కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉండండి

ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉండండి

“చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము.”1 తిమో. 4:13.

పాటలు: 45, 42

1, 2. (ఎ) యెషయా 60:22లో ఉన్న మాటలు నేడు ఎలా నిజమయ్యాయి? (బి) యెహోవా సంస్థలోని భూభాగంలో ప్రస్తుతం ఏ అవసరం ఉంది?

 “ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును.” (యెష. 60:22) ఈ మాటలు నేడు మనం జీవిస్తున్న చివరిరోజుల్లో నిజమవ్వడాన్ని కళ్లారా చూస్తున్నాం. 2015లో ప్రపంచవ్యాప్తంగా రాజ్యసువార్త ప్రకటించిన యెహోవా సేవకుల సంఖ్య 82,20,105. తన ప్రజల సంఖ్య పెరగడం గురించి యెహోవా ఇలా చెప్పాడు, “యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” కాబట్టి కాలం గడిచేకొద్దీ మనందరం చేయడానికి చాలా పని ఉంటుంది. మరి ఇప్పుడు మనం సువార్త ప్రకటించడానికి, బోధించడానికి చేయగలిగినదంతా చేస్తున్నామా? ఇప్పటికే చాలామంది సహోదరసహోదరీలు క్రమపయినీర్లుగా, సహాయ పయినీర్లుగా సేవ చేస్తున్నారు. కొంతమంది అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవచేస్తున్నారు. మరికొంతమంది రాజ్యమందిరాలు నిర్మించే పనిలో కష్టపడి పనిచేస్తున్నారు.

2 ప్రతీ సంవత్సరం దాదాపు 2,000 కొత్త సంఘాలు ఏర్పడుతున్నాయి, కాబట్టి పనిచేసేవాళ్లు చాలామంది అవసరమని అర్థమౌతోంది. ఉదాహరణకు ఆ కొత్త సంఘాల్లో సేవచేయడానికి సంఘపెద్దలు, సంఘ పరిచారకులు అవసరం. ప్రతీ సంవత్సరం వేలమంది సంఘ పరిచారకులు సంఘపెద్దలుగా, వేలమంది ఇతర సహోదరులు సంఘ పరిచారకులుగా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరముంది. దీన్నిబట్టి మనం “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై” ఉండాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే కేవలం సహోదరులే కాదు సహోదరీలు చేయాల్సిన పని కూడా ఎంతో ఉంది.—1 కొరిం. 15:58.

ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి ఏమి అవసరం?

3, 4. మీరు ఏ విషయంలో ప్రగతి సాధించాలని కోరుకుంటున్నారు?

3 1 తిమోతి 3:1 చదవండి. పర్యవేక్షకులుగా సేవచేసేందుకు అర్హత సంపాదించడానికి కృషిచేస్తున్న సహోదరులను అపొస్తలుడైన పౌలు మెచ్చుకున్నాడు. ఉదాహరణకు ఓ వ్యక్తి, దూరంలో ఉన్న ఏదైనా వస్తువును అందుకోవాలంటే కొంచెం కృషి చేయాలి, బహుశా తన చేతిని కాస్త ముందుకు చాపాల్సిన అవసరం కూడా రావచ్చు. ఇప్పుడు ఓసారి, సంఘ పరిచారకుడు అవ్వాలని కోరుకుంటున్న ఓ సహోదరుని గురించి ఆలోచించండి. ముందుగా అతను క్రైస్తవ లక్షణాల్ని మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరముందని గుర్తించి, దానికోసం కృషిచేస్తాడు. అతను సంఘ పరిచారకునిగా సేవ చేయడం మొదలుపెట్టాక, సంఘపెద్దగా సేవచేసేందుకు ఉండాల్సిన అర్హతల్ని సంపాదించడానికి కృషిచేస్తాడు.

