కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 30

యెహోవా కుటుంబంలో మీకున్న స్థానాన్ని విలువైనదిగా చూడండి

యెహోవా కుటుంబంలో మీకున్న స్థానాన్ని విలువైనదిగా చూడండి

“నువ్వు అతన్ని దేవదూతల కన్నా కాస్త తక్కువవాడిగా చేశావు, మహిమ, వైభవాల్ని అతనికి కిరీటంలా పెట్టావు.”—కీర్త. 8:5.

పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం

ఈ ఆర్టికల్‌లో . . . *

1. యెహోవా సృష్టించిన వాటన్నిటి గురించి ఆలోచించినప్పుడు మనకేం ప్రశ్నలు రావచ్చు?

యెహోవా సృష్టించిన ఈ సువిశాల విశ్వం గురించి ఆలోచించినప్పుడు, కీర్తనకర్త దావీదులాగే మనకు అనిపించవచ్చు. ఆయన ప్రార్థనాపూర్వకంగా ఇలా అడిగాడు: “నేను నీ చేతి పని అయిన నీ ఆకాశాన్ని, నువ్వు చేసిన చంద్రుణ్ణి, నక్షత్రాల్ని చూసినప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది: నువ్వు గుర్తుంచుకోవడానికి మనిషి ఎంతటివాడు? నువ్వు శ్రద్ధ చూపించడానికి మనిషికి పుట్టినవాడు ఎంతటివాడు?” (కీర్త. 8:3, 4) దావీదులాగే, మనల్ని మనం యెహోవా సృష్టించిన నక్షత్రాలతో పోల్చుకున్నప్పుడు చిన్నగా ఉన్నామని అనుకోవచ్చు. అలాగే యెహోవా మనల్ని గుర్తుంచుకున్నందుకు ఆశ్చర్యపోవచ్చు. కానీ యెహోవా మొదటి మనుషులైన ఆదాముహవ్వలను పట్టించుకోవడమే కాదు, వాళ్లను తన కుటుంబంలో సభ్యులుగా చేసుకున్నాడని కూడా మనం చూస్తాం.

2. యెహోవా ఆదాముహవ్వల్ని ఏం చేయమన్నాడు?

2 ఆదాముహవ్వలు యెహోవాకు మొదటి మానవ పిల్లలు. ఆయన వాళ్లకు ప్రేమగల పరలోక తండ్రి అయ్యాడు. ఆ దంపతులకు ఆయన ఒక పని ఇచ్చాడు. దేవుడు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి, దాన్ని లోబర్చుకోండి.” (ఆది. 1:28) వాళ్లు పిల్లల్ని కనాలని, ఈ భూమిని చక్కగా చూసుకోవాలని ఆయన కోరుకున్నాడు. ఆదాముహవ్వల విషయంలో యెహోవా సంకల్పించినదానికి వాళ్లు విధేయతతో సహకరించి ఉంటే వాళ్లు, వాళ్ల పిల్లలు ఎప్పటికీ యెహోవా కుటుంబంలో సభ్యులుగా ఉండేవాళ్లు.

3. యెహోవా కుటుంబంలో ఆదాముహవ్వలకు ఒక గౌరవపూర్వకమైన స్థానం ఉండేదని ఎలా చెప్పవచ్చు?

3 యెహోవా కుటుంబంలో ఆదాముహవ్వలకు ఒక గౌరవపూర్వకమైన స్థానం ఉండేది. యెహోవా సృష్టించిన మనిషి గురించి దావీదు కీర్తన 8:5 లో ఇలా అన్నాడు: “నువ్వు అతన్ని దేవదూతల కన్నా కాస్త తక్కువవాడిగా చేశావు, మహిమ, వైభవాల్ని అతనికి కిరీటంలా పెట్టావు.” నిజమే దేవదూతలకు ఉండే శక్తిని, తెలివిని, సామర్థ్యాల్ని యెహోవా మనుషులకు ఇవ్వలేదు. (కీర్త. 103:20) కానీ ఎంతో శక్తి ఉన్న ఆ దేవదూతలకన్నా మనుషులు కేవలం ‘కాస్త తక్కువగా’ ఉన్నారు. ఆయన మన మొదటి మానవ తల్లిదండ్రులను సృష్టించినప్పుడు, వాళ్లకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు.

