అధ్యయన ఆర్టికల్ 31
పాట 12 యెహోవా గొప్ప దేవుడు
పాపుల్ని కాపాడడానికి యెహోవా ఏం చేశాడు?
“దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు.”—యోహా. 3:16.
ముఖ్యాంశం
మనం పాపంతో పోరాడడానికి, అసలు పాపమే లేని లోకంలో శాశ్వతకాలం ఆనందంగా జీవించేలా మనకు సహాయం చేయడానికి యెహోవా ఎలా చొరవ తీసుకున్నాడో చూస్తాం.
1-2. (ఎ) పాపం అంటే ఏంటి? దానితో పోరాడి ఎలా గెలవవచ్చు? (“పదాల వివరణ” కూడా చూడండి) (బి) ఈ ఆర్టికల్‌లో, అలాగే ఈ పత్రికలోని మిగతా ఆర్టికల్స్‌లో ఏం చర్చిస్తాం? (ఈ పత్రికలోని “పాఠకులకు గమనిక” కూడా చూడండి.)
యెహోవా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? దానికొక మంచి పద్ధతి ఏంటంటే పాపం, మరణం నుండి మిమ్మల్ని విడిపించడానికి ఆయన ఏం చేశాడో చదవడమే. పాపం a ఒక బద్ధశత్రువు. మనంతట మనం దాన్ని ఎప్పుడూ ఓడించలేం. మనం ప్రతీరోజు పాపం చేస్తాం, ఆ పాపం వల్లే మనం చనిపోతున్నాం. (రోమా. 5:12) అయితే, ఒక మంచివార్త ఉంది. యెహోవా సహాయంతో మనం పాపాన్ని ఓడించగలం. నిజానికి పాపం మీద మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం!
2 దాదాపు 6000 సంవత్సరాలుగా మనుషులు పాపంతో చేసే పోరాటంలో, యెహోవా సహాయం చేస్తూనే ఉన్నాడు. ఎందుకు? మనమంటే ఆయనకు ప్రాణం. మనుషుల్ని తయారుచేసిన క్షణం నుండే యెహోవా వాళ్లను ప్రేమిస్తున్నాడు. వాళ్లు చేసే పోరాటంలో సహాయం చేయడానికి ఆయన ఎంతదూరం వెళ్లడానికైనా వెనకాడలేదు. పాపం మరణానికి నడిపిస్తుందని ఆయనకు తెలుసు, మనం చనిపోవాలని ఆయన కోరుకోవట్లేదు. మనం శాశ్వతకాలం బ్రతకాలని ఆయన ఆశిస్తున్నాడు. (రోమా. 6:23) మీ విషయంలో కూడా ఆయన అదే కోరుకుంటున్నాడు. ఈ ఆర్టికల్‌లో ఈ మూడు ప్రశ్నల్ని చూస్తాం: (1) పాపులైన మనుషుల్లో యెహోవా ఏ ఆశను నింపాడు? (2) బైబిలు కాలాల్లో ఉన్నవాళ్లు యెహోవా ఆమోదాన్ని ఎలా పొందారు? (3) మనుషుల్ని కాపాడడానికి యేసు ఎలా రంగంలోకి దిగాడు?
పాపులైన మనుషుల్లో యెహోవా ఏ ఆశను నింపాడు?
3. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు ఎలా పాపులయ్యారు?
3 యెహోవా మొట్టమొదటి పురుషుణ్ణి, స్త్రీని సృష్టించినప్పుడు వాళ్లు సంతోషంగా ఉండాలని ఆశపడ్డాడు. వాళ్లకు అందమైన ఇంటిని, పెళ్లి అనే బహుమతిని, అద్భుతమైన నియామకాన్ని ఇచ్చాడు. వాళ్లు ఈ భూమంతటినీ తమ పిల్లలతో నింపి, దాన్ని అందమైన ఏదెను తోటలా మార్చాలి. అయితే, వాళ్లకు ఒకేఒక సింపుల్ ఆజ్ఞ ఇచ్చాడు. ఒకవేళ వాళ్లు ఆ ఆజ్ఞ మీరి, కావాలనే తనకు ఎదురుతిరిగితే, వాళ్లు చేసిన పాపం మరణానికి నడిపిస్తుందని హెచ్చరించాడు. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అసలు దేవుడన్నా, మనుషులన్నా ఏమాత్రం ప్రేమలేని ఒక పరలోక ప్రాణి సీన్‌లోకి వచ్చాడు. ఆదాముహవ్వలు పాపం చేసేలా మోసం చేశాడు, వాళ్లు అతని బుట్టలో పడ్డారు. తమను ప్రాణంగా ప్రేమించే తండ్రిని నమ్మే బదులు వాళ్లు పాపం చేశారు. యెహోవా మాటలే నిజమయ్యాయి. ఆరోజు నుండి వాళ్లు తమ పాపానికి వచ్చిన పర్యవసానాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వాళ్లు ముసలివాళ్లు అయ్యి, చనిపోయారు.—ఆది. 1:28, 29; 2:8, 9, 16-18; 3:1-6, 17-19, 24; 5:5.
