కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పరిచర్య మంచు బిందువులా ఉందా?

మీ పరిచర్య మంచు బిందువులా ఉందా?

మనం చేస్తున్న పరిచర్య ప్రాముఖ్యమైనది, విలువైనది. అయితే మనం ప్రకటిస్తున్నప్పుడు ప్రతీఒక్కరూ దాని విలువను గుర్తించకపోవచ్చు. ఒకవేళ ప్రజలకు బైబిల్లోని విషయాలు ఆసక్తిగా అనిపించినా, మనతో కలిసి బైబిల్ని అధ్యయనం చేయాల్సిన అవసరంలేదని వాళ్లు అనుకోవచ్చు.

గవన్‌ విషయాన్నే తీసుకోండి. అతను మన మీటింగ్స్‌కి వచ్చేవాడు కానీ బైబిలు స్టడీ తీసుకోవడానికి మాత్రం ఇష్టపడేవాడు కాదు. గవన్‌ ఇలా చెప్తున్నాడు, “నాకు బైబిలు గురించి అంతగా తెలీదు, ఆ విషయం వేరేవాళ్లకు తెలియకూడదని అనుకున్నాను. నన్ను మోసం చేస్తారేమో, మతంలో చేరమంటారేమో అని భయపడేవాణ్ణి.” మీరు ఏమనుకుంటున్నారు? గవన్‌ బైబిలు స్టడీకి అస్సలు ఒప్పుకోడని అనుకుంటు​న్నారా? లేదు. బైబిలు బోధలు ఓ వ్యక్తి జీవితం మీద ఎంత మంచి ప్రభావం చూపిస్తాయో ఆలోచించండి. ప్రాచీనకాలంలోని తన ప్రజలతో యెహోవా ఇలా అన్నాడు, ‘నా వాక్యము మంచులా, లేతగడ్డిమీద పడు చినుకులా ఉంటుంది.’ (ద్వితీ. 31:​19, 30; 32:⁠2) అయితే, ‘అన్నిరకాల ప్రజలకు’ మనమెలా సమర్థవంతంగా ప్రకటించవచ్చో మంచు బిందువుకున్న ప్రత్యేకతలు చక్కగా వివరిస్తాయి.​—⁠1 తిమో. 2:​3-4, NW.

మన పరిచర్యను మంచు బిందువుతో ఎందుకు పోల్చవచ్చు?

మంచు బిందువు మృదువుగా ఉంటుంది. గాలిలో ఉండే తేమ క్రమక్రమంగా చిన్న నీటి బొట్టుల్లా తయారౌతుంది, వాటినే మంచు బిందువులు అంటాం. అయితే యెహోవా మాటలు ఏ విధంగా “మంచులా” ఉన్నాయి? ఆయన తన ప్రజలతో దయగా, మృదువుగా, వాళ్ల మీద శ్రద్ధతో మాట్లాడాడు. మనం ఇతరుల నమ్మకాలను గౌరవించినప్పుడు ఆయన్ను అనుకరించిన వాళ్లమౌతాం. అంతేకాదు, ఏదైనా విషయాన్ని తమకు తామే తర్కించుకుని, సొంతగా నిర్ణయాలు తీసుకునేలా మనం ఇతరుల్ని ప్రోత్సహిస్తాం. అలాంటి వ్యక్తిగత శ్రద్ధ చూపించినప్పుడు మనం చెప్పే విషయాల్ని వినడానికి వాళ్లు మరింతగా ఇష్టపడతారు, దానివల్ల మన పరిచర్యకు మంచి ఫలితాలు వస్తాయి.

మంచు బిందువు సేదదీర్పునిస్తుంది. సత్యంపట్ల ఇతరులకు ఆసక్తి కలిగేలా వేర్వేరు విధానాల్లో బోధించినప్పుడు మన పరిచర్య వాళ్లకు సేదదీర్పునిస్తుంది. గవన్‌కు మొట్టమొదటిసారి బైబిలు స్టడీ గురించి చెప్పినప్పుడు క్రిస్‌ అనే సహోదరుడు అతన్ని బలవంతం చేయలేదు. బదులుగా గవన్‌ ఎలాంటి ఇబ్బందిపడకుండా బైబిలు విషయాల గురించి మాట్లాడేలా క్రిస్‌ వివిధ పద్ధతుల్ని పాటించాడు. అంతేకాదు బైబిల్లో ఓ ప్రాముఖ్యమైన సమాచారం ఉందనీ, అది తెలుసుకుంటే మీటింగ్స్‌లో చెప్పే విషయాలు బాగా అర్థమౌతాయనీ ఆ సహోదరుడు గవన్‌తో చెప్పాడు. ఆ తర్వాత, బైబిలు చెప్పేది నిజమని నమ్మడానికి అందులో ఉన్న ప్రవచనాలు తనకు సహాయం చేశాయని కూడా క్రిస్‌ చెప్పాడు. దానివల్ల వాళ్లిద్దరూ బైబిల్లోని ప్రవచనాలు ఎలా నెరవేరాయో చాలాసార్లు చర్చించుకున్నారు. ఈ చర్చలు గవన్‌కు ఎంతో సేదదీర్పునిచ్చాయి, ఫలితంగా అతను బైబిలు స్టడీకి ఒప్పుకున్నాడు.

మంచు బిందువు జీవాన్ని కాపాడుతుంది. ఇశ్రాయేలు దేశంలోని ఎండాకాలాల్లో చాలా నెలలు వర్షాలు పడవు. అప్పుడు మంచు బిందువుల నుండి వచ్చే తేమ లేకపోతే చెట్లు వాడిపోయి, ఎండిపోతాయి. అదేవిధంగా, మన కాలంలో కూడా ఓ ఆధ్యాత్మిక కరువు వస్తుందని యెహోవా ముందే చెప్పాడు. (ఆమో. 8:11) కానీ అభిషిక్త క్రైస్తవులు దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ “యెహోవా కురిపించు మంచువలె” ఉంటారనీ, వాళ్లకు “వేరే గొర్రెలు” మద్దతిస్తారనీ దేవుడు మాటిచ్చాడు. (మీకా 5:7; యోహా. 10:16) మనం ప్రకటించే సందేశం, సత్యం కోసం తపించే ప్రజలకు జీవాన్ని ఇవ్వడానికి యెహోవా చేసిన ఏర్పాటులో భాగమే. ఈ సందేశాన్ని మనం విలువైనదిగా చూస్తున్నామా?

మంచు బిందువు యెహోవా ఇచ్చే ఆశీర్వాదం. (ద్వితీ. 33:​13, 16) మంచివార్తను అంగీకరించే వాళ్లకు మన పరిచర్య ఓ ఆశీర్వాదంగా లేదా బహుమానంగా ఉంటుంది. గవన్‌కు బైబిలు స్టడీ ఒక ఆశీర్వాదమే. ఎందుకంటే, దానివల్ల అతనికున్న ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలుసుకోగలిగాడు. అతను త్వరగా ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకున్నాడు. ప్రస్తుతం తన భార్య జొయిస్‌తో కలిసి గవన్‌ సంతోషంగా పరిచర్య చేస్తున్నాడు.

యెహోవాసాక్షులు దేవుని రాజ్యం గురించిన మంచివార్తతో భూమిని నింపుతున్నారు

మీ పరిచర్యను విలువైనదిగా చూడండి

మన ప్రకటనాపనిని మంచు బిందువుతో పోల్చడంవల్ల పరిచర్యలో మనలో ప్రతీఒక్కరం చేసే కృషి విలువైనదని అర్థం​చేసుకోగలుగుతాం. ఎందుకలా చెప్పవచ్చు? ఒక్క నీటి బొట్టు వల్ల అంత ప్రయోజనం ఉండదు. కానీ కొన్ని లక్షల మంచు​బిందువులు కలిస్తే భూమంతా తేమతో నిండుతుంది. అదే​విధంగా, పరిచర్యలో మనం ఒక్కరం చేసేది చాలా తక్కువగా కనిపించవచ్చు, కానీ లక్షలమంది యెహోవా సేవకులు కలిసి చేసే కృషి వల్ల “సకల జనములకు,” సాక్ష్యం ఇవ్వబడుతుంది. (మత్త. 24:14) మన పరిచర్య ఇతరులకు యెహోవా నుండి వచ్చే ఆశీర్వాదంగా ఉండగలదా? ఖచ్చితంగా. మనం ప్రకటించే సందేశం మంచు బిందువుల్లా మృదువుగా, సేదదీర్పుగా, జీవాన్ని కాపాడేదిగా ఉంటుంది.