కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బాప్తిస్మమిచ్చే యోహాను​—ఆనందాన్ని కాపాడుకోవడంలో మంచి ఆదర్శం

బాప్తిస్మమిచ్చే యోహాను​—ఆనందాన్ని కాపాడుకోవడంలో మంచి ఆదర్శం

మీరు సంఘంలో ఏదైనా నియామకం కోసం ఎదురుచూస్తున్నారా? బహుశా ఆ నియామకాన్ని వేరొకరు చేస్తుండవచ్చు, లేదా ఒకప్పుడు మీరే దాన్ని చేసివుండవచ్చు. అయితే వయసు పైబడడం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ బాధ్యతల వల్ల మీరు ఒకప్పుడు చేసినంత సేవ ఇప్పుడు చేయలేకపోతుండవచ్చు. లేదా సంస్థ చేసిన మార్పుల వల్ల, ఎంతోకాలంపాటు మీరు నిర్వహించిన బాధ్యతల్ని వదిలేసి ఉండవచ్చు. కారణం ఏదైనా, అనుకున్నంత ఎక్కువగా దేవుని సేవ చేయలేకపోతున్నారని మీరు భావిస్తుండవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక్కోసారి నిరాశపడే అవకాశం ఉంది. నిరుత్సాహం, కోపం, బాధ వంటి వాటికి మీ మనసులో చోటివ్వకుండా మీరు ఎలా జాగ్రత్తపడవచ్చు? ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీరు ఎలా ఆనందంగా ఉండవచ్చు?

బాప్తిస్మమిచ్చే యోహాను జీవితాన్ని పరిశీలించడం ద్వారా, మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం ఎలాగో తెలుసుకోవచ్చు. యోహాను అసాధారణమైన సేవావకాశాలు పొందాడు. కానీ తన జీవితంలో ఏం జరగబోతుందో ఆయన ఊహించి ఉండడు. తాను పరిచర్యలో కన్నా జైల్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుందని యోహాను అనుకుని ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఆయన తన ఆనందాన్ని కోల్పోలేదు, జీవితాంతం అదే స్ఫూర్తిని చూపించాడు. అలా ఉండడానికి ఆయనకు ఏం సహాయం చేసింది? నిరుత్సాహపర్చే పరిస్థితులు ఎదురైనా, మన ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

ఆనందాన్ని ఇచ్చిన నియామకం

యోహాను రాబోతున్న మెస్సీయ కోసం మార్గాన్ని సిద్ధం చేసే నియామకాన్ని యెహోవా నుండి పొందాడు. యోహాను ఆ పనిని క్రీ.శ. 29వ సంవత్సరం దాదాపు ఏప్రిల్‌లో మొదలుపెట్టాడు. ఆయన, “పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని ప్రజలకు ప్రకటించాడు. (మత్త. 3:2; లూకా 1:12-17) ఆ సందేశానికి చాలామంది చక్కగా స్పందించారు. నిజానికి, ప్రజలు ఆయన చెప్పే విషయాలు వినడానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్లు. వాళ్లలో చాలామంది పశ్చాత్తాపపడి, బాప్తిస్మం కూడా తీసుకున్నారు. అయితే ఆయన కాలంలోని మతనాయకులు తాము నీతిమంతులమని భావించేవాళ్లు. వాళ్లు మనసు మార్చుకొని పశ్చాత్తాపపడకపోతే దేవుని ఆగ్రహానికి గురౌతారని యోహాను వాళ్లను ధైర్యంగా హెచ్చరించాడు. (మత్త. 3:5-12) క్రీ.శ. 29 సుమారు అక్టోబరులో యేసుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు, యోహాను తన నియామకంలో అత్యంత ప్రాముఖ్యమైన పనిని పూర్తిచేశాడు. అప్పటినుండి యోహాను, వాగ్దానం చేయబడిన మెస్సీయ అయిన యేసును అనుకరించమని ప్రజల్ని ప్రోత్సహించాడు.—యోహా. 1:32-37.

