కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రాచీన ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు—మరి మనం ఎందుకు చేయం?

ప్రాచీన ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు—మరి మనం ఎందుకు చేయం?

“ఫ్రాన్స్‌తో గానీ, ఇంగ్లండ్‌తో గానీ యుద్ధం చేయడానికి మీలో ఒక్కరు ఒప్పుకోకపోయినా, అందర్నీ చంపేస్తాం!” అని రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక నాజీ అధికారి యెహోవాసాక్షుల ఒక గుంపును బెదిరించాడు. నాజీ సైనికులు పక్కనే ఆయుధాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నా మన సహోదరుల్లో ఒక్కరు కూడా భయపడలేదు, యుద్ధం చేయడానికి ఒప్పుకోలేదు. వాళ్లు ఎంత ధైర్యం చూపించారో కదా! యుద్ధం విషయంలో యెహోవాసాక్షుల అభిప్రాయం ఏంటో, ఈ అనుభవం చక్కగా చెప్తుంది. మనం ఈ లోకంలో జరిగే యుద్ధాల్లో పాల్గొనం. మనల్ని చంపేస్తామని బెదిరించినా సరే, ఈ లోకంలో జరుగుతున్న గొడవల్లో ఎవ్వరికీ మద్దతివ్వం.

అయితే క్రైస్తవులమని చెప్పుకునే చాలామందికి ఆ అభిప్రాయం లేదు. క్రైస్తవులు తమ దేశం కోసం యుద్ధం చేయవచ్చు, అలా యుద్ధం చేయాలి కూడా అని వాళ్లు అనుకుంటారు. వాళ్లు ఇలా ఆలోచించవచ్చు: ‘ప్రాచీన ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలే కదా, వాళ్లు యుద్ధం చేశారు. మరి నేడు క్రైస్తవులు ఎందుకు యుద్ధం చేయకూడదు?’ ఆ ప్రశ్నకు మీరెలా జవాబిస్తారు? ప్రాచీన ఇశ్రాయేలీయుల పరిస్థితికి, ఇప్పుడున్న దేవుని ప్రజల పరిస్థితికి మధ్య ఎన్నో తేడాలు ఉన్నాయని మీరు వివరించవచ్చు. అలాంటి ఐదు తేడాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

1. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులందరూ ఒకే దేశంలో ఉన్నారు

గతంలో యెహోవా తన ప్రజలందర్నీ ఒకే దేశంలోకి పోగుచేశాడు. వాళ్లే ఇశ్రాయేలీయులు. ఆయన వాళ్ల గురించి ఇలా అన్నాడు: “అన్నిదేశాల ప్రజల్లో మీరు నాకు ప్రత్యేకమైన సొత్తు.” (నిర్గ. 19:5) దేవుడు వాళ్లకు స్పష్టమైన సరిహద్దులతో ఒక దేశాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయుల్ని వేరే దేశాలతో యుద్ధం చేయమన్నప్పుడు, వాళ్లు తమ తోటి ఆరాధకుల మీద దాడిచేసే లేదా చంపే పరిస్థితి ఉండేది కాదు. *

నేడు యెహోవా ఆరాధకులు “అన్నిదేశాల నుండి, గోత్రాల నుండి, జాతుల నుండి, భాషల నుండి వచ్చారు.” (ప్రక. 7:9) ఒకవేళ దేవుని ప్రజలు యుద్ధం చేస్తే, వాళ్లు తమ తోటి ఆరాధకుల మీద దాడి చేయాల్సి వస్తుంది, వాళ్లను చంపేయాల్సి వస్తుంది.

