కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులు తమ వివాహబంధాన్ని ఎలా సంతోషమయం చేసుకోవచ్చు?

క్రైస్తవులు తమ వివాహబంధాన్ని ఎలా సంతోషమయం చేసుకోవచ్చు?

“మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.”ఎఫె. 5:33.

పాటలు: 36, 3

1. వివాహ జీవితం ఆనందంతో మొదలైనప్పటికీ, భార్యాభర్తల మధ్య ఏమి కూడా రావచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

 పెళ్లిరోజున, పెళ్లికొడుకు తనకు కాబోయే అందమైన భార్యను చూసినప్పుడు వాళ్లిద్దరి ఆనందానికి అవధులు ఉండవు. కోర్ట్‌షిప్‌లో ఉన్నప్పుడు వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఎంత గాఢంగా పెనవేసుకుపోయిందంటే, పెళ్లి చేసుకుని చివరిశ్వాస వరకు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన తర్వాత వాళ్లిద్దరు కలిసిమెలిసి ఉండాలంటే తమ జీవితాల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తలు తమ వివాహబంధాన్ని ఆనందించాలని వివాహాన్ని ఏర్పాటు చేసిన యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే వాళ్లకు ఉపయోగపడే జ్ఞానవంతమైన సలహాల్ని తన వాక్యమైన బైబిలులో ఇచ్చాడు. (సామె. 18:22) అయినప్పటికీ పెళ్లి చేసుకునే అపరిపూర్ణ మనుషుల మధ్య “శరీరసంబంధమైన శ్రమలు” లేదా సమస్యలు వస్తాయని బైబిలు చెప్తోంది. (1 కొరిం. 7:28) అయితే అలాంటి సమస్యలు ఎక్కువ రాకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఏమి చేయవచ్చు? క్రైస్తవులు తమ వివాహ జీవితాన్ని ఎలా సంతోషమయం చేసుకోవచ్చు?

2. భార్యాభర్తలు ఎన్ని రకాలుగా ప్రేమ చూపించుకోవాలి?

2 ప్రేమ ముఖ్యమైన లక్షణమని బైబిలు బోధిస్తోంది. అయితే భార్యాభర్తలు తమ వివాహ జీవితంలో చూపించుకోవాల్సిన ప్రేమ అనేక రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు వాళ్లు అనురాగంతోపాటు, స్త్రీపురుషుల మధ్య ఉండే ప్రేమను కూడా చూపించుకోవాలి. ఒకవేళ వాళ్లకు పిల్లలు పుడితే, కుటుంబసభ్యుల మధ్య ప్రేమ ఉండడం మరింత అవసరమౌతుంది. అయితే సూత్రబద్ధమైన ప్రేమ లేదా నిస్వార్థమైన ప్రేమ ఉన్నప్పుడే వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది. అలాంటి ప్రేమను వర్ణిస్తూ పౌలు ఇలా అన్నాడు, “మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.”—ఎఫె. 5:33.

భార్యాభర్తల బాధ్యతలు

3. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎంత గాఢంగా ఉండాలి?

3 ‘పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, దానికొరకు తన్నుతాను అప్పగించుకున్నాడు’ అని పౌలు రాశాడు. (ఎఫె. 5:25-27) యేసు తన శిష్యుల్ని ప్రేమించినట్లే నేడున్న క్రైస్తవులు కూడా ఒకరిపట్ల ఒకరు ప్రేమ చూపిస్తూ యేసును అనుకరిస్తారు. (యోహాను 13:34, 35; 15:12, 13 చదవండి.) భార్యాభర్తల మధ్య ప్రేమ ఎంత గాఢంగా ఉండాలంటే వాళ్లు ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి. కానీ సమస్యలు వచ్చినప్పుడు తమ మధ్య ప్రేమ అంత బలంగా లేదని కొంతమంది భార్యాభర్తలు అనుకోవచ్చు. అలాంటి సమయాల్లో వాళ్లకేమి సహాయం చేస్తుంది? సూత్రబద్ధమైన ప్రేమే వాళ్లకు సహాయం చేస్తుంది. అది ‘అన్నిటికి తాళుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది.’ అలాంటి ప్రేమ ‘శాశ్వతకాలముంటుంది.’ (1 కొరిం. 13:7, 8) తాము ఒకరినొకరం ప్రేమించుకుంటామని, నమ్మకంగా ఉంటామని చేసుకున్న ప్రమాణాన్ని భార్యాభర్తలు గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకున్నప్పుడు, యెహోవా సహాయంతో ఎలాంటి సమస్యలనైనా కలిసి పరిష్కరించుకోగలుగుతారు.

