కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 32

సృష్టికర్త మీద మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి

సృష్టికర్త మీద మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి

“మనం నమ్మేవి కంటికి కనిపించకపోయినా అవి నిజంగా ఉన్నాయనడానికి రుజువే విశ్వాసం.”—హెబ్రీ. 11:1.

పాట 11 సృష్టి దేవుణ్ణి స్తుతిస్తోంది

ఈ ఆర్టికల్‌లో . . . *

1. మన సృష్టికర్త గురించి మీరేం నేర్చుకున్నారు?

ఒకవేళ మీరు యెహోవాసాక్షుల కుటుంబంలో పెరిగితే, బహుశా చిన్నప్పటినుండే యెహోవా గురించి నేర్చుకున్నారు. ఆయనే సృష్టికర్త అని, ఆయనకు అద్భుతమైన లక్షణాలు ఉన్నాయని, మనుషులు విషయంలో ఆయనకు ఒక ప్రేమగల సంకల్పం ఉందని మీరు నేర్చుకొని ఉంటారు.—ఆది. 1:1; అపొ. 17:24-27.

2. సృష్టికర్త ఉన్నాడని నమ్మేవాళ్ల గురించి కొంతమంది ఏమనుకుంటారు?

2 దేవుడు ఉన్నాడని, ఆయనే అన్నిటినీ సృష్టించాడని చాలామంది నమ్మరు. బదులుగా జీవం దానంతటదే ఉనికిలోకి వచ్చిందని, ఆ తర్వాత ప్రాణులు పరిణామం చెందాయని వాళ్లు నమ్ముతారు. అలా నమ్మేవాళ్లలో కొంతమంది బాగా చదువుకున్నవాళ్లు ఉన్నారు. సైన్స్‌ ప్రకారం బైబిలు చెప్పేది తప్పనీ అలాగే చదువుకోనివాళ్లు, తెలివితక్కువవాళ్లు, అమాయకులే సృష్టికర్త మీద విశ్వాసం ఉంచుతారనీ వాళ్లంటారు.

3. మన విశ్వాసాన్ని బలపర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

3 బాగా చదువుకున్న కొంతమంది చెప్పే మాటల్ని విన్నప్పుడు, యెహోవాయే మన ప్రేమగల సృష్టికర్త అనే విషయంలో మనం సందేహపడతామా? ఈ ప్రశ్నకు జవాబు, యెహోవాయే సృష్టికర్తని మనం అసలు ఎందుకు నమ్ముతున్నామనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఇతరులు చెప్పారని మనమలా నమ్ముతున్నామా లేదా మనకై మనం సమయం తీసుకొని, రుజువుల్ని పరిశీలించి దాన్ని నమ్ముతున్నామా? (1 కొరిం. 3:12-15) మనం చాలాకాలంగా ఒక యెహోవాసాక్షిగా ఉన్నప్పటికీ, మనందరం మన విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉండాలి. అలా చేస్తే బైబిలు తప్పని చెప్పే మనుషుల ‘తత్వజ్ఞానం, మోసపూరితమైన వట్టి మాటలు’ వల్ల మోసపోం. (కొలొ. 2:8; హెబ్రీ. 11:6) ఈ ఆర్టికల్‌లో మనకు సహాయం చేసే మూడు విషయాల్ని చర్చిస్తాం: (1) సృష్టికర్త ఉన్నాడని చాలామంది ఎందుకు నమ్మరు? (2) మీ సృష్టికర్త అయిన యెహోవా మీద మీ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవచ్చు? (3) ఆ విశ్వాసాన్ని మీరెలా బలపర్చుకోవచ్చు?

సృష్టికర్త ఉన్నాడని చాలామంది ఎందుకు నమ్మరు?

4. హెబ్రీయులు 11:1 అలాగే అధస్సూచి ప్రకారం, విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది?

4 రుజువులు లేకపోయినా దేన్నైనా నమ్మడాన్ని విశ్వాసమని కొంతమంది అనుకుంటారు. కానీ విశ్వాసం అనేది రుజువుల మీద ఆధారపడి ఉందని బైబిలు వివరిస్తుంది. (హెబ్రీయులు 11:1 అలాగే అధస్సూచి చదవండి.) కాబట్టి మన కంటికి కనిపించని యెహోవా, యేసుక్రీస్తు నిజంగా ఉన్నారనడానికి, పరలోక రాజ్యం నిజంగా ఉందనడానికి ఒప్పింపజేసే రుజువు మనకు ఉంది. (హెబ్రీ. 11:3) యెహోవాసాక్షిగా మారిన ఒక సైంటిస్ట్‌ ఇలా చెప్తున్నాడు: “మా విశ్వాసం గుడ్డిది కాదు. మేము సైన్స్‌కి సంబంధించిన వాస్తవాల్ని పక్కనపెట్టం.”

