కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ఆరాధన కోసం ఎందుకు కలుసుకోవాలి?

మనం ఆరాధన కోసం ఎందుకు కలుసుకోవాలి?

‘వీరు సహవాసమందును ఎడతెగక యుండిరి.’అపొ. 2:42.

పాటలు: 20, 34

1-3. (ఎ) ఆరాధన కోసం కలుసుకోవడాన్ని ప్రాముఖ్యంగా ఎంచుతున్నామని క్రైస్తవులు ఎలా చూపించారు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) ఈ ఆర్టికల్‌లో మనమేం చర్చిస్తాం?

 కోరినా అనే అమ్మాయికి 17 ఏళ్లున్నప్పుడు, వాళ్ల అమ్మను అరెస్టు చేసి దూరంలో ఉన్న ఓ లేబర్‌ క్యాంపులో వేశారు.ఆ తర్వాత కొంతకాలానికి కోరినాను కూడా వాళ్ల ఇంటికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియాకు తీసుకెళ్లిపోయారు. అక్కడ ఆమెతో ఓ పొలంలో పనిచేయించి, బానిసలా చూసేవాళ్లు. కొన్నిసార్లయితే ఎముకలు కొరికే చలిలో పని చేయించేవాళ్లు, చలిని తట్టుకునేందుకు సరిపోయే బట్టలు కూడా ఆమెకు ఉండేవికావు. పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ కోరినా, మరో సహోదరి మాత్రం ఎలాగైనా సంఘంలో జరిగే మీటింగ్స్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

2 కోరినా ఇలా చెప్పింది, “మేము సాయంత్రం పొలం నుండి వచ్చేసి, 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వేస్టేషన్‌కు నడిచివెళ్లాం. ట్రైన్‌ ఉదయం రెండు గంటలకు బయల్దేరింది, ఆరు గంటలు ప్రయాణించాక మేం దిగి మరో 10 కిలోమీటర్లు నడిచి మీటింగ్స్‌ జరిగే చోటుకు వెళ్లాం.” మీటింగ్స్‌కు వెళ్లినందుకు కోరినా చాలా సంతోషించింది. ఆమె ఇలా చెప్పింది, “మీటింగ్‌లో కావలికోట అధ్యయనంలో పాల్గొన్నాం, రాజ్యగీతాలు పాడాం. అది మాలో ఉత్సాహాన్ని నింపి, మా విశ్వాసాన్ని బలపర్చింది.” మూడు రోజుల తర్వాత ఆ ఇద్దరు సహోదరీలు తిరిగి పొలానికి వెళ్లారు. కానీ వాళ్లు బయటికి వెళ్లారనే సంగతే వాళ్ల యజమాని గమనించలేదు.

3 ప్రాచీనకాలం నుండి యెహోవా ప్రజలు, తాము కలుసుకునే సందర్భాలను ఎల్లప్పుడూ చాలా ప్రాముఖ్యంగా ఎంచారు. ఉదాహరణకు, తొలి క్రైస్తవులు యెహోవాను ఆరాధించడానికి, ఆయన గురించి నేర్చుకోవడానికి ఒకచోట క్రమంగా కలుసుకునేవాళ్లు. (అపొ. 2:42) నిజానికి, మీరు కూడా మీటింగ్స్‌కు క్రమంగా వెళ్లాలని అనుకుంటారు. కానీ అలా క్రమంగా వెళ్లే విషయంలో క్రైస్తవులందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహుశా మీరు ఉద్యోగస్థలంలో ఎన్నో గంటలు పనిచేయాల్సి రావచ్చు లేదా చేయాల్సిన పని ఎంతో ఉండవచ్చు లేదా మీకెప్పుడూ అలసటగా అనిపించవచ్చు. కానీ ఏదేమైనాసరే మీటింగ్స్‌కు క్రమంగా వెళ్లేందుకు మనకేది సహాయం చేస్తుంది? [1] మీటింగ్స్‌కు క్రమంగా రమ్మని మనం స్టడీ ఇచ్చేవాళ్లను, వేరేవాళ్లను ఎలా ప్రోత్సహించవచ్చు? మీటింగ్స్‌కు వెళ్లడం ద్వారా (1) మనమెలా ప్రయోజనం పొందుతామో, (2) ఇతరులకు ఎలా సహాయం చేయగలుగుతామో, (3) యెహోవాను ఎలా సంతోషపెట్టగలుగుతామో ఈ ఆర్టకల్‌లో నేర్చుకుంటాం. [2]

మనం ప్రయోజనం పొందుతాం

4. యెహోవా గురించి మరింత ఎక్కువ నేర్చుకోవడానికి మీటింగ్స్‌ మనకెలా సహాయం చేస్తాయి?

