కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనులారా,
 ఆధ్యాత్మిక లక్ష్యాలపై మనసుపెడుతున్నారా?

యౌవనులారా,
 ఆధ్యాత్మిక లక్ష్యాలపై మనసుపెడుతున్నారా?

“నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.”సామె. 16:3.

పాటలు: 135, 144

1-3. (ఎ) యౌవనులు ఎందుకు అయోమయంలో పడతారు? ఆ పరిస్థితిని దేనితో పోల్చవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) అలాంటి పరిస్థితుల్లో యౌవనులకు ఏమి సహాయం చేస్తుంది?

మీరొక ప్రత్యేక కార్యక్రమానికి వెళ్లాలనుకుంటున్నట్లు ఊహించుకోండి. అది మీ ప్రాంతానికి చాలా దూరంలో జరుగుతోంది కాబట్టి అక్కడికి వెళ్లాలంటే మీరు బస్సులో ప్రయాణించాలి. బస్టాండ్‌కు వెళ్లేసరికి అది ప్రయాణికులతో కిటకిట లాడడం, చాలా బస్సులు ఆగివుండడం మీరు చూశారు. దాంతో మీకు కాసేపు అంతా అయోమయంగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో, మీ గమ్యానికి చేర్చే బస్సు ఏదో తెలిసి ఉండడం ప్రాముఖ్యం. ఒకవేళ వేరే బస్సు ఎక్కితే అది మీరు అనుకున్న గమ్యానికి కాకుండా ఇంకెక్కడికో తీసుకెళ్తుంది.

2 జీవితం ఒక ప్రయాణం లాంటిది, యౌవనులు బస్టాండులోని ప్రయాణికులు లాంటివాళ్లు. కొన్నిసార్లు జీవితంలో ఎన్ని అవకాశాలు వస్తాయంటే, వాటిలో ఏది ఎంపిక చేసుకోవాలో తెలియక యౌవనులు అయోమయంలో పడతారు. కానీ యౌవనులారా, జీవితంలో ఏమి చేయాలని అనుకుంటున్నారో మీకు ఖచ్చితంగా తెలిసుంటే సరైన నిర్ణయం తీసుకోవడం మరింత తేలికౌతుంది. ఇంతకీ మీరు చేయాల్సినది ఏమిటి?

3 ఈ ఆర్టికల్‌ దానికి జవాబిస్తుంది. అంతేకాదు యెహోవాను సంతోషపెట్టడానికి మీ జీవితంలో ముఖ్యమైన స్థానమివ్వమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఆయన్ను సంతోషపెట్టాలంటే, మీరు జీవితంలో తీసుకునే ప్రతీ నిర్ణయం యెహోవా ఆలోచనకు తగ్గట్లు ఉండాలి. ఆ నిర్ణయం మీ చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లల్ని కనడం వంటివాటికి సంబంధించినది కావచ్చు. అంతేకాదు మిమ్మల్ని యెహోవాకు మరింత దగ్గర చేసే ఆధ్యాత్మిక లక్ష్యాల్ని చేరుకోవడానికి మీరు కృషిచేయాలి. మీరు యెహోవా సేవపై మనసుపెడితే ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. జీవితంలో మీరు విజయం సాధించడానికి కూడా సహాయం చేస్తాడు.—సామెతలు 16:3 చదవండి.

ఆధ్యాత్మిక లక్ష్యాలు ఎందుకు పెట్టుకోవాలి?

4. ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

4 ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవడం మంచిది. ఎందుకు? దానికిగల మూడు కారణాల్ని ఇప్పుడు పరిశీలిస్తాం. మొదటి రెండు కారణాల్ని బట్టి, ఆధ్యాత్మిక లక్ష్యాల్ని చేరుకోవడానికి కృషిచేయడం ద్వారా మీరు యెహోవాకు మరింత సన్నిహిత స్నేహితులౌతారని గ్రహిస్తారు. మూడవ కారణాన్ని బట్టి, యౌవనంలో ఉండగానే అలాంటి లక్ష్యాలు పెట్టుకోవడం ఎందుకు మంచిదో తెలుసుకుంటారు.

5. ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవడానికి అత్యంత ప్రాముఖ్యమైన కారణమేమిటి?

