1924—వంద సంవత్సరాల క్రితం
“సంవత్సరం మొదట్లో ఉన్నాం కాబట్టి, బాప్తిస్మం తీసుకున్న ప్రతీ క్రైస్తవుడు వేర్వేరు విధానాల్లో యెహోవా సేవ చేసే అవకాశాల కోసం చూడడానికి ఇదే మంచి సమయం” అని 1924 జనవరి బులెటిన్‌లో a వచ్చింది. సంవత్సరం ముందుకు వెళ్తుండగా, బైబిలు విద్యార్థులు ఈ మాటల్ని రెండు విధానాల్లో పాటించారు: కొత్తకొత్త పద్ధతుల్ని మొదలుపెట్టారు, ధైర్యంగా ప్రకటించారు.
రేడియోతో చేసిన సాహసాలు
బెతెల్‌లో ఉన్న బ్రదర్స్, న్యూయార్క్ సిటీలో ఉన్న స్టేటన్ ఐలాండ్‌లో WBBR రేడియో స్టేషన్‌ని కట్టడానికి దాదాపు సంవత్సరం నుండి పనిచేస్తున్నారు. చెట్లను నరికేసి నేలను చదును చేసిన తర్వాత అక్కడ పనిచేసే వాళ్లకోసం ఒక పెద్ద ఇంటిని, పరికరాలు పెట్టడానికి ఒక బిల్డింగ్‌ని కట్టారు. ఈ పనంతా పూర్తయ్యాక రేడియో ద్వారా ప్రసారం చేయడానికి అవసరమైన పరికరాల్ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. కానీ వాళ్లు దాటాల్సిన అడ్డంకులు చాలా ఉన్నాయి.
రేడియో స్టేషన్‌కు సంబంధించిన పెద్ద యాంటినాను నిలబెట్టడం బ్రదర్స్‌కి చాలా కష్టమైంది. అది 300 అడుగుల (91 మీటర్ల) ఎత్తు ఉంది. దాన్ని 200 అడుగుల (61 మీటర్ల) ఎత్తున్న రెండు కర్రల మధ్య వేలాడదీయాలి. మొదటి ప్రయత్నంలో అవలేదు. కానీ యెహోవా సహాయంతో చివరికి సాధించారు. ఈ పనిలో చేయందించిన బ్రదర్ క్యాల్విన్ ప్రోస్సెర్ ఇలా అంటున్నాడు: “మొదటిసారే యాంటినాని పెట్టుంటే మేము ఒకరినొకరం భుజాలు తట్టుకుని ‘ఎంతబాగా చేశాం, చూడు’ అని గర్వంగా ఫీల్ అయ్యేవాళ్లం.” కానీ బ్రదర్స్ ఘనతంతా యెహోవాకు ఇచ్చారు. అయితే వాళ్లముందు ఇంకా వేరే అడ్డంకులు కూడా ఉన్నాయి.
అప్పట్లో రేడియో ప్రసారాలు అందరికీ కొత్తే. కాబట్టి దానికి అవసరమైన పరికరాలు అంత ఈజీగా దొరికేవి కావు. ఎవరో సొంతగా తయారుచేసి, వాడేసిన 500 వాట్‌ల ట్రాన్స్‌మిటర్‌ని బ్రదర్స్ తెచ్చుకున్నారు. మైక్‌ని కొనే బదులు, మామూలు టెలిఫోన్‌లో ఉండే మైక్‌ని ఉపయోగించారు. ఇలా కిందామీదా పడి తయారుచేసిన దాన్ని, టెస్ట్ చేయాలని ఫిబ్రవరిలో ఒకరోజు రాత్రి బ్రదర్స్ అనుకున్నారు. ఏదోకటి ప్రసారం చేయాలి కాబట్టి బ్రదర్స్ రాజ్య గీతాల్ని పాడారు. బ్రదర్స్ పాడుతున్నప్పుడు ఒక కామెడీ జరిగింది. వీళ్ల పాటల్ని తన రేడియోలో విని దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రూక్లిన్ నుండి b కాల్ చేయడం ఎర్నెస్ట్ లోవ్ బ్రదర్ గుర్తుచేసుకున్నాడు.
