కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ ఊహాశక్తిని జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తున్నారా?

మీ ఊహాశక్తిని జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తున్నారా?

కేవలం 1.4 కిలోల బరువు ఉండి, “విశ్వంలో ఇప్పటివరకు కనుగొన్న వాటన్నిటిలో అత్యంత సంక్లిష్టమైనది” అని పిలువబడుతున్నది ఏంటి? అదే మనిషి మెదడు. అవును, అది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దానిగురించి మనం ఎంతెక్కువ తెలుసుకుంటే, యెహోవా చేసిన ‘ఆశ్చర్యకార్యాల’ మీద అంతెక్కువ కృతజ్ఞత కలిగివుంటాం. (కీర్త. 139:14) మన మెదడుకున్న ఎన్నో సామర్థ్యాల్లో ఒకటైన ఊహాశక్తిని ఇప్పుడు పరిశీలిద్దాం.

ఊహాశక్తి అంటే ఏమిటి? “ఆసక్తి కలిగించే కొత్త వస్తువుల గురించి లేదా మీరు ఇంతవరకు చూడని విషయాల గురించి మీ మనసులో చిత్రాల్ని లేదా ఆలోచనల్ని కలిగేలా చేసే సామర్థ్యమే” ఊహాశక్తి అని ఓ డిక్షనరీ నిర్వచిస్తుంది. దీన్నిబట్టి మీరు మీ ఊహాశక్తిని తరచుగా ఉపయోగిస్తుంటారని ఒప్పుకుంటారు. ఉదాహరణకు, మీరు ఇప్పటివరకు వెళ్లని ఓ ప్రదేశం గురించి విన్నప్పుడు లేదా చదివినప్పుడు మీరు దాన్ని మీ మనసులో చిత్రీకరించుకోలేదా? నిజానికి మనం చూడలేని, వినలేని, రుచిచూడలేని, ముట్టుకోలేని లేదా వాసన చూడలేని వాటిగురించి ఆలోచిస్తున్నప్పుడల్లా మన ఊహాశక్తిని ఉపయోగిస్తున్నట్టే.

దేవుడు మనుషుల్ని తన పోలికలో చేశాడని అర్థంచేసుకోవడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది. (ఆది. 1:26, 27) అంటే ఓ విధంగా యెహోవాకు కూడా ఊహాశక్తి ఉందని తెలుస్తుంది. ఆయన మనల్ని ఆ సామర్థ్యంతో సృష్టించాడు కాబట్టి తన చిత్తాన్ని తెలుసుకోవడానికి దాన్ని ఉపయోగించాలని కోరుకోవడంలో తప్పులేదు. (ప్రసం. 3:11) దానికోసం మన ఊహాశక్తిని ఎలా జ్ఞానయుక్తంగా ఉపయోగించవచ్చు? ఎలా ఉపయోగించకూడదు?

ఊహాశక్తిని అవివేకంగా ఉపయోగించడం

(1) కానిసమయంలో తప్పుడు విషయాల గురించి పగటి కలలు.

పగటి కలలు కనడంలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయనడానికి రుజువులు ఉన్నాయి. అయితే “ప్రతిదానికి సమయము కలదు” అని ప్రసంగి 3:1 చెప్తుంది. కాబట్టి కానిసమయంలో కూడా కొన్ని పనులు చేసే అవకాశం ఉంటుందని అర్థమౌతుంది. ఉదాహరణకు, మీటింగ్స్‌ జరుగుతున్నప్పుడు లేదా వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు మన మనసు ఎక్కడో తిరుగుతుంటే మన ఊహాశక్తి మనకు సహాయపడుతున్నట్టా లేదా నష్టాన్ని కలిగిస్తున్నట్టా? అనైతిక విషయాల్ని ఊహించుకుంటే, అంటే తప్పుడు ఆలోచనల్ని మనసులోకి రానిస్తే అవి ప్రమాదాలకు దారితీస్తాయని యేసు హెచ్చరించాడు. (మత్త. 5:28) అయితే మనం ఊహించుకునే కొన్ని విషయాలు యెహోవాను చాలా బాధపెడతాయి. అంతేకాదు అనైతిక ఊహలు మనం తప్పు చేయడానికి దారితీయగలవు. యెహోవా నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకునేలా మీ ఊహాశక్తిని ఎన్నడూ ఉపయోగించకూడదని నిశ్చయించుకోండి.