4. యెహోవాకు అవిధేయత చూపించడం వల్ల ఆదాముహవ్వలకు ఏమైంది? ఈ ఆర్టికల్‌లో ఏం చర్చిస్తాం?

 4 విచారకరంగా, ఆదాముహవ్వలు అవిధేయత చూపించి యెహోవా కుటుంబంలో తమ స్థానాన్ని పోగొట్టుకున్నారు. దానివల్ల వాళ్ల పిల్లలు ఘోరమైన సమస్యల్ని ఎదుర్కొన్నారని తెలుసుకుంటాం. కానీ యెహోవా సంకల్పం మారలేదు. విధేయులైన మనుషులు ఎప్పటికీ తన పిల్లలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ ఆర్టికల్‌లో ముందుగా, యెహోవా మనల్ని ఎలా గౌరవించాడో చర్చిస్తాం. తర్వాత, మనం దేవుని కుటుంబంలో ఒకరిగా ఉండాలనుకుంటున్నామని చూపించడానికి ఇప్పుడు ఏం చేయవచ్చో చర్చిస్తాం. చివరిగా, యెహోవా పిల్లలు ఈ భూమ్మీద శాశ్వతకాలం అనుభవించే ఆశీర్వాదాల గురించి పరిశీలిస్తాం.

యెహోవా మనుషులను ఎలా గౌరవించాడు?

యెహోవా మనల్ని ఏయే విధాలుగా గౌరవించాడు? (5-11 పేరాలు చూడండి) *

5. మనల్ని తన స్వరూపంలో చేసినందుకు దేవుని పట్ల కృతజ్ఞత ఉందని మనమెలా చూపించవచ్చు?

5 తన స్వరూపంలో సృష్టించడం ద్వారా యెహోవా మనల్ని గౌరవించాడు. (ఆది. 1:26, 27) మనం యెహోవా స్వరూపంలో తయారు చేయబడ్డాం కాబట్టి ప్రేమ, కనికరం, విశ్వసనీయత, నీతి వంటి ఎన్నో అద్భుతమైన లక్షణాల్ని వృద్ధి చేసుకోగలం, చూపించగలం. (కీర్త. 86:15; 145:17) అలాంటి లక్షణాల్ని వృద్ధి చేసుకున్నప్పుడు యెహోవాను మహిమపరుస్తాం. అలాగే ఆయన పట్ల మనకు కృతజ్ఞత ఉందని నిరూపిస్తాం. (1 పేతు. 1:14-16) మన పరలోక తండ్రిని సంతోషపెట్టేలా ప్రవర్తించినప్పుడు, మనం సంతృప్తిగా ఉంటాం. యెహోవా తన స్వరూపంలో మనల్ని చేయడం ద్వారా, తన కుటుంబంలో ఎలాంటి వ్యక్తులు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ విధంగా తయారయ్యే సామర్థ్యాన్ని మనకిచ్చాడు.

6. భూమిని సిద్ధం చేస్తున్నప్పుడు యెహోవా మనుషుల్ని ఎలా గౌరవించాడు?

6 యెహోవా మన కోసం ఒక ప్రత్యేకమైన ఇంటిని సిద్ధపరిచాడు. మనిషిని తయారు చేయడానికి చాలాకాలం ముందే మనుషుల కోసం యెహోవా భూమిని సిద్ధపరిచాడు. (యోబు 38:4-6; యిర్మీ. 10:12) ఆయనకు దయ, ఉదారత ఉన్నాయి కాబట్టి మనం సంతోషించడానికి ఎన్నో మంచివాటిని సృష్టించాడు. (కీర్త. 104:14, 15, 24) కొన్నిసార్లు తాను చేసిన సృష్టి గురించి ఆలోచించడానికి ఆయన సమయం తీసుకొని “దాన్ని చూసినప్పుడు అది బాగుంది.” (ఆది. 1:10, 12, 31) ఆయన భూమ్మీద సృష్టించిన అద్భుతమైన వాటన్నిటి మీద మనుషులకు “అధికారం” ఇవ్వడం ద్వారా వాళ్లను గౌరవించాడు. (కీర్త. 8:6) తాను చేసిన అందమైన సృష్టిని పరిపూర్ణ మనుషులు జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికీ ఆనందించాలనేది దేవుని ఉద్దేశం. ఆ విషయంలో మీరు తరచూ యెహోవాకు కృతజ్ఞతలు చెప్తున్నారా?

