కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 33

పాట 130 క్షమిస్తూ ఉండండి

ఘోరమైన పాపం చేసినవాళ్లను యెహోవా చూసినట్టే చూడండి

ఘోరమైన పాపం చేసినవాళ్లను యెహోవా చూసినట్టే చూడండి

“ఒకవేళ ఎవరైనా పాపం చేసినా, మనకు ఒక సహాయకుడు ఉన్నాడు.”1 యోహాను 2:1.

ముఖ్యాంశం

ఒకవ్యక్తి ఘోరమైన పాపం చేసినప్పుడు కొరింథు సంఘం ఏం చేసిందో తెలుసుకుంటాం.

1. మనందరం ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు?

 యెహోవా మనందరికీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛా, సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి మనం ప్రతీరోజు నిర్ణయాలు తీసుకుంటాం. మనందరం తీసుకోగల ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి ఏంటంటే, యెహోవాకు సమర్పించుకుని, ఆయన కుటుంబంలో ఒకరు అవ్వాలనుకోవడం. ప్రతీఒక్కరు ఆ నిర్ణయం తీసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఎందుకంటే యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు, మన మంచి కోరుకుంటున్నాడు. మనం తనకు ఫ్రెండ్స్‌గా ఉంటూ, శాశ్వతకాలం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు.—ద్వితీ. 30:19, 20; గల. 6:7, 8.

2. యెహోవా పశ్చాత్తాపం చూపించని వాళ్ల నుండి ఏం కోరుకుంటున్నాడు? (1 యోహాను 2:1)

2 అయితే, యెహోవా తనను ఆరాధించమని ఎవ్వర్నీ బలవంతపెట్టడు, ఆ నిర్ణయాన్ని వాళ్లకే వదిలేస్తాడు. మరి ఒక బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుడు దేవుని నియమాలు మీరి, ఘోరమైన పాపం చేస్తే అప్పుడేంటి? ఒకవేళ అతను పశ్చాత్తాపం చూపించకపోతే అతన్ని సంఘం నుండి తొలగిస్తారు. (1 కొరిం. 5:13) అయినాసరే, తప్పుచేసిన వ్యక్తి తన దగ్గరికి తిరిగొస్తాడని యెహోవా కోటి ఆశలతో ఎదురుచూస్తాడు. నిజానికి పశ్చాత్తాపపడిన వాళ్లను క్షమించడానికే యెహోవా విమోచన క్రయధనాన్ని ఇచ్చాడు. (1 యోహాను 2:1 చదవండి.) తప్పు చేసినవాళ్లను పశ్చాత్తాపపడమని మన ప్రేమగల దేవుడు మనసారా పిలుస్తున్నాడు.—జెక. 1:3; రోమా. 2:4; యాకో. 4:8.

3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 మనం తప్పును అలాగే తప్పు చేసినవాళ్లను ఆయన చూసినట్టే చూడాలని యెహోవా కోరుకుంటున్నాడు. దాన్ని ఎలా చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. మనం ముఖ్యంగా మూడు విషయాల్ని చూస్తాం. (1) ఒకవ్యక్తి ఘోరమైన పాపం చేసినప్పుడు కొరింథు సంఘానికి పౌలు ఏం చేయమని చెప్పాడు? (2) ఆ వ్యక్తి పశ్చాత్తాపం చూపించినప్పుడు ఏం చేయమని చెప్పాడు? (3) ఘోరమైన పాపం చేసినవాళ్లను యెహోవా ఎలా చూస్తాడని ఇది నేర్పిస్తుంది?

ఘోరమైన పాపం చేసిన వ్యక్తిని కొరింథు సంఘం ఏం చేసింది?

