అధ్యయన ఆర్టికల్ 32
పాట 44 ఒక దీనుడి ప్రార్థన
అందరూ పశ్చాత్తాపపడాలన్నది యెహోవా కోరిక
“ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.”—2 పేతు. 3:9.
ముఖ్యాంశం
పశ్చాత్తాపం అంటే ఏంటి? అది ఎందుకు అవసరం? అన్నిరకాల ప్రజలు పశ్చాత్తాపపడడానికి యెహోవా ఎలా సహాయం చేశాడో తెలుసుకుంటాం.
1. పశ్చాత్తాపపడే వ్యక్తి ఏం చేస్తాడు?
మనం ఏదైనా తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడడం చాలా ప్రాముఖ్యం. బైబిలు ప్రకారం, పశ్చాత్తాపం చూపించే వ్యక్తి తను చేసిన తప్పును అసహ్యించుకుంటాడు, ఆ తప్పును పూర్తిగా మానేస్తాడు, దాన్ని మళ్లీ చేయనని గట్టిగా అనుకుంటాడు.—బైబిలు పదాల పదకోశంలో, “పశ్చాత్తాపం” చూడండి.
2. పశ్చాత్తాపం గురించి మనందరం ఎందుకు తెలుసుకోవాలి? (నెహెమ్యా 8:9-11)
2 భూమ్మీద ప్రాణాలతో ఉన్న ప్రతీఒక్కరు పశ్చాత్తాపం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనందరం ప్రతీరోజు ఏదోక తప్పు చేస్తాం. ఆదాముహవ్వల పిల్లలుగా పాపం, మరణం మనందరికీ వారసత్వంగా వచ్చేశాయి. (రోమా. 3:23; 5:12) ఆ లోపం లేనివాళ్లు ఈ భూమ్మీద ఎవ్వరూలేరు. విశ్వాసానికి నిలువెత్తు రూపాలైన అపొస్తలుడైన పౌలు లాంటివాళ్లు కూడా పాపంతో పోరాడాల్సి వచ్చింది. (రోమా. 7:21-24) అంటే దానర్థం మనం చేసిన పాపాల గురించి బాధపడుతూ కూర్చోవాలనా? కాదు. యెహోవా కరుణగల దేవుడు, మన జీవితాలు సంతోషంతో కళకళలాడాలని ఆయన ఆశపడుతున్నాడు. నెహెమ్యా కాలంలో ఉన్న యూదుల గురించి ఆలోచించండి. (నెహెమ్యా 8:9-11 చదవండి.) వాళ్లు గతంలో చేసిన పాపాల గురించి గుండెలు బాదుకుంటూ కూర్చోవాలని యెహోవా కోరుకోలేదు గానీ, తనని సంతోషంగా ఆరాధించాలని కోరుకున్నాడు. పశ్చాత్తాపం సంతోషానికి నడిపిస్తుందని యెహోవాకు తెలుసు కాబట్టే పశ్చాత్తాపం గురించి మనకు నేర్పిస్తున్నాడు. మన పాపాల విషయంలో పశ్చాత్తాపపడితే కరుణగల మన తండ్రి మనల్ని క్షమిస్తాడనే గట్టి నమ్మకంతో ఉండవచ్చు.
3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 పశ్చాత్తాపం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. ఈ ఆర్టికల్‌లో మనం మూడు విషయాల్ని పరిశీలిస్తాం. ఒకటి, పశ్చాత్తాపం గురించి యెహోవా ఇశ్రాయేలీయులకు ఏం నేర్పించాడు? రెండు, పాపుల్ని పశ్చాత్తాపం వైపు నడిపించడానికి యెహోవా ఏం చేశాడు? మూడు, యేసు అనుచరులు పశ్చాత్తాపం గురించి ఏం నేర్చుకున్నారు?
పశ్చాత్తాపం గురించి యెహోవా ఇశ్రాయేలీయులకు ఏం నేర్పించాడు?
4. పశ్చాత్తాపం గురించి యెహోవా ఇశ్రాయేలీయులకు ఏం నేర్పించాడు?
