దేవుని రాజ్యం వేటిని నాశనం చేస్తుంది?
“ఈ లోకం నాశనమౌతుంది, లోకంలోని ప్రజలు కోరుకునే ప్రతీది నాశనమౌతుంది. అయితే దేవుని ఇష్టప్రకారం ప్రవర్తించే వ్యక్తి నిరంతరం జీవిస్తాడు.”—1 యోహా. 2:17.
1, 2. (ఎ) ఈ చెడ్డ లోకం, ఉరి తీయబడుతున్న నేరస్థునిలా ఉందని ఎలా చెప్పవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) ఈ చెడ్డ లోకం నాశనమైన తర్వాత పరలోకంలో అలాగే భూమ్మీదున్న ప్రతీఒక్కరూ ఎలా భావిస్తారు?
ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. మరణ శిక్ష విధించబడిన ఒక కరడుగట్టిన నేరస్థుణ్ణి పోలీసులు ఉరితీయడానికి తీసుకెళ్తున్నారు. ఆ నేరస్థుడు బ్రతికే ఉన్నా, ఆరోగ్యంగానే కనిపిస్తున్నా కాసేపట్లో అతను చనిపోతాడు.
2 నేడు మనం జీవిస్తున్న ఈ లోకాన్ని, ఉరి తీయబడుతున్న నేరస్థునితో పోల్చవచ్చు. బైబిలు ఇలా చెప్తోంది, “ఈ లోకం నాశనమౌతుంది.” (1 యోహా. 2:17) ఇప్పుడున్న ఈ లోకాన్ని త్వరలోనే నాశనం చేయాలని యెహోవా నిర్ణయించాడు, కాబట్టి అది ఖచ్చితంగా నాశనమౌతుంది. అయితే ఈ లోకం నాశనమవ్వడానికి, ఆ నేరస్థుడు చనిపోవడానికి మధ్య ఒక ప్రాముఖ్యమైన తేడా ఉంది. అదేంటంటే, ఆ నేరస్థున్ని కాపాడాలనే ఉద్దేశంతో అతని విషయంలో అన్యాయం జరిగిందంటూ, ఇచ్చిన తీర్పును ప్రశ్నిస్తూ కొంతమంది నిరసనలు చేయవచ్చు. కానీ, యెహోవా మాత్రం పరిపూర్ణ న్యాయాధిపతి, ఈ లోకాన్ని నాశనం చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం సరైనదే. (ద్వితీ. 32:4) ఆయన అనుకున్న సమయానికే అది నాశనమౌతుంది. అది జరిగాక, పరలోకంలో అలాగే భూమ్మీదున్న ప్రతీఒక్కరూ యెహోవా తీసుకున్న నిర్ణయం సరైనదని, న్యాయమైనదని ఒప్పుకుంటారు. అప్పుడు పరిస్థితులు ఎంతో బాగుంటాయి.
3. దేవుని రాజ్యం ఏ నాలుగు విషయాలను తీసేస్తుంది?
3 “ఈ లోకం నాశనమౌతుంది” అంటున్నప్పుడు ఏవేవి కూడా నాశనమౌతాయి? మన కాలంలో సర్వసాధారణమైపోయిన చెడ్డ విషయాలన్నీ నాశనమైపోతాయి. అది త్వరలోనే జరగనుంది. నిజానికి ఈ విషయం, మనం ప్రకటిస్తున్న ‘రాజ్యం గురించిన మంచివార్తలో’ ఒక భాగం. (మత్త. 24:14) దేవుని రాజ్యం నాశనం చేసే నాలుగు విషయాల గురించి మనం ఈ ఆర్టికల్‌లో చర్చించుకుంటాం. అవేమిటంటే: చెడ్డ ప్రజలు, అవినీతి సంస్థలు, చెడ్డ పనులు, చెడ్డ పరిస్థితులు. వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తాం: (1) వాటివల్ల ఇప్పుడు మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం? (2) వాటి విషయంలో యెహోవా ఎలాంటి చర్య తీసుకుంటాడు? (3) వాటి స్థానంలో ఆయన వేటిని తీసుకొస్తాడు?