2. యుద్ధానికి వెళ్లమని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు

గతంలో ఇశ్రాయేలీయులు ఎప్పుడు యుద్ధానికి వెళ్లాలి, ఎందుకు వెళ్లాలి అనేది యెహోవా దేవుడే నిర్ణయించేవాడు. ఉదాహరణకు వాగ్దాన దేశానికి వెళ్లకముందు, కనానీయుల్ని నాశనం చేయమని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఎందుకంటే కనానీయులు చెడ్డదూతల్ని ఆరాధించేవాళ్లు, ఘోరమైన లైంగిక పాపాలు చేసేవాళ్లు, చిన్న పిల్లల్ని బలి ఇచ్చేవాళ్లు. వాళ్ల చెడు ప్రభావం ఇశ్రాయేలీయుల మీద పడకూడదనే ఉద్దేశంతో యెహోవా వాళ్లను అక్కడి నుండి నిర్మూలించమని చెప్పాడు. (లేవీ. 18:24, 25) ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, తమ మీదికి దాడి చేయడానికి వచ్చిన శత్రువులతో యుద్ధం చేయమని యెహోవా కొన్నిసార్లు చెప్పాడు. (2 సమూ. 5:17-25) అయితే ఇశ్రాయేలీయులు సొంతగా యుద్ధానికి వెళ్లడానికి, యెహోవా ఎప్పుడూ అనుమతివ్వలేదు. యెహోవా అనుమతి లేకుండా యుద్ధాలకు వెళ్లినప్పుడల్లా, వాళ్లు చేదు ఫలితాల్ని చూశారు.—సంఖ్యా. 14:41-45; 2 దిన. 35:20-24.

నేడు యుద్ధాలు చేయమని యెహోవా మనుషులకు చెప్పట్లేదు. దేశాలు దేవుని కోసం కాదుగానీ, తమ స్వార్థం కోసమే యుద్ధాలు చేస్తున్నాయి. చాలా దేశాలు తమ భూభాగాన్ని పెంచుకోవడం కోసం, డబ్బు కోసం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధం చేస్తున్నాయి. మరి ‘మేము దేవుని తరఫున యుద్ధం చేస్తున్నాం, దేవుని శత్రువుల్నే చంపుతున్నాం’ అని చెప్పుకునే వాళ్ల సంగతేంటి? అలా చేయమని యెహోవా చెప్పట్లేదు. తన ఆరాధకుల్ని యెహోవాయే కాపాడతాడు, తన శత్రువుల్ని యెహోవాయే నాశనం చేస్తాడు. భవిష్యత్తులో జరిగే చివరి యుద్ధమైన హార్‌మెగిద్దోన్‌లో ఆయన అలా చేస్తాడు. (ప్రక. 16:14, 16) ఆ యుద్ధంలో దేవుని పరలోక సైన్యాలు మాత్రమే యుద్ధం చేస్తాయి, కానీ భూమ్మీదున్న ఆయన ఆరాధకులు యుద్ధం చేయరు.—ప్రక. 19:11-15.

3. విశ్వాసం చూపించిన వాళ్లను ఇశ్రాయేలీయులు ప్రాణాలతో విడిచిపెట్టారు

ఇశ్రాయేలీయులు యెరికో మీద దాడిచేసినప్పుడు రాహాబును, ఆమె కుటుంబాన్ని ప్రాణాలతో విడిచిపెట్టారు. నేడు ఏ దేశాలైనా అలా చేస్తున్నాయా?

గతంలో ఇశ్రాయేలు సైన్యం దేవునిపై విశ్వాసం ఉంచిన వాళ్ల మీద కరుణ చూపించింది. కేవలం యెహోవా చంపమని చెప్పిన వాళ్లను మాత్రమే చంపింది. రెండు ఉదాహరణల్ని పరిశీలించండి. యెరికో పట్టణాన్ని నాశనం చేయమని యెహోవా చెప్పినప్పుడు, రాహాబు చూపించిన విశ్వాసాన్ని బట్టి ఆమెను, ఆమె కుటుంబాన్ని ఇశ్రాయేలీయులు ప్రాణాలతో విడిచిపెట్టారు. (యెహో. 2:9-16; 6:16, 17) అలాగే గిబియోనీయులు సత్యదేవునికి భయపడినప్పుడు, ఇశ్రాయేలీయులు వాళ్ల పట్టణాన్ని నాశనం చేయలేదు.—యెహో. 9:3-9, 17-19.

నేడు యుద్ధం చేసే దేశాలు, దేవుని మీద విశ్వాసం చూపించిన వాళ్లను ప్రాణాలతో విడిచిపెట్టట్లేదు. కొన్నిసార్లయితే, సైనికులు యుద్ధాల్లో సాధారణ ప్రజల్ని కూడా చంపేస్తున్నారు.

4. ఇశ్రాయేలీయులు దేవుడు ఇచ్చిన నియమాల ప్రకారం యుద్ధం చేయాలి

గతంలో యెహోవా తన నియమాల ప్రకారమే యుద్ధం చేయాలి అని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఉదాహరణకు, ఏదైనా నగరం మీదికి యుద్ధానికి వెళ్తున్నప్పుడు, ముందు “శాంతి ఒప్పందం” కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలి అని కొన్నిసార్లు దేవుడు చెప్పాడు. (ద్వితీ. 20:10) అంతేకాదు ఇశ్రాయేలు సైన్యం, వాళ్ల సైనిక శిబిరం శుభ్రంగా ఉండాలని, సైనికులందరూ పవిత్రంగా ఉండాలని యెహోవా చెప్పాడు. (ద్వితీ. 23:9-14) తరచూ ఇశ్రాయేలు చుట్టుపక్కల దేశాల సైనికులు, యుద్ధంలో ఓడిపోయిన దేశాల స్త్రీలను పాడుచేసేవాళ్లు. కానీ ఇశ్రాయేలీయులు అలా చేయకూడదని యెహోవా చెప్పాడు. బందీలుగా తీసుకొచ్చిన స్త్రీలను ఒక నెల వరకు పెళ్లి చేసుకోకూడదు అని కూడా ఆయన చెప్పాడు.—ద్వితీ. 21:10-13.

నేడు చాలా దేశాలు యుద్ధ నియమాలు ఉన్న కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకం చేశాయి. సాధారణ ప్రజల్ని కాపాడాలన్నదే ఆ ఒప్పందాల ఉద్దేశం. కానీ చాలా దేశాలు తరచూ అందులోని నియమాల్ని పాటించట్లేదు.

5. దేవుడు తన ప్రజల తరఫున యుద్ధం చేశాడు

ఇశ్రాయేలీయులు యెరికో మీద దాడిచేసినప్పుడు యెహోవా సహాయం చేశాడు. అలా ఏ దేశానికైనా ఇప్పుడు ఆయన సహాయం చేస్తున్నాడా?

గతంలో యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేసి, వాళ్లకు ఎన్నో గొప్ప విజయాలు ఇచ్చాడు. ఉదాహరణకు యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఎలా సహాయం చేశాడో ఆలోచించండి. యెహోవా నిర్దేశం ప్రకారం, ఇశ్రాయేలీయులు “పెద్దగా యుద్ధకేక వేయగానే ప్రాకారం కుప్పకూలింది.” దాంతో వాళ్లు ఆ పట్టణాన్ని చాలా తేలిగ్గా జయించారు. (యెహో. 6:20) అలాగే వాళ్లు అమోరీయులపై ఎలా గెలిచారో ఆలోచించండి. “ఆకాశం నుండి యెహోవా వాళ్ల మీద పెద్దపెద్ద వడగండ్లు కురిపించాడు. . . . నిజానికి ఇశ్రాయేలీయులు కత్తులతో చంపినవాళ్ల కన్నా వడగండ్ల వల్ల చనిపోయినవాళ్లే ఎక్కువ.”—యెహో. 10:6-11.