5. అన్నిటినీ దేవుడు సృష్టించలేదని చాలామంది ఎందుకు అనుకుంటారు?

5 ‘సృష్టికర్త ఉన్నాడనడానికి నమ్మదగిన రుజువులు ఉన్నప్పటికీ, అన్నిటినీ దేవుడే సృష్టించాడని చాలామంది ఎందుకు నమ్మరు?’ వాళ్లలో కొంతమంది ఎప్పుడూ ఆ రుజువుల్ని పరిశీలించలేదు కాబట్టి దాన్ని నమ్మరు. ఇప్పుడొక యెహోవాసాక్షిగా ఉన్న రాబర్ట్‌ ఇలా చెప్తున్నాడు: ‘సృష్టి తయారు చేయబడిందని మాకు స్కూల్లో ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి అన్నిటినీ సృష్టించింది దేవుడు కాదని అనుకున్నాను. కానీ నాకు 22 ఏళ్లు వచ్చినప్పుడు యెహోవాసాక్షుల్ని కలిశాక, అన్నిటినీ దేవుడే సృష్టించాడు అనడానికి నమ్మదగిన కారణాలు బైబిల్లో ఉన్నాయని నేర్చుకున్నాను.’ *—“ తల్లిదండ్రులారా, మీకొక ప్రాముఖ్యమైన విషయం” అనే బాక్సు చూడండి.

6. సృష్టికర్త లేడని కొంతమంది ఎందుకు నమ్ముతారు?

6 కొంతమంది తమకు కనిపించేవాటినే నమ్ముతామని చెప్తారు, అందుకే వాళ్లు సృష్టికర్తను నమ్మరు. ఉదాహరణకు, వాళ్లు కనిపించని గాలిని నమ్ముతారు. ఎందుకంటే అది ఉందనడానికి వాళ్లకు రుజువుంది. బైబిల్లో చెప్పబడిన విశ్వాసం కూడా, మనకు కనబడనివి నిజంగా ఉన్నాయని తెలియజేసే రుజువుల మీద ఆధారపడి ఉంది. (హెబ్రీ. 11:1) ఆ రుజువుల గురించి లోతుగా తెలుసుకోవడానికి సమయం, కృషి అవసరం. కానీ చాలామంది అలా తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఒక వ్యక్తి స్వయంగా ఆ రుజువుల గురించి లోతుగా తెలుసుకోకపోతే, దేవుడు లేడనే ముగింపుకు వచ్చే అవకాశం ఉంది.

7. విశ్వాన్ని దేవుడే సృష్టించాడని చదువుకున్నవాళ్లు అందరూ ఒప్పుకోరా? వివరించండి.

7 కొంతమంది సైంటిస్ట్‌లు ఆ రుజువు గురించి లోతుగా తెలుసుకున్నాక విశ్వాన్ని దేవుడే సృష్టించాడని ఒప్పుకున్నారు. * పైన ప్రస్తావించబడిన రాబర్ట్‌లాగే కొంతమంది సృష్టికర్త లేడని అనుకున్నారు. ఎందుకంటే, వాళ్లకు కాలేజీలో ఎప్పుడూ సృష్టి గురించి నేర్పించలేదు. కానీ చాలామంది సైంటిస్ట్‌లు యెహోవా గురించి తెలుసుకొని ఆయన్ని ప్రేమిస్తున్నారు. మనం ఎంత చదువుకున్నా, ఆ సైంటిస్ట్‌ల లాగే అందరం దేవుని మీద విశ్వాసాన్ని బలపర్చుకోవాలి. మన తరఫున ఆ పని ఇంకెవ్వరూ చేయలేరు.

సృష్టికర్త మీద మీ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవచ్చు?

8-9. (ఎ) మనం ఏ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటాం? (బి) సృష్టి గురించి లోతుగా తెలుసుకోవడం వల్ల మీరెలా ప్రయోజనం పొందుతారు?

