కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నియమిత పురుషులారా—తిమోతి నుండి నేర్చుకోండి

నియమిత పురుషులారా—తిమోతి నుండి నేర్చుకోండి

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల్లో వేలమంది సహోదరులు సంఘ పెద్దలుగా, సంఘ పరిచారకులుగా నియమించబడ్డారు. ఒకవేళ ఆ ప్రియ సహోదరుల్లో మీరూ ఒకరైతే, ఆ కొత్త సేవావకాశాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఆనందిస్తూ ఉండివుంటారు.

బహుశా కాస్త ఆందోళనగా కూడా అనిపించి ఉంటుంది. జేసన్‌ అనే ఒక యువ సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు, “నన్ను సంఘపెద్దగా నియమించినప్పుడు, కొత్త బాధ్యతలతో ఊపిరాడనట్లు అనిపించింది.” మోషే , యిర్మీయాలకు యెహోవా కొత్త నియామకాల్ని ఇచ్చినప్పుడు, వాటిని చేయగల సామర్థ్యం తమకు లేదని వాళ్లు భావించారు. (నిర్గ. 4:10; యిర్మీ. 1:6) మీకు కూడా అలాగే అనిపిస్తుంటే ఆ భావాల్ని అధిగమించి, ఎలా ప్రగతి సాధిస్తూ ఉండవచ్చు? ఆ విషయంలో శిష్యుడైన తిమోతి ఆదర్శం మీకు సహాయం చేస్తుంది.—అపొ. 16:1-3.

తిమోతి నుండి నేర్చుకోండి

అపొస్తలుడైన పౌలు తిమోతిని మిషనరీ యాత్రలకు తీసుకెళ్లే సమయానికి తిమోతి బహుశా 20వ పడిలో ఉండివుండవచ్చు. కాబట్టి ఆత్మవిశ్వాసం లేకపోవడంవల్ల తిమోతి మొదట్లో కాస్త వెనకాడివుంటాడు. (1 తిమో. 4:11, 12; 2 తిమో. 1:1, 2, 7) కానీ ఒక దశాబ్దం తర్వాత తిమోతి గురించి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఇలా అన్నాడు, “ప్రభువైన యేసుకు ఇష్టమైతే, త్వరలో తిమోతిని మీ దగ్గరికి పంపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే . . . తిమోతిలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు నా దగ్గర ఎవ్వరూ లేరు.”—ఫిలి. 2:19, 20.

తిమోతి సంఘపెద్దగా అంత మంచిపేరు ఎలా సంపాదించుకున్నాడు? ఆయన నుండి మనం నేర్చుకోగల ఆరు పాఠాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

1. ఆయన ప్రజలపట్ల నిజమైన శ్రద్ధ చూపించాడు. పౌలు ఫిలిప్పీలోని సహోదరులకు రాస్తూ తిమోతి ‘మీ విషయంలో నిజమైన శ్రద్ధ చూపిస్తాడు’ అని అన్నాడు. (ఫిలి. 2:20) అవును, తిమోతి ప్రజలపట్ల శ్రద్ధ చూపించాడు. వాళ్ల ఆధ్యాత్మిక సంక్షేమం పట్ల నిజమైన ఆసక్తి చూపించాడు, వాళ్లకు సహాయం చేయడానికి ఇష్టంగా సమయం వెచ్చించాడు.

ప్రయాణికుల్ని పట్టించుకోని బస్సు డ్రైవర్‌లా మీరు ఉండకండి. అలాంటి డ్రైవర్‌ ప్రయాణికులు బస్సు ఎక్కుతున్నారో లేదో పట్టించుకోకుండా, కేవలం బస్సును టైమ్‌కు తీసుకెళ్లడం గురించే ఆలోచిస్తాడు. గత 20 ఏళ్లుగా సంఘపెద్దగా సేవచేస్తున్న విలియమ్‌ అనే సహోదరుడు, కొత్తగా సంఘ పెద్దలైన వాళ్లకు ఈ సలహా ఇస్తున్నాడు, “సహోదర సహోదరీలను ప్రేమించండి. సంఘ పనుల గురించే కాకుండా సహోదరుల అవసరాలను కూడా పట్టించుకోండి.”

