కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 42

మీరు ఏం అయ్యేలా యెహోవా చేయగలడు?

మీరు ఏం అయ్యేలా యెహోవా చేయగలడు?

‘తనకు ఇష్టమైనవి చేయాలనే కోరికను మీలో కలిగించి, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని మీకు ఇచ్చేది దేవుడే.’—ఫిలి. 2:13.

పాట 104 పవిత్రశక్తి దేవుడిచ్చే బహుమానం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఏం చేయగలడు?

యెహోవా తన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎలా అవ్వాలనుకుంటే అలా అవ్వగలడు. ఉదాహరణకు ఆయన ఒక బోధకునిగా, ఊరటనిచ్చే తండ్రిగా, సువార్తికునిగా అయ్యాడు. యెహోవా పోషించిన ఎన్నో పాత్రల్లో ఇవి కొన్ని మాత్రమే. (యెష. 48:17; 2 కొరిం. 7:6; గల. 3:8) అయితే, ఆయన తన ఇష్టాన్ని నెరవేర్చడానికి చాలాసార్లు మనుషుల్ని కూడా ఉపయోగించుకుంటాడు. (మత్త. 24:14; 28:19, 20; 2 కొరిం. 1:3, 4) మనం తన ఇష్టాన్ని నెరవేర్చడానికి కావాల్సిన తెలివిని, శక్తిని యెహోవా మనలో ఎవ్వరికైనా ఇవ్వగలడు. కొంతమంది విద్వాంసుల ప్రకారం, ఇదంతా యెహోవా పేరుకున్న అర్థంలో భాగమే!

2. (ఎ) దేవుడు తమను ఉపయోగించుకుంటాడో లేదోనని కొంతమంది ఎందుకు సందేహపడతారు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 యెహోవా తన సేవలో మనల్ని ఉపయోగించుకోవాలని అందరం కోరుకుంటాం. కానీ కొంతమంది, దేవుడు తమను ఉపయోగించుకుంటాడో లేదోనని సందేహపడతారు. ఎందుకు? ఎందుకంటే తమ వయసు, పరిస్థితులు, లేదా సామర్థ్యాల్ని బట్టి ఎక్కువ సేవ చేయలేమని వాళ్లనుకుంటారు. మరోవైపు ఇంకొంతమంది, తాము ఇప్పటికే చేస్తున్న సేవను బట్టి తృప్తిపడుతూ ఇంకా ఎక్కువ సేవ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. అయితే ఈ ఆర్టికల్‌లో, మనం తన ఇష్టాన్ని చేయడానికి కావాల్సినవాటిని యెహోవా ఎలా ఇస్తాడో చర్చించుకుంటాం. ఆ తర్వాత తన ఇష్టాన్ని చేయాలనే కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని యెహోవా బైబిల్లోని కొంతమంది స్త్రీపురుషులకు ఎలా ఇచ్చాడో పరిశీలిస్తాం. చివరిగా, యెహోవా మనల్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలో కూడా పరిశీలిస్తాం.

మనకు కావాల్సినవాటిని యెహోవా ఎలా ఇస్తాడు?

3. ఫిలిప్పీయులు 2:13 ప్రకారం, తన ఇష్టాన్ని చేయాలనే కోరికను యెహోవా మనలో ఎలా కలిగిస్తాడు?

