కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 31

“మనం అధైర్యపడం”!

“మనం అధైర్యపడం”!

“మనం అధైర్యపడం.”—2 కొరిం. 4:16.

పాట 128 అంతం వరకు సహిద్దాం

ఈ ఆర్టికల్‌లో. . . *

1. క్రైస్తవులు జీవపు పరుగుపందెం పూర్తి చేయాలంటే ఏం చేయాలి?

క్రైస్తవులమైన మనందరం జీవపు పరుగుపందెంలో ఉన్నాం. మనం పరుగును ఈమధ్యే మొదలుపెట్టినా లేక ఎన్నో ఏళ్ల క్రితం మొదలుపెట్టినా లక్ష్యాన్ని చేరుకునేవరకు దాన్ని ఆపకూడదు. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలోని క్రైస్తవులకు రాసిన ఉత్తరాన్ని మనం పరిశీలించడం ద్వారా, ఆ పరుగుపందెం పూర్తి చేయడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని పొందగలం. ఆయన ఆ ఉత్తరం రాసే సమయానికి, ఫిలిప్పీ సంఘంలోని కొంతమంది చాలా సంవత్సరాలుగా యెహోవాను ఆరాధిస్తున్నారు. వాళ్లు జీవపు పరుగుపందెంలో ఎంతో నమ్మకంగా పరుగెత్తుతున్నారు, అయినప్పటికీ ఓపిగ్గా పరుగెత్తుతూ ఉండమని పౌలు వాళ్లకు గుర్తుచేశాడు. ఎందుకంటే వాళ్లు తనను ఆదర్శంగా తీసుకుని, ‘లక్ష్యం వైపే పరుగెత్తాలని’ ఆయన కోరుకున్నాడు.—ఫిలి. 3:14.

2. పౌలు ఫిలిప్పీయులను సరైన సమయంలోనే ప్రోత్సహించాడని ఎందుకు చెప్పవచ్చు?

2 పౌలు ఫిలిప్పీయులను సరైన సమయంలోనే ప్రోత్సహించాడు. ఎందుకంటే ఆ సంఘం స్థాపించబడినప్పటి నుండి సహోదరులు హింసలు ఎదుర్కొంటూ ఉన్నారు. దాదాపు క్రీ.శ. 50లో, మాసిదోనియకు వెళ్లి సహాయం చేయమని దేవుడు పౌలుకు చెప్పాడు, దాంతో పౌలు సీలను తీసుకుని ఫిలిప్పీ నగరానికి వచ్చాడు. (అపొ. 16:9) అక్కడ వాళ్లు లూదియ అనే స్త్రీని కలిశారు. “పౌలు చెప్తున్న వాటిని శ్రద్ధగా విని, అంగీకరించేలా యెహోవా ఆమె హృదయాన్ని తెరిచాడు.” (అపొ. 16:14) త్వరలోనే ఆమె, ఆమె ఇంటివాళ్లు బాప్తిస్మం తీసుకున్నారు. కానీ వెంటనే అపవాది అక్కడి క్రైస్తవుల్ని హింసలకు గురిచేశాడు. ప్రజలు పౌలును, సీలను నగర పాలకుల దగ్గరకు ఈడ్చుకెళ్లి, వాళ్లు నగరంలో అలజడి రేపుతున్నారని అబద్ధారోపణ చేశారు. దాంతో వాళ్లిద్దర్నీ కొట్టి చెరసాలలో వేశారు, నగరం విడిచి వెళ్లిపొమ్మని కూడా చెప్పారు. (అపొ. 16:16-40) దానికి వాళ్లు భయపడిపోయారా? లేదు. మరి కొత్తగా ఏర్పడిన ఆ సంఘంలోని సహోదరసహోదరీల పరిస్థితి ఏంటి? మెచ్చుకోదగిన విషయమేమిటంటే, వాళ్లు కూడా హింసల్ని సహించి నమ్మకంగా ఉన్నారు. పౌలు, సీలల ఆదర్శం ఆ సహోదరసహోదరీలను ఎంతో ప్రోత్సహించి ఉంటుంది.