4 మీటింగ్స్‌లో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. మనం ప్రతీ మీటింగ్‌లో యెహోవా గురించి మరిన్ని విషయాలు నేర్చుకుంటాం. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో, చాలా సంఘాల్లో యెహోవాకు సన్నిహితమవండి అనే పుస్తకాన్ని సంఘ బైబిలు అధ్యయనంలో చర్చించారు. యెహోవా లక్షణాల గురించి చర్చించుకుంటున్నప్పుడు, ఆయన గురించి మీ తోటి సహోదరసహోదరీల భావాలు విన్నప్పుడు మీకెలా అనిపించింది? అది ఖచ్చితంగా యెహోవాపై మీకున్న ప్రేమను మరింత పెంచివుంటుంది. మీటింగ్స్‌లో ప్రసంగాల్ని, బైబిలు పఠనాన్ని శ్రద్ధగా వినడం ద్వారా, ప్రదర్శనలను చూడడం ద్వారా కూడా మనం బైబిలు గురించి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. (నెహె. 8:8) అంతేకాదు ప్రతీవారం బైబిలు పఠనానికి సిద్ధపడుతున్నప్పుడు, వాటిని మీటింగ్స్‌లో వింటున్నప్పుడు మనమెన్ని విలువైన విషయాలు నేర్చుకుంటామో ఆలోచించండి.

5. బైబిలు సూత్రాల్ని మీ జీవితంలో పాటించడానికి, పరిచర్యను ఇంకా బాగా చేయడానికి మీటింగ్స్‌ మీకెలా సహాయం చేశాయి?

5 బైబిల్లో మనం నేర్చుకున్న వాటిని మన జీవితాల్లో ఎలా పాటించాలో మీటింగ్స్‌లో నేర్చుకుంటాం. (1 థెస్స. 4:9-12) ఉదాహరణకు కావలికోట అధ్యయనాన్ని చూస్తే, అది ముఖ్యంగా దేవుని ప్రజల అవసరాలకు తగట్లుగా ఉంటుంది.ఏదైనా కావలికోట అధ్యయనం, మిమ్మల్ని యెహోవా సేవ మరింత ఎక్కువగా చేసేలా, ప్రార్థనల్ని ఇంకా బాగా ఎలా చేయాలో నేర్చుకునేలా, తోటి సహోదరుణ్ణి లేదా సహోదరిని క్షమించేలా ప్రోత్సహించిందా? వారం మధ్యలో జరిగే కూటం, సువార్త ఎలా ప్రకటించాలో అలాగే బైబిలు సత్యాన్ని అర్థంచేసుకునేలా ఇతరులకు ఎలా బోధించాలో మనకు నేర్పిస్తుంది.—మత్త. 28:19, 20.

6. మీటింగ్స్‌ ఎలా మనల్ని ప్రోత్సహించి, బలపరుస్తాయి?