4 యెహోవా ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా ఎంచుకున్నప్పుడు వాళ్లతో ఒక ఒప్పందం చేశాడు. వాళ్లు ఆయన ఆజ్ఞల్ని పాటిస్తే ఆయన వాళ్లను కాపాడతాడు, దీవిస్తాడు. ఆ ఆజ్ఞల గురించి ఆయన ఈ అభయం ఇచ్చాడు: “నేడు నేను నీకు ఇస్తున్న ఈ ఆజ్ఞ నువ్వు పాటించలేనంత కష్టమైనది కాదు, నువ్వు అందుకోలేనంత దూరంలో కూడా లేదు.” (ద్వితీ. 30:11, 16) కానీ వాళ్లు ఆయనకు ఎదురుతిరిగితే, అంటే వేరే దేవుళ్లను పూజిస్తే మాత్రం వాళ్లను దీవించడం ఆపేస్తాడు, అప్పుడు వాళ్లు కష్టాలపాలౌతారు. అయినాసరే, ఇక వాళ్లను యెహోవా ఏ ఆశా లేకుండా పూర్తిగా వదిలేయలేదు. వాళ్ల కోసం తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. వాళ్లు ‘యెహోవా దగ్గరికి తిరిగొచ్చి ఆయన మాట వినే’ అవకాశం ఉంది. (ద్వితీ. 30:1-3, 17-20) మరో మాటలో చెప్పాలంటే, వాళ్లు పశ్చాత్తాపం చూపించే అవకాశం ఉంది. అలా చేస్తే యెహోవా వాళ్లను అక్కున చేర్చుకుంటాడు, దీవెనలతో ముంచెత్తుతాడు.
5. తన ప్రజల విషయంలో యెహోవా ఏం చేశాడు? (2 రాజులు 17:13, 14)
5 యెహోవా ఎంచుకున్న ప్రజలు మాటిమాటికి ఆయనకు ఎదురుతిరిగారు. వాళ్లు విగ్రహాల్ని ఆరాధించడమే కాదు, ఇంకా వేరే దిగజారిపోయిన పనులు కూడా చేశారు. దానివల్ల వాళ్లకు కష్టాలు తప్పలేదు. కానీ దారితప్పిన ప్రజల మీద యెహోవా ఆశలు వదులుకోలేదు. మళ్లీమళ్లీ ప్రవక్తల్ని పంపించి, పశ్చాత్తాపపడి తన దగ్గరికి తిరిగి రమ్మని వాళ్లను అడిగాడు.—2 రాజులు 17:13, 14 చదవండి.
6. తన ప్రజలు పశ్చాత్తాపపడడం ప్రాముఖ్యం అని యెహోవా ప్రవక్తల ద్వారా ఎలా నేర్పించాడు? (చిత్రం కూడా చూడండి.)
6 తన ప్రజల్ని హెచ్చరించి, దారిలో పెట్టడానికి యెహోవా ఎప్పటికప్పుడు ప్రవక్తల్ని ఉపయోగించుకున్నాడు. ఉదాహరణకు, యిర్మీయా ద్వారా ఆయనిలా చెప్పాడు: ‘భ్రష్టురాలైన ఇశ్రాయేలూ, తిరిగి రా. నేను విశ్వసనీయుణ్ణి కాబట్టి నీ మీద కోపం చూపించను. నేను ఎల్లప్పుడూ కోపంగా ఉండను. నువ్వు మాత్రం నీ అపరాధాన్ని గుర్తించు, ఎందుకంటే నువ్వు యెహోవాకు ఎదురుతిరిగావు.’ (యిర్మీ. 3:12, 13) యోవేలు ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “హృదయపూర్వకంగా నా దగ్గరికి తిరిగిరండి.” (యోవే. 2:12, 13) యెషయా ద్వారా ఇలా చెప్పాడు: “మిమ్మల్ని మీరు కడుక్కొని శుభ్రం చేసుకోండి; మీ దుష్ట పనుల్ని నా కళ్లముందు నుండి తీసేయండి; చెడు చేయడం మానండి.” (యెష. 1:16-19) యెహెజ్కేలు ద్వారా ఇలా అడిగాడు: ‘దుష్టుడు చనిపోవడం వల్ల నాకేమైనా సంతోషమా? అతను తన మార్గాల నుండి పక్కకుమళ్లి, బ్రతకడమే నాకు ఇష్టం. ఏ ఒక్కరైనా చనిపోవడం నాకు అస్సలు ఇష్టంలేదు, కాబట్టి తిరిగొచ్చి బ్రతకండి.’ (యెహె. 18:23, 32) ప్రజలు పశ్చాత్తాపపడితే యెహోవా సంతోషంతో ఉప్పొంగిపోతాడు. ఎందుకంటే వాళ్లు శాశ్వతకాలం బ్రతకాలన్నదే ఆయన కోరిక! అయితే, ఒకవ్యక్తి తనంతట తాను మారి, పశ్చాత్తాపపడేంత వరకు యెహోవా ఊరికే చూస్తూ ఉండడు. దీని గురించి ఇంకొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం.