7. యెహోషువ 24:15 ప్రకారం, మనిషికి స్వేచ్ఛాచిత్తం ఉందని ఎలా చెప్పవచ్చు?

7 యెహోవా మనకు స్వేచ్ఛాచిత్తం అనే బహుమానాన్ని ఇచ్చాడు. మన జీవితంలో మనం ఏం చేస్తామో మనమే నిర్ణయించుకోవచ్చు. (యెహోషువ 24:15 చదవండి.) తన సేవచేయాలని మనం నిర్ణయించుకున్నప్పుడు, మన ప్రేమగల దేవుడు సంతోషిస్తాడు. (కీర్త. 84:11; సామె. 27:11) మనం మరెన్నో మంచి నిర్ణయాల్ని తీసుకోవడానికి మన స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించవచ్చు. యేసు తన స్వేచ్ఛాచిత్తాన్ని ఎలా ఉపయోగించాడో ఒక ఉదాహరణ గమనించండి.

8. యేసు తనకున్న స్వేచ్ఛాచిత్తాన్ని ఎలా ఉపయోగించాడో ఒక ఉదాహరణ చెప్పండి.

8 మన అవసరాలకన్నా ఇతరుల అవసరాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్ణయించుకోవడం ద్వారా మనం యేసును అనుసరించవచ్చు. ఒకరోజు యేసు, ఆయన అపొస్తలులు బాగా అలసిపోయి ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. కానీ వాళ్లు విశ్రాంతి తీసుకోలేకపోయారు. ఎందుకంటే ప్రజలు యేసు చేత బోధించబడాలనే కోరికతో వాళ్లెక్కడ ఉన్నారో తెలుసుకుని, అక్కడికి వచ్చారు. కానీ యేసు వాళ్లను చూసి చిరాకుపడలేదు, బదులుగా జాలిపడ్డాడు. అప్పుడు యేసు ఏం చేశాడు? “ఆయన వాళ్లకు చాలా విషయాలు బోధించడం మొదలుపెట్టాడు.” (మార్కు 6:30-34) మనం యేసును అనుకరిస్తూ ఇతరులకు సహాయం చేయడానికి మన సమయాన్ని, శక్తిని ఉపయోగించినప్పుడు, మన పరలోక తండ్రికి మహిమ తీసుకొస్తాం. (మత్త. 5:14-16) అంతేకాదు, మనం తన కుటుంబంలో ఒకరిగా ఉండాలనుకుంటున్నామని కూడా యెహోవాకు చూపిస్తాం.

9. యెహోవా మనుషులకు ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతి ఏంటి? ఆయన తల్లిదండ్రులకు ఏ బాధ్యత ఇచ్చాడు?

9 యెహోవా మనుషులకు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని ఇచ్చాడు. దాంతోపాటు పిల్లలు ఆయన్ని ప్రేమించేలా, ఆరాధించేలా వాళ్లకు నేర్పించాల్సిన బాధ్యతను కూడా తల్లిదండ్రులకు ఇచ్చాడు. మీరు తల్లిదండ్రులైతే ఈ ప్రత్యేక బహుమతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నారా? యెహోవా దేవదూతలకు ఎన్నో సామర్థ్యాల్ని ఇచ్చినప్పటికీ, వాళ్లకు ఈ అవకాశం ఇవ్వలేదు. కాబట్టి తల్లిదండ్రులారా, పిల్లల్ని పెంచే గొప్ప అవకాశం మీకు ఉన్నందుకు కృతజ్ఞత కలిగి ఉండండి. “యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను, ఉపదేశాన్ని ఇస్తూ” పిల్లల్ని పెంచే ప్రాముఖ్యమైన బాధ్యత తల్లిదండ్రులకు ఇవ్వబడింది. (ఎఫె. 6:4; ద్వితీ. 6:5-7; కీర్త. 127:3) తల్లిదండ్రులకు సహాయం చేయడానికి దేవుని సంస్థ ఎన్నో బైబిలు ఆధారిత ప్రచురణల్ని, వీడియోలను, సంగీతాన్ని, వెబ్‌సైట్‌లోని ఆర్టికల్స్‌ని అందుబాటులో ఉంచింది. దీన్ని బట్టి మన పరలోక తండ్రి, ఆయన కుమారుడు పిల్లల్ని ప్రేమిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. (లూకా 18:15-17) తల్లిదండ్రులు యెహోవామీద ఆధారపడుతూ తమ అమూల్యమైన పిల్లల పట్ల శ్రద్ధ చూపించడానికి చేయగలిగినదంతా చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. అలా చేయడం వల్ల, తమ పిల్లలు యెహోవా కుటుంబంలో ఎప్పటికీ ఒకరిగా ఉండే అవకాశాన్ని తల్లిదండ్రులు కల్పిస్తారు.

