కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 33

“నువ్వు బోధించేది వినేవాళ్లు” రక్షించబడతారు

“నువ్వు బోధించేది వినేవాళ్లు” రక్షించబడతారు

“నీ గురించి, నీ బోధ గురించి జాగ్రత్తగా ఉండు. వీటి విషయంలో పట్టుదల చూపించు. అలాచేస్తే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నువ్వు బోధించేది వినేవాళ్లను కూడా రక్షిస్తావు.”—1 తిమో. 4:16.

పాట 67 ‘వాక్యాన్ని ప్రకటించండి’

ఈ ఆర్టికల్‌లో. . . *

1. మన కుటుంబ సభ్యుల గురించి మనందరం ఏం కోరుకుంటాం?

“పరదైసులో నాతోపాటు నా కుటుంబమంతా ఉండాలనేది సత్యం నేర్చుకున్న రోజు నుండే నా కోరిక. ముఖ్యంగా నా భర్త విక్రమ్‌, * అలాగే మా బాబు నాతోపాటు యెహోవాను ఆరాధించాలని కోరుకున్నాను” అని పల్లవి అనే సహోదరి చెప్పింది. మీ కుటుంబంలో కూడా యెహోవాను ఆరాధించనివాళ్లు ఎవరైనా ఉన్నారా? అయితే, మీరూ పల్లవిలాగే ఆలోచిస్తుండవచ్చు.

2. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

2 మన కుటుంబ సభ్యుల్ని మంచివార్త అంగీకరించమని మనం బలవంతం చేయలేం. కానీ వాళ్లు బైబిల్లోని విషయాల గురించి ఆలోచించేలా, వాటికి స్పందించేలా మనం సహాయం చేయవచ్చు. (2 తిమో. 3:14, 15) ఇంతకీ మన కుటుంబ సభ్యులకు ఎందుకు ప్రకటించాలి? వాళ్ల భావాల్ని అర్థంచేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? మనలాగే మన కుటుంబ సభ్యులు కూడా యెహోవాను ఆరాధించేలా మనమెలా సహాయం చేయవచ్చు? ఈ విషయంలో మనకు సంఘంలోని వాళ్లు ఎలా సహాయం చేయవచ్చు? అనే ప్రశ్నల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

మన కుటుంబ సభ్యులకు ఎందుకు ప్రకటించాలి?

3. రెండో పేతురు 3:9 ప్రకారం, మనం కుటుంబ సభ్యులకు ఎందుకు ప్రకటించాలి?

3 యెహోవా త్వరలోనే ఈ వ్యవస్థను నాశనం చేయబోతున్నాడు. “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి ఉన్నవాళ్లు” మాత్రమే ఆ నాశనాన్ని తప్పించుకుంటారు. (అపొ. 13:48) మన ప్రాంతంలో ఉన్న పరిచయంలేని వాళ్లకు కూడా ఎంతో సమయం, శక్తి వెచ్చించి ప్రకటిస్తాం. అలాంటప్పుడు మన కుటుంబ సభ్యులు మనతోపాటు యెహోవాను ఆరాధించాలని ఖచ్చితంగా కోరుకుంటాం కదా! మన ప్రేమగల తండ్రైన యెహోవాకు ‘ఎవ్వరూ నాశనం కావడం ఇష్టంలేదు, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని ఆయన కోరుకుంటున్నాడు.’—2 పేతురు 3:9 చదవండి.

4. కుటుంబ సభ్యులకు ప్రకటిస్తున్నప్పుడు మనం ఏ పొరపాటు చేసే అవకాశం ఉంది?

4 ప్రాణాల్ని కాపాడే సందేశాన్ని ప్రకటించడానికి ఒక మంచి పద్ధతి, ఒక చెడ్డ పద్ధతి ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. మనం పరిచయంలేని వాళ్లకు ప్రకటిస్తున్నప్పుడు నేర్పుగా మాట్లాడుతుండవచ్చు, కానీ మన కుటుంబ సభ్యులకు ప్రకటిస్తున్నప్పుడు ముక్కుసూటిగా మాట్లాడుతుండవచ్చు.