4 కొంతమంది సహోదరసహోదరీలు మరింత ఎక్కువగా యెహోవా సేవ చేయాలని కోరుకుంటున్నారు. అందుకోసం వాళ్ల జీవితాల్లో అవసరమైన మార్పులు చేసుకుంటున్నారు. ఉదాహరణకు కొంతమంది పయినీర్లుగా సేవచేయాలనుకోవచ్చు. మరికొంతమంది బెతెల్‌లో, రాజ్యమందిరాలు నిర్మించే పనిలో సేవచేయాలని కోరుకోవచ్చు. అయితే ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉండేందుకు బైబిలు మనందరికీ ఎలా సహాయం చేయగలదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూనే ఉండండి

5. యౌవనులు తమ బలాన్ని రాజ్యసేవ కోసం ఎలా ఉపయోగించవచ్చు?

5 యౌవనులు బలంగా, ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి యెహోవా సేవ ఎక్కువ చేయగలుగుతారు. (సామెతలు 20:29 చదవండి.) బెతెల్‌లో సేవచేస్తున్న కొంతమంది యౌవన సహోదరులు పుస్తకాలను, బైబిళ్లను ప్రింట్‌ చేయడంలో, బైండింగ్‌ చేయడంలో సహాయం చేస్తున్నారు. చాలామంది యౌవన సహోదరసహోదరీలు రాజ్యమందిరాలను కట్టడంలో లేదా వాటిని రిపేరు చేయడంలో సహాయం చేస్తున్నారు. కొంతమందేమో, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అంతేకాదు పయినీర్లుగా సేవచేస్తున్న చాలామంది యౌవనులు కొత్త భాష నేర్చుకుంటున్నారు లేదా సువార్త ప్రకటించడానికి వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు.

6-8. (ఎ) ఓ యువకుడు యెహోవా సేవ విషయంలో తనకున్న అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నాడు? (బి) ‘యెహోవా ఉత్తముడని’ మనమెలా రుచి చూసి తెలుసుకోవచ్చు?

6 మనం యెహోవాను ప్రేమిస్తాం, ఆయనకు శ్రేష్ఠమైనది ఇవ్వాలనుకుంటాం. అయినప్పటికీ, ఏరన్‌ అనే సహోదరునికి అనిపించినట్టే మనకు కూడా అనిపించవచ్చు. ఏరన్‌కు యెహోవా సేవ చేస్తూ సంతోషంగా ఉండాలనే కోరిక ఉండేది, కానీ అలా ఉండలేకపోయేవాడు. అతను చిన్నప్పటి నుండి మీటింగ్స్‌కు వెళ్తున్నాడు, ప్రకటనాపని చేస్తున్నాడు. కానీ అతనిలా చెప్తున్నాడు, “నాకు మీటింగ్స్‌, ప్రీచింగ్‌ బోర్‌ కొట్టేవి.” మరి అతనేమి చేశాడు?

7 ఏరన్‌ బైబిలు క్రమంగా చదవడానికి, మీటింగ్స్‌కు సిద్ధపడి కామెంట్స్‌ చెప్పడానికి కృషిచేశాడు. వీలైనన్ని ఎక్కువసార్లు ప్రార్థించడం కూడా మొదలుపెట్టాడు. దాంతో యెహోవాపై అతనికున్న ప్రేమ పెరిగేకొద్దీ ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అతను సంతోషంగా పయినీరు సేవచేశాడు, విపత్తులు వచ్చినప్పుడు ఇతరులకు సహాయంచేశాడు, వేరేదేశానికి వెళ్లి ప్రకటించాడు. ఇప్పుడు ఏరన్‌ సంఘపెద్దగా సేవచేస్తూ, బెతెల్‌లో పనిచేస్తున్నాడు. అతను తీసుకున్న నిర్ణయాల గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఏరన్‌ ఇలా అంటున్నాడు, “నేను ‘యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను.’ ఆయన నాకిచ్చిన దీవెనలకు రుణపడి ఉన్నాను, ఆయనకు మరింత ఎక్కువగా సేవచేయాలని కోరుకుంటున్నాను. అప్పుడు యెహోవా నాకు మరిన్ని దీవెనలు ఇస్తాడు.”