జడ్జ్ రూథర్‌ఫర్డ్“ఆ గోలను ఆపండి. మీరు పాడుతున్నట్టు లేదు అరుస్తున్నట్టు ఉంది” అని బ్రదర్ రూథర్‌ఫర్డ్ అన్నారు. సిగ్గుతో నాలుక కరుచుకుని, బ్రదర్స్ వెంటనే ట్రాన్స్‌మిటర్‌ని ఆపేశారు. కానీ రేడియో బాగా పనిచేస్తుందని, ఇక మొదటి ప్రసారానికి అంతా రెడీ అని వాళ్లకు అర్థమైపోయింది.
1924, ఫిబ్రవరి 24న మొట్టమొదటి రేడియో కార్యక్రమం ప్రసారమైంది. అందులో బ్రదర్ రూథర్‌ఫర్డ్ రేడియో స్టేషన్‌ని “మెస్సీయ రాజ్య పనుల కోసం” సమర్పించారు. “తమ మతం ఏదైనా ప్రతీఒక్కరు బైబిల్లో ఉన్న విషయాల్ని తెలుసుకునేలా, మన కాలం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకునేలా సహాయం చేయడానికి” ఈ రేడియో స్టేషన్‌ని మొదలుపెట్టామని చెప్పారు.
మొట్టమొదటి ప్రసార కార్యక్రమం దుమ్ము లేపేసింది. తర్వాత 33 సంవత్సరాల వరకు సంస్థ అందించిన రేడియో ప్రసార కార్యక్రమాలు ఎక్కువగా WBBR నుండే ప్రసారమయ్యేవి.
మతనాయకుల్ని నిలదీశారు
1924, జూలైలో ఒహాయోలోని కొలంబస్‌లో ఒక సమావేశం జరిగింది. దానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల నుండి బ్రదర్స్-సిస్టర్స్ వచ్చారు. ప్రసంగాలు అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, హంగేరియన్, ఇటాలియన్, లిథువేనియన్, పోలిష్, రష్యన్, యుక్రేనియన్ అలాగే స్కాండినేవియన్ భాషల్లోకి అనువదించారు. కార్యక్రమంలోని కొన్ని ప్రసంగాల్ని రేడియోలో కూడా ప్రసారం చేశారు. ప్రతీరోజు సమావేశంలో జరిగిన వాటి గురించి ఒహాయో స్టేట్ జర్నల్ అనే న్యూస్ పేపర్‌లో ఆర్టికల్స్‌ని రాయించారు.
గురువారం, జూలై 24న సమావేశానికి వచ్చిన 5000 కన్నా ఎక్కువమంది బ్రదర్స్-సిస్టర్స్ ప్రీచింగ్‌కి వెళ్లారు. ఆరోజు వాళ్లు దాదాపు 30,000 పుస్తకాల్ని ఇచ్చారు, ఎన్నో వేల బైబిలు స్టడీల్ని మొదలుపెట్టారు. “సమావేశంలో అన్నిటికన్నా సంతోషకరమైన సమయం ఇదే” అని కావలికోట చెప్పింది.
సమావేశంలో మరో ముఖ్యమైన సంఘటన జరిగింది. జూలై 25, శుక్రవారం రోజున బ్రదర్ రూథర్‌ఫర్డ్ ఒక ప్రసంగంలో మతనాయకుల అరాచకాల్ని ఖండిస్తూ ధైర్యంగా ఒక డాక్యుమెంట్‌ని చదివాడు. దాన్ని చట్టపరమైన డాక్యుమెంట్‌లా తయారుచేశారు. అందులో రాజకీయ నాయకులను, మతనాయకులను, పెద్దపెద్ద బిజినెస్ చేసేవాళ్లను ఖండిస్తూ, “దీవెనలకు దారితీసే దేవుని రాజ్యం గురించి ప్రజలు తెలుసుకోకుండా వాళ్లు ఆపుతున్నారని” ఉంది. అంతేకాదు వాళ్లు ఇంకో తప్పు కూడా చేశారని
ఆ డాక్యుమెంట్ ఖరాఖండిగా చెప్పేసింది. అదేంటంటే “నానాజాతి సమితికి మద్దతిస్తూ, ‘భూమిని పరిపాలించడానికి దేవుడు దాన్ని ఉపయోగిస్తున్నాడు’ అని వాళ్లు చెప్పారు.” ఈ విషయాల్ని అందరికీ చెప్పాలంటే బైబిలు విద్యార్థులకు చాలా ధైర్యం అవసరం.సమావేశం బ్రదర్స్‌ను ఎంతగా కదిలించిందో వివరిస్తూ కావలికోట ఇలా చెప్పింది: “కొలంబస్ సమావేశానికి వచ్చిన ఈ చిన్ని సైన్యం తమ విశ్వాసాన్ని బలపర్చుకుని తిరిగెళ్లారు . . . , ఎంత వ్యతిరేకత వచ్చినా, ఆరునూరైనా నూరుఆరైనా, ధైర్యంగా ప్రకటించాలని వాళ్లు నిశ్చయించుకున్నారు.” సమావేశానికి హాజరైన బ్రదర్ లియో క్లాస్ ఇలా గుర్తుచేసుకున్నాడు: “సమావేశం అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్‌ని మా ప్రాంతంలో ఎప్పుడెప్పుడు పంచిపెడతామా అని ఆత్రంగా ఎదురుచూశాం.”