4. కొరింథు సంఘంలో ఏం జరిగింది? (1 కొరింథీయులు 5:1, 2)

4 1 కొరింథీయులు 5:1, 2 చదవండి. పౌలు మూడో మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు, అప్పుడే కొత్తగా ఏర్పడిన కొరింథు సంఘంలో జరుగుతున్న ఘోరమైన విషయాన్ని విన్నాడు. ఆ సంఘంలో ఒకవ్యక్తి, తన నాన్న భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నాడు. అది ఎంత అసహ్యకరమైన పనంటే అన్యజనుల్లో కూడా అలా జరగదు. సంఘం దాన్ని సహించడమే కాదు, చూసీచూడనట్టు వదిలేసింది. కొంతమందైతే, అపరిపూర్ణ మనుషుల మీద దేవుడు ఎంత కరుణ చూపిస్తున్నాడో కదా అని అనుకొని ఉండవచ్చు. కానీ యెహోవా అలాంటి ప్రవర్తనను చీదరించుకుంటాడు. అలాంటి దిగజారిన పనుల వల్ల సంఘానికి ఉన్న మంచిపేరు పాడౌతుంది. మిగతా క్రైస్తవులు కూడా అతనిలా తయారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పౌలు సంఘానికి ఏం చేయమని చెప్పాడు?

5. పౌలు సంఘానికి ఏం చెప్పాడు, దానర్థం ఏంటి? (1 కొరింథీయులు 5:13) (చిత్రం కూడా చూడండి.)

5 1 కొరింథీయులు 5:13 చదవండి. పశ్చాత్తాపపడని వ్యక్తిని సంఘం నుండి తొలగించాలని పవిత్రశక్తి ప్రేరణతో పౌలు చెప్పాడు. మరి మిగతా క్రైస్తవులు అతనితో ఎలా ఉండాలి? “అతనితో సహవాసం మానేయాలి” అని పౌలు చెప్పాడు. అంటే “కనీసం అతనితో కలిసి భోజనం కూడా చేయకూడదు.” (1 కొరిం. 5:11) సాధారణంగా, ఎవరితోనైనా భోజనం చేస్తే వాళ్లతో మాటలు కలిసి, స్నేహాలు పెరుగుతాయి. అయితే, తప్పుచేసిన వ్యక్తితో అనవసరంగా సమయం గడపకూడదని పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. అప్పుడు అతని వల్ల సంఘం పాడవ్వకుండా ఉంటుంది. (1 కొరిం. 5:5-7) అంతేకాదు, అతను యెహోవాను ఎంత బాధ పెట్టాడో తెలుసుకొని, తన తప్పు విషయంలో సిగ్గుపడి, పశ్చాత్తాపపడే అవకాశం ఉంది.

పశ్చాత్తాపం చూపించని వ్యక్తిని సంఘం నుండి తొలగించాలని పౌలు పవిత్రశక్తి ప్రేరణతో ఉత్తరం రాశాడు (5వ పేరా చూడండి)


6. పౌలు రాసిన ఉత్తరానికి సంఘం, అలాగే తప్పుచేసిన వ్యక్తి ఎలా స్పందించారు?

6 కొరింథు సంఘానికి తన ఉత్తరం పంపించిన తర్వాత సంఘం దాన్ని ఎలా తీసుకుంటుందో అని పౌలు కాస్త కంగారుపడ్డాడు. కానీ తర్వాత తీతు ఒక మంచివార్తతో పౌలు దగ్గరికి తిరిగొచ్చి, సంఘం దానికి చక్కగా స్పందించిందని చెప్పాడు. (2 కొరిం. 7:6, 7) ఆయన చెప్పినట్టే, వాళ్లు తప్పుచేసిన వ్యక్తిని సంఘం నుండి తొలగించారు. అంతేకాదు, పౌలు ఉత్తరం రాసిన కొన్ని నెలల తర్వాత తప్పుచేసిన వ్యక్తి పశ్చాత్తాపపడ్డాడు! తన ప్రవర్తనను మార్చుకుని, యెహోవా నీతి ప్రమాణాలకు తగ్గట్టు జీవించడం మొదలుపెట్టాడు. (2 కొరిం. 7:8-11) మరి, ఇప్పుడు పౌలు సంఘానికి ఏం చెప్తాడు?

