అధ్యయన ఆర్టికల్ 43
నిజమైన తెలివి కేకలు వేస్తోంది
“నిజమైన తెలివి వీధుల్లో కేకలు వేస్తోంది. సంతవీధుల్లో బిగ్గరగా మాట్లాడుతోంది.”—సామె. 1:20.
పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి
ఈ ఆర్టికల్‌లో. . . *
1. నేడు తెలివి వీధుల్లో కేకలు వేస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు? (సామెతలు 1:20, 21)
చాలా దేశాల్లో ప్రజలు ఎక్కువగా ఉండే వీధుల్లో మన సహోదర సహోదరీలు సంతోషంగా ప్రచురణలు ఇస్తూ ప్రకటిస్తారు. మీరు కూడా అలా ఎప్పుడైనా ప్రకటించారా? అలా ప్రకటిస్తున్నప్పుడు, సామెతలు పుస్తకంలోని “తెలివి వీధుల్లో కేకలు వేస్తోంది” అనే మాటలు మీకు గుర్తొచ్చి ఉంటాయి. (సామెతలు 1:20, 21 చదవండి.) యెహోవా ఇచ్చే “నిజమైన తెలివి” బైబిల్లో, మన ప్రచురణల్లో ఉంది. శాశ్వత జీవితానికి నడిపించే దారిలో ప్రజలు అడుగుపెట్టాలంటే ఈ తెలివి ఎంతో అవసరం. ఎవరైనా మన ప్రచురణలు తీసుకుంటే మనం సంతోషిస్తాం, కానీ అందరూ వాటిని తీసుకోరు. కొంతమంది బైబిలు చెప్పేది వినడానికి ఇష్టపడరు. ఇంకొంతమంది బైబిలు పాతకాలం పుస్తకమని అనుకుంటూ, మనల్ని చూసి ఎగతాళిగా నవ్వుతారు. మరికొంతమంది మంచి చెడుల విషయంలో బైబిలు చెప్పేవాటిని విమర్శిస్తూ, బైబిల్ని పాటించేవాళ్లు అనవసరంగా ఇతరుల్ని తప్పుపడుతూ ఉంటారని అంటారు. అయినా ప్రేమగల యెహోవా దేవుడు నిజమైన తెలివిని అందరికీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఎలా?
2. నేడు నిజమైన తెలివి ఎలా అందుబాటులో ఉంది? కానీ చాలామంది ఏం చేస్తున్నారు?
2 నిజమైన తెలివిని యెహోవా ముఖ్యంగా తన వాక్యమైన బైబిలు ద్వారా ఇస్తున్నాడు. నేడు బైబిలు దాదాపు ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉంది. మన బైబిలు ప్రచురణల సంగతేంటి? యెహోవా ఆశీర్వాదంవల్ల అవి ప్రస్తుతం 1,000 కన్నా ఎక్కువ భాషల్లో ఉన్నాయి. దాన్ని వినేవాళ్లు, అంటే దాన్ని చదివి, పాటించేవాళ్లు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. కానీ చాలామంది యెహోవా చెప్పేది వినాలని అనుకోవట్లేదు. వాళ్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తమ సొంత జ్ఞానం మీద లేదా ఇతరుల మీద ఆధారపడుతుంటారు. అంతేకాదు బైబిల్ని పాటిస్తున్నందుకు వాళ్లు మనల్ని చిన్నచూపు చూస్తారు. ప్రజలు ఎందుకు అలా ఉన్నారో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అయితే ముందుగా యెహోవా ఇచ్చే తెలివిని ఎలా సంపాదించుకోవచ్చో పరిశీలిద్దాం.
యెహోవా గురించి తెలుసుకుంటే తెలివి వస్తుంది
3. నిజమైన తెలివి సంపాదించాలంటే ఏం చేయాలి?
