కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఐక్యతలేని లోకంలో ఎవ్వరి పక్షం వహించకుండా ఉండండి

ఐక్యతలేని లోకంలో ఎవ్వరి పక్షం వహించకుండా ఉండండి

‘దేవునివి దేవునికి చెల్లించండి.’మత్త. 22:21.

పాటలు: 33, 137

 1. మనం దేవునికి అలాగే మానవ ప్రభుత్వాలకు ఎలా లోబడవచ్చు?

 మానవ ప్రభుత్వాలకు లోబడాలని బైబిలు బోధిస్తోంది. మరోవైపున మనుషులకు కాదుగానీ దేవునికే లోబడాలని కూడా అది బోధిస్తోంది. (అపొ. 5:29; తీతు 3:1) అదెలా సాధ్యం? మనం ఎవరికి లోబడాలో తెలుసుకునేందుకు సహాయం చేసే ఓ సూత్రాన్ని యేసు చెప్పాడు. “కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి” అని ఆయన అన్నాడు. [1] (మత్త. 22:21) మనం ప్రభుత్వ చట్టాలకు లోబడుతూ, ప్రభుత్వ అధికారుల్ని గౌరవిస్తూ, పన్ను చెల్లించినప్పుడు “కైసరువి కైసరునకు” ఇస్తాం. (రోమా. 13:7) కానీ ఒకవేళ దేవునికి ఇష్టంలేని పని ఏదైనా చేయమని ప్రభుత్వం చెప్తే, మనం దాన్ని చేయమని గౌరవంగా చెప్తాం.

 2. మనం ఈ లోక రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చమని ఎలా చూపిస్తాం?

2 ‘దేవునివి దేవునికి’ చెల్లించే ఒక మార్గం ఏమిటంటే, ఈ లోక రాజకీయ వ్యవహారాలకు మద్దతు ఇవ్వకుండా ఉండడం. అలాంటి విషయాల్లో మనం తలదూర్చం. (యెష. 2:4) మానవ ప్రభుత్వాలు పరిపాలన చేయడానికి దేవుడే అనుమతిస్తున్నాడు కాబట్టి మనం వాటిని వ్యతిరేకించం. కానీ దేశభక్తికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనం. (రోమా. 13:1, 2) ప్రభుత్వాన్ని గానీ, రాజకీయ నాయకులను గానీ మార్చడానికి మనం ప్రయత్నించం. అలాగే ఎన్నికల్లో ఓట్లు వేయం లేదా పోటీచేయం.

 3. మనం ఎవ్వరి పక్షం వహించకుండా ఎందుకు ఉండాలి?

3 మనం ఎవ్వరి పక్షం వహించకుండా ఉండాలని దేవుడు చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయని బైబిలు చెప్తుంది. ఒక కారణం ఏమిటంటే, “నేను లోకసంబంధిని కాను” అని చెప్పిన యేసును మనం అనుకరిస్తాం. ఆయన రాజకీయాల్లో లేదా యుద్ధాల్లో ఎన్నడూ పాల్గొనలేదు. (యోహా. 6:15; 17:16) మరో కారణం ఏమిటంటే, మనం దేవుని రాజ్యానికి మద్దతిస్తాం. మనం మానవ ప్రభుత్వాలకు మద్దతివ్వం కాబట్టి, మానవ సమస్యలన్నిటినీ దేవుని రాజ్యం పరిష్కరిస్తుందని ఇతరులకు ప్రకటించినప్పుడు, మన మనస్సాక్షి మనల్ని నిందించదు. అబద్ధమతాలు రాజకీయాలకు మద్దతిస్తాయి దానివల్ల ప్రజల్లో విభేదాలు కలుగుతాయి. కానీ మనం రాజకీయాలకు దూరంగా ఉంటాం కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరసహోదరీలతో ఐక్యంగా ఉండగలుగుతున్నాం.—1 పేతు. 2:17.

 4. (ఎ) ఎవ్వరి పక్షం వహించకుండా ఉండడం కష్టంగా తయారౌతుందని మనకెలా తెలుసు? (బి) అలా ఉండడానికి మనం ఇప్పుడే ఎందుకు సిద్ధపడాలి?