చెడ్డ ప్రజలు
4. చెడ్డ ప్రజలవల్ల మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం?
4 చెడ్డ ప్రజలవల్ల మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం? ఈ చివరి రోజుల్లో “ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు” ఉంటాయని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. అంతేకాదు, ‘దుష్టులు, మోసగాళ్లు అంతకంతకూ చెడిపోతారు’ అని ఆయన అన్నాడు. (2 తిమో. 3:1-5, 13) ఈ మాటలు నిజమవ్వడాన్ని మీరు చూశారా? మనలో చాలామంది, తీవ్రంగా ఎగతాళి చేసేవాళ్ల వల్ల, జాతి వివక్ష చూపించేవాళ్ల వల్ల, కరడుగట్టిన నేరగాళ్ల వల్ల ఎంతో బాధ అనుభవించి ఉంటాం. కొంతమంది బహిరంగంగానే చెడ్డపనులు చేస్తారు. ఇంకొంతమంది మాత్రం పైకి మంచివాళ్లలా నటిస్తారుగానీ నిజానికి వాళ్ల బుద్ధి చెడ్డగా ఉంటుంది. ఒకవేళ మనం అలాంటివాళ్ల చెడుతనానికి నేరుగా బలికాకపోయినా, ఏదోక విధంగా వాళ్లవల్ల బాధలు పడుతూ ఉంటాం. అంతేకాదు వాళ్లు పిల్లలతో, పెద్దవాళ్లతో, నిస్సహాయులతో క్రూరంగా ప్రవర్తించడం గురించి విన్నప్పుడు మనకు చాలా కోపం వస్తుంది. వాళ్లు క్రూరమృగాల్లా, రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. (యాకో. 3:15) కానీ సంతోషకరమైన విషయమేమిటంటే, యెహోవా తన వాక్యం ద్వారా మనకు ఒక మంచి నిరీక్షణ ఇస్తున్నాడు.
5. (ఎ) చెడ్డవాళ్లకు ఇప్పటికీ ఏ అవకాశం ఉంది? (బి) మారడానికి ఇష్టపడని వాళ్లకు ఏమి జరుగుతుంది?
5 యెహోవా ఎలాంటి చర్య తీసుకుంటాడు? ఇప్పుడైతే, చెడ్డవాళ్లు మారేందుకు యెహోవా అవకాశమిస్తున్నాడు. (యెష. 55:7) ఈ చెడ్డ లోకాన్ని త్వరలో నాశనం చేయాలని ఆయన నిర్ణయించాడుగానీ, చివరి తీర్పు ఇంకా జరగలేదు. మరి మారడానికి ఇష్టపడకుండా, మహాశ్రమ మొదలయ్యే వరకు ఈ లోకానికి మద్దతిచ్చేవాళ్లకు ఏమి జరుగుతుంది? చెడ్డవాళ్లందర్నీ భూమ్మీద లేకుండా చేస్తానని యెహోవా మాటిచ్చాడు. (కీర్తన 37:10 చదవండి.) నేడు చాలామంది దొంగచాటుగా చెడ్డ పనులు చేయడం నేర్చుకున్నారు, దానివల్ల చాలాసార్లు శిక్షను తప్పించుకుంటున్నారు. (యోబు 21:7, 9) కానీ బైబిలు ఇలా గుర్తుచేస్తుంది, “ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారి నడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు. దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు.” (యోబు 34:21, 22) కాబట్టి యెహోవా నుండి తప్పించుకోవడం మాత్రం కుదరదు. చెడ్డవాళ్లు చేస్తున్న ప్రతీదీ ఆయన చూడగలడు. హార్‌మెగిద్దోను తర్వాత, వాళ్లు ఒకప్పుడు ఉన్న ప్రాంతానికి వెళ్లి వెదికినా వాళ్లు కనిపించరు. చెడ్డవాళ్లు భూమ్మీద ఇక ఎప్పటికీ ఉండరు.—కీర్త. 37:12-15.
