కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 31

మీరు యెహోవా కోసం వేచి ఉంటారా?

మీరు యెహోవా కోసం వేచి ఉంటారా?

‘నేను ఓపిగ్గా వేచి ఉంటాను.’—మీకా 7:7.

పాట 128 అంతం వరకు సహిద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

మీకెంతో అవసరమైన ఒక వస్తువు మీరు ఎదురుచూస్తున్న సమయానికి రాకపోతే మీకెలా అనిపిస్తుంది? మీరు నిరాశపడరా? బహుశా సామెతలు 13:12 లో ఉన్నట్లు మీకు అనిపిస్తుంది: “ఎదురుచూసింది ఆలస్యమైనప్పుడు బాధ కలుగుతుంది.” మీరు అనుకున్న సమయంలో ఆ వస్తువు రాకపోవడానికి సరైన కారణాలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు మీరెలా భావిస్తారు? బహుశా అప్పుడు ఓపిగ్గా ఎదురుచూస్తారు.

2 మనం ‘ఓపికను’ వృద్ధి చేసుకోవడానికి సహాయం చేసే కొన్ని బైబిలు సూత్రాలను ఈ ఆర్టికల్‌లో చూస్తాం. (మీకా 7:7) ఆ తర్వాత యెహోవా చర్య తీసుకునేంత వరకు మనం ఓపిగ్గా ఉండాల్సిన రెండు రంగాల్ని పరిశీలిస్తాం. చివరిగా, యెహోవా కోసం ఎదురు చూడాలనుకుంటున్న వాళ్లు పొందే ఆశీర్వాదాలు గురించి మనం చూస్తాం.

మనకు ఓర్పును నేర్పించే లేఖన సూత్రాలు

3. సామెతలు 13:11 మనకేం నేర్పిస్తుంది?

3 సామెతలు 13:11 మనం ఎందుకు ఓపిగ్గా ఉండాలో నేర్పిస్తుంది. అక్కడ ఇలా ఉంది: “త్వరగా సంపాదించిన ఆస్తి తరిగిపోతుంది, కొద్దికొద్దిగా సమకూర్చుకున్న ఆస్తి పెరుగుతుంది.” ఈ లేఖనం నుండి మనమేం నేర్చుకుంటాం? తెలివైన వ్యక్తి పనుల్ని జాగ్రత్తగా, ఓపిగ్గా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది.

4. సామెతలు 4:18 నుండి మనమేం నేర్చుకుంటాం?

4 సామెతలు 4:18 మనకు ఇలా చెప్తుంది: “నీతిమంతుల దారి వేకువ వెలుగు లాంటిది, మిట్టమధ్యాహ్నం అయ్యేవరకు ఆ వెలుగు అంతకంతకూ ఎక్కువౌతుంది.” తన ప్రజలు మెల్లమెల్లగా తన సంకల్పాన్ని అర్థంచేసుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడని ఈ లేఖనం స్పష్టం చేస్తోంది. ఒక క్రైస్తవుడు ఎలా తన జీవితంలో మార్పులు చేసుకుని యెహోవాకు దగ్గరౌతాడో అర్థంచేసుకోవడానికి కూడా ఈ లేఖనం మనకు సహాయం చేస్తుంది. ఒక వ్యక్తి యెహోవాకు దగ్గరవడానికి సమయం పడుతుంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తూ అందులో సలహాల్ని, అలాగే దేవుని సంస్థ నుండి వచ్చే సలహాల్ని పాటించినప్పుడు మనం మెల్లమెల్లగా క్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకుంటాం. అంతేకాదు, దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాం. ఆ విషయాన్ని యేసు ఒక ఉదాహరణతో ఎలా చెప్పాడో గమనించండి.

ఒక మొక్క మెల్లమెల్లగా పెరిగినట్టే, రాజ్య సందేశాన్ని విని అంగీకరించే వ్యక్తి ఆధ్యాత్మికంగా మెల్లమెల్లగా ఎదుగుతాడు (5వ పేరా చూడండి)

5. ఒక వ్యక్తి మార్పులు చేసుకోవడానికి సమయం పడుతుందని చెప్పడానికి యేసు ఏ ఉదాహరణ ఉపయోగించాడు?