4. యెహోవా పాపాన్ని ఎందుకు అసహ్యించుకుంటాడు, దాంతో పోరాడడానికి మనకు ఎందుకు సహాయం చేస్తాడు? (రోమీయులు 8:20, 21)
4 ఒక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవడానికే యెహోవా ఈ విషాద గాథను రాయించాడు. యెహోవా పాపాన్ని ఎంతగా అసహ్యించుకుంటాడో అది చూపిస్తుంది. పాపం మనల్ని మన తండ్రి నుండి వేరుచేస్తుంది, మరణానికి నడిపిస్తుంది. (యెష. 59:2) సాతానుకు యెహోవా అన్నా, మనుషులన్నా అస్సలు గిట్టదు. అందుకే అప్పుడు ఆదాముహవ్వలు పాపం చేసేలా ప్రేరేపించాడు, ఇప్పుడు మనం కూడా పాపం చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, ఏదెను తోటలో జరిగినదాన్ని బట్టి గొప్ప విజయం సాధించానని సాతాను విర్రవీగి ఉంటాడు. కానీ యెహోవా ఎంత ప్రేమగలవాడో అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఆదాముహవ్వల పిల్లల విషయంలో యెహోవా ఉద్దేశం ఎప్పుడూ మారలేదు. ఆయన మనుషుల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు, అందుకే వాళ్లందర్లో వెంటనే ఒక ఆశ నింపాడు. (రోమీయులు 8:20, 21 చదవండి.) ఆదాముహవ్వల పిల్లల్లో కొంతమందైనా తనను ప్రేమిస్తారని, పాపంతో పోరాడడానికి సహాయం అడుగుతారని యెహోవాకు బాగా తెలుసు. అంతేకాదు పాపం నుండి విడుదల అవ్వడానికి, తనకు దగ్గరవ్వడానికి సృష్టికర్తగా-తండ్రిగా యెహోవా వాళ్లకు ఏదోక దారి చూపిస్తాడు. ఇవన్నీ సాధ్యమవ్వడానికి యెహోవా ఏం చేశాడు?
5. పాపులైన మనుషుల్లో యెహోవా ఎలా ఆశను చిగురింపచేశాడో వివరించండి. (ఆదికాండం 3:15)
5 ఆదికాండం 3:15 చదవండి. సాతానుకు ఏం జరుగుతుందో యెహోవా చెప్పినప్పుడు మొట్టమొదటిసారి ఆశ చిగురించింది. దేవుడు మాటిచ్చిన ‘సంతానమే’ ఆ ఆశాకిరణం. ఈ సంతానం సాతాను తలను చితగ్గొట్టి, ఏదెను తోటలో అతని వల్ల కలిగిన నష్టాన్నంతటినీ తీసేస్తాడు. (1 యోహా. 3:8) అయితే, అలా జరగడానికి ముందు ఆ సంతానం బాధలు పడాల్సివుంది. సాతాను ఆ సంతానాన్ని మడిమె మీద కొట్టి, చనిపోయేలా చేస్తాడు. అప్పుడు యెహోవాకు కలిగిన బాధను మాటల్లో వర్ణించలేం. కానీ లెక్కలేనంతమంది మనుషుల్ని పాపం నుండి, మరణం నుండి కాపాడడానికి యెహోవా ఆ బాధనంతటినీ దిగమింగుకున్నాడు.
బైబిలు కాలాల్లో పాపులైన మనుషులు యెహోవా ఆమోదాన్ని ఎలా పొందారు?
6. యెహోవాకు దగ్గరవ్వడానికి నమ్మకస్థులైన హేబెలు, నోవహు లాంటి వాళ్లు ఏం చేశారు?