10-11. యేసును మనకోసం బలిగా ఇవ్వడం ద్వారా యెహోవా ఏం సాధ్యం చేశాడు?

10 మనం తిరిగి తన కుటుంబంలో ఒకరిగా అవ్వడానికి, యెహోవా తనకు ఎంతో ఇష్టమైన కుమారుణ్ణి ఇచ్చాడు. మనం  నాల్గొవ పేరాలో చూసినట్లు, ఆదాముహవ్వలు యెహోవా కుటుంబంలో స్థానాన్ని పోగొట్టుకోవడంతో పాటు తమ పిల్లలకు కూడా స్థానం లేకుండా చేశారు. (రోమా. 5:12) ఆదాముహవ్వలు దేవునికి అవిధేయత చూపించాలని నిర్ణయించుకున్నారు, కాబట్టి తన కుటుంబంలో వాళ్లకు స్థానం లేకుండా ఆయన చేయడం సరైనదే. మరి వాళ్ల పిల్లల సంగతేంటి? వాళ్ల పిల్లల్లో ఎవరైతే తనకు విధేయత చూపిస్తారో వాళ్లను తిరిగి తన కుటుంబంలో చేర్చుకోవడానికి యెహోవా ఒక ప్రేమపూర్వక ఏర్పాటు చేశాడు. తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తును బలిగా ఇవ్వడం ద్వారా ఆయన దాన్ని సాధ్యం చేశాడు. (యోహా. 3:16; రోమా. 5:19) దానివల్ల తనకు నమ్మకంగా ఉన్న 1,44,000 మందిని తన కుమారులుగా దత్తత తీసుకోవడం వీలైంది.—రోమా. 8:15-17; ప్రక. 14:1.

11 లక్షలాది ఇతర నమ్మకమైన క్రైస్తవులు, పరలోకానికి వెళ్లే 1,44,000 మందితో పాటు విధేయతతో దేవుని ఇష్టాన్ని చేస్తున్నారు. వెయ్యేళ్ల ముగింపులో చివరి పరీక్ష అయిపోయిన తర్వాత, వాళ్లు దేవుని కుటుంబంలో ఒకరిగా అవ్వడానికి ఎదురుచూస్తున్నారు. (కీర్త. 25:14; రోమా. 8:20, 21) వాళ్లకు ఆ నిరీక్షణ ఉంది కాబట్టే వాళ్లిప్పుడు కూడా యెహోవాను “తండ్రి” అని పిలుస్తున్నారు. (మత్త. 6:9) పునరుత్థానమయ్యే వాళ్లకు కూడా, యెహోవా తమ నుండి ఏం కోరుతున్నాడో తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. పునరుత్థానమయ్యే వాళ్లలో ఎవరైతే ఆయన నిర్దేశానికి లోబడాలని నిర్ణయించుకుంటారో వాళ్లు కూడా యెహోవా కుటుంబంలో ఒకరౌతారు.

12. మనం ఇప్పుడు ఏ ప్రశ్నకు జవాబు చూస్తాం?

12 యెహోవా మనుషుల్ని ఎన్నో విధాలుగా గౌరవించడానికి చొరవ తీసుకున్నాడని మనం చూశాం. అభిషిక్త క్రైస్తవులను ఆయన ఇప్పటికే తన కుమారులుగా దత్తత తీసుకున్నాడు. అలాగే ‘గొప్ప సమూహంలో’ ఉన్నవాళ్లకు కొత్తలోకంలో తన కుమారులయ్యే నిరీక్షణను ఇచ్చాడు. (ప్రక. 7:9) మనం ఆయన కుటుంబంలో ఎప్పటికీ ఒకరిగా ఉండాలనుకుంటున్నామని యెహోవాకు చూపించడానికి ఇప్పుడు ఏం చేయవచ్చు?