8 కీర్తనకర్త ఇలా అన్నాడు, ‘యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. యెహోవాను ఆశ్రయించేవాళ్లకు ఏ మేలు కొదువయై ఉండదు.’ (కీర్తన 34:8-10 చదవండి.) అవును, యెహోవాకు మనం శ్రేష్ఠమైనది ఇచ్చినప్పుడు ఆయనకు ఇష్టమైనది చేస్తున్నామనే సంతోషం మనకు కలుగుతుంది. ఆ సంతోషం దేనికీ సాటిరాదు. అప్పుడు యెహోవా కూడా మన బాగోగులు చూసుకుంటానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు.

ఓపిగ్గా ఉండండి

9, 10. ఓపిగ్గా ఎదురుచూడడం ఎందుకు ప్రాముఖ్యం?

9 యెహోవా సేవను మరింత ఎక్కువగా చేయాలనే కోరిక మనలో ఉండవచ్చు. కొన్నిసార్లు మనం సంఘంలో ఒకానొక సేవావకాశం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తుండవచ్చు. లేదా ఎక్కువగా సేవచేసేందుకు వీలుగా మన పరిస్థితులు మారాలని ఆశపడుతుండవచ్చు. అప్పుడేమి చేయాలి? మనం ఓపిగ్గా ఎదురుచూడాలి. (మీకా 7:7) మనమిలా ఎదురుచూడాల్సిన పరిస్థితిని యెహోవా అనుమతిస్తున్నప్పటికీ, ఆయన మనకెప్పుడూ అండగా ఉంటాడనే నమ్మకంతో ఉండవచ్చు. ఈ విషయంలో అబ్రాహాము మనకు చక్కని ఆదర్శం ఉంచాడు. అతనికి ఒక కొడుకును ఇస్తానని యెహోవా మాటిచ్చాడు. కానీ ఆ మాట నెరవేరడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరాలు అబ్రాహాము ఓపిగ్గా ఎదురుచూశాడే తప్ప యెహోవామీద ఉన్న విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోలేదు.—ఆది. 15:3, 4; 21:5; హెబ్రీ. 6:11-15.

10 నిజమే, ఎదురుచూస్తూ ఉండడం అంత తేలికేమీ కాదు. (సామె. 13:12) ఒకవేళ మన పరిస్థితి గురించే ఆలోచిస్తూ, బాధపడుతూ ఉంటే మనలో ఉన్న ఉత్సాహం పూర్తిగా నీరుగారిపోతుంది. అలా కాకుండా, సంఘంలో బాధ్యతలు చేపట్టడానికి కావాల్సిన లక్షణాల్ని మరింత మెరుగుపర్చుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించవచ్చు.

11. ఎలాంటి లక్షణాల్ని పెంపొందించుకోవడానికి కృషిచేయాలి? అవి ఎందుకు ప్రాముఖ్యం?

11 అవసరమైన లక్షణాల్ని, సామర్థ్యాల్ని పెంపొందించుకోండి. బైబిల్ని చదువుతూ, చదువుతున్న వాటిగురించి లోతుగా ఆలోచిస్తే జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. అంతేకాదు సరైన విధంగా ఎలా ఆలోచించాలో, ఎలా తర్కించాలో, మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్చుకుంటాం. నిజానికి సంఘ బాగోగులు చూసుకోవాలంటే సహోదరులకు ఇలాంటి లక్షణాలు, సామర్థ్యాలు అవసరం. (సామె. 1:1-4; తీతు 1:7-9) బైబిల్ని అధ్యయనం చేసినప్పుడు, ఎన్నో విషయాల్లో యెహోవా అభిప్రాయమేమిటో తెలుసుకుంటాం. అప్పుడు ప్రతీరోజు యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఉదాహరణకు ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, డబ్బు ఎలా ఖర్చుపెట్టాలి, ఎలాంటి వినోదాన్నీ, బట్టల్నీ ఎంచుకోవాలి వంటి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

12. తాము నమ్మదగినవాళ్లమని సంఘంలోని వాళ్లు ఏవిధంగా నిరూపించుకోవచ్చు?