3 మనకు తెలిసిన వాటిని బట్టి మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని తెలివి అంటారు. అయితే నిజమైన తెలివి అంటే అది మాత్రమే కాదు. బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా మీదుండే భయమే తెలివికి ఆరంభం, అతి పవిత్రుడైన దేవుని గురించి తెలుసుకోవడమే అవగాహన.” (సామె. 9:10) అందుకే ఏదైనా ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు, మనం యెహోవా ఆలోచనల్ని బట్టి అంటే “అతి పవిత్రుడైన దేవుని గురించి” తెలుసుకున్న వాటిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. అందుకోసం బైబిల్ని, ప్రచురణల్ని చదవాలి. అలా చేసినప్పుడు మనకు నిజమైన తెలివి ఉందని చూపిస్తాం.—సామె. 2:5-7.
4. యెహోవా మాత్రమే నిజమైన తెలివి ఇస్తాడని ఎందుకు చెప్పవచ్చు?
4 నిజమైన తెలివి యెహోవా మాత్రమే ఇస్తాడు. (రోమా. 16:27) మనం ఎందుకు అలా చెప్పవచ్చు? ఈ మూడు విషయాలు పరిశీలించండి. మొదటిగా, యెహోవాయే సృష్టికర్త కాబట్టి ఆయన చేసిన వాటన్నిటి గురించి ఆయనకే పూర్తిగా తెలుసు. (కీర్త. 104:24) రెండోదిగా, ఆయన చేసే పనులన్నిటిలో తెలివి కనిపిస్తుంది. (రోమా. 11:33) మూడోదిగా, ఆయన ఇచ్చే తెలివైన సలహాల్ని పాటిస్తే ఎప్పుడూ మంచే జరుగుతుంది. (సామె. 2:10-12) కాబట్టి నిజమైన తెలివి సంపాదించాలంటే ఈ మూడు విషయాల్ని మనం అర్థంచేసుకోవాలి, వాటిని బట్టే నిర్ణయాలు తీసుకోవాలి, వాటికి తగ్గట్టే నడుచుకోవాలి.
5. నిజమైన తెలివికి మూలం యెహోవాయే అని అర్థం చేసుకోకపోవడం వల్ల లోకం ఎలా ఉంది?
5 చాలామంది ప్రకృతిలోని అందాల్ని మెచ్చుకుంటారు, కానీ అవి పరిణామం వల్ల వచ్చాయని, సృష్టికర్త లేడని అంటారు. ఇంకొంతమంది దేవున్ని నమ్ముతున్నామని చెప్పినా, బైబిల్లో ఉన్న నియమాలు పాతకాలం నాటివి అంటూ తమకు నచ్చినట్టు నడుచుకుంటారు. మరి మనుషులు దేవుని మీద కాకుండా, సొంత తెలివి మీద ఆధారపడడం వల్ల ఈ లోకంలో సమస్యలు ఏమైనా తగ్గాయా? అందరూ సంతోషంగా ఉంటూ, భవిష్యత్తు మీద ఆశతో బ్రతుకుతున్నారా? లేదు కదా. మన చుట్టూ ఉన్న లోకం, బైబిల్లోని ఈ మాటల్ని రుజువు చేస్తుంది: “యెహోవాకు వ్యతిరేకంగా నిలిచే తెలివి గానీ, వివేచన గానీ, సలహా గానీ లేదు.” (సామె. 21:30) నిజమైన తెలివి కోసం యెహోవా మీద ఆధారపడడం ఎంత ముఖ్యమో దీన్నిబట్టి అర్థమౌతుంది. కానీ విచారకరంగా, చాలామంది ప్రజలు అలా అనుకోవడంలేదు. ఎందుకు?
చాలామంది నిజమైన తెలివిని ఎందుకు పట్టించుకోరు?
6. సామెతలు 1:22-25 ప్రకారం, నిజమైన తెలివి వేసే కేకలు ఎవరు వినరు?