4, 5. (ఎ) కుటుంబపెద్దగా భర్త బాధ్యత ఏమిటి? (బి) శిరస్సత్వాన్ని భార్య ఎలా చూడాలి? (సి) ఓ జంట ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవాల్సి వచ్చింది?

4 భార్యాభర్తల బాధ్యతల్ని వర్ణిస్తూ పౌలు ఇలా అన్నాడు, “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు.” (ఎఫె. 5:22, 23) దానర్థం భార్య కన్నా భర్త గొప్పవాడని కాదు. భార్యకున్న విలువైన బాధ్యత గురించి యెహోవా ఇలా అన్నాడు, ‘నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు; వానికి సాటియైన సహాయము వానికోసం చేస్తాను.’ (ఆది. 2:18) తన భర్త ఓ మంచి కుటుంబపెద్దగా ఉండేందుకు భార్య సహాయం చేయాలి. భర్త, “సంఘమునకు శిరస్సై యున్న” యేసును ఆదర్శంగా తీసుకుని భార్యతో ప్రేమగా ప్రవర్తించాలి. అలా చేస్తే, భార్యలో భద్రతా భావం కలుగుతుంది. అంతేకాదు భర్తను గౌరవించడం, అతనికి మద్దతివ్వడం ఆమెకు మరింత తేలికౌతుంది.

5 పెళ్లి తర్వాత కొన్ని రకాల సర్దుబాట్లు చేసుకోవడం అవసరమని చెప్తూ క్యాతీ  [1] ఇలా అంటోంది, “నాకు పెళ్లి అవ్వకముందు నేను ఎవ్వరి మీద ఆధారపడలేదు, నా విషయాలను నేనే చూసుకునేదాన్ని. అయితే పెళ్లయిన తర్వాత నా భర్త మీద ఆధారపడడం నేర్చుకున్నాను. అలా ఆధారపడడం కొన్నిసార్లు కష్టంగానే అనిపించింది. అయినాసరే యెహోవాలా ఆలోచిస్తూ పనులు చేయడం వల్ల భార్యాభర్తలుగా మేమిద్దరం చాలా దగ్గరయ్యాం.” ఆమె భర్త ఫ్రెడ్‌ ఇలా అంటున్నాడు, “నిర్ణయాలు తీసుకోవడం నాకు ప్రతీసారి కష్టంగా అనిపిస్తుంది. పెళ్లి తర్వాత, ఇద్దరి వైపు నుండి ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మరింత కష్టంగా అనిపిస్తుంటుంది. కానీ యెహోవా సహాయం కోసం ప్రార్థిస్తూ, నా భార్య అభిప్రాయాల్ని మనసుపెట్టి వినడంవల్ల రోజురోజుకూ ఆ కష్టం తగ్గుతోంది. మేమిద్దరం ఓ మంచి జట్టు అని నాకు అనిపిస్తోంది.”

6. భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రేమ ఎలా వాళ్లను “పూర్తిస్థాయిలో ఒకటి చేస్తుంది”?

6 ‘ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ’ ఉంటే భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది. భార్యాభర్తలు అపరిపూర్ణులు కాబట్టి వాళ్లిద్దరూ పొరపాట్లు చేస్తారు. వాటినుండి వాళ్లు పాఠాలు నేర్చుకోవచ్చు, క్షమించడం నేర్చుకోవచ్చు, సూత్రబద్ధమైన ప్రేమను చూపించవచ్చు. అలాంటి ప్రేమ వాళ్లను “పూర్తిస్థాయిలో ఒకటి చేస్తుంది.” (కొలొ. 3:13, 14, NW) భార్యాభర్తలు సహనంగా దయగా ఉండడం ద్వారా, ‘అపకారాన్ని మనసులో ఉంచుకోకపోవడం’ ద్వారా అలాంటి ప్రేమను చూపించవచ్చు. (1 కొరిం. 13:4, 5) అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు భార్యాభర్తలు వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి, సాధ్యమైతే ఆ రోజు ముగిసేలోపే చేయాలి. (ఎఫె. 4:26-28) అయితే, “నిన్ను బాధపెట్టినందుకు క్షమించు” అని చెప్పడానికి వినయం, ధైర్యం అవసరం. కానీ అలా చెప్పినప్పుడు సమస్యలు పరిష్కారమౌతాయి, భార్యాభర్తలు ఒకరికొకరు మరింత దగ్గరౌతారు.

అనురాగం చూపించడం చాలా అవసరం

7, 8. (ఎ) భార్యాభర్తలు లైంగిక అవసరాలు తీర్చుకునే విషయంలో బైబిలు ఎలాంటి సలహా ఇస్తోంది? (బి) భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ఎందుకు అనురాగం చూపించుకోవాలి?

7 భార్యాభర్తలు తమ లైంగిక అవసరాల్ని సరైన దృష్టితో చూసేందుకు సహాయం చేసే చక్కని సలహాల్ని బైబిలు ఇస్తోంది. (1 కొరింథీయులు 7:3-5 చదవండి.) భర్త అలాగే భార్య తమ ఇరువురి భావాల్ని, అవసరాల్ని పట్టించుకోవడం ముఖ్యం. ఒకవేళ భర్త తన భార్యపట్ల అనురాగం చూపించకపోతే, తమ లైంగిక సంబంధాన్ని ఆనందించడం ఆమెకు కష్టంగా ఉండవచ్చు. అందుకే భర్తలు తమ భార్యలతో ‘జ్ఞానము చొప్పున’ కాపురం చేయాలని బైబిలు చెప్తుంది. (1 పేతు. 3:7) కాబట్టి లైంగిక అవసరాలు తీర్చమని ఎన్నడూ బలవంతపెట్టకూడదు లేదా బెదిరించకూడదు, వాళ్లలో ఆ కోరిక సహజంగా కలగాలి. సాధారణంగా స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో లైంగిక కోరికలు త్వరగా కలుగుతాయి. అయితే భావోద్వేగపరంగా ఇద్దరూ సిద్ధమయ్యేవరకు వేచిచూడడం మంచిది.

8 భార్యాభర్తలు తమ లైంగిక అవసరాల్ని తీర్చుకునే క్రమంలో వాళ్లమధ్య ఎలాంటి చనువు ఉండాలి, ఎంత చనువు ఉండాలి వంటి విషయాల్లో బైబిలు ఖచ్చితమైన హద్దుల్ని పెట్టట్లేదు. కానీ భార్యాభర్తల మధ్య ఉండే చనువు గురించి మాత్రం బైబిలు మాట్లాడుతోంది. (పరమ. 1:2; 2:6) క్రైస్తవ భార్యాభర్తలకు ఒకరిపట్ల ఒకరికి అనురాగం ఉండాలి.

9. భర్త/భార్యతో తప్ప వేరేవాళ్లతో లైంగిక సంబంధాలు కలిగివుండాలని కోరుకోవడం ఎందుకు తప్పు?