5. కుటుంబ సభ్యులకు ప్రకటించే ముందు ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

5 మనలో చాలామందిమి, మొట్టమొదటిసారి మన కుటుంబ సభ్యులతో సత్యం గురించి మాట్లాడిన పద్ధతి గుర్తుతెచ్చుకొని బాధపడుతుంటాం. వాళ్లతో వేరేలా మాట్లాడివుంటే బాగుండేదని అనుకుంటాం. అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఈ సలహా ఇచ్చాడు, “ఎప్పుడూ మంచితనం ఉట్టిపడేలా మాట్లాడండి. ఉప్పుతో ఆహారానికి రుచి వచ్చినట్టు, మంచితనంతో మీ మాటలకు రుచి వస్తుంది. మీరు అలా మాట్లాడినప్పుడే, ప్రతీ ఒక్కరికి ఎలా జవాబివ్వాలో మీకు తెలుస్తుంది.” (కొలొ. 4:5, 6) మన కుటుంబ సభ్యులకు ప్రకటిస్తున్నప్పుడు ఆ సలహాను పాటించడం మంచిది. లేదంటే వాళ్లు మనం చెప్పేది వినే బదులు నొచ్చుకునే ప్రమాదం ఉంది.

కుటుంబ సభ్యులకు మనమెలా సహాయం చేయవచ్చు?

కుటుంబ సభ్యుల భావాల్ని అర్థంచేసుకోవడం ద్వారా, మీ మంచి ప్రవర్తన ద్వారా వాళ్లకు సాక్ష్యమివ్వవచ్చు (6-8 పేరాలు చూడండి) *

6-7. యెహోవాసాక్షికాని వివాహజత భావాల్ని అర్థంచేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో ఒక ఉదాహరణతో చెప్పండి.

6 వాళ్ల భావాల్ని అర్థంచేసుకోండి. పై పేరాల్లో ప్రస్తావించబడిన పల్లవి ఇలా చెప్తుంది, “నా భర్తతో దేవుని గురించి, బైబిలు గురించి మాత్రమే మాట్లాడాలని మొదట్లో అనుకున్నాను. మేము రోజువారీ విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం కాదు.” అయితే, ఆమె భర్త విక్రమ్‌కు బైబిలు గురించి అంతగా తెలీదు కాబట్టి ఆమె చెప్పేవి ఆయనకు అర్థమయ్యేవి కావు. ఆమెకు మతపిచ్చి పట్టిందని ఆయన అనుకునేవాడు. ఆమె ఏదో ప్రమాదకరమైన గుంపుతో సహవసిస్తోందని, మోసపోతోందని కంగారుపడేవాడు.

7 పల్లవి మొదట్లో సాయంత్రాలు, వారాంతాలు ఎక్కువగా మీటింగ్స్‌లో, ప్రీచింగ్‌లో, సహోదరసహోదరీల ఇళ్లలో గడిపేది. పల్లవి ఇలా చెప్పింది, “విక్రమ్‌ ఇంటికి వచ్చేసరికి కొన్నిసార్లు ఇంట్లో ఎవ్వరం ఉండేవాళ్లం కాదు, కాబట్టి ఆయనకు ఒంటరిగా అనిపించేది.” నిజమే, విక్రమ్‌కు తన భార్యతో, కొడుకుతో సమయం గడపాలని ఉంటుంది. వాళ్లు ఎలాంటివాళ్లతో స్నేహం చేస్తున్నారో ఆయనకు తెలియదు, తన భార్యకు తనకన్నా ఆ కొత్త స్నేహితులే ఎక్కువైపోయారని ఆయనకు అనిపించింది. దాంతో ఆయన విడాకులు ఇస్తానని పల్లవిని బెదిరించాడు. మీరు పల్లవి స్థానంలో ఉంటే, విక్రమ్‌ భావాల్ని అర్థంచేసుకున్నారని చూపించడానికి ఏం చేసేవాళ్లు?

8. మొదటి పేతురు 3:1, 2 ప్రకారం, మన కుటుంబ సభ్యుల మీద ఏది ఎక్కువ ప్రభావం చూపించవచ్చు?