యోహాను పొందిన ప్రత్యేక నియామకం బట్టి యేసు ఇలా అన్నాడు, “స్త్రీలకు పుట్టినవాళ్లలో బాప్తిస్మమిచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడు.” (మత్త. 11:11) యోహాను తాను పొందిన దీవెనల విషయంలో ఖచ్చితంగా సంతోషించి ఉంటాడు. ఆయనలాగే, నేడు చాలామంది దేవుని నుండి ఎన్నో దీవెనలు పొందారు. ఉదాహరణకు టెరీ అనే సహోదరుని అనుభవం పరిశీలించండి. టెరీ, ఆయన భార్య సాండ్రా 50 కన్నా ఎక్కువ సంవత్సరాలు పూర్తికాల సేవ చేశారు. టెరీ ఇలా చెప్తున్నాడు, “నేను పయినీరుగా, బెతెల్‌ కుటుంబ సభ్యునిగా, ప్రత్యేక పయినీరుగా, ప్రాంతీయ పర్యవేక్షకునిగా, జిల్లా పర్యవేక్షకునిగా ఇలా ఎన్నో అద్భుతమైన నియామకాల్లో సేవచేశాను. ఇప్పుడు మళ్లీ ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్నాను.” అవును, దేవుని సంస్థలో ఏదైనా నియామకం పొందినప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. కానీ పరిస్థితులు మారినప్పుడు ఆ ఆనందాన్ని కాపాడుకోవాలంటే కృషి అవసరమని యోహాను జీవితం మనకు నేర్పిస్తుంది.

కృతజ్ఞత కలిగివుండండి

యోహాను తాను పొందిన సేవావకాశాల పట్ల కృతజ్ఞతతో ఉండేవాడు కాబట్టే తన ఆనందాన్ని చివరివరకు కాపాడుకోగలిగాడు. ఒక ఉదాహరణ గమనించండి. యేసు బాప్తిస్మం తీసుకున్నాక యోహాను శిష్యుల సంఖ్య తగ్గి, యేసు శిష్యుల సంఖ్య పెరగడం మొదలైంది. అది చూసి ఆందోళనపడిన యోహాను శిష్యులు, “రబ్బీ, యొర్దాను నది అవతల నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి . . . బాప్తిస్మం ఇస్తున్నాడు, అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు” అని అన్నారు. (యోహా. 3:26) అందుకు యోహాను వాళ్లతో ఇలా చెప్పాడు, “పెళ్లికూతురు పెళ్లికొడుకుకు సొంతం. అయితే పెళ్లికొడుకు స్నేహితుడు పెళ్లికొడుకు దగ్గర నిలబడి అతను మాట్లాడడం విన్నప్పుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ఇప్పుడు నా సంతోషం సంపూర్ణమైంది.” (యోహా. 3:29) అవును, యోహాను యేసుతో పోటీపడలేదు; అలాగే యేసు చేస్తున్న పని ఇంకా ముఖ్యమైనది కాబట్టి తన పనికి విలువ లేకుండా పోయిందని అనుకోలేదు. బదులుగా ‘పెళ్లికొడుకుకు స్నేహితునిగా’ తనకున్న పాత్రను విలువైనదిగా ఎంచుతూ యోహాను ఆనందంగా ఉండగలిగాడు.

యోహాను సరైన విధంగా ఆలోచించడం వల్ల, తనకు ఇవ్వబడిన కష్టమైన నియామకాన్ని ఆనందంగా చేయగలిగాడు. ఉదాహరణకు, యోహాను పుట్టుకతోనే నాజీరు కాబట్టి ఆయన ద్రాక్షారసాన్ని ముట్టకూడదు. (లూకా 1:15) యోహాను గడిపిన సాదాసీదా జీవితం గురించి మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు, “బాప్తిస్మమిచ్చే యోహాను అందరిలా తింటూ, తాగుతూ జీవించలేదు.” దానికి భిన్నంగా యేసు, ఆయన శిష్యులు అలాంటి నియమాల కింద లేకపోవడం వల్ల మిగతా ప్రజల్లానే జీవించారు. (మత్త. 11:18, 19) అంతేకాదు, యోహాను ఎలాంటి అద్భుతాలు చేయలేదు. అయితే ఒకప్పుడు తనను అనుసరించిన వాళ్లతో సహా యేసు శిష్యులందరూ అద్భుతాలు చేసే శక్తి పొందారని యోహానుకు తెలుసు. (మత్త. 10:1; యోహా. 10:41) అయినప్పటికీ యోహాను తన అనుచరులకు, యేసు అనుచరులకు మధ్యున్న తేడాల గురించి ఆలోచించే బదులు, యెహోవా తనకిచ్చిన నియామకం మీదే మనసుపెట్టాడు.

