కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన స్వేచ్ఛకు మార్గం

నిజమైన స్వేచ్ఛకు మార్గం

“కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే, మీరు నిజంగా స్వతంత్రులౌతారు.”యోహా. 8:36.

పాటలు: 54, 36

1, 2. (ఎ) స్వేచ్ఛ కోసం ప్రజలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? (బి) దానివల్ల ఎలాంటి ఫలితం పొందుతున్నారు?

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సమాన హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అన్యాయం నుండి, పక్షపాతం నుండి, పేదరికం నుండి స్వేచ్ఛ కోరుకుంటారు. మరికొందరు తమకు నచ్చింది మాట్లాడేందుకు, నచ్చిన నిర్ణయాలు తీసుకునేందుకు, నచ్చినట్లు జీవించేందుకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు. అవును, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు.

2 దానికోసం ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఆఖరికి విప్లవాలు సృష్టిస్తారు. కానీ వాళ్లకు కావాల్సింది పొందుతున్నారా? లేదు. బదులుగా అలాంటివాటి వల్ల కష్టాలు మరింత ఎక్కువౌతున్నాయి, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు” అని ప్రసంగి 8:9లో రాజైన సొలొమోను చెప్పిన మాటలు అక్షరసత్యం.

3. నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని ఆనందించాలంటే ఏమి చేయాలని బైబిలు చెప్తుంది?

3 మనం నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని ఆనందించాలంటే ఏమి చేయాలో బైబిలు చెప్తుంది. ‘స్వేచ్ఛను ఇచ్చే పరిపూర్ణ శాసనంలోకి పరిశీలనగా చూసి, దాన్ని పాటిస్తే సంతోషాన్ని’ పొందుతామని శిష్యుడైన యాకోబు చెప్పాడు. (యాకో. 1:25) ఆ “పరిపూర్ణ శాసనం” యెహోవా నుండి వస్తుంది. నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని పొందడానికి మనకేమి అవసరమో ఆయన కన్నా బాగా ఇంకెవరికీ తెలీదు. ఆయన ఆదాముహవ్వలకు నిజమైన స్వేచ్ఛతోపాటు, సంతోషంగా ఉండడానికి అవసరమైన ప్రతీది ఇచ్చాడు.

నిజమైన స్వేచ్ఛ ఆనందించిన కాలం

4. ఆదాముహవ్వలు ఎలాంటి స్వేచ్ఛను ఆనందించారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

4 ఆదికాండములోని మొదటి రెండు అధ్యాయాలు చదివితే, ప్రస్తుతం ప్రజలు కలలు కంటున్న స్వేచ్ఛను ఆదాముహవ్వలు ఆనందించారని మనం తెలుసుకుంటాం. వాళ్లకు దేనికీ లోటు ఉండేది కాదు, దేనికీ భయపడాల్సిన అవసరం ఉండేది కాదు, ఎలాంటి అన్యాయం జరిగేది కాదు. ఆహారం, పని, అనారోగ్యం, మరణం వంటివాటి గురించిన దిగులే ఉండేది కాదు. (ఆది. 1:27-29; 2:8, 9, 15) దానర్థం వాళ్ల స్వేచ్ఛకు ఎలాంటి హద్దులు ఉండేవి కాదనా? చూద్దాం.

5. అందరూ స్వేచ్ఛను ఆనందించాలంటే ఏమి తప్పనిసరి?

5 పర్యవసానాల గురించిన చింత లేకుండా నచ్చింది చేయగలిగితేనే నిజమైన స్వేచ్ఛ ఉన్నట్లు చాలామంది అనుకుంటారు. ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం, “నిర్ణయాలు తీసుకుని వాటిని అమలులో పెట్టగలగడమే” స్వేచ్ఛ. ఆ పుస్తకం ఇంకా ఇలా చెప్తుంది, “చట్టపరంగానైతే, సమాజం అన్యాయమైన, అనవసరమైన, కష్టమైన హద్దులు పెట్టకపోతేనే స్వేచ్ఛ ఉన్నట్లు.” దానర్థం, అందరూ స్వేచ్ఛను ఆనందించాలంటే కొన్ని హద్దులు ఉండడం తప్పనిసరి. కానీ ఎలాంటి హద్దులు న్యాయమైనవో, అవసరమైనవో, సరైనవో నిర్ణయించే హక్కు ఎవరికి ఉంది?

