అధ్యయన ఆర్టికల్ 33
దానియేలులా ఉండండి
“నువ్వు ఎంతో అమూల్యమైనవాడివి.”—దాని. 9:23.
పాట 73 మాకు ధైర్యాన్నివ్వు
ఈ ఆర్టికల్‌లో . . . a
1. దానియేలు ప్రవక్త బబులోను అధికారులకు ఎందుకు బాగా నచ్చాడు?
బబులోనీయులు దానియేలును ఒక బందీగా యెరూషలేము నుండి బబులోనుకు తీసుకొచ్చినప్పుడు అతను ఇంకా యువకునిగానే ఉన్నాడు. దానియేలు “ఎలాంటి లోపంలేని అందమైన” యువకుడు. అలాగే అతను గొప్ప కుటుంబం నుండి వచ్చాడు. అలా వాళ్లు తమ “కంటికి కనిపించేదాన్ని” మాత్రమే చూశారు, కాబట్టి బబులోను అధికారులకు దానియేలు బాగా నచ్చాడు. (1 సమూ. 16:7) అందుకే రాజభవనంలో సేవ చేయగలిగేలా వాళ్లు దానియేలుకు శిక్షణ ఇచ్చారు.—దాని. 1:3, 4, 6.
2. యెహోవా దృష్టిలో దానియేలు ఎలా ఉన్నాడు? (యెహెజ్కేలు 14:14)
2 దానియేలుకు ఉన్న అందాన్ని, రాజభవనంలో అతనికి ఉన్న స్థానాన్ని చూసి యెహోవా అతన్ని ఇష్టపడలేదు గానీ, అతని వ్యక్తిత్వాన్ని బట్టి ఇష్టపడ్డాడు. నిజానికి దానియేలు యోబులా, నోవహులా ఉన్నాడని యెహోవా చెప్పినప్పుడు బహుశా అతని వయసు 20 ఏళ్లు ఉండివుండవచ్చు. అంటే యెహోవా దృష్టిలో దానియేలు ఎన్నో ఏళ్లు నమ్మకంగా సేవించిన నోవహు, యోబు అంత నీతిమంతునిగా ఉన్నాడు. (ఆది. 5:32; 6:9, 10; యోబు 42:16, 17; యెహెజ్కేలు 14:14 చదవండి.) అంతేకాదు దానియేలు జీవించినంతకాలం యెహోవా అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు.—దాని. 10:11, 19.
3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 యెహోవాకు దానియేలులో బాగా నచ్చిన రెండు లక్షణాల్ని మనం ఈ ఆర్టికల్‌లో చూస్తాం. ముందుగా దానియేలు చూపించిన ఆ లక్షణాలు ఏంటో, వాటిని ఎప్పుడెప్పుడు చూపించాడో చూస్తాం. తర్వాత, దానియేలు ఆ లక్షణాల్ని ఎలా పెంచుకున్నాడో చూస్తాం. చివరిగా, వాటిని మనం ఎలా చూపించవచ్చో చర్చిస్తాం. అయితే ఈ ఆర్టికల్ యౌవనుల కోసం తయారు చేసినప్పటికీ, దానియేలు నుండి మనందరం కూడా ఎంతో నేర్చుకోవచ్చు.
దానియేలులా ధైర్యం చూపించండి
4. దానియేలు గుండె ధైర్యం చూపించిన ఒక సందర్భం గురించి చెప్పండి.