6 మీటింగ్స్‌లో మనం ప్రోత్సాహం పొందుతాం. మన విశ్వాసం తగ్గిపోయేలా చేయాలని, మనం ఆందోళనపడేలా చేయాలని, నిరుత్సాహపడేలా చేయాలని సాతాను లోకం ప్రయత్నిస్తుంది. కానీ మీటింగ్స్‌ మనల్ని ప్రోత్సహించి, యెహోవాను సేవించడానికి కావాల్సిన బలాన్ని ఇస్తాయి. (అపొస్తలుల కార్యములు 15:30-32 చదవండి.) అంతేకాదు బైబిల్లోని ప్రవచనాలు ఎలా నెరవేరాయో మనం చాలా మీటింగ్స్‌లో చర్చించుకుంటాం. వాటివల్ల, భవిష్యత్తు విషయంలో యెహోవా చేసిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరతాయని మరింత బలంగా నమ్మగలుగుతాం. మన సహోదరసహోదరీలు కేవలం ప్రసంగాలు ఇచ్చినప్పుడే కాదు, కామెంట్స్‌ చెప్పినప్పుడు, రాజ్యగీతాలను మనసారా పాడుతూ యెహోవాను స్తుతించినప్పుడు కూడా మనల్ని ప్రోత్సహిస్తారు. (1 కొరిం. 14:26) అంతేకాదు మీటింగ్‌కు ముందు, మీటింగ్‌ తర్వాత వాళ్లతో మాట్లాడినప్పుడు మనమీద శ్రద్ధ చూపే స్నేహితులు ఉన్నారనే భావన కలిగి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.—1 కొరిం. 16:17, 18.

7. మీటింగ్స్‌కు వెళ్లడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

7 మీటింగ్స్‌లో దేవుని పవిత్రశక్తి మనపై పనిచేస్తుంది. సంఘాల్ని నడిపించడానికి యేసు ఈ పవిత్రశక్తినే ఉపయోగిస్తాడు. నిజానికి, ‘ఆత్మ సంఘాలతో చెప్పేమాటను వినాలని’ ఆయన మనకు చెప్పాడు. (ప్రక. 2:7) శోధనల్ని ఎదిరించడానికి, ధైర్యంగా ప్రకటించడానికి పవిత్రశక్తి మనకు సహాయం చేస్తుంది. అంతేకాదు మంచి నిర్ణయాలు తీసుకునేందుకు కూడా అది మనకు సహాయపడుతుంది. కాబట్టి మనం దేవుని పవిత్రశక్తి సహాయాన్ని పొందాలంటే, మీటింగ్స్‌కు హాజరవ్వడానికి చేయగలిగినదంతా చేయాలి.

ఇతరులకు సహాయం చేయగలుగుతాం

8. మనం మీటింగ్స్‌కు రావడం, కామెంట్స్‌ చెప్పడం, రాజ్యగీతాలు పాడడంవల్ల తోటి సహోదరసహోదరీలు ఎలా ప్రయోజనం పొందుతారు? (“మీటింగ్స్‌కు వెళ్లొచ్చిన ప్రతీసారి అతనికి ప్రశాంతంగా అనిపిస్తుంది” అనే బాక్సు కూడా చూడండి.)

8 తోటి సహోదరసహోదరీల్ని ప్రేమిస్తున్నామని చూపించేందుకు మీటింగ్స్‌లో మనకు ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. మన సంఘంలో చాలామంది పెద్దపెద్ద సమస్యలతో పోరాడుతున్నారు. మనం ఒకరి గురించి ఒకరం ‘ఆలోచించుకోవాలని’ అపొస్తలుడైన పౌలు రాశాడు. (హెబ్రీ. 10:24, 25) కాబట్టి ఒకర్నొకరు ప్రోత్సహించుకోవడం కోసం కలుసుకోవడం ద్వారా మనకు తోటి విశ్వాసులపట్ల శ్రద్ధ ఉందని చూపించవచ్చు. మీటింగ్స్‌కు వెళ్లడం ద్వారా, మనం తోటి సహోదరసహోదరీలతో ఉండాలనీ, వాళ్లతో మాట్లాడాలనీ, వాళ్ల బాగోగుల్ని తెలుసుకోవాలనీ కోరుకుంటున్నట్లు చూపిస్తాం. అంతేకాదు మనం చెప్పే కామెంట్స్‌ను, మనసారా పాడే పాటలను విన్నప్పుడు సంఘంలోని వాళ్లు ప్రోత్సాహం పొందుతారు.—కొలొ. 3:16.

9, 10. (ఎ) యోహాను 10:16లో యేసు చెప్పిన మాటలు, మనం మీటింగ్స్‌కు వెళ్లడం ప్రాముఖ్యమని అర్థంచేసుకోవడానికి ఎలా సహాయం చేస్తాయి? (బి) మనం మీటింగ్స్‌కు క్రమంగా వెళ్లడం ద్వారా సాక్షులుకాని కుటుంబసభ్యులు ఉన్నవాళ్లు ఎలా ప్రయోజనం పొందుతారు?