6. (ఎ) హద్దుల్లేని స్వేచ్ఛ యెహోవా దేవునికి మాత్రమే ఉందని ఎందుకు చెప్పవచ్చు? (బి) మనుషులకు ఎలాంటి స్వేచ్ఛ ఉంది? ఎందుకు?

6 మనందరం గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయమేమిటంటే, యెహోవా దేవునికి మాత్రమే హద్దుల్లేని పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే ఆయనే సమస్తాన్ని సృష్టించాడు, ఆయనే విశ్వమంతటికీ సర్వశక్తిగల పరిపాలకుడు. (1 తిమో. 1:17; ప్రక. 4:11) యెహోవా స్థానాన్ని రాజైన దావీదు ఎంతో చక్కని మాటలతో వర్ణించాడు. (1 దినవృత్తాంతములు 29:11, 12 చదవండి.) కానీ పరలోకంలో అలాగే భూమ్మీద ఉన్నవాళ్లందరి స్వేచ్ఛకు హద్దులు ఉన్నాయి. ఎలాంటి హద్దులు న్యాయమైనవో, అవసరమైనవో, సరైనవో నిర్ణయించే హక్కు యెహోవాకు మాత్రమే ఉందని అందరూ తెలుసుకోవాలి. సృష్టి ఆరంభం నుండే యెహోవా అన్నిటికీ హద్దులు విధించాడు.

7. సహజంగా మనం చేసే ఎలాంటి పనులు సంతోషాన్నిస్తాయి?

7 ఆదాముహవ్వలు ఎంతో స్వేచ్ఛను ఆనందించినప్పటికీ వాళ్లకు హద్దులు ఉండేవి. వాటిలో కొన్ని వాళ్లకు సహజంగా అనిపించాయి. ఉదాహరణకు జీవించి ఉండాలంటే వాళ్లు ఊపిరి తీసుకోవాలి, తినాలి, నిద్రపోవాలి. దానర్థం వాళ్లకు స్వేచ్ఛ లేదనా? కాదు. నిజానికి వాటిని చేస్తూ సంతోషాన్ని, సంతృప్తిని పొందేలా యెహోవా వాళ్లను తయారుచేశాడు. (కీర్త. 104:14, 15; ప్రసం. 3:12, 13) మనందరం స్వచ్ఛమైన గాలిని, నచ్చిన ఆహారాన్ని, కంటినిండా నిద్రను ఆనందిస్తాం. అంతేగానీ అవి మన స్వేచ్ఛకు అడ్డు తగులుతున్నట్లు భావించం. ఆదాముహవ్వలకు కూడా అలానే అనిపించివుంటుంది.

8. దేవుడు ఆదాముహవ్వలకు ఏ నిర్దిష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు? ఆయన సంకల్పం ఏమిటి?

8 యెహోవా ఆదాముహవ్వలకు ఒక నిర్దిష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. అదేమిటంటే, వాళ్లు పిల్లల్ని కని ఈ భూమిని నింపాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. (ఆది. 1:28) ఆ ఆజ్ఞ వాళ్లకున్న స్వేచ్ఛకు అడ్డు తగిలిందా? కానేకాదు. బదులుగా భూమంతటినీ అందమైన తోటలా మార్చి, పరిపూర్ణులైన పిల్లలతో శాశ్వత కాలంపాటు జీవించే అవకాశాన్ని ఇచ్చింది. దేవుని సంకల్పం కూడా అదే. (యెష. 45:18) నేడు పెళ్లి చేసుకోకూడదని అనుకునేవాళ్లు, ఒకవేళ చేసుకున్నా పిల్లల్ని వద్దనుకునేవాళ్లు దేవుని మాటను లెక్కచేయట్లేదని కాదు. కొంతమంది మాత్రం కొన్ని సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. (1 కొరిం. 7:36-38) ఎందుకు? అందులో వాళ్లు సంతోషాన్ని, సంతృప్తిని పొందాలని కోరుకుంటున్నారు. (కీర్త. 127:3) ఆదాముహవ్వలు దేవుని మాట వినుంటే తమ వివాహ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని శాశ్వతకాలంపాటు ఆనందించేవాళ్లు.