8 మీ ప్రవర్తన ద్వారా సాక్ష్యమివ్వండి. తరచూ, మన మాటల కన్నా మన ప్రవర్తనే కుటుంబ సభ్యుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. (1 పేతురు 3:1, 2 చదవండి.) పల్లవి కొంతకాలానికి ఆ వాస్తవాన్ని గుర్తించింది. ఆమె ఇలా చెప్తుంది, “విక్రమ్‌కి మేమంటే చాలా ఇష్టమని, విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఆయన మనసులో లేదని నాకు తెలుసు. కానీ ఆ బెదిరింపు వల్ల, భర్తతో ఎలా నడుచుకోవాలని యెహోవా చెప్తున్నాడో నేను అలా ఉండాలని గుర్తించగలిగాను. నేను బైబిలు విషయాలు ఎక్కువ మాట్లాడే బదులు నా ప్రవర్తన ద్వారా చక్కని ఆదర్శం ఉంచాలని తెలుసుకున్నాను.” ఆమె విక్రమ్‌ను బైబిలు గురించి వినమని ఒత్తిడి చేయడం ఆపేసి, ఆయనతో రోజువారీ విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. పల్లవి సౌమ్యంగా తయారవ్వడం, వాళ్ల బాబు చక్కగా తన మాట వినడం విక్రమ్‌ గమనించాడు. (సామె. 31:18, 27, 28, 29) బైబిల్లోని విషయాలు తన కుటుంబ సభ్యుల్లో మంచి మార్పు తీసుకొచ్చాయని గుర్తించినప్పుడు ఆయన వాటిగురించి ఆలోచించడం, వాటికి చక్కగా స్పందించడం మొదలుపెట్టాడు.—1 కొరిం. 7:12-14, 16.

9. మనం కుటుంబ సభ్యులకు ఎందుకు పట్టుదలగా సహాయం చేయాలి?

9 పట్టుదలగా ప్రకటించండి. ఈ విషయంలో యెహోవా మనకు చక్కని ఆదర్శం ఉంచుతున్నాడు. ప్రజలు మంచివార్తకు స్పందించి, జీవాన్ని పొందే అవకాశాన్ని ఆయన ప్రతీరోజు ఇస్తున్నాడు. (యిర్మీ. 7:25) అపొస్తలుడైన పౌలు తిమోతితో పట్టుదలగా ప్రకటించమని చెప్పాడు. ఎందుకు? అలాచేయడం వల్ల తిమోతి తనను తాను రక్షించుకుంటాడు, తన బోధ వినేవాళ్లను కూడా రక్షిస్తాడు. (1 తిమో. 4:16) మనం కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తాం కాబట్టి వాళ్లు బైబిల్లో ఉన్న సత్యాలు తెలుసుకోవాలని కోరుకుంటాం. పల్లవి మాటలు, ప్రవర్తన కొంతకాలానికి ఆమె కుటుంబం మీద మంచి ప్రభావం చూపించాయి. ఇప్పుడు ఆమెతోపాటు ఆమె భర్త కూడా యెహోవాను ఆరాధిస్తున్నాడు. ఇద్దరూ పయినీర్లుగా సేవచేస్తున్నారు, విక్రమ్‌ సంఘపెద్ద కూడా అయ్యాడు.

10. మనం ఎందుకు ఓపిక చూపించాలి?

10 ఓపిక చూపించండి. మనం దేవుని ప్రమాణాల ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు మన నమ్మకాల్లో, జీవన విధానంలో మార్పులు చేసుకున్నాం. వాటిని అంగీకరించడం మన కుటుంబ సభ్యులకు కష్టంగా ఉండవచ్చు. సాధారణంగా వాళ్లు మనలో గమనించే మొదటి మార్పు ఏంటంటే, వాళ్ల పండుగల్లో భాగం వహించకపోవడం, రాజకీయాలకు దూరంగా ఉండడం. కొంతమంది కుటుంబ సభ్యులకు మొదట్లో మనపై కోపం రావచ్చు. (మత్త. 10:35, 36) కానీ వాళ్లు ఎప్పటికీ మారరని మనం అనుకోకూడదు. ఒకవేళ మన నమ్మకాల గురించి చెప్పడం ఆపేస్తే, వాళ్లకు శాశ్వత జీవితాన్ని పొందే అర్హత లేదని తీర్పుతీర్చిన వాళ్లమౌతాం. అలా తీర్పుతీర్చే అధికారం యెహోవా యేసుకు ఇచ్చాడు గానీ మనకు కాదు. (యోహా. 5:22) మనం ఓపిక చూపిస్తే, మన కుటుంబ సభ్యులు కొంతకాలానికి మనం ప్రకటించే సందేశాన్ని వినడానికి ఇష్టపడవచ్చు.—“ మన వెబ్‌సైట్‌ ఉపయోగించి బోధించండి” అనే బాక్సు చూడండి.