3. పౌలుకు ఏ విషయం తెలుసు? మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

3 ఎలాంటి హింసలు వచ్చినా అధైర్యపడకూడదని పౌలు నిర్ణయించుకున్నాడు. (2 కొరిం. 4:16) జీవపు పరుగుపందెం పూర్తి చేయాలంటే తన దృష్టిని లక్ష్యం మీదే ఉంచాలని ఆయనకు తెలుసు. పౌలు ఉదాహరణ నుండి మనమేం నేర్చుకోవచ్చు? మనం ఎలాంటి కష్టాలనైనా సహించగలమని మనకాలంలోని ఏ ఉదాహరణలు నిరూపిస్తున్నాయి? ఎన్నడూ అధైర్యపడకూడదనే నిర్ణయానికి కట్టుబడి జీవించేలా మన నిరీక్షణ మనకెలా సహాయం చేస్తుంది? అనే ప్రశ్నల గురించి పరిశీలిస్తాం.

పౌలు నుండి నేర్చుకునే పాఠాలు

4. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పౌలు యెహోవా సేవను ఎలా కొనసాగించాడు?

4 ఫిలిప్పీయులకు ఉత్తరం రాసే సమయానికి పౌలు యెహోవా సేవలో ఎంత కష్టపడుతున్నాడో ఆలోచించండి. అప్పుడాయన రోములో గృహ నిర్బంధంలో ఉన్నాడు. దానివల్ల ఆయనకు బయటికెళ్లి ప్రకటించే స్వేచ్ఛ లేదు. అయినప్పటికీ, ఆయన తనను కలవడానికి వచ్చేవాళ్లకు ప్రకటిస్తూ, దూర ప్రాంతాల్లో ఉన్న సంఘాలకు ఉత్తరాలు రాస్తూ క్షణం తీరిక లేకుండా గడిపాడు. అదేవిధంగా నేడు కూడా ఎంతోమంది క్రైస్తవులు అనారోగ్యం లేదా వయసు పైబడడం వల్ల ఇంటికే పరిమితమైనప్పటికీ, మంచివార్త ప్రకటించడానికి చేయగలిగినదంతా చేస్తున్నారు. వాళ్లు తమను చూడడానికి వచ్చేవాళ్లకు ప్రకటిస్తున్నారు, నేరుగా కలవలేని వాళ్లకు ఉత్తరాలు రాస్తూ ప్రోత్సహిస్తున్నారు.

5. లక్ష్యం మీదే దృష్టి నిలిపేలా పౌలుకు ఏం సహాయం చేసిందని ఫిలిప్పీయులు 3:12-14 వచనాలు చూపిస్తున్నాయి?

5 గతంలో తాను చేసిన మంచి పనులు లేదా తప్పులు తన దృష్టిని పక్కకు మళ్లించడానికి పౌలు అనుమతించలేదు. నిజానికి ‘వెనక ఉన్నవాటిని మర్చిపోతేనే’ ‘ముందున్న వాటి కోసం పరుగెత్తగలనని’ అంటే పందెం పూర్తి చేయగలనని ఆయన అన్నాడు. (ఫిలిప్పీయులు 3:12-14 చదవండి.) పౌలు తన దృష్టి పక్కకు మళ్లకుండా ఎలా జాగ్రత్తపడ్డాడు? మొదటిగా, ఆయన క్రైస్తవుడు కాకముందు ఎంతో ఉత్సాహం గల యూదునిగా ఉంటూ యూదా మతాన్ని ప్రోత్సహించడానికి చాలా కృషిచేశాడు. కానీ తర్వాత ఆ కృషి అంతటినీ “చెత్తగా” ఎంచాడు. (ఫిలి. 3:3-8) రెండవదిగా, క్రైస్తవుల్ని హింసించి తప్పు చేశాననే అపరాధ భావాలు కలిగినప్పటికీ ఆయన యెహోవా సేవను ఆపలేదు. మూడవదిగా, యెహోవా కోసం ఇప్పటికే ఎంతో చేశానని ఆయన సంతృప్తిపడలేదు, కష్టపడడం ఆపేయలేదు. జైలు పాలైనా, కొరడాలతో-రాళ్లతో దెబ్బలు తిన్నా, ఓడ బద్దలై ప్రమాదానికి గురైనా, తినడానికి తిండి-వేసుకోవడానికి బట్టలు లేకపోయినా పరిచర్యను కొనసాగించి మంచి ఫలితాలు సాధించాడు. (2 కొరిం. 11:23-27) పౌలు ఎంత సాధించినా, ఎన్ని కష్టాలు అనుభవించినా తన పరుగును మాత్రం కొనసాగిస్తూ ఉండాలని గుర్తించాడు. మనం కూడా అదే చేయాలి!