నిజమైన స్వేచ్ఛను కోల్పోవడం

9. ఆదికాండము 2:17లో ఉన్న దేవుని ఆజ్ఞ అన్యాయమైనది, అనవసరమైనది, కష్టమైనది కాదని ఎందుకు చెప్పవచ్చు?

9 యెహోవా ఆదాముహవ్వలకు మరో ఆజ్ఞ ఇవ్వడంతోపాటు, దాన్ని మీరితే ఏమి జరుగుతుందో కూడా స్పష్టంగా చెప్పాడు. యెహోవా ఇలా చెప్పాడు, ‘మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాల్ని తినకూడదు; నువ్వు వాటిని తిను దినాన నిశ్చయంగా చచ్చెదవు.’ (ఆది. 2:17) అది అన్యాయమైన, అనవసరమైన, కష్టమైన ఆజ్ఞ అంటారా? అది వాళ్లకున్న స్వేచ్ఛకు అడ్డు తగిలిందా? కానేకాదు. నిజానికి దేవుని ఆజ్ఞ ఎంతో తెలివైనదని, అర్థవంతమైనదని చాలామంది బైబిలు విద్వాంసులు అంటారు. వాళ్లలో ఒకరు ఆ ఆజ్ఞ గురించి ఏమంటున్నారంటే, “మానవజాతికి ఏది మంచిదో . . . ఏది మంచిది కాదో దేవునికి మాత్రమే తెలుసని . . . అది స్పష్టం చేస్తుంది. ‘మంచిని’ ఆనందించాలంటే మానవజాతి దేవున్ని నమ్మాలి, ఆయన మాట వినాలి. ఒకవేళ వినకపోతే ఏది మంచిదో . . . ఏది మంచిది కాదో వాళ్లకు వాళ్లే నిర్ణయించుకోవాలి.” అలా సొంతగా నిర్ణయించుకోవడం మనుషుల వల్ల అవ్వని పని.

ఆదాముహవ్వల నిర్ణయం వల్ల ఘోరమైన పర్యవసానాలు ఎదుర్కొంటున్నాం (9-12 పేరాలు చూడండి)

10. ఏమి చేయాలో ఎంపిక చేసుకునే హక్కు; ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే హక్కు ఒకటేనా? వివరించండి.

10 నచ్చింది చేసే స్వేచ్ఛ దేవుడు ఆదాముకు ఇవ్వలేదని కొంతమంది అనుకోవచ్చు. నిజానికి వాళ్లు ఒక విషయాన్ని గుర్తించట్లేదు. ఏమి చేయాలో ఎంపిక చేసుకునే హక్కుకూ, ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే హక్కుకూ తేడా ఉంది. దేవుడు చెప్పినట్లు చేయాలో లేదో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఆదాముహవ్వలకు ఉండేది. కానీ ఏది మంచో ఏది చెడో నిర్ణయించే హక్కు మాత్రం యెహోవాకే ఉంది. ఆదాముహవ్వలకు ఆ హక్కు లేదని చెప్పడానికి ఏదెను తోటలో ఉన్న ‘మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమే’ ఒక రుజువు. (ఆది. 2:9) మనం తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం చెప్పలేం. అలాగే, ఫలితాలు ఎప్పుడూ మంచిగానే వస్తాయని కూడా ఖచ్చితంగా చెప్పలేం. అందుకే ప్రజలు మంచి ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నా వాటివల్ల బాధను, ఘోరమైన నష్టాన్ని అనుభవించడం మనం తరచూ చూస్తుంటాం. (సామె. 14:12) దీన్నిబట్టి మనుషుల శక్తిసామర్థ్యాలకు పరిమితులు ఉన్నాయని మనకు అర్థమౌతుంది. యెహోవా ఆదాముహవ్వలకు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాల్ని తినకూడదని చెప్పడం ద్వారా, నిజమైన స్వేచ్ఛను ఆనందించాలంటే తన మాట వినాలని వాళ్లకు నేర్పించాడు. కానీ ఆదాముహవ్వలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?

11, 12. ఆదాముహవ్వల నిర్ణయం వల్ల ఘోరమైన పర్యవసానాలు ఎందుకు వచ్చాయి? ఉదాహరణ చెప్పండి.