4 ధైర్యవంతులు కూడా అప్పుడప్పుడు భయపడతారు. కానీ ఆ భయం సరైనది చేయకుండా వాళ్లను ఆపలేదు. దానియేలు ఒక అమితమైన గుండె ధైర్యంగల యువకుడు. అతను ధైర్యం చూపించిన రెండు సందర్భాల్ని ఇప్పుడు చూద్దాం. మొదటిది, బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత జరిగింది. బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఒక భారీ ప్రతిమ గురించి కలవరపెట్టే కల వచ్చింది. అది అతనికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆ కల ఏంటో, దాని భావం ఏంటో చెప్పకపోతే దానియేలుతో సహా తన దగ్గరున్న జ్ఞానులందర్నీ చంపేస్తానని రాజు బెదిరించాడు. (దాని. 2:3-5) దానియేలు వెంటనే ఏదోకటి చేయకపోతే అందరూ తమ ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అప్పుడు “దానియేలు రాజు దగ్గరికి వెళ్లి, కల భావం చెప్పడానికి సమయం ఇవ్వమని కోరాడు.” (దాని. 2:16) అలా అడగడానికి అతనికి చాలా గుండె ధైర్యం, విశ్వాసం అవసరమైంది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ దానియేలు కలల భావం చెప్పినట్టు బైబిల్లో లేదు. “పరలోక దేవుడు తమను కరుణించి ఆ రహస్యాన్ని తెలియజేసేలా ఆయన్ని వేడుకోమని” తన స్నేహితులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోలను అతను అడిగాడు. (దాని. 2:18) యెహోవా వాళ్ల ప్రార్థనల్ని విన్నాడు. దేవుని సహాయంతో దానియేలు నెబుకద్నెజరుకు వచ్చిన కల భావాన్ని చెప్పాడు. దాంతో దానియేలు, అతని స్నేహితులు ప్రాణాలతో బయటపడ్డారు.
5. దానియేలు ధైర్యం చూపించిన ఇంకో సందర్భం చెప్పండి.
5 భారీ ప్రతిమ గురించిన కల భావాన్ని దానియేలు చెప్పిన కొంతకాలానికి, మళ్లీ అతను ధైర్యం చూపించాల్సిన సందర్భం వచ్చింది. నెబుకద్నెజరుకు ఇంకో కలవరపెట్టే కల వచ్చింది. ఆ కలలో ఆకాశాన్నంటే అంత పెద్ద చెట్టు కనిపించింది. దానియేలు ధైర్యంగా ఈ కల భావాన్ని కూడా రాజుకు చెప్పాడు. అంతేకాదు రాజు పిచ్చోడై, తన సింహాసనాన్ని కొంతకాలం కోల్పోతాడని కూడా చెప్పాడు. (దాని. 4:25) అప్పుడు రాజు, దానియేలు ఎదురు తిరుగుతున్నాడని అనుకుని అతన్ని చంపేసే అవకాశం కూడా ఉంది. అయినాసరే దానియేలు ఏమాత్రం భయపడకుండా చాలా ధైర్యంగా, నిక్కచ్చిగా ఆ కల భావాన్ని చెప్పాడు.
6. దానియేలు తన జీవితం మొత్తంలో ఎలా ధైర్యంగా ఉండగలిగాడు?
6 దానియేలు తన జీవితం మొత్తంలో ఎలా ధైర్యంగా ఉండగలిగాడు? చిన్నప్పుడు, దానియేలు తన అమ్మానాన్నల నుండి ఎంతో నేర్చుకున్నాడు. యెహోవా తల్లిదండ్రులకు ఇచ్చిన నిర్దేశాల్ని తన అమ్మానాన్నలు పాటిస్తూ దానియేలుకు ధర్మశాస్త్రం గురించి నేర్పించారు. (ద్వితీ. 6:6-9) అలా దానియేలుకు ధర్మశాస్త్రంలో ఉన్న పైపైన విషయాలు అంటే పది ఆజ్ఞలు మాత్రమే కాదు, ఒక ఇశ్రాయేలీయుడు ఏం తినొచ్చు, ఏం తినకూడదు లాంటి విషయాలు కూడా తెలుసు. b (లేవీ. 11:4-8; దాని. 1:8, 11-13) అలాగే గతంలో దేవుని ప్రజలు యెహోవా మాట వింటే ఏం జరిగిందో, వినకపోతే ఏం జరిగిందో కూడా దానియేలుకు తెలుసు. (దాని. 9:10, 11) అంతేకాదు, దానియేలుకు తన జీవితంలో ఎదురైన అనుభవాల్ని బట్టి యెహోవా అలాగే ఆయన శక్తివంతమైన దేవదూతలు తనకు తోడుగా ఉన్నారనే ఆత్మవిశ్వాసం కూడా కలిగింది.—దాని. 2:19-24; 10:12, 18, 19.
7. దానియేలు ధైర్యాన్ని పెంచుకోవడానికి ఇంకా ఏం చేశాడు? (చిత్రం కూడా చూడండి.)