11-13. అమృత తన అమ్మానాన్నలతో వ్యవహరించిన విధానం నుండి మీరేం నేర్చుకున్నారు?

11 దయగా ఉండండి కానీ ఒత్తిడికి లొంగిపోకండి. (సామె. 15:2) అమృత ఉదాహరణ పరిశీలించండి. ఆమె వాళ్ల అమ్మానాన్నలకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నప్పుడు యెహోవా గురించి నేర్చుకుంది. వాళ్లు నాస్తికులు, పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాళ్లు. అమృత తాను నేర్చుకున్న మంచి విషయాల్ని వీలైనంత త్వరగా ఇంట్లోవాళ్లకు చెప్పాలని గుర్తించింది. ఆమె ఇలా అంటుంది, “మీ నమ్మకాల్లో ఆచారాల్లో చేసుకున్న మార్పుల గురించి మీ కుటుంబ సభ్యులకు చెప్పడం ఎంత ఆలస్యం చేస్తే వాళ్లకు అంత బాధ కలుగుతుంది.” ఆమె తన ఉత్తరాల్లో వాళ్ల అమ్మానాన్నలకు ఆసక్తివున్న అంశాల గురించి, అంటే ప్రేమ వంటి వాటిగురించి బైబిలు ఏం చెప్తుందో రాస్తూ వాళ్ల అభిప్రాయాన్ని అడిగేది. (1 కొరిం. 13:1-13) తనను చక్కగా పెంచినందుకు, తన మీద శ్రద్ధ చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్తూ వాళ్ల అమ్మానాన్నలకు బహుమతులు పంపించేది. తర్వాత ఇంటికి వెళ్లినప్పుడు వాళ్ల అమ్మకు ఇంటి పనుల్లో ఎంతో సహాయం చేసేది. మొదట్లో, అమృత తన కొత్త నమ్మకాల గురించి చెప్పినప్పుడు వాళ్ల అమ్మానాన్నలు సంతోషించలేదు.

12 అమృత వాళ్ల అమ్మానాన్నల దగ్గరకు వచ్చినప్పుడు కూడా రోజూ బైబిలు చదివేది. అమృత ఇలా చెప్పింది, “అలా చేయడం వల్ల నేను బైబిల్ని ఎంత ప్రాముఖ్యంగా చూస్తున్నానో అమ్మ అర్థంచేసుకోగలిగింది.” కొంతకాలానికి, అమృత వాళ్ల నాన్న తన కూతురి ఆలోచన విధానం ఎందుకు మారిందో తెలుసుకోవడానికి, బైబిల్లో తప్పులు వెదకడానికి దాన్ని చదవాలనుకున్నాడు. అమృత ఇలా చెప్తుంది, “నాన్న మనసును హత్తుకునే కొన్ని మాటలు బైబిలు మీద రాసి, దాన్ని ఆయనకు ఇచ్చాను.” ఫలితం? ఆయన బైబిల్లో తప్పుల కోసం వెదికే బదులు, అందులోని మంచి విషయాలకు ఆకర్షితుడయ్యాడు.

13 మనకు వ్యతిరేకత ఎదురైనప్పుడు దయగా ఉంటూనే ఒత్తిడికి లొంగిపోకుండా జాగ్రత్తపడాలి. (1 కొరిం. 4:12బి) ఉదాహరణకు, అమృతకు వాళ్ల అమ్మ నుండి వ్యతిరేకత ఎదురైంది. అమృత ఇలా అంది, “నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు, నాకు తన మీద ప్రేమ లేదని అమ్మ చెప్పింది.” మరి అమృత ఏం చేసింది? “నా కొత్త మతం గురించి చెప్పడం ఆపలేదు. నేను ఒక యెహోవాసాక్షిగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు, దానికి కట్టుబడి ఉండాలని అనుకుంటున్నట్టు గౌరవపూర్వకంగా వివరించాను. నాకు తన మీద నిజంగా ప్రేమ ఉందని అమ్మకు చెప్పడానికి ప్రయత్నించాను. అప్పుడు ఇద్దరం ఏడ్చేశాం. తర్వాత అమ్మ కోసం మంచి వంట చేసిపెట్టాను. ఆ రోజు నుండి, బైబిలు చదవడం వల్ల నేను ఇంకా మంచి వ్యక్తిగా తయారౌతున్నానని అమ్మ గుర్తించడం మొదలుపెట్టింది.”

14. మనం ఒత్తిడికి ఎందుకు లొంగిపోకూడదు?

14 మనం యెహోవా ఆరాధనను ఎంత ప్రాముఖ్యంగా చూస్తున్నామో పూర్తిగా అర్థంచేసుకోవడానికి మన కుటుంబ సభ్యులకు కొంత సమయం పట్టవచ్చు. ఉదాహరణకు, అమృత పైచదువులు చదవాలని వాళ్ల అమ్మానాన్నలు కోరుకున్నారు. కానీ ఆమె పయినీరు సేవ చేయాలని నిర్ణయించుకుంది, అప్పుడు వాళ్ల అమ్మ మళ్లీ ఏడ్చింది. అమృత మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆమె ఇలా చెప్తుంది, “మీరు ఒక్కసారి ఒత్తిడికి లొంగిపోతే, మీ కుటుంబ సభ్యులు వేరే విషయాల్లో కూడా మిమ్మల్ని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. కానీ మీరు దయగా వ్యవహరిస్తూనే ఒత్తిడికి లొంగిపోకుండా ఉంటే, కుటుంబంలో కొంతమందైనా మీరు చెప్పేది అర్థంచేసుకోవచ్చు.” అమృత విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఆమె అమ్మానాన్నలు పయినీర్లుగా సేవచేస్తున్నారు, వాళ్ల నాన్న సంఘపెద్ద కూడా అయ్యాడు.

సంఘంలోని వాళ్లు ఎలా సహాయం చేయవచ్చు?

యెహోవాసాక్షులుకాని మన కుటుంబ సభ్యులకు సంఘంలోనివాళ్లు ఎలా సహాయం చేయవచ్చు? (15-16 పేరాలు చూడండి) *

15. మత్తయి 5:14-16 అలాగే 1 పేతురు 2:12 చెప్తున్నట్లు, ఇతరులు చేసే “మంచిపనులు” మన కుటుంబ సభ్యులకు ఎలా సహాయపడతాయి?

15 సంఘంలోని వాళ్లు చేసే “మంచిపనుల” ద్వారా యెహోవా ప్రజల్ని తనవైపు ఆకర్షించుకుంటున్నాడు. (మత్తయి 5:14-16; 1 పేతురు 2:12 చదవండి.) యెహోవాసాక్షికాని మీ భర్తకు లేదా భార్యకు మీ సంఘంలోని వాళ్లు తెలుసా? ముందు పేరాల్లో ప్రస్తావించబడిన పల్లవి, సంఘంలోని సహోదరసహోదరీల్ని తన ఇంటికి పిలిచింది. దానివల్ల విక్రమ్‌కు వాళ్లతో పరిచయం ఏర్పడింది. తనకు యెహోవాసాక్షుల గురించి ఉన్న సందేహాల్ని ఒక సహోదరుడు ఎలా పటాపంచలు చేశాడో గుర్తుచేసుకుంటూ విక్రమ్‌ ఇలా అన్నాడు, “ఆ సహోదరుడు టీవీలో వచ్చే ఒక ఆటను నాతో కలిసి చూడడానికి ఆఫీస్‌కు సెలవు పెట్టాడు. అప్పుడు, వాళ్లకు మతం మీదే కాదు వేరే విషయాల మీద కూడా ఆసక్తి ఉందని నాకర్థమైంది.”

16. మన కుటుంబ సభ్యుల్ని మీటింగ్స్‌కి ఎందుకు ఆహ్వానించాలి?

