పాఠకుల ప్రశ్న
యేసు పుట్టుక, చిన్నతనం గురించి మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్తలో ఉన్న విషయాలు ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి?
ఆ సువార్త వృత్తాంతాల్ని రాసినవాళ్లు వేర్వేరు వ్యక్తుల ఆలోచనల్ని, అనుభవాల్ని దృష్టిలోపెట్టుకుని రాశారు. అందుకే యేసు పుట్టుక, చిన్నతనం గురించి మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్తలో ఉన్న విషయాలు వేర్వేరుగా ఉన్నాయి.
మత్తయి సువార్తలో ముఖ్యంగా యోసేపు జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఉంది. ఉదాహరణకు, మరియ గర్భవతి అని తెలిసినప్పుడు యోసేపు స్పందించిన తీరు గురించి, దేవదూత కలలో కనబడి అసలు విషయాన్ని అతనికి వివరించడం గురించి, దేవదూత ఇచ్చిన నిర్దేశాలను యోసేపు పాటించిన విధానం గురించి మత్తయి తన సువార్తలో వివరించాడు. (మత్త. 1:19-25) అంతేకాదు, దేవదూత కలలో కనబడి యోసేపును తన కుటుంబంతో సహా ఐగుప్తుకు పారిపొమ్మని హెచ్చరించడం, యోసేపు దాని ప్రకారం చేయడం గురించి మత్తయి రాశాడు. ఆ తర్వాత యోసేపుకు మరో కల వచ్చిందని, దేవదూత మళ్లీ కనిపించి అతన్ని ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్లమని చెప్పాడని, యోసేపు తన కుటుంబంతో వచ్చి నజరేతులో స్థిరపడ్డాడని కూడా మత్తయి వివరించాడు. (మత్త. 2:13, 14, 19-23) మత్తయి తన సువార్తలోని మొదటి రెండు అధ్యాయాల్లో యోసేపు పేరును 12 సార్లు ప్రస్తావించాడు, కానీ మరియ పేరును కేవలం ఏడు సార్లే ప్రస్తావించాడు.
అయితే, లూకా సువార్తలో ముఖ్యంగా మరియ గురించి ఉంది. గబ్రియేలు దూత మరియ దగ్గరకు రావడం, ఆమె ఎలీసబెతు దగ్గరకు వెళ్లడం, మరియ యెహోవాను స్తుతిస్తూ మాట్లాడడం గురించి లూకా రాశాడు. అంతేకాదు అతను, భవిష్యత్తులో యేసు అనుభవించబోయే బాధల గురించి సుమెయోను మరియతో చెప్పిన విషయాలు కూడా రాశాడు. యేసుకు 12 ఏళ్లు ఉన్నప్పుడు తన కుటుంబంతో పాటు ఆయన ఆలయానికి వెళ్లిన సందర్భం గురించి లూకా వివరించాడు. ఈ సందర్భం గురించి రాస్తున్నప్పుడు కూడా, లూకా మరియ మాటలనే ప్రస్తావించాడుగానీ యోసేపు మాటల్ని కాదు. అంతేకాదు ఆ సంఘటనలన్నీ మరియపై ప్రభావం చూపించాయని కూడా లూకా రాశాడు. (లూకా 2:19, 34, 35, 48, 51) లూకా తన సువార్తలోని మొదటి రెండు అధ్యాయాల్లో మరియ పేరు 14 సార్లు ప్రస్తావించాడు, యోసేపు పేరు కేవలం నాలుగుసార్లే ప్రస్తావించాడు. కాబట్టి మత్తయి తన వృత్తాంతంలో ఎక్కువగా యోసేపు ఆలోచనల గురించి, పనుల గురించి చెప్పాడు. కానీ లూకా ఎక్కువగా మరియ ఆలోచనల గురించి, ఆమెకు ఎదురైన అనుభవాల గురించి చెప్పాడు.
యేసు వంశావళి కూడా రెండు సువార్తల్లో వేర్వేరుగా ఉంది. మత్తయి తన సువార్తలో, యోసేపు వంశావళిని రాయడం ద్వారా యేసు యోసేపుకు దత్తత కుమారుడని, దావీదు సింహాసనాన్ని పొందడానికి యేసుకు చట్టపరమైన హక్కు ఉందని సూచించాడు. ఆ హక్కు ఎలా వచ్చింది? దావీదు కుమారుడైన సొలొమోను వంశంలో పుట్టడంవల్ల రాజైన దావీదుకు యోసేపు వారసుడయ్యాడు. (మత్త. 1:6, 16) అయితే లూకా తన సువార్తలో, మరియ వంశావళిని రాయడం ద్వారా ‘మానవుడిగా పుట్టిన’ యేసుకు దావీదు సింహాసనాన్ని పొందే హక్కు సహజంగానే వచ్చిందని సూచించాడు. (రోమా. 1:3) యేసుకు ఆ హక్కు ఎలా వచ్చింది? ఎలాగంటే, మరియ దావీదు కుమారుడైన నాతాను వంశంలో పుట్టి దావీదుకు వారసురాలైంది. (లూకా 3:31) అయితే, మరియ హేలీ కూతురు అని లూకా ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే, సాధారణంగా అధికారిక లెక్కల్లో కుటుంబంలోని పురుషుల పేర్లనే నమోదు చేస్తారు. కాబట్టి, లూకా యోసేపు గురించి చెప్తూ అతను హేలీ కుమారుడని ప్రస్తావించినప్పుడు, యోసేపు హేలీకి అల్లుడని ప్రజలు అర్థంచేసుకున్నారు.—లూకా 3:23.
మత్తయి అలాగే లూకా సువార్తల్లో ఉన్న యేసు వంశావళిని బట్టి దేవుడు వాగ్దానం చేసిన మెస్సీయ ఆయనేనని రుజువౌతుంది. యేసు దావీదు వంశస్థుడనే విషయం ఎంత వాస్తవమంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా దాన్ని ఖండించలేరు. యేసు వంశావళి గురించి మత్తయి, లూకా సువార్తల్లో ఉన్న వివరాలు ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే, దేవుడు చేసిన మిగతా వాగ్దానాలు కూడా నెరవేరతాయనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని అవి మనలో కలిగిస్తాయి.