అధ్యయన ఆర్టికల్ 36
మీరు ఏం మోయాలి? ఏం వదిలేయాలి?
“ప్రతీ బరువును . . . వదిలేసి, మన ముందున్న పరుగుపందెంలో ఓపిగ్గా పరుగెత్తుదాం.”—హెబ్రీ. 12:1.
పాట 33 మీ భారాన్ని యెహోవాపై వేయండి
ఈ ఆర్టికల్‌లో . . . a
1. హెబ్రీయులు 12:1 ప్రకారం, జీవపు పరుగుపందెంలో గెలుపును సొంతం చేసుకోవడానికి మనం ఏం చేయాలి?
క్రైస్తవుల జీవితాన్ని బైబిలు ఒక పరుగుపందెంతో పోలుస్తుంది. పరుగుపందాన్ని విజయవంతంగా పూర్తి చేసేవాళ్లు శాశ్వత జీవితం అనే బహుమానాన్ని దక్కించుకుంటారు. (2 తిమో. 4:7, 8) మనం ఆ పరుగుపందెంలో పరుగెత్తుతూ ఉండడానికి ఎడతెగక ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం గెలుపు గీతకు కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాం. మనం ఆ పందెంలో గెలుపును సొంతం చేసుకోవడానికి ఏం చేయాలో, పరుగుపందాన్ని విజయవంతంగా పూర్తిచేసిన అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “ప్రతీ బరువును . . . వదిలేసి, మన ముందున్న పరుగుపందెంలో ఓపిగ్గా పరుగెత్తుదాం.”—హెబ్రీయులు 12:1 చదవండి.
2. ప్రతీ బరువును వదిలేయడం అంటే ఏంటి?
2 ‘ప్రతీ బరువును వదిలేయమని’ పౌలు చెప్పినప్పుడు మనం ఇక ఏ బరువును మోయకూడదని ఆయన ఉద్దేశమా? కాదు. బదులుగా అనవసరమైన బరువుల్ని దించేసుకోమని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే అవి మనం పరుగుపందెంలో వెనకపడేలా లేదా అలసిపోయేలా చేయవచ్చు. కాబట్టి అలాంటి బరువుల్ని మనం వెంటనే గుర్తించి, వాటిని దించేసుకోవాలి. అదే సమయంలో మనం మోయాల్సిన బరువుల్ని దించేయకూడదు. అలా దించేస్తే, మనం ఆ పరుగుపందెంలో ఉండే అర్హత కోల్పోతాం. (2 తిమో. 2:5) అయితే మనం మోయాల్సిన బరువులు ఏంటి?
3. (ఎ) గలతీయులు 6:5 ప్రకారం, మనం మోయాల్సిన బరువు ఏంటి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం? ఎందుకు?
3 గలతీయులు 6:5 చదవండి. మనందరం తప్పకుండా మోయాల్సిన దానిగురించి పౌలు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “ప్రతీ వ్యక్తి తన బరువు తానే మోసుకోవాలి.” క్రైస్తవులందరూ దేవుడు చెప్పింది చేయాల్సిన వ్యక్తిగత బాధ్యత గురించి పౌలు అక్కడ చెప్తున్నాడు. దాన్ని మన బదులు వేరేవాళ్లు చేయలేరు. మనం మోయాల్సిన బరువులు ఏంటో, వాటిని ఎలా మోయవచ్చో, దించేసుకోవాల్సిన బరువులు ఏంటో, వాటిని ఎలా దించేసుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. మనం మోయాల్సిన బరువుల్ని మోయడం వల్ల, అనవసరమైన బరువుల్ని దించేసుకోవడం వల్ల జీవపు పరుగుపందాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం.
మనం మోయాల్సిన బరువులు
4. సమర్పించుకున్నప్పుడు యెహోవాకు ఇచ్చిన మాట మోయలేనంత బరువైంది ఎందుకు కాదు? (చిత్రం కూడా చూడండి.)