7. హోషేయ ప్రవక్త, అతని భార్య ఉదాహరణ ఉపయోగించి యెహోవా తన ప్రజలకు ఏం నేర్పించాడు?
7 యెహోవా తన ప్రజలకు ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఎలా పాఠం నేర్పించాడో గమనించండి. అది హోషేయ ప్రవక్త భార్య గోమెరు ఉదాహరణ. ఆమె వ్యభిచారం చేసిన తర్వాత హోషేయను వదిలేసి వేరేవాళ్లతో వెళ్లిపోయింది. అప్పుడు యెహోవా ఏం చేశాడు? హృదయాల్ని చదివే యెహోవా, హోషేయతో ఇలా చెప్పాడు: ‘నువ్వు ఇంకొకసారి వెళ్లి పరాయి పురుషుడు ప్రేమించిన ఆ స్త్రీని, వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీని ప్రేమించు. ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలు వేరే దేవుళ్ల వైపు తిరిగినా యెహోవా వాళ్లను ప్రేమిస్తున్నాడు.’ (హోషే. 3:1; సామె. 16:2) గమనించారా, ఆమె ఇంకా ఘోరమైన పాపం చేస్తుండగానే ఆమెను క్షమించి, మళ్లీ తన భార్యగా తెచ్చుకోమని యెహోవా ఆ ప్రవక్తకు చెప్పాడు. a అదేవిధంగా, తన ప్రజలు తనను మొండిగా వదిలేసి వెళ్లిపోయినా, యెహోవా వాళ్లమీద ఆశ వదులుకోలేదు. వాళ్లు ఘోరమైన పాపాలు చేస్తున్నా యెహోవా వాళ్లను ఇంకా ప్రేమించాడు, పశ్చాత్తాపపడి మారేలా సహాయం చేయడానికి ప్రవక్తల్ని పంపిస్తూనే ఉన్నాడు. అంటే, ఘోరమైన పాపం చేస్తున్న వ్యక్తి ఇంకా తప్పు చేస్తుండగానే అతను పశ్చాత్తాపపడేలా, ‘హృదయాల్ని పరిశీలించే యెహోవా’ సహాయం చేస్తాడని ఆ ఉదాహరణ చూపిస్తుందా? (సామె. 17:3) చూద్దాం!
యెహోవా పాపుల్ని పశ్చాత్తాపం వైపు ఎలా నడిపిస్తాడు?
8. కయీనును పశ్చాత్తాపం వైపు నడిపించడానికి యెహోవా ఏం చేశాడు? (ఆదికాండం 4:3-7) (చిత్రం కూడా చూడండి.)
8 కయీను ఆదాముహవ్వల పెద్ద కొడుకు. తప్పు చేయాలనే కోరిక అతనికి తన అమ్మానాన్నల నుండి వారసత్వంగా వచ్చింది. అంతేకాదు, “అతని పనులు చాలా చెడ్డవి” అని బైబిలు చెప్తుంది. (1 యోహా. 3:12) బహుశా అందుకేనేమో యెహోవా “కయీనును, అతని అర్పణను ఏమాత్రం ఆమోదించలేదు.” కయీను తన తప్పు తెలుసుకుని మారే బదులు, “కోపంతో రగిలిపోయి, ముఖం చిన్నబుచ్చుకున్నాడు.” మరి ఆ తర్వాత యెహోవా ఏం చేశాడు? ఆయన కయీనుతో మాట్లాడాడు. (ఆదికాండం 4:3-7 చదవండి.) యెహోవా కయీనుతో దయగా మాట్లాడుతూ తన మాట విని, మంచి చేస్తే దీవిస్తానని చెప్పాడు. అలా కాకుండా కయీను కోపంతో ఉండిపోతే తప్పుచేసే అవకాశం ఉందని హెచ్చరించాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, యెహోవా చెప్పిన మాట కయీను చెవికి రుచించలేదు. యెహోవా పశ్చాత్తాపం వైపు నడిపిస్తున్నప్పుడు కయీను దానికి స్పందించలేదు. కయీను తన మాట వినలేదు, కాబట్టి ఇక పాపుల్ని పశ్చాత్తాపం వైపు నడిపించను అని యెహోవా ముఖం తిప్పేసుకున్నాడా? లేదు!