5 ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవడానికి అత్యంత ప్రాముఖ్యమైన మొదటి కారణమేమిటంటే, యెహోవా మనపై చూపిస్తున్న ప్రేమకు, మనకోసం చేసిన పనులకు కృతజ్ఞత చెప్పడానికి అదొక మార్గం. కీర్తనకర్త ఇలా చెప్పాడు, ‘యెహోవాకు కృతజ్ఞతలు తెలపడం మంచిది. ఎందుకంటే యెహోవా, నీ కార్యాల్ని బట్టి నేను సంతోషించేలా చేశావు; నీ చేతి పనుల్ని బట్టి నేను సంతోషంతో కేకలు వేస్తున్నాను.’ (కీర్త. 92:1, 4, NW) యెహోవా మీకిచ్చిన వాటన్నిటి గురించి ఒకసారి ఆలోచించండి. మీ ప్రాణం, మీ విశ్వాసం, బైబిలు, సంఘం, పరదైసులో నిత్యం జీవిస్తామనే నిరీక్షణ అన్నీ ఆయన ఇచ్చినవే. కాబట్టి వీటన్నిటినీ ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాలన్నా, ఆయనకు మరింత దగ్గరవ్వాలన్నా మనం ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవాలి.

6. (ఎ) యెహోవాతో మీకున్న సంబంధంపై ఆధ్యాత్మిక లక్ష్యాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? (బి) యౌవనంలో ఉండగానే మీరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చు?

6 రెండవ కారణమేమిటంటే, ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకోవడానికి కృషిచేసినప్పుడు మీరు యెహోవా దృష్టిలో మంచి పనులు చేసినవాళ్లౌతారు. అది మిమ్మల్ని ఆయనకు మరింత దగ్గర చేస్తుంది. అపొస్తలుడైన పౌలు ఇలా మాటిచ్చాడు, “మీరు చేసే పనిని, తన పేరు విషయంలో మీరు చూపించే ప్రేమను దేవుడు మర్చిపోడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు.” (హెబ్రీ. 6:10) పెద్దవాళ్లే లక్ష్యాలు పెట్టుకోవాలనే నియమమేమీ లేదు. ఉదాహరణకు క్రిస్టీన్‌, నమ్మకమైన సహోదరసహోదరీల జీవిత కథలను క్రమంగా చదవాలనే లక్ష్యం పెట్టుకునే నాటికి ఆమె వయసు 10 ఏళ్లు. టోబీ, బాప్తిస్మానికి ముందే బైబిలంతా చదవడం పూర్తిచేయాలనే లక్ష్యం పెట్టుకునే నాటికి అతని వయసు 12 ఏళ్లు. మాక్సిమ్‌, అతని చెల్లి నయోమి బాప్తిస్మం తీసుకునే నాటికి వాళ్ల వయసు 11, 10 ఏళ్లు. బెతెల్‌లో సేవ చేయాలనేది వాళ్లిద్దరి లక్ష్యం. అంతేకాదు ఆ లక్ష్యంపై మనసుపెట్టడానికి వీలుగా ఒక బెతెల్‌ అప్లికేషన్‌ను ఇంట్లో గోడకు అతికించుకున్నారు. మీ విషయమేమిటి? మీరు కూడా ఏవైనా లక్ష్యాల్ని పెట్టుకుని వాటిని చేరుకోవడానికి కృషిచేయగలరా?—ఫిలిప్పీయులు 1:10, 11 చదవండి.

7, 8. (ఎ) లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం ఎలా తేలికౌతుంది? (బి) యూనివర్సిటీలో చదవకూడదని ఒక టీనేజీ అమ్మాయి ఎందుకు నిర్ణయించుకుంది?