నేడు యెహోవా ఏ దేశం తరఫునా యుద్ధం చేయట్లేదు. యేసు రాజుగా ఉన్న దేవుని రాజ్యం “ఈ లోకానికి సంబంధించినది కాదు.” (యోహా. 18:36) నిజానికి ఈ లోక ప్రభుత్వాలన్నిటి మీద అధికారం ఉన్నది సాతానుకు. అందుకే, నేడు లోకంలో జరుగుతున్న ఘోరమైన యుద్ధాలు సాతాను వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాయి.—లూకా 4:5, 6; 1 యోహా. 5:19.

నిజక్రైస్తవులు శాంతిని నెలకొల్పే వాళ్లుగా ఉంటారు

ప్రాచీన ఇశ్రాయేలీయుల పరిస్థితికి, మన పరిస్థితికి ఉన్న ఐదు తేడాల్ని మనం చూశాం. అయితే మనం యుద్ధం చేయకపోవడానికి ఇవి మాత్రమే కారణాలు కాదు. వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చివరి రోజుల్లో దేవుని ప్రజలు “యుద్ధం చేయడం నేర్చుకోరు,” అంటే యుద్ధాల్లో పాల్గొనరు అని బైబిలు ముందే చెప్పింది. (యెష. 2:2-4) క్రీస్తు కూడా తన శిష్యులు “లోకానికి చెందినవాళ్లు కాదు” అని చెప్పాడు. కాబట్టి వాళ్లు ఈ లోకంలో జరుగుతున్న గొడవల్లో ఎవ్వరికీ మద్దతివ్వరు.—యోహా. 15:19.

అంతేకాదు క్రైస్తవులు ఇంకో అడుగు ముందుకేసి, ‘శాంతిని నెలకొల్పే వాళ్లుగా’ ఉండాలని, శత్రువుల్ని కూడా ప్రేమించాలని యేసు చెప్పాడు. (మత్త. 5:9, 44) కోపం, పగ, యుద్ధం లాంటి వాటికి దారితీసే స్వభావాన్ని కూడా విడిచిపెట్టమని ఆయన చెప్పాడు.—మత్త. 5:21, 22.

యేసు ఇచ్చిన సలహాల్ని మనం ఎలా పాటించవచ్చు? సాధారణంగా, యుద్ధాల్లో పాల్గొనాలనే కోరిక మనలో ఎవ్వరికీ ఉండదు. కానీ సంఘంలో మాత్రం ఎవరినైనా శత్రువులా చూస్తున్నామా? ఒకవేళ మన మనసులో ఎవరి మీదైనా కోపం ఉంటే, దాన్ని తీసేసుకోవడానికి చేయగలిగినదంతా చేద్దాం.—యాకో. 4:1, 11.

మనం దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల్లో తలదూర్చం. బదులుగా మన మధ్య శాంతిని, ప్రేమను పెంచడానికి కృషి చేస్తుంటాం. (యోహా. 13:34, 35) భవిష్యత్తులో ఈ భూమ్మీద యుద్ధాలే లేకుండా చేస్తానని యెహోవా మాటిచ్చాడు. అప్పటివరకు మనం ఈ లోక విషయాల్లో తలదూర్చకుండా, తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుందాం.—కీర్త. 46:9.

^ కొన్నిసార్లు ఇశ్రాయేలు గోత్రాల మధ్య యుద్ధాలు జరిగాయి. కానీ యెహోవా ఆ యుద్ధాల్ని ఇష్టపడలేదు. (1 రాజు. 12:24) అయితే కొన్ని సందర్భాల్లో, కొన్ని గోత్రాలవాళ్లు దేవునికి ఎదురుతిరిగినప్పుడు లేదా ఘోరమైన పాపాలు చేసినప్పుడు ఇశ్రాయేలు గోత్రాల మధ్య జరిగిన యుద్ధాలకు యెహోవా మద్దతిచ్చాడు.—న్యాయా. 20:3-35; 2 దిన. 13:3-18; 25:14-22; 28:1-8.