6. మనం మర్చిపోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి?

6 మనం పౌలును ఆదర్శంగా తీసుకొని ‘వెనక ఉన్నవాటిని మర్చిపోవడానికి’ ఏం చేయవచ్చు? మనలో కొంతమంది గతంలో చేసిన పాపాలకు సంబంధించిన అపరాధ భావాలతో పోరాడుతుండవచ్చు. అలాగైతే, క్రీస్తు అర్పించిన విమోచన క్రయధనం గురించి వ్యక్తిగత అధ్యయనంలో పరిశోధన చేయవచ్చు. మనలో ప్రోత్సాహాన్ని నింపే ఆ అంశం గురించి అధ్యయనం చేసి, లోతుగా ఆలోచించి, ప్రార్థిస్తే అనవసరమైన అపరాధ భావాల నుండి బయటపడతాం. ఇప్పటికే యెహోవా క్షమించేసిన పాపాల విషయంలో అతిగా చింతించకుండా ఉంటాం. మనం పౌలును ఆదర్శంగా తీసుకోగల మరో విషయాన్ని పరిశీలిద్దాం. కొంతమంది యెహోవా సేవను ఎక్కువగా చేయడానికి మంచి ఉద్యోగాన్ని వదులుకొని ఉండవచ్చు. అలాగైతే, వదులుకున్న వాటిగురించి బాధపడకుండా ఉండడానికి ప్రయత్నించవచ్చు. (సంఖ్యా. 11:4-6; ప్రసం. 7:10) మనం మర్చిపోవాల్సిన వాటిలో మనం సాధించిన మంచి ఫలితాలు లేదా గతంలో సహించిన కష్టాలు కూడా ఉన్నాయి. నిజమే, యెహోవా మనల్ని ఎలా దీవించాడో, మనకు ఎలా సహాయం చేశాడో గుర్తుంచుకోవడం వల్ల ఆయనకు దగ్గరౌతాం. అయితే అలా గుర్తుచేసుకుంటున్నప్పుడు, మనం యెహోవా కోసం ఇప్పటికే ఎంతో చేశామని సంతృప్తి చెందకుండా జాగ్రత్తపడాలి.—1 కొరిం. 15:58.

జీవపు పరుగుపందెంలో మన దృష్టిని పక్కకు మళ్లించకుండా, లక్ష్యం మీదే మనసుపెట్టి కొనసాగుదాం (7వ పేరా చూడండి)

7. మొదటి కొరింథీయులు 9:24-27 ప్రకారం, జీవపు పరుగుపందెంలో గెలవాలంటే ఏం అవసరం? ఉదాహరణతో చెప్పండి.

7 “తీవ్రంగా కృషిచేయండి” అని యేసు చెప్పిన మాటల్ని పౌలు సరిగ్గా అర్థంచేసుకున్నాడు. (లూకా 13:23, 24) క్రీస్తులాగే తాను కూడా చివరిశ్వాస వరకు కృషిచేస్తూ ఉండాలని పౌలు గుర్తించాడు. అందుకే ఆయన క్రైస్తవ జీవితాన్ని పరుగుపందెంతో పోల్చాడు. (1 కొరింథీయులు 9:24-27 చదవండి.) పందెంలో పరుగెత్తే క్రీడాకారుడు తన దృష్టిని లక్ష్యం మీదే ఉంచుతాడు, వేరే విషయాల్ని పట్టించుకోడు. ఉదాహరణకు, క్రీడాకారులు పరుగెత్తుతున్న రోడ్డుకు ఇరు వైపులా షాపులు గానీ, దృష్టిని మళ్లించే ఇతర విషయాలు గానీ ఉండవచ్చు. పందెంలో పాల్గొనే వ్యక్తి తన పరుగును మధ్యలో ఆపి షాపులో ఏమున్నాయో చూస్తాడా? గెలవాలనుకునే వ్యక్తి ఖచ్చితంగా అలా చేయడు! జీవపు పరుగుపందెంలో మనం కూడా మన దృష్టిని పక్కకు మళ్లించకూడదు. మనం పౌలులా లక్ష్యం మీదే దృష్టిపెట్టి తీవ్రంగా కృషి చేస్తే బహుమతి గెల్చుకుంటాం!