అక్టోబరులో బైబిలు విద్యార్థులు ఎక్లిసియాస్టిక్స్ ఇండిక్టెడ్ అనే కరపత్రాన్ని వేల కాపీల్లో పంచిపెట్టడం మొదలుపెట్టారు. అందులో సమావేశంలో బ్రదర్ రూథర్‌ఫర్డ్ చదివిన సమాచారం ఉంది. ఓక్లహోమాలోని క్లీవ్‌లాండ్ అనే చిన్న నగరంలో ఫ్రాంక్ జాన్‌సన్ కరపత్రాల్ని పంచిపెట్టేశాడు. ఓ 20 నిమిషాల తర్వాత కొంతమంది బ్రదర్స్-సిస్టర్స్ ఆయన్ని కలవాల్సి ఉంది. ఆయన చేసిన ప్రకటనా పనివల్ల ఆ ఊరివాళ్లు ఆయన్ని పట్టుకోవాలని కోపంతో చూస్తున్నారు. దానివల్ల బ్రదర్ జాన్‌సన్ బయట అందరిముందు ఉండలేక దగ్గర్లో ఉన్న ఒక చర్చీలో దాక్కోవాలని అనుకున్నాడు. ఆ చర్చీలో ఎవరూ లేకపోవడంతో కరపత్రాల్ని పాస్టర్ బైబిల్లో, అలాగే ప్రతీ సీట్లో ఒక్కొక్కటి గబగబా పెట్టుకుంటూ అక్కడ నుండి బయటపడ్డాడు. ఇంకా టైం ఉండేసరికి ఆయన ఇంకో రెండు చర్చీల్లోకి వెళ్లి అదే పని చేశాడు.
తర్వాత బ్రదర్స్-సిస్టర్స్ ఆయన్ని ఎక్కడైతే కలవమన్నారో అక్కడికి ఆయన త్వరత్వరగా వచ్చేశాడు. తనని పట్టుకోవడానికి వస్తున్నవాళ్లను ఒక కంట కనిపెడుతూ ఆయన పెట్రోల్ బంక్ వెనకాల దాక్కున్నాడు. వాళ్లు ఆయన కళ్లముందే డ్రైవ్ చేసుకుని వెళ్లారు గానీ ఆయన్ని చూడలేదు. వాళ్లు అలా వెళ్లారో లేదో వేరే చోట ప్రీచింగ్ చేస్తున్న మన బ్రదర్స్-సిస్టర్స్ వచ్చి బ్రదర్ ఫ్రాంక్‌ని పికప్ చేసుకున్నారు.
వాళ్లలో ఒక బ్రదర్ ఇలా గుర్తుచేసుకున్నాడు: “మేము ఆ నగరం నుండి బయటికి వచ్చేస్తున్నప్పుడు ఆ మూడు చర్చీలను దాటుకుంటూ వెళ్లాం. ప్రతీ చర్చీ బయట దాదాపు 50 మంది నిల్చొని ఉన్నారు. కొంతమందేమో కరపత్రాల్ని చదువుతున్నారు. ఇంకొంతమంది కరపత్రాల్ని పాస్టర్‌కి చూపిస్తున్నారు. మేము తృటిలో తప్పించుకున్నాం! వాళ్ల చేతిలో పడకుండా కాపాడినందుకు, ప్రకటనా పని చేసేలా సహాయం చేసినందుకు మేము యెహోవాకు థ్యాంక్స్ చెప్పాం.”