7 దానియేలు దేవుని ప్రవక్తలు రాసినవన్నీ అధ్యయనం చేశాడు. ముఖ్యంగా యిర్మీయా రాసినవి. ఎప్పటినుండో బబులోను చెరలో ఉన్న యూదులు త్వరలోనే విడుదలౌతారని దానియేలు ఆ అధ్యయనం నుండి తెలుసుకున్నాడు. (దాని. 9:2) ప్రవచనాలు నెరవేరడం తన కళ్లారా చూసినప్పుడు యెహోవా మీద అతనికి ఉన్న నమ్మకం ఎన్నోరెట్లు పెరిగింది. ఎవరైతే దేవుని మీద ఎక్కువ నమ్మకం చూపిస్తారో వాళ్లు ఎక్కువ ధైర్యంగా ఉంటారు. (రోమీయులు 8:31, 32, 37-39 పోల్చండి.) అన్నిటికంటే ముఖ్యంగా దానియేలు తన పరలోక తండ్రితో తరచూ మాట్లాడేవాడు. (దాని. 6:10) యెహోవా ముందు తన పాపాల్ని ఒప్పుకుని, తన మనసులో ఉన్నదంతా చెప్పి సహాయం అడిగేవాడు. (దాని. 9:4, 5, 19) అతను కూడా మనలాంటి మామూలు మనిషే కాబట్టి అతను పుట్టుకతో ధైర్యవంతుడేమీ కాదు. కానీ దానియేలు అధ్యయనం చేయడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, యెహోవా మీద నమ్మకం చూపించడం ద్వారా ఆ లక్షణాన్ని పెంచుకున్నాడు.
8. మనం ఎలా ధైర్యాన్ని పెంచుకోవచ్చు?
8 మనం ఎలా ధైర్యాన్ని పెంచుకోవచ్చు? మన తల్లిదండ్రులు ధైర్యంగా ఉండమని మనకు చెప్తుండొచ్చు. కానీ వాళ్లు ఆస్తిని వారసత్వంగా ఇచ్చినట్టు ధైర్యాన్ని ఇవ్వలేరు. ధైర్యాన్ని పెంచుకోవడం ఒక కొత్త కళ నేర్చుకోవడం లాంటిది. ఆ కళలో ఆరితేరిపోవాలంటే దాన్ని నేర్పిస్తున్నవాళ్లను బాగా గమనిస్తూ, వాళ్లు చేసినట్టే చేయాలి. అదేవిధంగా మనం ధైర్యాన్ని పెంచుకోవాలంటే, ఆ లక్షణాన్ని చూపిస్తున్న వాళ్లను బాగా గమనిస్తూ, వాళ్లు చేసినట్టే చేయాలి. మరి దానియేలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? అతనిలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకుని ఉండాలి. మన మనసులో ఉన్నదంతా యెహోవాతో చెప్తూ, ఆయనతో ఎక్కువసార్లు మాట్లాడుతూ, ఆయనతో విడిపోని బంధాన్ని ఏర్పర్చుకోవాలి. ఆయన ఎప్పుడూ మన వెన్నంటే ఉన్నాడనే నమ్మకాన్ని చూపించాలి. అలా చేస్తే, మన విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉంటాం.
9. ధైర్యం చూపిస్తే మనకు ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?
9 ధైర్యం చూపించడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జర్మనీలో ఉంటున్న బెన్ అనే బ్రదర్ ఉదాహరణ గమనించండి. మనిషి కోతి నుండి వచ్చాడని ఆయన స్కూల్లో వాళ్లందరూ నమ్ముతారు. సృష్టి గురించి బైబిలు చెప్తున్నది ఒక కట్టుకథ అంటారు. ఒకరోజు సృష్టికర్త ఉన్నాడని తను ఎందుకు నమ్ముతున్నాడో క్లాస్ అందరిముందు వివరించే అవకాశం బెన్‌కి వచ్చింది. అప్పుడు బెన్ చాలా ధైర్యంగా మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బెన్ ఇలా అంటున్నాడు: “మా మాష్టారు చాలా శ్రద్ధగా విన్నాడు. నేను చెప్పిన సమాచారాన్ని కాపీలుగా చేసి క్లాసులో ఉన్న ప్రతీ ఒక్కరికి ఇచ్చాడు.” మరి బెన్ క్లాస్‌మేట్స్ ఎలా స్పందించారు? బెన్ ఇలా చెప్తున్నాడు: “చాలామంది నేను చెప్పేది వినడానికి ఇష్టపడ్డారు. నన్ను బాగా మెచ్చుకున్నారు.” ధైర్యం చూపిస్తే ఇతరులు గౌరవిస్తారని బెన్ ఉదాహరణ నుండి అర్థమౌతుంది. అంతేకాదు సరైన హృదయస్థితి ఉన్నవాళ్లు యెహోవావైపు ఆకర్షింపబడవచ్చు. కాబట్టి మనం ధైర్యాన్ని పెంచుకోవడానికి మంచి కారణాలే ఉన్నాయి.