16 మన కుటుంబ సభ్యులకు సహాయం చేసే ఒక చక్కని మార్గం ఏంటంటే, వాళ్లను మన మీటింగ్స్‌కు ఆహ్వానించడం. (1 కొరిం. 14:24, 25) విక్రమ్‌ మొట్టమొదటిసారి వచ్చిన మీటింగ్‌, జ్ఞాపకార్థ ఆచరణ. ఎందుకంటే అది తక్కువ సమయంలో అయిపోతుంది, పైగా సాయంత్రం జరుగుతుంది కాబట్టి ఉద్యోగం అయ్యాక వెళ్లొచ్చని అనుకున్నాడు. ఆయనిలా చెప్పాడు, “ఆరోజు ప్రసంగం నాకు పెద్దగా అర్థంకాలేదు. కానీ అక్కడివాళ్లు నాకు బాగా గుర్తుండిపోయారు. ఎందుకంటే వాళ్లు నా దగ్గరకు వచ్చి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు. వాళ్లు చాలా మంచివాళ్లని నాకర్థమైంది.” అప్పటికే భాస్కర్‌, దీప అనే దంపతులు మీటింగ్స్‌లో, ప్రీచింగ్‌లో పల్లవికి తన బాబును చూసుకోవడానికి సహాయం చేస్తుండేవాళ్లు. కొంతకాలానికి విక్రమ్‌ తన భార్య నమ్మకాల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి స్టడీ ఇవ్వమని భాస్కర్‌ని అడిగాడు.

17. మనల్ని మనం ఏ విషయంలో నిందించుకోకూడదు? కానీ మన కుటుంబ సభ్యులకు ఎందుకు సహాయం చేస్తూనే ఉండాలి?

17 మనతోపాటు మన కుటుంబ సభ్యులందరూ యెహోవాను ఆరాధించాలని మనం కోరుకుంటాం. అయితే మనం ఎంత కృషి చేసినా వాళ్లు సత్యంలోకి రాకపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే, వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనల్ని మనం నిందించుకోకూడదు. ఎందుకంటే, మన నమ్మకాల్ని అంగీకరించమని ఎవ్వర్నీ బలవంతం చేయలేం. కానీ మీరు యెహోవాను ఆరాధిస్తూ ఎంత సంతోషంగా ఉన్నారో చూసినప్పుడు వాళ్లు మారే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లకోసం ప్రార్థించండి. వాళ్లతో దయగా మాట్లాడండి. వాళ్లకు సహాయం చేస్తూనే ఉండండి! (అపొ. 20:20) యెహోవా మీ కృషిని దీవిస్తాడనే నమ్మకంతో ఉండండి. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు మీరు చెప్పే సందేశాన్ని వింటే, వాళ్లు రక్షించబడతారు!

పాట 57 అన్నిరకాల ప్రజలకు ప్రకటిద్దాం

^ పేరా 5 మన కుటుంబంలో వాళ్లందరూ యెహోవా గురించి తెలుసుకోవాలని మనం కోరుకుంటాం. కానీ ఆయన్ని ఆరాధించాలా వద్దా అనేది వాళ్లే సొంతగా నిర్ణయించుకోవాలి. అయితే, మనం చెప్పేది వినడానికి వాళ్లు ఇష్టపడాలంటే మనమేం చేయాలో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

^ పేరా 1 అసలు పేర్లు కావు. ఈ ఆర్టికల్‌లో “కుటుంబం,” “కుటుంబ సభ్యులు” అనే పదాలు యెహోవాసాక్షులుకాని బంధువులను కూడా సూచిస్తాయి.

^ పేరా 53 చిత్రాల వివరణ: యెహోవాసాక్షికాని తన తండ్రి కారు రిపేర్‌ చేస్తుంటే ఒక యౌవన సహోదరుడు సహాయం చేస్తున్నాడు. తర్వాత సరైన సమయం చూసి jw.org® వెబ్‌సైట్‌లో ఒక వీడియో చూపిస్తున్నాడు.

^ పేరా 55 చిత్రాల వివరణ: యెహోవాసాక్షికాని భర్త తన రోజు ఎలా గడిచిందో చెప్తున్నప్పుడు ఒక సహోదరి శ్రద్ధగా వింటుంది. తర్వాత, తన కుటుంబంతోపాటు సరదాగా సమయం గడుపుతోంది.

^ పేరా 57 చిత్రాల వివరణ: ఆమె తన సంఘంలోని వాళ్లను ఇంటికి పిలిచింది. వాళ్లు ఆమె భర్తతో పరిచయం పెంచుకుంటున్నారు. తర్వాత, ఆయన ఆమెతోపాటు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యాడు.