9 మనకు దేవునిమీద అలాగే వివాహజత మీద గాఢమైన ప్రేమ ఉంటే, వివాహబంధాన్ని పాడుచేసేందుకు ఎవరినీ లేదా దేనినీ అనుమతించం. కొంతమంది అశ్లీల చిత్రాలకు బానిసలై వాళ్ల వివాహబంధంలో బీటలు వచ్చేలా చేసుకున్నారు, మరికొంతమంది పూర్తిగా పాడుచేసుకున్నారు. కాబట్టి అశ్లీల చిత్రాలు చూడాలని లేదా వేరేవాళ్లతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని కలిగే ఎలాంటి కోరికలనైనా మనం చంపేసుకోవాలి. అంతేకాదు భర్త/భార్యతో కాకుండా వేరే ఎవ్వరితోనైనా మనం సరసాలాడుతున్నట్లు ప్రవర్తించకూడదు, అలాచేస్తే ప్రేమ చూపించినట్లు అవ్వదు. దేవునికి మన ఆలోచనలు, పనులు అన్నీ తెలుసని మనం గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకుంటే దేవున్ని సంతోషపెట్టాలని, మన భర్త/భార్యకు నమ్మకంగా ఉండాలని మరింత బలంగా కోరుకుంటాం.—మత్తయి 5:27, 28; హెబ్రీయులు 4:13 చదవండి.

భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు

10, 11. (ఎ) విడాకులు తీసుకోవడం ఈ రోజుల్లో ఎంత సర్వసాధారణమైపోయింది? (బి) వేరైపోవడం గురించి బైబిలు ఏమి చెప్తోంది? (సి) వేరైపోవాలనే నిర్ణయానికి త్వరగా రాకుండా ఉండేందుకు భార్యాభర్తలకు ఏమి సహాయం చేస్తుంది?

10 పెద్దపెద్ద సమస్యలు పరిష్కారం కానప్పుడు, కొంతమంది భార్యాభర్తలు వేరైపోవాలని లేదా విడాకులు తీసుకోవాలనే ముగింపుకు వచ్చేస్తారు. కొన్ని దేశాల్లోనైతే సగంకన్నా ఎక్కువ జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. నిజమే క్రైస్తవ సంఘాల్లో అలాంటివి అంత ఎక్కువగా జరగడం లేదు. కానీ చాలామంది భార్యాభర్తల మధ్య పెద్దపెద్ద సమస్యలు మాత్రం ఉన్నాయి.

11 బైబిలు ఈ సలహాల్ని ఇస్తోంది: “భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధానపడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.” (1 కొరిం. 7:10, 11) కొంతమంది భార్యాభర్తలు, తమ మధ్య వచ్చిన గొడవలకు ఏకైక పరిష్కారం వేరైపోవడమేనని అనుకుంటారు. అయితే పెళ్లి గురించి దేవుడు పలికిన మాటల్ని చెప్పిన తర్వాత యేసు ఇలా అన్నాడు, ‘దేవుడు జతపరచినవాళ్లను మనుష్యుడు వేరుపరచకూడదు.’ వేరైపోవడం ఎంత పెద్ద విషయమో యేసు అన్న ఆ మాటల్నిబట్టి తెలుస్తోంది. (మత్త. 19:3-6; ఆది. 2:24) భార్యాభర్తలు చిరకాలం కలిసుండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 కొరిం. 7:39) మనం చేసే ప్రతీ పనికి యెహోవాకు జవాబు చెప్పాలని మనం గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకుంటే, గోరంత సమస్యలు కొండంత పెద్దవి కాకముందే పరిష్కరించుకోగలుగుతాం.

12. భార్యాభర్తలు ఎలాంటి సమస్యలవల్ల వేరైపోవాలని అనుకుంటారు?

