జీవిత భాగస్వామి అశ్లీల చిత్రాలు చూస్తే ఏం చేయవచ్చు?
-
“నా భర్త పదేపదే వ్యభిచారం చేసినట్టు అనిపించింది.”
-
“నాకు అవమానంగా, నేను చూడ్డానికి అస్సలు బాలేనని, ఎందుకూ పనికిరానిదాన్నని అనిపించింది.”
-
“దీనిగురించి నేను ఎవ్వరికీ చెప్పుకోలేక కుమిలిపోయాను, ఒంటరితనానికి చేరువయ్యాను.”
-
“యెహోవా నన్ను వదిలేశాడు అనిపించింది.”
భర్త అశ్లీల చిత్రాలు చూస్తే భార్య ఎంత కుమిలిపోతుందో పైన ఉన్న మాటల్నిబట్టి తెలుస్తుంది. బహుశా భర్త నెలలపాటు లేదా సంవత్సరాలపాటు రహస్యంగా అశ్లీల చిత్రాలు చూస్తుంటే, ఇక ఆయన్ని ఏమాత్రం నమ్మకూడదని భార్యకు అనిపించవచ్చు. ఒకామె ఇలా అంటుంది: “నా భర్త ఓ పరాయి వ్యక్తిలా అనిపించాడు. ఇదే కాకుండా నా నుండి ఇంకా ఏమైనా దాస్తున్నాడా? అని అనిపించేది.”
అశ్లీల చిత్రాల్ని చూసే ఒక భర్త ఉన్న భార్య కోసం ఈ ఆర్టికల్‌ని తయారుచేశారు. a ఇందులో యెహోవా ఆమెను ప్రేమిస్తున్నాడని, ఆమెకు సహాయం చేయాలనుకుంటున్నాడని అభయమిచ్చే, ఓదార్పునిచ్చే బైబిలు సూత్రాలు ఉన్నాయి. అంతేకాదు ఆమె మనశ్శాంతితో ఉండడానికి, యెహోవాకు దగ్గరవ్వడానికి కూడా అవి సహాయం చేస్తాయి. b
భార్యగా మీరేం చేయవచ్చు?
మీరు మీ భర్త చేసే పనులన్నిటి మీద ఒక కన్నేసి ఉంచలేరు గానీ, మీ మనశ్శాంతిని కాపాడుకోవడానికి కొన్ని పనులు చేయవచ్చు. అవేంటో చూడండి.
మిమ్మల్ని మీరు నిందించుకోకండి. భర్త అశ్లీల చిత్రాలు చూస్తున్నాడంటే, బహుశా భార్యగా తనలోనే ఏదో లోపం ఉందని ఆమె అనుకోవచ్చు. ఆలిస్ c ఇలా ఆలోచించేది: ‘నా భర్త నన్ను కాకుండా వేరే స్త్రీలను ఎందుకు చూడాలనుకుంటున్నాడు?’ బహుశా తనలో ఏదో లోపం ఉందని, తన భర్తకు తను అందంగా కనిపించట్లేదని ఆమెకు అనిపించేది. కొంతమంది భార్యలు తమ వల్లే కాపురం చెడిపోతుందని తమను తాము నిందించుకుంటారు. డాన్యెల ఇలా అంటుంది: “నా భర్త అశ్లీల చిత్రాలు చూసినప్పుడల్లా, నా కోపం కట్టలు తెంచుకునేది. దాంతో నేనే చేతులారా పరిస్థితిని ఘోరంగా మారుస్తున్నాను అనిపించింది.”
మీకు కూడా వాళ్లలాగే అనిపిస్తే, మీ భర్త చేసే పనులకు యెహోవా మిమ్మల్ని బాధ్యురాలిగా చేయడని గుర్తుంచుకోండి. యాకోబు 1:14 ఇలా చెప్తుంది: “ఒక వ్యక్తి కోరికే అతన్ని లాక్కెళ్లి, వలలో పడేసి అతన్ని పరీక్షకు గురిచేస్తుంది.” (రోమా. 14:12; ఫిలి. 2:12) కాబట్టి యెహోవా మిమ్మల్ని నిందించే బదులు, తనకు యథార్థంగా ఉన్నందుకు మిమ్మల్ని అమూల్యంగా చూస్తాడు.—2 దిన. 16:9.
భర్త అశ్లీల చిత్రాలు చూస్తే, తనలోనే ఏదో లోపం ఉందని భార్యకు అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. అశ్లీల చిత్రాలు చూసే వ్యక్తిలో లైంగిక కోరికలు ఎంతగా రగిలిపోతాయంటే, వాళ్ల కోరికల్ని ఏ స్త్రీ తీర్చలేదని నిపుణులు చెప్తున్నారు.