9. యెహోవా దావీదును పశ్చాత్తాపం వైపు ఎలా నడిపించాడు?
9 యెహోవా దావీదు రాజును ఎంత ఇష్టపడ్డాడంటే, “అతను నా హృదయానికి నచ్చిన వ్యక్తి” అన్నాడు. (అపొ. 13:22) కానీ దావీదు వ్యభిచారం, హత్య లాంటి ఘోరమైన పాపాలు చేశాడు. ధర్మశాస్త్రం ప్రకారమైతే దావీదును చంపేయాలి. (లేవీ. 20:10; సంఖ్యా. 35:31) కానీ యెహోవా దావీదు మీద ఆశ వదులుకోలేదు. b దావీదు అసలు ఏమాత్రం పశ్చాత్తాపం చూపించకపోయినా, యెహోవా నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త చెప్పిన ఉదాహరణ విన్న తర్వాత దావీదు మనసు చలించిపోయి, పశ్చాత్తాపపడ్డాడు. (2 సమూ. 12:1-14) ఆయన ఎంత పశ్చాత్తాపపడ్డాడో దావీదు రాసిన ఒక కీర్తనలో కనిపిస్తుంది. (కీర్త. 51, పైవిలాసం) ఆ కీర్తన లెక్కలేనంతమంది పాపులకు ఓదార్పునిచ్చింది, పశ్చాత్తాపపడాలనే కోరికను పుట్టించింది. దావీదు పశ్చాత్తాపపడేలా యెహోవా సహాయం చేయడం ఎంత గొప్ప విషయమో కదా!
10. పాపం చేసినవాళ్ల మీద యెహోవా చూపించే ఓర్పు, క్షమాగుణం గురించి మీకేం అనిపిస్తుంది?
10 యెహోవా అన్నిరకాల పాపాల్ని అసహ్యించుకుంటాడు. (కీర్త. 5:4, 5) అయితే, మనందరం పాపులమని ఆయనకు తెలుసు. అంతేకాదు, ఆయన మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనం ఆ పాపంతో పోరాడడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. నీచమైన పాపాలు చేసేవాళ్లు కూడా పశ్చాత్తాపపడి, తనకు దగ్గరయ్యేలా సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అది తెలుసుకున్నప్పుడు మన గుండె బరువు దిగిపోయినట్టు ఉంది కదా! యెహోవా చూపించే ఓర్పు, క్షమాగుణం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు నమ్మకంగా ఉండాలని, పాపం చేస్తే వెంటనే పశ్చాత్తాపం చూపించాలని అనిపిస్తుంది. అయితే, క్రైస్తవ సంఘానికి పశ్చాత్తాపం గురించి యేసు ఏం నేర్పించాడో ఇప్పుడు చూద్దాం.
యేసు అనుచరులు పశ్చాత్తాపం గురించి ఏం నేర్చుకున్నారు?
11-12. తన తండ్రి క్షమాగుణం ఎంత గొప్పదో చూపించడానికి యేసు ఏ కథ చెప్పాడు? ( పేజీ చిత్రం చూడండి.)
11 క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో మెస్సీయ రావాల్సిన టైం వచ్చేసింది. ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు, పశ్చాత్తాపపడడం ఎంత ప్రాముఖ్యమో ప్రజలకు నేర్పించడానికి యెహోవా బాప్తిస్మమిచ్చే యోహానును, యేసుక్రీస్తును ఉపయోగించుకున్నాడు. తన పరిచర్య అంతటిలో తన తండ్రికున్న క్షమాగుణం గురించి యేసు నేర్పించాడు.—మత్త. 3:1, 2; 4:17.