4 మనం జీవించే ప్రాంతంలో రాజకీయాల్లో పాల్గొనమని ప్రజలు మనల్ని ఒత్తిడి చేయకపోవచ్చు. కానీ సాతాను లోకం అంతానికి దగ్గరయ్యేకొద్దీ, ఎవ్వరి పక్షం వహించకుండా ఉండడం మరింత కష్టంగా తయారవ్వచ్చు. నేడు ప్రజలు ఇప్పటికే ‘మొండివాళ్లుగా,’ ‘మూర్ఖులుగా’ ఉన్నారు, వాళ్లు మరింత ఘోరంగా తయారవుతారు. (2 తిమో. 3:3-4, NW) మన సహోదరులు కొంతమంది, వాళ్ల దేశ రాజకీయాల్లో హఠాత్తుగా జరిగిన మార్పులవల్ల ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే, కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం ఎవ్వరి పక్షం వహించకుండా ఉండేలా ఇప్పుడే సిద్ధపడాలి. అలా సిద్ధపడేందుకు సహాయం చేసే నాలుగు విషయాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

మానవ ప్రభుత్వాల గురించి యెహోవాలా ఆలోచించండి

 5. మానవ ప్రభుత్వాల విషయంలో దేవుని అభిప్రాయమేంటి?

5 మానవ ప్రభుత్వాల పక్షం వహించకుండా ఉండేలా ఇప్పుడే సిద్ధపడడానికి ఒక మార్గం ఏమిటంటే, వాటిగురించి యెహోవాలా ఆలోచించడం. యెహోవా మనుషులను సృష్టించినప్పుడు వాళ్లకు ఒకరినొకరు పరిపాలించుకునే హక్కు ఇవ్వలేదు. (యిర్మీ. 10:23) ఆయన మనుషులందర్నీ ఒకే కుటుంబంలా చూస్తాడు. కానీ మానవ ప్రభుత్వాలు తమ దేశమే గొప్పదని భావిస్తూ ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేశాయి. కొన్ని ప్రభుత్వాలు మంచివని అనిపించినా, అవి సమస్యలన్నిటినీ పరిష్కరించలేవు. అంతేకాదు, 1914లో పరిపాలన మొదలుపెట్టిన దేవుని రాజ్యాన్ని అవి వ్యతిరేకిస్తున్నాయి. అతిత్వరలోనే దేవుని రాజ్యం ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేస్తుంది.—కీర్తన 2:3, 7-9 చదవండి.

 6. ప్రభుత్వ అధికారులను మనమెలా చూడాలి?

6 మానవ ప్రభుత్వాల వల్ల కొంత శాంతిసమాధానాలు ఉంటాయి కాబట్టి దేవుడు ఆ ప్రభుత్వాలను అనుమతిస్తున్నాడు. దానివల్ల మనం దేవుని రాజ్యం గురించి ప్రకటించగలుగుతున్నాం. (రోమా. 13:3, 4) అంతేకాదు అధికారులు తీసుకునే నిర్ణయాలు, మన ఆరాధనకు ఆటంకంగా ఉండకూడదని వాళ్ల గురించి కూడా ప్రార్థించమని దేవుడు చెప్తున్నాడు. (1 తిమో. 2:1, 2) మనకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, సహాయం కోసం ప్రభుత్వ అధికారుల దగ్గరకు వెళ్లవచ్చు. పౌలు అలాగే చేశాడు. (అపొ. 25:11) మానవ ప్రభుత్వాల వెనక ఉన్నది సాతానేనని బైబిలు చెప్తుందిగానీ, అధికారంలో ఉన్న ప్రతీ ఒక్కరు అతని గుప్పిట్లో ఉన్నారని మాత్రం చెప్పట్లేదు. (లూకా 4:5, 6) కాబట్టి ఫలానా ప్రభుత్వ అధికారిని సాతానే నడిపిస్తున్నాడని మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే మనం ఇతరులను అవమానించకూడదని బైబిలు చెప్తుంది.—తీతు 3:1, 2.

 7. మనం ఎలా ఆలోచించకూడదు?

7 ఓ రాజకీయ నాయకుడు లేదా పార్టీ మనకు ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడు కూడా మనం దేవునికే లోబడతాం. అలా ఉండడం కొన్నిసార్లు కష్టమే. ఉదాహరణకు, యెహోవాసాక్షులతో పాటు ఇతరులను కూడా చాలా బాధపెట్టిన ఓ ప్రభుత్వానికి ప్రజలు ఎదురుతిరిగారని అనుకోండి. అప్పుడు బహుశా మీరూ వాళ్లలాగే తిరుగుబాటు చేయకపోవచ్చు కానీ, వాళ్లు చేస్తున్నది సరైనదని, వాళ్లు దానిలో విజయం సాధించాలని మీరు అనుకుంటారా? (ఎఫె. 2:2) మనం ఎవ్వరి పక్షం వహించకుండా ఉండాలంటే, వీళ్లు వాళ్లకన్నా మంచివాళ్లని అనుకోకూడదు. మనం అలా అనుకోవట్లేదని మన మాటల ద్వారా, పనుల ద్వారా చూపిస్తాం.

‘వివేకులుగా’ ఉంటూనే ‘నిష్కపటులుగా’ ఉండండి

 8. మనం ఎవ్వరి పక్షం వహించకుండా ఉండడం కష్టంగా ఉన్నప్పుడు, ‘వివేకులుగా’ ఉంటూనే ‘నిష్కపటులుగా’ ఎలా ఉండవచ్చు?

8 మనం ఎవ్వరి పక్షం వహించకుండా ఉండడానికి రెండవ మార్గం ఏమిటంటే, ‘పాముల్లా వివేకులుగా పావురాళ్లా నిష్కపటులుగా ఉండడం.’ (మత్తయి 10:16, 17 చదవండి.) రాబోయే ప్రమాదాల గురించి ముందే ఆలోచించినప్పుడు మనం ‘వివేకులుగా’ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవ్వరి పక్షం వహించకుండా ఉన్నప్పుడు ‘నిష్కపటులుగా’ ఉంటాం. అలాంటి పరిస్థితులు కొన్ని ఏమిటో, ఎవ్వరి పక్షం వహించకుండా మనం ఎలా ఉండవచ్చో ఇప్పుడు చూద్దాం.

 9. మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి?

9 మాటలు. ప్రజలు రాజకీయ విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు, మనం దేవుని రాజ్యం గురించి ఎవరికైనా చెప్తున్నప్పుడు, ఫలానా రాజకీయ నాయకుని లేదా పార్టీ భావాలను, అభిప్రాయాలను మనం ఒప్పుకుంటున్నామని గానీ, ఒప్పుకోవట్లేదని గానీ చెప్పం. కాబట్టి, మనుషులు మన సమస్యలను పరిష్కరించడానికి ఏమి చేయాలనుకుంటున్నారనే దానిగురించి మాట్లాడే బదులు, దేవుని రాజ్యం ఎలా మన సమస్యలన్నిటినీ పూర్తిగా తీసేస్తుందో బైబిలు నుండి చూపించండి. ఒకవేళ ఎవరైనా, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించిగానీ, ఫలానా మతానికి ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయని గానీ వాదించాలని చూస్తే, వాటిగురించి బైబిలు ఏమి చెప్తుందో, దాన్ని మీ జీవితంలో ఎలా పాటిస్తున్నారో చెప్పండి. ఒకవేళ ఎవరైనా ఫలానా చట్టాలను తీసేయాలనిగానీ మార్చాలనిగానీ చెప్తే, మనం వాళ్లకు మద్దతివ్వం అలాగే వాళ్లు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని పట్టుబట్టం.

10. ప్రచార మాధ్యమాల్లో వచ్చే వార్తల్ని చూస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మనం ఎవ్వరి పక్షం వహించకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు?

10 ప్రచార మాధ్యమాలు. కొన్నిసార్లు వార్తల్లో ఏదైనా ఒక విషయం గురించి చెప్తున్నప్పుడు, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన వార్తా ఛానళ్లు ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడుతుంటాయి. ఒకవేళ ఆ వార్తా సంస్థలు, రిపోర్టర్లు ఎవరో ఒకరి పక్షాన మాట్లాడుతుంటే, మనం వాళ్లలా ఆలోచించకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘రాజకీయాల విషయాల్లో ఫలానా రిపోర్టరు చెప్పేవి నాకు నచ్చుతాయి కాబట్టి అతను చెప్పే వార్తలు వినడానికి నేను ఇష్టపడతానా?’ మీరు ఎవ్వరి పక్షం వహించకుండా ఉండాలంటే, రాజకీయాలకు మద్దతిచ్చే రిపోర్టులను చూడకుండా, చదవకుండా జాగ్రత్తపడండి. బదులుగా, అలా మద్దతివ్వని రిపోర్టులను చూడవచ్చు. మీరు వింటున్న విషయాలు బైబిల్లోని ‘మంచి మాటల నమూనాకు’ తగినట్టుగా ఉన్నాయో లేవో ఎప్పుడూ పోల్చి చూసుకోండి.—2 తిమో. 1:13, NW.

11. వస్తువులపై ప్రేమ ఉంటే ఎవ్వరి పక్షం వహించకుండా ఉండడం ఎందుకు కష్టమౌతుంది?

11 వస్తువులపై ప్రేమ. డబ్బును, మన దగ్గరున్న వస్తువులను మనం ఎక్కువగా ప్రేమిస్తే, ఎవ్వరి పక్షం వహించకుండా ఉండడం కష్టంగా ఉండవచ్చు. 1970వ సంవత్సరం తర్వాత మలావీలోని చాలామంది యెహోవాసాక్షులు ఒక రాజకీయ పార్టీలో చేరనందుకు వాళ్ల దగ్గరున్న వస్తువులన్నిటినీ వదులుకోవాల్సి వచ్చింది. అయితే, కొంతమంది తమ సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకోలేకపోయారు. రూతు అనే సహోదరి ఇలా గుర్తుచేసుకుంటుంది, “కొంతమంది మాతోపాటు క్యాంపుకు వచ్చారు. కానీ ఆ క్యాంపులో సౌకర్యవంతమైన జీవితం లేకపోవడంతో వాళ్లు రాజకీయ పార్టీలో చేరి, ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.” కానీ చాలామంది దేవుని ప్రజలు అలా చేయరు. వాళ్లు తమ డబ్బును, తమ దగ్గరున్న వాటన్నిటినీ పోగొట్టుకోవాల్సి వచ్చినా ఎవ్వరి పక్షం వహించకుండా ఉంటారు.—హెబ్రీ. 10:34.

12, 13. (ఎ) మనుషులందర్నీ యెహోవా ఎలా చూస్తున్నాడు? (బి) మన దేశమే గొప్పదనే గర్వం మనలో మొదలైతే, దాన్ని ఎలా గుర్తించవచ్చు?

12 గొప్పలకు పోవడం. సాధారణంగా ప్రజలు తమ జాతి, తెగ, సంస్కృతి, ఊరు, దేశం గురించి గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఒక వ్యక్తి లేదా ఒక గుంపు, మరో వ్యక్తి లేదా మరో గుంపుకన్నా గొప్పని యెహోవా అనుకోడు. ఆయనకు మనందరం సమానమే. నిజమే, యెహోవా మనందరినీ ఒకేలా చేయలేదు, ఆ వైవిధ్యాన్ని మనం ఆస్వాదించాలి, గౌరవించాలి. మన సంస్కృతిని విడిచిపెట్టాలని యెహోవా కోరుకోవట్లేదు, అంతేకాదు మనం ఇతరులకన్నా గొప్పవాళ్లమని అనుకోవాలని కూడా ఆయన కోరుకోవట్లేదు.—రోమా. 10:12.

13 అన్నిటికన్నా మన దేశం లేదా మన జాతే గొప్పదని ఎన్నడూ గర్వపడకూడదు. ఒకవేళ మనం అలా భావిస్తే, ఎవ్వరి పక్షం వహించకుండా ఉండలేం. మొదటి శతాబ్దంలో ఇలాగే జరిగింది. కొంతమంది హెబ్రీ సహోదరులు గ్రీసు దేశ విధవరాళ్లను సరిగ్గా చూడలేదు. (అపొ. 6:1) మనలో అలాంటి గర్వం మొదలైతే, దాన్ని ఎలా గుర్తించవచ్చు? ఒకవేళ వేరే ప్రాంతం సహోదరుడు లేదా సహోదరి మీకు ఒక సలహా ఇస్తే, మీరు వెంటనే ‘మేం ఇక్కడ ఇంకా బాగా చేస్తాం’ అని అనుకొని ఆ సలహాను కొట్టిపారేస్తారా? ఒకవేళ మీరలా ఆలోచిస్తుంటే, బైబిలు ఇస్తున్న ఈ ప్రాముఖ్యమైన సలహాను గుర్తుపెట్టుకోండి, ‘వినయ మనస్సుగలవారై ఒకనినొకడు తనకంటె యోగ్యుడని ఎంచుడి.’—ఫిలి. 2:3.

యెహోవా మీకు సహాయం చేస్తాడు

14. ప్రార్థన మనకు ఎలా సహాయం చేస్తుంది? బైబిల్లో ఉన్న ఏ ఉదాహరణ దాని గురించి చెప్తుంది?

14 ఎవ్వరి పక్షం వహించకుండా ఉండడానికి మూడవ మార్గం ఏమిటంటే, యెహోవా మీద ఆధారపడడం. దేవుని పవిత్రశక్తి కోసం ప్రార్థించండి. అది మీకు ఓర్పును, ఆశానిగ్రహాన్ని ఇస్తుంది. అంతేకాదు ప్రభుత్వం మీ విషయంలో అన్యాయంగా ప్రవర్తించినప్పుడు కూడా ఈ లక్షణాలు మీకు సహాయపడతాయి. ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని యెహోవా పక్షాన నిలబడకుండా చేస్తాయో గుర్తించే జ్ఞానాన్ని ఇవ్వమని యెహోవాను అడగండి. అలాంటి సమయాల్లో సరైనది చేసేలా సహాయం చేయమని ఆయనకు ప్రార్థించండి. (యాకో. 1:5) అయితే మీరు యెహోవాకు నమ్మకంగా ఉన్నందుకు, మిమ్మల్ని జైల్లో వేయవచ్చు లేదా ఏదోక శిక్ష వేయవచ్చు. ఒకవేళ అలా జరిగితే, మీరు మానవ ప్రభుత్వాల పక్షాన ఉండకపోవడానికి గల కారణాన్ని ఇతరులకు స్పష్టంగా వివరించేందుకు కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించండి. ఆ పరిస్థితిని తట్టుకునేలా యెహోవా మీకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండండి.—అపొస్తలుల కార్యములు 4:27-31 చదవండి.

15. ఎవ్వరి పక్షం వహించకుండా ఉండేందుకు బైబిలు మనకెలా సహాయం చేస్తుంది? (“ఎవ్వరి పక్షం వహించకుండా ఉండేందుకు బైబిలు వాళ్లకు సహాయం చేసింది” అనే బాక్స్‌ కూడా చూడండి.)

15 యెహోవా మనల్ని బలపర్చడానికి బైబిల్ని ఇచ్చాడు. మీరు ఎవ్వరి పక్షం వహించకుండా ఉండేందుకు సహాయం చేసే వచనాల గురించి లోతుగా ఆలోచించండి. వాటిని చదివి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీ దగ్గర బైబిలు లేనప్పుడు అవి మీకు సహాయపడతాయి. అంతేకాదు, భవిష్యత్తు గురించి యెహోవా చెప్తున్న వాటిపై మీ నిరీక్షణను కూడా బైబిలు బలపరుస్తుంది. హింసల్ని సహించాలంటే మనకు ఈ నిరీక్షణ అవసరం. (రోమా. 8:25) కొత్తలోకంలో నెరవేరాలని మీరు ఎదురుచూస్తున్న వాటికి సంబంధించిన లేఖనాలను ఎంపిక చేసుకొని, ఆ కొత్తలోకంలో మీరు ఉన్నట్టు ఊహించుకోండి.

యెహోవా నమ్మకమైన సేవకుల ఉదాహరణలు సహాయం చేస్తాయి

16, 17. ఎవ్వరి పక్షం వహించకుండా నమ్మకంగా ఉన్న కొంతమంది దేవుని సేవకుల ఉదాహరణలను నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

16 మనం ఎవ్వరి పక్షం వహించకుండా ఉండడానికి సహాయం చేసే నాలుగవ మార్గం ఏమిటంటే, యెహోవా నమ్మకమైన సేవకుల గురించి ఆలోచించడం. బైబిలు కాలాల్లో చాలామంది ధైర్యం చూపించారు, ఎవ్వరి పక్షం వహించకుండా ఉండేందుకు సహాయం చేసే తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు. బబులోను ప్రభుత్వానికి గుర్తుగా ఉన్న ఒక పెద్ద విగ్రహాన్ని ఆరాధించం అని ధైర్యంగా చెప్పిన షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గుర్తుచేసుకోండి. (దానియేలు 3:16-18 చదవండి.) బైబిల్లో ఉన్న ఈ వృత్తాంతం, నేడు చాలామంది యెహోవాసాక్షులు తమ దేశ జెండాను ఆరాధించకుండా ఉండేందుకు కావాల్సిన ధైర్యాన్ని ఇస్తోంది. ప్రజల మధ్య ఐక్యతను పాడుచేసే రాజకీయాల్లో, మరితర విషయాల్లో యేసు కూడా తలదూర్చలేదు. తనను చూసి తన శిష్యులు కూడా నేర్చుకుంటారని యేసుకు తెలుసు. “ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను” అని ఆయన అన్నాడు.—యోహా. 16:33.

17 మన కాలంలోని చాలామంది యెహోవాసాక్షులు ఎవ్వరి పక్షం వహించకుండా ఉండగలిగారు. దానివల్ల వాళ్లలో కొంతమందిని చిత్రహింసలు పెట్టారు, జైల్లో వేశారు. అంతేకాదు యెహోవాకు నమ్మకంగా ఉన్నందుకు వాళ్లను చంపేశారు కూడా. వాళ్ల అనుభవాలను చూసి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. టర్కీలోని ఒక సహోదరుడు ఏం చెప్తున్నాడంటే, “హిట్లర్‌ సైన్యంలో చేరడానికి నిరాకరించినందుకు ఫ్రాంట్స్‌ రీటర్‌ అనే యువ సహోదరుడిని చంపేశారు. ఆ సహోదరుడు చనిపోవడానికి ముందు రాత్రి వాళ్ల అమ్మకు రాసిన ఉత్తరంలో అతనికి యెహోవాపై ఉన్న గొప్ప విశ్వాసం, నమ్మకం కనిపించాయి. ఒకవేళ నాకూ అలాంటి పరీక్ష ఎదురైతే, నేను అతనిలాగే ఉండాలనుకుంటున్నాను.” [2]

18, 19. (ఎ) ఎవ్వరి పక్షం వహించకుండా ఉండడానికి సంఘంలోని సహోదరసహోదరీలు మనకెలా సహాయం చేస్తారు? (బి) మీరు ఏమని నిర్ణయించుకున్నారు?

18 మీరు ఎవ్వరి పక్షం వహించకుండా ఉండడానికి మీ సంఘంలోని సహోదరసహోదరీలు సహాయం చేయగలరు. మీరు కష్టంలో ఉన్నప్పుడు సంఘపెద్దలకు చెప్పండి. వాళ్లు బైబిలు నుండి మంచి సలహా ఇస్తారు. అలాగే మీ సంఘంలోని వాళ్లకు కూడా మీ పరిస్థితి తెలిసినప్పుడు వాళ్లు మీకు సహాయం చేస్తారు. మీ గురించి ప్రార్థన చేయమని వాళ్లను అడగండి. మీరు కూడా వాళ్లకోసం ప్రార్థన చేయండి. (మత్త. 7:12) రాజకీయాల్లో, యుద్ధాల్లో పాల్గొననందుకు జైల్లో ఉన్న సహోదరుల్లో ఎవరి గురించైనా మీకు తెలిసినా లేదా విన్నా వాళ్ల గురించి పేరుపేరున ప్రార్థించండి. ఆ సహోదరసహోదరీలు ధైర్యంగా ఉంటూ, నమ్మకంగా ఉండేలా సహాయం చేయమని యెహోవాను అడగండి.—ఎఫె. 6:19, 20.

19 అంతానికి మరింత దగ్గరౌతుండగా, తమ పక్షం వహించమని ప్రభుత్వాలు మనపై మరింత ఒత్తిడి తీసుకురావచ్చు. అందుకే, ఐక్యతలేని ఈ లోకంలో ఎవ్వరి పక్షం వహించకుండా ఉండడానికి ఇప్పుడే సిద్ధపడాలని నిర్ణయించుకుందాం.

^ [1] (1వ పేరా) యేసు మానవ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కైసరు అనే పదాన్ని ఉపయోగించాడు. ఆ కాలంలో, కైసరు ఒక పరిపాలకుడే కాదు, ఉన్నతమైన మానవ అధికారి కూడా.

^ [2] (17వ పేరా) జెహోవాస్‌ విట్నెసెస్‌—ప్రొక్లెయిమర్స్‌ ఆఫ్‌ గాడ్స్‌ కింగ్‌డమ్‌, 662వ పేజీ, అలాగే గాడ్స్‌ కింగ్‌డమ్‌ రూల్స్‌! అనే పుస్తకంలో 150వ పేజీలో ఉన్న “హీ డైడ్‌ ఫర్‌ గాడ్స్‌ ఆనర్‌” అనే బాక్స్‌ చూడండి.