దానియేలులా విశ్వసనీయత చూపించండి
10. విశ్వసనీయత అంటే ఏంటి?
10 బైబిల్లో “విశ్వసనీయత” లేదా “విశ్వసనీయ ప్రేమ” అని అనువదించబడిన హీబ్రూ పదాన్ని, దేవుడు తన ప్రజల మీద చూపించే ప్రేమ, ఆప్యాయతలను వివరించడానికి తరచూ ఉపయోగించారు. ఇదే పదాన్ని దేవుని సేవకుల మధ్య ఉన్న ప్రేమను వివరించడానికి కూడా ఉపయోగించారు. (2 సమూ. 9:6, 7) కాలంతోపాటు మన విశ్వసనీయత కూడా పెరుగుతూ ఉండవచ్చు. అది నిజమని దానియేలు ఉదాహరణ ఎలా చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం.
11. దానియేలు విశ్వసనీయతకు అతని వృద్ధాప్యంలో ఎలాంటి పరీక్ష వచ్చింది? (కవర్ పేజీ మీదున్న చిత్రం చూడండి.)
11 తన జీవితం మొత్తంలో దానియేలు విశ్వసనీయతకు ఎన్నో పరీక్షలు వచ్చాయి. కానీ అతనికి 90 ఏళ్ల వయసులో అన్నిటికంటే పెద్ద పరీక్ష ఎదురైంది. ఆ సమయంలో బబులోనును మాదీయులు, పారసీకులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని దర్యావేషు రాజు పరిపాలిస్తున్నాడు. రాజభవనంలో కూడా ఎవ్వరికీ దానియేలంటే గిట్టేది కాదు. అతను ఆరాధించే దేవుడంటే ఏమాత్రం గౌరవం ఉండేది కాదు. కాబట్టి వాళ్లు దానియేలును చంపేయడానికి ఒక కుట్ర పన్నారు. దానియేలు తన దేవునికి విశ్వసనీయంగా ఉంటాడా లేదా రాజుకు విశ్వసనీయంగా ఉంటాడా? అనేది తెలుసుకోవడానికి వాళ్లు రాజుతో ఒక ఆజ్ఞ జారీ చేయించారు. దానియేలు అందరిలాగే రాజుకు విశ్వసనీయంగా ఉండాలంటే, యెహోవాకు 30 రోజులపాటు ప్రార్థన చేయకూడదు. కానీ దానియేలు యెహోవాకే విశ్వసనీయంగా ఉన్నాడు. దాని ఫలితంగా అతన్ని సింహాల గుహలో వేశారు. కానీ దానియేలు తన ఒంటిమీద ఒక్క గాటు కూడా పడకుండా బయటపడ్డాడు. అది అతను విశ్వసనీయంగా ఉన్నందుకు యెహోవా ఇచ్చిన ప్రతిఫలం! (దాని. 6:12-15, 20-22) దానియేలు చూపించిన అంతటి విశ్వసనీయతను మనం ఎలా పెంచుకోవచ్చు?
12. దానియేలు యెహోవాకు ఎందుకంత విశ్వసనీయంగా ఉండగలిగాడు?
12 మనకు యెహోవా మీద ప్రగాఢమైన ప్రేమ ఉంటే ఆయనకు విశ్వసనీయంగా ఉంటాం. దానియేలుకు తన పరలోక తండ్రి మీద అమితమైన ప్రేమ ఉంది కాబట్టి, ఆయనకు విశ్వసనీయంగా ఉండగలిగాడు. యెహోవా లక్షణాల గురించి, ఆయన వాటిని ఎలా చూపించాడనే దానిగురించి దానియేలు బాగా ఆలోచించాడు. అలా అతను యెహోవా మీద ప్రేమను పెంచుకోగలిగాడు. (దాని. 9:4) అంతేకాదు తనకు, తన ప్రజలకు యెహోవా ఏమేం చేశాడో ధ్యానించాడు. దానివల్ల అతను కృతజ్ఞతతో నిండిపోయాడు.—దాని. 2:20-23; 9:15, 16.