అదేవిధంగా, మనం ప్రస్తుతం చేస్తున్న నియామకాన్ని విలువైనదిగా ఎంచితే మన ఆనందాన్ని కాపాడుకోగలుగుతాం. పైన ప్రస్తావించబడిన టెరీ ఇలా చెప్పాడు, “నేను ఏ నియామకాన్ని చేస్తుంటే దానిమీదే దృష్టి పెట్టేవాణ్ణి.” ఆయన పూర్తికాల సేవలో గడిపిన సంవత్సరాలను గుర్తుచేసుకుంటూ, “నాకు అద్భుతమైన అనుభవాలే ఉన్నాయి గానీ, ఏదో కోల్పోయాననే బాధ లేదు” అని అంటున్నాడు.

మన నియామకం ఏదైనప్పటికీ, మనం “దేవుని తోటి పనివాళ్లం” అని గుర్తించి, దానిగురించి ధ్యానించినప్పుడు రెట్టింపు ఆనందాన్ని పొందుతాం. (1 కొరిం. 3:9) ఏదైనా విలువైన వస్తువును శ్రద్ధగా చూసుకుంటే, ఎన్ని సంవత్సరాలైనా దాని అందం అలాగే ఉంటుంది. అదేవిధంగా, యెహోవాతో కలిసి పనిచేసే అవకాశం ఎంత విలువైనదో ధ్యానిస్తూ ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. మనం చేస్తున్న త్యాగాల్ని, ఇతరులు చేస్తున్న త్యాగాలతో పోల్చుకోం. మన నియామకం ఇతరుల నియామకం కన్నా తక్కువని ఎన్నడూ అనుకోం.—గల. 6:4.

యెహోవా ముఖ్యమైనవిగా ఎంచే వాటిపై మనసుపెట్టండి

యోహానుకు తన నియామకం ఎక్కువకాలం ఉండదనే విషయం తెలిసే ఉంటుంది. కానీ అది ఎంత అకస్మాత్తుగా పూర్తౌతుందో ఆయన గుర్తించి ఉండకపోవచ్చు. (యోహా. 3:30) క్రీ.శ. 30లో, యేసుకు బాప్తిస్మం ఇచ్చిన దాదాపు ఆరు నెలలకే, హేరోదు రాజు యోహానును జైల్లో వేశాడు. అయినప్పటికీ యోహాను ధైర్యంగా సాక్ష్యం ఇస్తూనే ఉన్నాడు. (మార్కు 6:17-20) అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎలా ఆనందంగా ఉండగలిగాడు? ఆయన, యెహోవా ముఖ్యమైనవిగా ఎంచే వాటిపై మనసుపెట్టాడు.