విశ్వాసానికి ఎదురయ్యే సవాళ్లు

8. మనం ఏ మూడు సవాళ్లను పరిశీలిస్తాం?

8 జీవపు పరుగుపందెంలో మన వేగాన్ని తగ్గించగల మూడు సవాళ్లను ఇప్పుడు పరిశీలిద్దాం. అవి: ఎదురుచూస్తున్నవి ఆలస్యం కావడం, బలం తగ్గిపోవడం, చాలాకాలంగా సమస్యల్ని ఎదుర్కోవడం. వీటిని ఇతరులు ఎలా సహించారో పరిశీలించడం వల్ల మనం ప్రయోజనం పొందవచ్చు.—ఫిలి. 3:17.

9. ఎదురుచూస్తున్నవి ఆలస్యమైనప్పుడు ఎలా అనిపించవచ్చు?

9 ఎదురుచూస్తున్నవి ఆలస్యం కావడం. సహజంగానే మనం యెహోవా మాటిచ్చిన మంచి విషయాలు నిజమవ్వాలని ఎదురుచూస్తాం. ఉదాహరణకు, యూదా ప్రాంతంలో పెరిగిపోతున్న చెడును యెహోవా నాశనం చేయాలని హబక్కూకు ప్రవక్త ఎంతో కోరుకున్నాడు. కానీ యెహోవా ‘దానికోసం కనిపెట్టుకొని’ ఉండమని ఆయనకు చెప్పాడు. (హబ. 2:3) అయితే ఎదురుచూస్తున్నవి ఆలస్యమైనప్పుడు మన ఉత్సాహం తగ్గిపోవచ్చు, బాధ అనిపించవచ్చు. (సామె. 13:12) సుమారు 1914లో కొంతమంది సహోదరసహోదరీలకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ కాలంలో జీవించిన అభిషిక్త క్రైస్తవుల్లో ఎంతోమంది, తాము 1914లో పరలోకానికి వెళ్లిపోతామని అనుకున్నారు. కానీ అలా జరగనప్పుడు నమ్మకమైన సహోదరసహోదరీలు ఏం చేశారు?

రాయల్‌, పెర్ల్‌ స్పాట్జ్‌ ఎదురుచూసింది 1914లో జరగలేదు, అయినప్పటికీ వాళ్లు తమ భూజీవితం ముగిసేవరకు నమ్మకంగా సేవచేశారు (10వ పేరా చూడండి)

10. ఎదురుచూస్తున్నవి ఆలస్యమైనప్పుడు ఒక జంట ఏం చేసింది?

10 అలాంటి నిరుత్సాహాన్ని ఎదుర్కొన్న ఇద్దరు నమ్మకమైన క్రైస్తవుల అనుభవాన్ని గమనించండి. సహోదరుడు రాయల్‌ స్పాట్జ్‌ 1908లో బాప్తిస్మం తీసుకున్నాడు, అప్పటికి ఆయన వయసు 20 ఏళ్లు. ఆయన త్వరలోనే పరలోకానికి వెళ్లిపోతానని చాలా నమ్మకంతో ఉండేవాడు. ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పెర్ల్‌ అనే సహోదరితో 1911లో ఇలా అన్నాడు, “1914లో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. నీకు ఇష్టమైతే త్వరగా పెళ్లి చేసుకుందాం!” కానీ ఆ జంట ఎదురుచూసినట్టు వాళ్లు 1914లో పరలోకానికి వెళ్లనప్పుడు, తమ జీవపు పరుగుపందెం అంటే యెహోవా సేవ మధ్యలోనే ఆపేశారా? లేదు. ఎందుకంటే, నమ్మకంగా యెహోవా ఇష్టాన్ని చేయడమే వాళ్ల లక్ష్యం కానీ పరలోకానికి వెళ్లడం కాదు. వాళ్లు ఓపిగ్గా పరుగెత్తాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు ఆ తర్వాత ఎన్నో ఏళ్లపాటు, నిజానికి తమ భూజీవితం ముగిసేవరకు ఉత్సాహంగా, నమ్మకంగా సేవచేశారు. అదేవిధంగా మీరు కూడా, యెహోవా తన పేరు మీదున్న నిందను తొలగించుకుని, తన పరిపాలనే సరైనదని రుజువు చేసి, తన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. యెహోవా నిర్ణయించిన సమయంలో అవి ఖచ్చితంగా జరుగుతాయనే నమ్మకంతో ఉండండి. అప్పటివరకు, మన దేవుణ్ణి సేవిస్తూ బిజీగా ఉందాం. ఎదురుచూస్తున్నవి ఆలస్యమైనా జీవపు పరుగుపందెంలో మన వేగాన్ని తగ్గించకుండా, నిరుత్సాహపడకుండా ఉందాం!

ఆర్థర్‌ సెకర్డ్‌ వృద్ధాప్యంలో కూడా యెహోవా కోసం చేయగలిగినదంతా చేశాడు (11వ పేరా చూడండి)

11-12. మన బలం తగ్గిపోయినా యెహోవా సేవను ఎందుకు కొనసాగించగలం? ఒక అనుభవం చెప్పండి.

11 బలం తగ్గిపోవడం. పరుగుపందెంలో పాల్గొనే క్రీడాకారుడు శారీరకంగా బలంగా ఉండాలి. కానీ యెహోవాపై విశ్వాసాన్ని పెంచుకోవడానికి, ఆయన సేవను ఉత్సాహంగా చేయడానికి శారీరక బలంతో సంబంధం లేదు. నిజానికి శారీరకంగా బలహీనంగా ఉన్నా ఎంతోమంది యెహోవా సేవలో ఉత్సాహంగా కొనసాగుతున్నారు. (2 కొరిం. 4:16) ఉదాహరణకు, ఆర్థర్‌ సెకర్డ్‌ * అనే సహోదరుని అనుభవం పరిశీలించండి. ఆయనకు 88 ఏళ్లు ఉన్నప్పుడు శారీరకంగా బలహీనంగా ఉన్నాడు, ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. అప్పటికి ఆయన బెతెల్‌లో 55 ఏళ్లు సేవచేశాడు. ఒకరోజు ఆయన బాగోగులు చూసుకోవడానికి వచ్చిన సహోదరి ఆయనతో ఆప్యాయంగా “బ్రదర్‌ సెకర్డ్‌, ఇప్పటిదాకా మీరు యెహోవా కోసం ఎంతో చేశారు” అని అంది. కానీ ఆయన మాత్రం గతంలో చేసినవాటి మీద దృష్టిపెట్టలేదు. అందుకే ఆమె వైపు చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు, “అవును నిజమే. కానీ ఒకప్పుడు మనం ఏం చేశాం అనేది ముఖ్యం కాదు. ప్రస్తుతం నమ్మకంగా ఉన్నామా లేదా అనేదే చాలా ముఖ్యం.”

12 బహుశా మీరు ఎన్నో ఏళ్లపాటు యెహోవా సేవ చేసివుండవచ్చు. ఇప్పుడు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఒకప్పుడు చేసినంత సేవ చేయలేకపోతుండవచ్చు. అయితే నిరుత్సాహపడకండి! గతంలో మీరు చేసిన సేవను యెహోవా విలువైనదిగా ఎంచుతున్నాడనే నమ్మకంతో ఉండండి. (హెబ్రీ. 6:10) మనం ఎక్కువ సేవ చేస్తేనే యెహోవాపై ఎక్కువ ప్రేమ ఉన్నట్టు కాదని గుర్తుంచుకోండి. బదులుగా మన ఆనందాన్నీ నిరీక్షణనూ కాపాడుకోవడం ద్వారా, ఆయన సేవలో చేయగలిగినదంతా చేయడం ద్వారా మనకు యెహోవా పట్ల ఎంతో ప్రేమ, భక్తి ఉన్నాయని చూపిస్తాం. (కొలొ. 3:23) యెహోవా మన పరిమితుల్ని అర్థంచేసుకుంటాడు, మనం చేయగలిగినదాని కన్నా ఎక్కువ మన నుండి ఆశించడు.—మార్కు 12:43, 44.

అనాటోలీ, లిడియా మెల్‌నిక్‌ ఎన్నో కష్టాల్ని నమ్మకంగా సహించారు (13వ పేరా చూడండి)

13. చాలాకాలంగా సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పటికీ నమ్మకంగా కొనసాగవచ్చని అనాటోలీ, లిడియాల అనుభవం మనల్ని ఎలా ప్రోత్సహిస్తుంది?

