కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని పొందాను

ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని పొందాను

నాకు 12 ఏళ్లున్నప్పుడు, ఇతరులకు ఇవ్వడానికి నా దగ్గర ఏదో విలువైనది ఉందని గుర్తించాను. ఒక సమావేశంలో ఓ సహోదరుడు, నాకు ప్రీచింగ్‌ చేయడం ఇష్టమో కాదోనని అడిగాడు. నేను అప్పటివరకు ఎప్పుడూ ప్రీచింగ్‌ చేయకపోయినా ఇష్టమేనని చెప్పాను, దాంతో మేము ప్రీచింగ్‌ చేయడానికి ఒక ప్రాంతానికి వెళ్లాం. ఆ సహోదరుడు దేవుని రాజ్యానికి సంబంధించిన చిన్నపుస్తకాలను కొన్ని నాకిచ్చి, “ఈ వీధిలో అటువైపు ఉన్న ఇళ్లలో నువ్వు మాట్లాడు. ఇటువైపు ఇళ్లలో నేను మాట్లాడతాను” అని అన్నాడు. నాకు భయమేసినా ఇంటింటికి వెళ్లి మాట్లాడడం మొదలుపెట్టాను. కొద్దిసేపటికే నా దగ్గరున్న పుస్తకాలన్నీ ఇచ్చేశాను, నాకు ఆశ్చర్యమనిపించింది. అవును, నేను ఇవ్వగలిగేది చాలామందికి అవసరమని నాకు అర్థమైంది.

నేను 1923లో ఇంగ్లాండ్‌లోని కెంట్‌లో ఉన్న చాతమ్‌లో పుట్టాను. అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం అయిపోవడంతో లోకంలోని పరిస్థితులు మారతాయని ప్రజలు ఆశపడ్డారు. కానీ అలా జరగకపోవడంతో చాలామంది నిరుత్సాహపడ్డారు. అలా నిరుత్సాహపడ్డవాళ్లలో మా అమ్మానాన్నలు కూడా ఉన్నారు, చర్చిలో పదవులకోసం ప్రాకులాడుతున్న బాప్టిస్ట్‌ చర్చి పాస్టర్ల ప్రవర్తనతో కూడా వాళ్లు విసిగిపోయారు. నాకు దాదాపు తొమ్మిదేళ్లున్నప్పుడు మా అమ్మ, యెహోవాసాక్షుల “క్లాసెస్‌” లేదా మీటింగ్స్‌ జరిగే అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల సమాఖ్య హాలుకు వెళ్లడం మొదలుపెట్టింది. అక్కడున్న వాళ్లలో ఒక సహోదరి, బైబిలు నుండి అలాగే ద హార్ప్‌ ఆఫ్‌గాడ్‌ అనే పుస్తకం నుండి నాతోపాటు దాదాపు ముగ్గురు పిల్లలకు పాఠాలు చెప్పేది అవి నాకు నచ్చేవి.

పెద్దవయసు సహోదరులను చూసి నేర్చుకున్నాను

ప్రజలకు బైబిల్లో ఉన్న మంచివార్త చెప్తూ నా టీనేజీని సంతోషంగా గడిపాను. నేను ఇంటింటి పరిచర్యకు ఎక్కువగా ఒక్కడినే వెళ్లేవాడిని, కానీ వేరేవాళ్లతో కలిసి ప్రీచింగ్‌ చేసినప్పుడు మాత్రం చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒకసారి, నేను ఓ పెద్దవయసు సహోదరునితో కలిసి సైకిల్‌ మీద ప్రీచింగ్‌కి వెళ్తున్నప్పుడు ఒక పాస్టరు అటువైపుగా వెళ్తున్నాడు. అప్పుడు నేను, “అదిగో మేక వెళ్తుంది” అని అన్నాను. ఆ సహోదరుడు తన సైకిల్‌ ఆపి తనతోపాటు నన్ను ఒక చెట్టు మొద్దు మీద కూర్చోమన్నాడు. తర్వాత అతను, “ఫలానా వ్యక్తి మేక అని తీర్పుతీర్చే అధికారం నీకు ఎవరిచ్చారు? ప్రజలకు మంచివార్తను చెప్తూ సంతోషించడం మాత్రమే మన పని, తీర్పుతీర్చే పని యెహోవాకు వదిలేద్దాం” అని చెప్పాడు. ఇవ్వడంలో ఎంత సంతోషం ఉంటుందో ఆ రోజుల్లో నేను బాగా నేర్చుకున్నాను.—మత్త. 25:31-33; అపొ. 20:35.

ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని పొందాలంటే కొన్నిసార్లు సహనం చూపించాలని పెద్దవయసున్న మరో సహోదరుడిని చూసి నేర్చుకున్నాను. అతని భార్యకు యెహోవాసాక్షులంటే ఇష్టముండేది కాదు. ఒకసారి టీ తాగడానికి అతను నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సహోదరుడు ప్రీచింగ్‌కి వెళ్లినందుకు అతని భార్యకు ఎంత కోపం వచ్చిందంటే, మా మీద టీ ప్యాకెట్లు విసరడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ సహోదరుడు ఆమెమీద కోప్పడే బదులు, నవ్వుతూ ఆ ప్యాకెట్లను తీసి వాటి స్థానంలో పెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, అతని భార్య బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షి అయింది. ఆ విధంగా అతని సహనానికి ఫలితం దక్కింది.

1939 సెప్టెంబరులో బ్రిటన్‌ జర్మనీ మీద యుద్ధం ప్రకటించింది, అప్పుడు నాకు 16 ఏళ్లు. 1940 మార్చిలో నేనూ, మా అమ్మ డోవర్‌లో బాప్తిస్మం తీసుకున్నాం. 1940 జూన్‌లో, డన్‌కిర్క్‌ యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన వేలమంది సైనికులు లారీల్లో వెళ్లడాన్ని మా గుమ్మం నుండి చూశాను. వాళ్ల ముఖాల్లో భయం, నిరాశ కనిపించాయి. వాళ్లకు దేవుని రాజ్యం గురించి చెప్పి భవిష్యత్తు విషయంలో వాళ్లలో ఆశ నింపాలని నాకు అనిపించింది. ఆ తర్వాతి సంవత్సరం, జర్మనీవాళ్లు బ్రిటన్‌ మీద బాంబులు వేయడం మొదలుపెట్టారు. రోజూ రాత్రి, జర్మన్‌ సైనికులు యుద్ధ విమానాల్లో మా ప్రాంతం మీదుగా వెళ్తూ బాంబులు వేసేవాళ్లు. అవి పడుతున్నప్పుడు వచ్చే శబ్దానికి మాకు భయమేసేది. తెల్లారేసరికి, చుట్టూ కూలిపోయిన ఇళ్లు కనిపించేవి. అవన్నీ చూసినప్పుడు, దేవుని రాజ్యం మాత్రమే మంచి భవిష్యత్తును ఇస్తుందని నా మనసులో మరింత బలంగా నాటుకుపోయింది.

ఇవ్వడం మొదలుపెట్టాను

నేను 1941లో, పూర్తికాల సేవ మొదలుపెట్టినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అంతకుముందు, చాతమ్‌లోని రాయల్‌ డాక్‌యార్డ్‌లో ఓడలను నిర్మించే పని నేర్చుకునేవాడిని. అది మంచి ఉద్యోగం కావడంతో చాలామంది దానికోసం పోటీపడేవాళ్లు. అయితే, క్రైస్తవులు యుద్ధాల్లో పాల్గొనకూడదని యెహోవాసాక్షులకు అప్పటికే తెలుసు. కానీ, ఆయుధాల్ని తయారుచేసే ఏ పనికి కూడా మద్దతివ్వకూడదని 1941 కల్లా అర్థంచేసుకున్నాం. (యోహా. 18:36) నేను పనిచేసే డాక్‌యార్డ్‌లో జలాంతర్గాములను (submarines) తయారుచేసేవాళ్లు. అందుకే నేను ఆ ఉద్యోగం వదిలేసి, పూర్తికాల సేవ మొదలుపెట్టాలనుకున్నాను. అలా కాట్‌స్వోల్డజ్‌లోని సైరన్‌సెస్టర్‌ అనే అందమైన పట్టణంలో పూర్తికాల సేవ మొదలుపెట్టాను.