3 ఫిలిప్పీయులు 2:13 చదవండి. * తన ఇష్టాన్ని చేయాలనే కోరికను యెహోవా మనలో కలిగిస్తాడు. ఎలా? బహుశా సంఘంలో ఏదైనా సహాయం అవసరమని మనకు తెలిసినప్పుడు, లేదా మన సంఘ క్షేత్రంలో కాకుండా వేరేచోట సహాయం అవసరమని బ్రాంచి కార్యాలయం పంపిన ఉత్తరం పెద్దలు చదివినప్పుడు, ‘ఈ విషయంలో నేనెలా సహాయం చేయగలను?’ అని మనకు అనిపించవచ్చు. అంతేకాదు మనకు ఏదైనా కష్టమైన నియామకం ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా చేయగలనా అని; లేదా బైబిల్లో కొన్ని వచనాలు చదివాక, ‘ఈ బైబిలు వృత్తాంతాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఎలా ఉపయోగించాలి’ అని మనకు అనిపించవచ్చు. నిజానికి, యెహోవా ఏ పనినీ మనతో బలవంతంగా చేయించడు. కానీ ఏదైనా విషయం గురించి మనం ఏం చేయగలమని ఆలోచిస్తుంటే, దాని ప్రకారం చేయాలనే కోరికను యెహోవా మనలో కలిగించగలడు.

4. యెహోవా మనకు కావాల్సిన శక్తిని ఎలా ఇస్తాడు?

4 తన ఇష్టాన్ని చేయడానికి కావాల్సిన శక్తిని కూడా యెహోవా మనకిస్తాడు. (యెష. 40:29) మనకున్న సామర్థ్యాల్ని మెరుగుపర్చుకోవడానికి ఆయన తన పవిత్రశక్తిని ఇస్తాడు. (నిర్గ. 35:30-35) కొన్ని పనులు ఎలా చేయాలో యెహోవా తన సంస్థ ద్వారా మనకు నేర్పిస్తాడు. ఒకవేళ ఏదైనా నియామకాన్ని ఎలా చేయాలో మీకు అర్థంకాకపోతే, సహాయం అడగండి. అలాగే, ఉదారతగల మన పరలోక తండ్రి ఇచ్చే “అసాధారణ శక్తి” కోసం అడగడానికి వెనకాడకండి. (2 కొరిం. 4:7; లూకా 11:13) యెహోవా ఎంతోమంది స్త్రీపురుషులకు తన ఇష్టాన్ని చేయాలనే కోరికను, దాన్ని చేయడానికి కావాల్సిన శక్తిని ఇచ్చాడు. ఆ వృత్తాంతాలన్నీ బైబిల్లో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తున్నప్పుడు, మిమ్మల్ని కూడా యెహోవా ఏయే విధాలుగా ఉపయోగించుకోగలడో ఆలోచించండి.

బైబిల్లోని పురుషులు ఏం అయ్యేలా యెహోవా చేశాడు?

5. యెహోవా మోషేను ఎలా, ఎప్పుడు ఉపయోగించుకున్నాడనే దాన్నుండి మనమేం నేర్చుకోవచ్చు?

5 మోషే ఇశ్రాయేలీయులకు ఒక విమోచకునిగా అయ్యేలా యెహోవా చేశాడు. కానీ ఆయన మోషేని ఎప్పుడు ఉపయోగించుకున్నాడు? “ఐగుప్తు దేశస్థులకు సంబంధించిన అన్ని విద్యల్ని” నేర్చుకుని ఏ నియామకాన్నైనా చేయగలనని మోషే అనుకున్నప్పుడా? (అపొ. 7:22-25) కాదు. మోషేను ఒక వినయస్థునిగా, సాత్వికునిగా తీర్చిదిద్దిన తర్వాతే యెహోవా ఉపయోగించుకున్నాడు. (అపొ. 7:30, 34-36) ఐగుప్తులో అత్యంత శక్తిమంతుడైన ఫరో ముందు నిలబడి మాట్లాడేంత ధైర్యాన్ని యెహోవా మోషేకు ఇచ్చాడు. (నిర్గ. 9:13-19) యెహోవా మోషేను ఎలా, ఎప్పుడు ఉపయోగించుకున్నాడనే దాన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? దైవిక లక్షణాల్ని చూపించేవాళ్లను, శక్తి కోసం తన మీద ఆధారపడేవాళ్లను మాత్రమే యెహోవా ఉపయోగించుకుంటాడు.—ఫిలి. 4:13.