6 ‘నిజమైన తెలివి వీధుల్లో కేకలు వేస్తున్నప్పుడు’ చాలామంది దాన్ని వినరు. మూడు రకాల ప్రజలు దాన్ని వినరని బైబిలు చెప్తుంది. వాళ్లు ఎవరంటే: “అనుభవంలేని వాళ్లు,” “ఎగతాళి చేసేవాళ్లు,” “మూర్ఖులు.” (సామెతలు 1:22-25 చదవండి.) వాళ్లు నిజమైన తెలివిని ఎందుకు వినరో, మనం వాళ్లలా తయారవ్వకుండా ఎలా ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
7. కొంతమంది “అనుభవం లేనివాళ్లు” అలానే ఉండిపోవాలని ఎందుకు నిర్ణయించుకుంటారు?
7 “అనుభవం లేనివాళ్లు” అన్నిటిని సులువుగా నమ్మేస్తారు, వాళ్లను మోసం చేయడం చాలా తేలిక. (సామె. 14:15) మనం పరిచర్యలో తరచూ అలాంటి వాళ్లను కలుస్తుంటాం. రాజకీయ నాయకులు, మత నాయకులు చెప్పేది విని ఎన్ని లక్షలమంది మోసపోతున్నారో ఆలోచించండి. వాళ్ల చేతుల్లో మోసపోయామని తెలుసుకున్నప్పుడు కొంతమంది షాక్ అవుతారు. కానీ సామెతలు 1:22 లో చెప్పిన “అనుభవం లేనివాళ్లు” అలానే ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే వాళ్లకు అలా ఉండడం ఇష్టం. (యిర్మీ. 5:31) వాళ్లు తమకు నచ్చినట్టే జీవించాలని అనుకుంటారు. బైబిలు చెప్పేది నేర్చుకోవడం, దాని నియమాల ప్రకారం జీవించడం వాళ్లకు ఇష్టం ఉండదు. ఉదాహరణకు కెనడాలో చర్చీకి వెళ్లే ఒక స్త్రీ, తన ఇంటికి వచ్చిన యెహోవాసాక్షితో ఇలా అంది: “మా పాస్టరు మమ్మల్ని తప్పుదారి పట్టిస్తే, అది ఆయన తప్పే అవుతుంది గానీ మా తప్పు ఎలా అవుతుంది?” చాలామంది ఆమెలాగే ఆలోచిస్తూ, తమ తప్పేమీ లేదని అనుకుంటున్నారు. మనం వాళ్లలా ఉండాలని అస్సలు అనుకోం.—సామె. 1:32; 27:12.
8. మంచి అనుభవాన్ని ఎలా సంపాదించుకుంటాం?
8 అందుకే అనుభవం లేనివాళ్లలా ఉండిపోకుండా, “ఆలోచించే విషయంలో పెద్దవాళ్లలా ఉండండి” అని బైబిలు ప్రోత్సహిస్తుంది. (1 కొరిం. 14:20) మన జీవితంలో బైబిలు సూత్రాల్ని పాటించినప్పుడు, మంచి అనుభవాన్ని సంపాదించుకుంటాం. బైబిలు సూత్రాల్ని పాటిస్తూ ఉంటే మనం సమస్యల్ని ఎలా తప్పించుకోవచ్చో, మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చో మెల్లమెల్లగా అర్థం చేసుకుంటాం. ఈ విషయంలో మనం ఎలా ప్రగతి సాధిస్తున్నామో, ఎప్పటికప్పుడు చూసుకోవడం మంచిది. మీరు కొంతకాలంగా బైబిలు స్టడీ తీసుకుంటూ, మీటింగ్స్‌కి వస్తున్నారా? అయితే మీరు ఇంకా యెహోవాకు ఎందుకు సమర్పించుకోలేదో, బాప్తిస్మం తీసుకోలేదో ఆలోచించుకోండి. ఒకవేళ మీరు బాప్తిస్మం తీసుకుని ఉంటే, ప్రకటించే-బోధించే పనిలో ప్రగతి సాధిస్తున్నారా? బైబిలు సూత్రాల ప్రకారం జీవిస్తున్నారని మీ నిర్ణయాలు చూపిస్తున్నాయా? మీరు ఇతరులతో యేసులాగే ప్రవర్తిస్తున్నారా? ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు, ఎక్కడైనా మార్పులు చేసుకోవాలని మీకు అనిపిస్తే, “అనుభవం లేనివాళ్లను తెలివిగలవాళ్లుగా” చేసే యెహోవా మాటల మీద మనసుపెట్టండి.—కీర్త. 19:7.
9. తెలివిని పట్టించుకోవట్లేదని “ఎగతాళి చేసేవాళ్లు” ఎలా చూపిస్తున్నారు?
9 దేవుడు ఇచ్చే తెలివిని పట్టించుకోని రెండో గుంపు, “ఎగతాళి చేసేవాళ్లు.” మనం ప్రకటించేటప్పుడు అలాంటి వాళ్లు కూడా అప్పుడప్పుడు కనిపిస్తారు. వాళ్లకు ఇతరుల్ని ఎగతాళి చేయడమంటే చాలా ఇష్టం. (కీర్త. 123:4) చివరి రోజుల్లో ఇలాంటి వాళ్లు చాలామంది ఉంటారని బైబిలు ముందే చెప్పింది. (2 పేతు. 3:3, 4) లోతు అల్లుళ్లలానే నేడు కొంతమంది దేవుడిచ్చే హెచ్చరికల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. (ఆది. 19:14) బైబిలు సూత్రాల ప్రకారం జీవించే వాళ్లను చాలామంది ఎగతాళి చేస్తున్నారు. ‘భక్తిహీన కోరికల ప్రకారం ప్రవర్తించాలని’ కోరుకుంటారు కాబట్టే వాళ్లు అలా ఎగతాళి చేస్తారు. (యూదా 7, 17, 18, అధస్సూచి) ఎగతాళి చేసేవాళ్ల గురించి బైబిలు చెప్పే మాటలు మతభ్రష్టులకు, యెహోవాను విడిచిపెట్టిన వాళ్లకు కూడా సరిగ్గా సరిపోతాయి.
10. కీర్తన 1:1 ప్రకారం, ఎగతాళి చేసేవాళ్లలా తయారవ్వకూడదంటే మనం ఏం చేయాలి?
10 ఎగతాళి చేసేవాళ్లలా తయారవ్వకూడదంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే, తప్పులుపట్టే వాళ్లకు దూరంగా ఉండాలి. (కీర్తన 1:1 చదవండి.) అంటే మతభ్రష్టులు చెప్పేదేదీ వినకూడదు, చదవకూడదు. జాగ్రత్తగా లేకపోతే, మనం ఎప్పుడూ తప్పులు పడుతూ యెహోవాను, ఆయన సంస్థ ద్వారా వచ్చే నిర్దేశాల్ని సందేహించే ప్రమాదం ఉంది. అలా అవ్వకూడదంటే మనం ఈ ప్రశ్నలు వేసుకోవాలి: ‘ఏదైనా కొత్త అవగాహన లేదా నిర్దేశాలు వచ్చినప్పుడు, దానిలో తప్పులు వెదికే అలవాటు నాకుందా? నాయకత్వం వహిస్తున్న సహోదరుల్లో నేను తప్పులు వెదుకుతుంటానా?’ ఒకవేళ ఇలాంటి అలవాట్లు మనకుంటే వాటిని వెంటనే మార్చుకోవాలి. అప్పుడు యెహోవా మనల్ని చూసి సంతోషిస్తాడు.—సామె. 3:34, 35.
11. మంచి చెడుల విషయంలో యెహోవా ప్రమాణాల్ని “మూర్ఖులు” ఎందుకు ఇష్టపడరు?
