కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 41

“మహాశ్రమ” కాలంలో నమ్మకంగా ఉండండి

“మహాశ్రమ” కాలంలో నమ్మకంగా ఉండండి

‘యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నవాళ్లారా, మీరందరూ ఆయన్ని ప్రేమించండి! యెహోవా నమ్మకమైనవాళ్లను రక్షిస్తాడు.’—కీర్త. 31:23, NW.

పాట 129 సహనం చూపిస్తూ ఉందాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. (ఎ) దేశాలు త్వరలో ఏ ప్రకటన చేస్తాయి? (బి) మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి?

మనందరం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న, “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటనను దేశాలు ఇప్పుడే చేశాయని ఊహించుకోండి. లోకం ముందెన్నడూ లేనంత సురక్షితంగా ఉందని అవి గొప్పగా చెప్పుకోవచ్చు. లోక సమస్యలన్నిటినీ అవి పరిష్కరించినట్టు మనం అనుకోవాలని దేశాలు కోరుకుంటాయి. కానీ ఆ తర్వాత జరగబోయే దాన్ని అవి అస్సలు ఆపలేవు. ఎందుకు? బైబిలు ముందే చెప్పినట్టు, “హఠాత్తుగా వాళ్ల మీదికి నాశనం వస్తుంది, అప్పుడు వాళ్లు అస్సలు తప్పించుకోలేరు.”—1 థెస్స. 5:3.

2 మనం ఈ ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి: “మహాశ్రమ” కాలంలో ఏం జరుగుతుంది? అప్పుడు మనం ఏం చేయాలని యెహోవా కోరుకుంటాడు? ఆ సమయంలో మనం నమ్మకంగా ఉండడానికి ఇప్పుడే ఎలా సిద్ధపడవచ్చు?—మత్త. 24:21.

“మహాశ్రమ” కాలంలో ఏం జరుగుతుంది?

3. ప్రకటన 17:5, 15-18 ప్రకారం దేవుడు ‘మహాబబులోనును’ ఎలా నాశనం చేస్తాడు?

3 ప్రకటన 17:5, 15-18 చదవండి. “మహాబబులోను” నాశనమౌతుంది! బైబిలు ముందే చెప్పినట్టు, ఆ సమయంలో జరగబోయే విషయాలు దేశాల చేతుల్లో ఉండవు. ఎందుకు? ఎందుకంటే “తాను అనుకున్నట్లు జరగాలని దేవుడే వాళ్లలో తన ఆలోచన [పెడతాడు].” ఇంతకీ ఏంటి ఆ ఆలోచన? క్రైస్తవులమని చెప్పుకునే మతాలతో * సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబద్ధమతాలన్నిటినీ నాశనం చేయడం. దేవుడు తన ఆలోచనను ‘ఎర్రని క్రూరమృగానికి’ ఉన్న ‘పది కొమ్ముల’ హృదయాల్లో పెడతాడు. ‘క్రూరమృగానికి’ సూచనగా ఉన్న ఐక్యరాజ్య సమితికి మద్దతిచ్చే ప్రభుత్వాలన్నిటినీ ఆ ‘పది కొమ్ములు’ సూచిస్తున్నాయి. (ప్రక. 17:3, 11-13; 18:8) ఆ ప్రభుత్వాలన్నీ అబద్ధమతం మీద చేసే దాడే, మహాశ్రమ ప్రారంభమవ్వడానికి సంకేతం. హఠాత్తుగా సంభవించే ఆ భయంకరమైన సంఘటన భూమ్మీదున్న ప్రతీఒక్కరి మీద ప్రభావం చూపిస్తుంది.

4. (ఎ) మహాబబులోను మీద దాడి చేయడానికి దేశాలు ఏ కారణాలు చెప్తాయి? (బి) ఒకప్పుడు మత సంస్థల్లో సభ్యులుగా ఉన్నవాళ్లు ఏం చేస్తారు?