8 సృష్టికర్త మీద మీ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవచ్చు? మనం చేయాల్సిన నాలుగు పనుల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

9 సృష్టి గురించి లోతుగా తెలుసుకోండి. జంతువుల్ని, మొక్కల్ని, నక్షత్రాల్ని జాగ్రత్తగా చూడడం ద్వారా సృష్టికర్త మీద మీ విశ్వాసాన్ని పెంచుకోవచ్చు. (కీర్త. 19:1; యెష. 40:26) వాటి గురించి మీరు ఎంత లోతుగా తెలుసుకుంటే, యెహోవాయే సృష్టికర్తని అంత ఎక్కువగా మీకు నమ్మకం కలుగుతుంది. మన ప్రచురణల్లో సృష్టి గురించి వివరించే ఆర్టికల్స్‌ తరచూ వస్తుంటాయి. అవి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా, వాటిని చదవకుండా వదిలేయకండి. మీరు నేర్చుకోగలిగినంత నేర్చుకోండి. అలాగే ఈ మధ్యకాలంలో మన ప్రాదేశిక సమావేశాల్లో, సృష్టి గురించి చూపించిన అద్భుతమైన వీడియోలను మన వెబ్‌సైట్‌లో మళ్లీ చూడడం మర్చిపోకండి.

10. సృష్టికర్త ఉన్నాడని సృష్టి ఎలా నిరూపిస్తుందో ఒక ఉదాహరణ చెప్పండి. (రోమీయులు 1:20)

10 మీరు సృష్టి గురించి లోతుగా తెలుసుకుంటున్నప్పుడు, సృష్టికర్త గురించి ఏం నేర్చుకోవచ్చో జాగ్రత్తగా గమనించండి. (రోమీయులు 1:20 చదవండి.) ఉదాహరణకు భూమ్మీద జీవించడానికి అవసరమయ్యే వేడిని, వెలుగును సూర్యుడు ఉత్పత్తి చేస్తాడు. అయితే దాంతోపాటు సూర్యుని నుండి వచ్చే కొన్ని కిరణాల వల్ల మనకు హాని జరగవచ్చు. కానీ అలా జరగట్లేదు. ఎందుకు? మన భూమి చుట్టూ ఓజోన్‌ పొర ఉంటుంది. అది హానికరమైన కిరణాల నుండి మనల్ని కాపాడుతుంది. సూర్యుని నుండి ఆ కిరణాలు ఎంత ఎక్కువగా వస్తే, అవి భూమికి చేరకుండా ఓజోన్‌ పొర అంత ఎక్కువగా అడ్డుకుంటుంది. దీనంతటి వెనుక ఖచ్చితంగా ఎవరో ఉన్నారని, ఆయన ప్రేమగల తెలివిగల సృష్టికర్త అయ్యుంటాడని మీరు ఒప్పుకోరా?

11. సృష్టికి సంబంధించి మీ విశ్వాసాన్ని బలపర్చే వాస్తవాల్ని ఎక్కడ చూడవచ్చు? (“ విశ్వాసాన్ని బలపర్చే కొంత సమాచారం” అనే బాక్స్‌ చూడండి.)

11 సృష్టికి సంబంధించి మీ విశ్వాసాన్ని బలపర్చే ఎన్నో వాస్తవాల్ని యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకంలో, అలాగే jw.org వెబ్‌సైట్‌లో చూడవచ్చు. “సృష్టిలో అద్భుతాలు” అనే సెక్షన్‌ కిందున్న ఆర్టికల్స్‌ని చదవడం ద్వారా, వీడియోలను చూడడం ద్వారా మీ పరిశోధన మొదలుపెట్టవచ్చు. ఈ ఆర్టికల్స్‌ చిన్నగా ఉంటాయి అలాగే జంతువుల గురించి, సృష్టిలోని ఇతర వాటిగురించి కొన్ని అద్భుతమైన వాస్తవాల్ని తెలియజేస్తాయి. అంతేకాదు సృష్టిని చూసి సైంటిస్ట్‌లు కొన్నిటిని తయారుచేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో తెలియజేసే ఉదాహరణలు కూడా వాటిలో చూస్తాం.

12. బైబిల్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఏమిటి?