6 ఏదెను తోటలో ఆ సంఘటన జరిగిన తర్వాత వందల సంవత్సరాలుగా పాపులైన మనుషులు తనకు ఎలా దగ్గరవ్వచ్చో యెహోవా క్రమక్రమంగా స్పష్టం చేస్తూ వచ్చాడు. ఆ తిరుగుబాటు తర్వాత, ఆదాముహవ్వల రెండో కొడుకైన హేబెలు, యెహోవా మీద విశ్వాసం ఉంచిన మొట్టమొదటి మనిషి అయ్యాడు. హేబెలుకు యెహోవా అంటే బాగా ఇష్టం, ఆయన్ని సంతోషపెట్టాలనుకున్నాడు, దగ్గరవ్వాలనుకున్నాడు కాబట్టే బలి అర్పించాడు. హేబెలు ఒక గొర్రెల కాపరి, తన దగ్గరున్న గొర్రెపిల్లల్ని యెహోవా కోసం అర్పించాడు. మరి యెహోవా ఏం చేశాడు? “యెహోవా హేబెలును, అతని అర్పణను ఆమోదించాడు.” (ఆది. 4:4) తనను ప్రేమించి, తన మీద నమ్మకం ఉంచిన నోవహు లాంటివాళ్లు అర్పించిన బలుల్ని కూడా యెహోవా ఆమోదించాడు. (ఆది. 8:20, 21) అలాంటి బలుల్ని అంగీకరించడం వల్ల పాపులైన మనుషులు తన ఆమోదాన్ని పొందవచ్చని, తనకు దగ్గరవ్వచ్చని యెహోవా చూపించాడు. b
7. అబ్రాహాము తన కొడుకైన ఇస్సాకును బలివ్వడానికి వెనకాడకపోవడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
7 విశ్వాసానికి మారుపేరైన అబ్రాహామును, ఊహకందని పని చేయమని యెహోవా చెప్పాడు. తన కొడుకైన ఇస్సాకును బలి ఇవ్వమని అడిగాడు. అది వినగానే అబ్రాహాము గుండె జారిపోయి ఉంటుంది. అయినాసరే ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ చివరి క్షణంలో యెహోవా అతన్ని ఆపాడు. అయితే, యెహోవా భవిష్యత్తులో ఏం చేస్తాడో ఆ ఉదాహరణ చూపించింది. యెహోవాకు మనుషులంటే ఎంత ఇష్టమంటే, తను ప్రాణంగా ప్రేమించే తన కుమారున్ని బలి ఇవ్వడానికి కూడా వెనకాడలేదు.—ఆది. 22:1-18.
8. ధర్మశాస్త్రంలో ఉన్న చాలా రకాల బలులు దేనిని సూచించాయి? (లేవీయకాండం 4:27-29; 17:11)
8 వందల సంవత్సరాల తర్వాత, యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుని ప్రజల పాపాల్ని ప్రాయశ్చిత్తం చేయడానికి చాలారకాల బలులు అవసరమయ్యాయి. (లేవీయకాండం 4:27-29; 17:11 చదవండి.) ఆ బలులన్నీ మనుషుల్ని పాపం నుండి పూర్తిగా కాపాడే ఒక గొప్ప త్యాగాన్ని సూచించాయి. దేవుడు మాటిచ్చిన ఆ సంతానం గురించి ప్రవక్తలు పవిత్రశక్తి ప్రేరణతో రాశారు. ఆ సంతానం దేవుని ఒక్కగానొక్క కుమారుడని, ఆయన చాలా బాధలు పడి చనిపోతాడని వాళ్లు చెప్పారు. ఆయన వధించబడిన గొర్రెపిల్లలా తన ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. (యెష. 53:1-12) ఒక్కసారి ఊహించుకోండి: యెహోవా దేవుడు తన ఒక్కగానొక్క ప్రియకుమారుణ్ణి మనుషులందర్నీ పాపం, మరణం నుండి విడిపించడానికి బలిచ్చాడు. అందులో మీరూ ఉన్నారు.
మనుషుల్ని కాపాడడానికి యేసు ఎలా రంగంలోకి దిగాడు?
9. యేసు గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చెప్పాడు? (హెబ్రీయులు 9:22; 10:1-4, 12)
9 క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో బాప్తిస్మమిచ్చే యోహాను, నజరేయుడైన యేసును చూసి ఇలా అన్నాడు: “ఇదిగో, లోక పాపాల్ని తీసేసే దేవుని గొర్రెపిల్ల!” (యోహా. 1:29) పవిత్రశక్తి ప్రేరణతో యోహాను చెప్పిన ఈ మాటలు, గతంలో ఎప్పుడో దేవుడు మాటిచ్చిన సంతానం యేసే అని చూపించాయి. యెహోవా మాటిచ్చినట్టే యేసు తన ప్రాణాన్ని అర్పిస్తాడు. అలా పాపం అనే చీకటిని చీలుస్తూ మనుషుల్ని విడిపించే ఒక ఆశాకిరణం ప్రకాశించింది.—హెబ్రీయులు 9:22; 10:1-4, 12 చదవండి.