11 విచారకరంగా, దేవుడు చెప్పినట్లు చేయకూడదని ఆదాముహవ్వలు నిర్ణయించుకున్నారు. ‘మీ కళ్లు తెరుచుకుంటాయి, మీకు మంచి-చెడులు తెలిసి మీరు దేవునిలా అవుతారు’ అని సాతాను చెప్పిన మాయమాటల్ని హవ్వ నమ్మింది. (ఆది. 3:5, NW) మరి సాతాను చెప్పినట్లు ఆ పండు తినగానే వాళ్ల స్వేచ్ఛకు రెక్కలు వచ్చాయా? లేదు. బదులుగా, యెహోవా మాట వినకపోవడం నాశనానికి నడిపిస్తుందని తెలుసుకున్నారు. (ఆది. 3:16-19) ఎందుకు? ఎందుకంటే ఏది మంచో, ఏది చెడో నిర్ణయించుకునే స్వేచ్ఛను యెహోవా మనుషులకు ఇవ్వలేదు.—సామెతలు 20:24; యిర్మీయా 10:23 చదవండి.

12 దీన్ని ఒక పైలట్‌ విమానాన్ని నడపడంతో పోల్చవచ్చు. అతను గమ్యానికి సురక్షితంగా చేరాలంటే ముందుగానే నిర్ణయించబడిన దారిలో విమానాన్ని నడుపుతూ, దిశానిర్దేశిత ఉపకరణాలను ఉపయోగించుకుంటూ, ఎయిర్‌ ట్రాఫిక్‌ను నియంత్రించే అధికారులతో సంభాషిస్తూ వెళ్లాలి. ఒకవేళ పైలట్‌ ఈ నిర్దేశాలను పాటించకుండా తనకు నచ్చిన దారిలో వెళ్తే ఘోరమైన ప్రమాదం జరుగుతుంది. అదేవిధంగా, ఆదాముహవ్వలు దేవుని నిర్దేశాన్ని వద్దనుకుని తమకు నచ్చినట్లు ప్రవర్తించారు. ఫలితం? వాళ్లూ, వాళ్ల పిల్లలూ పాపమరణాలకు బానిసలయ్యారు. (రోమా. 5:12) ఆదాముహవ్వలు మంచిచెడులను నిర్ణయించుకునే హక్కును తమ చేతుల్లోకి తీసుకోవడం ద్వారా ఎక్కువ స్వేచ్ఛను పొందలేకపోయారు. పైగా యెహోవా ఇచ్చిన నిజమైన స్వేచ్ఛను కూడా చేతులారా పోగొట్టుకున్నారు.

నిజమైన స్వేచ్ఛను తిరిగి ఎలా పొందవచ్చు?

13, 14. నిజమైన స్వేచ్ఛను మనమెలా పొందవచ్చు?

13 ఎలాంటి హద్దుల్లేని స్వేచ్ఛ ఉంటే చాలా బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. అది నిజమేనా? స్వేచ్ఛ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న మాట నిజమే. కానీ, హద్దులు లేకపోయుంటే ఈ ప్రపంచం ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి! ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఏం చెప్తుందంటే, ‘క్రమపద్ధతిలో నడిచే ఏ సమాజంలోని చట్టాలైనా సంశ్లిష్టంగా ఉంటాయి. ఎందుకంటే అవి రక్షణ ఇవ్వడంతోపాటు, ప్రజల స్వేచ్ఛకు హద్దులు విధించాలి.’ అయితే అవి నిజంగా సంశ్లిష్టమైనవే. అందుకే వాటిని మనకు అర్థమయ్యేలా వివరించడానికి, ఎలా పాటించాలో తెలపడానికి ఎన్నో చట్టాలు, ఎంతోమంది లాయర్లు, న్యాయవాదులు ఉండడం మనం గమనిస్తున్నాం.