4 ఏ కారణాలు చెప్పి దేశాలు మహాబబులోను మీద దాడి చేస్తాయో మనకు తెలీదు. బహుశా ప్రపంచ మతాలు శాంతికి అడ్డుగా ఉన్నాయని, అవి తరచూ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నాయని దేశాలు చెప్పవచ్చు. లేదా మత సంస్థలు డబ్బును, ఆస్తిని బాగా కూడబెట్టుకున్నాయని చెప్పవచ్చు. (ప్రక. 18:3, 7) అయితే, అబద్ధమతం మీద దాడి జరిగినప్పుడు దాని మతాలకు చెందిన సభ్యులందరూ నాశనం అవ్వకపోవచ్చు. కానీ దాని సంస్థలు నాశనమౌతాయని మనం అర్థంచేసుకోవచ్చు. ఆ సంస్థలు నాశనమయ్యాక వాటిలో సభ్యులుగా ఉన్నవాళ్లు, తమ మతనాయకులు చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోలేకపోయారని గుర్తించి, బహుశా ఆ మతాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.

5. మహాశ్రమ గురించి యెహోవా ఏమని మాటిచ్చాడు? ఎందుకు?

5 మహాబబులోను ఎంత సమయంలో నాశనమౌతుందో బైబిలు చెప్పట్లేదు. కానీ అది తక్కువ సమయంలోనే నాశనమౌతుందని మనకు తెలుసు. (ప్రక. 18:10, 21) తాను ‘ఎంపిక చేసుకున్నవాళ్లను’ అలాగే సత్య మతాన్ని కాపాడడానికి, యెహోవా మహాశ్రమ ‘రోజుల్ని తగ్గిస్తానని’ మాటిచ్చాడు. (మార్కు 13:19, 20) అయితే మహాశ్రమ మొదలయ్యాక, హార్‌మెగిద్దోను యుద్ధం వచ్చేలోపు మనం ఏం చేయాలని యెహోవా కోరుకుంటాడు?

యెహోవాను ఆరాధిస్తూ ఉండండి

6. అబద్ధమతంతో తెగతెంపులు చేసుకోవడం మాత్రమే ఎందుకు సరిపోదు?

6 ముందటి ఆర్టికల్‌లో చర్చించుకున్నట్టు, మహాబబులోను నుండి తన ఆరాధకులు బయటకు రావాలని యెహోవా కోరుకుంటున్నాడు. అయితే దానికోసం, మనం అబద్ధమతంతో తెగతెంపులు చేసుకుంటే సరిపోదు. యెహోవాను ఆరాధించాలని నిశ్చయించుకోవాలి కూడా. అలా చేయడానికి సహాయపడే రెండు మార్గాల్ని పరిశీలిద్దాం.

కష్ట పరిస్థితుల్లో కూడా మనం మీటింగ్స్‌ మానకుండా ఉందాం (7వ పేరా చూడండి) *

7. (ఎ) యెహోవా నీతియుక్తమైన నైతిక ప్రమాణాల్ని అంటిపెట్టుకొని ఉండాలంటే ఏం చేయాలి? (బి) హెబ్రీయులు 10:24, 25 ప్రకారం మనం ఎందుకు మీటింగ్స్‌కు వెళ్లాలి? అలా వెళ్లడం ఇప్పుడు ఎందుకు ప్రాముఖ్యం?

7 మొదటిగా, యెహోవా నీతియుక్తమైన నైతిక ప్రమాణాల్ని పాటిస్తూ ఉండాలి. లోకంలోని అనైతిక ప్రవర్తనను మనం ఎన్నడూ అంగీకరించకూడదు. ఉదాహరణకు అమ్మాయిలు-అమ్మాయిల్ని, అబ్బాయిలు-అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడాన్ని, స్వలింగ సంపర్కాన్ని అలాగే అన్నిరకాల లైంగిక పాపాల్ని మనం అసహ్యించుకుంటాం. (మత్త. 19:4, 5; రోమా. 1:26, 27) రెండవదిగా, మన సహోదరసహోదరీలతో కలిసి ఆరాధన చేయడం మానకూడదు. ఎక్కడ వీలైతే అక్కడ, అంటే రాజ్యమందిరాల్లో లేదా సహోదరసహోదరీల ఇళ్లలో లేదా రహస్యంగానైనా మనం ఆరాధన చేసుకుంటాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మనం మీటింగ్స్‌ మాత్రం మానం. నిజానికి, “ఆ రోజు దగ్గరపడే కొద్దీ ఇంకా ఎక్కువగా” మీటింగ్స్‌కి వెళ్లాలి.—హెబ్రీయులు 10:24, 25 చదవండి.