2. ఆయన ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానం ఇచ్చాడు. ఇతర సహోదరులకు, తిమోతికి మధ్యున్న తేడా గురించి చెప్తూ పౌలు ఇలా రాశాడు, “మిగతావాళ్లంతా ఎవరి పనులు వాళ్లు చూసుకుంటున్నారే తప్ప యేసుక్రీస్తుకు సంబంధించిన పనులు చూడట్లేదు.” (ఫిలి. 2:21) ఈ ఉత్తరాన్ని రాసే సమయానికి పౌలు రోములో ఉన్నాడు. అక్కడి సహోదరులు తమ సొంత పనుల గురించే ఎక్కువగా ఆలోచించడం ఆయన గమనించాడు. కొన్ని విషయాల్లో వాళ్లు యెహోవాకు మొదటిస్థానం ఇవ్వలేదు. కానీ తిమోతి అలా కాదు! మంచివార్తను వ్యాప్తిచేసే అవకాశాలు వచ్చినప్పుడు, “నేనున్నాను నన్ను పంపు” అని యెషయా లాంటి స్ఫూర్తిని చూపించాడు.—యెష. 6:8.

మీ వ్యక్తిగత బాధ్యతల్ని, ఆధ్యాత్మిక బాధ్యతల్ని సరైన స్థానంలో ఉంచాలంటే ఏమి చేయాలి? మొట్టమొదటిగా, ఏవి ప్రాముఖ్యమైనవో నిర్ణయించుకోండి. “ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో మీరు పరిశీలించి తెలుసుకోవాలని” పౌలు చెప్పాడు. (ఫిలి. 1:10) దేవుడు వేటిని ప్రాముఖ్యమైన వాటిగా చూస్తాడో వాటినే మీరూ ప్రాముఖ్యంగా ఎంచండి. రెండవదిగా, పనుల్ని తేలిక చేసుకోండి. మీ సమయాన్ని, శక్తిని వృథా చేసేవాటికి దూరంగా ఉండండి. పౌలు తిమోతికి ఈ సలహా ఇచ్చాడు, “నువ్వు యౌవన కోరికల నుండి పారిపో . . . నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, శాంతిని అలవర్చుకోవడానికి శతవిధాలా కృషి చేయి.”—2 తిమో. 2:22.

3. ఆయన దేవుని సేవలో చాలా కష్టపడ్డాడు. పౌలు ఫిలిప్పీయులకు ఇలా గుర్తుచేశాడు, “తిమోతి తానేంటో నిరూపించుకున్నాడని మీకు తెలుసు. ఒక పిల్లవాడు తన తండ్రితో కలిసి పని చేసినట్టు, మంచివార్తను వ్యాప్తిచేయడానికి అతను నాతో కలిసి సేవచేశాడు.” (ఫిలి. 2:22) తిమోతి సోమరిపోతు కాదు. ఆయన పౌలుతోపాటు కష్టపడి పనిచేశాడు, దానివల్ల వాళ్లిద్దరి మధ్యున్న సంబంధం మరింత బలపడింది.

నేడు దేవుని సంస్థలో చేయాల్సిన పని ఎంతో ఉంది. ఆ పని నిజమైన సంతృప్తినిస్తుంది, తోటి సహోదరసహోదరీలతో మీకున్న సంబంధాన్ని బలపరుస్తుంది. కాబట్టి “ఎప్పుడూ ప్రభువు సేవలో నిమగ్నమై” ఉండాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి.—1 కొరిం.15:58.

4. ఆయన నేర్చుకున్నవాటిని పాటించాడు. పౌలు తిమోతికి ఇలా రాశాడు, “నువ్వైతే నా బోధను, నా జీవన విధానాన్ని, నా లక్ష్యాన్ని, నా విశ్వాసాన్ని, నా ఓర్పును, నా ప్రేమను, నా సహనాన్ని జాగ్రత్తగా అనుసరించావు.” (2 తిమో. 3:10) తిమోతి నేర్చుకున్నవాటిని పాటించాడు కాబట్టే పెద్దపెద్ద బాధ్యతలు చేపట్టడానికి కావాల్సిన అర్హత సంపాదించాడు.—1 కొరిం. 4:17.

