కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 34

కొత్త నియామకానికి ఎలా అలవాటుపడవచ్చు?

కొత్త నియామకానికి ఎలా అలవాటుపడవచ్చు?

“మీరు చేసే పనిని, తన పేరు విషయంలో మీరు చూపించే ప్రేమను దేవుడు మర్చిపోడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు.”—హెబ్రీ. 6:10.

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

ఈ ఆర్టికల్‌లో. . . *

1-3. ఎలాంటి కారణాల వల్ల పూర్తికాల సేవకుల నియామకాలు మారవచ్చు?

“మేమిద్దరం 21 ఏళ్లపాటు మిషనరీలుగా సేవచేస్తూ చాలా ఆనందించాం. తర్వాత మా ఇద్దరి అమ్మానాన్నల ఆరోగ్యం పాడవ్వడంతో ఆ సేవను ఆపేశాం. దగ్గరుండి వాళ్లను చూసుకుంటున్నందుకు సంతోషంగా అనిపించినా, మాకు బాగా నచ్చిన ప్రాంతాన్ని విడిచి వచ్చినందుకు బాధగా అనిపిస్తుంటుంది” అని రాబర్ట్‌, మేరీ జో అనే జంట చెప్పింది.

2 విలియమ్‌, టెరీ అనే మరో జంట ఇలా చెప్పింది, “మా నియామకాన్ని కొనసాగించడానికి మా ఆరోగ్యం సహకరించదని తెలిసినప్పుడు ఇద్దరం ఏడ్చేశాం. వేరే దేశంలో సేవ చేయాలనే మా కల మధ్యలోనే ముగిసిపోయింది.”

3 అలిక్సే అనే సహోదరుడు ఇలా చెప్పాడు, “నేను సేవచేస్తున్న బ్రాంచి కార్యాలయాన్ని మూసేయడానికి ప్రభుత్వం ప్రయత్ని స్తోందని మాకు తెలుసు. కానీ అది జరిగి, మేమందరం బెతెల్‌ విడిచి వెళ్లాల్సి వచ్చినప్పుడు తట్టుకోలేకపోయాం.”

4. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

4 అంతేకాదు, బెతెల్‌ కుటుంబ సభ్యులతో సహా ఇంకా ఎంతోమంది పూర్తికాల సేవకుల నియామకాలు మారాయి. * నచ్చిన నియామకాన్ని వదిలి పెట్టడం ఆ నమ్మకమైన సహోదరసహోదరీలకు ఒక సవాలే. మరి ఆ మార్పుకు అలవాటుపడడానికి వాళ్లకేమి సహాయం చేయగలదు? మీరు వాళ్లకెలా మద్దతివ్వవచ్చు? వీటికి జవాబులు తెలుసుకోవడం వల్ల, మన జీవితంలో మార్పులు వచ్చినప్పుడు వాటికి తేలిగ్గా అలవాటుపడగలుగుతాం.

మార్పుకు ఎలా అలవాటుపడవచ్చు?

నియామకం మారడం పూర్తికాల సేవకులకు ఒక సవాలుగా ఎందుకు అనిపించవచ్చు? (5వ పేరా చూడండి) *

5. నియామకం మారినప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురవ్వవచ్చు?

5 మనం బెతెల్‌లో సేవచేస్తున్నా, వేరే ఏ రకమైన పూర్తికాల సేవ చేస్తున్నా ఆ ప్రాంతం మీద లేదా అక్కడి ప్రజల మీద ప్రేమ పెంచుకుంటాం. ఏదైనా కారణం వల్ల వేరే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వస్తే తట్టుకోలేనంత బాధ కలుగుతుంది; విడిచి వచ్చిన సహోదరసహోదరీలు గుర్తుకొస్తారు. ఒకవేళ హింస ఎదురవ్వడం వల్ల ఆ ప్రాంతాన్ని విడిచి వచ్చుంటే, అక్కడున్న సహోదరసహోదరీలు ఎలా ఉన్నారోనని దిగులుపడతాం. (మత్త. 10:23; 2 కొరిం. 11:28, 29) అంతేకాదు, వేరే సంస్కృతికి అలవాటుపడడం కూడా ఒక సవాలుగా అనిపించవచ్చు. మన సొంతూరికి తిరిగొచ్చినప్పుడు సైతం అలాంటి ఇబ్బంది ఎదురవ్వవచ్చు. రాబర్ట్‌, మేరీ జో ఇలా అంటున్నారు, “మా సంస్కృతే మాకు కొత్తగా అనిపించింది, మాతృభాషలో ప్రకటించడానికి కూడా కష్టపడాల్సి వచ్చింది. చాలా ఏళ్లు వేరే ప్రాంతంలో ఉండి సేవచేయడం వల్ల, మేము పుట్టి పెరిగిన దేశమే కొత్తగా అనిపించింది.” నియామకం మారినప్పుడు ఆర్థికపరంగా కూడా కొత్త సవాళ్లు ఎదురవ్వవచ్చు. ఏం చేయాలి, ఎలా జీవించాలి వంటి సందేహాలు నిరుత్సాహానికి గురి చేయవచ్చు. అప్పుడు ఏది సహాయం చేయగలదు?