10. ‘పాపుల్ని పిలవడానికే వచ్చాను’ అని యేసు ఎలా చూపించాడు?
10 పాపం అనే బరువుతో నలిగిపోతున్న వాళ్లమీద యేసు శ్రద్ధ చూపించాడు, తనని అనుసరించమని పిలిచాడు. మనుషులు పడే బాధలన్నిటికీ కారణం పాపమని ఆయనకు తెలుసు. అందుకే పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా పాపం చేశామనే బాధతో నలిగిపోయిన వాళ్లందరి దగ్గరికి ఆయన వెళ్లాడు. ఆయన ఒక ఉదాహరణతో ఇలా వివరించాడు: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను.” (మత్త. 9:12, 13) యేసు ఆ మాటలకు తగ్గట్టే జీవించాడు. తన కన్నీళ్లతో యేసు పాదాల్ని తుడవడానికి వచ్చిన స్త్రీతో చాలా మృదువుగా మాట్లాడి, ఆమె పాపాల్ని క్షమించాడు. (లూకా 7:37-50) సమరయ స్త్రీ అనైతిక జీవితం జీవిస్తుందని తెలిసినా, బావి దగ్గర ఆమెకు ముఖ్యమైన సత్యాల్ని నేర్పించాడు. (యోహా. 4:7, 17-19, 25, 26) అంతేకాదు పాపం వల్ల వచ్చిన ఫలితాన్ని, అంటే మరణాన్ని తీసేసే శక్తిని కూడా దేవుడు యేసుకు ఇచ్చాడు. ఎలాగంటే ఆయన పురుషుల్ని-స్త్రీలని, పిల్లల్ని-పెద్దవాళ్లని మళ్లీ బ్రతికించాడు.—మత్త. 11:5.
11. పాపులు యేసు దగ్గరికి ఎందుకు రాగలిగారు?
11 ఆఖరికి, పొద్దున లేస్తే పాపం చేసే ప్రజలు కూడా యేసు దగ్గరికి రావడానికి ఇష్టపడ్డారు. వాళ్లమీద యేసు కనికరం, దయ చూపించాడు. వాళ్లు కూడా ఆయన దగ్గరికి రావడానికి అస్సలు భయపడలేదు. (లూకా 15:1, 2) తన మీద విశ్వాసం చూపించినందుకు యేసు వాళ్లను మెచ్చుకున్నాడు, ప్రతిఫలం ఇచ్చాడు. (లూకా 19:1-10) తన తండ్రి కరుణకు ఆయన నిలువెత్తు రూపంలా నిలిచాడు. (యోహా. 14:9) కరుణ, కనికరంగల తన తండ్రి ప్రజల్ని ప్రేమిస్తాడని; పాపం చేసేవాళ్లకు సహాయం చేయాలనుకుంటున్నాడని యేసు తన ప్రతీ మాటలో, పనిలో చూపించాడు. పాపం చేసేవాళ్లు తప్పుడు పనుల్ని మానేసి తనను అనుసరించేలా సహాయం చేశాడు.—లూకా 5:27, 28.
12. యేసు తన మరణం గురించి ఏం చెప్పాడు?
12 తన జీవితంలో ముందుముందు ఏం జరుగుతుందో యేసుకు తెలుసు. ఆయన వెన్నుపోటుకు గురై కొయ్యమీద వేలాడదీయబడతాడు అని తన అనుచరులకు ఒకట్రెండుసార్లు చెప్పాడు. (మత్త. 17:22; 20:18, 19) యోహాను ప్రకటించినట్టు, ప్రవక్తలు ముందే చెప్పినట్టు తన బలి వల్ల ఈ లోకంలోని పాపం తీసేయబడుతుందని ఆయనకు తెలుసు. తన ప్రాణాన్ని బలిచ్చిన తర్వాత, “అన్నిరకాల ప్రజల్ని” తనవైపు ఆకర్షించుకుంటానని కూడా ఆయన చెప్పాడు. (యోహా. 12:32) పాపులైన మనుషులు యేసును తమ ప్రభువుగా అంగీకరించి, ఆయన అడుగులో అడుగు వేస్తున్నప్పుడు యెహోవాను సంతోషపెట్టగలుగుతారు. అలా చివరికి వాళ్లు, “పాపం నుండి విడుదల” పొందుతారు. (రోమా. 6:14, 18, 22; యోహా. 8:32) అందుకే, యేసు భయంకరమైన మరణం ముందు కూడా ఇష్టంగా, ధైర్యంగా తలవంచాడు.—యోహా. 10:17, 18.