13. (ఎ) యౌవనులకు ఎలాంటి విశ్వసనీయ పరీక్షలు ఎదురౌతున్నాయి? ఒక ఉదాహరణ చెప్పండి. (చిత్రం కూడా చూడండి.) (బి) వీడియోలో చూపించినట్టు, యెహోవాసాక్షులు హోమోసెక్సువల్స్‌కి మద్దతిస్తారా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఏమని చెప్తారు?
13 దానియేలులాగే నేడు యౌవనులు కూడా యెహోవా అన్నా, తప్పొప్పుల విషయంలో ఆయన చెప్పేవన్నా ఏమాత్రం ఇష్టంలేని ప్రజల మధ్య ఉన్నారు. అలాంటివాళ్లకు దేవుణ్ణి ప్రేమిస్తున్నవాళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి యెహోవా మీద మన యౌవనులకు ఉన్న విశ్వసనీయతను పాడుచేయడానికి వాళ్లు వెక్కిరిస్తారు, ఎగతాళి చేస్తారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న గ్రామ్ అనే బ్రదర్ ఉదాహరణ గమనించండి. ఒకరోజు అతని స్కూల్ టీచర్, ‘మీ ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి తానొక హోమోసెక్సువల్ అని చెప్తే మీరు అతనికి మద్దతిస్తారా? మద్దతు ఇచ్చే వాళ్లందరూ ఒకవైపు, మద్దతు ఇవ్వని వాళ్లందరూ ఇంకోవైపు నిల్చోండి’ అని అంది. “నేనూ, నాతోపాటు ఉన్న మరో యెహోవాసాక్షి తప్పా మిగతా వాళ్లందరూ అతనికి మద్దతిచ్చే వైపే నిల్చున్నారు” అని గ్రామ్ చెప్పాడు. అయితే, యెహోవా మీద గ్రామ్‌కున్న విశ్వసనీయతకు అసలు పరీక్ష ఆ తర్వాతే ఎదురైంది. అతను ఇలా చెప్తున్నాడు: “ఆ తర్వాత జరిగిన గంటసేపు క్లాస్‌లో మా టీచర్, మా క్లాస్‌మేట్స్ అందరూ నన్ను తిట్టారు, ఎగతాళి చేశారు, వెక్కిరించారు. అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటూ నా నమ్మకాల్ని చెప్పడానికి ప్రయత్నించాను. కానీ నేను చెప్పేది వినడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు.” ఈ విశ్వసనీయ పరీక్ష గురించి గ్రామ్‌కి ఏమనిపించింది? అతను ఇలా చెప్పాడు: “వాళ్లతో మాటలు అనిపించుకోవడం నాకు అస్సలు ఇష్టంలేదు. కానీ ఆ సమయంలో నేను నా నమ్మకాల విషయంలో ఏమాత్రం రాజీపడనందుకు చాలా సంతృప్తిగా ఉంది.” c
14. యెహోవా మీద చెక్కుచెదరని విశ్వసనీయత పెంచుకోవడానికి ఒక మార్గం ఏంటి?
