కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1919లో ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న సహోదరుడు రూథర్‌ఫర్డ్‌

1919—వంద సంవత్సరాల క్రితం

1919—వంద సంవత్సరాల క్రితం

1919 కల్లా గొప్ప యుద్ధం ముగిసింది (తర్వాత దాన్ని మొదటి ప్రపంచ యుద్ధం అని పిలిచారు). అప్పటికే ఆ యుద్ధం నాలుగు ఏళ్లుగా కొనసాగుతోంది. 1918 చివర్లో, దేశాలు యుద్ధం చేయడం ఆపేశాయి. 1919 జనవరి 18న ప్యారిస్‌ పీస్‌ కాన్ఫరెన్స్‌ మొదలైంది. ఆ కాన్ఫరెన్స్‌ వల్లే వర్సైలిస్‌ శాంతి ఒప్పందం ఏర్పడింది. ఆ ఒప్పందం కారణంగా, మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధాన్ని ఆపేశాయి. ఆ ఒప్పందం 1919 జూన్‌ 28న సంతకం చేయబడింది.

అంతేకాదు ఆ ఒప్పందం వల్ల నానాజాతి సమితి అనే ఒక కొత్త సంస్థ స్థాపించబడింది. “అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ శాంతిభద్రతలను నెలకొల్పడమే” ఆ సంస్థ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా చాలా క్రైస్తవమత శాఖలు దానికి మద్దతిచ్చాయి. నానాజాతి సమితి “భూమిపై దేవుని రాజ్య రాజకీయ ప్రతిరూపం” అని అమెరికాలోని ఫెడరల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ చర్చస్‌ ఆఫ్‌ క్రైస్ట్‌ ప్రకటించింది. ఈ కౌన్సిల్‌, తన ప్రతినిధుల్ని ప్యారిస్‌ పీస్‌ కాన్ఫరెన్స్‌కు పంపించడం ద్వారా నానాజాతి సమితికి మద్దతును తెలిపింది. ఆ కాన్ఫరెన్స్‌ “ప్రపంచ చరిత్రలోనే ఒక కొత్త శకానికి మార్గం తెరిచింది” అని ఆ ప్రతినిధుల్లో ఒకతను చెప్పాడు.

నిజంగానే ఒక కొత్త శకానికి మార్గం తెరుచుకుంది, కానీ దానికి కారణం పీస్‌ కాన్ఫరెన్స్‌లో ఉన్న మనుషులు కాదు. 1919లో ముందెప్పటికన్నా ఎక్కువ ప్రకటించేలా యెహోవా తన ప్రజలకు శక్తిని ఇవ్వడం వల్ల ప్రకటనా పనిలో ఒక కొత్త శకం మొదలైంది. కానీ దానికన్నా ముందు, బైబిలు విద్యార్థుల పరిస్థితిలో పెద్ద మార్పు జరగాల్సివుంది.

కష్టమైన నిర్ణయం

జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌

వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ డైరెక్టర్ల వార్షిక ఎన్నికలు 1919 జనవరి 4, శనివారం జరగాల్సివుంది. కానీ ఆ సమయానికే, యెహోవా ప్రజలకు నాయకత్వం వహిస్తున్న జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ను అలాగే మరో ఏడుగురు సహోదరులను అన్యాయంగా అరెస్టు చేసి అమెరికాలోని జార్జియాలో ఉన్న అట్లాంటా జైల్లో వేశారు. దాంతో, జైల్లో ఉన్న సహోదరులను మళ్లీ డైరెక్టర్లుగా ఎన్నుకోవాలా లేక వాళ్ల స్థానంలో వేరేవాళ్లను ఎన్నుకోవాలా? అనే ప్రశ్న తలెత్తింది.