మనం యెహోవాను అంటిపెట్టుకొని ఉండడం, ఆయన మీద నమ్మకం ఉంచడం అవసరం (6-7 పేరాలు చూడండి) *

6. మనం యెహోవాను ఎలా అంటిపెట్టుకుని ఉండవచ్చు?

6 యెహోవాను అంటిపెట్టుకుని ఉండండి. (యాకో. 4:8) యెహోవా మన ప్రార్థనలు వింటాడని నమ్మడం ద్వారా ఆయన్ని అంటిపెట్టుకుని ఉండవచ్చు. (కీర్త. 65:2) ‘ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి’ అని కీర్తన 62:8 మనల్ని ప్రోత్సహిస్తుంది. యెహోవా “మనం అడిగే వాటన్నిటికన్నా, ఊహించగలిగే వాటన్నిటికన్నా ఎంతో గొప్పవాటిని చేయగలడు.” (ఎఫె. 3:20) ఆయన కేవలం మనం ప్రార్థించిన వాటిని ఇవ్వడమే కాదు, కొన్ని సందర్భాల్లో మనం ఎన్నడూ ఊహించని రీతిలో మన సమస్యల్ని పరిష్కరిస్తాడు.

7. (ఎ) యెహోవాను అంటిపెట్టుకుని ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది? (బి) హెబ్రీయులు 6:10-12 ప్రకారం, యెహోవా సేవను నమ్మకంగా కొనసాగిస్తే వచ్చే ఫలితం ఏంటి?

7 ప్రతీరోజు బైబిలు చదవడం ద్వారా, చదివిన వాటిగురించి లోతుగా ఆలోచించడం ద్వారా కూడా యెహోవాను అంటిపెట్టుకుని ఉండవచ్చు. ఒకప్పుడు మిషనరీగా సేవచేసిన ఒక సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “నియామకం మారకముందు చేసినట్టే ప్రతీవారం కుటుంబ ఆరాధన చేసుకోండి, మీటింగ్స్‌కి సిద్ధపడండి.” మీ కొత్త సంఘంతో కలిసి ప్రీచింగ్‌కి వెళ్లడానికి శాయశక్తులా కృషి చేయండి. ఒకప్పుడు చేసినంత చేయలేకపోయినా, తన సేవను నమ్మకంగా కొనసాగించేవాళ్లను యెహోవా ఎప్పటికీ మర్చిపోడు.—హెబ్రీయులు 6:10-12 చదవండి.

8. సాదాసీదాగా జీవించడానికి 1 యోహాను 2:15-17 వచనాల్లో ఉన్న మాటలు మీకెలా సహాయం చేస్తాయి?

8 సాదాసీదాగా జీవించండి. సాతాను లోకంలో జీవిస్తున్న చాలామంది వస్తుసంపదల గురించి అతిగా ఆలోచిస్తుంటారు. కానీ మీరు అలాంటి ఆలోచనల వల్ల యెహోవా సేవను ఆపకండి. (మత్త. 13:22) ఎక్కువ డబ్బు సంపాదిస్తేనే మీ జీవితం బాగుంటుందని యెహోవాను ఆరాధించనివాళ్లు, స్నేహితులు, బంధువులు చెప్పే మాటలు వినకండి. (1 యోహాను 2:15-17 చదవండి.) మనకు ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా, భౌతికంగా “సహాయం అవసరమైనప్పుడు” ఆదుకుంటానని మాటిస్తున్న యెహోవాపై నమ్మకం ఉంచండి.—హెబ్రీ. 4:16; 13:5, 6.

