కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

ఇశ్రాయేలీయులు ఎడారిలో ఉన్నప్పుడు తినడానికి మన్నా, పూరేడు పిట్టలు తప్ప ఇంకేమీ లేవా?

40 సంవత్సరాలపాటు ఎడారిలో ఉన్న ఇశ్రాయేలీయులు ఎక్కువగా మన్నా తినే కడుపు నింపుకున్నారు. (నిర్గ. 16:35) రెండు సందర్భాల్లో, వాళ్లు తినడానికి యెహోవా పూరేడు పిట్టల్ని కూడా ఇచ్చాడు. (నిర్గ. 16:12, 13; సంఖ్యా. 11:31) అయితే, ఇవే కాకుండా ఇశ్రాయేలీయులు తినడానికి కొన్ని వేరే రకమైన ఆహార పదార్థాలు కూడా ఉండేవి.

ఉదాహరణకు, వాళ్లు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యమధ్యలో “విశ్రాంతి” తీసుకోవడానికి, ఆహారం అలాగే నీళ్లు ఉండేచోట యెహోవా వాళ్లను ఆపేవాడు. (సంఖ్యా. 10:33) అలాంటి ఒక చోటు ఏలీము. అక్కడ “12 నీటి ఊటలు, 70 ఖర్జూర చెట్లు” ఉన్నాయి. (నిర్గ. 15:27) ప్లాంట్స్‌ ఆఫ్‌ ది బైబిల్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది: “ఈ ఖర్జూర చెట్లు రకరకాల ప్రదేశాల్లో పెరిగేవి. . . . ఎడారిలో ప్రయాణించే వాళ్లకు ఆహారాన్ని, నూనెను, ఆశ్రయాన్ని ఇచ్చేవి.”

మనకాలంలో వాడీ ఫెరెన్‌లో భాగమైన ఫెరెన్‌ అనే పెద్ద ఒయాసిస్‌ దగ్గర కూడా ఇశ్రాయేలీయులు ఆగివుంటారు. a ఈ వాడీ ఫెరెన్‌ అనే పెద్ద నీటి లోయ గురించి డిస్కవరింగ్‌ ది వరల్డ్‌ ఆఫ్‌ ది బైబిల్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది: “ఇది 130 కి.మీ. పొడవు ఉంటుంది. పైగా అన్నిటికన్నా పెద్దది, సీనాయి నీటి ఊటల్లో కల్లా చాలా అందమైనది, పేరుగాంచింది. ఈ నీటి ఊట ప్రవేశ మార్గం నుండి 45 కి.మీ ప్రయాణిస్తే మనకు అందమైన ఫెరెన్‌ ఒయాసిస్‌ కనిపిస్తుంది. చుట్టూ ఖర్జూరపు చెట్లతో నిండివున్న ఈ నీటి ఊట సముద్రమట్టానికి 2,000 అడుగుల ఎత్తులో ఉంటుంది, 4.8 కి.మీ. పొడవు ఉంటుంది. దీని అందాన్ని ఏదెను తోటతో పోల్చారు. వేల సంవత్సరాలుగా ఇక్కడున్న ఖర్జూర చెట్ల కోసం చాలామంది ప్రజలు వచ్చేవాళ్లు.”