12 మీకు ఏ పని ఇచ్చినా కష్టపడి చేయండి. దేవుని ఆలయాన్ని మళ్లీ కడుతున్నప్పుడు, వేర్వేరు పనులు చూసుకోవడానికి నెహెమ్యాకు చాలామంది పురుషులు అవసరమయ్యారు. అందుకోసం దేవునిపట్ల భక్తి, కష్టపడి పనిచేసే గుణం ఉండి, నమ్మదగిన వాళ్లనే అతను ఎంపిక చేసుకున్నాడు. (నెహె. 7:2; 13:12, 13) అదేవిధంగా నేడు కూడా, నమ్మకంగా ఉంటూ కష్టపడి పనిచేసేవాళ్లకే సంఘంలో మరిన్ని బాధ్యతలు నిర్వహించే అవకాశం దొరుకుతుంది. (1 కొరిం. 4:2) కాబట్టి మనం సహోదరులమైనా, సహోదరీలమైనా మనకిచ్చే ఏ పనినైనా కష్టపడి చేయాలి.—1 తిమోతి 5:25 చదవండి.

13. ఇతరులు మిమ్మల్ని బాధపెట్టేలా ప్రవర్తించినప్పుడు యోసేపును మీరెలా అనుకరించవచ్చు?

13 యెహోవాపై ఆధారపడండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టేలా ప్రవర్తిస్తే మీరేమి చేయవచ్చు? బహుశా మీ మనసులోని భావాల్ని వాళ్లకు వివరించవచ్చు. కానీ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ, మీరు చేసింది సరైనదేనని వాదిస్తూ ఉంటే సమస్య మరింత పెద్దది కావచ్చు. ఈ విషయంలో యోసేపు ఉదాహరణ మనకు ఓ పాఠం నేర్పిస్తుంది. యోసేపు సహోదరులు అతనితో కఠినంగా ప్రవర్తించారు. ఆ తర్వాత ప్రజలు అబద్ధాలు చెప్పి చేయని తప్పుకు అతన్ని జైళ్లో వేయించారు. కానీ యోసేపు మాత్రం యెహోవాపై ఆధారపడ్డాడు. ఆయన చేసిన వాగ్దానాల గురించి ఆలోచిస్తూ నమ్మకంగా ఉన్నాడు. (కీర్త. 105:19) కష్టాల్ని ఎదుర్కొంటున్న ఆ సమయంలో యోసేపు ఎన్నో మంచి లక్షణాల్ని అలవర్చుకున్నాడు. కొంతకాలం తర్వాత అతనికి ఓ ప్రాముఖ్యమైన పని అప్పగించబడినప్పుడు ఆ లక్షణాలు సహాయపడ్డాయి. (ఆది. 41:37-44; 45:4-8) ఒకవేళ ఎవరైనా మీతో బాధపెట్టేలా ప్రవర్తిస్తే జ్ఞానాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించండి. ప్రశాంతంగా ఉండడానికి, వాళ్లతో దయగా మాట్లాడడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు.—1 పేతురు 5:10 చదవండి.

పరిచర్యలో నైపుణ్యాలు పెంచుకుంటూ ఉండండి

14, 15. (ఎ) మనం బోధించే విధానాన్ని ఎప్పటికప్పుడు ఎందుకు మెరుగుపర్చుకుంటూ ఉండాలి? (బి) పరిస్థితులు మారినప్పుడు మీరేమి చేయవచ్చు? (ప్రారంభ చిత్రాన్ని అలాగే “ వేరే పద్ధతిని ప్రయత్నించగలరా?” అనే బాక్సును చూడండి.)

14 లేఖనాల్ని వివరించే విధానాన్ని మెరుగుపర్చుకుంటూ ఉండమని తిమోతిని ప్రోత్సహిస్తూ పౌలు ఇలా చెప్పాడు, “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము.” (1 తిమో. 4:13, 16) అప్పటికే ఎన్నో సంవత్సరాలుగా ప్రకటిస్తున్న అనుభవం తిమోతికి ఉంది. మరి అతనింకా ఎందుకు మెరుగవ్వాలి? ప్రజలు, పరిస్థితులు మారుతూ ఉంటాయని తిమోతికి తెలుసు. కాబట్టి అతను చెప్పే విషయాల్ని ప్రజలు వింటూ ఉండాలంటే బోధించే విధానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ, మార్చుకుంటూ ఉండాలి. నేడు రాజ్యసువార్తను ప్రకటిస్తున్న మనం కూడా అలానే చేయాలి.

15 మనం ఇంటింటి పరిచర్యకు వెళ్లినప్పుడు ఇళ్లు తాళం వేసి ఉండడం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉంటారుగానీ, వాళ్లు ఉండే బిల్డింగులోకి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంవల్ల వాళ్లను కలవలేకపోతుంటాం. ఒకవేళ మీరు ప్రకటిస్తున్న ప్రాంతంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురౌతుంటే, ప్రజల్ని చేరుకోవడానికి వేరే పద్ధతిని మీరు ప్రయత్నించగలరా?

16. బహిరంగ సాక్ష్యం ద్వారా మంచి ఫలితాలు పొందాలంటే ఏమి చేయాలి?

16 బహిరంగ సాక్ష్యం ఇవ్వడానికి చాలామంది సహోదరసహోదరీలు ఇష్టపడుతుంటారు. ఉదాహరణకు రైల్వే స్టేషన్‌లలో, బస్టాండుల్లో, మార్కెట్‌లలో, పార్కుల్లో ప్రజలను కలిసి సువార్త ప్రకటిస్తుంటారు. అలా ప్రకటిస్తున్నప్పుడు, ఈ మధ్యకాలంలో వచ్చిన వార్త ఏదైనా చెప్పి వాళ్లతో సంభాషణ మొదలుపెట్టవచ్చు. లేదా మీరు కలిసిన వ్యక్తికున్న పిల్లల్ని మెచ్చుకుంటూ లేదా అతని ఉద్యోగం గురించి అడుగుతూ ఏదైనా మాట్లాడవచ్చు. ఒకవేళ ఎదుటి వ్యక్తి కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటే బైబిల్లోని ఏదైనా విషయం చెప్పి, అతని అభిప్రాయమేమిటో అడగవచ్చు. అలాంటప్పుడు బైబిలు గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ప్రజలు ఇష్టపడుతుంటారు.

17, 18. (ఎ) బహిరంగ సాక్ష్యంలో మీరెలా ధైర్యంగా మాట్లాడవచ్చు? (బి) యెహోవాను స్తుతించడం గురించి దావీదు అన్న మాటలు విలువైనవని పరిచర్యలో పాల్గొన్నప్పుడు మీరెందుకు గుర్తిస్తారు?

17 బహిరంగ సాక్ష్యం ఇస్తున్నప్పుడు, పరిచయంలేని వాళ్లతో మాట్లాడడం బహుశా మీకు కష్టంగా ఉండవచ్చు. న్యూయార్క్‌లో పయినీరుగా సేవచేస్తున్న ఎడీ అనే సహోదరునికి కూడా అలానే అనిపించింది. అయితే ఆ భయాన్ని పోగొట్టుకుని ధైర్యంగా మాట్లాడడానికి అతనికి ఓ విషయం సహాయం చేసింది. అదేమిటో వివరిస్తూ ఎడీ ఇలా చెప్తున్నాడు, “కుటుంబ ఆరాధనలో నేనూ, నా భార్య కలిసి ప్రజలు సాధారణంగా ఎలాంటి విషయాల్లో అభ్యంతరం చెప్తారో, ఎలాంటి అభిప్రాయాల్ని కలిగివుంటారో వాటికి జవాబుల్ని పరిశోధించేవాళ్లం. తోటి సహోదరుల సలహాల్ని కూడా అడిగేవాళ్లం.” ఇప్పుడు ఎడీ బహిరంగ సాక్ష్యం ఇచ్చే అవకాశం కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నాడు.

18 పరిచర్యలో నైపుణ్యం పెంచుకుని ధైర్యంగా సువార్త ప్రకటించినప్పుడు, మన ఆధ్యాత్మిక ప్రగతి అందరికీ కనిపిస్తుంది. (1 తిమోతి 4:15 చదవండి.) వేరేవాళ్లు యెహోవా సేవకులు అయ్యేందుకు సహాయం కూడా చేయగలుగుతాం. దావీదు ఇలా అన్నాడు, “నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు.”—కీర్త. 34:1, 2.

ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ యెహోవాను స్తుతించండి

19. కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని నమ్మకమైన సేవకులు ఎందుకు సంతోషంగా ఉండవచ్చు?

19 దావీదు ఇంకా ఇలా అన్నాడు, “యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు.” (కీర్త. 145:10-12) యెహోవాను ప్రేమిస్తూ, ఆయనకు నమ్మకంగా ఉండే ప్రతీఒక్కరికి ఆయన గురించి ఇతరులకు చెప్పాలనే కోరిక బలంగా ఉంటుంది. ఒకవేళ అనారోగ్యంవల్లో లేదా వయసుపైబడడం వల్లో మీరు ఇంటింటి పరిచర్యలో ఎక్కువ సమయం గడపలేకపోతుంటే అప్పుడేంటి? మీ చుట్టూ ఉన్న నర్సులతో, డాక్టర్లతో యెహోవా గురించి మాట్లాడిన ప్రతీసారి మీరు ఆయన్ను స్తుతిస్తున్నారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఒకవేళ మీ నమ్మకాలను బట్టి మీరు జైల్లో ఉంటున్నప్పటికీ మీకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుని యెహోవా గురించి ఇతరులతో మాట్లాడుతుండవచ్చు. అది చూసి యెహోవా ఖచ్చితంగా సంతోషిస్తాడు. (సామె. 27:11) మీ కుటుంబంలో ఎవ్వరూ యెహోవాసాక్షులు కాకపోయినప్పటికీ మీరు ఆయన్ను ఆరాధిస్తుంటే ఆయన చాలా సంతోషిస్తాడు. (1 పేతు. 3:1-4) ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా మీరు యెహోవాను స్తుతిస్తూ, ఆయనకు మరింత దగ్గరౌతూ, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉండవచ్చు.

20, 21. యెహోవా సంస్థలో మీకు ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తే, ఇతరులకు మీరెలా ఓ దీవెనగా ఉండవచ్చు?

20 మీరు యెహోవాకు మరింత దగ్గరౌతూ, ఆయన సేవలో చేయగలిగినదంతా చేస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. బహుశా మీ పనుల్లో, జీవితంలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే దేవుని అద్భుతమైన వాగ్దానాల గురించి ఇతరులకు చెప్పే అవకాశాలు మీకు మరిన్ని దొరకవచ్చు. తోటి సహోదరులకు కూడా ఇంకా ఎక్కువగా సహాయం చేయగలుగుతారు. మీరు సంఘంలో కష్టపడి పనిచేయడం చూసినప్పుడు తోటి సహోదరసహోదరీలు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారో ఒక్కసారి ఆలోచించండి.

21 మనందరం యెహోవాను ఎంతకాలంగా సేవిస్తున్నప్పటికీ, ఆయనకు మరింత దగ్గరౌతూ, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉండవచ్చు. అదే విధంగా ఇతరులు కూడా ప్రగతి సాధించేందుకు మనమెలా సహాయపడవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.