4 సమర్పించుకున్నప్పుడు యెహోవాకు ఇచ్చిన మాట. మనం యెహోవాకు సమర్పించుకున్నప్పుడు ఆయన్ని ఆరాధిస్తామని, ఆయన ఇష్టం చేస్తామని మాటిచ్చాం. ఆ మాటను మనం నిలబెట్టుకోవాలి. మన సమర్పణకు తగ్గట్టు జీవించడం బరువైన బాధ్యతే. కానీ అది మనం మోయలేనంత బరువైంది కాదు. ఎందుకంటే తన ఇష్టం చేసేలా యెహోవా మనల్ని సృష్టించాడు. (ప్రక. 4:11) తన గురించి తెలుసుకోవాలనే, తనని ఆరాధించాలనే కోరికను ఆయన మనలో పెట్టాడు. అలాగే ఆయన మనల్ని తన స్వరూపంలో తయారుచేశాడు. కాబట్టి మనం ఆయనకు దగ్గరవ్వగలుగుతాం, ఆయన ఇష్టం చేయడంలో సంతోషాన్ని పొందుతాం. (కీర్త. 40:8) అంతేకాదు దేవుని ఇష్టాన్ని చేస్తూ తన కుమారుణ్ణి అనుకరించడం వల్ల మనం “సేదదీర్పు పొందుతాం.”—మత్త. 11:28-30.
5. సమర్పించుకున్నప్పుడు మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడానికి ఏది సహాయం చేస్తుంది? (1 యోహాను 5:3)
5 ఈ బరువును మీరెలా మోయవచ్చు? దానికోసం మీరు రెండు పనులు చేయాలి. ఒకటి, యెహోవా మీద ప్రేమను పెంచుకుంటూ ఉండండి. ఆయన మీకోసం ఇప్పటివరకు చేసిన మంచి వాటిగురించి, భవిష్యత్తులో చేయబోయే వాటిగురించి లోతుగా ఆలోచిస్తూ ఉండండి. మీకు దేవుని మీద ప్రేమ పెరిగేకొద్దీ ఆయనకు లోబడడం ఇంకా తేలికౌతుంది. (1 యోహాను 5:3 చదవండి.) రెండు, యేసును అనుకరించండి. దేవుని ఇష్టాన్ని చేయడంలో ఆయన విజయం సాధించాడు. ఎందుకంటే ఆయన సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాడు, తన బహుమతి మీద మనసుపెట్టాడు. (హెబ్రీ. 5:7; 12:2) యేసులాగే మీరు కూడా బలం కోసం యెహోవాకు ప్రార్థించండి. శాశ్వత జీవితమనే ఆశను మీ కళ్లముందే ఉంచుకోండి. దేవుని మీద మీ ప్రేమ పెరిగేకొద్దీ, ఆయన కుమారుణ్ణి అనుకరించే కొద్దీ సమర్పించుకున్నప్పుడు మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండగలుగుతారు.
6. కుటుంబ బాధ్యతల్ని మనం ఎందుకు సరిగ్గా చేయాలి? (చిత్రం కూడా చూడండి.)
6 కుటుంబ బాధ్యతలు. జీవపు పరుగుపందెంలో కుటుంబ సభ్యుల కన్నా మనం యెహోవాను, యేసును ఎక్కువ ప్రేమించాలి. (మత్త. 10:37) అయితే యెహోవాను, యేసును సంతోషపెట్టే క్రమంలో కుటుంబ బాధ్యతలు అడ్డొస్తున్నాయని మనం వాటిని పక్కన పెట్టేయకూడదు. దానికి బదులు వాళ్లిద్దరూ మనల్ని అంగీకరించాలంటే కుటుంబంలో మన బాధ్యతను సరిగ్గా చేయాలి. (1 తిమో. 5:4, 8) అలా చేసినప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమ-గౌరవాలను ఇచ్చిపుచ్చుకున్నప్పుడు, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించి-శిక్షణ ఇచ్చినప్పుడు, పిల్లలు కూడా అమ్మానాన్న మాట విన్నప్పుడు కుటుంబాలు కళకళలాడతాయని యెహోవాకు తెలుసు.—ఎఫె. 5:33; 6:1, 4.
7. కుటుంబంలో మీ పాత్రను సరిగ్గా చేయడానికి మీకేది సహాయం చేస్తుంది?