ఇవాండర్‌ జే. కౌవర్డ్‌

జైల్లో ఉన్న సహోదరుడు రూథర్‌ఫర్డ్‌, సంస్థ భవిష్యత్తు గురించి ఆందోళనపడ్డాడు. కొంతమంది సహోదరులు, అధ్యక్షుడిగా వేరే వ్యక్తిని ఎన్నుకుంటే మంచిదని అనుకుంటున్నట్టు రూథర్‌ఫర్డ్‌కు తెలిసింది. దాంతో ఆయన, ఆ ఎన్నికలకు వచ్చినవాళ్లకు ఒక ఉత్తరం రాస్తూ ఇవాండర్‌ జే. కౌవర్డ్‌ అనే సహోదరుణ్ణి అధ్యక్షుడిగా సిఫారసు చేశాడు. కౌవర్డ్‌ “నెమ్మదస్థుడు,” “వివేచనగలవాడు,” “ప్రభువుకు నమ్మకస్థుడు” అని రూథర్‌ఫర్డ్‌ అన్నాడు. అయితే, చాలామంది సహోదరులు వేరేలా ఆలోచించారు, వాళ్లు ఎన్నికల్ని ఆరు నెలలు వాయిదా వేద్దాం అన్నారు. జైల్లో ఉన్న సహోదరుల తరఫున వాదిస్తున్న న్యాయవాదులు దానికి ఒప్పుకున్నారు. అయితే, ఆ చర్చ జరుగుతున్నప్పుడు కొంతమంది సహోదరులు అసహనం వ్యక్తం చేశారు.

రిచర్డ్‌ హెచ్‌. బార్బర్‌

తర్వాత ఒక సంఘటన జరగడం వల్ల ఆ కష్టమైన పరిస్థితి సద్దుమణిగిందని రిచర్డ్‌ హెచ్‌. బార్బర్‌ చెప్పాడు. అక్కడికి హాజరైనవాళ్లలో ఒక సహోదరుడు లేచి ఇలా అన్నాడు, “నేను న్యాయవాదిని కాను, కానీ విశ్వసనీయంగా ఉండాలంటే ఏం అవసరమో నాకు తెలుసు. దేవుడు విశ్వసనీయతను కోరుకుంటున్నాడు. దేవునికి మనం విశ్వసనీయంగా ఉన్నామని చూపించాలంటే, ఎన్నికలు జరిపి మళ్లీ సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కన్నా వేరే మార్గం లేదు.”—కీర్త. 18:25.

అలెగ్జాండర్‌ హెచ్‌. మాక్‌మిలన్‌

ఆ తర్వాతి రోజు ఏం జరిగిందో జైల్లో ఉన్న మరో సహోదరుడైన మాక్‌మిలన్‌ గుర్తుచేసుకున్నాడు. సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ తన జైలు గది గోడను తట్టి, “నీ చెయ్యి బయటపెట్టు” అన్నాడు. అప్పుడు రూథర్‌ఫర్డ్‌, మాక్‌మిలన్‌ చేతిలో ఒక టెలిగ్రామ్‌ పెట్టాడు. దానిలో చిన్న సందేశం ఉండడాన్ని మాక్‌మిలన్‌ చూశాడు, వెంటనే ఆయనకు విషయం అర్థమైంది. ఆ టెలిగ్రామ్‌లో ఇలా ఉంది, “రూథర్‌ఫర్డ్‌ వైజ్‌ వాన్‌ బార్బర్‌ ఆండర్సన్‌ బుల్లీ స్పిల్‌ డైరెక్టర్‌ మొదటి ముగ్గురు ఆఫీసర్లు అందరికి మా ప్రేమలు.” ఆ మాటల అర్థమేంటంటే డైరెక్టర్లు అందరూ మళ్లీ ఎన్నుకోబడ్డారు; జోసెఫ్‌ రూథర్‌ఫర్డ్‌, విలియమ్‌ వాన్‌ ఆమ్‌బర్గ్‌ ఇంకా ఆఫీసర్లుగానే ఉన్నారు. కాబట్టి సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ అధ్యక్షుడిగా కొనసాగుతారు.

విడుదలయ్యారు!

ఆ ఎనిమిదిమంది సహోదరులు జైల్లో ఉండగా, వాళ్లను విడుదల చేయమని కోరుతూ నమ్మకమైన బైబిలు విద్యార్థులు ఒక పిటీషన్‌ తయారుచేసి దానిమీద ప్రజల సంతకాల్ని సేకరించారు. ధైర్యవంతులైన ఆ సహోదరసహోదరీలు ఏడు లక్షల కన్నా ఎక్కువ సంతకాల్ని సేకరించారు. ఆ పిటీషన్‌ను అందజేయకముందే, 1919 మార్చి 26 బుధవారం రోజున సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ అలాగే బాధ్యతగల ఇతర సహోదరులు జైలు నుండి విడుదలయ్యారు.

సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ విడుదలై వచ్చాక తనను ఆహ్వానించిన సహోదరులతో ఇలా అన్నాడు “ఇదంతా, రాబోయే మరింత కష్టకాలాలకు మనల్ని సిద్ధం చేయడానికే జరిగిందని నేను నమ్ముతున్నాను. . . . మీ పోరాటం సహోదరులను జైలు నుండి విడిపించడానికి కాదు. దానికన్నా ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. . . . మీరు సత్యం గురించి సాక్ష్యమివ్వడానికి పోరాడుతున్నారు. అలా పోరాడినవాళ్లు అద్భుతమైన ఆశీర్వాదం పొందారు.”

మన సహోదరుల విచారణ సమయంలో చోటుచేసుకున్న పరిస్థితుల్ని చూస్తుంటే, వాటి వెనుక యెహోవా నిర్దేశం ఉన్నట్లు అనిపిస్తుంది. 1919 మే 14న అప్పీల్‌ కోర్టు ఈ తీర్పునిచ్చింది, “ఈ కేసులో శిక్షపడినవాళ్లను . . . తగినరీతిలో నిష్పక్షపాతంగా విచారణ చేయలేదు, అందుకే తీర్పు తిరగరాయబడింది.” అది మంచి తీర్పు. ఎందుకంటే, సహోదరుల మీద తీవ్ర నేరారోపణలు మోపబడ్డాయి. వాళ్లు కేవలం క్షమించబడి ఉంటే లేదా శిక్ష తగ్గించబడి ఉంటే వాళ్ల పేర్ల మీద క్రిమినల్‌ రికార్డులు అలాగే ఉండిపోయేవి. కానీ ఆ తీర్పు తిరగరాయబడింది, ఇక వాళ్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. కాబట్టి సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ * అమెరికా సుప్రీం కోర్టులో యెహోవా ప్రజల తరఫున వాదించడానికి తనకున్న చట్టపరమైన అర్హతలు కోల్పోలేదు. ఆయన విడుదలయ్యాక చాలాసార్లు అలా వాదించాడు.

ప్రకటించాలని నిర్ణయించుకున్నారు

సహోదరుడు మాక్‌మిలన్‌ ఇలా గుర్తుచేసుకున్నాడు, “ప్రభువు మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లే సమయం కోసం ఎదురుచూస్తూ మేము చేతులు కట్టుకొని ఊరికే కూర్చోవాలని అనుకోలేదు. ప్రభువు ఇష్టమేమిటో తెలుసుకోవడానికి మేము ఏదోకటి చేయాలని గుర్తించాం.”

కానీ ప్రధాన కార్యాలయంలో సహోదరులు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న తమ పనిని ఎప్పటిలా కొనసాగించలేకపోయారు. ఎందుకంటే వాళ్లను జైల్లో పెట్టినప్పుడు, ప్రచురణల్ని ముద్రించడానికి ఉపయోగించే ప్రింటింగ్‌ ప్లేట్లు ధ్వంసం చేయబడ్డాయి. దానివల్ల సహోదరులు నిరుత్సాహపడ్డారు, కొంతమందైతే ప్రకటనా పని పూర్తయిందేమో అనుకున్నారు.

బైబిలు విద్యార్థులు ప్రకటించే రాజ్య సందేశం పట్ల ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉందా? ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఒక ప్రసంగం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దానికి అందర్నీ ఆహ్వానించాలని అనుకున్నాడు. “ఆ ప్రసంగం వినడానికి ఒక్కరు కూడా రాకపోతే, ప్రకటనా పని పూర్తయినట్టే” అని సహోదరుడు మాక్‌మిలన్‌ అన్నాడు.

1919లో కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెల్స్‌లో, “బాధపడుతున్న మానవజాతికి ఒక నిరీక్షణ” అనే అంశం మీద సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఇచ్చే ప్రసంగం గురించి వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన

1919, మే 4 ఆదివారం రోజున సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ తన ఆరోగ్యం అస్సలు బాలేకపోయినా కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఇంగ్లీషులో ప్రసంగం ఇచ్చాడు. దాని అంశం “బాధపడుతున్న మానవజాతికి ఒక నిరీక్షణ.” దాదాపు 3,500 మంది ఆ ప్రసంగానికి హాజరయ్యారు. ఇంకా వందలమంది స్థలం లేకపోవడంతో తిరిగివెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు మరో 1,500 మంది హాజరయ్యారు. సహోదరులకు జవాబు దొరికింది, ఆసక్తిపరులు ఉన్నారు!

ఆ తర్వాత ప్రకటనా పని విషయంలో సహోదరులు చేసిన కొన్ని మార్పుల్ని యెహోవాసాక్షులు ఇప్పటికీ పాటిస్తున్నారు.

