కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 40

పాట 30 నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు

యెహోవా “విరిగిన హృదయంగల వాళ్లను” బాగుచేస్తాడు

యెహోవా “విరిగిన హృదయంగల వాళ్లను” బాగుచేస్తాడు

“విరిగిన హృదయంగల వాళ్లను ఆయన బాగుచేస్తాడు; వాళ్ల గాయాలకు కట్టుకడతాడు.”కీర్త. 147:3.

ముఖ్యాంశం

మనసుకైన గాయాలతో బాధపడుతున్న వాళ్లను యెహోవా చాలా ఎక్కువగా పట్టించుకుంటాడు. ఆ వేదన నుండి బయటపడడానికి, వేరేవాళ్లను ఓదార్చడానికి ఆయన ఎలా సహాయం చేస్తాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

1. తన సేవకుల విషయంలో యెహోవా ఎలా ఫీల్‌ అవుతున్నాడు?

 తన సేవకుల జీవితాల్లో జరిగే ప్రతీదాన్ని యెహోవా గమనిస్తున్నాడు. ఆయనకు మన కష్టసుఖాలు తెలుసు. (కీర్త. 37:18) మనం రకరకాల బాధల్లో ఉన్నా, తన సేవలో చేయగలిగినదంతా చేస్తున్నందుకు ఆయన మనల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు సహాయం చేయడానికి, మనల్ని ఓదార్చడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటాడు.

2. విరిగిన హృదయంగల వాళ్లకు యెహోవా ఎలా సహాయం చేస్తాడు? ఆ సహాయం నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

2 యెహోవా ‘విరిగిన హృదయంగల వాళ్ల గాయాలకు కట్టుకడతాడు’ అని కీర్తన 147:3 చెప్తుంది. మనసు విరిగిపోయిన వాళ్లకు యెహోవా మృదువుగా ఎలా సహాయం చేస్తాడో ఈ లేఖనం చూపిస్తుంది. మరి యెహోవా సహాయాన్ని మనం ఎలా పొందవచ్చు? ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. గాయపడిన వ్యక్తి బాగయ్యేలా ఒక మంచి డాక్టర్‌ ఎంతో సహాయం చేయగలడు. అయితే డాక్టర్‌ చెప్పేవన్నీ మంచిగా పాటిస్తేనే గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. అదేవిధంగా యెహోవా చెప్పేవన్నీ పాటిస్తే మనం కూడా చాలా ప్రయోజనం పొందుతాం. ఈ ఆర్టికల్‌లో, మనసుకు తీవ్రంగా గాయమైన వాళ్లకు యెహోవా తన వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడో చూస్తాం. అలాగే ఆయన ప్రేమతో ఇచ్చే సలహాల్ని మనం ఎలా పాటించవచ్చో నేర్చుకుంటాం.

మనం ఎంతో విలువైనవాళ్లమని యెహోవా భరోసా ఇస్తున్నాడు

3. దేనికీ పనికిరానివాళ్లం అని కొంతమందికి ఎందుకు అనిపిస్తుంది?

3 మనం ప్రేమ కరువైన లోకంలో జీవిస్తున్నాం. ఇతరుల మాటల వల్ల, ప్రవర్తన వల్ల చాలామందికి తాము ఎందుకూ పనికిరానివాళ్లమని అనిపిస్తుండవచ్చు. హెలెన్‌ a అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “అసలు ప్రేమంటే ఏంటో తెలియని కుటుంబంలో నేను పెరిగాను. మా నాన్న చాలా క్రూరంగా ఉండేవాడు. మేము దేనికీ పనికిరానివాళ్లమని ప్రతీరోజు అంటుండేవాడు.” బహుశా మీకు కూడా హెలెన్‌ లాంటి పరిస్థితే ఎదురై ఉండవచ్చు. ఎవరైనా మిమ్మల్ని తమ మాటలతో, పనులతో బాధపెట్టారా? ప్రతీదానికి మిమ్మల్ని తప్పుపట్టారా? దేనికీ పనికిరానివాళ్లని అనిపించేలా చేశారా? అలాగైతే మిమ్మల్ని నిజంగా ప్రేమించేవాళ్లు ఉన్నారని నమ్మడం మీకు కష్టంగా ఉండవచ్చు.

