కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 43

యెహోవాను మాత్రమే ఆరాధించండి

యెహోవాను మాత్రమే ఆరాధించండి

“నీ దేవుడైన యెహోవాను నువ్వు ఆరాధించాలి, ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి.”—మత్త. 4:10.

పాట 51 దేవునికి సమర్పించుకున్నాం!

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మన ఆరాధనకు యెహోవా మాత్రమే ఎందుకు అర్హుడు?

యెహోవా మన సృష్టికర్త, జీవదాత కాబట్టి ఆయన మాత్రమే మన ఆరాధనకు అర్హుడు. (ప్రక. 4:11) మనం యెహోవాను ప్రేమిస్తాం, గౌరవిస్తాం అయినప్పటికీ మన జీవితంలో వేరే విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల ఆయనకు చెందాల్సిన ఆరాధనను మనం ఆయనకు ఇవ్వలేకపోవచ్చు. అది ఎలా జరిగే అవకాశం ఉందో మనం అర్థంచేసుకోవాలి. ముందుగా, యెహోవాను మాత్రమే ఆరాధించడమంటే ఏంటో చర్చించుకుందాం.

2. మత్తయి 4:10 ప్రకారం, మనం యెహోవాను మాత్రమే ఆరాధించినప్పుడు ఏం చేయం?

2 బైబిలు ప్రకారం, యెహోవా మీద ప్రగాఢమైన ప్రేమ కలిగివుండడానికి, ఆయన్ని మాత్రమే ఆరాధించడానికి దగ్గరి సంబంధం ఉంది. మనం యెహోవాను మాత్రమే ఆరాధించినప్పుడు, మన హృదయంలో యెహోవాకున్న స్థానాన్ని వేరే దేనికీ లేదా ఎవ్వరికీ ఇవ్వం.—మత్తయి 4:10 చదవండి.

3. యెహోవా మీద మనకున్న ప్రేమ గుడ్డిది కాదని ఎందుకు చెప్పవచ్చు?

3 యెహోవా మీద మనకున్న ప్రేమ గుడ్డిది కాదు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే ఆయన గురించిన వాస్తవాల్ని తెలుసుకున్న తర్వాతే మనం ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టాం. ఆయనకున్న అద్భుతమైన లక్షణాలు మనకు నచ్చాయి. ఆయన వేటిని ప్రేమిస్తాడో, వేటిని ద్వేషిస్తాడో తెలుసుకుని, మనం కూడా ఆయనలాగే ఆలోచిస్తాం. మనుషుల విషయంలో ఆయన సంకల్పం ఏంటో అర్థంచేసుకుని, ఆయన ప్రమాణాల ప్రకారం జీవిస్తాం. అంతేకాదు ఆయనకు స్నేహితులుగా ఉండే అవకాశాన్ని గొప్ప గౌరవంగా భావిస్తాం. (కీర్త. 25:14) సృష్టికర్త గురించి మనం నేర్చుకునే ప్రతీది మనల్ని ఆయనకు మరింత దగ్గర చేస్తుంది.—యాకో. 4:8.

4. (ఎ) యెహోవాను మాత్రమే కాకుండా, వేరే వాటిని కూడా ప్రేమించేలా చేయడానికి సాతాను ఏం చేస్తాడు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏం పరిశీలిస్తాం?

4 ఈ లోకం సాతాను గుప్పిట్లో ఉంది. అతను ఈ లోకాన్ని ఉపయోగించుకుని మనం మన సహజ కోరికలకు, బలహీనతలకు లొంగిపోయేలా ప్రలోభపెడతాడు. (ఎఫె. 2:1-3; 1 యోహా. 5:19) మనం యెహోవాను మాత్రమే కాకుండా, వేరే వాటిని కూడా ప్రేమించేలా చేయడమే సాతాను లక్ష్యం. దానికోసం అతను ఉపయోగించే రెండు మార్గాల్ని మనం ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. మొదటిది, మనం డబ్బును ప్రేమించేలా చేయడం. రెండోది, మనం చెడు వినోదాన్ని ఎంపిక చేసుకునేలా చేయడం.