అతిగా చింతించకండి. క్యాథరీన్ ఏమంటుందంటే, ‘నా భర్త అశ్లీల చిత్రాలు చూస్తున్నాడేంటి అనే ఆలోచనతోనే నా జీవితమంతా అయిపోయింది.’ ఫ్రాన్సిస్కా ఇలా అంటుంది: “నా భర్త ఎక్కడ ఉన్నాడో తెలీనప్పుడు నా కాళ్లుచేతులాడవు. ఇక రోజంతా నేను ఆ కంగారులోనే ఉంటాను.” తమ భర్తల సమస్య గురించి తెలిసిన బ్రదర్స్, సిస్టర్స్ కనబడితే తల కొట్టేసినట్టుగా అనిపిస్తుందని కొంతమంది భార్యలు చెప్తున్నారు. ఇంకొంతమంది భార్యలేమో, తమ పరిస్థితిని ఎవ్వరూ అర్థంచేసుకోలేరని, ఒంటరితనంతో నలిగిపోతున్నామని అంటున్నారు.
అలా అనిపించడం సహజమే. కానీ మీరు వాటిగురించి అదే పనిగా ఆలోచిస్తూ కూర్చుంటే మీలో కంగారు ఇంకా పెరగవచ్చు. దానికి బదులు, యెహోవాతో మీకున్న బంధం మీద మనసుపెట్టండి. అప్పుడు సహించడానికి కావాల్సిన బలం పుంజుకుంటారు.—కీర్త. 62:2; ఎఫె. 6:10.
బాధతో తల్లడిల్లిపోయినప్పుడు ఓదార్పు కోసం యెహోవా వైపుకు తిరిగిన స్త్రీల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. వాటిని చదివి, ధ్యానించడం మీకు ఓదార్పుగా ఉండొచ్చు. యెహోవా వాళ్లకున్న సమస్యను తీసేయలేదు గానీ, వాళ్లకు కావాల్సిన ప్రశాంతతను ఇచ్చాడు. ఉదాహరణకు హన్నా గురించి ఆలోచించండి. ఆమె తన పరిస్థితినిబట్టి “ఎంతో దుఃఖంతో ఉంది.” కానీ “చాలాసేపు యెహోవా ఎదుట” ప్రార్థించిన తర్వాత తన పరిస్థితి చక్కబడుతుందో లేదో తెలీకపోయినా ఆమె ప్రశాంతతను పొందింది.—1 సమూ. 1:10, 12, 18; 2 కొరిం. 1:3, 4.
సంఘపెద్దల సహాయం అడగండి. వాళ్లు “గాలికి చాటైన ఆశ్రయంలా, తుఫాను నుండి దాక్కునే ఆశ్రయంలా” ఉంటారు. (యెష. 32:2, అధస్సూచీలు.) అంతేకాదు, మీరు మనసువిప్పి మాట్లాడుతుంటే శ్రద్ధగా విని, మీకు ఓదార్పునిచ్చే ఒక సిస్టర్‌తో మాట్లాడమని కూడా వాళ్లు చెప్పవచ్చు.—సామె. 17:17.
మీరు మీ భర్తకు సహాయం చేయగలరా?
మీ భర్త అశ్లీల చిత్రాలు చూడడానికి బానిసైతే, దాన్నుండి బయటపడడానికి మీరు ఆయనకు సహాయం చేయగలరా? చేయగలరేమో చూడండి. ఏదైనా ఒక సమస్యను పరిష్కరించడానికి లేదా బలమైన ఒక శత్రువుతో పోరాడడానికి “ఒక్కరి కన్నా ఇద్దరు ఉండడం మంచిది” అని బైబిలు చెప్తుంది. (ప్రసం. 4:9-12) ఆ చెడు అలవాటు నుండి బయటపడడానికి, మీ వివాహబంధాన్ని పటిష్ఠం చేసుకోవడానికి భార్యాభర్తలిద్దరూ కలిసి పనిచేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని నిపుణులు కూడా చెప్తున్నారు.
నిజానికి అంతా మీ భర్త చేతుల్లోనే ఉంది. అశ్లీల చిత్రాలు చూడొద్దని గట్టిగా నిర్ణయించుకుని, దానికి తగ్గట్టు పనులు చేయడం మీదే ఆధారపడివుంది. ఆయన శక్తి కోసం యెహోవాను వేడుకున్నాడా? సహాయం కోసం పెద్దల్ని అడిగాడా? (2 కొరిం. 4:7; యాకో. 5:14, 15) ఆ చెడు అలవాటును మానుకోవడానికి ఆయన ఏమేం చేస్తున్నాడు? ఉదాహరణకు ఫోన్‌ని, ట్యాబ్‌ని, కంప్యూటర్ని తక్కువగా వాడుతున్నాడా? అశ్లీల చిత్రాలు చూడడానికి దారితీసే పరిస్థితులకు దూరంగా ఉంటున్నాడా? (సామె. 27:12) మీ సహాయం తీసుకోవడానికి, మీతో అన్నీ నిజాయితీగా చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నాడా? అలాగైతే, మీరు ఆయనకు సహాయం చేయవచ్చు.