7 ఈ బరువును మీరెలా మోయవచ్చు? మీరొక భర్తయినా, భార్యయినా, పిల్లలైనా బైబిలు ఇచ్చే తెలివైన సలహాల్ని పాటించండి. మీకు సరైంది అనిపించిన దాన్నో లేదా మీ చుట్టూవున్నవాళ్ల అభిప్రాయాన్నో, లోకంలోని తెలివైనవాళ్ల సలహానో గుడ్డిగా పాటించకండి. (సామె. 24:3, 4) బదులుగా, బైబిలు ఆధారంగా తయారు చేసిన ప్రచురణల్ని చూడండి. బైబిలు సూత్రాల్ని ఎలా పాటించాలో అందులో మంచి సలహాలు ఉన్నాయి. ఉదాహరణకు “కుటుంబం కోసం” అనే ఆర్టికల్ సిరీస్‌లో భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు, టీనేజీ పిల్లలకు ఎదురయ్యే కొన్ని సవాళ్ల గురించి మంచి సమాచారం ఉంది. b మీ కుటుంబ సభ్యులు ఆ సలహాల్ని పాటించినా, పాటించకపోయినా మీరు మాత్రం వాటిని పాటించాలని తీర్మానించుకోండి. అలా చేసినప్పుడు మీ కుటుంబం ప్రయోజనం పొందుతుంది, యెహోవా దీవెనలు మీపై ఉంటాయి.—1 పేతు. 3:1, 2.
8. మనం తీసుకున్న నిర్ణయాలకు మనం ఎలా బాధ్యత వహించాల్సి రావచ్చు?
8 మనం తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించడం. మనందరికీ సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను యెహోవా ఇచ్చాడు. అలాగే మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానివల్ల వచ్చే ఫలితాల్ని అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ చెడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానివల్ల వచ్చే నష్టం నుండి ఆయన మనల్ని కాపాడడు. (గల. 6:7, 8) అందుకే మనం చెడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అనాలోచితంగా ఏదైనా మాట్లాడినప్పుడు, తొందరపడి ఏదైనా పని చేసినప్పుడు దానివల్ల వచ్చే నష్టానికి మనం తలొగ్గాల్సిందే. మనం చేసే పనుల్నిబట్టి కొన్నిసార్లు మనం బాధతో కుమిలిపోవచ్చు. అయితే మనం తీసుకున్న నిర్ణయాలకు మనమే బాధ్యత వహించాలని తెలుసుకున్నప్పుడు మన పాపాల్ని ఒప్పుకుంటాం, తప్పుల్ని సరిచేసుకుంటాం, చేసిన తప్పుల్నే మళ్లీ చేయకుండా ఉంటాం. ఇవన్నీ చేసినప్పుడు జీవపు పరుగుపందెంలో ముందుకు కొనసాగగలుగుతాం.
9. మీరు ఏదైనా చెడు నిర్ణయం తీసుకుంటే మీరేం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
9 ఈ బరువును మీరెలా మోయవచ్చు? మీరు ఏదైనా చెడు నిర్ణయం తీసుకుంటే ఏం చేయవచ్చు? వెనక్కి వెళ్లి దాన్ని మార్చలేరు. కాబట్టి మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికో లేదా మిమ్మల్ని మీరు నిందించుకోవడానికో, వేరేవాళ్లని నిందించడానికో మీ సమయాన్ని, శక్తిని వృథా చేసుకోకండి. బదులుగా మీ తప్పులేంటో గుర్తించి, ప్రస్తుతం మీరు వాటిని ఎలా సరిచేసుకోగలరో చూడండి. మీరు ఏదైనా తప్పు చేయడం వల్ల బాధతో కుమిలిపోతుంటే వినయంగా యెహోవాకు ప్రార్థించండి. మీ తప్పును ఆయన ముందు ఒప్పుకోండి, క్షమించమని ఆయన్ని అడగండి. (కీర్త. 25:11; 51:3, 4) మీరు ఎవరి విషయంలోనైనా తప్పు చేసుంటే వాళ్లను క్షమించమని అడగండి, అవసరమైతే సంఘపెద్దల సహాయం కూడా తీసుకోండి. (యాకో. 5:14, 15) మీరు చేసిన తప్పుల నుండి నేర్చుకోండి, వాటిని మళ్లీ చేయకుండా చూసుకోండి. అలా చేసినప్పుడు యెహోవా కరుణ చూపిస్తాడు, మీకు అవసరమైన సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఉండవచ్చు.—కీర్త. 103:8-13.