13. యేసు ఎలా చనిపోయాడు? ఆయన మరణం యెహోవా గురించి మనకు ఏం తెలియజేస్తుంది? (చిత్రం కూడా చూడండి.)
13 యేసును వెన్నుపోటు పొడిచారు, అరెస్టు చేశారు, తిట్టారు, లేనిపోనివి కల్పించి చెప్పారు, దోషిగా నిలబెట్టారు, చిత్రహింసలు పెట్టారు. సైనికులు ఆయన్ని చంపే స్థలానికి తీసుకెళ్లి కొయ్యకు మేకులతో దిగగొట్టారు. అంత వేదనను యేసు నమ్మకంగా సహించాడు. కానీ ఇంకో వ్యక్తి అంతకు మించిన బాధను అనుభవించాడు. ఆయన ఎవరోకాదు యెహోవా దేవుడు. తనకు అంతులేని శక్తి ఉన్నా యెహోవా ఎందుకు మౌనంగా ఉన్నాడు? ప్రేమకు నిలువెత్తు రూపమైన ఆయన ఎందుకు అలా ఉన్నాడు? కేవలం మన మీద ఉన్న ప్రేమవల్లే! యేసు ఇలా చెప్పాడు: “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.”—యోహా. 3:16.
14. యేసు విమోచన క్రయధనం ఏం రుజువు చేస్తుంది?
14 యెహోవా ఆదాముహవ్వల పిల్లల్ని చాలా ప్రేమిస్తున్నాడు అనడానికి యేసు విమోచన క్రయధనమే తిరుగులేని రుజువు. అది యెహోవా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూపిస్తుంది. మిమ్మల్ని పాపం నుండి, మరణం నుండి విడిపించడానికి యెహోవా ఎప్పుడూ అనుభవించనంత బాధను అనుభవించాడు. దానికోసం ఆయన ఎంతదూరం వెళ్లడానికైనా వెనకాడలేదు. (1 యోహా. 4:9, 10) అవును మనలో ప్రతీ ఒక్కరం పాపంతో పోరాడి గెలిచేలా సహాయం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు.
15. విమోచన క్రయధనం అనే బహుమతి నుండి ప్రయోజనం పొందాలంటే మనం ఏం చేయాలి?
15 దేవుని ఒక్కగానొక్క కుమారుని విమోచన క్రయధనం మనకు దొరికిన సాటిలేని బహుమతి. దానివల్ల మన పాపాలన్నీ క్షమించబడతాయి. కానీ దేవుని క్షమాపణ పొందాలంటే మనం ఒకటి చేయాలి. ఏంటది? బాప్తిస్మమిచ్చే యోహాను, ఆ తర్వాత యేసుక్రీస్తు ఇలా చెప్పారు: “పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి.” (మత్త. 3:1, 2; 4:17) మనం పాపంతో పోరాడాలన్నా, మన పరలోక తండ్రికి దగ్గరవ్వాలన్నా పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యం. కానీ పశ్చాత్తాపపడడం అంటే ఏంటి? మనం పాపులమైనాసరే, యెహోవాను సంతోషపెట్టడానికి అదెలా సహాయం చేస్తుంది? జవాబు తర్వాతి ఆర్టికల్‌లో ఉంది.
పాట 18 విమోచన క్రయధనంపట్ల కృతజ్ఞత
a పదాల వివరణ: బైబిలు ప్రకారం “పాపం” అనే పదం కొన్నిసార్లు, మనం చేసే తప్పుల్ని అలాగే యెహోవా నైతిక ప్రమాణాలకు తగ్గట్టుగా జీవించకపోవడాన్ని సూచించవచ్చు. అయితే, “పాపం” అనే పదం ఆదాము నుండి మనకు వచ్చిన అపరిపూర్ణతను లేదా పాపపు స్థితిని కూడా సూచించవచ్చు. వారసత్వంగా వచ్చిన పాపం వల్లే మనమంతా చనిపోతున్నాం.
b ఈ నమ్మకమైన సేవకుల బలుల్ని యెహోవా అంగీకరించడానికి ఆధారం, యేసుక్రీస్తు చెల్లించబోయే బలి. అది మనుషులందర్నీ పాపం, మరణం నుండి శాశ్వతంగా విడిపిస్తుంది.—రోమా. 3:25.