(2) వస్తు సంపదలు మీకు శాశ్వతమైన భద్రతను ఇస్తాయని అనుకోవడం.

డబ్బు, వస్తువులు మనకు అవసరమే, అవి ఉపయోగపడతాయి కూడా. కానీ అవి నిజమైన భద్రతను, సంతోషాన్ని ఇస్తాయని ఊహించుకోవడం మొదలుపెట్టినప్పుడు తప్పకుండా నిరుత్సాహపడతాం. జ్ఞానియైన సొలొమోను ఇలా రాశాడు, “ధనికుడి సంపద అతడికి బలమైన పట్టణంలాంటిది. అది తనకు ఎత్తయిన ప్రాకారం అనుకొంటాడు.” (సామె. 18:11, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఉదాహరణకు, సెప్టెంబరు 2009లో పెద్ద తుఫాను వచ్చినప్పుడు మనీలా, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలు 80 శాతం వరకు కొట్టుకుపోయాయి. అయితే, బాగా డబ్బున్నవాళ్లు దాన్ని తప్పించుకోగలిగారా? తుఫానువల్ల ఎంతో నష్టపోయిన ఓ ధనవంతుడు ఇలా చెప్తున్నాడు, “పేదవాళ్లకు, ధనవంతులకు కష్టాలూ బాధలూ తీసుకురావడం వల్ల తుఫాను అందర్నీ సమానం చేసింది.” డబ్బు, వస్తువులు నిజమైన రక్షణను, భద్రతను ఇస్తాయని ఊహించుకోవడం సులభమే. కానీ అది నిజం కాదు.

(3) ఎన్నటికీ జరగని వాటిగురించి అనవసరమైన ఆందోళన.

అతిగా “చింతింపకుడి” అని యేసు మనకు సలహా ఇచ్చాడు. (మత్త. 6:34) ఎప్పుడూ ఆందోళనపడేవాళ్లు ఎక్కువగా ఊహించుకుంటారు. లేని సమస్యల గురించి లేదా ఎప్పటికీ రాని సమస్యల గురించి ఊహించుకుని ఆందోళనపడితే ఎంతో శక్తి వృథా అవుతుంది. అలాంటి ఆందోళన నిరుత్సాహాన్ని కలిగిస్తుందనీ, చివరికి కృంగిపోయేలా చేస్తుందనీ బైబిలు చెప్తుంది. (సామె. 12:25) అతిగా చింతించకుండా, ఏ రోజు సమస్యల గురించి ఆ రోజు ఆలోచిస్తూ యేసు ఇచ్చిన సలహాను పాటించడం ఎంత ప్రాముఖ్యమో కదా.

ఊహాశక్తిని జ్ఞానయుక్తంగా ఉపయోగించడం

(1) ప్రమాదాలను ముందే పసిగట్టి తప్పించుకోవడం.

జ్ఞానయుక్తంగా ఉంటూ, ఏదైనా చేసే ముందు ఆలోచించాలని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (సామె. 22:3) మనం తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పర్యవసానాల్ని ముందే ఆలోచించడానికి మనకున్న ఊహాశక్తిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మిమ్మల్ని ఏదైనా పార్టీకి పిలిచారనుకోండి, దానికి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి మీ ఊహాశక్తిని ఎలా ఉపయోగించవచ్చు? ఆ పార్టీకి ఎవరెవర్ని పిలిచారు, ఎంతమంది వస్తున్నారు, అది ఎక్కడ-ఎప్పుడు జరుగుతుంది వంటి విషయాల్ని ముందు పరిశీలించండి. ఆ తర్వాత వీటి గురించి ఆలోచించండి: ఆ పార్టీలో ఏమి జరగవచ్చు? బైబిలు సూత్రాలకు తగ్గట్టుగా ఆ పార్టీ జరుగుతుందని మీరు ఊహించుకోగలుగుతున్నారా? ఈ ప్రశ్నలు ఆలోచించడం వల్ల, మీ మనసులో ఆ పార్టీని చిత్రీకరించుకోగలుగుతారు. మీకు ఆధ్యాత్మిక హాని కలగకుండా తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మీ ఊహాశక్తి సహాయం చేస్తుంది.