5 మనం ప్రకటించే రాజ్య సందేశం ఒక చిన్న విత్తనంలా యథార్థ హృదయం ఉన్నవాళ్లలో ఎలా పెరుగుతుందో వివరించడానికి యేసు ఒక ఉదాహరణ ఉపయోగించాడు. ఆయన ఇలా అన్నాడు: “ఆ విత్తనాలు మొలకెత్తి, పొడుగ్గా పెరుగుతాయి. అదంతా ఎలా జరుగుతుందో అతనికి [విత్తేవానికి] తెలీదు. నేల దానంతటదే క్రమేణా పంటనిస్తుంది. ముందు కాండం, తర్వాత వెన్నులు, చివరికి ధాన్యం వస్తాయి.” (మార్కు 4:27, 28) యేసు ఏం చెప్పాలనుకున్నాడు? ఒక మొక్క మెల్లమెల్లగా పెరిగినట్టే, రాజ్య సందేశాన్ని అంగీకరించే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా మెల్లమెల్లగా ఎదుగుతాడని ఆయన వివరించాడు. ఉదాహరణకు, మన విద్యార్థులు యెహోవాకు దగ్గరౌతుండగా ఎన్నో మంచి మార్పులు చేసుకోవడం మనం చూస్తాం. (ఎఫె. 4:22-24) అయితే ఆ చిన్న విత్తనాన్ని యెహోవాయే పెరిగేలా చేస్తాడని మనం గుర్తుంచుకోవాలి.—1 కొరిం. 3:7.

6-7. యెహోవా భూమిని తయారుచేసిన విధానం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

6 యెహోవా ఏ పని చేసినా, దాన్ని పూర్తి చేయడానికి కావాల్సినంత సమయాన్ని వెచ్చిస్తాడు. తన పేరును మహిమపర్చుకోవడానికి, ఇతరులకు సహాయం చేయడానికి ఆయన అలా చేస్తాడు. ఉదాహరణకు, యెహోవా మనుషుల కోసం భూమిని మెల్లమెల్లగా ఎలా సిద్ధం చేశాడో గమనించండి.

7 యెహోవా ఈ భూమిని ఎలా సృష్టించాడో వివరిస్తున్నప్పుడు ఆయన “దానికి కొలతలు” నిర్ణయించాడని, “దాని పునాదులు” వేశాడని, “దాని మూలరాయి” వేశాడని బైబిలు చెప్తుంది. (యోబు 38:5, 6) తన పని ఎలా ఉందో చూడడానికి కూడా ఆయన సమయం వెచ్చించాడు. (ఆది. 1:10, 12) యెహోవా తయారుచేస్తున్న ఒక్కోదానిని దేవదూతలు చూస్తున్నప్పుడు, వాళ్లకు ఎలా అనిపించి ఉంటుందో ఆలోచించండి. వాళ్లు ‘సంతోషంతో స్తుతిగీతాలు పాడారు.’ (యోబు 38:7) దాన్నుండి మనమేం నేర్చుకుంటాం? భూమిని, నక్షత్రాలను, జీవ ప్రాణులన్నిటినీ సృష్టించడానికి యెహోవాకు వేల సంవత్సరాలు పట్టింది. అయితే ఆయన వాటినన్నిటినీ జాగ్రత్తగా చూసినప్పుడు “చాలా బాగుంది” అని అన్నాడు.—ఆది. 1:31.

8. మనమిప్పుడు ఏం చూస్తాం?

8 మనకు ఓపిక ఎందుకు అవసరమో నేర్పించే ఎన్నో బైబిలు సూత్రాలు దేవుని వాక్యంలో ఉన్నాయని పైనున్న ఉదాహరణలు చూపించాయి. యెహోవా చర్య తీసుకునేంత వరకు మనం వేచి ఉండాల్సిన రెండు రంగాల గురించి ఇప్పుడు చూద్దాం.

యెహోవా చర్య తీసుకునే వరకు వేచి ఉండండి

9. యెహోవా కోసం మనం వేచి ఉండాల్సిన ఒక రంగం ఏంటి?

9 యెహోవా మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేంతవరకు మనం వేచి ఉండాల్సి రావచ్చు. ఏదైనా సమస్యను ఎదుర్కోవడానికి బలాన్ని ఇవ్వమని లేదా ఆయనకు నచ్చనిది చేయడం మానేయడానికి సహాయం చేయమని ప్రార్థించినప్పుడు, వాటికి జవాబు ఇవ్వడానికి యెహోవా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడని మనకు అనిపించవచ్చు. యెహోవా మన ప్రార్థనలన్నిటికీ వెంటనే ఎందుకు జవాబు ఇవ్వడు?