12 క్షమాపణ గురించి తలచుకోగానే గుర్తొచ్చే ఒక కథను యేసు చెప్పాడు. అదే తప్పిపోయిన కుమారుడి కథ! ఆ కథలో యువకుడు ఇల్లు వదిలేసి వెళ్లిపోయి, చెడ్డపనులు చేశాడు. కానీ కొంతకాలానికి “అతనికి బుద్ధి వచ్చి” ఇంటికి తిరిగొచ్చాడు. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? యేసు ఏం చెప్పాడంటే, ఆ అబ్బాయి “ఇంకా దూరంగా ఉన్నప్పుడే, వాళ్ల నాన్న అతన్ని చూసి, జాలిపడి, పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకొని, ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నాడు.” తన తండ్రి ఇంట్లో ఒక పనివాడిగానైనా ఉందామని అతను అనుకున్నాడు. కానీ అతని తండ్రి అతన్ని “నా కుమారుడు” అని పిలిచి తిరిగి తన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఆ తండ్రి ఇలా అన్నాడు: ‘నా కుమారుడు తప్పిపోయి దొరికాడు.’ (లూకా 15:11-32) యేసు భూమ్మీదికి రాకముందు, పశ్చాత్తాపపడిన లెక్కలేనంతమంది పాపుల మీద యెహోవా కనికరం చూపించడం గమనించి ఉంటాడు, అందుకే ఈ కథ చెప్పాడు. ఈ కథ మనకు ఎంతో ఓదార్పునిస్తుంది, మన పరలోక తండ్రి అయిన యెహోవా కరుణకు అద్దంపడుతుంది!
13-14. అపొస్తలుడైన పేతురు పశ్చాత్తాపం గురించి ఏం నేర్చుకున్నాడు? దానిగురించి ఇతరులకు ఏం చెప్పాడు? (చిత్రం కూడా చూడండి.)
13 పశ్చాత్తాపం, క్షమాపణ గురించి అపొస్తలుడైన పేతురు యేసు నుండి చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాడు. పేతురుకు క్షమాపణ చాలాసార్లు అవసరమైంది. యేసు కూడా పెద్దమనసుతో అతన్ని క్షమిస్తూ వచ్చాడు. ఉదాహరణకు, యేసు ఎవరో తనకు తెలీదని మూడుసార్లు చెప్పిన తర్వాత, తప్పుచేశాననే బాధతో పేతురు కుమిలిపోయాడు. (మత్త. 26:34, 35, 69-75) కానీ యేసు పునరుత్థానమైన తర్వాత పేతురును ఏకాంతంగా కలిశాడు. (లూకా 24:33, 34; 1 కొరిం. 15:3-5) పేతురు నిజంగా పశ్చాత్తాపపడ్డాడని యేసుకు తెలుసు కాబట్టి, ప్రేమతో అతన్ని క్షమించాననే భరోసా ఇచ్చాడు.
14 పేతురు స్వయంగా క్షమాపణను రుచి చూశాడు కాబట్టి పశ్చాత్తాపం గురించి, క్షమాపణ గురించి ఇతరులకు చెప్పగలిగాడు. పెంతెకొస్తు పండుగ తర్వాత యూదుల సమూహానికి పేతురు ఇచ్చిన ప్రసంగంలో, వాళ్లు మెస్సీయను చంపారని చెప్పాడు. అయితే, వాళ్లను ప్రేమగా ఇలా వేడుకున్నాడు: “కాబట్టి మీరు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగండి. అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి, యెహోవాయే మీకు సేదదీర్పును ఇస్తాడు.” (అపొ. 3:14, 15, 17, 19) పశ్చాత్తాపపడిన వ్యక్తి తన తప్పుడు ఆలోచనను మానేస్తాడు, తన దారి మార్చుకుంటాడు, యెహోవాను సంతోషపెట్టే జీవితాన్ని మొదలుపెడతాడు అని పేతురు వివరించాడు. యెహోవా ఆ పాపిని క్షమించినప్పుడు, ఆయన అతని తప్పుల్ని మాయం చేస్తాడు లేదా పూర్తిగా తుడిచేస్తాడు అని కూడా పేతురు చెప్పాడు. దశాబ్దాల తర్వాత పేతురు క్రైస్తవులకు ఈ అభయాన్నిచ్చాడు: “యెహోవా . . . మీ విషయంలో ఓర్పు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.” (2 పేతు. 3:9) క్రైస్తవులు పాపం చేసినప్పుడు, ఆఖరికి ఘోరమైన పాపం చేసినప్పుడు కూడా ఇది ఎంత ఊరటను ఇస్తుందో కదా!