9. సామెతలు 22:3, 7 ప్రకారం, అనవసరమైన అప్పులు చేయకుండా జాగ్రత్తపడడం ఎందుకు ముఖ్యం? తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు ఏవి సహాయం చేస్తాయి?

9 అనవసరమైన అప్పులు చేయకండి. (సామెతలు 22:3, 7 చదవండి.) వేరే ప్రాంతానికి మారినప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, తేలిగ్గా అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అలా జరగకూడదంటే, అనవసరమైన వస్తువులు కొనడానికి అప్పు చేయకుండా జాగ్రత్తపడాలి. అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుల్ని చూసుకోవడం లాంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నప్పుడు, ఎంత అప్పు తీసుకోవాలో నిర్ణయించుకోవడం కష్టంగా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేయమని యెహోవాకు ‘ప్రార్థించండి, అభ్యర్థించండి.’ దానికి జవాబుగా ఆయన మీకు తన ‘శాంతిని’ ఇచ్చి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తాడు.—ఫిలి. 4:6, 7; 1 పేతు. 5:7.

10. కొత్త స్నేహితుల్ని సంపాదించుకోవడానికి ఏం చేయవచ్చు?

10 స్నేహపూర్వకంగా ఉండండి. సన్నిహిత స్నేహితులతో, ముఖ్యంగా మీలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్లతో మీ భావాలను, అనుభవాలను పంచుకోండి. అలా చేయడం వల్ల మీ మనసు కాస్త కుదుటపడుతుంది. (ప్రసం. 4:9, 10) మీరు విడిచి వచ్చిన ప్రాంతంలో మీకు కొంతమంది స్నేహితులు ఉండవచ్చు. అయితే మీరు ప్రస్తుతం ఉంటున్న చోట కూడా స్నేహితులను సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలంటే మీరు స్నేహపూర్వకంగా ఉండాలి. యెహోవా సేవలో మీకున్న మంచి అనుభవాలను, మీరు పొందిన ఆనందాన్ని ఇతరులకు చెప్పండి. మీకు పూర్తికాల సేవ ఎందుకు ఇష్టమో సంఘంలో కొంతమంది అర్థం చేసుకోలేకపోయినా, మిగతావాళ్లు మీరు చెప్పే విషయాలపై ఆసక్తి చూపించవచ్చు. వాళ్లు మీకు మంచి స్నేహితులు కూడా అవ్వవచ్చు. అయితే మీ గురించి, మీరు సాధించినవాటి గురించి, మీకు ఎదురైన చేదు అనుభవాల గురించి అతిగా చెప్పకుండా జాగ్రత్తపడండి.

11. మీ వివాహ జీవితాన్ని సంతోషంగా ఎలా ఉంచుకోవచ్చు?

11 మీ వివాహజత ఆరోగ్యం పాడవ్వడం వల్ల మీ నియామకాన్ని ఆపేయాల్సి వస్తే, వాళ్లను నిందించకండి. లేదా మీ ఆరోగ్యం పాడవ్వడం వల్ల ఆపేయాల్సి వస్తే, మీ వల్ల మీ వివాహజత సేవకు కూడా ఆటంకం కలిగిందని బాధపడకండి. మీరిద్దరూ ‘ఒకే శరీరమని’ గుర్తుంచుకోండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ చూపించుకుంటామని మీరు యెహోవా ముందు ప్రమాణం చేశారు. (మత్త. 19:5, 6) ఒకవేళ మీకు పిల్లలు పుట్టడం వల్ల మీ నియామకాన్ని ఆపేయాల్సి వస్తే అప్పుడేంటి? మీరు ఆపేసిన నియామకం కన్నా ఇప్పుడు మీ బిడ్డే మీకు ఎక్కువ ప్రాముఖ్యమని మీ బిడ్డ అర్థంచేసుకునేలా సహాయం చేయండి. తను మీకు దేవుడిచ్చిన “బహుమానం” అని వీలైనప్పుడల్లా చెప్పండి. (కీర్త. 127:3-5) దాంతోపాటు, మీ నియామకంలో ఎదురైన మంచి అనుభవాలను పంచుకోండి. అలా చెప్తే, మీలాగే మీ బిడ్డ కూడా పూర్తికాల సేవ చేయాలనే ప్రోత్సాహం పొందవచ్చు.