ఎలా? ఫెలిసియా ఉదాహరణను గమనించండి. ఆమె భర్త ఈతన్ చిన్నవయసు నుండే అశ్లీల చిత్రాలు చూడడానికి బానిసయ్యాడు. ఆయనకు చూడాలని అనిపించినప్పుడల్లా, తనతో మనసువిప్పి మాట్లాడేలా ఫెలిసియా సహాయం చేసేది. ఈతన్ ఇలా అంటున్నాడు: “నేను నా భార్యతో మనసువిప్పి, నిజాయితీగా అన్నీ చెప్పేవాణ్ణి. అశ్లీల చిత్రాలు చూడాలనే కోరికను చంపేసుకోవడానికి ఆమె ప్రేమతో నాకు కొన్ని హద్దులు పెట్టేది. వాటిని నేను పాటిస్తున్నానా లేదా అని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేది. అంతేకాదు ఇంటర్నెట్ను తక్కువగా వాడడానికి కూడా ఆమె నాకు సహాయం చేసింది.” నిజానికి ఈతన్కు అశ్లీల చిత్రాలు చూడాలని అనిపించినప్పుడల్లా ఫెలిసియాకు గుండె పగిలినట్టు అనిపించేది. కానీ ఆమె ఇలా అంటుంది: “నా బాధ, కోపం ఆ చెడు అలవాటు నుండి ఆయన్ని బయటపడేయదని నాకు తెలుసు. మేము ముందు ఆయన సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత, నా బాధ నుండి బయటపడడానికి ఆయన నాకు సహాయం చేస్తానన్నాడు.”
అలా ఒకరితోఒకరు మాట్లాడుకున్నప్పుడు, భర్త అశ్లీల చిత్రాలకు దూరంగా ఉండగలుగుతాడు. భార్య కూడా మళ్లీ తన భర్త మీద నమ్మకాన్ని పెంచుకోగలుగుతుంది. ఒక భర్త తను ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, తనలో ఎలాంటి చెడు కోరికలు వస్తున్నాయో ఇలాంటివన్నీ తన భార్యకు చెప్పుకోవాలి. అప్పుడు వాళ్ల మధ్య ఇక ఏ రహస్యాలు ఉండవు కాబట్టి భర్తను నమ్మడం భార్యకు తేలికౌతుంది.
మీరు కూడా మీ భర్తకు అలా సహాయం చేయగలరని అనిపిస్తుందా? అలాగైతే ఈ ఆర్టికల్‌ని కలిసి చదివి, చర్చించుకోండి. అలా చేస్తున్నప్పుడు, అశ్లీల చిత్రాలు చూడడం మానుకోవాలని, తనను నమ్మడానికి మీకొక కారణం ఇవ్వాలనే లక్ష్యం మీ భర్త పెట్టుకోవచ్చు. ఈ సమస్య గురించి మాట్లాడడం తనకు నచ్చక, కోపపడే బదులు మీ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవడానికి మీ భర్త ప్రయత్నించవచ్చు. ఈ చెడు అలవాటు నుండి బయటపడడానికి మీ భర్త చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని, మీ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకునే ఒక అవకాశం ఆయనకు ఇవ్వాలనే లక్ష్యం మీరు పెట్టుకోవచ్చు. అలాగే కొంతమందికి అసలు అశ్లీల చిత్రాలు ఎందుకు చూడాలనిపిస్తుందో, దాన్నుండి ఎలా బయటపడవచ్చో ఇద్దరు కలిసి తెలుసుకోండి. d
మీరిద్దరూ మాట్లాడుకుంటునప్పుడు మాటామాటా పెరిగి గొడవలు అవుతాయని మీరు భయపడితే ఏం చేయాలి? ప్రసం. 7:8; 1 కొరిం. 13:4.
మీరిద్దరూ ఏ సంఘపెద్దతో మనసువిప్పి మాట్లాడగలరో ఆయన సమక్షంలో మాట్లాడుకోండి. మీ భర్త అశ్లీల చిత్రాల బానిసత్వం నుండి బయటపడినా సరే, మీరు ఆయన మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి కాస్త సమయం పడుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఆశ వదులుకోకండి. మీ భర్త మీకోసం చేసే చిన్నచిన్న పనుల మీద మనసుపెట్టండి. మీరు కాస్త సమయం ఇస్తే, కాస్త ఓపిక చూపిస్తే మీ వివాహబంధం పటిష్ఠంగా తయారౌతుందనే నమ్మకంతో ఉండవచ్చు.—మీ భర్త మళ్లీ అశ్లీల చిత్రాలు చూడడం మొదలుపెడితే?