7 యౌవనంలో ఉండగానే లక్ష్యాలు పెట్టుకోవడం మంచిదనడానికి మూడవ కారణమేమిటి? యౌవనంలో ఉండగానే మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కోర్సు చదవాలి, ఏ ఉద్యోగం ఎంచుకోవాలి వంటి ఇతర విషయాలు మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అవి మీ గమ్యానికి వెళ్లే మార్గం మధ్యలో వచ్చే కూడలి (క్రాస్‌రోడ్స్‌) లాంటివి. మీ గమ్యం ఏమిటో మీకు ఖచ్చితంగా తెలిసుంటే ఏ రోడ్డులో వెళ్లాలో తేలిగ్గా నిర్ణయించుకోగలుగుతారు. జీవితం విషయంలో కూడా అంతే. మీ లక్ష్యాలేమిటో మీకు తెలిస్తే, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం తేలికౌతుంది. సామెతలు 21:5 ఇలా చెప్తుంది, “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు.” ఇంకో మాటలో చెప్పాలంటే, శ్రద్ధ గలవాళ్ల ఆలోచనలు విజయాన్ని ఇస్తాయి. కాబట్టి ఎంత త్వరగా లక్ష్యాలు పెట్టుకొని వాటిని చేరుకోవడానికి ప్రణాళిక వేసుకుంటే అంత త్వరగా జీవితంలో విజయం సాధిస్తారు. టీనేజీలో ఉండగా ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన డామారిస్‌ జీవితంలో ఇది నిజమైంది.

8 డామారిస్‌ స్కూల్లో మంచి మార్కులు సాధించింది. కాబట్టి యూనివర్సిటీలో ఉచితంగా న్యాయశాస్త్రం చదివే అవకాశం ఆమెకు ఉంది. కానీ ఆమె మాత్రం తక్కువ జీతం వచ్చే పార్ట్‌టైమ్‌ ఉద్యోగం ఎంచుకుంది. ఎందుకంటే పయినీరు అవ్వాలని ఆమె చిన్నప్పుడే నిర్ణయించుకుంది. ఆమె ఇలా చెప్పింది, “దానికోసం నేను పార్ట్‌టైమ్‌ ఉద్యోగం ఎంచుకోవాల్సి వచ్చింది. యూనివర్సిటీలో చదివిన డిగ్రీ పట్టా ఉంటే చాలా డబ్బు సంపాదించి ఉండేదాన్ని. కానీ పార్ట్‌టైమ్‌ ఉద్యోగం దొరికేది కాదు.” 20 ఏళ్లుగా డామారిస్‌ పయినీరుగా సేవచేస్తోంది. ఆమె పెట్టుకున్న లక్ష్యం, టీనేజీలో తీసుకున్న నిర్ణయం సరైనదని ఆమె భావిస్తుందా? అవును. “నేను పనిచేసే చోటుకు చాలామంది లాయర్లు వస్తుంటారు. నేను ఒకవేళ న్యాయశాస్త్రం చదివుంటే వాళ్లలాంటి ఉద్యోగాన్నే చేస్తూ ఉండేదాన్ని. అయితే వాళ్లలో చాలామంది తమ ఉద్యోగంలో సంతోషాన్ని పొందట్లేదు. నేను పయినీరుగా సేవచేయాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్లలాంటి ఒత్తిడి అనుభవించకుండా తప్పించుకున్నాను. అంతేకాదు యెహోవా సేవ చేస్తూ ఇన్నేళ్లు ఎంతో సంతోషాన్ని అనుభవించాను” అని ఆమె చెప్పింది.

9. మన మధ్యున్న యౌవనులను ఎందుకు మెచ్చుకోవాలి?

9 ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల్లోని వేలమంది యౌవనుల్ని మనం మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్లు యెహోవాతో ఉన్న స్నేహానికి, ఆధ్యాత్మిక లక్ష్యాలకు తమ జీవితంలో మొదటిస్థానం ఇస్తున్నారు. ఒకవైపు తమ జీవితాన్ని ఆనందిస్తూనే, మరోవైపు ప్రతీ విషయంలో యెహోవా ఇచ్చే నిర్దేశాల్ని పాటించడం నేర్చుకుంటున్నారు. ఉదాహరణకు చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం వంటివాటిలో వాళ్లు యెహోవా నిర్దేశాన్ని పాటిస్తున్నారు. సొలొమోను ఇలా అన్నాను, “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామె. 3:5, 6) యౌవనులారా, యెహోవా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మీరు ఆయనకు ఎంతో విలువైనవాళ్లు. ఆయన మిమ్మల్ని సంరక్షిస్తాడు, నడిపిస్తాడు, దీవిస్తాడు.

యెహోవా గురించి ఇతరులకు చెప్పడానికి సిద్ధపడండి

10. (ఎ) ప్రకటనా పనికే మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన స్థానం ఎందుకు ఇవ్వాలి? (బి) మీ నమ్మకాల్ని మరింత బాగా వివరించడానికి మీకేమి సహాయం చేస్తాయి?