అభివృద్ధి కోసం సిద్ధపడడం

సెప్టెంబరు మొదటి వారంలో ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో ఒక సమావేశం జరగబోతుందని ద వాచ్‌ టవర్‌ 1919 ఆగస్టు 1 సంచికలో ప్రకటన వచ్చింది. “ఎలాగైనా దానికి హాజరవ్వాలని అందరికి అనిపించింది” అని మిస్సోరికి చెందిన క్లారెన్స్‌ బి. బీటీ అనే యువ బైబిలు విద్యార్థి గుర్తుచేసుకున్నాడు. అక్కడికి 6,000 కన్నా ఎక్కువమంది సహోదరసహోదరీలు హాజరయ్యారు, అది ఊహించినదాని కన్నా చాలా ఎక్కువ. ఆ సమావేశంలో ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ దగ్గరలో ఉన్న లేక్‌ ఎరీలో 200 కన్నా ఎక్కువమంది బాప్తిస్మం తీసుకున్నారు.

1919 అక్టోబరు 1 ద గోల్డెన్‌ ఏజ్‌ మొదటి సంచిక కవర్‌ పేజీ

1919 సెప్టెంబరు 5న అంటే సమావేశం ఐదో రోజున, “తోటి పనివాళ్లకు ఒక సందేశం” అనే అంశం మీద సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ప్రసంగం ఇచ్చాడు. ఆ ప్రసంగంలో ఆయన, ద గోల్డెన్‌ ఏజ్‌  * అనే కొత్త పత్రిక ప్రచురించబడుతోందని చెప్పాడు. దానిలో “ముఖ్యమైన తాజా వార్తలు అలాగే ఆ సంఘటనలకు లేఖనాలు ఇస్తున్న వివరణ ఉంటాయి.”

ఆ కొత్త ప్రచురణను ఉపయోగించి ధైర్యంగా ప్రకటనా పని చేయమని బైబిలు విద్యార్థులందరూ ప్రోత్సహించబడ్డారు. ఆ పనిని క్రమపద్ధతిలో ఎలా చేయాలో వివరించే ఉత్తరంలో ఇలా ఉంది, “సేవ చేయడం ఒక గొప్ప అవకాశమని బాప్తిస్మం తీసుకున్న ప్రతీఒక్కరు గుర్తుంచుకోవాలి. ఆ అవకాశాన్ని ఇప్పుడే సద్వినియోగం చేసుకొని, ప్రపంచవ్యాప్తంగా సాక్ష్యమిచ్చే ఈ పనిలో భాగంవహించడానికి వీలైనంత ఎక్కువగా కృషిచేయాలి.” ఆ ఆహ్వానాన్ని చాలామంది అంగీకరించారు. డిసెంబరు కల్లా, ఉత్సాహవంతులైన రాజ్య ప్రచారకులు కొత్త పత్రిక కోసం 50 వేల కన్నా ఎక్కువమంది ప్రజలతో చందా కట్టించారు.

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ద గోల్డెన్‌ ఏజ్‌ పత్రికలున్న ట్రక్కు దగ్గర నిలబడ్డ సహోదరులు

1919 చివరికల్లా యెహోవా ప్రజలు తిరిగి సంస్థీకరించబడ్డారు, బలం పుంజుకున్నారు. దానికితోడు, చివరి రోజులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రవచనాలు నెరవేరాయి. మలాకీ 3:1-4 లో చెప్పినట్టు దేవుని ప్రజలు పరీక్షించబడ్డారు, శుద్ధీకరించబడ్డారు; యెహోవా ప్రజలు “మహాబబులోను” సూచనార్థక చెర నుండి విడుదలయ్యారు; యేసు ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుణ్ణి’ నియమించాడు. * (ప్రక. 18:2, 4; మత్త. 24:45) దాంతో యెహోవా అప్పగించిన పనిని చేయడానికి బైబిలు విద్యార్థులు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు.

^ పేరా 13 సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఒక న్యాయవాది అలాగే జడ్జి. అందుకే ఆయన్ని జడ్జి రూథర్‌ఫర్డ్‌ అని పిలుస్తారు.

^ పేరా 22 ఆ పత్రిక పేరును 1937లో కన్సోలేషన్‌ అని, ఆ తర్వాత 1946లో అవేక్‌! అని మార్చారు.

^ పేరా 24 కావలికోట 2013 జూలై 15 సంచికలో 10-12, 21-23 పేజీలు అలాగే కావలికోట 2016 మార్చి సంచికలో 29-31 పేజీలు చూడండి.