పశ్చాత్తాపపడిన వ్యక్తిని సంఘం ఎలా చూడాలి?

7. తప్పుచేసిన వ్యక్తిని సంఘం నుండి తొలగించడం వల్ల ఎలాంటి మంచి ఫలితం వచ్చింది? (2 కొరింథీయులు 2:5-8)

7 2 కొరింథీయులు 2:5-8 చదవండి. పౌలు సంఘానికి ఇలా చెప్పాడు: “అలాంటి వ్యక్తికి మీలో చాలామంది ఇప్పటికే ఇచ్చిన క్రమశిక్షణ సరిపోతుంది.” ఇంకోమాటలో చెప్పాలంటే, అతని విషయంలో క్రమశిక్షణ ఉద్దేశం నెరవేరింది. ఏంటది? క్రమశిక్షణ అతన్ని పశ్చాత్తాపం వైపు నడిపించింది.—హెబ్రీ. 12:11.

8. పౌలు సంఘానికి ఇంకా ఏం చేయమని చెప్పాడు?

8 ఆ వ్యక్తి పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి అతన్ని సంఘంలోకి తిరిగి చేర్చుకోమని పౌలు పెద్దలకు చెప్పాడు. అంతేకాదు, ‘దయతో అతన్ని క్షమించి ఓదార్చమని, అతన్ని ప్రేమిస్తున్నారనే భరోసా ఇవ్వమని’ కూడా చెప్పాడు. పశ్చాత్తాపం చూపించిన వ్యక్తిని వాళ్లు మనస్ఫూర్తిగా క్షమించాలని, అతన్ని ప్రేమిస్తున్నారు అనే భరోసాను తమ మాటల ద్వారా, పనుల ద్వారా ఇవ్వాలని పౌలు కోరుకున్నాడు. అలా చేస్తే, పశ్చాత్తాపం చూపించిన వ్యక్తి సంఘానికి తిరిగి రావడం వాళ్లకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో చూపించినట్టు అవుతుంది.

9. పశ్చాత్తాపపడిన వ్యక్తిని క్షమించడం కొంతమందికి ఎందుకు కష్టమై ఉండొచ్చు?

9 పశ్చాత్తాపపడిన వ్యక్తి తిరిగి సంఘంలో చేర్చుకోబడినప్పుడు అందరూ సంతోషించకపోయి ఉండొచ్చు. అలాగని ఎందుకు చెప్పొచ్చు? అతని పనుల వల్ల సంఘం మొత్తం ఇబ్బందిపడి ఉంటుంది. కొంతమందినైతే, అతను వ్యక్తిగతంగా బాధపెట్టి ఉండొచ్చు. ఇంకొంతమందైతే, ‘యెహోవా ఆజ్ఞల్ని పాటించడానికి మేము ఇంత కష్టపడుతుంటే, అంత ఘోరమైన తప్పుచేసిన వ్యక్తిని సంఘంలో తిరిగి చేర్చుకోవడం అన్యాయం’ అని అనుకొని ఉండొచ్చు. (లూకా 15:28-30 తో పోల్చండి.) అయినాసరే, తిరిగొచ్చిన వ్యక్తి మీద నిజమైన ప్రేమ చూపించడం ఎందుకంత ముఖ్యం?

10-11. పశ్చాత్తాపం చూపించిన వ్యక్తిని పెద్దలు క్షమించకపోతే ఏమౌతుంది?

10 నిజంగా పశ్చాత్తాపం చూపించిన వ్యక్తిని సంఘపెద్దలు తిరిగి సంఘంలోకి చేర్చుకోకపోతే, లేదా తిరిగి చేర్చుకున్నా సంఘంలోని వాళ్లు అతని మీద ప్రేమ చూపించకపోతే, ఏమౌతుంది? “అతను తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాడు.” తను మారినా ఉపయోగం లేదని అనుకోవచ్చు. చివరికి, యెహోవాకు దగ్గరవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథానే అని డీలా పడిపోతాడు.