10 యెహోవాను సంతోషపెట్టడం మీదే మీరు మనసుపెడితే, ఆయన గురించి ఇతరులకు చెప్పాలనే కోరిక మీలో కలుగుతుంది. యేసుక్రీస్తు ఇలా అన్నాడు “ముందు అన్ని దేశాల్లో మంచివార్త ప్రకటించబడాలి.” (మార్కు 13:10) కాబట్టి ప్రకటనా పనే అన్నిటికన్నా అత్యవసరమైనది, మన జీవితంలో దానికే అత్యంత ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలి. మరి ప్రీచింగ్‌లో ఎక్కువ సమయాన్ని గడపాలనే లక్ష్యాన్ని మీరు పెట్టుకోగలరా? పయినీరు సేవ చేయగలరా? ఒకవేళ ప్రీచింగ్‌ మీకు అంత ఆసక్తిగా అనిపించకపోతే? మీ నమ్మకాల్ని మరింత బాగా వివరించడానికి మీకేమి సహాయం చేస్తాయి? రెండు విషయాలు సహాయం చేస్తాయి. మొదటిది బాగా సిద్ధపడండి. రెండవది, యెహోవా గురించి మీకు తెలిసిన వాటిని ఇతరులకు చెప్పడం ఆపకండి. అప్పుడు ప్రీచింగ్‌ చేయడం వల్ల కలిగే ఆనందాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.

యెహోవా గురించి ఇతరులకు సాక్ష్యమివ్వడానికి మీరెలా సిద్ధపడతారు? (11, 12 పేరాలు చూడండి)

11, 12. (ఎ) యెహోవా గురించి ఇతరులకు చెప్పడానికి మీరెలా సిద్ధపడవచ్చు? (బి) స్కూల్లో యెహోవా గురించి మాట్లాడేందుకు వచ్చిన అవకాశాన్ని ఒక అబ్బాయి ఎలా ఉపయోగించుకున్నాడు?

11 మీ తోటి విద్యార్థులు అడిగే అవకాశమున్న ప్రశ్నలకు ఎలా జవాబివ్వవచ్చో సిద్ధపడండి. ఉదాహరణకు, “నువ్వు దేవున్ని ఎందుకు నమ్ముతావు?” అనే ప్రశ్ననే తీసుకోండి. దానికి జవాబివ్వడానికి సహాయం చేసే ఆర్టికల్స్‌ jw.org వెబ్‌సైట్‌లో ఉన్నాయి. మీరు బైబిలు బోధలు > టీనేజర్లు అనే విభాగంలో చూస్తే “దేవుడు ఉన్నాడని నేను ఎందుకు నమ్ముతున్నాను?” అనే శీర్షికతో ఒక వర్క్‌షీట్‌ కనిపిస్తుంది. అందులోని సూచనలను పాటిస్తూ సొంతమాటల్లో జవాబు ఎలా చెప్పవచ్చో సిద్ధపడండి. మీకు ఉపయోగపడే మూడు బైబిలు లేఖనాలు కూడా ఆ వర్క్‌షీట్‌లో కనిపిస్తాయి. అవి హెబ్రీయులు 3:4, రోమీయులు 1:20, కీర్తన 139:14. ఇంకా ఎన్నో ఇతర ప్రశ్నలకు జవాబుల్ని సిద్ధపడడానికి సహాయం చేసే వర్క్‌షీట్లు కూడా వెబ్‌సైట్‌లో ఉన్నాయి.—1 పేతురు 3:15 చదవండి.