4. కీర్తన 34:18 ప్రకారం, యెహోవా మనకు ఏ భరోసా ఇస్తున్నాడు?

4 వేరేవాళ్లు మిమ్మల్ని ఎలా చూసినా, యెహోవా మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, ఆయనకు మీరు చాలా విలువైనవాళ్లని మీరు పూర్తిగా నమ్మవచ్చు. ఆయన “విరిగిన హృదయంగలవాళ్లకు . . . దగ్గరగా ఉంటాడు.” (కీర్తన 34:18 చదవండి.) ఒకవేళ మీరు బాధతో ‘నలిగిపోతుంటే,’ యెహోవా మీలో మంచిని చూసి తనవైపుకు ఆకర్షించుకున్నాడు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. (యోహా. 6:44) మీకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ఎందుకంటే మీరు ఆయనకు చాలా స్పెషల్‌.

5. సమాజం చిన్నచూపు చూసిన వాళ్లతో యేసు ప్రవర్తించిన విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

5 మన గురించి యెహోవా ఎలా ఫీల్‌ అవుతాడో తెలుసుకోవడానికి యేసు ఉదాహరణ సహాయం చేస్తుంది. సమాజం చిన్నచూపు చూసిన వాళ్లను యేసు పట్టించుకున్నాడు, వాళ్లమీద కనికరం చూపించాడు. (మత్త. 9:9-12) చాలా ఏళ్లుగా పెద్ద జబ్బుతో బాధపడుతున్న ఒకామె బాగవ్వాలనే ఆశతో యేసు బట్టల్ని ముట్టుకుంది. అప్పుడు యేసు ఆమెను ఓదార్చాడు, ఆమె చూపించిన విశ్వాసాన్నిబట్టి మెచ్చుకున్నాడు. (మార్కు 5:25-34) యేసు తన తండ్రి ఎలా ఉంటాడో మనకు చూపించాడు. (యోహా. 14:9) కాబట్టి యెహోవాకు మీరు విలువైనవాళ్లు, అలాగే మీకున్న విశ్వాసం, ప్రేమ లాంటి మంచి లక్షణాల్ని ఆయన తప్పకుండా చూస్తున్నాడు అనే నమ్మకంతో ఉండండి.

6. దేనికీ పనికిరాము అనే ఆలోచన నుండి బయటపడడానికి మీరు ఏం చేయవచ్చు?

6 ఎందుకూ పనికిరాము అనే ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఏం చేయవచ్చు? మీరు యెహోవాకు విలువైనవాళ్లని భరోసా ఇచ్చే బైబిలు లేఖనాల్ని చదివి, వాటిగురించి బాగా ఆలోచించండి. b (కీర్త. 94:19) మీరు ఏదైనా లక్ష్యం పెట్టుకుని దాన్ని చేరుకోలేకపోయారా? లేదా వేరేవాళ్లు చేసినంత మీరు చేయలేకపోతున్నారని డీలాపడిపోయారా? అలాగైతే మీరు చేతకానివాళ్లని అస్సలు అనుకోకండి. మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువగా యెహోవా ఆశించడు. (కీర్త. 103:13, 14) ఒకవేళ గతంలో మిమ్మల్ని ఎవరైనా తీవ్రంగా బాధపెడితే, మిమ్మల్ని మీరు నిందించుకోకండి. తప్పు మీది కాదు. యెహోవా తప్పు చేసిన వాళ్లకు తీర్పు తీరుస్తాడు, బాధింపబడ్డ వాళ్లను ఓదారుస్తాడని గుర్తుంచుకోండి. (1 పేతు. 3:12) చిన్నప్పుడు సాండ్రా అనే సిస్టర్‌తో క్రూరంగా ప్రవర్తించారు, ఆమె ఇలా అంటోంది: “యెహోవా నన్ను ఎలా చూస్తున్నాడో నన్ను నేను అలా చూసుకోవడానికి సహాయం చేయమని పదేపదే అడుగుతుంటాను.”