12 కొంతమంది భార్యాభర్తల మధ్య పెద్దపెద్ద గొడవలు ఎందుకు వస్తాయి? వివాహ జీవితం అనుకున్నంత సాఫీగా లేనప్పుడు వాళ్లు నిరాశపడతారు లేదా కోపం పెంచుకుంటారు. చాలావరకు వాళ్లు పెరిగిన విధానంలో, స్పందించే తీరులో చాలా తేడాలు ఉండడంవల్ల గొడవలు రావచ్చు. అంతేకాదు అత్తమామలతో ఇబ్బందులు, డబ్బును ఎలా ఖర్చుపెట్టాలి, పిల్లల్ని ఎలా పెంచాలి వంటి విషయాల్లో అభిప్రాయభేదాలవల్ల కూడా గొడవలు రావచ్చు. అయితే దేవుడిచ్చిన సలహాల్ని పాటించడంవల్ల చాలామంది క్రైస్తవ భార్యాభర్తలు తమ సమస్యలకు పరిష్కారం కనుగొనగలిగారు.

13. కొంతమంది ఎలాంటి బలమైన కారణాలవల్ల వేరైపోవాలనుకుంటారు?

13 వేరైపోయేందుకు భార్యాభర్తల దగ్గర బలమైన కారణాలు ఉండవచ్చు. కావాలని కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, భార్యను బాగా కొట్టడం, పూర్తిగా దేవునికి దూరమయ్యేలా చేయడం వంటి తీవ్రమైన సమస్యలు ఎదురైనప్పుడు కొంతమంది వేరైపోవాలని అనుకుంటారు. భార్యాభర్తల మధ్య అలాంటి పెద్దపెద్ద సమస్యలు ఉన్నప్పుడు సంఘపెద్దల సహాయం అడగాలి. వాళ్లకు చాలా అనుభవం ఉంటుంది కాబట్టి దేవుడిచ్చే సలహాను పాటించడానికి వాళ్లు సహాయం చేస్తారు. పెళ్లయినవాళ్లు పవిత్రశక్తి సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాలి. బైబిలు సూత్రాల్ని పాటించడానికి, క్రైస్తవ లక్షణాల్ని చూపించడానికి అది వాళ్లకు సహాయం చేస్తుంది.—గల. 5:22-24. [2]

14. అవిశ్వాసి అయిన భర్త లేదా భార్య ఉన్న క్రైస్తవులకు బైబిలు ఏమి చెప్తోంది?

14 తమ భర్త/భార్య అవిశ్వాసి అయినప్పటికీ వాళ్లతో కలిసి ఉండేందుకు సరైన కారణాలు ఉన్నాయని బైబిలు చెప్తోంది. (1 కొరింథీయులు 7:12-14 చదవండి.) యెహోవాసాక్షిని పెళ్లిచేసుకోవడం వల్ల ఆ అవిశ్వాసి “పరిశుద్ధపరచబడును” అని బైబిలు చెప్తోంది. అంతేకాదు వాళ్ల పిల్లలు ‘పవిత్రులుగా’ ఎంచబడతారు కాబట్టి వాళ్లకు దేవుని సంరక్షణ ఉంటుంది. అవిశ్వాసి అయిన భర్త లేదా భార్య ఉన్న క్రైస్తవులకు పౌలు ఇలా చెప్తున్నాడు, “ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?” (1 కొరిం. 7:16) అవిశ్వాసి అయిన తమ భర్త లేదా భార్య యెహోవాసాక్షి అయ్యేందుకు సహాయం చేసిన క్రైస్తవుల మంచి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

15, 16.(ఎ) అవిశ్వాసులైన భర్తలున్న భార్యలకు బైబిలు ఏమని సలహా ఇస్తోంది? (బి) అవిశ్వాసియైన భర్త లేదా భార్య వేరైపోవాలని నిర్ణయించుకుంటే ఏమి చేయాలి?

15 క్రైస్తవ భార్యలు తమ భర్తలకు లోబడివుండాలని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. అలా ఉంటే, ‘వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చు.’ కాబట్టి క్రైస్తవ భార్యలు ప్రతీసారి తమ నమ్మకాల గురించి మాట్లాడే బదులు, దేవుడు ఎంతో విలువైనవిగా చూసే ‘సాధువైన, మృదువైన’ గుణాల్ని చూపించాలి. వాటినిబట్టి భర్తలు సత్యాన్ని అంగీకరించవచ్చు.—1 పేతు. 3:1-4.

