశాడు. ఫ్రెడ్రిక్‌ ఫ్రాంజ్‌ కొంతకాలానికి పరిపాలక సభ సభ్యుడు అయ్యాడు. ఆ అధికారి ఇలా రాశాడు, “ఎఫ్‌. డబ్ల్యూ. ఫ్రాంజ్‌ . . . ‘ఫినిష్డ్‌ మిస్టరీ’ పుస్తకపు వేల కాపీలను అమ్మాడు.”

ఆ తర్వాతి కాలాల్లో పరిపాలక సభ సభ్యునిగా సేవచేసిన సహోదరుడు ఛార్లెస్‌ ఫెకెల్‌ కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ద ఫినిష్డ్‌ మిస్టరీ పుస్తకాన్ని పంచిపెడుతున్నందుకు అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. ఆయనకు వచ్చే ఉత్తరాలన్నిటి మీద నిఘా వేశారు. మేరీల్యాండ్‌లోని బాల్టమోర్‌లో ఆయన్ని నెలపాటు జైల్లో ఉంచి, “ఆస్ట్రియా నుండి వచ్చిన విదేశీ శత్రువు” అని ముద్రవేశారు. తనను విచారిస్తున్న అధికారులకు ఆయన ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నప్పుడు, 1 కొరింథీయులు 9:16⁠లోని పౌలు మాటల్ని గుర్తుచేసుకున్నాడు. అక్కడిలా ఉంది, “నేను మంచివార్త ప్రకటించకపోతే నిజంగా నాకు శ్రమ!” *

బైబిలు విద్యార్థులు ఒకవైపు ఉత్సాహంగా ప్రకటిస్తూనే, అట్లాంటాలో జైలుపాలైన సహోదరుల్ని విడుదల చేయమనే పిటీషన్‌ను కూడా పంచిపెట్టారు. ఆన కె. గార్డనర్‌ అనే సహోదరి ఇలా గుర్తుచేసుకుంది, “మేం అస్సలు ఖాళీగా లేము. సహోదరులు జైల్లో ఉన్నప్పుడు, మా తక్షణ కర్తవ్యం ఏంటంటే, సహోదరులను విడుదల చేయమనే పిటీషన్‌ మీద వీలైనన్ని ఎక్కువ సంతకాలు సేకరించడం. మేం ఇంటింటికి తిరిగి వేలకొలది సంతకాలు తీసుకున్నాం! ఆ సహోదరులు నిజక్రైస్తవులనీ, వాళ్లను అన్యాయంగా జైల్లో వేశారనీ ప్రజలకు చెప్పాం.”

సమావేశాలు

ఆ కష్టపరిస్థితుల్లో సహోదరుల్ని ఆధ్యాత్మికంగా బలపర్చడానికి తరచూ సమావేశాలు జరిగాయి. ద వాచ్‌ టవర్‌ ఇలా చెప్పింది, “నలభై కన్నా ఎక్కువ సమావేశాలు . . . ఆ సంవత్సరంలో జరిగాయి . . . ఆ సమావేశాలన్నిటి నుండి చక్కని నివేదికలు అందాయి. అంతకుముందు, సంవత్సరానికి రెండుమూడు సమావేశాలు జరిగేవి. కానీ ఆ సంవత్సరంలో నెలకు ఒక సమావేశం జరిగింది.”

మంచి మనసున్న ప్రజలు మంచివార్తకు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన ఒక సమావేశానికి దాదాపు 1,200 మంది హాజరయ్యారు, 42 మంది బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్లలో ఒక చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు. “దేవుని మీద తనకున్న కృతజ్ఞతను, భక్తిని చాటుతూ ఆ అబ్బాయి లోకంలోని పెద్దవాళ్లు సిగ్గుపడేలా చేశాడు.”

తర్వాత ఏంటి?

1918వ సంవత్సరం ముగింపులో బైబిలు విద్యార్థులు ఊహించని సంఘటనలు ఎదుర్కొన్నారు. బ్రూక్లిన్‌లో ఉన్న కొంత ఆస్తిని అమ్మేశారు, ప్రధాన కార్యాలయం పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌కు మారింది. సంస్థలో నాయకత్వం వహిస్తున్న సహోదరులు జైల్లో ఉండగానే వాటాదారులు 1919, జనవరి 4న వార్షిక కూటాన్ని ఏర్పాటు చేశారు. మరి ఏం జరుగుతుంది?

మన సహోదరులు తమ పనిని పట్టుదలగా కొనసాగించారు. వాళ్లు ఎంత నమ్మకంతో ఉన్నారంటే, 1919వ సంవత్సరానికి ఈ వార్షిక వచనం ఎంపిక చేసుకున్నారు: “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు.” (యెష. 54:17) జరగబోయే ఒక పెనుమార్పుకు రంగం సిద్ధమైంది. ఆ మార్పు వాళ్ల విశ్వాసాన్ని బలపర్చి, ముందున్న గొప్ప పనికి వాళ్లను సంసిద్ధులను చేసింది.

^ పేరా 6 2017 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకంలో (ఇంగ్లీష్‌) 172-176 వరకున్న పేజీల్లోని “వంద సంవత్సరాల క్రితం—1917” అనే అంశం చూడండి.

^ పేరా 22 1969 మార్చి 1 కావలికోట (ఇంగ్లీష్‌) సంచికలో, “మంచి పనిని పట్టుదలగా చేస్తూ సంతోషాన్ని పొందండి” అనే అంశంతో ఉన్న ఛార్లెస్‌ ఫెకెల్‌ జీవిత కథను చూడండి.