ఇతరులు ఎలా మద్దతివ్వవచ్చు?

12. (ఎ) పూర్తికాల సేవకులు తమ నియామకాల్లో కొనసాగడానికి మనమెలా సహాయం చేయవచ్చు? (బి) కొత్త పరిస్థితులకు వాళ్లు తేలిగ్గా అలవాటుపడేలా ఎలా సహాయం చేయవచ్చు?

12 మెచ్చుకోదగిన విషయం ఏంటంటే, పూర్తికాల సేవకులు తమ నియామకాల్లో కొనసాగడానికి చాలా సంఘాలు, సహోదరసహోదరీలు సహాయం చేస్తున్నారు. మాటలతో ప్రోత్సహించడం ద్వారా, ఆర్థిక-వస్తుపర సహాయం చేయడం ద్వారా, వాళ్ల కుటుంబసభ్యుల బాగోగులు చూసుకోవడం ద్వారా అలా చేస్తున్నారు. (గల. 6:2) ఒకవేళ పూర్తికాల సేవకులు ఎవరైనా నియామకం మారడం వల్ల మీ సంఘానికి వస్తే, వాళ్లు సరిగ్గా సేవ చేయలేదు లేదా ఏదో తప్పు చేశారు కాబట్టే నియామకం మార్చారని అనుకోకండి. * బదులుగా వాళ్లు కొత్త పరిస్థితులకు తేలిగ్గా అలవాటుపడేలా సహాయం చేయండి. వాళ్లను ప్రేమగా ఆహ్వానించండి, వాళ్లు చేసిన సేవను మెచ్చుకోండి, ఒకవేళ అనారోగ్యం వల్ల ఇప్పుడు ఎక్కువ సేవ చేయలేకపోతున్నా మెచ్చుకోండి. వాళ్లతో పరిచయం పెంచుకోండి. వాళ్లు పొందిన అపారమైన జ్ఞానం, శిక్షణ, అనుభవం నుండి ప్రయోజనం పొందండి.

13. కొత్త నియామకం పొందినవాళ్లకు ఎలాంటి విషయాల్లో మన సహాయం అవసరం కావచ్చు?

13 కొత్త నియామకం పొందినవాళ్లకు అద్దె ఇల్లు వెతుక్కోవడం, రవాణా సౌకర్యం-ఉద్యోగం చూసుకోవడం లాంటి పనుల్లో మీ సహాయం అవసరం కావచ్చు. అంతేకాదు పన్నులు కట్టడం, బిల్లులు చెల్లించడం లాంటి రోజువారీ పనులకు సంబంధించిన సమాచారం కూడా చెప్పాల్సి రావచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా, వాళ్లు మన జాలిని కాదుగానీ మనం వాళ్ల పరిస్థితిని అర్థంచేసుకోవాలని కోరుకుంటారు. బహుశా వాళ్లకో, వాళ్ల ఇంట్లోవాళ్లకో ఆరోగ్యం బాలేనందువల్ల వాళ్లు ఒత్తిడిని ఎదుర్కొంటుండవచ్చు. లేదా వాళ్లకు ఇష్టమైనవాళ్లు ఎవరైనా చనిపోయి ఉండవచ్చు. * బయటికి చెప్పకపోయినా, విడిచి వచ్చిన ప్రాంతంలోని స్నేహితులు గుర్తుకొచ్చి మనసులో బాధపడుతుండవచ్చు. అలాంటి లోతైన భావాల నుండి కోలుకొని మనసు కుదుటపడడానికి చాలా సమయం పడుతుంది.

14. ఒక సహోదరి నియామకం మారినప్పుడు అక్కడి సహోదరసహోదరీలు ఆమెకు ఎలా సహాయం చేశారు?