7. మన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల మనం యెహోవా సేవలో ఏం చేయగలుగుతాం?

7 ఈ విషయం మర్చిపోకండి: వేరేవాళ్లకు సహాయం చేయడానికి యెహోవా మిమ్మల్ని తప్పకుండా ఉపయోగించుకుంటాడు. పరిచర్యలో తన తోటి పనివాళ్లుగా ఉండే గొప్ప గౌరవాన్ని ఆయన మీకు ఇచ్చాడు. (1 కొరిం. 3:9) మీ జీవితంలో ఎదురైన చేదు అనుభవాల్ని బట్టి, బాధలో ఉన్నవాళ్లకు ఎలా అనిపిస్తుందో బహుశా మీరైతే ఇంకా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. వాళ్లకు సహాయం కూడా చేయగలుగుతారు. ముందు పేరాల్లో చెప్పిన హెలెన్‌ సహాయం తీసుకుంది, ఇప్పుడు వేరేవాళ్లకు సహాయం చేయగలుగుతోంది. ఆమె ఇలా అంటుంది: “ఎందుకూ పనికిరానిదాన్ని అనే ఆలోచనతో సతమతమయ్యే నన్ను యెహోవా మార్చేశాడు. ఇప్పుడు నేను యెహోవా ప్రేమను పూర్తిగా రుచి చూస్తున్నాను. వేరేవాళ్లకు సహాయం చేసేలా ఆయన నన్ను ఉపయోగించుకుంటున్నాడు.” హెలెన్‌ క్రమపయినీరుగా సంతోషంగా సేవచేస్తోంది.

యెహోవా మిమ్మల్ని క్షమించాడని పూర్తిగా నమ్మండి

8. యెషయా 1:18 లో యెహోవా మనకు ఏమని మాటిస్తున్నాడు?

8 బాప్తిస్మానికి ముందైనా తర్వాతైనా తాము చేసిన పాపాల్ని బట్టి కొంతమంది యెహోవా సేవకులు బాధతో కుమిలిపోతుంటారు. కానీ యెహోవా మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనకోసం విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆ బహుమతిని మనం తీసుకోవాలన్నదే ఆయన కోరిక. ఆయనతో ‘వివాదాన్ని పరిష్కరించుకున్న’ c తర్వాత మన పాపాల్ని పూర్తిగా క్షమిస్తానని యెహోవా మాటిస్తున్నాడు. (యెషయా 1:18 చదవండి.) మనం గతంలో చేసిన తప్పుల్ని యెహోవా మర్చిపోతాడు. అదే సమయంలో మనం చేసిన మంచిని అస్సలు మర్చిపోడు. యెహోవా ఎంత ప్రేమగల దేవుడో కదా!—కీర్త. 103:9, 12; హెబ్రీ. 6:10.

9. గతం గురించి ఆలోచించే బదులు మనం ఏం చేయడానికి ప్రయత్నించాలి?

9 మీరు గతంలో చేసిన తప్పుల గురించి అదేపనిగా బాధపడుతుంటే ఏం చేయవచ్చు? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో, భవిష్యత్తులో ఏం చేయగలరో దానిమీదే మనసు పెట్టడానికి ప్రయత్నించండి. అపొస్తలుడైన పౌలు గురించి ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు క్రైస్తవుల్ని విపరీతంగా హింసించినందుకు ఆయన బాధపడ్డాడు. కానీ యెహోవా తనని క్షమించాడని ఆయనకు తెలుసు. (1 తిమో. 1:12-15) మరి ఆ తర్వాత కూడా గతంలో చేసిన పాపాల గురించే ఆలోచిస్తూ కూర్చున్నాడా? లేదు. యూదా మతంలో ఉన్నప్పుడు ఆయన సాధించిన వాటిగురించి ఎలాగైతే ఆలోచించలేదో, గతంలో చేసిన పాపాల గురించి కూడా ఆలోచించలేదు. (ఫిలి. 3:4-8, 13-15) బదులుగా పౌలు పరిచర్యలో తన బెస్ట్‌ ఇచ్చాడు, భవిష్యత్తు మీద మనసుపెట్టాడు. పౌలులాగే మీరు కూడా గతాన్ని మార్చలేకపోయినా ఇప్పుడు మీరు యెహోవాను స్తుతించగలరు, ఆయన్ని సంతోషపెట్టగలరు. అంతేకాదు ఆయన మాటిచ్చిన బంగారు భవిష్యత్తు కోసం ఎదురుచూడగలరు.