మనం వదిలేయాల్సిన బరువులు
10. మన నుండి మనం ఎక్కువ ఆశించడం బండ రాయిలా ఉంటుందని ఎందుకు చెప్పవచ్చు? (గలతీయులు 6:4)
10 మన నుండి మనం ఎక్కువ ఆశించడం. మన నుండి మనం ఎక్కువ ఆశించినప్పుడు వేరేవాళ్లతో పోల్చుకుంటాం. అప్పుడు అదొక బండ రాయిలా తయారౌతుంది. (గలతీయులు 6:4 చదవండి.) మనం ఎప్పుడూ వేరేవాళ్లతో పోల్చుకుంటూ ఉంటే మనలో ఈర్ష్య, పోటీతత్వం పెరగవచ్చు. (గల. 5:26) వేరేవాళ్లు చేసినట్టే మనమూ చేయాలనుకుంటే మన సామర్థ్యాల్ని, పరిస్థితుల్ని మించి మనల్ని మనం నలగ్గొట్టుకుంటాం. అలాగే “ఎదురుచూసింది ఆలస్యమైనప్పుడు బాధ కలుగుతుంది” అని బైబిలు చెప్తుంది. (సామె. 13:12) మరి ఎప్పుడూ చేరుకోలేని వాటిని మనం ఎక్కువ ఆశిస్తే, ఇంకెంత బాధ కలుగుతుందో కదా! అలా చేయడం వల్ల మన శక్తి ఆవిరైపోతుంది, జీవపు పరుగుపందెంలో మన అడుగులు తడబడతాయి.—సామె. 24:10.
11. మీ నుండి మీరు ఎక్కువ ఆశించకుండా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?
11 ఈ బరువును మీరెలా దించేసుకోవచ్చు? యెహోవా మీ నుండి ఆశించే దానికన్నా, మీ నుండి మీరు ఎక్కువ ఆశించకండి. మీరు చేయగలిగే దానికన్నా ఆయన మీ నుండి ఎప్పుడూ ఎక్కువ ఆశించడు. (2 కొరిం. 8:12) మీరు చేసేదాన్ని, వేరేవాళ్లు చేసే దాంతో యెహోవా ఎప్పుడూ పోల్చడు. (మత్త. 25:20-23) మీరు మనస్ఫూర్తిగా చేసే సేవను, మీ విశ్వసనీయతను, మీ సహనాన్ని ఆయన విలువైనదిగా చూస్తాడు. కాబట్టి మీ వయసు, ఆరోగ్యం, పరిస్థితుల వల్ల ఇప్పుడు కొన్ని పనులు చేయలేరని వినయంగా గుర్తించండి. బర్జిల్లయిలా మీ వయసు, ఆరోగ్యం వల్ల ఏదైనా నియామకం చేయడం కష్టమనిపిస్తే చేయలేరని చెప్పండి. (2 సమూ. 19:35, 36) మోషేలా ఇతరుల సహాయం తీసుకోండి, అవసరమైతే మీ బాధ్యతల్ని ఇతరులతో పంచుకోండి. (నిర్గ. 18:21, 22) అలా వినయం చూపించినప్పుడు మీ నుండి మీరు మరీ ఎక్కువ ఆశించరు, జీవపు పరుగుపందెంలో అలసిపోరు.
12. వేరేవాళ్లు తీసుకున్న చెడు నిర్ణయాలకు మనం బాధ్యులమా? వివరించండి.
12 వేరేవాళ్లు తీసుకున్న చెడు నిర్ణయాలకు మీరు బాధ్యులని అనుకోకండి. వేరేవాళ్లకు బదులు మనం నిర్ణయాలు తీసుకోలేం. అలాగే వాళ్లు తీసుకున్న చెడు నిర్ణయాలకు వచ్చే నష్టాల నుండి మనం వాళ్లను ప్రతీసారి కాపాడలేం. ఉదాహరణకు ఒక కొడుకో, కూతురో కొంతకాలానికి యెహోవాను సేవించకూడదని నిర్ణయించుకోవచ్చు. ఆ నిర్ణయం తల్లిదండ్రులకు చెప్పలేనంత గుండెకోతను మిగులుస్తుంది. అయితే పిల్లలు తీసుకున్న చెడు నిర్ణయాలకు తల్లిదండ్రులు తమను తాము నిందించుకుంటే, మోయలేని బండ రాయిని తమ మీద వేసుకున్నట్టే. వాళ్లు దాన్ని మోయాలని యెహోవా కోరుకోవట్లేదు.—రోమా. 14:12.