11 సంఘంలోని వాళ్లు పశ్చాత్తాపపడిన వ్యక్తిని క్షమించకపోతే, యెహోవాతో తమకున్న సంబంధాన్ని చేతులారా ప్రమాదంలోకి నెట్టేసుకుంటారు. ఎందుకు? వాళ్లు క్షమాగుణం ఉన్న యెహోవాలా కాకుండా, జాలి-దయ లేని సాతానులా ప్రవర్తించినట్టు అవుతుంది. దానివల్ల, వాళ్లు సాతాను చెప్పుచేతల్లోకి వెళ్లిపోయి, పశ్చాత్తాపపడిన వ్యక్తి యెహోవాకు దూరం అయ్యేలా చేసే అవకాశం ఉంది.—2 కొరిం. 2:10, 11; ఎఫె. 4:27.

12. కొరింథు సంఘం యెహోవాలా ఎలా ఉండొచ్చు?

12 కొరింథు సంఘం సాతానులా కాకుండా యెహోవాలా ఎలా ఉండొచ్చు? పశ్చాత్తాపపడిన వ్యక్తుల్ని యెహోవాలా క్షమించడం ద్వారా! యెహోవా గురించి బైబిల్లో కొంతమంది ఏం రాశారో గమనించండి. “నువ్వు మంచివాడివి, క్షమించడానికి సిద్ధంగా ఉంటావు” అని దావీదు రాశాడు. (కీర్త. 86:5) మీకా ఇలా రాశాడు: “తప్పుల్ని, అపరాధాల్ని క్షమించే నీలాంటి దేవుడు ఎవరు?” (మీకా 7:18) అలాగే యెషయా ఇలా రాశాడు: “దుష్టుడు తన మార్గాన్ని, చెడ్డవాడు తన ఆలోచనల్ని విడిచిపెట్టాలి; అతను యెహోవా దగ్గరికి తిరిగి రావాలి, ఆయన అతని మీద కరుణ చూపిస్తాడు, మన దేవుని దగ్గరికి తిరిగొస్తే, ఆయన అధికంగా క్షమిస్తాడు.”—యెష. 55:7.

13. పశ్చాత్తాపపడిన వ్యక్తిని సంఘంలోకి తిరిగి చేర్చుకోవడం ఎందుకు సరైంది? (“ కొరింథు సంఘంలోని వ్యక్తి ఎప్పుడు తిరిగి చేర్చుకోబడ్డాడు?” అనే బాక్స్‌ చూడండి.)

13 యెహోవాను అనుకరించాలంటే కొరింథు సంఘం పశ్చాత్తాపపడిన వ్యక్తిని క్షమించాలి, అతన్ని ప్రేమిస్తున్నట్టు భరోసాను ఇవ్వాలి. వాళ్లు పౌలు చెప్పినట్టే పశ్చాత్తాపపడిన వ్యక్తిని క్షమించి, “అన్ని విషయాల్లో విధేయత” చూపించారు. (2 కొరిం. 2:9) నిజమే అతన్ని సంఘం నుండి తొలగించి కొన్ని నెలలే అయ్యింది. కానీ అతనికి ఇచ్చిన క్రమశిక్షణ వల్ల అతను పశ్చాత్తాపపడ్డాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని సంఘంలోకి తిరిగి చేర్చుకోవడానికి ఆలస్యం చేయడంలో అర్థం లేదు.

యెహోవాలా న్యాయాన్ని, కరుణను ఎలా చూపించవచ్చు?

14-15. కొరింథు సంఘంలో జరిగిన దాన్నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? (2 పేతు. 3:9) (చిత్రం కూడా చూడండి.)