10. గతంలో మీరు ఎవరినైనా నొప్పించి ఉంటే ఏం చేయవచ్చు?

10 గతంలో ఇతరుల్ని నొప్పించినందుకు మీరు బాధపడుతుండవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయవచ్చు? మీ వల్ల బాధపడినవాళ్ల మనసు కుదుటపడడానికి మీరు చేయగలిగినదంతా చేయండి. చేసినదానికి మీరు బాధపడుతున్నారని మీ మాటల్లో, పనుల్లో చూపించండి. (2 కొరిం. 7:11) మీ వల్ల బాధపడినవాళ్లకు అవసరమైన సహాయం చేయమని యెహోవాను అడగండి. ఆయన మీకు, వాళ్లకు తన సేవలో కొనసాగేలా, తిరిగి మనశ్శాంతిని పొందేలా సహాయం చేయగలడు.

11. యోనా ప్రవక్త నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ( చిత్రం కూడా చూడండి.)

11 చేసిన తప్పుల నుండి నేర్చుకోండి, యెహోవా మీకు ఏ పని ఇచ్చినా దాన్ని సంతోషంగా చేయండి. యోనా ప్రవక్తనే తీసుకోండి. యెహోవా ఆయన్ని నీనెవెకు వెళ్లమంటే, ఆయన ఇంకో వైపుకు వెళ్లాడు. అప్పుడు యెహోవా ఆయన్ని సరిదిద్దాడు. చేసిన తప్పు నుండి యోనా పాఠం నేర్చుకున్నాడు. (యోనా 1:1-4, 15-17; 2:7-10) అయితే ఇక యోనా దేనికీ పనికిరాడు అని యెహోవా అనుకోలేదు. బదులుగా ఆయనకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. మళ్లీ నీనెవెకు వెళ్లమని చెప్పినప్పుడు, యోనా ఈసారి వెంటనే ఒప్పుకున్నాడు. యోనా గతంలో చేసిన తప్పు గురించే ఆలోచిస్తూ కూర్చోలేదు గానీ యెహోవా చేయమన్న పని చేశాడు.—యోనా 3:1-3.

పెద్ద చేప కడుపులో నుండి ప్రాణాలతో బయటపడిన తర్వాత యోనా ప్రవక్తను మళ్లీ నీనెవెకు వెళ్లి తన సందేశాన్ని ప్రకటించమని యెహోవా చెప్పాడు (11వ పేరా చూడండి)


పవిత్రశక్తిని ఇచ్చి యెహోవా మనల్ని ఓదారుస్తాడు

12. ఏదైనా అనుకోని సంఘటన జరిగి మీరు షాక్‌లో ఉన్నా, మీవాళ్లు ఎవరైనా చనిపోయినా యెహోవా మీకు శాంతిని ఎలా ఇస్తాడు? (ఫిలిప్పీయులు 4:6, 7)

