కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఇష్టంతో ఓపిగ్గా ఎదురుచూస్తారా?

మీరు ఇష్టంతో ఓపిగ్గా ఎదురుచూస్తారా?

“మీరు కూడా ఓపిక పట్టండి.”యాకో. 5:8.

పాటలు: 114, 79

1, 2. (ఎ) ‘ఎన్నాళ్లు’ లేదా ‘ఎంతకాలం’ అనే ప్రశ్న మనలో ఎందుకు తలెత్తవచ్చు? (బి) ప్రాచీన కాలంలోని నమ్మకమైన సేవకుల ఉదాహరణలు బట్టి మనమెందుకు ప్రోత్సాహం పొందుతాం?

 ‘ఎన్నాళ్లు?’ ఈ ప్రశ్నను యెహోవాకు నమ్మకంగా సేవచేసిన యెషయా, హబక్కూకు ప్రవక్తలు అడిగారు. (యెష. 6:11; హబ. 1:2) అలాంటి ప్రశ్ననే రాజైన దావీదు 13వ కీర్తనను రాస్తున్నప్పుడు ఐదుసార్లు అడిగాడు. (కీర్త. 13: 1, 2) విశ్వాసంలేని ప్రజలు తన చుట్టూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు కూడా ‘ఎంతకాలం?’ అని అడిగాడు. (మత్త. 17:17) నేడు కూడా మన మనసుల్లో అలాంటి ప్రశ్నే కొన్నిసార్లు మెదులుతూ ఉండవచ్చు.

2 ఇంతకీ ఏ కారణాలవల్ల ‘ఎన్నాళ్లు’ లేదా ‘ఎంతకాలం’ అనే ప్రశ్న మనలో తలెత్తవచ్చు? బహుశా మనకేదైనా అన్యాయం జరిగినప్పుడో, ఆరోగ్యం పాడైనప్పుడో, వయసు పైబడుతున్నప్పుడో మనకు అలా అనిపించవచ్చు. అంతేకాదు ‘ప్రమాదకరమైన, కష్టమైన కాలాల్లో’ జీవిస్తుండడం వల్ల కలిగే ఆందోళన బట్టి మనకు అలా అనిపించవచ్చు. (2 తిమో. 3:1) లేదా మన చుట్టూ ఉన్న ప్రజల చెడ్డ ఆలోచనలవల్ల మనలో విసుగు, నిరుత్సాహం కలిగి కూడా అలా అనిపించవచ్చు. కారణం ఏదైనప్పటికీ, ఆ ప్రశ్నను అడిగినందుకు ప్రాచీన కాలంలోని తన సేవకుల్ని యెహోవా గద్దించలేదు. ఆ విషయం మనకెంత ప్రోత్సాహాన్నిస్తుందో కదా!

3. కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకేమి సహాయం చేస్తుంది?

3 సహించడానికి కష్టంగా అనిపించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకేది సహాయం చేయగలదు? యేసు తమ్ముడైన యాకోబు పవిత్రశక్తి సహాయంతో ఇలా రాశాడు, “సోదరులారా, ప్రభువు ప్రత్యక్షత వరకు ఓపికపట్టండి.” (యాకో. 5:7) కాబట్టి మనందరం ఓపిగ్గా ఉండాలి. అసలు ఓపిక లేదా ఓర్పు అంటే ఏమిటి? ఆ చక్కని లక్షణాన్ని మనం ఏ విధంగా చూపించవచ్చు?

ఓపిక అంటే ఏమిటి?

4, 5. (ఎ) ఓపిక అంటే ఏమిటి? మనమెలా ఓపిగ్గా ఉండవచ్చు? (బి) ఓపిగ్గా ఉండడాన్ని యాకోబు దేనితో పోల్చాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