6. చెడ్డవాళ్లు నాశనమయ్యాక ఈ భూమ్మీద ఎవరుంటారు? అది ఎందుకు మంచివార్త?
6 చెడ్డవాళ్లు నాశనమయ్యాక ఈ భూమ్మీద ఎవరుంటారు? “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు” అని యెహోవా మాటిస్తున్నాడు. అదే కీర్తనలో మనం ఇంకా ఇలా చదువుతాం, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్త. 37:11, 29) ఇంతకీ “దీనులు,” “నీతిమంతులు” అంటే ఎవరు? దీనులు అంటే యెహోవా దగ్గర నేర్చుకుంటూ, ఆయనకు లోబడే వినయస్థులు. నీతిమంతులు అంటే దేవుని దృష్టిలో సరైనదాన్ని చేయడానికి ఇష్టపడేవాళ్లు. నేడున్న లోకంలో, నీతిమంతుల కన్నా చెడ్డవాళ్లే ఎక్కువమంది ఉన్నారు. కానీ కొత్తలోకంలో కేవలం దీనులు, నీతిమంతులే ఉంటారు. వాళ్లు ఈ భూమిని పరదైసుగా మారుస్తారు.
అవినీతి సంస్థలు
7. అవినీతి సంస్థలవల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?
7 అవినీతి సంస్థలవల్ల మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం? నేడు లోకం ఇంత చెడుగా ఉండడానికి కారణం ఒక్క మనిషి కాదుగానీ కొన్ని సంస్థలే. మతసంస్థలు లక్షలమందిని మోసం చేస్తున్నాయి. ఉదాహరణకు ఆ సంస్థలు దేవుని గురించి అబద్ధాలు చెప్తున్నాయి, బైబిల్ని నమ్మవద్దని చెప్తున్నాయి. అంతేకాదు భవిష్యత్తులో భూమికి, మనుషులకు జరగబోయే వాటిగురించి లేనిపోనివి చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాయి. అవినీతి ప్రభుత్వాలు యుద్ధాల్ని, వేర్వేరు జాతుల మధ్య హింసను ప్రోత్సహిస్తున్నాయి. అంతేకాదు పేదవాళ్లను, బలహీనులను అణచివేస్తున్నాయి. అలాంటి సంస్థలు పక్షపాతాన్ని చూపిస్తూ, లంచాలు తీసుకుంటూ కోట్లు సంపాదించి మరింత శక్తిమంతంగా తయారౌతున్నాయి. అత్యాశగల కార్పొరేషన్లు అనాలోచితంగా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి, ప్రకృతి వనరుల్ని నాశనం చేస్తున్నాయి. అంతేకాదు కొంతమందిని ధనవంతుల్ని చేయడం కోసం ప్రజల్ని మోసం చేస్తున్నాయి. దీనంతటిని బట్టి, నేడు లోకంలో ఇన్ని కష్టాలకు కారణం అవినీతి సంస్థలేనని అర్థమౌతుంది.
8. దృఢంగా ఉన్నాయని నేడు చాలామంది అనుకుంటున్న సంస్థలకు ఏమి జరుగుతుందని బైబిలు చెప్తుంది?
8 యెహోవా ఎలాంటి చర్య తీసుకుంటాడు? మానవ ప్రభుత్వాలు, అబద్ధమత సంస్థలన్నిటిపై దాడిచేసినప్పుడు మహాశ్రమ మొదలౌతుంది. ఈ సంస్థలన్నిటినీ బైబిలు ఒక వేశ్యగా వర్ణిస్తూ మహాబబులోను అని పిలుస్తోంది. (ప్రక. 17:1, 2, 16; 18:1-4) ఈ మతసంస్థలు నామరూపాల్లేకుండా చేయబడతాయి. మరి ఇతర అవినీతి సంస్థలకు ఏమి జరుగుతుంది? అవి పర్వతాల్లా, ద్వీపాల్లా బలంగా దృఢంగా ఉన్నట్టు కనిపిస్తాయని బైబిలు చెప్తుంది. (ప్రకటన 6:14 చదవండి.) కానీ దేవుని రాజ్యానికి మద్దతివ్వని ప్రభుత్వాలు, ఇతర సంస్థలన్నీ నాశనమౌతాయని కూడా బైబిలు చెప్తుంది. అది మహాశ్రమలోని చివరి భాగంలో జరుగుతుంది. (యిర్మీ. 25:31-33) ఆ తర్వాత, అవినీతి సంస్థ ఒక్కటి కూడా ఉండదు.
9. కొత్త భూమి ఒక క్రమపద్ధతిలో చక్కగా ఉంటుందని ఎందుకు ఖచ్చితంగా చెప్పవచ్చు?
9 అవినీతి సంస్థల స్థానంలో ఏమి వస్తాయి? హార్‌మెగిద్దోను తర్వాత, భూమ్మీద ఏ సంస్థ అయినా ఉంటుందా? బైబిలు ఇలా చెప్తుంది, “అయితే మనం ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశం కోసం, కొత్త భూమి కోసం ఎదురుచూస్తున్నాం; వాటిలో ఎప్పుడూ నీతి ఉంటుంది.” (2 పేతు. 3:13) పాత ఆకాశం అంటే అవినీతి ప్రభుత్వాలు అని, పాత భూమి అంటే ఆ ప్రభుత్వ పరిపాలన కింద ఉండే మనుషులు అని చెప్పవచ్చు. వాటి స్థానంలో ఏమి వస్తాయి? “కొత్త ఆకాశం, కొత్త భూమి” వస్తాయి. కొత్త ఆకాశం, యేసు అలాగే ఆయన సహపరిపాలకులైన 1,44,000 మంది పరిపాలించే కొత్త ప్రభుత్వాన్ని సూచిస్తుంది. కొత్త భూమి దేవుని రాజ్య పరిపాలనలో ఉండే ప్రజలకు సూచనగా ఉంది. ఆ రాజ్యాన్ని పరిపాలించే యేసు, క్రమముగల దేవుడైన యెహోవా లక్షణాల్ని పరిపూర్ణంగా చూపిస్తాడు. (1 కొరిం. 14:33) కాబట్టి “కొత్త భూమి” ఒక క్రమపద్ధతిలో ఉంటుంది. మన బాగోగులు చూసుకోవడానికి మంచివాళ్లు ఉంటారు. (కీర్త. 45:16) వాళ్లకు కావాల్సిన నిర్దేశాన్ని యేసు అలాగే 1,44,000 మంది ఇస్తారు. అవినీతిగల ఈ సంస్థలన్నిటి స్థానంలో ఎప్పటికీ అవినీతిగా తయారవ్వని ఒకేఒక్క సంస్థ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి.
చెడ్డ పనులు
10. మీరు జీవిస్తున్న ప్రాంతంలో ఎలాంటి చెడ్డపనులు సర్వసాధారణమైపోయాయి? వాటివల్ల మీరూ, మీ కుటుంబం ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు?
10 చెడ్డ పనులవల్ల మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం? మనం జీవిస్తున్న లోకంలో అనైతికత, మోసాలు, తీవ్రమైన హింస సర్వసాధారణమైపోయాయి. వీటిని లోకంలోని వినోదం ఆకర్షణీయంగా కనబడేలా చేస్తోంది. మరోవైపు, తప్పొప్పుల విషయంలో యెహోవా ప్రమాణాలను చులకన చేస్తోంది. (యెష. 5:20) అలాంటి చెడ్డవాటి నుండి తల్లిదండ్రులు తమను, తమ పిల్లల్ని కాపాడుకోవడానికి పోరాడాలి. నిజానికి, దేవుని ప్రమాణాల్ని గౌరవించని ఈ లోకంలో ఉన్న నిజ క్రైస్తవులందరూ యెహోవాతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోవడానికి ఎంతో కృషి చేయాలి.
11. సొదొమ గొమొర్రా పట్టణాల విషయాల్లో యెహోవా తీసుకున్న చర్య నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
11 యెహోవా ఎలాంటి చర్య తీసుకుంటాడు? సొదొమ గొమొర్రా పట్టణాల్లో చెడ్డ పనులు జరుగుతున్నప్పుడు యెహోవా ఏమి చేశాడో ఆలోచించండి. (2 పేతురు 2:6-8 చదవండి.) నీతిమంతుడైన లోతు, అతని కుటుంబం తమ చుట్టూ జరుగుతున్న చెడ్డపనుల వల్ల ఎన్నో బాధలుపడ్డారు. ఆ ప్రాంతంలోని చెడ్డ ప్రజలందర్నీ యెహోవా నాశనం చేయడం ద్వారా అక్కడ జరిగే చెడ్డ పనుల్ని అరికట్టాడు. అయితే నేడున్న చెడ్డ ప్రజలకు జరగబోయేదానికి అది ఒక “నమూనాగా ఉంది.” అవును, గతంలో యెహోవా చర్య తీసుకొని అనైతిక పనులన్నిటికీ ముగింపు తెచ్చాడు. నేడు కూడా యెహోవా ఈ లోకాన్ని నాశనం చేసినప్పుడు అనైతిక పనులన్నిటికీ ముగింపు తెస్తాడు.
12. కొత్తలోకంలో మీరు ఏ పనులు చేయాలని ఎదురుచూస్తున్నారు?
12 చెడ్డపనులు ఆగిపోయాక భూమ్మీద ఎలాంటి పనులు జరుగుతాయి? కొత్తలోకంలో, మనకు సంతోషాన్నిచ్చే ఎన్నో పనులతో బిజీగా ఉంటాం. ఉదాహరణకు మనం ఈ భూమిని పరదైసుగా మార్చి, మనకోసం మన ప్రియమైనవాళ్ల కోసం ఇళ్లు కట్టుకుంటాం. పునరుత్థానమయ్యే లక్షలమందిని ఆహ్వానిస్తాం, వాళ్లకు యెహోవా గురించి నేర్పిస్తాం, ఆయన మనుషుల కోసం చేసిన వాటిగురించి చెప్తాం. (యెష. 65:21, 22; అపొ. 24:15) అలా ఆ కాలంలో మనకు సంతోషాన్ని, యెహోవాకు స్తుతిని తెచ్చే పనులతో బిజీగా ఉంటాం.
చెడ్డ పరిస్థితులు
13. ఏదెనులో జరిగిన తిరుగుబాటువల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
13 చెడ్డ పరిస్థితుల వల్ల మనం ఎలాంటి బాధలుపడుతున్నాం? చెడ్డ ప్రజలతో, అవినీతి సంస్థలతో, చెడ్డ పనులతో ఈ లోకంలోని పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయి. యుద్ధం, పేదరికం, జాతివిభేదాలు, అనారోగ్యం, మరణం వంటి వాటివల్ల మనందరం చాలా బాధలు అనుభవిస్తున్నాం. అసలు ఈ బాధలు మొదలవ్వడానికి కారణం సాతాను, ఆదాముహవ్వలు యెహోవాకు ఎదురుతిరగడమే. వాళ్లు చేసిన తిరుగుబాటువల్లే ఇప్పుడు మనందరం కష్టాలు అనుభవిస్తున్నాం.
14. చెడ్డ పరిస్థితుల విషయంలో యెహోవా ఎలాంటి చర్య తీసుకుంటాడు?