10. యెహోవా మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేంతవరకు మనమెందుకు ఓపికతో వేచి ఉండాలి?

10 యెహోవా మన ప్రార్థనల్ని శ్రద్ధగా వింటాడు. (కీర్త. 65:2) మనం మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనల్ని ఆయన మీద మనకున్న విశ్వాసానికి రుజువుగా చూస్తాడు. (హెబ్రీ. 11:6) అంతేకాదు, మన ప్రార్థనలకు తగ్గట్టు జీవించడానికి, ఆయన ఇష్టం చేయడానికి మనం ఎంత కృషి చేస్తున్నామో కూడా ఆయన చూడాలనుకుంటాడు. (1 యోహా. 3:22) ఒక చెడు అలవాటును లేదా యెహోవాకు ఇష్టంలేనిది ఏదైనా మానుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు, ఓర్పు చూపిస్తూ మన ప్రార్థనలకు తగ్గట్టు కృషి చేయాలి. మనం చేసే కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోవచ్చని అర్థంచేసుకోవడానికి యేసు సహాయం చేశాడు. ఆయన ఇలా అన్నాడు: “అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది; వెతుకుతూ ఉండండి, మీకు దొరుకుతుంది; తడుతూ ఉండండి, మీ కోసం తెరవబడుతుంది; అడిగే ప్రతీ వ్యక్తి పొందుతాడు, వెతికే ప్రతీ వ్యక్తికి దొరుకుతుంది, తట్టే ప్రతీ వ్యక్తి కోసం తెరవబడుతుంది.” (మత్త. 7:7, 8) ఆ సలహాను పాటించి మనం ‘పట్టుదలతో ప్రార్థించినప్పుడు’ మన పరలోక తండ్రి మన ప్రార్థనలు వింటాడనే, వాటికి జవాబిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—కొలొ. 4:2.

యెహోవా చర్య తీసుకునేంత వరకు మనం వేచి ఉండగా, విశ్వాసంతో ప్రార్ధిస్తూ ఉంటాం (11వ పేరా చూడండి) *

11. మన ప్రార్థనలకు జవాబు వెంటనే రాలేదని అనిపిస్తే, హెబ్రీయులు 4:16 లో ఉన్న మాటలు ఎలా సహాయం చేస్తాయి?

11 మనం చేసిన ఒక ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యమైనట్టు అనిపించినా, మనకు “సరిగ్గా అవసరమైనప్పుడు” మన ప్రార్థనకు జవాబు ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు. (హెబ్రీయులు 4:16 అలాగే అధస్సూచి చదవండి.) కాబట్టి మనం అనుకున్నంత త్వరగా జవాబు రాకపోతే ఎన్నడూ యెహోవాను నిందించకూడదు. ఉదాహరణకు, దేవుని రాజ్యం ఈ వ్యవస్థకు ముగింపు తీసుకురావాలని చాలామంది సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నారు. దానికోసం ప్రార్థించాలని కూడా యేసు చెప్పాడు. (మత్త. 6:10) కానీ మనం ఎదురుచూసిన సమయానికి అంతం రాలేదని దేవుని మీద విశ్వాసం కోల్పోతే, అది తెలివితక్కువతనం అవుతుంది. (హబ. 2:3; మత్త. 24:44) యెహోవా చర్య తీసుకునేంత వరకు వేచి ఉంటూ, విశ్వాసంతో ఆయనకు ప్రార్థిస్తూ ఉండడం తెలివైన పని. అంతం తప్పకుండా సరైన సమయానికి వస్తుంది. ఎందుకంటే ‘ఆ రోజును, ఆ గంటను’ యెహోవా ఇప్పటికే నిర్ణయించాడు. అదే అందరికీ మంచి సమయం అవుతుంది.—మత్త. 24:36; 2 పేతు. 3:15.

ఓపిగ్గా ఉండడం గురించి మనం యోసేపు నుండి ఏం నేర్చుకోవచ్చు? (12-14 పేరాలు చూడండి)

12. ఎలాంటి పరిస్థితిలో మనం ఓపిగ్గా ఉండడం కష్టం కావచ్చు?

12 మనం ఓపిగ్గా ఉంటూ అన్యాయాన్ని సహించాల్సిరావచ్చు. లోకంలోని ప్రజలు సాధారణంగా వేరే లింగ వ్యక్తులను, వేరే జాతి, సంస్కృతి, తెగ, దేశం వాళ్లను చిన్నచూపు చూస్తారు. ఇంకొంతమందిని వాళ్లకున్న శారీరక, మానసిక లోపాలవల్ల చిన్నచూపు చూస్తున్నారు. చాలామంది యెహోవా ప్రజలు తమ బైబిలు ఆధారిత నమ్మకాల్ని బట్టి అన్యాయాన్ని సహించారు. మనమలా అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు, యేసు అన్న ఈ మాటల్ని గుర్తుపెట్టుకోవాలి: “అంతం వరకు సహించినవాళ్లే రక్షించబడతారు.” (మత్త. 24:13) కానీ సంఘంలో ఎవరైనా ఘోరమైన తప్పు చేశారని తెలిస్తే మీరేం చేయాలి? పెద్దలకు ఆ విషయం చెప్పాక, తప్పు చేసిన వ్యక్తితో వాళ్లు యెహోవా నిర్దేశం ప్రకారం వ్యవహరిస్తారని నమ్ముతూ, మీరు ఓపిగ్గా ఉంటారా? ఎవరైనా గంభీరమైన తప్పు చేస్తే సంఘ పెద్దలు ఏం చేయాల్సిరావచ్చు?

13. ఒక వ్యక్తి గంభీరమైన తప్పు చేశాడని తెలిసినప్పుడు, పెద్దలు ఏం చేయాలని యెహోవా కోరుకుంటాడు?

13 సంఘంలో ఎవరైనా గంభీరమైన తప్పు చేశారని పెద్దలకు తెలిస్తే, ఆ పరిస్థితిని యెహోవా అర్థంచేసుకున్నట్టే అర్థంచేసుకోవడానికి, వాళ్లు ప్రార్థనాపూర్వకంగా “పరలోకం నుండి వచ్చే తెలివి” కోసం అడుగుతారు. (యాకో. 3:17) తప్పు చేస్తున్న వ్యక్తి ‘చెడు మార్గం నుండి మళ్లేలా’ సహాయం చేయడమే వాళ్ల లక్ష్యం. (యాకో. 5:19, 20) సంఘాన్ని కాపాడడానికి, నొచ్చుకున్నవాళ్లను ఓదార్చడానికి చేయగలిగినదంతా చేయాలని కూడా కోరుకుంటారు. (2 కొరిం. 1:3, 4) సంఘంలో ఎవరైనా గంభీరమైన తప్పు చేశారని పెద్దలకు తెలిస్తే, ముందు అసలేం జరిగిందో వాళ్లు పూర్తిగా తెలుసుకోవాలి. దానికి కొంత సమయం పట్టొచ్చు. తర్వాత వాళ్లు ప్రార్థించి, లేఖనాల నుండి జాగ్రత్తగా సలహా ఇస్తారు. అలాగే తప్పు చేసిన వ్యక్తిని “తగిన మోతాదులో” సరిదిద్దుతారు. (యిర్మీ. 30:11) నిర్ణయం తీసుకునే విషయంలో పెద్దలు మరీ ఆలస్యం చేయరు, అలాగని మరీ త్వరగా కూడా తీసుకోరు. పెద్దలు యెహోవా నుండి వచ్చే నిర్దేశాన్ని పాటించినప్పుడు, సంఘమంతటికీ మంచి జరుగుతుంది. వాళ్లు సమస్యను సరైన పద్ధతిలో పరిష్కరించిన్నప్పటికీ, తప్పు చేసిన వ్యక్తి వల్ల నొచ్చుకున్నవాళ్లు ఇంకా బాధపడుతూ ఉండవచ్చు. మీ విషయంలో కూడా అలా జరిగితే ఆ బాధ తగ్గడానికి మీరేం చేయవచ్చు?

14. ఒక సహోదరుడు లేదా సహోదరి వల్ల మీరు బాగా నొచ్చుకుంటే, ఏ బైబిలు ఉదాహరణ మీకు ఓదార్పును ఇవ్వగలదు?

14 మీరు ఒక సహోదరుడు లేదా సహోదరి వల్ల బాగా నొచ్చుకున్నారా? మనకు ఎదురయ్యే అన్యాయాల్ని యెహోవా సరిచేసేంతవరకు ఎలా వేచి ఉండవచ్చో నేర్పే అత్యుత్తమ ఉదాహరణల్ని బైబిల్లో చదవవచ్చు. ఉదాహరణకు, యోసేపు తన అన్నల చేతిలో అన్యాయానికి గురైనప్పటికీ, వాళ్ల తప్పుల్ని బట్టి కోపాన్ని పెంచుకోలేదు. బదులుగా ఆయన యెహోవాను సేవించడానికి చేయగలిగినదంతా చేస్తూ ఉన్నాడు. ఆయన ఓర్పు, సహనం చూపించినందుకు యెహోవా ఆయనకు ప్రతిఫలం ఇచ్చాడు. (ఆది. 39:21) సమయం గడుస్తుండగా తనను బాధపెట్టినవాళ్లను యోసేపు క్షమించగలిగాడు. అలాగే యెహోవా తనను ఎలా దీవించాడో చూడగలిగాడు. (ఆది. 45:5) మనం యోసేపులా యెహోవాకు దగ్గరైనప్పుడు, మనకు ఎదురైన అన్యాయాన్ని ఆయన సరైన సమయంలో సరిచేస్తాడని వేచి ఉన్నప్పుడు ఓదార్పును పొందుతాం.—కీర్త. 7:17; 73:28.

15. ఒక సహోదరి తనకు ఎదురైన అన్యాయాన్ని ఓపిగ్గా సహించి, మనశ్శాంతిని పొందడానికి ఏది సహాయం చేసింది?

15 మనకు ఎదురయ్యే అన్యాయాలన్నీ యోసేపుకు ఎదురైనంత తీవ్రమైనవి కాకపోవచ్చు. కానీ అన్యాయానికి గురైనప్పుడు మనందరం బాధపడతాం. యెహోవాను ఆరాధించని వాళ్లతోసహా, వేరే ఎవరితోనైనా మనకు సమస్య ఎదురైతే బైబిలు సూత్రాలను పాటించడం వల్ల మనం ప్రయోజనం పొందుతాం. (ఫిలి. 2:3, 4) ఒక సహోదరి గురించి తన తోటి ఉద్యోగి వేరేవాళ్ల దగ్గర లేనిపోనివి చెప్పేది. అది విన్నప్పుడు సహోదరి బాగా నొచ్చుకుంది. తోటి ఉద్యోగిని వెంటనే కోప్పడే బదులు, సహోదరి యేసు ఉదాహరణ గురించి ఆలోచించడానికి సమయం తీసుకుంది. ఇతరులు యేసును అవమానించినప్పుడు, ఆయన తిరిగి అవమానించలేదు. (1 పేతు. 2:21, 23) ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని తనకి జరిగింది వదిలేయాలనుకుంది. తనతో పాటు పనిచేసే ఆ స్త్రీ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుందనీ, చాలా ఒత్తిడిలో ఉందనీ సహోదరి తర్వాత తెలుసుకుంది. బహుశా అందుకే ఆమె అలా మాట్లాడి ఉంటుందని సహోదరి అర్థంచేసుకుంది. ఆ సహోదరి తనకు ఎదురైన అన్యాయాన్ని ఓపిగ్గా సహించినందుకు సంతోషించింది, అలాగే మనశ్శాంతిని పొందింది.

16. మీరు అన్యాయాన్ని సహిస్తుంటే, ఏ విషయం మీకు ఓదార్పును ఇవ్వగలదు? (1 పేతురు 3:12)

16 మీరు అన్యాయాన్ని ఎదుర్కోవడం వల్ల లేదా ఇంకేదైనా కారణం వల్ల బాధపడుతుంటే, “విరిగిన హృదయంగలవాళ్లకు” యెహోవా దగ్గరగా ఉంటాడని గుర్తుంచుకోండి. (కీర్త. 34:18) మీరు ఓపిక చూపిస్తున్నందుకు, ఆయన మీద భారం వేస్తున్నందుకు మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. (కీర్త. 55:22) యెహోవా భూమి అంతటికీ న్యాయాధిపతి, ఆయన అన్నిటినీ చూస్తూ ఉంటాడు. (1 పేతురు 3:12 చదవండి.) కాబట్టి మీరు పరిష్కరించలేనంత పెద్ద సమస్యల్ని ఎదుర్కొంటుంటే, యెహోవా చర్య తీసుకునేంత వరకు వేచి ఉండడం ప్రాముఖ్యమని గుర్తుంచుకోండి.

యెహోవా కోసం వేచి ఉండేవాళ్లు పొందే ఎన్నో ఆశీర్వాదాలు

17. యెషయా 30:18 ప్రకారం, యెహోవా మనకు ఏమని మాటిస్తున్నాడు?

