కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు తీసుకొచ్చే “తుఫాను” దగ్గరపడింది కాబట్టి ప్రజలు ఆ హెచ్చరికను వినాల్సిన అవసరం ఉంది!

దేవుని తీర్పులు​—అమలు చేసే ముందు సరిపడా సమయం ఇస్తాడా?

దేవుని తీర్పులు​—అమలు చేసే ముందు సరిపడా సమయం ఇస్తాడా?

వాతావరణ సమాచారాన్ని తెలిపే వ్యక్తి రాడార్‌ మెషీన్‌లో గమనార్హమైన మార్పును చూశాడు. జనాభా ఎక్కువున్న ఒక ప్రాంతంలో భయంకరమైన తుఫాను రాబోతుందని ఆయన గుర్తించాడు. ప్రజల సంక్షేమం పట్ల ఆయనకు శ్రద్ధ ఉంది కాబట్టి సమయం మించిపోకముందే వాళ్లను హెచ్చరించడానికి చేయగలిగినదంతా చేశాడు.

అదేవిధంగా, నేడు కనీవినీ ఎరుగని ఒక భయంకరమైన “తుఫాను” రాబోతుందని యెహోవా హెచ్చరిస్తున్నాడు. ఇంతకీ ఆయన ఆ పనిని ఎలా చేస్తున్నాడు? ప్రజలు దానికి స్పందించేంత సమయాన్ని ఆయన ఇస్తున్నాడని మనమెలా చెప్పవచ్చు? వీటికి జవాబులు తెలుసుకోవడానికి, ప్రాచీన కాలాల్లో యెహోవా ఇచ్చిన కొన్ని హెచ్చరికల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

దేవుడు హెచ్చరికల్ని ఎప్పుడు ఇచ్చాడు?

బైబిలు కాలాల్లో, తన ఆజ్ఞల్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసేవాళ్ల మీదికి రాబోతున్న వివిధ “తుఫానుల” గురించి లేదా తీర్పుల గురించి యెహోవా హెచ్చరించాడు. (సామె. 10:25; యిర్మీ. 30:23) ప్రతీ సందర్భంలో, ఆయన అవిధేయులైన ప్రజల్ని చాలా ముందుగానే హెచ్చరించాడు, తనకు లోబడాలంటే ఏం చేయాలో కూడా చెప్పాడు. (2 రాజు. 17:12-15; నెహె. 9:29, 30) ప్రజలు మార్పులు చేసుకునేలా ప్రోత్సహించడానికి ఆయన తరచూ భూమ్మీదున్న తన నమ్మకమైన సేవకుల్ని ఉపయోగించుకున్నాడు. వాళ్లు ఆయన తీర్పుల్ని ప్రకటించారు, త్వరగా చర్య తీసుకోవడం ప్రాముఖ్యమని అర్థంచేసుకునేలా ప్రజలకు సహాయం చేశారు.—ఆమో. 3:7.

అలాంటి నమ్మకమైన సేవకుల్లో నోవహు ఒకడు. ఆయన కాలంలో ప్రజలు అనైతికంగా, క్రూరంగా ఉండేవాళ్లు. అయితే జలప్రళయం గురించి నోవహు ఎన్నో ఏళ్లపాటు ప్రజల్ని ధైర్యంగా హెచ్చరించాడు. (ఆది. 6:9-13, 17) వాళ్లు దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలో కూడా ఆయన చెప్పాడు. నోవహు ఎంతగా ప్రకటించాడంటే, ఆయనకు “నీతిని ప్రకటించిన నోవహు” అనే పేరు వచ్చింది.—2 పేతు. 2:5.

నోవహు అంత కష్టపడి ప్రకటించినా, ప్రజలు దేవుని తీర్పు సందేశాన్ని పట్టించుకోలేదు. వాళ్లు ఏమాత్రం విశ్వాసం చూపించలేదు. ఫలితంగా, జలప్రళయం “వచ్చి వాళ్లందర్నీ కొట్టుకొనిపోయింది.” (మత్త. 24:39; హెబ్రీ. 11:7) వాళ్లు చనిపోయేముందు, దేవుడు తమను హెచ్చరించలేదని చెప్పడానికి ఏ కారణమూ లేదు.

ఇంకొన్ని సందర్భాల్లో, “తుఫాను” లాంటి తన తీర్పును అమలుచేయడానికి కాస్త ముందు యెహోవా ప్రజల్ని హెచ్చరించాడు. అయినప్పటికీ, ప్రజలు దానికి స్పందించేంత సమయం ఇచ్చాడు. ఉదాహరణకు, ప్రాచీన ఐగుప్తు మీదకు పది తెగుళ్లు తీసుకొచ్చినప్పుడు ఆయన వాటిగురించి ముందుగానే హెచ్చరించాడు. ఏడో తెగులైన వడగండ్ల వాన గురించి ఫరోను, అతని సేవకులను హెచ్చరించడానికి యెహోవా మోషేను, అహరోనును పంపించాడు. ఆ వడగండ్ల వాన మరుసటి రోజు మొదలౌతుంది కాబట్టి, ప్రజలు ఆశ్రయం వెతుక్కుని, దాన్ని తప్పించుకునేంత సమయం దేవుడు ఇచ్చాడా? బైబిలు ఇలా చెప్తుంది, “ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.” (నిర్గ. 9:18-21) దీన్నిబట్టి యెహోవా, ప్రజలకు తగినంత సమయాన్ని ఇచ్చాడని స్పష్టంగా అర్థమౌతుంది. ఆ హెచ్చరికకు ఎవరైతే త్వరగా స్పందించారో వాళ్లు ఆ తెగులు నుండి ఎక్కువగా నష్టపోలేదు.

పదో తెగులు విషయంలో కూడా అది రావడానికి ముందే దేవుడు ఫరోను, అతని సేవకుల్ని హెచ్చరించాడు. అయినప్పటికీ వాళ్లు మూర్ఖంగా దాన్ని పట్టించుకోలేదు. (నిర్గ. 4:22, 23) ఫలితంగా, వాళ్ల పెద్ద కొడుకులందరూ చనిపోయారు. ఎంత విచారకరమో కదా! (నిర్గ. 11:4-10; 12:29) ఆ హెచ్చరికకు స్పందించేంత సమయం వాళ్లకు ఉందా? ఉంది! రాబోయే పదో తెగులు గురించి మోషే వెంటనే ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించాడు, వాళ్లు తమ కుటుంబాల్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో చెప్పాడు. (నిర్గ. 12:21-28) మరి ఆ హెచ్చరికకు ఎంతమంది స్పందించారు? కొన్ని అంచనాల ప్రకారం, 30 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువమంది ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చారు. వాళ్లలో ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులుకాని “అనేకులైన అన్యజనులు” అలాగే ఐగుప్తీయులు ఉన్నారు.—నిర్గ. 12:38.

ఈ ఉదాహరణల్ని బట్టి, ప్రజలు తన హెచ్చరికల్ని విని, స్పందించేంత సమయం యెహోవా ఎల్లప్పుడూ ఇచ్చాడని అర్థమౌతుంది. (ద్వితీ. 32:4) ఆయన ఎందుకు అలా సమయం ఇచ్చాడు? ఆయనకు “ఎవ్వరూ నాశనం కావడం ఇష్టంలేదు, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని ఆయన కోరుకుంటున్నాడు” అని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (2 పేతు. 3:9) అవును, దేవునికి ప్రజల మీద శ్రద్ధ ఉంది. తన తీర్పు అమలయ్యే లోపే వాళ్లు పశ్చాత్తాపపడి, తగిన మార్పులు చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు.—యెష. 48:17, 18; రోమా. 2:4.

నేడు దేవుని తీర్పుకు స్పందించడం

నేడు భూవ్యాప్తంగా ప్రకటించబడుతున్న ప్రాముఖ్యమైన తీర్పుకు ప్రజలందరూ స్పందించాలి. “మహాశ్రమ” కాలంలో ఈ వ్యవస్థ నాశనమౌతుందని యేసు భూమ్మీదున్నప్పుడు హెచ్చరించాడు. (మత్త. 24:21) భవిష్యత్తులో రాబోయే ఆ తీర్పు గురించి ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. ఆరోజు దగ్గరయ్యే కొద్దీ తన అనుచరులు ఏమేమి చూస్తారో, వాళ్లకు ఏమేమి జరుగుతాయో అందులో స్పష్టంగా వివరించాడు. ఆ విధంగా, నేడు మనం చూస్తున్న ముఖ్యమైన సంఘటనల గురించి యేసు ముందే చెప్పాడు.—మత్త. 24:3-12; లూకా 21:10-13.

ఆ ప్రవచనానికి అనుగుణంగా, యెహోవా తన ప్రేమపూర్వక పరిపాలనకు లోబడమని ఇప్పుడు ప్రతీ ఒక్కర్ని ఆహ్వానిస్తున్నాడు. అలా లోబడడం ద్వారా ప్రజలు ఇప్పుడు సంతోషంగా జీవించాలని, నీతి నివసించే కొత్తలోకంలో దీవెనల్ని సొంతం చేసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (2 పేతు. 3:13) తన వాగ్దానాల మీద విశ్వాసం ఉంచమని ప్రోత్సహించడానికి, ప్రాణాలు కాపాడే సందేశాన్ని అంటే “రాజ్యం గురించిన మంచివార్తను” ఆయన ఇచ్చాడు. ఆ మంచివార్త, ‘అన్ని దేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా భూమంతటా ప్రకటించబడుతుంది’ అని యేసు ముందే చెప్పాడు. (మత్త. 24:14) దేవుని నుండి వచ్చిన ఆ సందేశాన్ని ప్రకటించడానికి యెహోవా తన ఆరాధకులను చక్కగా వ్యవస్థీకరించాడు. ఇప్పుడు వాళ్లు దాదాపు 240 దేశాల్లో దాన్ని ప్రకటిస్తున్నారు. రాబోయే “తుఫాను” లేదా తన నీతియుక్తమైన తీర్పు గురించిన సందేశాన్ని వీలైనంత ఎక్కువమంది విని, దాన్ని తప్పించుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు.—జెఫ. 1:14, 15; 2:2, 3.

కాబట్టి, హెచ్చరికలకు స్పందించేంత సమయం యెహోవా ఇస్తాడా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ అలా సమయం ఇస్తాడని రుజువుల్ని చూస్తే తెలుస్తుంది. అయితే, సమయం ఉండగానే ప్రజలు దేవుని తీర్పుకు స్పందిస్తారా లేదా అనేదే ముఖ్యమైన ప్రశ్న. దేవుని ప్రతినిధులమైన మనం, వీలైనంత ఎక్కువమంది ఈ వ్యవస్థ నాశనాన్ని తప్పించుకునేలా సహాయం చేస్తూ ఉందాం.