జైల్లో ఉన్న యోహాను, విస్తరిస్తున్న యేసు పరిచర్యకు సంబంధించిన విషయాలు విన్నాడు. (మత్త. 11:2; లూకా 7:18) ఆయన యేసే మెస్సీయ అని నమ్మినప్పటికీ, మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలు అన్నిటినీ యేసు ఎలా నెరవేరుస్తాడో అర్థం చేసుకోలేకపోయాడు. మెస్సీయ రాజ్యాధికారం పొందుతాడని యోహానుకు తెలుసు. కాబట్టి యేసు త్వరలో రాజు అవుతాడా? తనను జైలు నుండి విడిపిస్తాడా? అని యోహాను ఆలోచించివుంటాడు. యేసు ఏం చేయబోతున్నాడో ఎక్కువ తెలుసుకోవాలనే కుతూహలంతో ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని యేసు దగ్గరికి పంపించి, “రాబోతున్న వాడివి నువ్వేనా? లేక ఇంకో వ్యక్తి కోసం మేము ఎదురుచూడాలా?” అని అడగమని చెప్పాడు. (లూకా 7:19) ఆ ఇద్దరు తిరిగొచ్చి, యేసు అద్భుతరీతిలో ప్రజలను బాగుచేయడం గురించి వివరిస్తున్నప్పుడు యోహాను చాలా శ్రద్ధగా వినివుంటాడు. అంతేకాదు “గుడ్డివాళ్లు ఇప్పుడు చూస్తున్నారు, కుంటివాళ్లు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులౌతున్నారు, చెవిటివాళ్లు వింటున్నారు, చనిపోయినవాళ్లు బ్రతికించబడుతున్నారు, పేదవాళ్లకు మంచివార్త చెప్పబడుతోంది” అని యేసు చెప్పమన్న మాటల్ని కూడా వాళ్లు యోహానుకు చెప్పారు.—లూకా 7:20-22.

తన శిష్యులు చెప్పిన విషయాలు యోహానును ఖచ్చితంగా బలపర్చి ఉంటాయి. అంతేకాదు మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలు యేసులో నెరవేరుతున్నాయనే నమ్మకాన్ని కలిగించి ఉంటాయి. యేసు తనను జైలు నుండి విడిపించకపోయినా, తన పరిచర్య విలువైనదేనని యోహాను గుర్తించాడు. కష్టాలు ఎదురైనా, సంతోషంగా ఉండడానికి ఆయనకు సరైన కారణమే ఉంది.

ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి వస్తున్న మంచి ఫలితాల మీద మనసుపెడితే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం

యోహానులాగే మనం కూడా యెహోవా సేవ మీద మనసుపెడితే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆనందంగా, ఓపిగ్గా ఉంటాం. (కొలొ. 1:9-11) అలా మనసుపెట్టాలంటే మనం బైబిలు చదవాలి, అందులోని విషయాల్ని లోతుగా ఆలోచించాలి. యెహోవా సేవలో మనం చేసే ప్రతీ పనిని ఆయన విలువైనదిగా ఎంచుతాడని నమ్మడానికి ఆ విషయాలు మనకు సహాయం చేస్తాయి. (1 కొరిం. 15:58) సాండ్రా ఇలా చెప్తోంది, “ప్రతీరోజు బైబిల్లో ఒక అధ్యాయం చదవడం వల్ల యెహోవాకు ఇంకా దగ్గరవ్వగలిగాను. అలాగే నా మీద కాకుండా యెహోవా మీద మనసు నిలపగలుగుతున్నాను.” మనం రాజ్య పనికి సంబంధించిన నివేదికల మీద కూడా మనసుపెట్టవచ్చు. మన పరిస్థితుల గురించి కాకుండా, యెహోవా సాధిస్తున్న వాటిగురించి ఆలోచించడానికి అవి సహాయం చేస్తాయి. సాండ్రా ఇంకా ఇలా అంటోంది, “ప్రతీ నెల వచ్చే JW బ్రాడ్‌కాస్టింగ్‌ కార్యక్రమాలు మమ్మల్ని సంస్థకు మరింత దగ్గర చేస్తున్నాయి. మా నియామకాన్ని ఆనందంగా కొనసాగించడానికి కూడా సహాయం చేస్తున్నాయి.”

బాప్తిస్మమిచ్చే యోహాను ప్రకటించింది కొంతకాలమే అయినప్పటికీ, ఆయన ఆ పనిని “ఏలీయా లాంటి స్ఫూర్తితో, శక్తితో” చేశాడు. ఏలీయాలాగే ఆయన కూడా “మనలాంటి మనిషే.” (లూకా 1:17; యాకో. 5:17) కాబట్టి మనం యోహానును అనుకరిస్తూ మన నియామకం పట్ల కృతజ్ఞత కలిగివుందాం, యెహోవా సేవ మీద మనసుపెడదాం. అలా చేస్తే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన సేవను ఆనందంగా చేయగలుగుతాం.