17 మన పరలోకపు తండ్రి త్వరలో తన రాజ్యం ద్వారా మనకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. యెషయా 30:18 ఇలా చెప్తుంది: “మీ మీద అనుగ్రహం చూపించాలని యెహోవా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు, మీ మీద కరుణ చూపించడానికి ఆయన లేస్తాడు. ఎందుకంటే యెహోవా న్యాయవంతుడైన దేవుడు. ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నవాళ్లంతా సంతోషంగా ఉంటారు.” యెహోవా కోసం కనిపెట్టుకునేవాళ్లు, ఇప్పుడు అలాగే రానున్న కొత్త లోకంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారు.

18. భవిష్యత్తులో మనం ఎలాంటి ఆశీర్వాదాల్ని పొందుతాం?

18 దేవుని ప్రజలు కొత్త లోకంలోకి వెళ్లాక, ఇప్పుడు అనుభవిస్తున్న సమస్యల్ని ఇంకెప్పటికీ ఎదుర్కోరు. అన్యాయం ఉండదు, నొప్పి ఇక ఉండదు. (ప్రక. 21:4) అంతా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, మనకు కావాల్సింది దొరుకుతుందో లేదో అని ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. (కీర్త. 72:16; యెష. 54:13) అది నిజంగా అద్భుతంగా ఉంటుంది!

19. యెహోవా మనల్ని ఇప్పుడు మెల్లమెల్లగా దేనికోసం సిద్ధం చేస్తున్నాడు?

19 మనం చెడు లక్షణాల్ని మానుకొని తనకు నచ్చే లక్షణాల్ని వృద్ధి చేసుకోవడానికి సహాయం చేయడం ద్వారా, తన పరిపాలనలో జీవించడానికి యెహోవా మనల్ని సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి నిరుత్సాహపడకండి, యెహోవా సేవ చేయడం ఆపేయకండి. చాలా మంచి జీవితం మీముందు ఉంది. ఆ అద్భుతమైన సమయం కోసం మనం ఎదురుచూస్తుండగా, యెహోవా తాను చేస్తానన్న పనుల్ని చేసేంతవరకు మనం ఓపికను చూపిస్తూ, సంతోషంగా ఉందాం.

పాట 118 ‘బలమైన విశ్వాసం కలిగివుండేలా సాయం చేయి’

^ పేరా 5 ‘ఈ దుష్టలోకం ఇంతకాలం కొనసాగుతుందని నేను అస్సలు ఊహించలేదు’ అని యెహోవాను చాలాకాలంగా సేవిస్తున్న ఒకరు అనడం మీరెప్పుడైనా విన్నారా? ముఖ్యంగా ఇలాంటి కష్టకాలాల్లో యెహోవా ఈ దుష్టలోకాన్ని అంతం చేయాలని మనందరం ఎదురుచూస్తున్నాం. అయినా మనం ఓపిక చూపించడం నేర్చుకోవాలి. ఈ ఆర్టికల్‌లో ఓపిగ్గా వేచివుండడానికి సహాయం చేసే బైబిలు సూత్రాలను మనం చూస్తాం. యెహోవా కోసం ఓపిగ్గా వేచి ఉండాల్సిన రెండు రంగాల్ని కూడా మనం చూస్తాం. చివరిగా, ఓపిగ్గా ఎదురు చూడాలనుకుంటున్న వాళ్లకు యెహోవా వాగ్దానం చేసిన ఆశీర్వాదాల గురించి చూస్తాం.

^ పేరా 56 చిత్రాల వివరణ: ఒక సహోదరి చిన్నప్పటి నుండి యెహోవాకు క్రమంగా ప్రార్థిస్తుంది. ఎలా ప్రార్థన చేయాలో ఆమె తల్లిదండ్రులు నేర్పించారు. టీనేజీలో ఉన్నప్పుడే ఆమె పయినీరు సేవను మొదలుపెట్టి, ఆ సేవను ఆశీర్వదించమని తరచూ యెహోవాను అడుగుతూ ఉండేది. చాలా సంవత్సరాల తర్వాత ఆమె భర్త తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఆ పరిస్థితిని తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వమని యెహోవాను వేడుకుంది. ఇప్పుడామె విధవరాలు, అయినా యెహోవా తన ప్రార్థనలకు ఇప్పటివరకు జవాబిచ్చినట్టే ఇకముందు కూడా జవాబిస్తాడని నమ్ముతూ, పట్టుదలగా ప్రార్థిస్తుంది.