8. భవిష్యత్తులో మనం ఏ సందేశం ప్రకటిస్తాం?

8 మహాశ్రమ కాలంలో మనం ప్రకటించే సందేశం మారవచ్చు. ప్రస్తుతం మనం దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటిస్తున్నాం అలాగే శిష్యుల్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మహాశ్రమ కాలంలో, మనం ప్రకటించే సందేశం చాలా సూటిగా ఉంటుంది. బైబిలు దాన్ని వడగండ్లతో పోలుస్తుంది. (ప్రక. 16:21) అది బహుశా సాతాను లోకానికి జరగబోయే నాశనం గురించి కావచ్చు. మనం ఏం ప్రకటిస్తామో, ఎలా ప్రకటిస్తామో త్వరలో స్పష్టంగా తెలుస్తుంది. ప్రకటించడానికి, బోధించడానికి వందల సంవత్సరాలుగా మనం ఉపయోగిస్తున్న అవే పద్ధతుల్ని ఉపయోగిస్తామా? లేదా వేరే పద్ధతుల్ని ఉపయోగిస్తామా? దాన్ని తెలుసుకోవడానికి మనం వేచి చూడాల్సిందే. ఏదేమైనా, యెహోవా తీర్పు సందేశాన్ని ధైర్యంగా ప్రకటించే గొప్ప అవకాశం మనకు దొరుకుతుంది!—యెహె. 2:3-5.

9. మనం ప్రకటించే సందేశానికి దేశాలు ఎలా స్పందిస్తాయి? కానీ మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

9 దేశాలు మన ప్రకటనా పనిని శాశ్వతంగా ఆపుజేయడానికి ప్రయత్నించేలా చాలావరకు మన సందేశమే వాటిని రెచ్చగొడుతుంది. నేడు పరిచర్యలో సహాయం కోసం మనం యెహోవా మీద ఆధారపడినట్టే, భవిష్యత్తులో కూడా ఆధారపడాలి. మనం తన ఇష్టాన్ని నెరవేర్చేలా దేవుడు మనలో శక్తి నింపుతాడనే నమ్మకంతో ఉండవచ్చు.—మీకా 3:8.

దేవుని ప్రజల మీద జరిగే దాడి కోసం సిద్ధంగా ఉండండి

10. లూకా 21:25-28 ప్రకారం, మహాశ్రమలో జరిగే వాటికి చాలామంది ఎలా స్పందిస్తారు?

10 లూకా 21:25-28 చదవండి. ఈ లోకంలో స్థిరంగా ఉంటాయని నమ్మినవన్నీ అంటే రాజకీయం, వాణిజ్యం, ప్రపంచంలోని ఇతర వ్యవస్థలు మహాశ్రమలో కుప్పకూలుతుండడం చూసి ప్రజలు అవాక్కౌతారు. మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఆ సమయంలో తాము చనిపోతామేమో అని ప్రజలు భయాందోళన చెందుతారు. (జెఫ. 1:14, 15) ఆ సమయంలో యెహోవా ప్రజలకు కూడా జీవితం మరింత కష్టంగా తయారవ్వచ్చు. మనం ఈ లోకానికి వేరుగా ఉంటాం కాబట్టి దానివల్ల కొన్ని కష్టాలు ఎదురవ్వవచ్చు. బహుశా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా మన దగ్గర ఉండకపోవచ్చు.

11. (ఎ) దేశాల దృష్టంతా యెహోవాసాక్షుల మీద ఎందుకు పడుతుంది? (బి) మహాశ్రమ గురించి మనం ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు?