తన కుటుంబంలో ఒకరిగా ఉండాలనుకుంటున్నారని యెహోవాకు చూపించండి

13. దేవుని కుటుంబంలో ఒకరిగా ఉండాలంటే మనమేం చేయాలి? (మార్కు 12:30)

13 మీ నిండు హృదయంతో యెహోవాను సేవించడం ద్వారా ఆయనపై మీకున్న ప్రేమను చూపించండి. (మార్కు 12:30 చదవండి.) దేవుడు దయతో మనకెన్నో బహుమతులు ఇచ్చాడు, వాటన్నిటిలో అత్యంత గొప్ప బహుమతి ఆయనను ఆరాధించే సామర్థ్యం. మనం ‘ఆయన ఆజ్ఞల్ని పాటించడం’ ద్వారా యెహోవాను ప్రేమిస్తున్నామని చూపిస్తాం. (1 యోహా. 5:3) తన తండ్రి తరఫున మాట్లాడుతూ ప్రజల్ని శిష్యుల్ని చేయమని, వాళ్లకు బాప్తిస్మం ఇవ్వమని యేసు మనకు ఆజ్ఞాపించాడు. (మత్త. 28:19) ఒకరినొకరు ప్రేమించుకోమని కూడా ఆయన మనకు ఆజ్ఞాపించాడు. (యోహా. 13:35) తన ఆజ్ఞలకు లోబడేవాళ్లకు తన ప్రపంచవ్యాప్త ఆరాధకుల కుటుంబంలో ఒకరిగా ఉండే అవకాశం యెహోవా ఇస్తాడు.—కీర్త. 15:1, 2.

14. ఇతరుల పట్ల మనం ప్రేమ ఎలా చూపించవచ్చు? (మత్తయి 9:36-38; రోమీయులు 12:10)

14 ఇతరుల పట్ల ప్రేమ చూపించండి. యెహోవాకున్న అతిప్రాముఖ్యమైన లక్షణం ప్రేమ. (1 యోహా. 4:8) తన గురించి మనకు తెలియకముందే ఆయన మనపట్ల ప్రేమ చూపించాడు. (1 యోహా. 4:9, 10) ఇతరుల పట్ల ప్రేమ చూపించినప్పుడు మనం ఆయన్ని అనుకరిస్తాం. (ఎఫె. 5:1) ప్రజల పట్ల ప్రేమ చూపించడానికి ఒక అత్యుత్తమ మార్గం ఏంటంటే, ఇంకా సమయం ఉండగానే వాళ్లు యెహోవా గురించి నేర్చుకునేలా సహాయం చేయడం. (మత్తయి 9:36-38 చదవండి.) అలా చేస్తే, దేవుని కుటుంబంలో ఒకరిగా ఉండాలంటే ఏం చేయాలో వాళ్లు తెలుసుకోగలుగుతారు. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం ఆయన పట్ల ప్రేమ, గౌరవం చూపిస్తూనే ఉండాలి. (1 యోహా. 4:20, 21) మనం దాన్ని ఎలా చేయవచ్చు? ఒక విధానం ఏంటంటే, ఆ సహోదరుని ఉద్దేశాలు మంచివని నమ్మడం. ఉదాహరణకు, ఆయన ఒక పని ఎందుకు చేశాడో మనకు అర్థంకానప్పుడు, ఆయన ఉద్దేశాన్ని తప్పుపట్టకుండా ఉంటాం. బదులుగా ఆ సహోదరుడు మనకన్నా గొప్పవాడని ఎంచుతూ ఆయన్ని ఘనపరుస్తాం.రోమీయులు 12:10 చదవండి; ఫిలి. 2:3.

15. మనం ఎవరి పట్ల కరుణ, దయ చూపించాలి?

15 అందరి పట్ల కరుణ, దయ చూపించండి. యెహోవా కుటుంబంలో ఒకరిగా మనం ఎప్పటికీ ఉండాలనుకుంటే, దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో పాటించాలి. ఉదాహరణకు, శత్రువులతోసహా మనం అందరి పట్ల కరుణ, దయ చూపించాలని యేసు బోధించాడు. (లూకా 6:32-36) కొన్నిసార్లు అలా చేయడం మనకు కష్టంగా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం యేసులా ఆలోచించడం, ప్రవర్తించడం నేర్చుకోవాలి. యెహోవాకు లోబడడానికి, యేసును అనుకరించడానికి మనం శాయశక్తులా కృషి చేసినప్పుడు తన కుటుంబంలో ఎప్పటికీ ఒకరిగా ఉండాలనుకుంటున్నామని మన పరలోక తండ్రికి చూపిస్తాం.

16. యెహోవా కుటుంబానికి ఉన్న గౌరవాన్ని మనమెలా కాపాడవచ్చు?

16 యెహోవా కుటుంబానికి ఉన్న గౌరవాన్ని కాపాడండి. ఒక కుటుంబంలో సాధారణంగా ఒక పిల్లవాడు తన అన్న ఏం చేస్తే, అదే చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ అన్న బైబిలు సూత్రాల్ని పాటిస్తే, తన తమ్ముడికి మంచి ఆదర్శంగా ఉంటాడు. ఒకవేళ అన్న ఏదైనా తప్పు చేస్తే, తన తమ్ముడు కూడా అలానే చేసే అవకాశం ఉంది. యెహోవా కుటుంబంలో కూడా అలాగే జరగవచ్చు. ఒకప్పుడు నమ్మకంగా ఉన్న క్రైస్తవుడు మతభ్రష్టుడిగా మారితే లేదా అనైతిక పనులు, చెడ్డ పనులు చేస్తే, ఇతరులు కూడా అతనిలా ప్రవర్తించే ప్రమాదం ఉంది. అలాంటివాళ్లు యెహోవా కుటుంబానికి ఉన్న గౌరవాన్ని పాడుచేస్తారు. (1 థెస్స. 4:3-8) కాబట్టి వాళ్లను అనుసరించకుండా మన ప్రేమగల పరలోక తండ్రితో మనకున్న సంబంధాన్ని కాపాడుకుందాం.

17. మనం ఎలా ఆలోచించకూడదు? ఎందుకు?

17 వస్తుసంపదలపై కాకుండా యెహోవాపై నమ్మకం ఉంచండి. మనం తన రాజ్యాన్ని మొదట వెదుకుతూ, తన నీతి ప్రమాణాలకు లోబడితే ఆహారాన్ని, బట్టల్ని, ఇంటిని ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు. (కీర్త. 55:22; మత్త. 6:33) ఆయన మాట మీద నమ్మకం ఉంచితే ఈ లోకంలోని వస్తుసంపదలు మనల్ని కాపాడతాయని, మనకు సంతోషాన్ని ఇస్తాయని ఆలోచించకుండా ఉంటాం. మనం యెహోవా ఇష్టాన్ని చేసినప్పుడు మాత్రమే నిజమైన శాంతిని అనుభవిస్తామని మనకు తెలుసు. (ఫిలి. 4:6, 7) మన దగ్గర ఎక్కువ వస్తువులు కొనుక్కునే స్థోమత ఉన్నా వాటిని వాడడానికి, అవి మంచి స్థితిలో ఉండేలా చూసుకోవడానికి సరిపడా సమయం, శక్తి మనకు ఉన్నాయో లేవో ఆలోచించుకోవాలి. మన దగ్గరున్న వస్తువుల్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా? తన ఆరాధకులుగా దేవుడు మనకు ఒక పని ఇచ్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పని నుండి మన అవధానం పక్కకు మళ్లకుండా చూసుకోవాలి. యేసు కాలంలోని యువకునిలా మనం అస్సలు ఉండకూడదు. ఆ యువకుడు తన దగ్గరున్న ఆస్తిపాస్తుల్ని ఎక్కువ ప్రేమించడం వల్ల యేసును అనుసరించకూడదని నిర్ణయించుకున్నాడు. దానివల్ల అతను యెహోవా సేవ చేసే అవకాశాన్ని, యెహోవా దత్తత కుమారుల్లో ఒకరిగా ఉండే అవకాశాన్ని కోల్పోయాడు!—మార్కు 10:17-22.

యెహోవా పిల్లలు ఎప్పటికీ దేన్ని అనుభవిస్తారు?

18. విధేయులైన మనుషులు ఏ గొప్ప గౌరవాన్ని, ఆశీర్వాదాల్ని ఎప్పటికీ అనుభవిస్తారు?

18 విధేయులైన మనుషులు యెహోవాను ఎప్పటికీ ప్రేమించే, ఆరాధించే గొప్ప గౌరవాన్ని పొందుతారు! మనుషులు జీవించడానికి కావాల్సిన వాటన్నిటితో ఈ భూమిని తయారుచేసి, దాన్ని వాళ్లకు ఒక ఇల్లుగా యెహోవా ఇచ్చాడు. భూనిరీక్షణ ఉన్నవాళ్లు ఈ అందమైన భూమిని చూసుకోవడంలో కూడా ఆనందిస్తారు. త్వరలో దేవుని రాజ్యం ఈ భూమిని, దానిలో ఉన్న ప్రతీదాన్ని తిరిగి అందంగా చేస్తుంది. దేవుని కుటుంబాన్ని విడిచివెళ్లాలని ఆదాముహవ్వలు తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చిన సమస్యలన్నిటినీ యేసు పరిష్కరిస్తాడు. యెహోవా లక్షలమందిని పునరుత్థానం చేసి, పరదైసుగా మారే ఈ భూమ్మీద పరిపూర్ణ ఆరోగ్యంతో శాశ్వతకాలం జీవించే అవకాశాన్ని వాళ్లకిస్తాడు. (లూకా 23:42, 43) యెహోవాను ఆరాధించే ప్రజలు పరిపూర్ణులైనప్పుడు, దావీదు రాసిన ‘మహిమ, వైభవాన్ని’ అందరూ పొందుతారు.—కీర్త. 8:5.

19. మనం వేటిని మన మనసులో, హృదయంలో ఉంచుకోవాలి?

19 మీరు ‘గొప్ప సమూహానికి’ చెందినవాళ్లైతే మీకు ఒక అద్భుతమైన నిరీక్షణ ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు ఆయన కుటుంబంలో ఒకరిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన్ని సంతోషపెట్టడానికి చేయగలిగినదంతా చేయండి. దేవుని వాగ్దానాల్ని ప్రతిరోజూ మీ మనసులో, హృదయంలో ఉంచుకుంటూ జీవించండి. మన ప్రియ పరలోకపు తండ్రిని ఆరాధించే గొప్ప అవకాశాన్ని విలువైనదిగా ఎంచుతూ, ఆయనను ఎల్లప్పుడూ స్తుతించే నిరీక్షణ బట్టి సంతోషించండి!

పాట 107 దేవునిలా ప్రేమ చూపిద్దాం

^ పేరా 5 ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఏం చేయాలో తెలిసుండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. తండ్రి కుటుంబాన్ని ప్రేమగా నడిపిస్తాడు, తల్లి ఆయనకు మద్దతిస్తుంది, పిల్లలు వాళ్లకు లోబడతారు. యెహోవా కుటుంబం విషయం కూడా అంతే. దేవునికి మన పట్ల ఒక సంకల్పం ఉంది. మనం ఆయన సంకల్పానికి తగ్గట్టు జీవిస్తే, ఎప్పటికీ ఆయన కుటుంబంలో భాగంగా ఉంటాం.

^ పేరా 55 చిత్రాల వివరణ: దేవుని స్వరూపంలో చేయబడడం వల్ల ఒక జంట ఒకరిపట్ల ఒకరు, అలాగే తమ పిల్లల పట్ల ప్రేమ, కనికరం చూపిస్తున్నారు. ఆ జంట యెహోవాను ప్రేమిస్తున్నారు. ఆయన తమకిచ్చిన బహుమానాన్ని విలువైనదిగా ఎంచుతున్నారు కాబట్టే వాళ్ల పిల్లలకు యెహోవాను ప్రేమించడం, ఆరాధించడం నేర్పిస్తున్నారు. వాళ్లు ఒక వీడియోను చూపిస్తూ, యెహోవా విమోచన క్రయధనంగా యేసును ఎందుకిచ్చాడో వివరిస్తున్నారు. రాబోయే పరదైసులో ఈ భూమిని, జంతువుల్ని ఎప్పటికీ చక్కగా చూసుకుంటామని కూడా వాళ్లు బోధిస్తున్నారు.