వేరే దేశాల్లో ధైర్యంగా ప్రకటించడం
వేరే దేశాల్లో కూడా బైబిలు విద్యార్థులు ధైర్యంగా ప్రకటించారు. ఉత్తర ఫ్రాన్స్‌లో జోసఫ్ క్రెట్ అనే బ్రదర్, పోలండ్ గనుల్లో పనిచేసి ఫ్రాన్స్‌కు వలస వచ్చిన వాళ్లకు సాక్ష్యం ఇచ్చాడు. కొద్ది రోజుల్లో ఆయన, “చనిపోయినవాళ్లు త్వరలో పునరుత్థానం అవుతారు” అనే అంశంతో ప్రసంగం ఇవ్వాలి. ఆ ప్రసంగానికి నగరంలో ఉన్న వాళ్లను ఆహ్వానించినప్పుడు అక్కడి పాస్టర్ తన చర్చీ సభ్యులకు ఆ ప్రసంగానికి వెళ్లొద్దని చెప్పాడు. కానీ ఎవ్వరూ ఆయన మాట వినలేదు. ఆ ప్రసంగానికి 5000 మంది వచ్చారు, ఆసక్తికరంగా ఆ పాస్టర్ కూడా హాజరయ్యాడు. అప్పుడు బ్రదర్ క్రెట్ ఆ పాస్టర్‌ని పిలిచి తన నమ్మకాల్ని నిరూపించమని అన్నాడు, కానీ ఆ పాస్టర్ దానికి ఒప్పుకోలేదు. అక్కడి ప్రజలు దేవుని వాక్యంలో ఉన్న విషయాలు తెలుసుకోవడం కోసం తపిస్తున్నారని గమనించి, బ్రదర్ క్రెట్ తన దగ్గరున్న ప్రచురణలన్నీ వాళ్లకు పంచిపెట్టాడు.—ఆమో. 8:11.
ఆఫ్రికాలో ప్రస్తుతం ఘానా అని పిలుస్తున్న గోల్డ్ కోస్ట్ దేశంలో క్లాడ్ బ్రౌన్ అనే బ్రదర్ మంచివార్తను ప్రకటించాడు. ఆయన ఇచ్చిన ప్రసంగాలు, పంచిపెట్టిన ప్రచురణల వల్ల ఆ దేశంలో సత్యం వేగంగా వ్యాప్తి చెందింది. బ్రదర్ బ్రౌన్ ఇచ్చిన ఒక ప్రసంగాన్ని ఫార్మసి చదువుతున్న జాన్ బ్లాంక్సన్ విన్నాడు. ఇదే సత్యమని అతనికి వెంటనే అర్థమైంది. దాని గురించి జాన్ ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “సత్యం తెలుసుకున్నప్పుడు నేను ఆనందంలో
తేలిపోయాను. దాని గురించి మా ఫార్మసి కాలేజీలో చాలామందితో మాట్లాడాను.”దేవుడు త్రిత్వంలో ఒక భాగం కాదని జాన్ బైబిలు నుండి నేర్చుకున్నాడు. ఆయన ఒకరోజు చర్చికి వెళ్లి దాని గురించి పాస్టర్‌ని అడిగాడు. ఆ పాస్టర్ అరుస్తూ “నువ్వు క్రైస్తవుడివి కాదు, అపవాదికి చెందినవాడివి. ఇక్కడి నుండి వెళ్లిపో!” అని అతన్ని బయటికి గెంటేశాడు.
జాన్ ఇంటికి వెళ్లి, త్రిత్వం నిజమో కాదో అందరిముందు నిరూపించమని ఆ పాస్టర్‌కి ఉత్తరం రాశాడు. అప్పుడు ఆ పాస్టర్ ఫార్మసి కాలేజీ ముఖ్య లెక్చరర్ ఆఫీసుకు రమ్మని జాన్‌కి చెప్పాడు. ఆ లెక్చరర్ జాన్‌ని, తను నిజంగానే ఆ పాస్టర్‌కి ఉత్తరం రాశాడా అని అడిగాడు.
“నేను రాశాను సార్” అని జాన్ అన్నాడు.
దాంతో పాస్టర్‌ని క్షమాపణ అడుగుతూ ఒక ఉత్తరం రాయమని ఆ లెక్చరర్ జాన్‌కి చెప్పాడు. అప్పుడు జాన్ ఇలా రాశాడు:
“పాస్టర్ గారు, మిమ్మల్ని క్షమాపణ అడుగుతూ ఉత్తరం రాయమని మా లెక్చరర్ చెప్పాడు. అయితే మీరు నేర్పిస్తున్నది అబద్ధ బోధని ఒప్పుకుంటే నేను క్షమాపణ అడగడానికి రెడీ.”