డబ్బును ప్రేమించకుండా జాగ్రత్తపడండి

5. మనం డబ్బు మీద ప్రేమ పెంచుకోకుండా ఎందుకు జాగ్రత్తపడాలి?

5 మనందరం తినడానికి ఆహారం, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు కావాలని కోరుకుంటాం. కానీ డబ్బు మీద ప్రేమ పెంచుకోకుండా మనం జాగ్రత్తపడాలి. నేడు ఈ లోకంలో చాలామంది “డబ్బును,” డబ్బుతో కొనగల వస్తువులనే ప్రేమిస్తున్నారు. (2 తిమో. 3:2) తన అనుచరులు కూడా వాటిమీద ప్రేమ పెంచుకునే అవకాశం ఉందని యేసుకు తెలుసు. అందుకే ఆయనిలా చెప్పాడు, “ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు, లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానిని చిన్నచూపు చూస్తాడు. మీరు ఒకే సమయంలో దేవునికీ డబ్బుకూ దాసులుగా ఉండలేరు.” (మత్త. 6:24) ఒకవ్యక్తి యెహోవాను ఆరాధిస్తూ, మరోవైపు డబ్బు సంపాదించడానికి ఎక్కువ సమయాన్ని, శక్తిని ఉపయోగిస్తే అతను ఇద్దరు యజమానులకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టే. అప్పుడు అతను యెహోవాను మాత్రమే ఆరాధించినట్టు అవ్వదు.

లవొదికయలో కొంతమంది తమ గురించి తాము ఇలా అనుకున్నారు . . . కానీ వాళ్లు యెహోవా, యేసు దృష్టిలో ఇలా ఉన్నారు (6వ పేరా చూడండి)

6. లవొదికయ సంఘానికి యేసు చెప్పిన మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

6 సా.శ. 100వ సంవత్సరానికి ముందు, లవొదికయ సంఘంలోనివాళ్లు “నేను ధనవంతుణ్ణి, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాను, నాకు ఇంకేమీ అవసరం లేదు” అని గొప్పలు చెప్పుకున్నారు. కానీ యెహోవా, యేసు దృష్టిలో వాళ్లు ‘దుర్భరమైన, దయనీయమైన స్థితిలో ఉన్నారు; పేదవాళ్లుగా, గుడ్డివాళ్లుగా, దిగంబరులుగా ఉన్నారు.’ అయితే యేసు వాళ్లను సరిదిద్దాడు. వాళ్లు ధనవంతులుగా ఉన్నందుకు కాదుగానీ వాళ్లు యెహోవాతో ఉన్న స్నేహాన్ని పాడు చేసుకునేంతగా డబ్బును ప్రేమించారు కాబట్టే ఆయనలా సరిదిద్దాడు. (ప్రక. 3:14-17) ఒకవేళ ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక మన హృదయంలో మొదలౌతోందని గుర్తిస్తే, వెంటనే మన ఆలోచనను సరిచేసుకోవాలి. (1 తిమో. 6:7, 8) అలా చేయకపోతే, మనం వేరే వాటిని కూడా ప్రేమించడం మొదలుపెడతాం. అప్పుడు మన ఆరాధనను యెహోవా అంగీకరించడు. ఎందుకంటే, మనం “నిండు హృదయంతో” తనను ప్రేమించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (మార్కు 12:30) ఇంతకీ మనం ఎలా డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే అవకాశం ఉంది?

7-9. డేవిడ్‌ అనే సంఘపెద్ద అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

7 అమెరికాలో ఉంటున్న డేవిడ్‌ అనే సంఘపెద్ద ఉదాహరణ పరిశీలించండి. ఆయన తన ఉద్యోగంలో చాలా కష్టపడి పనిచేసేవాడు. ఆయనకు ప్రమోషన్‌తో పాటు, జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే “అవన్నీ, యెహోవా ఆశీర్వాదానికి రుజువని ఆ సమయంలో నేను అనుకున్నాను” అని డేవిడ్‌ చెప్పాడు. కానీ అది నిజంగా యెహోవా ఆశీర్వాదమేనా?