13 చాలాకాలంగా సమస్యల్ని ఎదుర్కోవడం. కొంతమంది యెహోవా సేవకులు చాలా ఏళ్లపాటు కష్టాల్ని, హింసల్ని సహించారు. ఉదాహరణకు, అనాటోలీ మెల్‌నిక్‌ * అనే సహోదరుని అనుభవం పరిశీలించండి. ఆయనకు 12 ఏళ్లు ఉన్నప్పుడు వాళ్ల నాన్నను జైల్లో వేశారు, తర్వాత సైబీరియాకు బందీగా పంపించారు. అది, అనాటోలీ వాళ్ల కుటుంబం ఉండే మాల్డోవా ప్రాంతం నుండి 7,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉండేది. ఒక సంవత్సరం తర్వాత అనాటోలీని, వాళ్ల అమ్మను, అమ్మమ్మ-తాతయ్యలను కూడా అక్కడికే బందీలుగా పంపించారు. కొంతకాలానికి వాళ్లు వేరే పల్లెటూరిలో జరిగే మీటింగ్స్‌కు హాజరవ్వగలిగారు. అందుకోసం వాళ్లు ఎముకలు కొరికే చలిలో సుమారు ఆరు గంటలు మంచులో నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. తర్వాత సహోదరుడు అనాటోలీ మూడేళ్ల పాటు తన భార్య లిడియాకు, ఏడాది వయసున్న తన కూతురికి దూరంగా జైల్లో ఉండాల్సి వచ్చింది. అన్ని సంవత్సరాలు కష్టాలు అనుభవించినా అనాటోలీ, ఆయన కుటుంబం నమ్మకంగా యెహోవా సేవను కొనసాగించారు. ఇప్పుడు అనాటోలీకి 82 ఏళ్లు. ఆయన సెంట్రల్‌ ఆసియాలోని ఒక బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేస్తున్నాడు. అనాటోలీని, ఆయన భార్య లిడియాను మనం ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పటివరకు సహించినట్లే ఇకముందు కూడా సహిస్తూ యెహోవా సేవలో చేయగలిగినదంతా చేద్దాం.—గల. 6:9.

నిరీక్షణ మీద దృష్టిపెట్టండి

14. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలని పౌలు గుర్తించాడు?

14 పౌలు తన పరుగుపందెం పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకుంటానని నమ్మాడు. ఆయన అభిషిక్త క్రైస్తవుడు కాబట్టి, “దేవుని నుండి వచ్చే పరలోక పిలుపు అనే బహుమానం పొందాలని” ఎదురుచూశాడు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, దానివైపు పరుగెత్తుతూ ఉండాలని ఆయన గుర్తించాడు. (ఫిలి. 3:14) పౌలు ఫిలిప్పీయులకు ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పడం ద్వారా వాళ్లు తమ లక్ష్యం మీదే దృష్టి నిలిపేందుకు సహాయం చేశాడు.

15. పౌలు ఫిలిప్పీయులను లక్ష్యం వైపు పరుగెత్తుతూ ఉండమని ప్రోత్సహించడానికి పౌరసత్వం గురించిన ఉదాహరణ ఎందుకు ఉపయోగించాడు?

15 పౌలు ఫిలిప్పీయులకు తమ పరలోక పౌరసత్వాన్ని గుర్తుచేశాడు. (ఫిలి. 3:20) ఎందుకు? ఆ రోజుల్లో, ప్రజలు రోమా పౌరసత్వం పొందడానికి చాలా కృషి చేసేవాళ్లు, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండేవి. * అయితే అభిషిక్త క్రైస్తవులకు అంతకన్నా గొప్ప పౌరసత్వం ఉంది, దానివల్ల వాళ్లు ఎన్నో గొప్ప ప్రయోజనాలు పొందుతారు. పరలోక పౌరసత్వంతో పోలిస్తే రోమా పౌరసత్వం ఎందుకూ పనికిరాదు! కాబట్టి ఆయన, “క్రీస్తు గురించిన మంచివార్తకు తగ్గట్టు పౌరులుగా” నడుచుకోమని ఫిలిప్పీయులను ప్రోత్సహించాడు. (ఫిలి. 1:27, అధస్సూచి) నేడున్న అభిషిక్త క్రైస్తవులు, పరలోకంలో శాశ్వత జీవితం అనే లక్ష్యం వైపు పరుగెత్తుతూ మనకు మంచి ఆదర్శాన్ని ఉంచుతున్నారు.

16. మనం పరలోక బహుమానం కోసం ఎదురుచూస్తున్నా, పరదైసు భూమిపై శాశ్వతకాలం జీవించాలని ఎదురుచూస్తున్నా ఏం చేయాలని ఫిలిప్పీయులు 4:6, 7 వచనాలు చెప్తున్నాయి?

16 మనం పరలోక బహుమానం కోసం ఎదురుచూస్తున్నా, పరదైసు భూమిపై శాశ్వతకాలం జీవించాలని ఎదురుచూస్తున్నా మన లక్ష్యం వైపు పరుగెత్తుతూనే ఉండాలి. మనం ఎలాంటి కష్టాలు సహించాల్సి వచ్చినా వెనక ఉన్నవాటిని గుర్తు చేసుకోకూడదు, యెహోవా సేవను ఆపడానికి దేన్నీ అనుమతించకూడదు. (ఫిలి. 3:16) ఎదురుచూసేవి ఆలస్యమైనా, శరీరం బలహీనపడినా, కష్టాల్నీ హింసల్నీ ఎంతోకాలంపాటు సహించాల్సి వచ్చినా, “ఆందోళన పడకండి.” బదులుగా మీ విన్నపాల్ని, అభ్యర్థనల్ని దేవునికి తెలియజేయండి, మీరు ఊహించినదానికి మించిన శాంతిని ఆయన మీకు ఇస్తాడు.—ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.

17. తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

17 క్రీడాకారుడు తన లక్ష్యానికి దగ్గరైనప్పుడు మరింత ఏకాగ్రతతో పరుగెత్తుతాడు. మనం కూడా జీవపు పరుగుపందెం ముగింపుకు చేరుకునే కొద్దీ, భవిష్యత్తుకు సంబంధించిన అద్భుతమైన వాగ్దానాల మీద ఎక్కువ దృష్టి నిలుపుదాం. మన బలం, పరిస్థితులు అనుమతించిన మేరకు అలా చేస్తూ ఉందాం. మనం సరైన దారిలో, తగినంత వేగంతో ఓపిగ్గా పరుగెత్తుతూ ఉండాలంటే ఏం చేయాలి? మన జీవితంలో దేనికి మొదటిస్థానం ఇవ్వాలి? ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో’ ఎలా తెలుసుకోవాలి? అనే వాటిగురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.—ఫిలి. 1:9, 10.

పాట 79 వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం

^ పేరా 5 మనం ఎన్నో ఏళ్లుగా యెహోవాను ఆరాధిస్తున్నా మరింత పరిణతి సాధించడానికి, మన సేవను విస్తృతపర్చుకోవడానికి కృషి చేస్తుంటాం. అలా కృషి చేయడం ఎన్నడూ ఆపకూడదని అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసుల్ని ప్రోత్సహించాడు. ఆయన ఫిలిప్పీయులకు రాసిన ఉత్తరాన్ని పరిశీలించడం ద్వారా, మనం జీవపు పరుగుపందెంలో ఓపిగ్గా పరుగెత్తడానికి కావాల్సిన ప్రోత్సాహం పొందగలం. అయితే పౌలు రాసిన మాటల్ని మన జీవితంలో ఎలా పాటించవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

^ పేరా 11 సహోదరుడు సెకర్డ్‌ జీవిత కథను, 1965 జూన్‌ 15 కావలికోట (ఇంగ్లీష్‌) 380-382 పేజీల్లో చూడండి.

^ పేరా 13దేవుణ్ణి ప్రేమించడం చిన్నప్పటి నుండి బోధించబడింది” అనే శీర్షికతో వచ్చిన సహోదరుడు అనాటోలీ మెల్‌నిక్‌ జీవిత కథను 2005, జనవరి-మార్చి తేజరిల్లు! సంచికలోని 11-15 పేజీల్లో చూడండి.

^ పేరా 15 ఫిలిప్పీ ప్రాంతం రోమా పరిపాలన కింద ఉండడం వల్ల ఫిలిప్పీయులు రోమా పౌరులు పొందే కొన్ని ప్రయోజనాల్ని ఆనందించేవాళ్లు. కాబట్టి అక్కడి సహోదరులు పౌలు చెప్పిన ఉదాహరణను చక్కగా అర్థంచేసుకుని ఉంటారు.