16 ఒకవేళ అవిశ్వాసియైన భర్త లేదా భార్య వేరైపోవాలని నిర్ణయించుకుంటే ఏమి చేయాలి? బైబిలు ఇలా చెప్తోంది, “అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు.” (1 కొరిం. 7:15) వేరుగా ఉండడంవల్ల కాస్త మనశ్శాంతి ఉండవచ్చు, కానీ బైబిలు ప్రకారం క్రైస్తవులైన భర్త/భార్యకు మాత్రం వేరే పెళ్లి చేసుకునే వీలులేదు. అలాగని వేరైపోవాలని నిర్ణయించుకున్న భాగస్వామిని ఉండిపొమ్మని బలవంతపెట్టాల్సిన అవసరం కూడా లేదు. కొంతకాలం గడిచాక, మీతో కలిసి జీవించేందుకు అవిశ్వాసియైన భర్త/భార్య తిరిగిరావచ్చు. భవిష్యత్తులో వాళ్లు యెహోవా ఆరాధకులు కూడా కావచ్చు.

పెళ్లయినవాళ్లు దేనికి మొదటి స్థానమివ్వాలి?

యెహోవా ఆరాధనకు మొదటి స్థానమిస్తే, భార్యాభర్తల మధ్య సంతోషం రెట్టింపవుతుంది (17వ పేరా చూడండి)

17. పెళ్లయినవాళ్లు దేనికి మొదటి స్థానమివ్వాలి?

17 మనం ‘అంత్యదినాల’ చివరిభాగంలో జీవిస్తున్నాం కాబట్టి ‘అపాయకరమైన కాలాలు’ ఎదురౌతాయి. (2 తిమో. 3:1-5) ఇలాంటి సమయంలో యెహోవాతో మనకున్న బలమైన సంబంధమే రక్షణగా ఉంటుంది. ‘కొంచెం సమయమే మిగిలి ఉంది’ అని పౌలు రాశాడు. కాబట్టి ‘ఇప్పటినుండి భార్య ఉన్నవాళ్లు భార్య లేనట్టుగా ఉండాలి. ఈ లోకాన్ని ఉపయోగించుకునేవాళ్లు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోనట్టుగా ఉండాలి.’ (1 కొరిం. 7:29-31, NW) అంటే తమ వివాహజతను పట్టించుకోవద్దని పౌలు చెప్పట్లేదుగానీ, మనం చివరిరోజుల్లో జీవిస్తున్నాం కాబట్టి యెహోవా ఆరాధనకు మొదటి స్థానమివ్వాలని ఆ మాటలకర్థం.—మత్త. 6:33.

18. భార్యాభర్తలు ఆనందంగా ఉంటూ చివరివరకు కలిసుండడం సాధ్యమేనా?

18 కష్టతరమైన ఈరోజుల్లో ఎన్నో జంటలు మన కళ్లముందే విడిపోతున్నాయి. అసలు భార్యాభర్తలు ఆనందంగా ఉంటూ చివరివరకు కలిసుండడం సాధ్యమేనా? దేవునికీ, ఆయన ప్రజలకూ దగ్గరగా ఉంటూ; దేవుడు తన పవిత్రశక్తి ద్వారా ఇచ్చే నిర్దేశాల్ని పాటిస్తే అది సాధ్యమే. అలాచేస్తే, ఇద్దరు వ్యక్తుల్ని ఒక్కటి చేస్తూ దేవుడు చేసిన ఏర్పాటుకు గౌరవం చూపించినవాళ్లమౌతాం.—మార్కు 10:9.

^ [1] (5వ పేరా) అసలు పేర్లు కావు.

^ [2] (13వ పేరా) ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే పుస్తకంలోని అనుబంధంలో, 251-252 పేజీల్లో ఉన్న “విడాకులు, వేరుగా ఉండడం గురించి బైబిలు ఏమి చెబుతోంది?” అనే ఆర్టికల్‌ చూడండి.