14 యెహోవా ఎలాంటి చర్య తీసుకుంటాడు? కొన్ని ఉదాహరణలు పరిశీలించండి. యెహోవా యుద్ధాలనేవే జరగకుండా చేస్తానని మాటిస్తున్నాడు. (కీర్తన 46:8, 9 చదవండి.) అనారోగ్యాన్ని ఆయన తీసేస్తాడు. (యెష. 33:24) మరణాన్ని మ్రింగివేస్తాడు. (యెష. 25:8) పేదరికాన్ని లేకుండా చేస్తాడు. (కీర్త. 72:12-16) అంతేకాదు ఈరోజుల్లో మన జీవితాన్ని కష్టతరం చేస్తున్న ఇతర చెడ్డ పరిస్థితులన్నిటినీ యెహోవా తీసేస్తాడు. దానితోపాటు సాతాను, అతని చెడ్డ దూతల ప్రభావం కూడా మనమీద పడకుండా చేస్తాడు.—ఎఫె. 2:2.
15. హార్‌మెగిద్దోను తర్వాత ఎలాంటి విషయాలు శాశ్వతంగా లేకుండా పోతాయి?
15 యుద్ధం, అనారోగ్యం, మరణం అనేవే లేని లోకంలో జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. సైన్యాలు, ఆయుధాలు, యుద్ధంలో చనిపోయినవాళ్లను జ్ఞాపకం చేసుకుంటూ చేసే కార్యక్రమాలు ఉండవు. ఆసుపత్రులతో, డాక్టర్లతో, నర్సులతో, మార్చురీలతో, శ్మశానాలతో అవసరం ఉండదు. నేరాలు జరగవు కాబట్టి పోలీసులతో, సెక్యూరిటీ అలారమ్‌లతో, తాళాలతో కూడా పని ఉండదు. మనకు ఎంతో ఆందోళనను కలిగించే ఈ చెడ్డ పరిస్థితులు శాశ్వతంగా పోతాయి.
16, 17. (ఎ) హార్‌మెగిద్దోనును తప్పించుకున్నవాళ్లు ఎలా భావిస్తారు? ఉదాహరణ చెప్పండి. (బి) ఈ పాత లోకం అంతమైనప్పుడు, మన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏమి చేయాలి?
16 చెడ్డ పరిస్థితులు పోయినప్పుడు జీవితం ఎలా ఉంటుంది? అది ఊహించడం కష్టమే. మనం చెడ్డ పరిస్థితులతో ఎంత ఎక్కువకాలం నుండి జీవిస్తున్నామంటే వాటివల్ల కలుగుతున్న ఒత్తిడిని గుర్తించడం కూడా మానేశాం. ఉదాహరణకు, బాగా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ దగ్గర జీవించే ప్రజలు కొంతకాలానికి ఆ శబ్దాలకు అలవాటుపడిపోతారు అవి వాళ్లకు ఇబ్బందిగా అనిపించవు. అలాగే చెత్తకుండీ దగ్గర్లో జీవించేవాళ్లు కొంతకాలానికి ఆ చెడువాసనకు అలవాటుపడిపోతారు. కానీ యెహోవా చెడ్డ పరిస్థితులన్నిటినీ తీసేసినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
17 మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఒత్తిళ్లన్నీ భవిష్యత్తులో ఉండవు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు” అని కీర్తన 37:11 వచనం చెప్తోంది. మనకోసం యెహోవా కోరుకునేది ఇదేనని తెలుసుకోవడం ఎంత ఓదార్పును ఇస్తుందో కదా! కాబట్టి ఒత్తిడితో కూడిన ఈ కాలాల్లో యెహోవాను, ఆయన సంస్థను అంటిపెట్టుకొని ఉండడానికి చేయగలిగినదంతా చేయండి. భవిష్యత్తు విషయంలో మీకున్న నిరీక్షణ విలువైనది, కాబట్టి దాని గురించి లోతుగా ఆలోచించండి. అది నిజమౌతుందని నమ్మండి, దాని గురించి ఇతరులకు చెప్పండి. (1 తిమో. 4:15, 16; 1 పేతు. 3:15) అలా చేయడం ద్వారా ఈ లోకం అంతమైనప్పుడు, మీ ప్రాణాలు కాపాడుకుంటారు, నిత్యం సంతోషంగా జీవిస్తారు.