పెద్దవాళ్లను, అనుభవం ఉన్నవాళ్లను మీరు ఆదర్శంగా తీసుకోగలరా? ఎన్నో ఏళ్లుగా సంఘపెద్దగా సేవచేస్తున్న టామ్‌ అనే సహోదరుడు ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “అనుభవం ఉన్న సంఘపెద్ద నా మీద వ్యక్తిగత శ్రద్ధ చూపించి చక్కని శిక్షణ నిచ్చాడు. ఆయన్ను ఎప్పటికప్పుడు సలహాలు అడుగుతూ వాటిని పాటించేవాణ్ణి. దానివల్ల నాలో ఆత్మవిశ్వాసం చాలా త్వరగా పెరిగింది.”

5. ఆయన తనకు తాను శిక్షణ ఇచ్చుకున్నాడు. పౌలు తిమోతిని ఇలా ప్రోత్సహించాడు, “దైవభక్తి చూపించడమే లక్ష్యంగా పెట్టుకొని నీకు నువ్వు శిక్షణ ఇచ్చుకో.” (1 తిమో. 4:7) ఒక క్రీడాకారుడు, కోచ్‌ ఉన్నప్పటికీ తనకు తాను శిక్షణ ఇచ్చుకోవాలి. పౌలు ఇంకా ఇలా ప్రోత్సహించాడు, “బహిరంగంగా చదివే విషయంలో, ప్రోత్సహించే విషయంలో, బోధించే విషయంలో నిమగ్నమవ్వు. . . . వీటిని ధ్యానించు; నీ ప్రగతి అందరికీ స్పష్టంగా కనిపించేలా వీటిలో నిమగ్నమవ్వు.”—1 తిమో. 4:13-15.

మీరు కూడా మీకున్న నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ఉండాలి. శ్రద్ధగల విద్యార్థిగా ఉండండి, సంస్థ ఎప్పటికప్పుడు ఇచ్చే నిర్దేశాలను తెలుసుకుంటూ ఉండండి. అంతేకాదు, జాగ్రత్తగా పరిశోధన చేయకుండా ఎలాంటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించేంత అనుభవం మీకుందనే మితిమీరిన ఆత్మవిశ్వాసం చూపించకండి. తిమోతిని అనుకరిస్తూ మీ గురించి, మీ బోధ గురించి జాగ్రత్తగా ఉండండి.—1 తిమో. 4:16.

6. ఆయన పవిత్రశక్తి మీద ఆధారపడ్డాడు. పరిచర్య గురించి మాట్లాడుతూ పౌలు తిమోతికి ఇలా గుర్తుచేశాడు, “నీకు అప్పగించబడిన ఈ అమూల్యమైన సంపదను మనలో ఉన్న పవిత్రశక్తి సహాయంతో కాపాడు.” (2 తిమో. 1:14) తన పరిచర్యను కాపాడుకోవడానికి తిమోతి పవిత్రశక్తి మీద ఆధారపడ్డాడు.

ఎన్నో దశాబ్దాలపాటు సంఘపెద్దగా సేవచేస్తున్న డోనల్డ్‌ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “నియమిత పురుషులు యెహోవాతో తమకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచాలి. అలాంటివాళ్లు ‘అంతకంతకూ బలం పొందుతారు.’ అవును వాళ్లు దేవుని పవిత్రశక్తి కోసం ప్రార్థించి, అది పుట్టించే లక్షణాల్ని అలవర్చుకుంటే తోటి సహోదరులకు ఆశీర్వాదంగా ఉండగలుగుతారు.”—కీర్త. 84:7; 1 పేతు. 4:11.

మీ సేవావకాశాన్ని విలువైనదిగా ఎంచండి

కొత్తగా నియామకం పొందిన ఎంతోమంది సహోదరులు యెహోవా సేవలో ప్రగతి సాధించడాన్ని చూడడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ ఆర్టికల్‌ మొదట్లో ప్రస్తావించిన జేసన్‌ అనే సహోదరుడు ఇలా చెప్పాడు, “నేను సంఘపెద్దగా సేవచేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, నా ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ఇప్పుడు నా నియామకాన్ని ఆనందిస్తున్నాను, దాన్ని ఒక అద్భుతమైన సేవావకాశంగా చూస్తున్నాను.”

మీరు యెహోవా సేవలో ప్రగతి సాధిస్తూ ఉండాలనుకుంటున్నారా? అయితే తిమోతి నుండి నేర్చుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. అప్పుడు మీరు కూడా దేవుని ప్రజలకు ఒక ఆశీర్వాదంగా మారతారు.