4 ఓపిక అనేది పవిత్రశక్తి పుట్టించే లక్షణమని బైబిలు చెప్తోంది. తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు దేవుని సహాయం లేకుండా ఓపిగ్గా ఉండడం అపరిపూర్ణ మనుషులకు సాధ్యంకాదు. నిజానికి ఓపిక అనే లక్షణం దేవుడిచ్చే బహుమానం. ఆ లక్షణాన్ని చూపించడం ద్వారా యెహోవాపట్ల, ఇతరులపట్ల ప్రేమ ఉందని చూపిస్తాం. మనం ఓపిక చూపించనప్పుడు మనకు, ఇతరులకు మధ్య ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. (1 కొరిం. 13:4; గల. 5:22) ఇంతకీ ఓపిగ్గా ఉన్నామని మనమెలా చూపించవచ్చు? కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆశను వదులుకోకుండా సహిస్తే ఓపిగ్గా ఉంటున్నట్లే. (కొలొ. 1:11; యాకో. 1:3, 4) అంతేకాదు ఎలాంటి సమస్యలు వచ్చినా యెహోవాకు నమ్మకంగా ఉంటే మనం ఓపిక చూపిస్తున్నట్లే. పైగా మనకు ఓపిక ఉంటే మనల్ని ఎవరైనా బాధపెట్టినప్పుడు వాళ్లమీద పగతీర్చుకోం. అందుకే ఇష్టంతో ఓపిగ్గా ఎదురుచూడమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. యాకోబు 5:7, 8 వచనాలు మనకు నేర్పించే ముఖ్యమైన పాఠం అదే. (చదవండి.)

5 యెహోవా చర్య తీసుకునేంతవరకు మనమెందుకు ఎదురుచూడాలి? శిష్యుడైన యాకోబు మన పరిస్థితిని రైతు పరిస్థితితో పోలుస్తున్నాడు. రైతు ఎంతో కష్టపడి విత్తనాలు చల్లినప్పటికీ, అతను వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చలేడు అలాగే మొక్కలు త్వరగా పెరిగేలా చేయలేడు. సమయం త్వరగా గడిచేలా కూడా చేయలేడు. అతను చేయగలిగిందల్లా “విలువైన పంట కోసం” ఓపిగ్గా ఎదురుచూడడమే. అదేవిధంగా యెహోవా చేసిన వాగ్దానాలు నిజమయ్యే రోజు కోసం మనం వేచిచూస్తున్నాం. ఈలోపు పరిస్థితుల్ని మనం మార్చలేము ఎందుకంటే ఎన్నో విషయాలు మన చేతుల్లో లేవు. (మార్కు 13:32, 33; అపొ. 1:7) కాబట్టి రైతులాగే మనమూ ఓపిగ్గా ఎదురుచూడాలి.

6. మీకా ప్రవక్త నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

6 మీకా ప్రవక్త కూడా మనలాగే కష్టాల్ని సహించాల్సి వచ్చింది. అతను రాజైన ఆహాజు పరిపాలిస్తున్న కాలంలో జీవించాడు. ఆహాజు చాలా చెడ్డ రాజు కావడంతో దేశంలో అవినీతి పెచ్చుపెరిగిపోయింది. పరిస్థితులు ఎంత చెడ్డగా ఉండేవంటే, ఆ కాలంలోని ప్రజల గురించి మాట్లాడుతూ వాళ్లు ‘రెండు చేతులతోను కీడు చేయపూనుకున్నారు’ అని బైబిలు చెప్తోంది. మరో మాటలో చెప్పాలంటే వాళ్లు చెడ్డ పనులు చేయడంలో ఆరితేరిపోయారు. (మీకా 7:1-3 చదవండి.) పరిస్థితుల్ని మార్చడం తన వల్ల అయ్యే పనికాదని మీకాకు తెలుసు. మరి అతను ఏమి చేశాడు? మీకా ఇలా చెప్పాడు, ‘నేనైతే యెహోవా కోసం కనిపెట్టుకొనివుంటాను. నా రక్షకుడైన దేవుని కోసం ఓపిగ్గా వేచివుంటాను. నా దేవుడు నా మొర వింటాడు.’ (మీకా 7:7, NW) మీకాలాగే మనం కూడా ‘ఓపిగ్గా వేచివుండడం’ నేర్చుకోవాలి.

7. యెహోవా తన వాగ్దానాల్ని నెరవేర్చే రోజు కోసం మనమెలా ఎదురుచూస్తాం?

7 మీకా ప్రవక్తకు ఉన్నలాంటి విశ్వాసం మనకుంటే యెహోవా చర్య తీసుకునే సమయం కోసం ఇష్టంగా ఎదురుచూస్తాం. మన పరిస్థితి ఉరిశిక్ష పడిన ఖైదీ పరిస్థితి లాంటిది కాదు. సాధారణంగా అలాంటి ఖైదీ తనను ఉరితీసే రోజు కోసం వేచివుంటాడు, కాకపోతే అది ఇష్టంతో కాదు. పైగా ఆ రోజు త్వరగా రావాలని అతను కోరుకోడు. కానీ మన పరిస్థితి వేరు. యెహోవా చర్య తీసుకునే రోజు కోసం మనం ఇష్టంగా ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే మనకు శాశ్వత జీవితం ఇస్తానని ఆయన చేసిన వాగ్దానాన్ని సరైన సమయానికి నెరవేరుస్తాడని మనకు తెలుసు. కాబట్టి మనం ‘ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ సహిస్తాం.’ (కొలొ. 1:11, 12) అయితే అలా ఎదురుచూస్తున్నప్పుడు, యెహోవా త్వరగా చర్య తీసుకోవడం లేదని మనం సణగకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ సణిగితే యెహోవా సంతోషించడు.—కొలొ. 3:12.

ఓపిగ్గా ఎదురుచూసిన నమ్మకమైన సేవకులు

8. ప్రాచీన కాలంలోని నమ్మకమైన స్త్రీపురుషుల ఉదాహరణల గురించి ఆలోచిస్తుండగా మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ఏమిటి?

8 మరింత ఇష్టంగా ఎదురుచూడడానికి మనకేవి సహాయం చేస్తాయి? యెహోవా వాగ్దానాలు నెరవేరే రోజు కోసం ఓపిగ్గా ఎదురుచూసిన ప్రాచీన కాలంలోని నమ్మకమైన స్త్రీపురుషుల ఉదాహరణలు మనకు సహాయం చేస్తాయి. (రోమా. 15:4) వాళ్ల ఆదర్శం గురించి ఆలోచిస్తుండగా మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే: వాళ్లు ఎంతకాలం ఎదురుచూడాల్సి వచ్చింది? వాళ్లు ఎందుకు ఇష్టంగా ఎదురుచూశారు? ఓపిగ్గా ఉన్నందుకు యెహోవా వాళ్లను ఎలా దీవించాడు?

అబ్రాహాము తన మనవళ్లయిన ఏశావు, యాకోబుల కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది (9, 10 పేరాలు చూడండి)

9, 10. యెహోవా వాగ్దాన నెరవేర్పు కోసం అబ్రాహాము శారాలు ఎంతకాలం ఎదురుచూడాల్సి వచ్చింది?

9 అబ్రాహాము శారాల గురించి ఆలోచించండి. వాళ్లు ‘విశ్వాసం, ఓర్పు’ చూపించారు కాబట్టే “వాగ్దానం చేయబడినవాటిని” సొంతం చేసుకున్నారు. నిజానికి యెహోవా అబ్రాహామును దీవిస్తానని, గొప్ప జనాంగానికి తండ్రిని చేస్తానని మాటిచ్చినది ‘అబ్రాహాము ఓర్పు చూపించిన తర్వాత’ అని బైబిలు చెప్తోంది. (హెబ్రీ. 6:12, 15) అబ్రాహాము ఎందుకు ఓపిగ్గా ఉండాల్సి వచ్చింది? ఎందుకంటే యెహోవా చేసిన వాగ్దానం నెరవేరడానికి సమయం పడుతుంది. నిజానికి ఆ వాగ్దానం నెరవేరడం సా.శ.పూ. 1943 నీసాను 14న ప్రారంభమైంది. ఆ రోజే అబ్రాహాము, శారా అలాగే వాళ్ల కుటుంబమంతా యూఫ్రటీసు నది దాటి వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టారు. కానీ అబ్రాహాము తన కొడుకైన ఇస్సాకు కోసం 25 ఏళ్లు, తన మనవళ్లయిన ఏశావు-యాకోబు కోసం మరో 60 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది.—హెబ్రీ. 11:9.

10 వాగ్దాన దేశంలోని ఎంత ప్రాంతం అబ్రాహాముకు వారసత్వంగా వచ్చింది? “ఈ దేశంలో వారసత్వ ఆస్తిగా దేవుడు అతనికి ఏమీ ఇవ్వలేదు, కనీసం అతను కాలు పెట్టేంత స్థలం కూడా ఇవ్వలేదు. అయితే అతనికి, ఆ తర్వాత అతని వంశస్థులకు ఈ దేశాన్ని వారసత్వ ఆస్తిగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే అప్పటికి అబ్రాహాముకు ఇంకా పిల్లలు లేరు” అని బైబిలు చెప్తోంది. (అపొ. 7:5) అబ్రాహాము యూఫ్రటీసు నది దాటిన 430 ఏళ్ల తర్వాత, అతని వంశం వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకోబోయే గొప్ప జనాంగంగా మారింది.—నిర్గ. 12:40-42; గల. 3:17.

11. అబ్రాహాము ఎందుకు ఓపిగ్గా ఎదురుచూడగలిగాడు? అందుకు ఎలాంటి ప్రతిఫలం పొందాడు?

11 యెహోవా తన మాటను నిలబెట్టుకుంటాడనే నమ్మకం ఉండబట్టే అబ్రాహాము ఇష్టంగా ఎదురుచూడగలిగాడు. అతనికి యెహోవాపై విశ్వాసం ఉంది. (హెబ్రీయులు 11:8-12 చదవండి.) అబ్రాహాము తన జీవితకాలంలో దేవుని వాగ్దానాలన్నీ నెరవేరడం చూడకపోయినప్పటికీ సంతోషంగా ఎదురుచూశాడు. పరదైసులా మారిన భూమిపై అబ్రాహాము పునరుత్థానమైనప్పుడు అతనిలో కలిగే ఆనందాన్ని ఒకసారి ఊహించుకోండి. తన జీవితం, తన కుటుంబసభ్యుల జీవితం గురించి బైబిల్లోని ఎన్నో పుస్తకాల్లో ఉండడం చూసి అతను ఆశ్చర్యపోతాడు. a వాగ్దానం చేయబడిన మెస్సీయ విషయంలో తన పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసుకుని అబ్రాహాము ఎంత సంతోషిస్తాడో ఊహించండి. తాను పొందిన దీవెనల్ని తెలుసుకున్నప్పుడు ఓపిగ్గా ఎదురుచూసినందుకు తగిన ప్రతిఫలం పొందానని అబ్రాహాము ఖచ్చితంగా భావిస్తాడు.

12, 13. యోసేపు ఎందుకు ఓపిగ్గా ఎదురుచూడాల్సి వచ్చింది? అతను ఎలాంటి చక్కని స్ఫూర్తిని చూపించాడు?

12 అబ్రాహాముకు మునిమనవడైన యోసేపు కూడా ఇష్టంగా ఎదురుచూశాడు. యోసేపు తన జీవితంలో ఘోరమైన అన్యాయాల్ని ఎదుర్కొన్నాడు. 17 ఏళ్ల వయసున్న యోసేపును అతని అన్నలు బానిసగా అమ్మేశారు. ఆ తర్వాత, యజమాని భార్యను పాడుచేయాలని చూశాడనే నిందతో జైలుపాలయ్యాడు. (ఆది. 39:11-20; కీర్త. 105:17, 18) యోసేపు దేవున్ని నమ్మకంగా సేవించినప్పటికీ దీవెనలకు బదులు ఎన్నో శిక్షల్ని అనుభవించాడు. కానీ 13 ఏళ్ల తర్వాత పరిస్థితి తారుమారైంది. యోసేపు జైలు నుండి బయటికి వచ్చాడు, ఐగుప్తులో ఫరోకు తర్వాతి స్థానంలో అత్యంత శక్తివంతమైన పరిపాలకుడయ్యాడు.—ఆది. 41:14, 37-43; అపొ. 7:9, 10.

13 తనకు జరిగిన అన్యాయాల్ని మనసులో పెట్టుకుని యోసేపు పగతో రగిలిపోయాడా? యెహోవా తనను వదలిపెట్టేశాడని అనుకున్నాడా? లేదు. అతను ఓపిగ్గా ఎదురుచూశాడు. ఆ విషయంలో అతనికి ఏమి సహాయం చేసింది? యెహోవాపై ఉన్న విశ్వాసమే. పరిస్థితులన్నీ యెహోవా ఆధీనంలో ఉన్నాయని యోసేపు అర్థంచేసుకున్నాడు. అలాగని మనకెలా తెలుసు? యోసేపు తన అన్నలతో ఏమన్నాడో గమనించండి: “భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.” (ఆది. 50:19, 20) ఓపిగ్గా ఎదురుచూసినందుకు తగిన దీవెనల్ని యెహోవా తనకిస్తాడని యోసేపుకు తెలుసు.

14, 15. (ఎ) దావీదు చూపించిన ఓపిక ఎందుకు మెచ్చుకోదగినది? (బి) ఓపిగ్గా ఎదురుచూడడానికి దావీదుకు ఏమి సహాయం చేసింది?

14 రాజైన దావీదు కూడా ఎన్నో అన్యాయాలకు గురయ్యాడు. దావీదు యౌవనస్థునిగా ఉన్నప్పుడే యెహోవా అతన్ని ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించాడు. కానీ తన సొంత జనాంగానికి రాజవ్వడానికి అతను 15 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. (2 సమూ. 2:3, 4) అలా ఎదురుచూస్తున్న కాలంలో, తనను చంపడానికి ప్రయత్నిస్తున్న రాజైన సౌలు నుండి తప్పించుకుని పారిపోవాల్సి వచ్చింది. b ఆ సమయంలో ఉండడానికి సొంతిల్లు లేనందువల్ల కొన్నిరోజులు పరాయి దేశంలో, కొన్ని సందర్భాల్లో గుహల్లో తలదాచుకున్నాడు. చివరికి ఒక యుద్ధంలో సౌలు చనిపోయాడు. కానీ ఇశ్రాయేలు జనాంగమంతటికీ రాజవ్వడానికి దావీదు మరో ఏడేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది.—2 సమూ. 5:4, 5.

15 దావీదు ఎందుకు ఇష్టంతో ఓపిగ్గా ఎదురుచూశాడు? ‘ఎంతకాలం’ అని ఐదుసార్లు ప్రశ్నిస్తూ దావీదు రాసిన అదే కీర్తనలో దానికిగల కారణం ఉంది. దావీదు ఇలా చెప్పాడు, “నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను.” (కీర్త. 13:5) తనమీద యెహోవాకు ప్రేమ ఉందని, ఆయన తనకు ఎల్లప్పుడూ విశ్వసనీయంగా ఉంటాడని దావీదుకు తెలుసు. గతంలో ఆయన సహాయం చేసిన సందర్భాల్ని దావీదు గుర్తుచేసుకున్నాడు. తానున్న కష్టాలనుండి యెహోవా తనను బయటపడేసే సమయం కోసం ఎదురుచూశాడు. అందుకు తగిన దీవెనల్ని యెహోవా ఇస్తాడని దావీదుకు తెలుసు.

తాను చేయడానికి ఇష్టపడని పనిని మనల్ని చేయమని యెహోవా అడగలేదు

16, 17. ఇష్టంగా ఎదురుచూసే విషయంలో యెహోవా దేవుడు, యేసు ఎలా అత్యుత్తమ ఆదర్శం ఉంచారు?

16 తాను చేయడానికి ఇష్టపడని పని మనల్ని చేయమని యెహోవా అడగలేదు. ఇష్టంగా ఎదురుచూసే విషయంలో ఆయనే మనకు గొప్ప ఆదర్శం ఉంచాడు. (2 పేతురు 3:9 చదవండి.) ఉదాహరణకు వేల సంవత్సరాల క్రితం ఏదెను తోటలో, యెహోవా అన్యాయస్థుడని సాతాను నిందించాడు. అయితే తన పేరు పూర్తిగా పవిత్రపర్చబడే సమయం కోసం యెహోవా “ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు.” ‘ఆయన కోసం ఆత్రంగా ఎదురుచూసేవాళ్లంతా’ అద్భుతమైన దీవెనల్ని సొంతం చేసుకుంటారు.— యెష. 30:18, అధస్సూచి, NW.

17 ఇష్టంగా ఎదురుచూసే విషయంలో యేసు కూడా చక్కని ఆదర్శం ఉంచాడు. భూమ్మీదున్నప్పుడు ఆయన తన చివరిశ్వాస వరకు నమ్మకంగా ఉన్నాడు. సా.శ. 33లో ఆయన తన బలి విలువను పరలోకంలో యెహోవాకు సమర్పించాడు. కానీ రాజవ్వడానికి 1914 వరకు ఆయన ఎదురుచూడాల్సి వచ్చింది. (అపొ. 2:33-35; హెబ్రీ. 10:12, 13) అంతేకాదు తన శత్రువులందరూ నాశనమవ్వాలంటే వెయ్యేళ్ల పరిపాలన ముగిసేవరకు ఆయన ఎదురుచూడాలి. (1 కొరిం. 15:25) చాలాకాలమే ఎదురుచూడాల్సి వచ్చినప్పటికీ, దీవెనలు మాత్రం దానికి తగినట్లుగానే ఉంటాయి.

మనకేవి సహాయం చేస్తాయి?

18, 19. ఇష్టంతో ఓపిగ్గా ఎదురుచూడడానికి మనకేవి సహాయం చేస్తాయి?

18 మనం ఓపికతో, ఇష్టంగా ఎదురుచూడాలని యెహోవా కోరుకుంటున్నాడు. మరి అలా ఎదురుచూడడానికి మనకేవి సహాయం చేస్తాయి? దేవుని పవిత్రశక్తి కోసం మనం ప్రార్థించాలి. ఓపిగ్గా ఉండడానికి దేవుని పవిత్రశక్తే మనకు సహాయం చేస్తుందని గుర్తుంచుకోండి. (ఎఫె. 3:16; 6:18; 1 థెస్స. 5:17-19) కాబట్టి ఓపిగ్గా సహించడానికి మీకు సహాయం చేయమని యెహోవాను వేడుకోండి.

19 అంతేకాదు యెహోవా వాగ్దానాలు నెరవేరేవరకు ఓపిగ్గా ఎదురుచూసేలా అబ్రాహాముకు, యోసేపుకు, దావీదుకు ఏవి సహాయం చేశాయో గుర్తుంచుకోండి. యెహోవాపై వాళ్లకున్న విశ్వాసం, నమ్మకమే సహాయం చేశాయి. వాళ్లు కేవలం తమ గురించి, తమ అవసరాల గురించి మాత్రమే ఆలోచించలేదు. ఓపిగ్గా ఉండడం వల్ల వాళ్లు ఎలాంటి దీవెనలు పొందారో మనం ఆలోచించాలి. అలా ఆలోచిస్తే, ఇష్టంగా ఎదురుచూడాలనే ప్రోత్సాహం మనలో కూడా కలుగుతుంది.

20. మన నిర్ణయం ఏమై ఉండాలి?

20 కాబట్టి కష్టాలు వచ్చినప్పటికీ ‘ఓపిగ్గా ఎదురుచూడాలని’ మనం నిర్ణయించుకున్నాం. కొన్నిసార్లు మనం, ‘యెహోవా, ఎంతకాలంపాటు?’ అని అడగవచ్చు. (యెష. 6:11, NW) అయితే దేవుని పవిత్రశక్తి సహాయంతో యిర్మీయా ప్రవక్తలాగే మనం కూడా ఇలా చెప్పవచ్చు, “యెహోవాయే నాకు వంతు. ఆయనకోసమే నేను నమ్మకంతో ఎదురు చూస్తాను.”—విలా. 3:21, 24, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

a ఆదికాండములోని దాదాపు 15 అధ్యాయాల్లో అబ్రాహాము జీవితం గురించి ఉంది. అంతేకాదు క్రైస్తవ గ్రీకు లేఖనాల్ని రాసిన రచయితలు అబ్రాహాము గురించి 70 కన్నా ఎక్కువసార్లు ప్రస్తావించారు.

b సౌలు పరిపాలన మొదలుపెట్టి రెండేళ్లు దాటిన కొంతకాలానికే యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయాడు. అయినాసరే అతను చనిపోయేవరకు అంటే ఇంకా 38 ఏళ్లు రాజుగా పరిపాలించాడు.—1 సమూ. 13:1; అపొ. 13:21.