14 యెహోవా మీద చెక్కుచెదరని విశ్వసనీయత పెరగాలంటే దానియేలులాగే ఆయన మీద ప్రేమను పెంచుకోవాలి. ఆ ప్రేమను పెంచుకోవడానికి ఆయన లక్షణాల్ని మనం తెలుసుకోవాలి. దానికోసం మనం ఆయన చేసినవాటిని గమనించాలి. (రోమా. 1:20) యెహోవా మీద మనం ప్రేమ, గౌరవం పెంచుకోవడానికి “సృష్టిలో అద్భుతాలు” అనే సిరీస్‌లో ఉన్న ఆర్టికల్స్ చదవచ్చు, వీడియోలు చూడవచ్చు. వాటితోపాటు జీవం సృష్టించబడిందా? (ఇంగ్లీష్), జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు (ఇంగ్లీష్) అనే బ్రోషుర్లు చదవచ్చు. ఈ బ్రోషుర్ల గురించి కొంతమంది యౌవనులు ఏం అంటున్నారో గమనించండి. డెన్మార్క్‌లో ఉంటున్న ఎస్తేర్ అనే సిస్టర్ ఇలా అంటుంది: “వీటిలో ఉన్న వివరణ నాకు చాలా బాగా నచ్చింది. ఈ బ్రోషుర్లు మీరు ఏం నమ్మాలో చెప్పట్లేదు గానీ, నిజాల్ని చెప్తూ మీరే సొంతగా నిర్ణయం తీసుకునేలా సహాయం చేస్తాయి.” ముందు పేరాలో చెప్పిన బెన్ అనే బ్రదర్ ఇలా అంటున్నాడు: “ఈ బ్రోషుర్లు నా విశ్వాసాన్ని బలపర్చాయి. అలాగే సృష్టికర్త ఉన్నాడని నాకు నమ్మకం కుదిరింది.” వీటిని మీరు కూడా చదివితే బహుశా బైబిలు చెప్తున్న ఈ మాటలతో ఒప్పుకుంటారు: “యెహోవా మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు; నీ ఇష్టాన్ని బట్టే అవి ఉనికిలోకి వచ్చాయి, సృష్టించబడ్డాయి. కాబట్టి మహిమ, ఘనత, శక్తి పొందడానికి నువ్వు అర్హుడవు.”—ప్రక. 4:11. d
15. యెహోవాతో మన బంధం బలపడాలంటే ఏం చేయాలి?
15 యెహోవా మీద మీకున్న ప్రేమను పెంచుకోవడానికి ఇంకో మార్గం ఏంటంటే, ఆయన కుమారుడైన యేసు గురించి చదవడం. జర్మనీలో ఉంటున్న సమీరా అనే సిస్టర్ ఇలా చెప్తుంది: “నేను యేసు గురించి చదివినప్పుడే యెహోవా గురించి ఇంకా బాగా తెలుసుకోగలిగాను.” తన చిన్నప్పుడు యెహోవాకు ఫీలింగ్స్ ఉన్నాయా అని అనుకునేది. కానీ ఆమె యేసు ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోగలిగింది. ఆమె ఇలా అంటుంది: “యేసు పిల్లల్ని చాలా ఇష్టపడేవాడు. వాళ్లతో సరదాగా ఉండేవాడు. అందుకే నాకు యేసు అంటే ఇష్టం.” ఆమె యేసు గురించి ఎక్కువ తెలుసుకునే కొద్దీ, యెహోవాతో ఆమెకు ఉన్న బంధం కూడా పెరుగుతూ వచ్చింది. ఎందుకో ఆమె ఇలా అంటుంది: “యేసు అచ్చుగుద్దినట్టు తన పరలోక తండ్రిని అనుకరించాడు. వాళ్లిద్దరికీ ఒకేలాంటి వ్యక్తిత్వాలు ఉన్నాయి. బహుశా అందుకేనేమో తన గురించి ప్రజలు తెలుసుకోవడానికి యెహోవా యేసును భూమ్మీదకు పంపించాడు.” (యోహా. 14:9) యెహోవాతో మీకున్న బంధాన్ని బలపర్చుకోవాలనుకుంటే, మీరు యేసు గురించి ఎందుకు ఎక్కువగా చదవకూడదు? మీరు అలా చేస్తే యెహోవా మీదున్న ప్రేమ, ఆయన మీద మీకున్న విశ్వసనీయత ఇంకా పెరుగుతాయి.
16. మనం ఎందుకు విశ్వసనీయంగా ఉండాలి? (కీర్తన 18:25; మీకా 6:8)
16 సాధారణంగా ఎవరైతే విశ్వసనీయంగా ఉంటారో వాళ్లకు ఇతరులతో మంచి స్నేహాలు ఉంటాయి. (రూతు 1:14-17) అలాగే ఎవరైతే యెహోవాకు విశ్వసనీయంగా ఉంటారో వాళ్లకు జీవితంలో మనశ్శాంతి, సంతృప్తి ఉంటాయి. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే తనకు విశ్వసనీయంగా ఉండేవాళ్లతో విశ్వసనీయంగా ఉంటానని యెహోవా మాటిస్తున్నాడు. (కీర్తన 18:25; మీకా 6:8 చదవండి.) ఒకసారి ఆలోచించండి, సర్వశక్తిగల సృష్టికర్తే మనతో దగ్గరి స్నేహాన్ని కోరుకుంటున్నాడు! మనం ఆయనతో అలాంటి స్నేహాన్ని ఏర్పరచుకుంటే ఏ కష్టమైనా, ఏ శత్రువైనా, ఆఖరికి మరణమైనా మనల్ని ఆయన నుండి వేరు చేయలేవు. (దాని. 12:13; లూకా 20:37, 38; రోమా. 8:38, 39) దానియేలును అనుకరిస్తూ యెహోవాకు విశ్వసనీయంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా!