12 బైబిల్ని అధ్యయనం చేయండి. నాల్గో పేరాలో ప్రస్తావించబడిన సైంటిస్ట్‌, అన్నిటినీ సృష్టికర్తే చేశాడని మొదట్లో నమ్మేవాడు కాదు. సమయం గడిచేకొద్దీ సృష్టికర్త ఉన్నాడని అతనికి నమ్మకం కుదిరింది. అతనిలా చెప్తున్నాడు: “నేను సైన్స్‌ ద్వారా నేర్చుకున్న విషయాల్ని బట్టే కాకుండా బైబిల్ని జాగ్రత్తగా అధ్యయనం చేయడం వల్ల కూడా నాకు విశ్వాసం కలిగింది.” బహుశా మీకిప్పటికే బైబిలు గురించి బాగా తెలిసుంటుంది. అయినా సృష్టికర్త మీద మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూనే ఉండాలి. (యెహో. 1:8; కీర్త. 119:97) ఉదాహరణకు, ఎంతోకాలం క్రితం జరిగిన సంఘటనల్ని బైబిలు ఎంత ఖచ్చితంగా వివరిస్తుందో ఆలోచించండి. బైబిలు ప్రవచనాలు నెరవేరడం గురించి, బైబిలు రచయితలు రాసిన విషయాలు ఒకదానితో ఒకటి పొందికగా ఉండడం గురించి కూడా ఆలోచించండి. అలా చేయడం వల్ల ఒక ప్రేమగల, తెలివిగల సృష్టికర్త మనల్ని తయారుచేశాడని, ఆయనే బైబిల్ని రాయించాడని మన విశ్వాసం బలపడుతుంది. *2 తిమో. 3:14; 2 పేతు. 1:21.

13. దేవుని వాక్యంలో తెలివి ఉందనడానికి ఒక ఉదాహరణ చెప్పండి.

13 దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు అందులోని సలహాలు ఎంత సహాయకరంగా ఉంటాయో గమనించండి. ఉదాహరణకు, డబ్బు మీద మోజువల్ల హాని కలుగుతుందని, అది ‘ఎన్నో బాధలకు’ కారణమని చాలాకాలం ముందే బైబిలు హెచ్చరించింది. (1 తిమో. 6:9, 10; సామె. 28:20; మత్త. 6:24) ఆ హెచ్చరిక ఈ రోజుకు కూడా వర్తిస్తుందా? మనకాలంలోని ప్రజల మనస్తత్వాల గురించి వివరించే ఒక పుస్తకం ఇలా చెప్తుంది: “చాలా సందర్భాల్లో, తమ జీవితంలో డబ్బే అన్నిటికన్నా ముఖ్యం అనుకునేవాళ్లు తక్కువ సంతోషంగా, ఎక్కువ నిరాశగా ఉంటారు. ఎక్కువ డబ్బును కోరుకునేవాళ్లు కూడా అంత ఆనందంగా, ఆరోగ్యంగా ఉండరు.” కాబట్టి డబ్బు మీద మోజు పెంచుకోవద్దని బైబిలు ఇస్తున్న హెచ్చరిక నిజంగా చాలా మంచిది. మీకు సహాయం చేసిన ఇంకొన్ని బైబిలు సలహాల గురించి ఆలోచించగలరా? బైబిలు ఇచ్చే మంచి సలహాలన్నిటి గురించి ఆలోచించినప్పుడు, మనకేది మంచిదో మన ప్రేమగల సృష్టికర్తకు తెలుసని అర్థంచేసుకుంటాం. అలాగే ఎల్లప్పుడూ సలహా కోసం ఆయన మీద ఆధారపడతాం. (యాకో. 1:5) ఫలితంగా మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.—యెష. 48:17, 18.

14. బైబిల్ని అధ్యయనం చేయడం వల్ల యెహోవా గురించి ఏం నేర్చుకుంటాం?

14 యెహోవా గురించి ఇంకా బాగా తెలుసుకోవాలనే లక్ష్యంతో బైబిల్ని అధ్యయనం చేయండి. (యోహా. 17:3) మీరు లేఖనాల్ని అధ్యయనం చేస్తుండగా యెహోవా వ్యక్తిత్వం గురించి, ఆయన లక్షణాల గురించి నేర్చుకుంటారు. ఇవే లక్షణాల్ని మీరు సృష్టి గురించి లోతుగా తెలుసుకుంటున్నప్పుడు నేర్చుకున్నారు. అలా నేర్చుకోవడం వల్ల యెహోవా నిజంగా ఉనికిలో ఉన్నాడని మీకు నమ్మకం కుదురుతుంది. (నిర్గ. 34:6, 7; కీర్త. 145:8, 9) మీరు యెహోవా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునేకొద్దీ ఆయనమీద మీ విశ్వాసం, ప్రేమ పెరుగుతాయి. ఆయనతో మీకున్న స్నేహం బలపడుతుంది.

15. దేవునిపై మీకున్న విశ్వాసం గురించి ఇతరులతో మాట్లాడడం వల్ల మీరెలా ప్రయోజనం పొందుతారు?

15 దేవునిపై మీ విశ్వాసం గురించి ఇతరులకు చెప్పండి. అలా చెప్పినప్పుడు మీ విశ్వాసం బలపడుతుంది. మీరు ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా దేవుని ఉనికిని ప్రశ్నిస్తే, దానికి ఎలా జవాబివ్వాలో మీకు తెలియకపోతే అప్పుడేంటి? వాళ్లు అడిగిన ప్రశ్నకు మన ప్రచురణల్లో జవాబును వెతికి దాన్ని వాళ్లతో చర్చించండి. (1 పేతు. 3:15) ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి మీకు సహాయం చేయమని సంఘంలో అనుభవం ఉన్న ఎవరినైనా అడగవచ్చు. బైబిలు నుండి మీరిచ్చిన జవాబు ఇంటివ్యక్తి అంగీకరించినా, అంగీకరించకపోయినా పరిశోధన చేయడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు అలాగే మీ విశ్వాసం పెరుగుతుంది. దానివల్ల సృష్టికర్త లేడని చెప్పే లోకంలోని తెలివిగలవాళ్ల లేదా బాగా చదువుకున్నవాళ్ల మాటలు నమ్మం.

మీ విశ్వాసాన్ని బలంగా ఉంచుకోండి

16. ఒకవేళ మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోకపోతే ఏం జరగొచ్చు?

16 మనం యెహోవాను ఎంతకాలంగా సేవిస్తున్నప్పటికీ, ఆయన మీద మనకున్న విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాలి. ఎందుకంటే, మనం జాగ్రత్తగా లేకపోతే మన విశ్వాసం బలహీనపడవచ్చు. మనం ముందు చూసినట్లు కంటికి కనిపించనివి నిజంగా ఉన్నాయనడానికి రుజువే విశ్వాసం. మన కంటితో చూడలేనివాటిని బహుశా త్వరగా మర్చిపోతాం. అందుకే పౌలు విశ్వాసం లేకపోవడాన్ని, ‘సులభంగా చిక్కుల్లో పడేసే పాపం’ లాంటిదని అన్నాడు. (హెబ్రీ. 12:1) మరైతే మన విశ్వాసం బలంగా ఉండేలా ఎలా చూసుకోవచ్చు?—2 థెస్స. 1:3.

17. మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఏది సహాయపడగలదు?

17 మొదటిగా పవిత్రశక్తి కోసం యెహోవాను వేడుకోండి, అలా తరచూ అడగండి. ఎందుకంటే పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో విశ్వాసం ఒకటి. (గల. 5:22, 23) పవిత్రశక్తి సహాయం లేకుండా మన సృష్టికర్త మీద విశ్వాసాన్ని పెంచుకోలేం. మనం పవిత్రశక్తి కోసం యెహోవాను అడుగుతూ ఉంటే, ఆయన దాన్ని మనకిస్తాడు. (లూకా 11:13) ప్రార్థనలో “ఇంకా బలమైన విశ్వాసం కలిగివుండేలా మాకు సాయం చేయి” అని కూడా మనం అడగొచ్చు.—లూకా 17:5.

18. కీర్తన 1:2, 3 ప్రకారం, మన దగ్గర ఏ అమూల్యమైన బహుమతి ఉంది?

18 రెండోదిగా, దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేయండి. (కీర్తన 1:2, 3 చదవండి.) ఈ కీర్తన రాసే సమయానికి రాజు, యాజకులతో సహా ఇశ్రాయేలీయుల్లో కొద్దిమంది దగ్గరే దేవుని ధర్మశాస్త్రం పూర్తి రాతప్రతి ఉంది. అయితే ఏడు సంవత్సరాలకు ఒకసారి ఇశ్రాయేలీయుల్లోని “పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని” అలాగే పరదేశుల్ని సమావేశపర్చి దేవుని ధర్మశాస్త్రం చదివి, వినిపించేవాళ్లు. (ద్వితీ. 31:10-12) యేసు కాలంలో లేఖన ప్రతులు కేవలం కొద్దిమంది దగ్గరే ఉండేవి, చాలా ప్రతులు సమాజమందిరాల్లో ఉండేవి. కానీ ఈ రోజుల్లో పూర్తి బైబిలు లేదా కొంతభాగం చాలామంది దగ్గర ఉంది. అది నిజంగా ఒక అమూల్యమైన బహుమతి. దానిపట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?

19. మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి?

19 బైబిల్ని క్రమంగా చదవడం ద్వారా ఆ బహుమతి పట్ల మనకు కృతజ్ఞత ఉందని చూపించవచ్చు. సమయం ఉన్నప్పుడు బైబిలు చదువుదాంలే అని మనం అనుకోకుండా దాన్ని చదివి, అధ్యయనం చేయడానికి ఒక పట్టిక వేసుకోవాలి. దాన్ని పాటిస్తూ, క్రమంగా అధ్యయనం చేసినప్పుడే మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోగల్గుతాం.

20. మనం ఏం చేయాలని తీర్మానించుకుందాం?

20 లోకంలోని ‘తెలివిగలవాళ్లలా, మేధావుల్లా’ కాకుండా దేవుని వాక్యంపై ఆధారపడిన విశ్వాసం మనకుంది. (మత్త. 11:25, 26) భూమ్మీద పరిస్థితులు ఎందుకు ఘోరంగా తయారౌతున్నాయో, వాటి విషయంలో యెహోవా ఏం చేయబోతున్నాడో బైబిలు మనకు వివరిస్తుంది. కాబట్టి మన విశ్వాసాన్ని బలపర్చుకోవాలని, సృష్టికర్త మీద విశ్వాసం ఉంచేలా సాధ్యమైనంత ఎక్కువమందికి సహాయం చేయాలని తీర్మానించుకుందాం. (1 తిమోతి 2:3, 4) భూమ్మీద జీవించే వాళ్లందరూ యెహోవాను స్తుతిస్తూ ప్రకటన 4:11 లో ఉన్నట్టు, ‘యెహోవా మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు; కాబట్టి మహిమ పొందడానికి నువ్వు అర్హుడవు’ అనే సమయం కోసం మనం ఎదురుచూద్దాం.

పాట 2 యెహోవా నీ పేరు

^ పేరా 5 యెహోవాయే సృష్టికర్త అని బైబిలు స్పష్టంగా బోధిస్తోంది. కానీ చాలామంది దాన్ని నమ్మరు. జీవం దానంతటదే ఉనికిలోకి వచ్చిందని వాళ్లు నమ్ముతారు. వాళ్ల మాటలవల్ల యెహోవా సృష్టికర్త కాదేమో అనే సందేహం మనకు రాకూడదంటే దేవుని మీద, బైబిలు మీద మనకున్న విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి కృషి చేయాలి. అదెలా చేయవచ్చో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.

^ పేరా 5 అన్నిటినీ బహుశా దేవుడే సృష్టించి ఉంటాడని చాలా స్కూళ్లలో టీచర్లు కనీసం చెప్పనుకూడా చెప్పరు. ఒకవేళ అలా చెప్తే దేవుణ్ణి నమ్మమని విద్యార్థుల్ని బలవంతం పెట్టినట్టు అవుతుందని వాళ్లు అనుకుంటారు.

^ పేరా 7 బాగా చదువుకున్న కొంతమంది ఏం చెప్తున్నారో తెలుసుకోవడానికి యెహోవాసాక్షుల పరిశోధన పుస్తకం చూడండి. “సైన్స్‌, టెక్నాలజీ” అనే దాని కింద “‘ఇంటర్వ్యూ’ (తేజరిల్లు! ఆర్టికల్స్‌).” చూడండి.

^ పేరా 12 ఉదాహరణకు, కావలికోట నం. 1 2020 సార్వజనిక పత్రికలోని “బైబిలు—సత్యం దొరికే నమ్మదగిన పుస్తకం” అనే ఆర్టికల్‌ చూడండి.