12 ఏదైనా అనుకోని సంఘటన జరిగి మీరు షాక్‌లో ఉన్నా, మీవాళ్లు ఎవరైనా చనిపోయినా తన పవిత్రశక్తిని ఇచ్చి యెహోవా మిమ్మల్ని ఓదారుస్తాడు. రోన్‌, క్యారల్‌ అనే జంట ఉదాహరణను గమనించండి. వాళ్ల కొడుకు సూసైడ్‌ చేసుకున్నాడు. వాళ్లిలా అంటున్నారు: “మేము ఇప్పటివరకు చాలా కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాం. కానీ ఈ కడుపుకోతను మాటల్లో చెప్పలేం. ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపాం. అప్పుడు యెహోవాకు ప్రార్థించాం. దాంతో ఫిలిప్పీయులు 4:6, 7లో చెప్పిన శాంతిని మేము రుచిచూశాం.” (చదవండి.) గుండె పగిలిపోయేంత కష్టాన్ని మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్నారా? అలాగైతే మీ మనసులో ఉన్నదంతా యెహోవాకు ఎన్నిసార్లయినా, ఎంతసేపైనా చెప్పండి. (కీర్త. 86:3; 88:1) తన పవిత్రశక్తిని ఇవ్వమని పదేపదే అడగండి. అలా అడిగేవాళ్లను ఆయన ఎప్పుడూ కాదనడు.—లూకా 11:9-13.

13. యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగడానికి పవిత్రశక్తి ఎలా సహాయం చేస్తుంది? (ఎఫెసీయులు 3:16)

13 మీరు ఏదైనా పెద్ద కష్టాన్ని ఎదుర్కోవడం వల్ల మీ ఒంట్లో రవ్వంత శక్తి కూడా లేదని మీకు అనిపిస్తుందా? తన సేవలో నమ్మకంగా కొనసాగడానికి యెహోవా తన పవిత్రశక్తిని ఇచ్చి మీకు బలాన్ని ఇవ్వగలడు. (ఎఫెసీయులు 3:16 చదవండి.) ఫ్లోరా సిస్టర్‌ అనుభవాన్ని గమనించండి. ఆమె తన భర్తతో కలిసి మిషనరీగా సేవ చేస్తున్నప్పుడు, తన భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఆమె ఇలా అంటుంది: “ఆయన చేసిన నమ్మకద్రోహం వల్ల నా ప్రాణం విలవిలలాడిపోయింది. అది తప్ప నేనింకా దేని గురించీ ఆలోచించలేకపోయేదాన్ని. ఆ పరిస్థితిని తట్టుకోవడానికి పవిత్రశక్తిని ఇవ్వమని నేను యెహోవాకు ప్రార్థన చేశాను. నా మనసుకైన గాయం మానడానికి అవసరమైన సహాయాన్ని యెహోవా చేశాడు. ఈ పరిస్థితి నుండి అస్సలు బయటపడలేనని అనుకున్నాను. కానీ ఆయన వల్లే నేను గట్టెక్కగలిగాను.” యెహోవా చేసిన సహాయం వల్ల ఫ్లోరాకు దేవుని మీద ఇంకా నమ్మకం పెరిగింది. అలాగే ముందుముందు ఇంకే కష్టం వచ్చినా, ఆయన చూసుకుంటాడనే ధీమాతో ఉంది. ఆమె ఇలా చెప్తుంది: “కీర్తన 119:32 లోని మాటలు నా విషయంలో నిజమయ్యాయి. ‘నీ ఆజ్ఞల మార్గంలో నేను ఆత్రుతతో పరుగెత్తుతాను, ఎందుకంటే నువ్వు నా హృదయాన్ని ధైర్యంగా ఉండేలా చేస్తావు.’”

14. పవిత్రశక్తి కావాలంటే మనం ఏయే పనులు చేయాలి?

14 పవిత్రశక్తిని ఇవ్వమని యెహోవాను అడిగిన తర్వాత మనం ఏం చేయాలి? ఎక్కువ పవిత్రశక్తి కోసం కొన్ని పనుల్ని చేయాలి. అంటే మీటింగ్స్‌కి వెళ్లాలి, ప్రీచింగ్‌ చేయాలి. అంతేకాదు ప్రతీరోజు బైబిలు చదువుతూ యెహోవా ఆలోచనల్ని మనసులో నింపుకోవాలి. (ఫిలి. 4:8, 9) అలా చదువుతుండగా కష్టాల్ని ఎదుర్కొన్న బైబిలు ఉదాహరణల్ని గమనించండి. సహించడానికి యెహోవా వాళ్లకు ఎలా సహాయం చేశాడో బాగా ఆలోచించండి. ముందు చెప్పిన సాండ్రా అనే సిస్టర్‌కి ఒకదాని తర్వాత ఒకటి పెద్దపెద్ద కష్టాలు వచ్చాయి. ఆమె ఇలా చెప్తుంది: “యోసేపు ఉదాహరణ నిజంగా నా మనసును తాకింది. కష్టాలు వచ్చినా, అన్యాయం ఎదుర్కొన్నా యెహోవాతో తనకున్న స్నేహం బలహీనపడకుండా యోసేపు చూసుకున్నాడు.”—ఆది. 39:21-23.