దానియేలు నుండి నేర్చుకుంటూ ఉండండి
17-18. మనం దానియేలు నుండి ఇంకా ఏం నేర్చుకోవచ్చు?
17 ఈ ఆర్టికల్‌లో మనం కేవలం దానియేలుకు ఉన్న రెండు లక్షణాల్ని మాత్రమే చూశాం. కానీ అతని నుండి నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంది. ఉదాహరణకు యెహోవా దానియేలుకు దర్శనాల్ని చూపించాడు. అతనికి ఎన్నో కలలు కూడా వచ్చాయి. అలాగే ఎన్నో ప్రవచనాల్ని అర్థంచేసుకుని, దాన్ని చెప్పే సామర్థ్యం కూడా యెహోవా అతనికి ఇచ్చాడు. అతను చెప్పిన చాలా ప్రవచనాలు ఇప్పటికే నెరవేరాయి. ఇంకొన్ని భవిష్యత్తులో నెరవేరబోతున్నాయి. అవి భూమ్మీదున్న ప్రతీ ఒక్కరి జీవితానికి ముడిపడి ఉన్నాయి.
18 తర్వాతి ఆర్టికల్‌లో, దానియేలు చెప్పిన రెండు ప్రవచనాల్ని పరిశీలిస్తాం. మనం యౌవనులమైనా, వృద్ధులమైనా వాటిని అర్థం చేసుకోవడం వల్ల తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మన ధైర్యాన్ని, విశ్వసనీయతను పెంచుకోగలుగుతాం. అంతేకాదు, ముందుముందు వచ్చే పరీక్షల్ని ఎదుర్కోడానికి అవి మనల్ని సిద్ధం చేస్తాయి.
పాట 119 మనకు విశ్వాసం ఉండాలి
a ఈరోజుల్లో యెహోవాను ఆరాధిస్తున్న యౌవనులు ధైర్యానికి, విశ్వసనీయతకు సంబంధించిన పరీక్షల్ని ఎదుర్కొంటున్నారు. వాళ్లు సృష్టికర్తను నమ్ముతున్నందుకు వాళ్ల క్లాస్‌మేట్స్ వెక్కిరిస్తుండవచ్చు. దేవున్ని ఆరాధిస్తున్నందుకు, తప్పొప్పుల విషయంలో ఆయన చెప్తున్నట్టు వింటున్నందుకు వాళ్లను తెలివి తక్కువవాళ్లుగా చూస్తుండవచ్చు. కానీ దానియేలు ప్రవక్తలాగే ఎవరైతే ధైర్యంగా, విశ్వసనీయంగా యెహోవాను ఆరాధిస్తారో వాళ్లు నిజంగా తెలివిగలవాళ్లని ఈ ఆర్టికల్ చూపిస్తుంది.
b బహుశా ఈ మూడు కారణాల వల్ల దానియేలు బబులోనీయుల ఆహారాన్ని తినుండకపోవచ్చు: (1) అది ధర్మశాస్త్రం నిషేధించిన జంతువు మాంసం అయ్యుండొచ్చు. (ద్వితీ. 14:7, 8) (2) అది రక్తాన్ని పూర్తిగా ఒలికించని మాంసం అయ్యుండొచ్చు. (లేవీ. 17:10-12) (3) బహుశా ఆ ఆహారాన్ని తినడం తమ ఆరాధనలో భాగమని బబులోనీయులు అనుకునేవాళ్లు.—లేవీయకాండం 7:15 అలాగే 1 కొరింథీయులు 10:18, 21, 22 పోల్చండి.
c jw.orgలో “నిజమైన నీతి వల్ల శాంతి కలుగుతుంది” వీడియో చూడండి.
d యెహోవా మీద ప్రేమ పెంచుకోవడానికి యెహోవాకు సన్నిహితమవండి అనే పుస్తకాన్ని అధ్యయనం చేయవచ్చు. అలా చేస్తే యెహోవాకు ఉన్న లక్షణాల్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతాం.