కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

చేతులు కడుక్కునే విషయంలో యేసు శత్రువులు ఎందుకు రాద్ధాంతం చేశారు?

యేసు శత్రువులు యేసును, ఆయన శిష్యులను చాలా విషయాల్లో తప్పుపట్టారు. వాటిలో చేతులు కడుక్కునే ఆచారం ఒకటి. మనుషుల్ని అపవిత్రం చేసేవేమిటో మోషే ధర్మశాస్త్రం వివరించింది. వాటిలో శరీరం నుండి వచ్చే స్రావాలు, కుష్ఠు వ్యాధి, మనుషుల లేదా జంతువుల మృతకళేబరాలను ముట్టడం వంటివి ఉన్నాయి. వాటివల్ల అపవిత్రమైనవాళ్లు మళ్లీ పవిత్రులు కావాలంటే ఏం చేయాలో కూడా ధర్మశాస్త్రంలో ఉంది. బలులు అర్పించడం ద్వారా, బట్టలు ఉతుక్కోవడం ద్వారా, లేదా రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా వాళ్లు పవిత్రులు అవ్వవచ్చు.—లేవీ. 11-15 అధ్యాయాలు; సంఖ్యా. 19వ అధ్యాయం.

యూదా మతనాయకులు లేదా రబ్బీలు ఈ ఆజ్ఞలకు అదనపు నియమాలను చేర్చారు. ఒక నివేదిక ఏమి చెప్తుందంటే, ఒకరు వేటివల్ల అపవిత్రం అవుతారు, వాళ్ల ద్వారా ఇతరులు కూడా ఎలా అపవిత్రులు అవుతారు వంటి వాటికి సంబంధించి ధర్మశాస్త్రంలో లేనివాటిని మతనాయకులు చేర్చారు. అంతేకాదు ఏ పాత్రలు-వస్తువులు అపవిత్రం అవ్వవచ్చు లేదా అవ్వకపోవచ్చు; ఒకరు మళ్లీ పవిత్రం అవ్వాలంటే ఏ ఆచారాలు పాటించాలి వంటి వాటిగురించి కూడా నియమాలు పెట్టారు.

యేసు శత్రువులు ఆయన్ని ఇలా ప్రశ్నించారు: “నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక, అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురు?” (మార్కు 7:5) నిజానికి ఆ మతనాయకులు పరిశుభ్రత గురించి మాట్లాడడం లేదు. బదులుగా ఒక ఆచారంలా, భోజనం చేసే ముందు తమ చేతుల మీద ఎవరైనా ఒకరు నీళ్లు పోయాలని వాళ్లు అనుకునేవాళ్లు. పైన చెప్పుకున్న నివేదికలో ఇంకా ఇలా ఉంది, “నీళ్లు పోస్తున్నప్పుడు ఏ పాత్రలను ఉపయోగించాలి, ఎలాంటి నీళ్లు పోయాలి, ఎవరు పోయాలి, చేతులు ఎంతవరకు తడవాలి వంటి వాటిగురించి కూడా వాదించుకునేవాళ్లు.”

మనుషులు పెట్టిన ఈ ఆజ్ఞల్ని యేసు పెద్దగా పట్టించుకోలేదు. మొదటి శతాబ్దంలోని యూదా మతనాయకులతో ఆయన ఇలా అన్నాడు, “ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు.”—మార్కు 7:6-8.