9 మనం మీటింగ్స్‌కు వెళ్లడం ద్వారా సంఘం ఐక్యంగా ఉండడానికి సహాయం చేసినవాళ్లమౌతాం. (యోహాను 10:16 చదవండి.) యేసు తనను కాపరితో పోల్చుకుని, తన అనుచరుల్ని గొర్రెల మందతో పోల్చాడు. దీని గురించి ఆలోచించండి: రెండు గొర్రెలు కొండపైన, మరో రెండు గొర్రెలు లోయలో, ఇంకొక గొర్రె ఇంకెక్కడో ఉంటే ఆ ఐదు గొర్రెలు మందగా ఉన్నాయని అంటామా? అనం కదా! ఎందుకంటే మందగా ఉండే గొర్రెలు కలిసి ఉంటాయి, కాపరి వెంట వెళ్తాయి. అదేవిధంగా, మనం మీటింగ్స్‌ మానేసి సహోదరసహోదరీలకు దూరంగా ఉంటే మన కాపరిని అనుసరించలేం. కాబట్టి మనం ఒక్కమందగా ఉంటూ ఒకే కాపరిని అనుసరించాలంటే మీటింగ్స్‌కు తప్పనిసరిగా వెళ్లాలి.

10 మనమంతా ఒకే కుటుంబంగా ప్రేమగా ఉండడానికి మీటింగ్స్‌ సహాయం చేస్తాయి. (కీర్త. 133:1) సత్యం తెలుసుకోవడం వల్ల కొంతమంది తమ తల్లిదండ్రులకు, తోబుట్టువులకు దూరమయ్యారు. కానీ వాళ్లను ప్రేమించే, వాళ్ల బాగోగుల్ని చూసుకునే ఓ కుటుంబాన్ని ఇస్తానని యేసు వాళ్లకు మాటిచ్చాడు. (మార్కు 10:29, 30) ఒకవేళ మీరు మీటింగ్స్‌కు క్రమంగా వెళ్తే సంఘంలో ఎవరో ఒకరికి ఓ తండ్రిలా, తల్లిలా, సహోదరిలా లేదా సహోదరునిలా అండగా ఉండగలుగుతారు. ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు, ఎలాగైనా మీటింగ్స్‌కు మానకుండా వెళ్లాలనే ప్రోత్సాహం మనలో కలుగుతుంది.

యెహోవాను సంతోషపెడతాం

11. యెహోవాకు చెందాల్సినవి ఆయనకు ఇవ్వడానికి మీటింగ్స్‌ మనకెలా సహాయం చేస్తాయి?

11 మీటింగ్స్‌లో యెహోవాకు చెందాల్సినవి ఆయనకు ఇస్తాం. యెహోవా మన సృష్టికర్త కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి, ఆయన్ని ఘనపర్చాలి, స్తుతించాలి. (ప్రకటన 7:11, 12 చదవండి.) మీటింగ్స్‌లో ప్రార్థించడం ద్వారా, పాడడం ద్వారా, యెహోవా గురించి చెప్పడం ద్వారా మనం ఆయనకు చెందాల్సినవి ఇస్తాం. యెహోవాను ఆరాధించడానికి మనకు ప్రతీవారం ఎంత మంచి అవకాశం ఉందో కదా!

12. మీటింగ్స్‌కు వెళ్లమని తాను ఇచ్చిన ఆజ్ఞను మనం పాటించినప్పుడు యెహోవా ఎలా భావిస్తాడు?

12 యెహోవాయే మనల్ని సృష్టించాడు కాబట్టి మనం ఆయన మాట వినాలి. మనం సమకూడుతూ ఉండాలని ఆయన ఆజ్ఞాపించాడు. మరిముఖ్యంగా అంతం దగ్గరయ్యేకొద్దీ మనమలా చేయాలని ఆయన చెప్పాడు. మనం ఆ ఆజ్ఞను పాటించినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. (1 యోహా. 3:22) అంతేకాదు, ప్రతీ మీటింగ్‌కు వెళ్లడానికి మనం చేసే కృషిని ఆయన గమనిస్తాడు, దాన్ని విలువైనదిగా ఎంచుతాడు.—హెబ్రీ. 6:10.

13, 14. మీటింగ్స్‌లో మనం ఏవిధంగా యెహోవాకూ, యేసుకూ దగ్గరౌతాం?

13 మీటింగ్స్‌కు వెళ్లడం ద్వారా, మనం యెహోవాకూ ఆయన కుమారునికీ దగ్గరవ్వాలని కోరుకుంటున్నట్లు చూపిస్తాం. మనమేమి చేయాలో, ఎలా జీవించాలో యెహోవా మనకు బైబిలు ద్వారా మీటింగ్స్‌లో నేర్పిస్తాడు. (యెష. 30:20, 21) చివరికి మన మీటింగ్స్‌కు వచ్చే సాక్షులుకానివాళ్లు కూడా దేవుడే మనల్ని నడిపిస్తున్నాడని గ్రహిస్తారు. (1 కొరిం. 14:23-25) అవును, యెహోవా తన పవిత్రశక్తి ద్వారా మన మీటింగ్స్‌ని నడిపిస్తున్నాడు. అక్కడ యెహోవాయే మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం మీటింగ్స్‌కి వెళ్లినప్పుడు యెహోవా చెప్పే వాటిని వింటాం, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకుంటాం, ఆయనకు మరింత దగ్గరౌతాం.

14 సంఘ శిరస్సైన యేసు ఇలా చెప్పాడు, “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును.” (మత్త. 18:20) అంతేకాదు యేసు సంఘాలమధ్య ‘సంచరిస్తాడని’ బైబిలు చెప్తుంది. (ప్రక. 1:19–2:1) ఖచ్చితంగా యెహోవా, యేసు మనతో ఉంటూ మీటింగ్స్‌లో మనల్ని బలపరుస్తున్నారు. తనకూ, తన కుమారునికీ దగ్గరవ్వడానికి మీరు చేయగలిగినదంతా చేయడం చూసినప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు?

15. మనం తనకు లోబడాలనుకుంటున్నామని మీటింగ్స్‌కు వెళ్లడం ద్వారా యెహోవాకు ఎలా చూపిస్తాం?

15 మీటింగ్స్‌కు వెళ్లడం ద్వారా, మనం దేవుని సర్వాధిపత్యాన్ని సమర్థిస్తున్నామని చూపిస్తాం. తాను చెప్పినట్లు చేయాలని యెహోవా మనల్ని బలవంతపెట్టడు. (యెష. 43:23) కాబట్టి ఆయన ఆజ్ఞను పాటించాలని మనమే స్వయంగా నిర్ణయించుకున్నప్పుడు, మనం ఆయన్ను ప్రేమిస్తున్నామనీ, మనమేమి చేయాలో చెప్పే హక్కు ఆయనకుందని నమ్ముతున్నామనీ చూపిస్తాం. (రోమా. 6:17) ఉదాహరణకు, మీటింగ్స్‌ మానేసే పరిస్థితి వచ్చేలా ఇంకా ఎక్కువ గంటలు పనిచేయాలని మన బాస్‌ మనకు చెప్పవచ్చు. లేదా ఎవరైనా మీటింగ్స్‌కి వెళ్తే జరిమానా కట్టాలనీ లేదా జైల్లో వేస్తామనీ లేదా ఘోరమైన శిక్ష విధిస్తామనీ మనం ఉంటున్న దేశంలోని ప్రభుత్వం చెప్పవచ్చు. లేకపోతే కొన్నిసార్లు మనకు మీటింగ్స్‌ మానేసి ఇంకేదైనా చేయాలనిపించవచ్చు. ఇలాంటి సందర్భాలన్నిటిలో ఏం చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ యెహోవా మనకిచ్చాడు. (అపొ. 5:29) అయితే ఆయన మాట వినాలని నిర్ణయించుకునే ప్రతీసారి మనం యెహోవాను సంతోషపెడతాం.—సామె. 27:11.

సహోదరసహోదరీలతో కలిసి సమకూడుతూ ఉండండి

16, 17. (ఎ) మీటింగ్స్‌కు వెళ్లడాన్ని తొలి క్రైస్తవులు చాలా ప్రాముఖ్యంగా ఎంచారని మనకెలా తెలుసు? (బి) మీటింగ్స్‌ గురించి సహోదరుడు జార్జ్‌ గ్యాంగస్‌ ఎలా భావించేవాడు?

16 సా.శ. 33 పెంతెకొస్తు రోజున సమకూడినప్పటి నుండి, క్రైస్తవులు యెహోవాను ఆరాధించడానికి క్రమంగా కలుసుకునేవాళ్లు. “వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును . . . ఎడతెగక యుండిరి” అని బైబిలు చెప్తుంది. (అపొ. 2:42) చివరికి రోమా ప్రభుత్వం అలాగే యూదా మతనాయకులు వాళ్లను హింసించినప్పుడు కూడా వాళ్లు సమకూడడం మానలేదు. క్రమంగా సమకూడడం అంత తేలిక కాకపోయినా, అలా సమకూడడానికి క్రైస్తవులు చేయగలిగినదంతా చేశారు.

17 నేడు కూడా, దేవుని సేవకులు మీటింగ్స్‌ పట్ల కృతజ్ఞత చూపిస్తూ, వాటికి హాజరవడానికి సంతోషిస్తున్నారు. 22 కన్నా ఎక్కువ ఏళ్లపాటు పరిపాలక సభ సభ్యునిగా సేవచేసిన జార్జ్‌ గ్యాంగస్‌ అనే సహోదరుడు ఇలా చెప్పాడు, “నావరకైతే, సహోదరుల్ని కలవడం జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రాజ్యమందిరానికి అందరికన్నా ముందు వచ్చి, వీలైతే అందరికన్నా చివరన వెళ్లడం నాకు చాలా ఇష్టం. దేవుని ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు నాలో తెలియని ఆనందం కలుగుతుంది. వాళ్లతో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక పరదైసులో నా కుటుంబసభ్యులతో కలిసి ఉన్నట్లు అనిపిస్తుంది. దిక్సూచి ఎప్పుడూ ఉత్తర దిక్కునే చూపించినట్లు, నా మనసులో, హృదయంలో ఎప్పుడూ ఉండే కోరిక మీటింగ్స్‌కు వెళ్లడమే.”

18. మీటింగ్స్‌ విషయంలో మీ అభిప్రాయమేమిటి? మీరేమని నిర్ణయించుకున్నారు?

18 యెహోవాను ఆరాధించడానికి సమకూడే విషయంలో మీ అభిప్రాయం కూడా అదేనా? అలాగైతే మీ సహోదరులతో కలిసి మీటింగ్స్‌ను ఆనందించడానికి చేయగలిగినదంతా చేస్తూ ఉండండి. అలాచేయడం కష్టమైనప్పటికీ పట్టువిడవకండి. ‘యెహోవా, నీ నివాసమందిరమును నేను ప్రేమించుచున్నాను’ అని చెప్పిన రాజైన దావీదులాగే మీరు కూడా మనస్ఫూర్తిగా భావిస్తున్నారని యెహోవాకు చూపించండి.—కీర్త. 26:8.

^ [1] (3వ పేరా) మన సహోదరసహోదరీల్లో కొంతమంది, తీవ్రమైన అనారోగ్యంవల్ల లేదా అలాంటి మరితర సమస్యలవల్ల మీటింగ్స్‌కు క్రమంగా వెళ్లలేరు. అయినాసరే యెహోవా వాళ్ల పరిస్థితిని అర్థంచేసుకుంటాడనీ, ఆయన్ను ఆరాధించడం కోసం వాళ్లు చేసేదాన్ని చాలా విలువైనదిగా చూస్తాడనీ పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. అలాంటివాళ్లు మీటింగ్స్‌ను వినేందుకు కావాల్సిన ఏర్పాట్లు సంఘపెద్దలు చేయవచ్చు. అంటే టెలిఫోన్‌ ద్వారా వినిపించడం లేదా వాళ్లకోసం మీటింగ్‌ మొత్తం రికార్డు చేయడం లాంటివి చేయవచ్చు.

^ [2] (3వ పేరా) “మీటింగ్స్‌కు వెళ్లేందుకు కారణాలు” అనే బాక్సు చూడండి.