బ్రదర్స్‌-సిస్టర్స్‌ ద్వారా యెహోవా మనల్ని ఓదారుస్తాడు

15. ఎవరు మనకు ఊరటను ఇవ్వగలరు? వాళ్లు మనకు ఏయే విధాలుగా ఊరటను ఇస్తారు? (చిత్రం కూడా చూడండి.)

15 మనం బాధలో ఉన్నప్పుడు మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ మనకు “ఎంతో ఊరటను” ఇవ్వగలరు. (కొలొ. 4:11) యెహోవా ప్రేమకు మన బ్రదర్స్‌-సిస్టర్సే ప్రతిరూపాలని చెప్పాలి. మనం చెప్పేది శ్రద్ధగా వినడం ద్వారా లేదా మన పక్కనే ఉండడం ద్వారా వాళ్లు మనల్ని ఓదారుస్తారు. ఇంకొన్నిసార్లయితే మనకు ధైర్యాన్నిచ్చే బైబిలు లేఖనాన్ని చూపిస్తారు, లేదా మనతో కలిసి ప్రార్థన చేస్తారు. d (రోమా. 15:4) యెహోవా ఆలోచన ఏంటో మనకు గుర్తు చేసి ప్రశాంతంగా ఉండేలా సహాయం చేస్తారు. అంతేకాదు అవసరమైతే మనకు భోజనం వండి పెడతారు, ఇంకా వేరే పనులు కూడా చేసి పెడతారు.

యెహోవాను ప్రేమించే నమ్మదగిన స్నేహితులు మనకు ఎంతో ఊరటను, చేయూతను ఇస్తారు (15వ పేరా చూడండి)


16. వేరేవాళ్ల సహాయం కావాలంటే మనం ఏం చేయాల్సి రావచ్చు?

16 మనకు వేరేవాళ్ల సహాయం కావాలంటే మనమే అడగాల్సి రావచ్చు. మన బ్రదర్స్‌-సిస్టర్స్‌కి మనమంటే చాలా ఇష్టం, మనకు సహాయం చేయాలనే కోరిక కూడా వాళ్లకు ఉంది. (సామె. 17:17) కానీ మనకు ఎలా అనిపిస్తుందో, మనకు ఏం అవసరమో వాళ్లకు తెలీకపోవచ్చు. (సామె. 14:10) మీ మనసుకు ఒకవేళ గాయమైతే, మీకు బాగా దగ్గరైన స్నేహితులతో మాట్లాడి మీకెలా అనిపిస్తుందో చెప్పండి. వాళ్లు మీకోసం ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. మీరు మనసువిప్పి మాట్లాడగలరని అనిపించే ఒకరిద్దరు పెద్దలతో కూడా మాట్లాడండి. కొంతమంది సిస్టర్స్‌కైతే ఇంకొక పరిణతిగల సిస్టర్‌తో మాట్లాడడం ఊరటను ఇచ్చింది.

17. యెహోవా ఇచ్చే ప్రోత్సాహాన్ని పొందకుండా మనల్ని ఏది ఆపవచ్చు? మరైతే మనం ఏం చేయాలి?