(2) కష్టమైన సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో మనసులో ప్రాక్టీసు చేసుకోవడం.

ఊహాశక్తికి “సమస్యను ఎదుర్కొని, దాన్ని పరిష్కరించగలిగే సామర్థ్యం” కూడా ఉంటుంది. ఉదాహరణకు, సంఘంలో ఎవరితోనైనా మీకు మనస్పర్థలు వచ్చాయనుకోండి. వాళ్లతో సమాధానపడడానికి మీరేమి చేస్తారు? దానికోసం మీరు చాలా విషయాల్ని ఆలోచించాలి. అతను లేదా ఆమె మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? సమస్య గురించి ఎప్పుడు మాట్లాడితే బాగుంటుంది? మాట్లాడేటప్పుడు ఎలాంటి స్వరంతో, ఎలాంటి పదాలను ఉపయోగించడం మంచిది? మీ ఊహాశక్తిని ఉపయోగించి ఆ సమస్యను పరిష్కరించుకునే వివిధ పద్ధతుల్ని మనసులో ప్రాక్టీసు చేసుకోండి. అప్పుడు ఆ సమస్యను చక్కగా, ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా పరిష్కరించుకోగలుగుతారు. (సామె. 15:28) కష్టమైన పరిస్థితుల్ని పరిష్కరించుకునేటప్పుడు ఇలా ఆలోచిస్తే సంఘంలో శాంతిని కాపాడగలుగుతాం. అలా చేస్తే మీ ఊహాశక్తిని జ్ఞానయుక్తంగా ఉపయోగించినట్లే.

(3) బైబిలు చదవడాన్ని, అధ్యయనం చేయడాన్ని మెరుగుపర్చుకోవడం.

మనం ప్రతీరోజు బైబిలు చదవడం ప్రాముఖ్యం. అయితే ప్రతీరోజు పేజీలకు పేజీలు చదివితే సరిపోదు. బైబిల్లో ఉన్న ఆచరణాత్మక పాఠాల్ని అర్థంచేసుకుని వాటిని మన జీవితంలో పాటించాలనే ప్రేరణను పొందాలి. బైబిలు చదవడంవల్ల యెహోవా మార్గాల మీద మనకున్న కృతజ్ఞత పెరగాలి. అలా చేయడానికి మన ఊహాశక్తిని ఉపయోగించవచ్చు. ఎలా? ఉదాహరణకు, వాళ్లలా విశ్వాసం చూపించండి అనే పుస్తకాన్నే తీసుకోండి. బైబిల్లో మనం చదివే వ్యక్తుల పరిస్థితుల్ని మనసులో చిత్రీకరించుకునేలా మన ఊహాశక్తిని పెంచుకోవడానికి ఈ పుస్తకంలోని వృత్తాంతాలు సహాయం చేస్తాయి. వాటిని చదువుతున్నప్పుడు అక్కడి చుట్టుపక్కల పరిసరాల్ని చూడగలుగుతాం, శబ్దాలను వినగలుగుతాం, వాసనలు పీల్చగలుగుతాం, ఆ వ్యక్తి భావాలను అర్థంచేసుకోగలుగుతాం. మనకు బాగా పరిచయం ఉన్న బైబిలు వృత్తాంతాల్లో కూడా అద్భుతమైన పాఠాల్ని గుర్తించగలుగుతాం, ప్రోత్సాహాన్ని పొందగలుగుతాం. మనం బైబిల్ని చదువుతున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు మన ఊహాశక్తిని ఇలా ఉపయోగిస్తే మనం చదివే భాగాల్ని ఇంకా ఆసక్తిగా చదవగలుగుతాం.