14 కొరింథు సంఘంలో జరిగిన విషయం, “మనకు బోధించడానికే” యెహోవా రాయించాడు. (రోమా. 15:4) ఆ సంఘటన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఎవరైనా ఘోరమైన పాపం చేసి, పశ్చాత్తాపం చూపించకపోతే యెహోవా అతన్ని సంఘంలో ఉండనివ్వడు. బహుశా కొంతమంది యెహోవా “కరుణగలవాడు” కాబట్టి, పశ్చాత్తాపం చూపించకపోయినా సంఘంలో ఉండొచ్చులే అనుకోవచ్చు, కానీ ఆయన తన కరుణను అలా చూపించడు. యెహోవా కరుణగలవాడే కానీ తప్పును చూసీచూడనట్టు వదిలేయడు, తప్పొప్పుల విషయంలో తన ప్రమాణాల్ని ఎప్పుడూ మార్చుకోడు. (యూదా 4) నిజానికి అలా చేస్తే ఆయన కరుణ చూపించినట్టు అవ్వదు. ఎందుకంటే, దానివల్ల సంఘం మొత్తం నష్టపోతుంది.—సామె. 13:20; 1 కొరిం. 15:33.

15 అయినాసరే, యెహోవాకు ఎవ్వరూ నాశనమవ్వడం ఇష్టంలేదని తెలుసుకున్నాం. వీలైనంతమందిని ఆయన కాపాడాలని అనుకుంటున్నాడు. ఎవరైతే మనసు మార్చుకుని, ఆయనకు దగ్గరవ్వాలని కోరుకుంటారో వాళ్లమీద కరుణ చూపిస్తాడు. (యెహె. 33:11; 2 పేతురు 3:9 చదవండి.) అందుకే కొరింథులో ఉన్న వ్యక్తి పశ్చాత్తాపం చూపించి, తన ప్రవర్తనను మార్చుకున్నప్పుడు సంఘమంతా అతన్ని క్షమించి, తిరిగి చేర్చుకోవాలని యెహోవా పౌలు ద్వారా చెప్పాడు.

తిరిగి చేర్చుకోబడిన వాళ్ల మీద సంఘం యెహోవాలా ప్రేమ, కరుణ చూపిస్తూ అక్కున చేర్చుకుంటుంది (14-15 పేరాలు చూడండి)


16. కొరింథులో జరిగిన సంఘటన యెహోవా గురించి మనకేం నేర్పిస్తుంది?

16 యెహోవా ప్రేమగలవాడు, నీతిమంతుడు, న్యాయం గలవాడు అని కొరింథు సంఘం ఉదాహరణ మనకు చూపిస్తుంది. (కీర్త. 33:5) అది తెలుసుకున్నప్పుడు యెహోవాను ఇంకా ఎక్కువ స్తుతించాలని అనిపించట్లేదా? నిజానికి, మనందరం పాపులం! మనలో ప్రతీఒక్కరికి ఆయన క్షమాపణ అవసరం. ఆయన మనల్ని క్షమించడానికి విమోచన క్రయధనం ఇచ్చినందుకు మనలో ప్రతీఒక్కరం ఆయనకు రుణపడి ఉన్నాం! యెహోవా మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని, మన మంచి కోరుకుంటున్నాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పును, ధైర్యాన్ని ఇస్తుందో కదా!

17. తర్వాతి ఆర్టికల్స్‌లో ఏం చర్చిస్తాం?

17 ఈ రోజుల్లో, ఎవరైనా ఘోరమైన పాపం చేసినప్పుడు సంఘపెద్దలు యెహోవాలా ఎలా ప్రేమ చూపించవచ్చు? ఆ వ్యక్తి పశ్చాత్తాపపడేలా వాళ్లు ఎలా సహాయం చేయవచ్చు? ఒక వ్యక్తిని సంఘం నుండి తొలగించాలని గానీ, తిరిగి చేర్చుకోవాలని గానీ సంఘపెద్దలు నిర్ణయించినప్పుడు సంఘం ఎలా స్పందించాలి? ఈ ప్రశ్నల గురించి తర్వాతి ఆర్టికల్స్‌లో చర్చిస్తాం.

పాట 109 మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించండి