కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిచర్యకు వెళ్తున్న యోహానస్‌ రావుట, బహుశా అది 1920లలో కావచ్చు

ఆనాటి జ్ఞాపకాలు

“నేను సువార్తను ప్రకటిస్తూ యెహోవాను స్తుతిస్తున్నాను”

“నేను సువార్తను ప్రకటిస్తూ యెహోవాను స్తుతిస్తున్నాను”

“ప్రస్తుతం యూరప్‌లో చెలరేగుతున్న యుద్ధంతో పోలిస్తే, గతంలో జరిగిన యుద్ధాలేవీ పెద్దవి కావు” అని మొదటి ప్రపంచ యుద్ధం గురించి సెప్టెంబరు 1, 1915 కావలికోట సంచిక పేర్కొంది. ఆ యుద్ధంలో దాదాపు 30 దేశాలు పాల్గొన్నాయి. ఆ సమయంలోని పరిస్థితులవల్ల “రాజ్యసేవ కొంతవరకు కుంటుపడింది, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో ప్రకటనాపని చేయడం కష్టమైంది” అని కూడా ఆ కావలికోట పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతున్న ఆ సమయంలో, బైబిలు విద్యార్థులు క్రైస్తవ తటస్థత గురించిన పూర్తి అర్థాన్ని గ్రహించలేదు. అందుకే మిలటరీలో చేరారు. కానీ సువార్తను ప్రకటించాలని మాత్రం నిర్ణయించుకున్నారు. రాజ్యసేవలో తన వంతు కృషి చేయాలనుకున్న విల్‌హెల్మ్‌ హిల్డ్‌బ్రాన్ట్‌ అనే వ్యక్తి ఫ్రెంచ్‌ భాషలో ఉన్న ద బైబిల్‌ స్టూడింట్స్‌ మంథ్లీ అనే కరపత్రాల్ని ఆర్డరు పెట్టాడు. ఇంతకీ అతను ఫ్రాన్స్‌లో సేవచేస్తున్న కల్‌పోర్చరు (పయినీరు) కాదు, ఓ జర్మన్‌ సైనికుడు. మిలిటరీ దుస్తుల్లో ఉన్న ఇతను ఫ్రాన్స్‌ దేశస్థులకు శాంతి గురించిన సువార్తను ప్రకటించాడు. తమను శత్రువులుగా చూడాల్సిన సైనికుడు అలా ప్రకటించడం చూసి ఆ ఫ్రాన్స్‌ దేశస్థులు ఆశ్చర్యపోయారు.

మిలిటరీలో పనిచేస్తున్న ఎంతోమంది ఇతర జర్మన్‌ బైబిలు విద్యార్థుల్లో కూడా రాజ్యసువార్తను ప్రకటించాలనే బలమైన కోరిక ఉందని కావలికోటలో వచ్చిన ఉత్తరాల్ని బట్టి అర్థమైంది. నేవీలో పనిచేసిన లెమ్‌కీ అనే సహోదరుడు తన తోటి పనివాళ్లలో ఐదుగురికి సత్యం తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని గమనించాడు. అతను ఇలా రాశాడు, “నౌకలో ప్రయాణిస్తూ కూడా నేను సువార్తను ప్రకటిస్తూ యెహోవాను స్తుతిస్తున్నాను.”

గేయార్గ్‌ కైజర్‌ అనే ఓ వ్యక్తి సైనికునిగా వెళ్లి సత్యదేవుని సేవకునిగా ఇంటికి తిరిగొచ్చాడు. అదెలా? అతనికి ఎలాగోలా బైబిలు విద్యార్థుల ప్రచురణ ఒకటి దొరికింది. దాంతో అతను సత్యాన్ని హత్తుకుని యుద్ధం చేయడం మానేశాడు. ఆ తర్వాత మిలిటరీలోనే ఆయుధాలు ధరించి యుద్ధం చేయాల్సిన అవసరంలేని పనిచేశాడు. యుద్ధం అయిపోయాక పయినీరుగా సేవచేస్తూ ఎన్నో ఏళ్లపాటు ఉత్సాహంగా సువార్త ప్రకటించాడు.

బైబిలు విద్యార్థులు తటస్థత గురించి పూర్తిగా అర్థం చేసుకోకపోయినప్పటికీ, వాళ్ల ప్రవర్తన-ఆలోచనా తీరుకు, యుద్ధంలో భాగం వహిస్తున్న ప్రజల ప్రవర్తన-ఆలోచనా తీరుకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపించింది. ఓ వైపు రాజకీయ నాయకులు, మతనాయకులు యుద్ధానికి మద్దతిస్తుంటే, బైబిలు విద్యార్థులు మాత్రం ‘సమాధానకర్తయగు అధిపతినే’ అంటిపెట్టుకుని ఉన్నారు. (యెష. 9:6) అయితే వాళ్లలో కొంతమంది పూర్తిగా తటస్థంగా లేకపోయినప్పటికీ నరహత్య చేయకూడదనే ప్రాథమిక సూత్రాన్ని మాత్రం అస్సలు మీరకూడదని నిర్ణయించుకున్నారు. కాన్‌రాట్‌ మర్ట అనే బైబిలు విద్యార్థి ఇలా చెప్పాడు, “క్రైస్తవులు ఇతరుల్ని చంపకూడదని దేవుని వాక్యం నుండి స్పష్టంగా తెలుసుకున్నాను.”—నిర్గ. 20:13. a

గోల్డెన్‌ ఏజ్‌ గురించి ప్రకటించడానికి ఈ తోపుడు బండిని హాన్స్‌ హల్టహాఫ్‌ ఉపయోగించాడు

జర్మనీ చట్టప్రకారం, మతనమ్మకాల్నిబట్టి యుద్ధంలో పాల్గొనకుండా ఉండడానికి అనుమతి లేదు. అయినప్పటికీ 20 కన్నా ఎక్కువమంది బైబిలు విద్యార్థులు మిలిటరీకి సంబంధించిన ఎలాంటి పని చేయడానికీ ఒప్పుకోలేదు. దాంతో వాళ్లలో కొంతమందిని పిచ్చివాళ్లుగా ముద్రవేసి పిచ్చి ఆసుపత్రికి పంపించి, మత్తు ఇచ్చేవాళ్లు. అలాంటివాళ్లలో గాస్తాఫ్‌ కాయాట్‌ ఒకడు. అలాంటి మరో వ్యక్తి హాన్స్‌ హల్టహాఫ్‌. అతను యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించినందుకు జైల్లో వేశారు, అక్కడ కూడా యుద్ధానికి సంబంధించిన ఏ పనీ చేయడానికి అతను ఒప్పుకోలేదు. అప్పుడు గార్డులు, నిర్బంధించడానికి ఉపయోగించే ఓ రకమైన బిగుతు దుస్తుల్ని (straitjacket) అతనికి వేసి నిర్బంధించారు, దాంతో రక్తప్రసరణ జరగక అతని కాళ్లు మొద్దుబారిపోయాయి. అయినాసరే హాన్స్‌ అతని నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో, కాల్చి చంపేస్తామని గార్డులు బెదిరించారు. ఏదేమైనా హాన్స్‌ యుద్ధం అయిపోయేంతవరకు తటస్థంగా ఉన్నాడు.

ఇతర సహోదరులు ఆయుధాలు ధరించి యుద్ధం చేయడానికి ఒప్పుకోలేదుగానీ మిలిటరీలోనే ఆయుధాలు ధరించాల్సిన అవసరంలేని పనులు ఇవ్వమని అధికారుల్ని అడిగారు. b యోహానస్‌ రావుట కూడా అలాంటి విన్నపమే చేసుకున్నాడు, దాంతో అతనికి రైల్వేలో పనిచేయమని చెప్పారు. కాన్‌రాట్‌ మర్టకు వైద్య విభాగంలో పని అప్పగించారు, రైన్‌హోల్ట్‌ వేబర్‌ను నర్సుగా నియమించారు. ఆగాస్ట్‌ క్రాఫ్‌చిక్‌కు లగేజీని చూసుకునే పని అప్పజెప్పారు. ఆయుధాలు పట్టుకోవాల్సిన పని ఇవ్వనందుకు వీళ్లందరూ ఎంతో సంతోషించారు. ప్రేమ, నమ్మకం గురించి అర్థంచేసుకున్న ఈ బైబిలు విద్యార్థులు, అలాగే ఇతరులు యెహోవాను సేవించాలని నిర్ణయించుకున్నారు.

బైబిలు విద్యార్థులు యుద్ధంలో పాల్గొననందుకు, వాళ్ల ప్రతీ కదలికను అధికారులు జాగ్రత్తగా గమనించేవాళ్లు. అయితే ప్రకటనాపని చేసినందుకు ఆ తర్వాతి సంవత్సరాల్లో జర్మనీలోని బైబిలు విద్యార్థులపై వేలకొలది కేసులు వేశారు. వాళ్లకు సహాయం చేసేందుకు జర్మనీలోని మన బ్రాంచి కార్యాలయం, సహోదరులు చట్టపరంగా ఎదుర్కొనే ఇబ్బందుల్ని చూసుకోవడానికి మాగ్డెబర్గ్‌లో ఉన్న బెతెల్‌లో ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది.

క్రైస్తవులుగా తటస్థంగా ఉండే విషయంపై తమ అవగాహనను యెహోవాసాక్షులు క్రమక్రమంగా సవరించుకుంటూ వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు, మిలిటరీకి పూర్తిగా దూరంగా ఉండడం ద్వారా తమ యథార్థతను కాపాడుకున్నారు. అయితే అలా ఉన్నందుకు జర్మనీ ప్రభుత్వం వాళ్లను శత్రువులుగా చూసి, దారుణంగా హింసించింది. వాటిగురించి, “ఆనాటి జ్ఞాపకాలు” శీర్షిక పేరుతో వచ్చే తర్వాతి ఆర్టికల్స్‌లో తెలుసుకుంటాం.—సెంట్రల్‌ యూరప్‌ నుండి సేకరించినవి.

a మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌లో ఉంటున్న బైబిలు విద్యార్థుల అనుభవాల గురించి తెలుసుకోవడానికి మే 15, 2013 కావలికోట సంచికలోని ‘ఆనాటి జ్ఞాపకాలు—“శోధనకాలములో” వాళ్లు స్థిరంగా నిలబడ్డారు’ అనే ఆర్టికల్‌ చూడండి.

b అలా చేయవచ్చని మిలీనియల్‌ డాన్‌ అనే సిరీస్‌లోని (1904) ఆరవ సంపుటిలో, ఆగస్టు 1906లోని జాయన్స్‌ వాచ్‌ టవర్‌ జర్మన్‌ ఎడిషన్‌లో సంస్థ చెప్పింది. అయితే సెప్టెంబరు 1915 ద వాచ్‌ టవర్‌ సంచిక మన అవగాహనలో మార్పు వచ్చిందని చెప్తూ, బైబిలు విద్యార్థులు మిలిటరీలో అస్సలు చేరవద్దని సలహా ఇచ్చింది. అయితే ఈ ఆర్టికల్‌ను జర్మన్‌ ఎడిషన్‌లో ప్రచురించలేదు.