(4) సహానుభూతిని పెంపొందించుకోవడం, చూపించడం.

సహానుభూతి అంటే ఇతరుల బాధను మన బాధగా భావించడం. యెహోవా, యేసు సహానుభూతిని చూపిస్తున్నట్టే మనం కూడా ఆ లక్షణాన్ని చూపించడానికి కృషిచేయాలి. (నిర్గ. 3:7; కీర్త. 72:13) సహానుభూతిని మనం ఎలా పెంపొందించుకోవచ్చు? ఆ లక్షణాన్ని పెంపొందించుకోవడానికి అత్యంత శక్తివంతమైన మార్గం మన ఊహాశక్తిని ఉపయోగించడమే. మన తోటి సహోదరసహోదరీలు అనుభవించే పరిస్థితుల్ని మనం ఎన్నడూ అనుభవించకపోవచ్చు. కానీ మీరిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేనే ఆ పరిస్థితిలో ఉంటే ఎలా భావిస్తాను? ఆ పరిస్థితిలో నాకు ఏమి అవసరం?’ మన ఊహాశక్తిని ఉపయోగించి ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే మనం మరింత ఎక్కువగా సహానుభూతిని చూపించడానికి వీలౌతుంది. నిజంగా, సహానుభూతి చూపిస్తే మన క్రైస్తవ జీవితంలోని ప్రతీ అంశంలో ప్రయోజనం పొందుతాం. ముఖ్యంగా పరిచర్య, తోటి క్రైస్తవులతో మనకున్న సంబంధాలు వంటి విషయాల్లో కూడా ఈ లక్షణం చాలా ప్రయోజనాలు తీసుకొస్తుంది.

(5) కొత్తలోకంలో జీవితం గురించి ఊహించుకోవడం.

దేవుడు మాటిచ్చిన కొత్తలోకంలో జీవితం గురించి ఎన్నో స్పష్టమైన వివరాలు బైబిల్లో ఉన్నాయి. (యెష. 35:5-7; 65:21-25; ప్రక. 21:3, 4) ఆ వివరాలకు సంబంధించిన ఎన్నో అందమైన చిత్రాల్ని మన ప్రచురణలు అందిస్తున్నాయి. ఆ చిత్రాలు మన ఊహాశక్తిని పెంచుకోవడానికే కాదు, మనం కొత్తలోకంలో జీవితాన్ని ఆనందిస్తున్నట్లు ఊహించుకోవడానికి కూడా మనకు సహాయం చేస్తాయి. ఊహాశక్తి అనే సామర్థ్యం ఎంత శక్తివంతమైందో వేరే ఎవ్వరికన్నా దాన్ని ఇచ్చిన యెహోవాకే బాగా తెలుసు. ఆ సామర్థ్యాన్ని యెహోవా వాగ్దానాల గురించి ఆలోచించడానికి ఉపయోగిస్తే, ఆయన మాటలు తప్పకుండా నెరవేరుతాయనే నమ్మకం కలుగుతుంది. అంతేకాదు ప్రస్తుతం కష్టాలు వచ్చినా ఆయనకు నమ్మకంగా ఉండగలుగుతాం.

ఊహాశక్తి అనే అద్భుతమైన సామర్థ్యాన్ని యెహోవా ప్రేమతో మనకిచ్చాడు. మన రోజువారీ జీవితంలో ఆయన్ను ఇంకా ఎక్కువ సేవించడానికి అది మనకు సహాయం చేస్తుంది. కాబట్టి మనం ప్రతీరోజు ఆ సామర్థ్యాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తూ ఆ అద్భుతమైన బహుమానం ఇచ్చిన యెహోవా మీద మనకున్న కృతజ్ఞతను చూపిద్దాం.