6. రాజైన దావీదుకు సహాయం చేయడానికి యెహోవా బర్జిల్లయిని ఉపయోగించుకోవడం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

6 వందల సంవత్సరాల తర్వాత, రాజైన దావీదుకు సహాయం చేసేలా యెహోవా బర్జిల్లయిని ఉపయోగించుకున్నాడు. దావీదు తన కొడుకైన అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు ఆయన, ఆయన ప్రజలు ‘అలసిపోయి ఆకలితో, దాహంతో’ ఉన్నారు. అప్పుడు వృద్ధుడైన బర్జిల్లయి అలాగే ఇంకొంతమంది తమ ప్రాణాలకు తెగించి, దావీదుకు ఆయన సేవకులకు ఆహారాన్ని ఇచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న తనను యెహోవా ఇక ఉపయోగించుకోడని బర్జిల్లయి అనుకోలేదు. బదులుగా, అవసరంలో ఉన్న దేవుని సేవకులకు సహాయం చేయడానికి తన దగ్గరున్నవాటిని ఉదారంగా ఇచ్చాడు. (2 సమూ. 17:27-29) దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనం ఏ వయసులో ఉన్నా, మన దేశంలో లేదా వేరే దేశంలో ఉండే సహోదరసహోదరీల కనీస అవసరాల్ని తీర్చడానికి యెహోవా మనల్ని ఉపయోగించుకోగలడు. (సామె. 3:27, 28; 19:17) బహుశా మనం స్వయంగా వెళ్లి సహాయం చేయలేకపోయినా, ప్రపంచవ్యాప్త పనికోసం విరాళాలు ఇవ్వడం ద్వారా మన సహోదరసహోదరీలకు సహాయం చేయవచ్చు.—2 కొరిం. 8:14, 15; 9:11.

7. సుమెయోను అనే నమ్మకమైన వృద్ధుణ్ణి యెహోవా ఎలా ఉపయోగించుకున్నాడు? అది మనకెలా ప్రోత్సాహకరంగా ఉంది?

7 యెరూషలేములో ఉండే సుమెయోను అనే నమ్మకమైన వృద్ధుడు, మెస్సీయను చూడకుండా చనిపోడని యెహోవా మాటిచ్చాడు. ఆ మాట సుమెయోను విశ్వాసాన్ని ఎంతో బలపర్చివుంటుంది, ఎందుకంటే ఆయన మెస్సీయ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాడు. యెహోవా ఆయన విశ్వాసానికి, సహనానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఒకరోజు, ఆయన “పవిత్రశక్తి నిర్దేశంతో” ఆలయానికి వెళ్లాడు. అక్కడ పసివాడైన యేసును చూశాడు. అంతేకాదు, భవిష్యత్తులో క్రీస్తు కాబోయే ఆ పసివాడి గురించి సుమెయోను ఒక ప్రవచనం చెప్పేలా యెహోవా ఆయన్ని ఉపయోగించుకున్నాడు. (లూకా 2:25-35) యేసు భూమ్మీద పరిచర్య మొదలుపెట్టక ముందే సుమెయోను చనిపోయి ఉంటాడు. అయినప్పటికీ, తనకు దొరికిన అవకాశాన్ని బట్టి ఆయన సంతోషించాడు! ఆయన భవిష్యత్తులో కూడా ఎన్నో దీవెనలు పొందుతాడు. కొత్తలోకంలో, యేసు పరిపాలన కింద భూమ్మీదున్న ప్రతీ కుటుంబం అనుభవించే దీవెనల్ని సుమెయోను చూస్తాడు. (ఆది. 22:18) మనం కూడా, యెహోవా మనల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నా సంతోషంగా ఉండవచ్చు.

8. యెహోవా బర్నబాను ఉపయోగించుకున్నట్టే మనల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు?

8 యెహోవా తనను ఉపయోగించుకునేలా మొదటి శతాబ్దంలో ఉదారతగల ఒకవ్యక్తి ఇష్టంగా ముందుకొచ్చాడు. ఆయనే యోసేపు. (అపొ. 4:36, 37) ఆయన ఇతరుల్ని చక్కగా ఓదార్చేవాడు, బహుశా అందుకే అపొస్తలులు ఆయన్ని బర్నబా అని పిలిచారు. బర్నబా అంటే “ఓదార్పు పుత్రుడు” అని అర్థం. ఉదాహరణకు, సౌలు ఒకప్పుడు సంఘాల్ని హింసించాడు కాబట్టి క్రైస్తవునిగా మారిన తర్వాత కూడా, చాలామంది సహోదరులు ఆయనతో మాట్లాడడానికి భయపడ్డారు. కానీ బర్నబా సౌలుకు ఓదార్పునిచ్చి, సహాయం చేశాడు. సౌలు దానికి ఎంతో కృతజ్ఞత చూపించివుంటాడు. (అపొ. 9:21, 26-28) ఆ తర్వాత, యెరూషలేముకు చాలా దూరంలో ఉన్న సిరియాలోని అంతియొకయలో సహోదరులకు ప్రోత్సాహం అవసరమని యెరూషలేము పెద్దలు గుర్తించారు. మరి దానికోసం వాళ్లు ఎవరిని పంపించారు? బర్నబాను! వాళ్లు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే బర్నబా, ‘స్థిరమైన హృదయంతో ప్రభువుకు విశ్వసనీయంగా ఉండమని వాళ్లందర్నీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు’ అని బైబిలు చెప్తుంది. (అపొ. 11:22-24) నేడు, తోటి సహోదరసహోదరీలకు కావాల్సిన ఓదార్పును ఇవ్వడానికి యెహోవా మనల్ని కూడా ఉపయోగించుకోగలడు. ఉదాహరణకు, తమ ప్రియమైనవాళ్లను మరణంలో కోల్పోయినవాళ్లకు ఓదార్పు ఇవ్వడానికి ఆయన మనల్ని ఉపయోగించుకోవచ్చు. అనారోగ్యంతో లేదా కృంగుదలతో బాధపడేవాళ్లను కలిసేలా లేదా ఫోన్‌ చేసి దయగా మాట్లాడేలా ఆయన మనల్ని కదిలించవచ్చు. యెహోవా బర్నబాను ఉపయోగించుకున్నట్టే మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి అనుమతిస్తారా?—1 థెస్స. 5:14.

9. వాసీలి మంచి కాపరి అయ్యేలా యెహోవా సహాయం చేసిన విధానం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

9 వాసీలి అనే సహోదరుడు సంఘంలో ఒక మంచి కాపరి అయ్యేలా యెహోవా సహాయం చేశాడు. వాసీలి 26 ఏళ్ల వయసులో సంఘపెద్ద అయినప్పుడు సహోదరసహోదరీలకు, ముఖ్యంగా కష్టాలు ఎదుర్కొంటున్న వాళ్లకు ఆధ్యాత్మికంగా సహాయం చేసేంత అనుభవం తనకు లేదని అనుకున్నాడు. కానీ, అనుభవంగల సంఘపెద్దల నుండి అలాగే రాజ్య పరిచర్య పాఠశాల నుండి చక్కని శిక్షణ పొందాడు. వాసీలి కూడా గట్టి కృషి చేశాడు. ఉదాహరణకు, ఆయన చిన్నచిన్న లక్ష్యాలు పెట్టుకున్నాడు. వాటిలో ఒక్కోదాన్ని చేరుకునే కొద్దీ ఆయనకున్న భయం తగ్గుతూ వచ్చింది. ఆయనిలా చెప్తున్నాడు, “ఒకప్పుడు నేను దేనిగురించి భయపడ్డానో ఇప్పుడు అదే నాకు సంతోషాన్నిస్తుంది. సంఘంలో ఒక సహోదరునికి లేదా సహోదరికి ఓదార్పునిచ్చే సరైన లేఖనం కనుగొనేలా యెహోవా సహాయం చేసినప్పుడు, నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది.” సహోదరులారా, మీరు వాసీలిని అనుకరిస్తూ యెహోవా మిమ్మల్ని ఉపయోగించుకునేలా అనుమతించినప్పుడు, సంఘంలో మరిన్ని బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యం ఆయన మీకు ఇవ్వగలడు.

బైబిల్లోని స్త్రీలు ఏం అయ్యేలా యెహోవా చేశాడు?

10. అబీగయీలు ఏం చేసింది? ఆమె నుండి మనమేం నేర్చుకోవచ్చు?

10 రాజైన సౌలు దావీదును, ఆయన మనుషుల్ని తరుముతున్నప్పుడు వాళ్లకు సహాయం అవసరమైంది. దావీదు మనుషులు, ధనవంతుడైన నాబాలు అనే ఇశ్రాయేలీయుణ్ణి కొంచెం ఆహారం ఇవ్వమని అడిగారు. వాళ్లు అరణ్యంలో నాబాలు గొర్రెల్ని కాపాడుతున్నారు కాబట్టి అలా అడిగే హక్కు తమకుందని అనుకున్నారు. కానీ స్వార్థపరుడైన నాబాలు వాళ్లకు ఏమీ ఇవ్వలేదు. దాంతో దావీదుకు చాలా కోపం వచ్చింది, నాబాలును అతని ఇంట్లో ఉన్న పురుషులందర్నీ చంపేయాలని అనుకున్నాడు. (1 సమూ. 25:3-13, 22) అయితే, నాబాలు భార్యయైన అబీగయీలు అందం, వివేచన ఉన్న స్త్రీ. ఆమె చాలా ధైర్యంగా దావీదు ముందు మోకాళ్లూని నాబాలును, అతని మనుషుల్ని చంపి పగతీర్చుకోవద్దనీ, తన మీదకు రక్తాపరాధం తెచ్చుకోవద్దనీ బతిమాలింది. విషయాన్ని యెహోవాకు వదిలేయమని ఆమె దావీదుకు నేర్పుగా చెప్పింది. అబీగయీలు వినయంతో చెప్పిన మాటలు, వివేచనతో చేసిన పనులు దావీదు మనసును తాకాయి. ఆమెను యెహోవాయే పంపాడని దావీదు గుర్తించాడు. (1 సమూ. 25:23-28, 32-34) యెహోవా తనను ఉపయోగించుకోవడానికి కావాల్సిన లక్షణాల్ని అబీగయీలు వృద్ధి చేసుకుంది. అదేవిధంగా క్రైస్తవ సహోదరీలు నేర్పును, వివేచనను వృద్ధి చేసుకున్నప్పుడు వాళ్లు తమ కుటుంబాల్ని, సంఘాల్ని బలపర్చేలా యెహోవా వాళ్లను ఉపయోగించుకోగలడు.—సామె. 24:3; తీతు 2:3-5.

11. షల్లూము కూతుళ్లు ఏం చేశారు? నేడు వాళ్లను ఎవరు అనుకరిస్తున్నారు?

11 వందల సంవత్సరాల తర్వాత, యెరూషలేము గోడల్ని తిరిగి కట్టే పనిలో యెహోవా షల్లూము కూతుళ్లను కూడా ఉపయోగించుకున్నాడు. (నెహె. 2:20; 3:12) షల్లూము యెరూషలేములో ఒక అధిపతి అయినప్పటికీ ఆయన కూతుళ్లు కష్టమైన, ప్రమాదకరమైన పనిని చేయడానికి ముందుకొచ్చారు. (నెహె. 4:15-18) కానీ తెకోవీయుల్లో ప్రముఖులైన పురుషులు ‘పని చేయడానికి ఒప్పుకోలేదు.’ వాళ్లకూ, షల్లూము కూతుళ్లకు ఎంత తేడా ఉందో కదా! (నెహె. 3:5) యెరూషలేము గోడల నిర్మాణం కేవలం 52 రోజుల్లో పూర్తి అవ్వడం చూసి షల్లూము కూతుళ్లు ఎంత సంతోషించివుంటారో ఊహించండి! (నెహె. 6:15) మనకాలంలో, యెహోవాకు సమర్పించే భవనాలను నిర్మించడానికి, అవి మంచిస్థితిలో ఉండేలా చూసుకోవడానికి సహోదరీలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, సంతోషంగా పనిచేస్తున్నారు. యెహోవాకు చేసే పవిత్రసేవలో ఆ పనులు కూడా ఒక భాగం. ఈ పనులన్నీ చక్కగా జరగాలంటే నైపుణ్యం, ఉత్సాహం, విశ్వసనీయత ఉన్న సహోదరీలు కావాలి.

12. యెహోవా తబితాను ఉపయోగించుకున్నట్టే మనల్ని కూడా ఎలా ఉపయోగించుకోగలడు?

12 తబితా ‘మంచి పనులు చేసేలా, పేదవాళ్లకు’ ముఖ్యంగా విధవరాళ్లకు ఎంతో సహాయం చేసేలా యెహోవా కదిలించాడు. (అపొ. 9:36) ఆమె చనిపోయినప్పుడు, ఆమెకున్న గొప్ప ఉదారత, దయ వంటి లక్షణాల్ని గుర్తుచేసుకుని చాలామంది ఏడ్చారు. కానీ అపొస్తలుడైన పేతురు ఆమెను మళ్లీ బ్రతికించినప్పుడు వాళ్లందరూ చాలా సంతోషించారు. (అపొ. 9:39-41) తబితా నుండి మనమేం నేర్చుకోవచ్చు? యౌవనులమైనా-వృద్ధులమైనా, పురుషులమైనా-స్త్రీలమైనా మనందరం మన సహోదరసహోదరీలకు వీలైన సహాయం చేయవచ్చు.—హెబ్రీ. 13:16.

13. బిడియస్థురాలైన రూత్‌ని యెహోవా ఎలా ఉపయోగించుకున్నాడు? ఆమె ఏం చెప్పింది?

13 రూత్‌ అనే బిడియస్థురాలైన సహోదరికి మిషనరీ అవ్వాలనే కోరిక ఉండేది. ఆమె చిన్నప్పుడు, ఇంటింటికి పరిగెత్తుకుంటూ కరపత్రాల్ని పంచిపెట్టేది. “ఈ పని నాకు చాలా ఇష్టం” అని ఆమె అంది. కానీ గుమ్మం దగ్గర నిలబడి, ఇంటివ్యక్తితో దేవుని రాజ్యం గురించి మాట్లాడడం ఆమెకు చాలా కష్టంగా ఉండేది. ఆమె బిడియస్థురాలైనప్పటికీ 18 ఏళ్ల వయసులో పయినీరు సేవ మొదలుపెట్టింది. 1946 లో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కి హాజరైంది, ఆ తర్వాత హవాయిలో అలాగే జపాన్‌లో సేవ చేసింది. ఆ ప్రాంతాల్లో మంచివార్త వ్యాప్తిచేయడానికి యెహోవా ఆమెను ఎంతో ఉపయోగించుకున్నాడు. దాదాపు 80 ఏళ్లు పరిచర్య చేసిన తర్వాత రూత్‌ ఇలా చెప్పింది, “యెహోవా నన్ను ఎంతో బలపర్చాడు. నా బిడియాన్ని అధిగమించడానికి సహాయం చేశాడు. తన మీద నమ్మకం ఉంచే ఎవ్వరినైనా యెహోవా తప్పకుండా ఉపయోగించుకుంటాడని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.”

యెహోవా మిమ్మల్ని ఉపయోగించుకునేలా అనుమతించండి

14. కొలొస్సయులు 1:29 ప్రకారం, యెహోవా మనల్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి?

14 చరిత్రంతటిలో యెహోవా తన సేవకుల్ని ఎన్నో విధాలుగా ఉపయోగించుకున్నాడు. అయితే, మీరు ఏం అయ్యేలా యెహోవా చేయగలడు? చాలావరకు అది మీరు చేసే కృషిని బట్టి ఉంటుంది. (కొలొస్సయులు 1:29 చదవండి.) మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకుంటే, మీరు ఒక ఉత్సాహంగల ప్రచారకునిగా, మంచి బోధకునిగా, ఓదార్పునిచ్చేవానిగా, నైపుణ్యంగల పనివానిగా, మద్దతునిచ్చే స్నేహితునిగా, లేదా తన ఇష్టాన్ని నెరవేర్చడానికి మీరు ఇంకేదైనా అయ్యేలా యెహోవా చేయగలడు.

15. మొదటి తిమోతి 4:12, 15 ప్రకారం, యౌవన సహోదరులు దేనిగురించి యెహోవాను వేడుకోవాలి?

15 మరి యౌవన సహోదరులారా, మీ సంగతేంటి? సంఘ పరిచారకులుగా సేవ చేయడానికి బలవంతులైన పురుషుల అవసరం చాలా ఉంది. చాలా సంఘాల్లో పెద్దలు ఎక్కువమంది ఉన్నారు గానీ సంఘ పరిచారకులు తక్కువగా ఉన్నారు. కాబట్టి యౌవన సహోదరుల్లారా, మీలో కొంతమంది సంఘంలో మరిన్ని బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాగలరా? కొన్నిసార్లు కొంతమంది సహోదరులు, “నేను ఒక పబ్లిషర్‌గా సేవచేస్తే చాల్లే” అని అంటుంటారు. ఒకవేళ మీకూ అలా అనిపిస్తే, సంఘ పరిచారకుడు అవ్వాలనే కోరిక మీలో కలిగించమని, తన సేవ చేయడానికి కావాల్సిన శక్తిని మీకు ఇవ్వమని యెహోవాను వేడుకోండి. (ప్రసం. 12:1, 2) మాకు మీ సహాయం అవసరం!—1 తిమోతి 4:12, 15 చదవండి.

16. యెహోవాను దేనికోసం అడగాలి? ఎందుకు?

16 తన ఇష్టాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని ఎలా కావాలనుకుంటే అలా అయ్యేలా యెహోవా చేయగలడు. కాబట్టి తన పని చేయాలనే కోరిక మీలో కలిగించమని ఆయన్ని వేడుకోండి. తర్వాత మీకు కావాల్సిన శక్తి కోసం అడగండి. మీరు యౌవనులైనా-వృద్ధులైనా మీ సమయాన్ని, శక్తిని, వనరులను ఉపయోగించి యెహోవాను ఇప్పుడే ఘనపర్చండి. (ప్రసం. 9:10) మీకు యెహోవా సేవ ఎక్కువ చేసే మంచి అవకాశం ఏదైనా వస్తే, దాన్ని చేయలేనని వెంటనే తిరస్కరించకండి. మన ప్రేమగల తండ్రికి చెందాల్సిన ఘనతను ఆయనకు చెందేలా చేయడానికి మనకు దొరికే ఏ చిన్న వంతైనా గొప్ప అవకాశమే!

పాట 127 నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలి

^ పేరా 5 మీరు యెహోవా సేవ ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నారా? ఆయన మిమ్మల్ని ఉపయోగించుకుంటాడో లేదో అని ఆలోచిస్తున్నారా? లేదా మీరు ఇప్పుడు చేస్తున్న సేవతో తృప్తి పడుతున్నారా? యెహోవా ఇష్టాన్ని చేయాలనే కోరికను, దాని ప్రకారం చేయడానికి కావాల్సిన శక్తిని ఆయన మీకు ఏయే విధాలుగా ఇస్తాడో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

^ పేరా 3 పౌలు తన ఉత్తరాన్ని మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు రాసినప్పటికీ, అందులోని మాటలు యెహోవా సేవకులందరికీ వర్తిస్తాయి.