14 మీతోపాటు వాళ్లను పరిచర్యకు తీసుకెళ్లడం వల్ల, మీ మంచి ప్రవర్తన వల్ల కూడా వాళ్లు కొత్త పరిస్థితులకు తేలిగ్గా అలవాటు పడగలుగుతారు. వేరే దేశంలో చాలా ఏళ్లు సేవచేసిన ఒక సహోదరి ఇలా చెప్పింది, “నేను అంతకుముందు సేవచేసిన దేశంలో ప్రతీరోజు బైబిలు స్టడీలు చేసేదాన్ని. కానీ కొత్త ప్రాంతంలో ఒక లేఖనం గానీ, వీడియో గానీ చూపించే అవకాశం ఎక్కువగా దొరకేదికాదు. సహోదరసహోదరీలు నన్ను వాళ్ల రిటన్‌ విజిట్‌లకు, స్టడీలకు తీసుకెళ్లేవాళ్లు. వాళ్లు ఎంతో ఉత్సాహంగా, ధైర్యంగా బైబిలు స్టడీలు చేయడం చూశాక ఆ క్షేత్రంలో పరిచర్య కొనసాగించగలననే నమ్మకం కలిగింది. దాంతో కొత్త ప్రాంతంలో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాను. చివరికి పరిచర్యను మళ్లీ ఆనందించగలిగాను.”

చేయగలిగినదంతా చేస్తూ ఉండండి!

మీ ప్రాంతంలో పరిచర్య చేసే అవకాశాల కోసం చూడండి (15-16 పేరాలు చూడండి) *

15. కొత్త నియామకంలో మంచి ఫలితాలను ఎలా సాధించవచ్చు?

15 మీరు మీ కొత్త నియామకంలో మంచి ఫలితాలను సాధించగలరు. మీ పాత నియామకాన్ని సరిగ్గా చేయలేదని గానీ, ఇప్పుడు మీరు విలువైనవాళ్లు కాదని గానీ అనుకోకండి. ప్రస్తుతం మీకు యెహోవా ఎన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడో ఆలోచించండి, పరిచర్యను కొనసాగించండి. మొదటి శతాబ్దపు నమ్మకమైన క్రైస్తవులను ఆదర్శంగా తీసుకోండి. వాళ్లు, “తాము వెళ్లిన ప్రాంతాల్లో వాక్యం గురించిన మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.” (అపొ. 8:1, 4) మీరు పరిచర్యను కొనసాగిస్తూ ఉంటే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు, కొంతమంది పయినీర్లు వాళ్లు సేవ చేస్తున్న దేశం నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పుడు వాళ్లు పొరుగు దేశంలో అవసరం ఎక్కువగా ఉన్న తమ భాషా క్షేత్రానికి వెళ్లి పరిచర్య చేశారు. కొన్ని నెలలకే, వేగంగా వృద్ధిచెందే ఎన్నో గ్రూపులు ఏర్పడ్డాయి.

16. మీ కొత్త నియామకంలో సంతోషించాలంటే ఏం చేయాలి?

16 ‘యెహోవాయందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు.’ (నెహె. 8:10) మన నియామకం అంటే మనకు చాలా ఇష్టం ఉండవచ్చు. అయితే మనం దాన్నిబట్టి కాదుగానీ, యెహోవాతో ఉన్న మంచి సంబంధాన్ని బట్టే ఎక్కువగా సంతోషించాలి. అందుకోసం మనం యెహోవాను అంటిపెట్టుకుని ఉంటూ తెలివి, నిర్దేశం, సహాయం కోసం ఆయన మీద ఆధారపడుతూ ఉండాలి. మీ పాత నియామకంలో మీరు ప్రజలకు సహాయపడడానికి చేయగలిగినదంతా చేశారు కాబట్టే ఆ పనిని అంత ప్రేమించగలిగారు. ప్రస్తుతం మీరు పొందిన నియామకంలో కూడా అలాగే కష్టపడండి; అప్పుడు దీన్ని కూడా ప్రేమించడానికి యెహోవా ఏవిధంగా సహాయం చేస్తాడో మీరే చూస్తారు.—ప్రసం. 7:10.

17. ప్రస్తుతం మనం చేస్తున్న నియామకం ఎలాంటిదని గుర్తుంచుకోవాలి?