15-16. (ఎ) క్షమాపణ గురించి అపొస్తలుడైన పౌలు ఏం నేర్చుకున్నాడు? (1 తిమోతి 1:12-15) (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?
15 తార్సువాడైన సౌలుకు పశ్చాత్తాపం, క్షమాపణ చాలా అవసరమయ్యాయి. ఆయన క్రీస్తు అనుచరుల్ని ఘోరంగా హింసించేవాడు. ఆయన పశ్చాత్తాపపడి మారడం అసాధ్యమని చాలామంది క్రైస్తవులు అనుకొని ఉంటారు. కానీ యేసు వాళ్లలా ఎందుకు ఆలోచిస్తాడు! సౌలు పశ్చాత్తాపపడి మారతాడని యేసు నమ్మాడు. యెహోవా, యేసు సౌలులో ఉన్న మంచి లక్షణాల్ని చూశారు. యేసు ఆయన్ని “నేను ఎంచుకున్న వ్యక్తి” అన్నాడు. (అపొ. 9:15) సౌలును పశ్చాత్తాపం వైపు నడిపించడానికి యేసు ఒక అద్భుతాన్ని కూడా చేశాడు. (అపొ. 7:58–8:3; 9:1-9, 17-20) సౌలు క్రైస్తవునిగా మారిన తర్వాత అపొస్తలుడైన పౌలు అయ్యాడు. దేవుడు తనమీద చూపించిన దయకు, కరుణకు ఎంత రుణపడి ఉన్నాడో పౌలు చాలాసార్లు చెప్పాడు. (1 తిమోతి 1:12-15 చదవండి.) కృతజ్ఞతతో నిండిన ఆ అపొస్తలుడు ఇలా అన్నాడు: దేవుడు “తన దయతో నిన్ను పశ్చాత్తాపం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు.”—రోమా. 2:4.
16 కొరింథు సంఘంలో లైంగిక పాపం చేసిన వ్యక్తిని ఇంకా సంఘంలోనే ఉండనిస్తున్నారని పౌలు విన్నాడు. మరి, వాళ్లను ఏం చేయమని పౌలు చెప్పాడు? యెహోవా తన సేవకులకు క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు ఎలా ప్రేమ చూపిస్తాడో, వాళ్లు పశ్చాత్తాపం చూపించినప్పుడు ఎలా కరుణ చూపిస్తాడో పౌలు చెప్పిన దాన్నుండి తెలుసుకుంటాం. అంతేకాదు, యెహోవాలాగే మనం కూడా ఎలా కరుణ చూపించవచ్చో నేర్చుకుంటాం. ఇంతకీ కొరింథు సంఘంలో ఏం జరిగింది? తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.
పాట 33 మీ భారాన్ని యెహోవాపై వేయండి
a ఇది చాలా ప్రత్యేకమైన పరిస్థితి. ఈరోజుల్లో, ఏ తప్పూ చేయని భర్త లేదా భార్య వ్యభిచారం చేసిన తన భాగస్వామితో కలిసే ఉండాలని యెహోవా చెప్పట్లేదు. నిజానికి, అలాంటివాళ్లు కావాలనుకుంటే విడాకులు తీసుకోవచ్చని యెహోవా తన కుమారునితో చెప్పించాడు.—మత్త. 5:32; 19:9.
b 2012, నవంబరు 15 కావలికోట 21-23 పేజీల్లో ఉన్న “యెహోవా క్షమాగుణం వల్ల మనకు లభించే ప్రయోజనం ఏమిటి?” ఆర్టికల్‌లో 3-10 పేరాలు చూడండి.