నాకు 18 ఏళ్లు వచ్చాక మిలిటరీలో చేరడానికి ఒప్పుకోనందుకు తొమ్మిది నెలలు జైల్లో వేశారు. నన్ను జైలు గదిలో పెట్టి గట్టిగా తలుపువేసినప్పుడు భయమేసింది. కానీ కొద్దిసేపటికే అక్కడున్న గార్డులు, ఖైదీలు నేను జైలుకు ఎందుకు వచ్చానో అడిగినప్పుడు వాళ్లకు నా విశ్వాసం గురించి సంతోషంగా వివరించాను.

జైలు నుండి విడుదలయ్యాక, లెన్నర్డ్‌స్మిత్‌తో a కలిసి కెంట్‌లోని వేర్వేరు పట్టణాల్లో ప్రీచింగ్‌ చేశాం. లండన్‌ మీద బాంబులు వేసే నాజీ విమానాలు కెంట్‌ మీదుగా వెళ్లేవి. 1944 మొదలుకొని, కెంట్‌ మీద వెయ్యి కన్నా ఎక్కువ బాంబులు పడ్డాయి. వాటిని డూడుల్‌బగ్స్‌ అనేవాళ్లు, నిజానికి అవి పేలుడు పదార్థాలతో నిండిన జెట్‌ విమానాలు, వాటికి పైలట్లు ఉండరు. ఆ విమానాల ఇంజన్‌ ఆగిపోయిన శబ్దం వినిపించిందంటే, అది కొన్ని సెకన్లలో కిందపడి పేలుతుందని మాకు అర్థమయ్యేది, ప్రతీఒక్కరూ ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకొని ఉండేవాళ్లు. అప్పట్లో మేము ఒక కుటుంబంతో బైబిలు స్టడీ చేసేవాళ్లం, ఆ కుటుంబంలో ఐదుగురు ఉండేవాళ్లు. ఇల్లు కూలిపోతున్నప్పుడు ఎవ్వరికీ ప్రాణహాని జరగకుండా ఉండేందుకు ఇనుముతో ప్రత్యేకంగా తయారుచేసిన టేబుల్‌ వాళ్లకు ఉండేది. కొన్నిసార్లు మేము ఆ టేబుల్‌ కిందే కూర్చునేవాళ్లం. కొంతకాలానికి ఆ కుటుంబంలోని వాళ్లందరూ బాప్తిస్మం తీసుకున్నారు.

వేరే దేశాల్లో సువార్త ప్రకటించడం

ఐర్లాండ్‌లో నేను పయినీరు సేవ మొదలుపెట్టిన కొత్తలో సమావేశం గురించి ప్రచారం చేస్తూ

యుద్ధం తర్వాత, దక్షిణ ఐర్లాండ్‌లో రెండు సంవత్సరాలు పయినీరు సేవ చేశాను. ఇంటింటికి వెళ్లి మేము మిషనరీలమని చెప్పి అద్దె ఇంటి కోసం అడిగేవాళ్లం, వీధుల్లో పత్రికలు పంచిపెట్టేవాళ్లం. అయితే ఇంగ్లాండ్‌తో పోలిస్తే ఐర్లాండ్‌లోని పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి. ఒక క్యాథలిక్‌ దేశానికి వెళ్లి, అక్కడి ప్రజలు మాతో చక్కగా ప్రవర్తించాలని కోరుకోవడం వెర్రితనమని మాలో చాలామందికి అనిపించింది. ఓ సందర్భంలో ఒకాయన మమ్మల్ని కొడతానని బెదిరించినప్పుడు, నేను పోలీసుకు కంప్లెయింట్‌ ఇచ్చాను. కానీ ఆ పోలీసు, “ఇప్పుడేమి చేయమంటావ్‌” అని అన్నాడు. అక్కడ ప్రీస్టులకు ఎంత అధికారం ఉందో మేము గుర్తించలేకపోయాం. ఒకవేళ ఎవరైనా మా దగ్గర పుస్తకాలు తీసుకుంటే వాళ్ల ఉద్యోగాలు పోయేవి. మేము ఉంటున్న ప్రాంతం నుండి వెళ్లిపొమ్మని మమ్మల్ని బలవంతపెట్టారు.

మరో కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు, మేమెవరో ప్రీస్టులకు తెలియని చోట ప్రీచింగ్‌ చేయడం మంచిదని అనుకున్నాం. అందుకే, మేము ఉంటున్న ప్రాంతానికి దూరంలో ఉన్న ప్రదేశాలకు వెళ్లి ముందు అక్కడ ప్రీచింగ్‌ చేసేవాళ్లం. ఆ తర్వాత దగ్గర్లో ఉన్నవాళ్లను కలిసేవాళ్లం. కిల్‌కెనీలో అల్లరి మూకలు మమ్మల్ని బెదిరించినా అక్కడుండే ఓ యువకునితో వారానికి మూడుసార్లు స్టడీ చేసేవాళ్లం. నాకు బైబిలు గురించి నేర్పించడం అంటే చాలా ఇష్టం కాబట్టి మిషనరీ శిక్షణ తీసుకోవాలనుకున్నాను. అందుకే, వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు దరఖాస్తు చేసుకున్నాను.

1948 నుండి 1953 వరకు సిబేయా పడవ మా మిషనరీ ఇల్లుగా పనిచేసింది (కుడివైపు)

న్యూయార్క్‌లో ఐదునెలల శిక్షణ పూర్తైన తర్వాత, మాలో నలుగురిని కరీబియన్‌ దీవులకు పంపించారు. మేము 1948 నవంబరులో, తెరచాపతో నడిచే 59 అడుగుల సిబేయా అనే పడవలో న్యూయార్క్‌ నుండి బయల్దేరాం. నేను అంతకుముందెప్పుడూ సముద్రంలో ప్రయాణించలేదు కాబట్టి, నాకు చాలా ఆత్రుతగా అనిపించింది. మాతోపాటు గిలియడ్‌ పూర్తిచేసుకున్న గస్ట్‌ మాకీ అనుభవం ఉన్న కెప్టెన్‌. అతను మాకు సముద్ర ప్రయాణానికి సంబంధించి కొన్ని మెళకువల్ని నేర్పించాడు. అంటే తెరచాపను పైకి ఎత్తడం, దించడం, దిక్సూచిని ఉపయోగిస్తూ దారి కనుక్కోవడం, గాలికి వ్యతిరేకదిశలో ప్రయాణించడం వంటివి నేర్పించాడు. న్యూయార్క్‌ నుండి బహమాస్‌ ద్వీపానికి చేరుకోవడానికి మాకు 30 రోజులు పట్టింది. ఆ ప్రయాణంలో భయంకరమైన తుఫానులు ఎదురైనా గస్ట్‌ నైపుణ్యంగా పడవ నడిపాడు.

‘ద్వీపములలో ప్రకటించండి’

బహమాస్‌ దీవుల్లో కొన్ని నెలలు ప్రీచింగ్‌ చేశాక లీవర్డ్‌ దీవులకు, విండ్‌వార్డ్‌ దీవులకు వెళ్లాం. అవి వర్జన్‌ దీవులకు, ట్రినిడాడ్‌కు మధ్య దాదాపు 800 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. మేము యెహోవాసాక్షులులేని మారుమూల దీవుల్లో ఐదు సంవత్సరాలపాటు ప్రీచింగ్‌ చేశాం. కొన్నిసార్లయితే, ఉత్తరాలు పంపించడం లేదా అందుకోవడం వారాలపాటు వీలయ్యేదికాదు. కానీ “ద్వీపములలో” యెహోవా గురించి ప్రకటించడం మాకు చాలా సంతోషాన్నిచ్చింది.—యిర్మీ. 31:10.

సిబేయా పడవలో ఉన్న మిషనరీలు (ఎడమ నుండి కుడికి): రాన్‌ పార్కన్‌, డిక్‌ రైడ్‌, గస్ట్‌ మాకీ, స్టాన్లీ కార్టర్‌

మేము రేవు దగ్గర ఆగినప్పుడు, ఎవరొచ్చారో చూడడానికి పల్లెల్లోని ప్రజలు కుతూహలంతో వచ్చేవాళ్లు. కొంతమందైతే, మా లాంటి పడవనుగానీ తెల్లజాతీయుణ్ణి గానీ ముందెప్పుడూ చూడలేదు. దీవుల్లో ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లు, వాళ్లకు బైబిలు గురించి బాగా తెలుసు. మాకు చాలాసార్లు, తాజా చేపల్ని, కొన్ని పండ్లను, వేరుశెనగలను ఇచ్చేవాళ్లు. మా పడవ చిన్నదైనా వంట చేసుకోవడానికి, పడుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి సరిపోయేది.

పగలంతా దీవుల్లోకి వెళ్లి ప్రజల్ని కలిసేవాళ్లం, బైబిలు ప్రసంగం ఉంటుందని చెప్పేవాళ్లం. ఇక చీకటి పడుతోందనగా పడవ బెల్లు మోగించేవాళ్లం. ఆ శబ్దం విని ప్రజలు దీపాలు పట్టుకొని వచ్చేవాళ్లు. ఆ దీపాల్ని దూరం నుండి చూసినప్పుడు మెరిసే నక్షత్రాలు కొండలు దిగి వస్తున్నట్లు అనిపించేది. కొన్నిసార్లు వందమంది వచ్చేవాళ్లు, అర్ధరాత్రి వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉండేవాళ్లు. వాళ్లకు పాటలు పాడడమంటే ఇష్టం కాబట్టి మేము కొన్ని రాజ్యగీతాలను టైప్‌ చేసి ఇచ్చేవాళ్లం. మేము నలుగురం పాటలు బాగా పాడడానికి శాయశక్తులా ప్రయత్నించాం. అప్పుడు వాళ్లు కూడా మాతోపాటు పాడడం మొదలుపెట్టారు, వాళ్ల స్వరాలు వినసొంపుగా ఉండేవి. ఆ రోజులు ఎంత బాగుండేవో!

ఒకరికి బైబిలు స్టడీ చేసి మరో స్టడీకి వెళ్తున్నప్పుడు, కొంతమంది బైబిలు విద్యార్థులు ఆ స్టడీలో చెప్పేవి కూడా వినడానికి మాతోపాటు వచ్చేవాళ్లు. మేము ఒక చోట కొన్ని వారాలు ఉండి, మరో చోటకు వెళ్లేవాళ్లం. మేము మళ్లీ వచ్చేవరకు మాకున్న బైబిలు స్టడీలు చేయమని బాగా ఆసక్తి ఉన్న బైబిలు విద్యార్థులకు చెప్పేవాళ్లం. వాళ్లలో కొంతమంది తమకు అప్పగించిన ఆ పనిని చాలా చక్కగా చేయడం చూసి ముచ్చటగా అనిపించేది.

మేము వెళ్లినవాటిలో చాలా దీవులు ఇప్పుడు టూరిస్టులతో కిటకిటలాడుతున్నాయి. మేము ఉన్నప్పుడైతే నీలిరంగు మడుగులతో, ఇసుక తీరాలతో, తాటి చెట్లతో ఆ దీవులు ప్రశాంతంగా ఉండేవి. సాధారణంగా మేము ఒక దీవి నుండి మరో దీవికి రాత్రిళ్లు ప్రయాణించేవాళ్లం. మా పడవతోపాటు డాల్ఫిన్‌ చేపలు ఆటలాడుతూ ఈదుతూ వచ్చేవి, ఆ రాత్రిపూట మాకు వినిపించేదల్లా మా పడవ నీళ్లను చీల్చుకుంటూ ముందుకు వెళ్తున్న శబ్దం మాత్రమే. సముద్రంపై పడుతున్న వెన్నెల, సుదూరాన సముద్రం ఆకాశం కలిసినట్లుగా కనిపించే చోటువరకు వెండి తివాచీ వేసినట్లు కనిపించేది.

ఆ దీవుల్లో ఐదు సంవత్సరాలు ప్రీచింగ్‌ చేశాక, ఇంజన్‌లు ఉన్న కొత్త పడవను తీసుకోవడానికి ప్యూర్టోరికోకు బయల్దేరాం. అక్కడ నేను, మ్యాక్‌సీన్‌ బాయిడ్‌ అనే అందమైన మిషనరీ సహోదరిని కలిశాను, ఆమె నాకు చాలా నచ్చింది. ఆమె చిన్నప్పటి నుండి ఎంతో ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేసేది. ఆమె డొమినికన్‌ రిపబ్లిక్‌లో మిషనరీగా కూడా సేవచేసింది. అయితే, 1950లో ఆ దేశంలోని క్యాథలిక్‌ ప్రభుత్వం ఆమెను వెళ్లిపోమనడంతో అక్కడినుండి వచ్చేసింది. నేను పడవ సిబ్బందిలో ఒకడిని కాబట్టి ప్యూర్టోరికోలో కేవలం ఒక్కనెల ఉండడానికే నాకు అనుమతి ఉంది. ఆ తర్వాత మళ్లీ దీవులకు వెళ్లి కొన్ని సంవత్సరాల వరకు తిరిగిరాను. అప్పుడు నేను, ‘రానల్డ్‌ నీకు ఆ అమ్మాయి కావాలనుకుంటే, వెంటనే వెళ్లి మనసులోని మాట చెప్పేయ్‌’ అని అనుకున్నాను. మూడువారాల తర్వాత ఆమె దగ్గరకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాని చెప్పాను. ఆరువారాల తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం. నన్నూ, మ్యాక్‌సీన్‌నీ ప్యూటోరికోకు మిషనరీలుగా పంపించారు కాబట్టి నేను ఇక ఆ కొత్త పడవలో వెళ్లలేదు.

1956లో మేము ప్రాంతీయ సేవ మొదలుపెట్టాం, మాకు సహోదరులను కలవడమంటే చాలా ఇష్టం. వాళ్లలో చాలామంది పేదవాళ్లే. ఉదాహరణకు, పోటాలా ప్యాస్టేల్యో అనే పల్లెటూర్లో యెహోవాసాక్షుల కుటుంబాలు రెండు ఉండేవి. వాళ్లకు ఎక్కువమంది పిల్లలు ఉండేవాళ్లు, వాళ్లకోసం నేను ఫ్లూట్‌ వాయించేవాణ్ణి. వాళ్లలో ఈల్డా అనే ఓ చిన్నపాపను మాతో ప్రీచింగ్‌కి వస్తావానని అడిగాను. అప్పుడు ఆ పాప, “నాకు రావాలనే ఉంది, కానీ నాకు చెప్పులు లేవు కాబట్టి రాలేను” అని చెప్పింది. మేము తనకి ఒక జత చెప్పులు కొనిచ్చాం, తను మాతోపాటు ప్రీచింగ్‌కి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత, 1972లో నేనూ మ్యాక్‌సీన్‌ బ్రూక్లిన్‌కు వెళ్లాం. అప్పుడు, గిలియడ్‌ శిక్షణ పూర్తిచేసుకొని ఈక్వెడార్‌లో సేవచేయడానికి వెళ్లబోతున్న ఓ సహోదరి మా దగ్గరికి వచ్చి, “మీరు నన్ను గుర్తుపట్టారా? నేను, ప్యాస్టేల్యోలో మీరు కలిసిన చిన్నపాపను. నాకు చెప్పులు కూడా ఉండేవికావు” అని అంది. ఆమె ఈల్డా! ఆమెను చూసి సంతోషంతో ఏడ్చేశాం.

1960లో మేము ప్యూర్టోరికో బ్రాంచిలో సేవచేయడం మొదలుపెట్టాం. అప్పట్లో అది సాన్‌ హ్వాన్‌లోని సాన్‌టూసాలో ఒక చిన్న ఇంట్లో ఉండేది. మొదట్లో చాలావరకు పనంతా నేనూ, లెనార్ట్‌ జాన్సన్‌నే చేసేవాళ్లం. అతనూ, అతని భార్య డొమినికన్‌ రిపబ్లిక్‌లో మొట్టమొదటి యెహోవాసాక్షులు. కానీ 1957లో వాళ్లు ప్యూర్టోరికోకు వచ్చేశారు. దాంతో, మ్యాక్‌సీన్‌ అక్కడున్న చందాదారులకు పత్రికలు పంపించేది. ఆమె వారానికి వెయ్యికన్నా ఎక్కువ పత్రికల్ని పంపించేది. వాటి సహాయంతో యెహోవాను తెలుసుకుంటున్న ఎంతోమంది గురించి ఆలోచించడంవల్ల ఆమె ఆ పనిని సంతోషంగా చేయగలిగింది.

బెతెల్‌ సేవను నేను ఎంతో ఆనందిస్తాను, ఎందుకంటే అక్కడ నా శక్తిని యెహోవా సేవలో ఉపయోగించవచ్చు. కాని అన్ని సందర్భాల్లో ఆ సంతోషాన్ని పొందడం సులభం కాదు. ఉదాహరణకు, 1967లో ప్యూర్టోరికోలో మొదటిసారి అంతర్జాతీయ సమావేశం జరిగింది. అందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నప్పుడు, పనితో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. అప్పట్లో యెహోవాసాక్షుల పనికి నాయకత్వం వహిస్తున్న సహోదరుడు నేథన్‌ నార్‌ ప్యూర్టోరికోకు వచ్చారు. నేను అప్పటికే, సమావేశం కోసం వేరేదేశం నుండి ప్యూర్టోరికోకు వస్తున్న మిషనరీలకు రవాణా ఏర్పాట్లను చేసేశాను. కానీ నేను చేయలేదని సహోదరుడు నార్‌ పొరబడ్డాడు. దాంతో పనులన్నిటినీ క్రమపద్ధతిలో చేయడం గురించి నన్ను గట్టిగా మందలించి, నేను అతన్ని నిరుత్సాహపరిచానని చెప్పాడు. ఆ సమయంలో నేను సహోదరునితో వాదించాలని అనుకోలేదు, కానీ నాతో అలా ప్రవర్తించినందుకు కొద్దిసేపు బాధపడ్డాను. అయితే మరోసారి నేనూ, మ్యాక్‌సీన్‌ సహోదరుడు నార్‌ని కలిసినప్పుడు, అతను మమ్మల్ని భోజనానికి తన రూమ్‌కి ఆహ్వానించాడు.

మేము ఇంగ్లాండ్‌లో ఉన్న మా కుటుంబాన్ని చాలాసార్లు వెళ్లి కలిశాం. నేనూ, మా అమ్మ సాక్షులమయ్యాం కానీ నాన్న మాత్రం సత్యాన్ని ఇష్టపడలేదు. అయితే, బెతెల్‌లోని సహోదరులు మా ఊరికి వెళ్లినప్పుడల్లా, అమ్మ వాళ్లను మా ఇంట్లో ఉండమనేది. ఒకప్పుడు పాస్టర్ల ప్రవర్తనతో విసిగిపోయిన మా నాన్న బెతెల్‌ పర్యవేక్షకులు వినయంగా, పాస్టర్ల కన్నా చాలా వేరుగా ఉండడం గమనించాడు. చివరికి, 1962లో నాన్న బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షి అయ్యాడు.

పెళ్లయిన కొత్తలో మ్యాక్‌సీన్‌తో కలిసి ప్యూర్టోరికోలో, అలాగే 2003లో మా 50వ పెళ్లి రోజున

నా భార్య మ్యాక్‌సీన్‌ 2011లో చనిపోయింది. కొత్తలోకంలో ఆమెను మళ్లీ కలుసుకొనే రోజు కోసం నేను ఎంతో ఎదురుచూస్తున్నాను. దాని గురించి ఆలోచిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. మేము కలిసి జీవించిన 58 సంవత్సరాల్లో ప్యూర్టోరికోలో యెహోవాసాక్షుల సంఖ్య 650 నుండి 26,000కు పెరగడాన్ని మేం చూశాం. 2013లో, ప్యూర్టోరికో బ్రాంచిని అమెరికా బ్రాంచితో కలిపేశారు. నన్నేమో న్యూయార్క్‌లోని వాల్‌కిల్‌ బెతెల్‌కు పంపించారు. 60 సంవత్సరాలు ప్యూర్టోరికోలో గడిపాక, అదే నా సొంత ఊరిలా అనిపించింది. ఇప్పటివరకు ప్యూర్టోరికోలో సంతోషంగా ఉన్నాను, కానీ ఇప్పుడు వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది.

‘సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం’

నాకిప్పుడు 90 ఏళ్లు, బెతెల్‌లో పనిచేయడమంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. అక్కడ నా పని బెతెల్‌ కుటుంబసభ్యుల్ని ప్రోత్సహించడం. నేను వాల్‌కిల్‌కి వచ్చినప్పటినుండి, 600 కన్నా ఎక్కువమంది సహోదరసహోదరీలను ప్రోత్సహించాను. నా దగ్గరకు వచ్చే కొంతమంది, వాళ్ల సొంత విషయాల్లో, కుటుంబ విషయాల్లో సలహాలు అడుగుతుంటారు. ఇంకొందరైతే, బెతెల్‌ సేవను ఎలా సంతోషంగా చేయవచ్చో అడిగి తెలుసుకుంటారు. మరికొంతమంది కొత్తగా పెళ్లి చేసుకున్నవాళ్లు లేదా వేరేచోటకు పయినీర్లుగా వెళ్తున్నవాళ్లు కూడా సలహాల కోసం నా దగ్గరకు వస్తుంటారు. ఎవరైనా నాతో మాట్లాడుతున్నప్పుడు నేను శ్రద్ధగా వింటాను, సందర్భాన్నిబట్టి, “‘సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం’ మీరు యెహోవా కోసం పనిచేస్తున్నారు కాబట్టి సంతోషంగా ఆ పని చేయండి” అని చెప్తుంటాను.—2 కొరిం. 9:7, NW.

మీరు చేస్తున్న పని ఎందుకు ప్రాముఖ్యమనే విషయంపై మనసుపెట్టినప్పుడు, మీరు బెతెల్‌లో సేవచేస్తున్నా లేదా ఇంకెక్కడ సేవచేస్తున్నా సంతోషంగా ఉంటారు. మీరు బెతెల్‌లో చేసే ప్రతీ పని పవిత్రమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరులందరికీ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే పనిలో మీరు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ సహాయం చేస్తున్నారు. (మత్త. 24:45) మనం ఎక్కడ సేవచేస్తున్నా యెహోవాను స్తుతించడానికి ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. యెహోవా అడిగే ప్రతీపనిని సంతోషంగా చేద్దాం ఎందుకంటే ‘సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం.’

a లెన్నర్డ్‌స్మిత్‌ జీవిత కథను ఏప్రిల్‌ 15, 2012 కావలికోట సంచికలో చదవవచ్చు.