11 నిజమైన తెలివిని పట్టించుకోని మూడో గుంపు, “మూర్ఖులు.” మంచి చెడుల విషయంలో దేవుడు పెట్టిన నియమాల ప్రకారం జీవించడానికి వాళ్లు ఇష్టపడరు కాబట్టి వాళ్లను మూర్ఖులు అని పిలవవచ్చు. వాళ్లు తమకు ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తారు. (సామె. 12:15) యెహోవాయే నిజమైన తెలివికి మూలమని వాళ్లు ఒప్పుకోరు. (కీర్త. 53:1) మనం ప్రకటనా పనిలో అలాంటివాళ్లను కలిసినప్పుడు, బైబిలు సూత్రాల్ని పాటిస్తున్నందుకు తరచూ వాళ్లు మనల్ని తప్పుపడుతుంటారు. మరి మనల్ని అలా తప్పుపడుతున్న వాళ్ల దగ్గర ఏమైనా గొప్ప సలహాలు ఉంటాయా? బైబిలు ఇలా చెప్తుంది: “మూర్ఖుడికి నిజమైన తెలివి దొరకదు; నగర ద్వారం దగ్గర అతను ఏమీ మాట్లాడలేడు.” (సామె. 24:7) అవును, మూర్ఖుల దగ్గర మంచి సలహాలు ఏవీ ఉండవు. అందుకే యెహోవా “తెలివితక్కువవాళ్లకు దూరంగా ఉండు” అని చెప్తున్నాడు.—సామె. 14:7.
12. దేవునికి లోబడని మూర్ఖుల్లా తయారవ్వకూడదంటే మనం ఏం చేయాలి?
12 దేవుని సలహాల్ని అసహ్యించుకునే మూర్ఖుల్లా మనం ఉండం. బదులుగా దేవుని ఆలోచనల్ని, మంచి చెడుల విషయంలో ఆయన ప్రమాణాల్ని ప్రేమించడం నేర్చుకుంటాం. దేవుని ప్రమాణాలకు లోబడేవాళ్లు ఎలా ఉన్నారో, లోబడనివాళ్లు ఎలా ఉన్నారో ఆలోచించడం ద్వారా మనం ఆ ప్రేమను పెంచుకోవచ్చు. యెహోవా ఇచ్చే తెలివైన సలహాల్ని మూర్ఖంగా పట్టించుకోని ప్రజలు సమస్యల్ని ఎలా కొనితెచ్చుకుంటున్నారో ఆలోచించండి. తర్వాత దేవునికి లోబడడం వల్ల మీరు ఎంత ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారో ఆలోచించండి.—కీర్త. 32:8, 10.
13. తను ఇచ్చే తెలివైన సలహాల్ని తీసుకోమని యెహోవా మనల్ని బలవంతపెడతాడా?
13 యెహోవా అందరికీ తెలివిని ఇస్తున్నాడు, కానీ దాన్ని తీసుకోమని ఎవ్వర్నీ బలవంతపెట్టడు. అయితే దాన్ని తీసుకోని వాళ్లకు ఏం జరుగుతుందో ఆయన వివరిస్తున్నాడు. (సామె. 1:29-32) యెహోవాకు లోబడని వాళ్లు, “తమ పనుల పర్యవసానాల్ని అనుభవిస్తారు.” కొంతకాలానికి వాళ్ల పనులు, అలవాట్ల వల్ల కష్టాల్ని, కన్నీళ్లను, చివరికి నాశనాన్ని కొనితెచ్చుకుంటారు. అయితే తను ఇచ్చిన తెలివైన సలహాల్ని విని, పాటించేవాళ్లు ఇలా ఉంటారని యెహోవా చెప్తున్నాడు: “నా మాటలు వినేవాళ్లు, విపత్తు వస్తుందనే భయం లేకుండా సురక్షితంగా నివసిస్తారు.”—సామె. 1:33.
నిజమైన తెలివి వల్ల వచ్చే ప్రయోజనాలు
14-15. సామెతలు 4:23 నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
14 దేవుడిచ్చే తెలివైన సలహాల్ని పాటిస్తే మనం ఎప్పుడూ ప్రయోజనం పొందుతాం. మనం చర్చించుకున్నట్టు, యెహోవా ఇచ్చే సలహాల్ని తెలుసుకోవడం చాలా సులువు. ఉదాహరణకు సామెతలు పుస్తకంలో, అన్నికాలాల వాళ్లకు ఉపయోగపడే ఎన్నో మంచి సలహాల్ని యెహోవా ఇచ్చాడు. అందులోని నాలుగు సలహాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
15 మీ హృదయాన్ని కాపాడుకోండి. బైబిలు ఇలా అంటుంది: “అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, ఎందుకంటే దానిలో నుండే జీవపు ఊటలు బయల్దేరతాయి.” (సామె. 4:23) మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహారం తీసుకుంటాం, వ్యాయామం చేస్తాం, చెడు అలవాట్లకు దూరంగా ఉంటాం. అదేవిధంగా మన ఆలోచనలు, భావాలు, కోరికలకు మూలమైన హృదయాన్ని కూడా మనం కాపాడుకోవాలి. దానికోసం మనం ప్రతిరోజు బైబిలు చదవాలి. అంతేకాదు మీటింగ్స్‌కి సిద్ధపడి వెళ్లాలి, కామెంట్స్ చెప్పాలి. ప్రకటించే, బోధించే పనిలో ఉత్సాహంగా పాల్గొనాలి. అలాగే మన ఆలోచనల్ని పాడుచేసే వినోదానికి, స్నేహితులకు దూరంగా ఉండాలి.
16. సామెతలు 23:4, 5 లో ఉన్న సలహా నేడు మనకు ఎలా సహాయం చేస్తుంది?
16 మీకున్న వాటితో సంతృప్తిగా ఉండండి. బైబిలు ఈ సలహా ఇస్తుంది: “ఆస్తిని సంపాదించడానికి అతిగా ప్రయాసపడకు. . . . నీ చూపు దానిమీద పడగానే, అది లేకుండా పోతుంది; అది గద్దలా రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోతుంది.” (సామె. 23:4, 5) ఆస్తులు, సంపదలు ఎప్పటికీ మనతోనే ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేం. అయినా ఈరోజుల్లో, ధనవంతులు-పేదవాళ్లు అనే తేడా లేకుండా అందరూ డబ్బు సంపాదించాలని ఆరాటపడుతున్నారు. దానివల్ల చాలామంది తమ పేరును, ఇతరులతో తమ సంబంధాల్ని, చివరికి ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకుంటున్నారు. (సామె. 28:20; 1 తిమో. 6:9, 10) అయితే డబ్బు గురించి ఎక్కువ ఆందోళనపడకుండా ఉండడానికి నిజమైన తెలివి మనకు సహాయం చేస్తుంది. అప్పుడు మనం అత్యాశకు దూరంగా ఉంటూ సంతృప్తిగా, సంతోషంగా జీవిస్తాం.—ప్రసం. 7:12.
17. సామెతలు 12:18 చెప్తున్నట్టు, మనం “తెలివిగలవాళ్లలా” మాట్లాడాలంటే ఏం చేయాలి?
17 మాట్లాడే ముందు ఆలోచించండి. మనం జాగ్రత్తగా లేకపోతే, మన మాటలవల్ల ఎంతో నష్టం జరగవచ్చు. బైబిలు ఇలా చెప్తుంది: “ఆలోచించకుండా మాట్లాడే మాటలు కత్తిపోట్ల లాంటివి, తెలివిగలవాళ్ల మాటలు గాయాల్ని నయం చేస్తాయి.” (సామె. 12:18) ఇతరుల తప్పులు, లోపాల గురించి వేరేవాళ్లతో మాట్లాడకుండా ఉంటే, మనకు అందరితో మంచి సంబంధాలు ఉంటాయి. (సామె. 20:19) మన మాటలు కత్తిపోట్లలా కాకుండా, గాయాల్ని నయం చేసేవిగా ఉండాలంటే మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి. (లూకా 6:45) మనం బైబిలు చెప్తున్న విషయాల గురించి బాగా ఆలోచిస్తే, మన మాటలు “తెలివి అనే ఊటలా” ఇతరులకు సేదదీర్పును ఇస్తాయి.—సామె. 18:4.
18. సామెతలు 24:6 లో ఉన్న సలహాను పాటించడంవల్ల, మనం పరిచర్యలో విజయాన్ని ఎలా సాధించవచ్చు?
18 నిర్దేశాలు పాటించండి. బైబిలు ఈ చక్కని సలహా ఇస్తుంది: “తెలివిగల నిర్దేశంతో యుద్ధం చేయి, సలహాదారులు ఎక్కువమంది ఉంటే విజయం లభిస్తుంది.” (సామె. 24:6) ప్రకటించే, బోధించే పనిలో విజయం సాధించేలా ఈ సలహా మనకు ఎలా సహాయం చేస్తుంది? మనకు నచ్చిన విధంగా పరిచర్య చేసే బదులు, ఇచ్చిన సలహాల్ని పాటించడం మంచిది. మనకు మీటింగ్స్‌లో తెలివిగల నిర్దేశాలు దొరుకుతాయి. అక్కడ అనుభవం గలవాళ్లు బైబిలు ప్రసంగాలు ఇస్తారు, ప్రదర్శనలు చేస్తారు. అలా మీటింగ్స్‌లో మనకు మంచి శిక్షణ దొరుకుతుంది. అంతేకాదు ప్రజలు బైబిల్ని బాగా అర్థం చేసుకోవడానికి యెహోవా సంస్థ ప్రచురణలు, వీడియోలు వంటి మంచి పనిముట్లను ఇస్తోంది. మీరు వాటిని చక్కగా ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటున్నారా?
19. యెహోవా ఇచ్చే తెలివి గురించి మీకు ఏమనిపిస్తుంది? (సామెతలు 3:13-18)
19 సామెతలు 3:13-18 చదవండి. దేవుడు తన వాక్యంలో ఇన్ని మంచి సలహాల్ని ఇచ్చినందుకు మనం ఆయనకు ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తాం. ఈ సలహాలు లేకపోయుంటే మన పరిస్థితి ఎలా ఉండేదో కదా! ఈ ఆర్టికల్‌లో సామెతలు పుస్తకంలో ఉన్న తెలివైన సలహాల్ని మనం చూశాం. అయితే బైబిలు మొత్తంలో కూడా యెహోవా ఎన్నో తెలివైన సలహాల్ని రాయించాడు. మన జీవితంలో యెహోవా ఇచ్చే సలహాల్ని ఎప్పుడూ పాటించాలని బలంగా నిర్ణయించుకుందాం. దేవుడిచ్చే తెలివిని లోకంలో ఉన్న ప్రజలు ఎలా చూసినా, మనం మాత్రం దాన్ని గట్టిగా పట్టుకుంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటాం అనే నమ్మకంతో ఉండవచ్చు.
పాట 36 మన హృదయాల్ని కాపాడుకుందాం
^ లోకంలోని తెలివి కంటే యెహోవా ఇచ్చే తెలివి చాలాచాలా గొప్పది. తెలివి వీధుల్లో కేకలు వేస్తోంది అని సామెతలు పుస్తకం చెప్తున్న మాటల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అలాగే నిజమైన తెలివిని ఎలా సంపాదించుకోవచ్చో, అది కేకలు వేసినప్పుడు కొంతమంది ఎందుకు వినరో, దాన్ని వినడంవల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో చూస్తాం.