13. పిల్లలు చెడు నిర్ణయాలు తీసుకుంటే తల్లిదండ్రులు ఆ పరిస్థితిని ఎలా తట్టుకోవచ్చు?
13 ఈ బరువును మీరెలా దించేసుకోవచ్చు? నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను యెహోవా అందరికీ ఇచ్చాడని గుర్తుంచుకోండి. కాబట్టి ప్రతీఒక్కరు సొంతగా నిర్ణయాలు తీసుకోవచ్చు. యెహోవాను సేవించాలా వద్దా అనే నిర్ణయం కూడా అందులో ఉంది. తల్లిదండ్రులుగా మీరు పరిపూర్ణులుకారని యెహోవాకు తెలుసు. మీరు ఎంత చేయగలరో అంతే చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మీ పిల్లలు తీసుకున్న నిర్ణయాలకు వాళ్లే బాధ్యులు, మీరు కారు. (సామె. 20:11) అయినాసరే, తల్లిదండ్రులుగా మీరు చేసిన పొరపాట్ల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవచ్చు. అలాగైతే మీకు ఎలా అనిపిస్తుందో యెహోవాకు చెప్పండి, క్షమించమని ఆయన్ని అడగండి. మీరు వెనక్కి వెళ్లి జరిగిపోయిన దాన్ని మార్చలేరని ఆయన అర్థం చేసుకుంటాడు. మరోవైపు, మీ పిల్లల నిర్ణయాలకు వచ్చే చెడు ఫలితాల నుండి మీరు వాళ్లను కాపాడాలని ఆయన కోరుకోవట్లేదు. కానీ యెహోవా దగ్గరకు తిరిగి రావడానికి మీ పిల్లలు ఏ చిన్న ప్రయత్నం చేసినా, ఆయన వాళ్లను అక్కున చేర్చుకుంటాడని గుర్తుంచుకోండి.—లూకా 15:18-20.
14. బాధలో కూరుకుపోవడం ఎందుకు మనం దించేసుకోవాల్సిన బరువు?
14 బాధలో కూరుకుపోకండి. మనం పాపం చేసినప్పుడు బాధపడడం సహజమే. కానీ బాధలో కూరుకుపోవడం అనే బరువును మనం మోస్తూ ఉండాలని యెహోవా కోరుకోవట్లేదు. మనం ఆ బరువును దించేసుకోవాలి. మనం పాపం చేశామని ఒప్పుకుని, పశ్చాత్తాపపడి, మళ్లీ ఆ పాపం జోలికి వెళ్లకుండా ఉండడానికి చేయగలిగినదంతా చేసినప్పుడు యెహోవా మనల్ని క్షమిస్తాడనే నమ్మకంతో ఉండొచ్చు. (అపొ. 3:19) ఈ పనులన్నీ చేసిన తర్వాత, ఇక మనం బాధలో కూరుకుపోవాలని యెహోవా కోరుకోవట్లేదు. బాధలో కూరుకుపోతే మనం ఎంత నష్టపోతామో యెహోవాకు తెలుసు. (కీర్త. 31:10) అంతేకాదు, మనం బాధలో మునిగిపోతే జీవపు పరుగుపందెంలో పరుగెత్తడం ఆపేసే ప్రమాదం ఉంది.—2 కొరిం. 2:7.
15. బాధలో కూరుకుపోతే మీరేం చేయాలి? (1 యోహాను 3:19, 20) (చిత్రం కూడా చూడండి.)
15 ఈ బరువును మీరెలా దించేసుకోవచ్చు? మీరు ఇంకా బాధలో కూరుకుపోతూ ఉంటే, దేవుడిచ్చే “నిజమైన క్షమాపణ” మీద మనసుపెట్టండి. (కీర్త. 130:4) నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించినవాళ్లను ఆయన క్షమిస్తాడు అలాగే వాళ్లకు ఇలా మాటిస్తున్నాడు: “వాళ్ల పాపాన్ని ఇక గుర్తుచేసుకోను.” (యిర్మీ. 31:34) అంటే మీరు గతంలో చేసిన పాపాన్ని యెహోవా ఒక్కసారి క్షమిస్తే, ఇక దాన్ని మళ్లీ గుర్తుచేసుకోడని అర్థం. కాబట్టి మీరు చేసిన పాపం వల్ల కష్టాల్ని అనుభవిస్తుంటే, యెహోవా మిమ్మల్ని క్షమించలేదని అనుకోకండి. అలాగే సంఘంలో మీరేదైనా సేవావకాశాన్ని కోల్పోతే, మిమ్మల్ని మీరు నిందించుకోకండి. మీరు చేసిన పాపాల్ని యెహోవా గుర్తుచేసుకోడు, కాబట్టి మీరూ గుర్తుచేసుకోకండి.—1 యోహాను 3:19, 20 చదవండి.
గెలిచే వరకు మీ పరుగు ఆపకండి
16. జీవపు పరుగుపందెంలో మనకు ఏం తెలుసుండాలి?
16 జీవపు పరుగుపందెంలో ‘మనం బహుమతి గెల్చుకునేలా పరుగెత్తాలి.’ (1 కొరిం. 9:24) దానికోసం మోయాల్సిన బరువులేంటో, దించేసుకోవాల్సిన బరువులేంటో మనకు తెలిసుండాలి. ఈ ఆర్టికల్‌లో మనం మోయాల్సిన, దించేసుకోవాల్సిన బరువుల్లో కొన్నిటిని చూశాం. అయితే వేరేవి కూడా ఉన్నాయి. “అతిగా తినడం వల్ల, అతిగా తాగడం వల్ల, జీవిత చింతల వల్ల” మనం ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉందని యేసు చెప్పాడు. (లూకా 21:34) ఈ లేఖనం అలాగే వేరే లేఖనాలు మీరు ఎక్కడ మార్పులు చేసుకోవాలో తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి. ఆ మార్పులు చేసుకుంటే జీవపు పరుగుపందెంలో మీరు గెలిచే వరకు పరుగెత్తగలుగుతారు.
17. జీవపు పరుగుపందెంలో మనం గెలవచ్చని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?
17 యెహోవా మనకు కావల్సిన బలాన్ని ఇస్తాడు. దాంతో జీవపు పరుగుపందాన్ని మనం గెలవచ్చు. (యెష. 40:29-31) కాబట్టి అలుపెరగకుండా పరుగెత్తండి! తన ముందున్న బహుమతిని గెలుచుకోవడానికి పూర్తి శక్తితో పరుగెత్తిన అపొస్తలుడైన పౌలును అనుకరించండి. (ఫిలి. 3:13, 14) మీకు బదులు ఈ పరుగుపందెంలో ఎవ్వరూ పరుగెత్తలేరు. కానీ యెహోవా సహాయంతో మీరు గెలవచ్చు. మోయాల్సిన బరువుల్ని మోయడానికి, అనవసరమైన బరువుల్ని దించేసుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడు. (కీర్త. 68:19) కాబట్టి యెహోవా సహాయం తీసుకోండి, సహనంతో గెలిచే వరకు మీ పరుగు ఆపకండి!
పాట 65 ముందుకు సాగిపోదాం!
a జీవపు పరుగుపందెంలో ముందుకెళ్లేలా ఈ ఆర్టికల్ మనకు సహాయం చేస్తుంది. అయితే, మనం ఈ పరుగుపందెంలో కొన్ని బరువుల్ని మోయాల్సి ఉంది. వాటిలో యెహోవాకు సమర్పించుకున్నప్పుడు ఇచ్చిన మాట, కుటుంబ బాధ్యతలు, మనం తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించడం ఉన్నాయి. అలాగే పరుగుపందెంలో మన వేగాన్ని తగ్గించే అనవసరమైన బరువుల్ని దించేసుకోవాలి. అవేంటో కూడా ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
b jw.orgలో “కుటుంబం కోసం” అనే ఆర్టికల్ సిరీస్‌ని చూడవచ్చు. భార్యాభర్తల కోసం: “ఓర్పును ఎలా పెంచుకోవచ్చు” అలాగే “అనురాగం ఎలా చూపించాలి?” లాంటి ఆర్టికల్స్ ఉన్నాయి. ఇక తల్లిదండ్రుల కోసమేమో: “మంచి నాన్నగా ఎలా ఉండవచ్చు?” అలాగే “పిల్లల్ని ఎలా పొగడాలి” వంటి ఆర్టికల్స్ ఉన్నాయి. టీనేజీ పిల్లలకైతే: “ఒంటరితనంతో బాధపడుతుంటే …” అలాగే “తప్పు చేయాలనే కోరికను తిప్పికొట్టండి” లాంటి ఆర్టికల్స్ ఉన్నాయి.