17 మనందరం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం ప్రస్తుతం చేస్తున్న నియామకాలు తాత్కాలికం, యెహోవాకు మనం చేసే సేవ మాత్రమే శాశ్వతం. కొత్తలోకంలో మనందరి నియామకాలు మారవచ్చు. ముందు పేరాలో ప్రస్తావించబడిన అలిక్సే, తన నియామకం మారడం వల్ల భవిష్యత్తులో జరిగే మార్పులకు సిద్ధపడుతున్నానని చెప్పాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు, “నాకు యెహోవా దేవుడు ఎంత వాస్తవంగా ఉన్నాడో, ఆయన రాజ్యం కూడా అంతే వాస్తవమైనదిగా ఉంది. కాకపోతే చిన్న తేడా ఉంది. యెహోవాకు నేను ఇప్పటికే దగ్గరయ్యాను కానీ దేవుని రాజ్యంలోకి మాత్రం ఇంకా వెళ్లలేదు, త్వరలో వెళ్తాను.” (అపొ. 2:25) కాబట్టి మన నియామకం ఏదైనప్పటికీ, యెహోవాను అంటిపెట్టుకుని ఉందాం. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మనం ఏ నియామకం పొందినా, తన సేవలో చేయగలిగినదంతా చేస్తూ సంతోషంగా ఉండడానికి ఆయన సహాయం చేస్తాడు.—యెష. 41:13.

పాట 90 ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

^ పేరా 5 కొన్ని సందర్భాల్లో, సహోదరసహోదరీలు తమ పూర్తికాల సేవను ఆపేయాల్సి రావచ్చు లేదా సంస్థ వాళ్లకు వేరే నియామకాన్ని ఇవ్వవచ్చు. అప్పుడు వాళ్లకు ఎలాంటి సమస్యలు ఎదురౌతాయో, కొత్త పరిస్థితులకు అలవాటుపడడానికి వాళ్లు ఏం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఇతరులు అలాంటివాళ్లను ఎలా ప్రోత్సహించవచ్చో, వాళ్లకు ఎలా మద్దతివ్వవచ్చో, ఒకవేళ మనకే అలాంటి పరిస్థితి ఎదురైతే బైబిలు ఎలా సహాయం చేయగలదో కూడా తెలుసుకుంటాం.

^ పేరా 4 అదేవిధంగా, వయసు పైబడిన చాలామంది సహోదరులు తమ బాధ్యతల్ని ఇతర సహోదరులకు అప్పగించారు. 2018 సెప్టెంబరు కావలికోట సంచికలో వచ్చిన “వృద్ధ సహోదరులారా—మీ విశ్వసనీయతను యెహోవా విలువైనదిగా చూస్తాడు” అనే ఆర్టికల్‌ను; అలాగే 2018 అక్టోబరు కావలికోట సంచికలో వచ్చిన “పరిస్థితులు మారినప్పటికీ మనశ్శాంతిగా ఎలా ఉండవచ్చు?” అనే ఆర్టికల్‌ను చూడండి.

^ పేరా 12 సంఘ పెద్దలు వీలైనంత త్వరగా పరిచయ ఉత్తరాన్ని కొత్త సంఘానికి పంపించాలి. దానివల్ల వాళ్లు ఎలాంటి అంతరాయం లేకుండా పయినీరుగా గానీ, సంఘ పెద్దగా గానీ, సంఘ పరిచారకునిగా గానీ సేవను కొనసాగించగలుగుతారు.

^ పేరా 13 2018 నం. 3 తేజరిల్లు! సంచికలోని “మనవాళ్లు చనిపోతే కలిగే దుఃఖాన్ని తట్టుకోవడం ఎలా?” అనే ఆర్టికల్స్‌ చూడండి.

^ పేరా 57 చిత్రాల వివరణ: వేరే దేశంలో మిషనరీలుగా సేవచేస్తున్న ఒక జంట అక్కడినుండి వెళ్లిపోవాల్సి వచ్చినప్పుడు, సహోదరసహోదరీలకు కన్నీళ్లతో వీడ్కోలు చెప్తున్నారు.

^ పేరా 59 చిత్రాల వివరణ: వాళ్లు తమ సొంత దేశానికి వెళ్లాక, అక్కడి సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయం చేయమని పట్టుదలగా యెహోవాకు ప్రార్థిస్తున్నారు.

^ పేరా 61 చిత్రాల వివరణ: యెహోవా సహాయంతో వాళ్లు మళ్లీ పూర్తికాల సేవ మొదలుపెట్టారు. మిషనరీలుగా సేవ చేస్తున్నప్పుడు నేర్చుకున్న భాష ఉపయోగించి, తమ కొత్త సంఘ క్షేత్రంలోని ఆ భాష ప్రజలకు ప్రకటిస్తున్నారు.