అశ్లీల చిత్రాలు చూడడం మానేసిన కొంతకాలానికి, మీ భర్త మళ్లీ వాటిని చూడడం మొదలుపెడితే ఆయన పశ్చాత్తాపం చూపించనట్టా? ఇక పరిస్థితి చేయి దాటిపోయినట్టా? అలా ఏమీ కాదు. ఒకవేళ ఆయన అశ్లీల చిత్రాలకు బానిసై ఉంటే, ఆ చెడు అలవాటుకు దూరంగా ఉండడానికి ఆయన జీవితాంతం పోరాడుతూనే ఉండాలి. అవి చూడడం మానేసిన చాలా సంవత్సరాల తర్వాత కూడా బహుశా ఆ కోరిక మళ్లీ కలగవచ్చు. ముందుముందు అలాంటివి జరగకూడదంటే, ఆ సమస్య పోయింది అని అనిపించినా సరే, ఆయన ఇంతకుముందు పెట్టుకున్న హద్దులను ఇంకా గట్టిగా పాటించడానికి కృషిచేయాలి. (సామె. 28:14; మత్త. 5:29; 1 కొరిం. 10:12) అలాగే ఆయన “కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలి.” అంతేకాదు ‘చెడును అసహ్యించుకోవడం’ నేర్చుకోవాలి. అంటే అశ్లీల చిత్రాలు చూడడంతోపాటు హస్తప్రయోగం లాంటి అపవిత్రమైన పనులకు కూడా దూరంగా ఉండాలి. (ఎఫె. 4:23; కీర్త. 97:10; రోమా. 12:9) ఇవన్నీ చేయడానికి ఆయన ముందుకొస్తున్నాడా? అలాగైతే ఆయన ఈ చెడు అలవాటు నుండి పూర్తిగా బయటపడవచ్చు. e
ఈ అలవాటు నుండి బయటపడడం మీ భర్తకు అస్సలు ఇష్టంలేకపోతే అప్పుడేంటి? మీకు నిరాశగా, కోపంగా, మోసపోయినట్టుగా పదేపదే అనిపిస్తుండవచ్చు. విషయాన్నంతా యెహోవాకు వదిలేసి మనశ్శాంతి కోసం అడగండి. (1 పేతు. 5:7) అధ్యయనం చేస్తూ, ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ యెహోవాకు ఇంకా దగ్గరౌతూ ఉండండి. అలా చేసేకొద్దీ యెహోవా కూడా మీకు దగ్గరౌతున్నాడనే నమ్మకంతో ఉండండి. అలాగే యెషయా 57:15 చెప్తున్నట్టు “నలిగిపోయిన వాళ్లతో, దీనమనస్సు గలవాళ్లతో” ఆయన నివసిస్తూ వాళ్లకు నూతన ఉత్తేజాన్ని ఇస్తాడు. ఒక మంచి క్రైస్తవురాలిగా ఉండడానికి మీరు కృషిచేస్తూ ఉండండి. సంఘపెద్దల సహాయం తీసుకోండి. భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు మీ భర్త మనసు మారుతుందనే ఆశతో ఉండండి.—రోమా. 2:4; 2 పేతు. 3:9.
a ఈ ఆర్టికల్‌లో, అశ్లీల చిత్రాలు చూసే భర్త ఉన్న భార్య గురించి చెప్తున్నా, ఇందులో ఉన్న సూత్రాలు అశ్లీల చిత్రాలు చూసే భార్య ఉన్న భర్తకు కూడా ఉపయోగపడతాయి.
b భార్యాభర్తల్లో ఎవరైనా అశ్లీల చిత్రాలు చూస్తున్నారనే కారణంతో విడాకులు తీసుకోవడాన్ని బైబిలు ఒప్పుకోవట్లేదు.—మత్త. 19:9.
c కొన్ని అసలు పేర్లు కావు.
d మీకు ఉపయోగపడే సమాచారం jw.orgలో అలాగే మన ప్రచురణల్లో దొరుకుతాయి. ఉదాహరణకు, “పోర్నోగ్రఫీ—ప్రమాదకరమైనదా, కాదా?” అనే ఆర్టికల్ jw.orgలో చూడండి. 2014, జూలై 1 కావలికోట పత్రికలో 9-11 పేజీల్లో ఉన్న “మీరు శోధనను ఎదిరించవచ్చు!” అనే ఆర్టికల్ చూడండి.
e అశ్లీల చిత్రాలకు బానిసలవ్వడం వల్ల కొంతమంది భార్యాభర్తలు సంఘపెద్దల సహాయంతో పాటు డాక్టర్ల సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.