ఫెరెన్‌ ఒయాసిస్‌లో ఉన్న ఖర్జూర చెట్లు

ఐగుప్తు వదిలి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయులు పిండి ముద్దల్ని, పిండి పిసికే పాత్రల్ని తెచ్చుకున్నారు. వాటితోపాటు బహుశా కొంచెం నూనెను, ధాన్యాన్ని కూడా తెచ్చుకుని ఉంటారు. అయితే, అవి తొందరగానే అయిపోయి ఉంటాయి. ఆ ప్రజలు తమతోపాటు “పశువులు, మందలు కూడా పెద్ద సంఖ్యలో” తెచ్చుకుని ఉంటారు. (నిర్గ. 12:34-39) కానీ ఎడారిలో ఉన్న వాతావరణానికి కొన్ని జంతువులు చనిపోయి ఉంటాయి, కొన్నిటిని వాళ్లు తినుంటారు, మరికొన్నిటిని వాళ్లు బలులు ఇవ్వడానికి, ఆఖరికి అబద్ధ దేవుళ్లకు అర్పించడానికి కూడా ఉపయోగించివుంటారు. b (అపొ. 7:39-43) అయినాసరే, ఇశ్రాయేలీయుల దగ్గర కొన్ని జంతువులు మిగిలివుంటాయి. అలాగని ఎందుకు చెప్పవచ్చంటే, వాళ్లు విశ్వాసం చూపించనప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “మీ కుమారులు ఈ ఎడారిలో 40 సంవత్సరాల పాటు పశువుల కాపరులుగా ఉంటారు.” (సంఖ్యా. 14:33) ఆ పశువుల మందల నుండి పాలు, మాంసం వాళ్లకు దొరికి ఉండవచ్చు. కానీ మరీ 30 లక్షలమందికి 40 సంవత్సరాలపాటు సరిపోయేంత వచ్చుండకపోవచ్చు. c

జంతువులకు ఆహారం, నీళ్లు ఎక్కడి నుంచి వచ్చేవి? d అప్పట్లో వర్షాలు బాగా పడేవి కాబట్టి ఎడారి నిండా పచ్చదనం నిండివుండేది. లేఖనాలపై అంతర్దృష్టి (ఇంగ్లీష్‌) 1వ సంపుటి ఇలా చెప్తుంది: “ఇప్పటితో పోలిస్తే 3,500 సంవత్సరాల క్రితం అరేబియాలో నీళ్లకు ఏ కొదువ ఉండేదికాదు. ఇప్పుడు అక్కడ కనిపించే లోతైన, ఎండిపోయిన లోయలు చూసినప్పుడు ఒకప్పుడు వర్షాలు బాగా పడేవనీ, ఆ నీళ్లన్నీ నదులుగా పారేవనీ అర్థమౌతుంది.” ఎంతైనా ఎడారి ఎడారే. అక్కడ ప్రయాణించాలంటే భయంగానే ఉండేది. (ద్వితీ. 8:14-16) అయితే, యెహోవా అద్భుతరీతిలో వాళ్లకు నీళ్లు ఇవ్వకపోయుంటే, అక్కడున్న ఇశ్రాయేలీయులు, జంతువులు తమ ప్రాణాల్ని కోల్పోయేవాళ్లు.—నిర్గ. 15:22-25; 17:1-6; సంఖ్యా. 20:2, 11.

“మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ యెహోవా నోటినుండి వచ్చే ప్రతీ మాట వల్ల జీవిస్తాడు” అని ఇశ్రాయేలీయులు తెలుసుకునేలా యెహోవా వాళ్లను మన్నాతో పోషించాడని మోషే చెప్పాడు.—ద్వితీ. 8:3.

a 1992, మే 1 కావలికోట (ఇంగ్లీష్‌) సంచికలో 24-25 పేజీలు చూడండి.

b ఎడారిలో ఇశ్రాయేలీయులు, యెహోవాకు జంతువులతో బలి అర్పించిన రెండు సందర్భాల గురించి బైబిలు చెప్తుంది. మొదటి సందర్భం, యాజకుల్ని ఏర్పాటు చేసినప్పుడు. రెండోది, పస్కా. ఈ రెండు సందర్భాలు, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు బయటికి వచ్చిన రెండో సంవత్సరానికే అంటే క్రీ.పూ. 1512లో జరిగింది.—లేవీ. 8:14–9:24; సంఖ్యా. 9:1-5.

c ఇశ్రాయేలీయులు తమ 40 సంవత్సరాల ఎడారి ప్రయాణం చివరికల్లా, కొన్ని వేల జంతువుల్ని దోపుడు సొమ్ముగా తెచ్చుకున్నారు. (సంఖ్యా. 31:32-34) అయినా, వాళ్లు వాగ్దాన దేశంలో అడుగుపెట్టేంత వరకు మన్నానే తిన్నారు.—యెహో. 5:10-12.

d జంతువులు మన్నా తిన్నట్టు బైబిల్లో లేదు. ఎందుకంటే, ఎవరు ఎంత తినగలరో అంతే పోగు చేసుకోమని యెహోవా చెప్పాడు.—నిర్గ. 16:15, 16.