8 రోజులు గడిచేకొద్దీ, తన ఉద్యోగంవల్ల యెహోవా దేవునితో ఉన్న స్నేహం దెబ్బతింటోందని డేవిడ్‌ గుర్తించాడు. ఆయన ఇలా చెప్తున్నాడు, “నేను మీటింగ్స్‌లో, ప్రీచింగ్‌లో నా ఉద్యోగ సమస్యల గురించే ఆలోచించేవాణ్ణి. నా సంపాదనతోపాటు ఒత్తిడి, వివాహ జీవితంలో సమస్యలు కూడా పెరిగిపోయాయి.”

9 డేవిడ్‌ దేనికి మొదటిస్థానం ఇస్తున్నాడో పరిశీలించుకోవాల్సి వచ్చింది. “నా పరిస్థితిని చక్కదిద్దుకోవాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను” అని ఆయన అన్నాడు. ఆయన తక్కువ గంటలు పనిచేసేలా ప్రణాళిక వేసుకొని, దానిగురించి తన యజమానికి చెప్పాడు. ఫలితంగా, డేవిడ్‌ని ఉద్యోగం నుండి తీసేశారు. మరి డేవిడ్‌ ఏం చేశాడు? “ఆ తర్వాతి రోజే నేను ఆగ్జిలరి పయినీరు అప్లికేషన్‌ నింపాను, దాన్ని క్రమంగా చేయాలని నిర్ణయించుకున్నాను” అని ఆయన అన్నాడు. కుటుంబ పోషణ కోసం డేవిడ్‌ తన భార్యతో కలిసి పెద్దపెద్ద బిల్డింగ్‌లలో శుభ్రపర్చే పనిచేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఆయన క్రమ పయినీరు సేవ మొదలుపెట్టాడు, తర్వాత ఆయన భార్య కూడా ఆ సేవ మొదలుపెట్టింది. చాలామంది చిన్నచూపు చూసే పనిని ఈ జంట చేస్తున్నప్పటికీ, తాము ఎలాంటి పని చేస్తున్నామనేది అంత ప్రాముఖ్యం కాదని భావించారు. వాళ్లకు వస్తున్న ఆదాయం అంతకుముందు కన్నా చాలా తక్కువైనప్పటికీ, ప్రతీనెల వాళ్ల ఖర్చులకు అది సరిపోయేది. వాళ్లు యెహోవాకు మొదటిస్థానం ఇవ్వాలని కోరుకున్నారు. అంతేకాదు, దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇచ్చేవాళ్ల బాగోగులను యెహోవా చూసుకుంటాడని వాళ్లు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.—మత్త. 6:31-33.

10. మన హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

10 మన దగ్గర డబ్బు తక్కువున్నా, ఎక్కువున్నా మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఎలా? డబ్బు మీద ప్రేమ పెంచుకోకండి. యెహోవా సేవ కన్నా మీ ఉద్యోగానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వకండి. మీరు ఉద్యోగానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నట్లు ఎలా తెలుస్తుంది? మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు, ‘నేను మీటింగ్స్‌లో లేదా ప్రీచింగ్‌లో ఉన్నప్పుడు నా ఉద్యోగం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా? భవిష్యత్తులో నా ఖర్చులకు సరిపడా డబ్బు ఉంటుందో లేదో అని అదేపనిగా ఆందోళనపడుతున్నానా? డబ్బు, వస్తుసంపదలు నాకూ నా భార్యకు మధ్య సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయా? యెహోవా సేవకు ఎక్కువ సమయం దొరికేలా, ఇతరులు చిన్నచూపు చూసే ఉద్యోగాన్నైనా చేయడానికి నేను ఇష్టపడతానా?’ (1 తిమో. 6:9-12) ఆ ప్రశ్నల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు అలాగే తనను ప్రేమించేవాళ్లకు ఆయన ఈ మాట ఇస్తున్నాడు, “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.” అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, “డబ్బును ప్రేమించకండి.”—హెబ్రీ. 13:5, 6.

వినోదాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి

11. ఒకవ్యక్తి ఎంపిక చేసుకునే వినోదం వల్ల ఏం జరిగే అవకాశం ఉంది?

11 మనం జీవితాన్ని ఆనందించాలని యెహోవా కోరుకుంటున్నాడు. వినోదం మనకు ఆనందాన్ని ఇవ్వగలదు. నిజానికి బైబిలు ఇలా చెప్తుంది, “అన్న పానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు.” (ప్రసం. 2:24) అయితే, లోకంలో ఉన్న వినోదం చాలావరకు మనపై చెడు ప్రభావం చూపించగలదు. అది ప్రజల్ని నైతిక విలువలు కోల్పోయేలా చేస్తుంది. అంతేకాదు బైబిలు ఖండిస్తున్నవాటిని వాళ్లు అంగీకరించేలా, ప్రేమించేలా చేస్తుంది.

మీ వినోదాన్ని ఎవరు తయారు చేస్తున్నారు? (11-14 పేరాలు చూడండి) *

12. మొదటి కొరింథీయులు 10:21, 22 ప్రకారం, మనం వినోదాన్ని ఎందుకు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి?

12 మనం యెహోవాను మాత్రమే ఆరాధించాలని కోరుకుంటాం, కాబట్టి “యెహోవా బల్ల మీదివి తింటూ, చెడ్డదూతల బల్ల మీదివి” తినలేము. (1 కొరింథీయులు 10:21, 22 చదవండి.) ఒకవ్యక్తితో కలిసి భోజనం చేయడం తరచూ స్నేహానికి గుర్తుగా ఉంటుంది. హింసను, మంత్రతంత్రాలను, అనైతికతను లేదా ఇతర శరీర కోరికలను-ఆలోచనలను ప్రోత్సహించే వినోదాన్ని మనం ఎంపిక చేసుకుంటే, దేవుని శత్రువులు తయారుచేసిన ఆహారం తింటున్నట్టే. దానివల్ల, మనకు మనం హాని చేసుకోవడంతోపాటు యెహోవాతో ఉన్న స్నేహాన్ని కూడా పాడుచేసుకుంటాం.

13-14. యాకోబు 1:14, 15 ప్రకారం మనం వినోదాన్ని ఎందుకు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి? ఉదాహరణ చెప్పండి.

13 వినోదాన్ని ఆహారంతో ఎలా పోల్చవచ్చు? మనం ఏదైనా తింటున్నప్పుడు దాన్ని నోట్లో పెట్టుకోవడమే మన చేతుల్లో ఉంటుంది. కానీ దాన్ని ఒక్కసారి మింగేశాక, ఆ ఆహారం మన శరీరంపై చూపే ప్రభావం మన చేతుల్లో ఉండదు. మంచి ఆహారం మనకు ఆరోగ్యాన్నిస్తుంది, కానీ చెడ్డ ఆహారం ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. అయితే, ఆహారం మనపై చూపించే ప్రభావం వెంటనే తెలియకపోవచ్చు కానీ, కొంతకాలానికి స్పష్టంగా తెలుస్తుంది.

