కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

ప్రాచీనకాలంలోని ఇశ్రాయేలీయులు సంగీతాన్ని ఎంత ప్రాముఖ్యంగా చూసేవాళ్లు?

ప్రాచీనకాలంలోని ఇశ్రాయేలీయుల నరనరాల్లో సంగీతం ఉంది. పాటలు పాడడం, సంగీత వాద్యాల్ని వాయించడం గురించి బైబిలు చాలాసార్లు చెప్తుంది. నిజానికి బైబిల్లో దాదాపు పది శాతం పాటలే ఉన్నాయి. ఉదాహరణకు, కీర్తనలు, పరమగీతం, విలాపవాక్యాలు ఈ పుస్తకాలు అంతా పాటలే. అందుకే “ప్రాచీన ఇశ్రాయేలులో సంగీతం రోజువారీ పనుల్లో బాగా కనిపించేది” అని మ్యూజిక్‌ ఇన్‌ బిబ్లికల్‌ లైఫ్‌ అనే పుస్తకం చెప్తుంది.

రోజువారీ జీవితంలో . . . ఇశ్రాయేలీయులు తమ ఫీలింగ్స్‌ ఉట్టిపడేలా సంగీత వాద్యాలను వాయించేవాళ్లు లేదా పాటలు పాడేవాళ్లు. (యెష. 30:29) కొత్త రాజుల్ని అభిషేకించేటప్పుడు, పండుగలు చేసుకునేటప్పుడు లేదా యుద్ధాలు గెలిచినప్పుడు స్త్రీలు కంజీరలు వాయిస్తూ, సంతోషంగా పాటలు పాడుతూ నాట్యం చేసేవాళ్లు. (న్యాయా. 11:34; 1 సమూ. 18:6, 7; 1 రాజు. 1:39, 40) ఏదైనా బాధాకరమైన సందర్భంలో, ఇశ్రాయేలీయులు శోకగీతాలు కూడా పాడేవాళ్లు. (2 దిన. 35:25) నిజంగా “హెబ్రీ ప్రజలకు సంగీతం అంటే ప్రాణం” అని మెక్‌క్లింటాక్‌ అండ్‌ స్ట్రాంగ్స్‌ సైక్లోపీడియా అనే పుస్తకం చెప్తుంది.

రాజుల గృహంలో . . . ఇశ్రాయేలు రాజులకు సంగీతం అంటే చాలా ఇష్టం. రాజైన సౌలు వీణ వాయించడానికి దావీదును తన ఆస్థానానికి పిలిపించుకున్నాడు. (1 సమూ. 16:18, 23) తర్వాత దావీదు రాజైనప్పుడు సంగీత వాద్యాల్ని కనిపెట్టాడు, శ్రావ్యమైన పాటల్ని కూర్చాడు. యెహోవా ఆలయంలో వాద్యాల్ని వాయించేలా ఒక వాద్య బృందాన్ని (orchestra) కూడా ఏర్పాటు చేశాడు. (2 దిన. 7:6; ఆమో. 6:5) రాజైన సొలొమోను తన రాజగృహంలో గాయనీ, గాయకుల్ని సమకూర్చుకున్నాడు.—ప్రసం. 2:8.

ఆరాధనలో . . . అన్నిటికన్నా ముఖ్యంగా ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధన కోసం సంగీతాన్ని ఉపయోగించేవాళ్లు. యెరూషలేము ఆలయంలో 4,000 మంది సంగీతకారులు సంగీత వాద్యాల్ని వాయించేవాళ్లు. (1 దిన. 23:5) వాళ్లు తాళాలు, తంతివాద్యాలు, వీణలు వాయించేవాళ్లు, బాకాలు ఊదేవాళ్లు. (2 దిన. 5:12) అయితే యెహోవాను సంగీతంతో స్తుతించింది ఈ సంగీతకారులు మాత్రమే కాదు. చాలామంది ఇశ్రాయేలీయులు వార్షిక పండుగల కోసం యెరూషలేముకు వెళ్లేటప్పుడు యాత్ర కీర్తనలు పాడేవాళ్లు. (కీర్త. 120–134) అంతేకాదు యూదులు రాసిన కొన్ని పుస్తకాల్లో, పస్కా భోజనం చేసేటప్పుడు ఇశ్రాయేలీయులు హల్లేల్‌ కీర్తనలు a పాడేవాళ్లు అని ఉంది.

నేడు కూడా దేవుని ప్రజలు సంగీతానికి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఇస్తారు. (యాకో. 5:13) ఆరాధనలో మనం పాటలు పాడతాం. (ఎఫె. 5:19) బ్రదర్స్‌-సిస్టర్స్‌తో గొంతు కలిపి పాటలు పాడినప్పుడు మనం వాళ్లకు ఇంకా దగ్గరౌతాం. (కొలొ. 3:16) సంగీతం కష్టాల్లో కూడా మనకు ఎంతో ఊరటను ఇస్తుంది. (అపొ. 16:25) నిజంగా, యెహోవా మీద మనకున్న ప్రేమను, విశ్వాసాన్ని చూపించడానికి సంగీతం ఒక అద్భుతమైన విధానం.

a యెహోవాను స్తుతించడానికి పాడే 113–118 కీర్తనల్ని యూదులు హల్లేల్‌ కీర్తనలు అని పిలిచేవాళ్లు.