14 మనం నిజమైన స్వేచ్ఛను ఎలా పొందవచ్చో యేసుక్రీస్తు వివరించాడు. ఆయనిలా అన్నాడు, “నా వాక్యంలో నిలిచివుంటేనే మీరు నిజంగా నా శిష్యులు. అంతేకాదు, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది.” (యోహా. 8:31, 32) దీన్నిబట్టి, నిజమైన స్వేచ్ఛ కావాలంటే మనం రెండు పనులు చేయాలని అర్థమౌతుంది. మొదటిది, యేసు బోధించిన సత్యాన్ని మనం అంగీకరించాలి. రెండవది, ఆయన శిష్యులు అవ్వాలి. ఇంతకీ దేన్నుండి నిజమైన స్వేచ్ఛను పొందుతాం? యేసు ఇంకా ఇలా అన్నాడు, “పాపం చేసే ప్రతీ వ్యక్తి పాపానికి దాసుడు . . . కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే, మీరు నిజంగా స్వతంత్రులౌతారు.”—యోహా. 8:34, 36.

15. యేసు మాటిచ్చిన స్వేచ్ఛ శ్రేష్ఠమైనదని ఎందుకు చెప్పవచ్చు?

15 యేసు మాటిచ్చిన స్వేచ్ఛ, నేడు చాలామంది కావాలనుకుంటున్న స్వేచ్ఛ కన్నా ఎంతో శ్రేష్ఠమైనది. “కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే, మీరు నిజంగా స్వతంత్రులౌతారు” అని యేసు చెప్పిన మాటలకు అర్థమేమిటి? పాపపు బానిసత్వం నుండి విడుదల చేయడం ద్వారా స్వేచ్ఛనిస్తానని యేసు మాటిస్తున్నాడు. మానవజాతి అనుభవించిన అతి ఘోరమైన బానిసత్వం అదే. ఇంతకీ మనం ఏవిధంగా పాపానికి బానిసలుగా ఉన్నాం? పాపం మనల్ని చెడ్డ పనులు చేసేలా ప్రోత్సహిస్తుంది. సరైనదాన్ని లేదా మంచిని చేయకుండా అడ్డుపడుతుంది. ఫలితంగా చిరాకు, వేదన, బాధ, చివరికి మరణం అనుభవిస్తున్నాం. (రోమా. 6:23) పాపానికి బానిసలుగా ఉండడం వల్ల కలిగే బాధను అపొస్తలుడైన పౌలు స్వయంగా అనుభవించాడు. (రోమీయులు 7:21-25 చదవండి.) పాపం పూర్తిగా తొలగిపోయిన రోజునే ఆదాముహవ్వలు మొదట్లో అనుభవించిన లాంటి నిజమైన స్వేచ్ఛను మనం ఆనందిస్తాం.

16. నిజమైన స్వేచ్ఛను ఎప్పుడు పొందుతాం?

16 “నా వాక్యంలో నిలిచివుంటేనే” అని యేసు అన్న మాటల్నిబట్టి, ఆయనిచ్చే స్వేచ్ఛను పొందాలంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని అర్థమౌతుంది. అందుకే మనం సమర్పించుకున్న క్రైస్తవులుగా, మన జీవితాన్ని త్యాగం చేసి, యేసు తన శిష్యులకు విధించిన హద్దుల్ని అంగీకరించాం. (మత్త. 16:24) భవిష్యత్తులో విమోచన క్రయధనం ద్వారా కలిగే పూర్తి ప్రయోజనాల్ని పొందినప్పుడు, యేసు మాటిచ్చినట్లు మనం నిజమైన స్వేచ్ఛను పొందుతాం.

17. (ఎ) అసలైన సంతోషాన్ని, సంతృప్తిని పొందాలంటే ఏమి చేయాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి తెలుసుకుంటాం?

17 అసలైన సంతోషాన్ని, సంతృప్తిని పొందాలంటే యేసుకు శిష్యులుగా ఉంటూ ఆయన చెప్పినవాటిని పాటించాలి. అలాచేస్తే, పాపమరణాల బానిసత్వం నుండి పూర్తి స్వేచ్ఛను పొందుతాం. (రోమీయులు 8:1-2, 20-21 చదవండి.) అయితే, ప్రస్తుతం మనకున్న స్వేచ్ఛను తెలివిగా ఎలా ఉపయోగించుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అప్పుడే నిజమైన స్వేచ్ఛకు దేవుడైన యెహోవాను శాశ్వతకాలంపాటు ఘనపర్చగలుగుతాం.