11 మహాశ్రమ మొదలయ్యాక ఒక సమయంలో, నాశనమైపోయిన మతాలకు చెందిన ప్రజలు యెహోవాసాక్షుల మతం ఇంకా ఉండడం చూసి కోపోద్రేకులు అవుతారు. దానివల్ల ఆఖరికి సోషల్‌ మీడియాలో, టీవీలో కలిగే అలజడిని మనం ఊహించుకోవచ్చు. మన మతం మాత్రమే మిగిలివుండడం చూసి దేశాలు, వాటి పరిపాలకుడైన సాతాను మనల్ని ద్వేషిస్తారు. ఎందుకంటే, భూమ్మీది మతాలన్నిటినీ నాశనం చేయాలనే వాళ్ల లక్ష్యం నెరవేరలేదు. దాంతో వాళ్ల దృష్టంతా మనమీద పడుతుంది. సరిగ్గా అప్పుడే, దేశాలు మాగోగు వాడైన గోగు పాత్ర పోషిస్తాయి. * ఆ దేశాలన్నీ ఏకమై, తమ శక్తంతా ఉపయోగించి యెహోవా ప్రజలమీద దాడి చేస్తాయి. (యెహె. 38:2, 14-16) మహాశ్రమలో ఏం జరుగుతుందో మనకు పూర్తి వివరాలు తెలియవు కాబట్టి మనలో ఆందోళన మొదలవ్వవచ్చు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం. అదేంటంటే, మహాశ్రమ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రాణాల్ని కాపాడే నిర్దేశాల్ని యెహోవా మనకు ఇస్తాడు. (కీర్త. 34:19) అప్పుడు మనం ‘స్థిరంగా నిలబడి మన తలలు ఎత్తుతాం; ఎందుకంటే మన విడుదల దగ్గరపడుతోందని’ మనకు అర్థమౌతుంది. *

12. భవిష్యత్తులో జరగబోయేవాటి కోసం “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” మనల్ని ఎలా సిద్ధం చేస్తూ ఉన్నాడు?

12 మనం మహాశ్రమ కాలంలో నమ్మకంగా ఉండేలా “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. (మత్త. 24:45) దాసుడు చాలా విధాలుగా మనల్ని సిద్ధం చేస్తున్నాడు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, 2016 నుండి 2018 వరకు సమయానుకూలంగా ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమాలు. యెహోవా రోజు దగ్గరపడుతుండగా మనకు అవసరమయ్యే కొన్ని లక్షణాలను బలపర్చుకునేలా ఆ కార్యక్రమాలు మనల్ని ప్రోత్సహించాయి. ఆ లక్షణాల గురించి ఇప్పుడు కొంత పరిశీలిద్దాం.

మీ విశ్వసనీయతను, సహనాన్ని, ధైర్యాన్ని బలపర్చుకుంటూ ఉండండి

“మహాశ్రమ” దాటడానికి ఇప్పుడే సిద్ధపడండి (13-16 పేరాలు చూడండి) *

13. యెహోవా పట్ల మన విశ్వసనీయతను ఎలా బలపర్చుకోవచ్చు? ఆ పని ఇప్పుడే ఎందుకు చేయాలి?

13 విశ్వసనీయత: 2016 సమావేశ ముఖ్యాంశం, “యెహోవాకు విశ్వసనీయంగా ఉండండి!” యెహోవాతో మన సంబంధం బలంగా ఉంటే, మనం ఆయనకు విశ్వసనీయంగా ఉంటామని ఆ సమావేశం నేర్పించింది. హృదయపూర్వకంగా ప్రార్థించడం ద్వారా, బైబిల్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం ద్వారా మనం యెహోవాకు దగ్గరవ్వగలమని ఆ సమావేశం గుర్తుచేసింది. మనం ఆ పనులు చేసినప్పుడు అత్యంత కష్టమైన సమస్యల్ని కూడా తట్టుకోగలిగే బలాన్ని పొందుతాం. సాతాను వ్యవస్థ నాశనానికి దగ్గరయ్యే కొద్దీ దేవుని పట్ల, ఆయన రాజ్యం పట్ల మనకున్న విశ్వసనీయత ఇంకా ఎక్కువగా పరీక్షించబడవచ్చు. బహుశా ప్రజలు మనల్ని ఎగతాళి చేస్తూనే ఉంటారు. (2 పేతు. 3:3, 4) అలా ఎగతాళి చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, మనం సాతాను లోకంలో ఉన్న దేనికీ మద్దతివ్వకపోవడం. మనం ఇప్పుడే మన విశ్వసనీయతను బలపర్చుకుంటే, మహాశ్రమలో కూడా విశ్వసనీయంగా ఉంటాం.

14. (ఎ) భూమ్మీద నాయకత్వం వహించే సహోదరులకు సంబంధించి ఏ మార్పు జరుగుతుంది? (బి) ఆ సమయంలో మనం ఎందుకు విశ్వసనీయంగా ఉండాలి?

14 మహాశ్రమ కాలంలో, భూమ్మీద నాయకత్వం వహించే సహోదరులకు సంబంధించి ఒక మార్పు జరుగుతుంది. అప్పుడు ఏదోక సమయంలో, భూమ్మీద మిగిలివున్న అభిషిక్త క్రైస్తవులు పరలోకానికి సమకూర్చబడతారు, తర్వాత వాళ్లు హార్‌మెగిద్దోన్‌ యుద్ధంలో భాగం వహిస్తారు. (మత్త. 24:31; ప్రక. 2:26, 27) అంటే ఇక పరిపాలక సభ మనతోపాటు భూమ్మీద ఉండదు. కానీ, గొప్ప సమూహం ఒక క్రమపద్ధతిలో సంస్థీకరించబడే ఉంటుంది. వేరే గొర్రెలకు చెందిన అర్హులైన సహోదరుల్లో కొందరు నాయకత్వం వహిస్తారు. ఆ సహోదరులకు మద్దతివ్వడం ద్వారా, అలాగే వాళ్లను ఉపయోగించుకొని దేవుడు ఇచ్చే నిర్దేశాలను పాటించడం ద్వారా మన విశ్వసనీయతను చూపిస్తాం. అలా చేస్తేనే మన ప్రాణాల్ని కాపాడుకుంటాం.

15. మన సహనాన్ని ఎలా బలపర్చుకోవచ్చు? ఇప్పుడే అలా చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

15 సహనం: 2017 సమావేశ ముఖ్యాంశం, “పట్టుదలగా ముందుకు సాగండి!” కష్టాల్ని సహించేలా ఈ సమావేశం మనల్ని బలపర్చింది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సహనం చూపించడం సాధ్యమేనని మనం ఆ సమావేశంలో నేర్చుకున్నాం. యెహోవా మీద ఆధారపడడం ద్వారా మన సహనాన్ని బలపర్చుకోవచ్చు. (రోమా. 12:12) “అంతం వరకు సహించే వాళ్లే రక్షించబడతారు” అని యేసు ఇచ్చిన మాటను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. (మత్త. 24:13, అధస్సూచి) యేసు ఇచ్చిన ఆ మాటను బట్టి, ఎలాంటి కష్టాలు వచ్చినా మనం నమ్మకంగా ఉండాలని అర్థంచేసుకోవచ్చు. ఇప్పుడు మనకొచ్చే కష్టాలన్నిటినీ సహిస్తే, మహాశ్రమ రాకముందే మన విశ్వాసం బలపడుతుంది.

16. మనకు ధైర్యం దేనివల్ల వస్తుంది? ధైర్యాన్ని ఇప్పుడే ఎందుకు బలపర్చుకోవాలి?

16 ధైర్యం: 2018 సమావేశ ముఖ్యాంశం, “ధైర్యంగా ఉండండి!” మన సొంత సామర్థ్యాల వల్ల మనం ధైర్యంగా ఉండలేమని ఆ సమావేశం గుర్తుచేసింది. సహనం కోసం యెహోవా మీద ఆధారపడినట్టే, నిజమైన ధైర్యం కోసం కూడా యెహోవా మీద ఆధారపడాలి. యెహోవా మీద మనం మరింతగా ఎలా ఆధారపడవచ్చు? దానికోసం మనం ప్రతిరోజు బైబిలు చదవాలి, యెహోవా గతంలో తన ప్రజల్ని ఎలా రక్షించాడో లోతుగా ఆలోచించాలి. (కీర్త. 68:20; 2 పేతు. 2:9) మహాశ్రమ కాలంలో దేశాలు మన మీద దాడి చేసినప్పుడు, మనం ధైర్యంగా ఉంటూ ముందెప్పటికన్నా ఎక్కువగా యెహోవా మీద నమ్మకం ఉంచాలి. (కీర్త. 112:7, 8; హెబ్రీ. 13:6) ఇప్పుడు మనం యెహోవా మీద ఆధారపడితే, భవిష్యత్తులో గోగు దాడిని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం వస్తుంది. *

మీ విడుదల కోసం ఎదురుచూడండి

దేవుని శత్రువుల్ని హార్‌మెగిద్దోన్‌ యుద్ధంలో నాశనం చేయడానికి త్వరలోనే యేసు తన పరలోక సైన్యంతో పాటు బయలుదేరతాడు! (17వ పేరా చూడండి)

17. హార్‌మెగిద్దోన్‌ యుద్ధం గురించి మనం ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు? (ముఖచిత్రం చూడండి.)

17 ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించినట్టు, మనలో చాలామంది జీవితమంతా చివరి రోజుల్లో గడిపాం. అయితే, మహాశ్రమను దాటే అవకాశం కూడా మనకు ఉంది. హార్‌మెగిద్దోన్‌ యుద్ధం వచ్చినప్పుడు ఈ వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుంది. కానీ మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే ఆ యుద్ధం చేసేది యెహోవాయే, మనం కాదు. (సామె. 1:33; యెహె. 38:18-20; జెక. 14:3) యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు, యేసుక్రీస్తు దేవుని సైన్యాన్ని యుద్ధానికి నడిపిస్తాడు. ఆయనతోపాటు పునరుత్థానం చేయబడిన అభిషిక్త క్రైస్తవులు అలాగే కోటాను కోట్లమంది దేవదూతలు దానిలో పాల్గొంటారు. వాళ్లంతా కలిసి సాతానుతో, అతని చెడ్డదూతలతో, భూమ్మీదున్న అతని సైన్యాలతో పోరాడతారు.—దాని. 12:1; ప్రక. 6:2; 17:14.

18. (ఎ) యెహోవా మనకు ఏ హామీ ఇచ్చాడు? (బి) ప్రకటన 7:9, 13-17 బట్టి భవిష్యత్తు గురించి మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

18 “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు” అని యెహోవా హామీ ఇచ్చాడు. (యెష. 54:17) నమ్మకమైన యెహోవా ఆరాధకుల “ఒక గొప్పసమూహం” ‘మహాశ్రమను దాటి’ సజీవంగా వస్తారు. ఆ తర్వాత కూడా వాళ్లు యెహోవాకు పవిత్రసేవ చేయడంలో కొనసాగుతారు. (ప్రకటన 7:9, 13-17 చదవండి.) మనం మహాశ్రమ నుండి రక్షించబడతామని నమ్మడానికి బైబిలు మనకు చాలా కారణాల్ని ఇస్తుంది. ‘యెహోవా నమ్మకమైనవాళ్లను రక్షిస్తాడు’ అని మనకు తెలుసు. (కీర్త. 31:23, NW) యెహోవాను ప్రేమించే, స్తుతించే వాళ్లందరూ ఆయన మీద వేయబడిన నిందలన్నీ తీసేయబడి, ఆయన పేరు ఘనపర్చబడడం చూసి చాలా సంతోషిస్తారు.—యెహె. 38:23.

19. త్వరలోనే మనం ఎలాంటి భవిష్యత్తును సొంతం చేసుకుంటాం?

19 కొత్త లోకంలో ప్రజలమీద సాతాను ప్రభావం ఉండదు కాబట్టి 2 తిమోతి 3:2-5 వచనాల్లో ఉన్న మాటలు ఎలా ఉంటాయో ఆలోచించండి. (“ అప్పుడు ఇలాంటి ప్రజలు ఉంటారు” అనే బాక్సు చూడండి.) పరిపాలక సభ సభ్యునిగా సేవ చేసిన సహోదరుడు జార్జ్‌ గ్యాంగస్‌ * ఇలా వివరించాడు, “ప్రతీఒక్కరు యెహోవాను ఆరాధించినప్పుడు ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! త్వరలో, కొత్త వ్యవస్థలో జీవించే గొప్ప అవకాశం మీకు ఉంటుంది. యెహోవా ఉన్నంతకాలం మీరు కూడా ఉంటారు. అంటే మనం శాశ్వతకాలం జీవిస్తాం.” అది నిజంగా ఒక అద్భుతమైన నిరీక్షణ!

పాట 122 స్థిరంగా, నిలకడగా ఉందాం!

^ పేరా 5 త్వరలో ప్రజలందరి మీదకు “మహాశ్రమ” వస్తుందని మనకు తెలుసు. అప్పుడు మనకు ఏం జరుగుతుంది? మనం ఏం చేయాలని యెహోవా కోరుకుంటాడు? ఆ సమయంలో మనం నమ్మకంగా ఉండాలంటే ఏ లక్షణాల్ని పెంచుకోవాలి? ఆ ప్రశ్నలకు జవాబులు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

^ పేరా 3 పదాల వివరణ: క్రైస్తవులమని చెప్పుకునే మతాలు, క్రీస్తును అనుసరిస్తున్నాయని చెప్పుకుంటాయి కానీ యెహోవా ప్రమాణాల ప్రకారం ఆరాధన చేయమని ప్రజలకు బోధించవు.

^ పేరా 11 పదాల వివరణ: మాగోగు వాడైన గోగు (దాని సంక్షిప్త రూపం, గోగు) దేశాల గుంపును సూచిస్తుంది. మహాశ్రమ కాలంలో దేశాలన్నీ ఏకమై యెహోవా ఆరాధకుల మీద దాడి చేస్తాయి.

^ పేరా 11 హార్‌మెగిద్దోన్‌కు ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఇంకా వివరంగా తెలుసుకోవడానికి, దేవుని రాజ్యం పరిపాలిస్తోంది! పుస్తకంలో 21వ అధ్యాయం చూడండి. మాగోగు వాడైన గోగు చేసే దాడి గురించి, అలాగే హార్‌మెగిద్దోన్‌లో యెహోవా తన ప్రజల్ని ఎలా కాపాడతాడనే దానిగురించి మరింతగా తెలుసుకోవడానికి, 2015 జూలై 15 కావలికోట సంచికలో 14-19 పేజీలు చూడండి.

^ పేరా 16 “ప్రేమ శాశ్వతంగా ఉంటుంది!” అనే ముఖ్యాంశం ఉన్న 2019 సమావేశ కార్యక్రమాన్ని చూస్తే, యెహోవా ప్రేమతో ఇచ్చే కాపుదలలో మనం సురక్షితంగా ఉండవచ్చనే నమ్మకం కుదురుతుంది.—1 కొరిం. 13:8.

^ పేరా 19 1994, డిసెంబరు 1 కావలికోట సంచికలో ‘ఆయన క్రియలు ఆయన్ను వెంబడిస్తాయి’ అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 65 చిత్రాల వివరణ: మహాశ్రమ కాలంలో, కొంతమంది యెహోవాసాక్షులు ఒక అడవిలో ధైర్యంగా మీటింగ్‌ జరుపుకుంటున్నారు.

^ పేరా 67 చిత్రాల వివరణ: నమ్మకమైన యెహోవా ఆరాధకుల ఒక గొప్పసమూహం, మహాశ్రమ నుండి ప్రాణాలతో బయటపడ్డారు, సంతోషంగా ఉన్నారు.