అది చూసి ఆ లెక్చరర్ షాక్ అయిపోయి, “జాన్, ఇదేనా నువ్వు రాయాలనుకున్నది?” అని అడిగాడు.
“అవును సార్. దానికి మించి నేనేమీ రాయలేను.”
“నిన్ను కాలేజీ నుండి తీసేస్తాం. ప్రభుత్వం మద్దతిచ్చే చర్చీ పాస్టర్‌కి వ్యతిరేకంగా మాట్లాడి ఈ కాలేజీలో ఉండగలవని ఎలా అనుకుంటున్నావు?”
“కానీ సార్ . . . మీరు మాకు పాఠం చెప్పేటప్పుడు మాకు ఏమైనా అర్థంకాకపోతే మేము మిమ్మల్ని ప్రశ్నలు అడగకూడదా?”
“అడగొచ్చు.”
“పాస్టర్‌తో కూడా అదే జరిగింది. ఆయన మాకు బైబిలు గురించి నేర్పిస్తున్నప్పుడు నేను ఆయన్ని ఒక ప్రశ్న అడిగాను. ఆ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేకపోతే నేను ఎందుకు క్షమాపణ అడగాలి?”
జాన్ క్షమాపణ అడగడం గానీ, ఆయన్ని కాలేజీ నుండి తీసేయడం గానీ జరగలేదు.
ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం
ఆ సంవత్సరంలో జరిగిన పనంతటి గురించి కావలికోట ఇలా చెప్పింది: “మనం నిజంగా దావీదు అన్న మాటలతో ఒప్పుకుంటాం: ‘యుద్ధం కోసం నువ్వు నాకు శక్తినిస్తావు.’ (కీర్తన 18:39) ఈ సంవత్సరం మనందరం చాలా ప్రోత్సాహాన్ని పొందాం. ఎందుకంటే యెహోవా మనకు తన పనిలో ఎంత సహాయం చేశాడో కళ్లారా చూశాం . . . తన నమ్మకమైన సేవకులు . . . సంతోషంగా మంచివార్తను చాటి చెప్తున్నారు.”
ఆ సంవత్సరం చివర్లో, బ్రదర్స్ ఇంకో కొత్త రేడియో స్టేషన్‌ని మొదలుపెట్టాలని ప్లాన్ చేశారు. ఆ పనులు చికాగో దగ్గర్లో మొదలుపెట్టారు. ఆ కొత్త రేడియో స్టేషన్ పేరు WORD, దానర్థం వాక్యం. ఆ పేరు సరిగ్గా సరిపోతుందని చెప్పాలి, ఎందుకంటే రేడియో ద్వారా వాళ్లు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. ఈ రేడియో స్టేషన్ 5000 వాట్‌ల ట్రాన్స్‌మిటర్‌ని ఉపయోగించి, ఎన్నో వందల కిలోమీటర్ల దూరం వరకు, చివరికి ఉత్తర కెనడా వరకు రాజ్య సందేశాన్ని తీసుకెళ్తుంది.
తర్వాతి సంవత్సరంలో, అంటే 1925 లో ఆధ్యాత్మిక వెలుగు ఇంకా ఎక్కువగా ప్రకాశించబోతోంది. బైబిలు విద్యార్థులు ప్రకటన 12వ అధ్యాయానికి సంబంధించి కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొంతమందికి ఆ విషయాలు అడ్డురాయిలా అనిపించాయి. కానీ చాలామంది, పరలోకంలో జరిగిన ఆ విషయాలు భూమ్మీదున్న దేవుని ప్రజలపై ఎలా ప్రభావం చూపించాయో తెలుసుకున్నందుకు సంతోషించారు.
a ప్రస్తుతం దీన్ని మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్ వర్క్‌బుక్ అని పిలుస్తున్నాం.
b జె.ఎఫ్. రూథర్‌ఫర్డ్ అప్పట్లో బైబిలు విద్యార్థులు చేసే పనిని ముందుండి నడిపించాడు. ఆయన్ని “జడ్జ్” రూథర్‌ఫర్డ్ అని కూడా పిలిచేవాళ్లు. ఆయన బెతెల్‌లో సేవ చేయకముందు అప్పుడప్పుడు ఎనిమిదవ జుడిషియల్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ మిస్సోరీలో ప్రత్యేక జడ్జ్‌గా పనిచేసేవాడు.