14 అదేవిధంగా, మనం వినోదాన్ని ఎంపిక చేసుకుంటున్నప్పుడు, దేన్ని మన మనసులోకి తీసుకుంటున్నామో మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. కానీ ఆ వినోదం మన ఆలోచనలపై, భావాలపై చూపించే ప్రభావం మన చేతుల్లో ఉండదు. మంచి వినోదం మనకు సేదదీర్పునిస్తుంది, చెడు వినోదం హాని చేస్తుంది. (యాకోబు 1:14, 15 చదవండి.) చెడు వినోదం మనపై చూపించే ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు, కానీ కొంతకాలానికి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే బైబిలు మనల్ని ఇలా హెచ్చరిస్తుంది, “మోసపోకండి, దేవుణ్ణి వెక్కిరించలేం. ఎందుకంటే మనిషి తాను విత్తిన పంటనే కోస్తాడు; శారీరక కోరికల ప్రకారం విత్తే వ్యక్తి తన శరీరం నుండి నాశనం అనే పంట కోస్తాడు.” (గల. 6:7, 8) యెహోవా ద్వేషించేవాటిని ప్రోత్సహించే ఏ వినోదానికైనా మనం దూరంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా!—కీర్త. 97:10.

15. యెహోవా మనకు ఏ బహుమానాన్ని ఇచ్చాడు?

15 చాలామంది సహోదరసహోదరీలు JW బ్రాడ్‌కాస్టింగ్‌ అనే మన ఇంటర్నెట్‌ టీవీ స్టేషన్‌ను చూస్తూ చాలా ఆనందిస్తారు. మెరలిన్‌ అనే సహోదరి ఇలా చెప్పింది, “JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూడడం వల్ల నా సంతోషం రెట్టింపు అయ్యింది. దానిలో వచ్చేవన్నీ మంచివే కాబట్టి ప్రతీది నేను చూడవచ్చు. నాకు ఒంటరిగా, నిరుత్సాహంగా అనిపించినప్పుడు ప్రోత్సాహానిచ్చే ఒక ప్రసంగాన్ని లేదా ఉదయకాల ఆరాధనను చూస్తాను. అప్పుడు యెహోవాకు, ఆయన సంస్థకు మరింత దగ్గరైనట్టు అనిపిస్తుంది. JW బ్రాడ్‌కాస్టింగ్‌ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.” యెహోవా ఇచ్చే బహుమానం నుండి మీరు ప్రయోజనం పొందుతున్నారా? JW బ్రాడ్‌కాస్టింగ్‌లో ప్రతీనెల వచ్చే కొత్త కార్యక్రమాలతో పాటు, “నచ్చిన వీడియో చూడండి” అనే విభాగంలో చాలా ఆడియో-వీడియో కార్యక్రమాలు, ప్రోత్సాహకరమైన పాటలు ఉంటాయి.

16-17. మనం వినోదం కోసం వెచ్చించే సమయం విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? దానికోసం ఏం చేయవచ్చు?

16 మనం వినోదాన్ని ఎంపిక చేసుకుంటున్నామనే విషయంలోనే కాదు, దాన్ని ఎంతసేపు చూస్తున్నామనే దానిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే, యెహోవా సేవ కన్నా వినోదానికే ఎక్కువ సమయాన్ని వెచ్చించే ప్రమాదం ఉంది. వినోదానికి పెట్టే సమయాన్ని అదుపు చేసుకోవడం చాలామందికి కష్టంగా ఉంటుంది. 18 ఏళ్ల అబిగైల్‌ అనే సహోదరి ఇలా చెప్తుంది, “రోజంతా బిజీగా ఉంటాను కాబట్టి సాయంత్రం టీవీ చూస్తే నాకు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా లేకపోతే, గంటల తరబడి టీవీ చూసే ప్రమాదం ఉంది.” 21 ఏళ్ల శామ్యుల్‌ ఇలా చెప్తున్నాడు, “నేను ఇంటర్నెట్‌లో వీడియోలు చాలాసేపు చూస్తున్నానని గుర్తించాను. ఒక వీడియో చూద్దామని మొదలుపెడతాను కానీ నాకు తెలియకుండానే మూడు నాలుగు గంటలు గడిచిపోతాయి.”