17 అందరికీ దూరంగా ఒక్కళ్లే ఉండాలని అనుకోకండి. బ్రదర్స్‌-సిస్టర్స్‌తో టైం గడపండి. మీ గుండె బరువెక్కినప్పుడు మీకు ఎవ్వరితో మాట్లాడాలని అనిపించకపోవచ్చు. కొన్నిసార్లు కొందరు బ్రదర్స్‌-సిస్టర్స్‌ మనల్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు లేదా మనల్ని నొప్పించేలా ఒక మాట అనొచ్చు. (యాకో. 3:2) ఇలాంటి కారణాలవల్ల మిమ్మల్ని ప్రోత్సహించడానికి యెహోవా ఉపయోగించే మీ బ్రదర్స్‌-సిస్టర్స్‌కి దూరం కాకండి. డిప్రెషన్‌తో బాధపడుతున్న గ్యావిన్‌ అనే సంఘపెద్ద ఇలా అంటున్నాడు: “చాలాసార్లు నాకు ఫ్రెండ్స్‌తో మాట్లాడాలని, టైం గడపాలని అనిపించదు.” కానీ గ్యావిన్‌ తన ఫీలింగ్స్‌ని పక్కనపెట్టి బ్రదర్స్‌-సిస్టర్స్‌తో టైం గడపడానికి ప్రయత్నించాడు. దానివల్ల చాలాసార్లు ఆయనకు మంచిగా అనిపించేది. యామి అనే సిస్టర్‌ ఇలా చెప్తుంది: “గతంలో నాకు జరిగినదాన్ని బట్టి మనుషుల్ని నమ్మడం నాకు చాలా కష్టం. కానీ యెహోవా దేవుడు నా బ్రదర్స్‌-సిస్టర్స్‌ని ప్రేమిస్తున్నాడు, వాళ్లని నమ్ముతున్నాడు. కాబట్టి నేను కూడా యెహోవాలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అది యెహోవాను సంతోషపెడుతుందని నాకు తెలుసు. అది నాకు కూడా సంతోషాన్నిస్తుంది.”

భవిష్యత్తు కోసం ఆశగా ఎదురుచూస్తూ ఓదార్పు పొందండి

18. మనం దేనికోసం ఎదురుచూడవచ్చు? ఇప్పుడు మనం ఏం చేయవచ్చు?

18 త్వరలో యెహోవా మన మనసుకు, శరీరానికి అయిన గాయాల్ని పూర్తిగా బాగుచేస్తాడని తెలుసుకుని భవిష్యత్తు కోసం ఆశగా ఎదురుచూడవచ్చు. (ప్రక. 21:3, 4) అప్పుడు మనకు ఎదురైన చేదు అనుభవాలేవీ మన “హృదయంలో కూడా ఉండవు.” (యెష. 65:17) ఇప్పుడు కూడా యెహోవా మన ‘గాయాలకు కట్టు కడుతున్నాడని’ మనం నేర్చుకున్నాం. మనల్ని ఓదార్చడానికి, ఊరటను ఇవ్వడానికి యెహోవా ప్రేమతో చేసిన ఏర్పాట్ల నుండి పూర్తి ప్రయోజనం పొందండి. “ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది” అని అస్సలు మర్చిపోకండి.—1 పేతు. 5:7.

పాట 7 యెహోవా, మన బలం

a కొన్ని పేర్లను మార్చాం.

b  మీరు యెహోవాకు అమూల్యమైనవాళ్లు” అనే బాక్సు చూడండి.

c యెహోవాతో మన “వివాదాన్ని పరిష్కరించుకోవడం” అంటే మనం పశ్చాత్తాపపడ్డాం అని నిరూపించుకోవడం. మనం చేసిన తప్పుకు యెహోవాను క్షమాపణ అడగాలి, మన ప్రవర్తనను మార్చుకోవాలి. ఒకవేళ ఘోరమైన పాపం చేస్తే సంఘపెద్దల సహాయం కూడా తీసుకోవాలి.—యాకో. 5:14, 15.

d ఉదాహరణకు మంచి క్రైస్తవులుగా ఉండడానికి ఉపయోగపడే లేఖనాలు అనే పుస్తకంలో “ఆందోళన,” “ఊరట” అనే అంశాల కిందున్న లేఖనాల్ని చూడండి.