17 వినోదం కోసం వెచ్చించే సమయాన్ని మీరెలా అదుపు చేసుకోవచ్చు? మొదటిగా, మీరు ఎంత సమయం దానికోసం వెచ్చిస్తున్నారో తెలుసుకోండి. వారంలో ఎంతసేపు వినోదానికి సమయం పెడుతున్నారో రాసుకోవచ్చు. టీవీ, ఇంటర్నెట్‌ చూడడానికి, ఫోన్‌లో గేమ్స్‌ ఆడడానికి ఎన్ని గంటలు వెచ్చిస్తున్నారో క్యాలెండర్‌లో రాసుకోండి. ఒకవేళ వాటికి ఎక్కువ సమయం పెడుతున్నట్టు అనిపిస్తే, ఒక పట్టిక వేసుకోండి. ముందుగా ఎక్కువ ప్రాముఖ్యమైన వాటికి సమయం వెచ్చించి, ఆ తర్వాత వినోదానికి సమయం పెట్టండి. మీరు వేసుకున్న పట్టికను పాటించగలిగేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. అవన్నీ చేస్తే, వ్యక్తిగత బైబిలు అధ్యయనం కోసం, కుటుంబ ఆరాధన కోసం, మీటింగ్స్‌, ప్రీచింగ్‌, స్టడీల కోసం సమయం, శక్తి ఉంటాయి. అలా మీరు యెహోవాకు మొదటిస్థానం ఇస్తారు కాబట్టి వినోదాన్ని ఆనందించవచ్చు.

యెహోవాను మాత్రమే ఆరాధిస్తూ ఉండండి

18-19. మనం యెహోవాను మాత్రమే ఆరాధిస్తున్నామని ఎలా చూపిస్తాం?

18 సాతాను లోకం నాశనమవ్వడం గురించి, కొత్త లోకం రావడం గురించి రాసిన తర్వాత అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు, “ప్రియ సోదరులారా, మీరు వీటికోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి, మీరు చివరికి ఆయన దృష్టిలో మచ్చ గానీ, కళంకం గానీ లేనివాళ్లుగా ఉండాలి; ఆయనతో మంచి సంబంధం ఉన్నవాళ్లుగా ఉండాలి; అందుకోసం చేయగలిగినదంతా చేయండి.” (2 పేతు. 3:14) మనం ఆ సలహాను పాటించి నైతికంగా, ఆధ్యాత్మికంగా శుభ్రంగా ఉంటే, యెహోవాను మాత్రమే ఆరాధిస్తున్నామని చూపిస్తాం.

19 మనం యెహోవాకు కాకుండా వేరేవాటికి మొదటిస్థానం ఇచ్చేలా సాతాను, అతని లోకం మనల్ని ప్రలోభపెడుతూనే ఉంటారు. (లూకా 4:13) కానీ మనం మాత్రం, మన హృదయంలో యెహోవాకున్న స్థానాన్ని వేరే దేనికీ లేదా ఎవ్వరికీ ఇవ్వం. మన ఆరాధనకు యెహోవా మాత్రమే అర్హుడు, కాబట్టి ఆయన్ని మాత్రమే ఆరాధించాలని మనం నిర్ణయించుకున్నాం!

పాట 30 నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు

^ పేరా 5 మన జీవితాన్ని యెహోవా ఆరాధనకే అంకితం చేశాం. కానీ మనం ఆయన్ని మాత్రమే ఆరాధిస్తున్నామా? ఈ ప్రశ్నకు జవాబు, మనం తీసుకునే నిర్ణయాల్ని బట్టి ఉంటుంది. మనం యెహోవాను మాత్రమే ఆరాధిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి మన జీవితంలో రెండు రంగాల్ని పరిశీలిద్దాం.

^ పేరా 53 చిత్రాల వివరణ: అపరిశుభ్రంగా ఉన్న వంటగదిలో తయారుచేసే కలుషితమైన ఆహారాన్ని మనం తినాలనుకోం. అలాంటిది హింస, మంత్రతంత్రాలు లేదా అనైతికతతో కలుషితమైన వినోదాన్ని మనం చూడాలని కోరుకుంటామా?