12 మీ తోటి విద్యార్థులకు jw.org వెబ్‌సైట్‌ పరిచయం చేసి వాళ్లనే స్వయంగా చూడమని చెప్పండి. లూకా అనే అబ్బాయి అదే చేశాడు. ఆ అబ్బాయివాళ్ల క్లాసులో వివిధ మతాల గురించిన చర్చ జరుగుతోంది. వాళ్ల పాఠ్యపుస్తకంలో యెహోవాసాక్షుల గురించి తప్పుడు సమాచారం ఉన్నట్లు గమనించాడు. కాస్త భయంగా అనిపించినా లూకా లేచి నిలబడి, పుస్తకంలో సాక్షుల గురించి ఉన్న విషయాలు ఎందుకు తప్పో వివరించడానికి అనుమతి ఇవ్వమని టీచర్‌ను అడిగాడు. తన నమ్మకాల్ని వివరించడానికి అనుమతి ఇవ్వగానే, మన వైబ్‌సైట్‌ను తన క్లాస్‌లోని వాళ్లందరికీ చూపించాడు. అంతేకాదు, ఏడిపించేవాళ్లకు కొట్టకుండానే బుద్ధిచెప్పండి అనే వీడియోను ఇంట్లో అందరూ చూసి రావాలని టీచర్‌ పిల్లలకు హోంవర్క్‌ కూడా ఇచ్చింది. యెహోవా గురించి స్కూల్‌లో మాట్లాడినందుకు లూకాకు ఎంత సంతోషంగా అనిపించి ఉంటుందో మీరు ఊహించగలరా?

13. సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు నిరుత్సాహపడకూడదు?

13 సమస్యలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి, మీ లక్ష్యాల్ని చేరుకోవడానికి కృషిచేస్తూనే ఉండండి. (2 తిమో. 4:2) క్యాతరీనా అలానే చేసింది. ఆమెకు 17 ఏళ్లున్నప్పుడు, తన తోటి ఉద్యోగులందరికీ ప్రకటించాలనే లక్ష్యం పెట్టుకుంది. వాళ్లలో ఒకరు ఆమెను చాలాసార్లు అవమానించారు. కానీ ఆమె మాత్రం తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. క్యాతరీనా మంచి ప్రవర్తన హాన్స్‌ అనే మరో తోటి ఉద్యోగికి నచ్చింది. అతను మన ప్రచురణలు చదవడం మొదలుపెట్టాడు, స్టడీ తీసుకున్నాడు, బాప్తిస్మం కూడా పొందాడు. అప్పటికే క్యాతరీనా వేరే ఉద్యోగానికి మారిపోవడంతో హాన్స్‌ ప్రగతి సాధించిన సంగతి ఆమెకు తెలియలేదు. 13 ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు క్యాతరీనా తన కుటుంబంతో కలిసి మీటింగ్‌కి వెళ్లినప్పుడు, ఆరోజు బహిరంగ ప్రసంగం ఇవ్వడానికి వచ్చిన అతిథి ప్రసంగీకుడు హాన్స్‌ అని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది! తోటి ఉద్యోగులకు ప్రకటించాలనే లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేసినందుకు క్యాతరీనాకు చాలా సంతోషంగా అనిపించింది.

మీ లక్ష్యాల్ని మర్చిపోకండి

14, 15. (ఎ) ఇతరులు మిమ్మల్ని ఒత్తిడి చేసినప్పుడు ఏమి గుర్తుంచుకోవాలి? (బి) తోటివాళ్ల ఒత్తిడికి లొంగిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

14 ఇప్పటివరకు ఈ ఆర్టికల్‌ యెహోవాను సంతోషపెట్టడం మీద, ఆధ్యాత్మిక లక్ష్యాల మీద మనసుపెట్టమని మిమ్మల్ని ప్రోత్సహించింది. కానీ మీ వయసులో ఉన్న చాలామంది యౌవనులు జీవితాన్ని సరదాగా గడపడం పైనే మనసుపెడతారు. మీరు కూడా వాళ్ల బాటలోనే నడవాలని వాళ్లు కోరుకుంటారు. కానీ ఏదోకరోజు, మీ లక్ష్యాల్ని చేరుకోవడం మీకు ఎంత ప్రాముఖ్యమో ఇతరులకు తెలిసేలా చేయాలి. ఆ లక్ష్యాల్ని మర్చిపోయేలా చేయడానికి ఇతరుల్ని అనుమతించకండి. ఆర్టికల్‌ మొదట్లో ప్రస్తావించిన బస్టాండ్‌లో మీరే ఉంటే ఏమి చేస్తారు? ఏ బస్సులోని ప్రయాణికులు సరదాగా ఆనందిస్తున్నట్లు కనిపిస్తే ఆ బస్సు ఎక్కేస్తారా? అలా చేయరు కదా!

15 తోటివాళ్ల ఒత్తిడికి లొంగిపోకుండా ఉండాలంటే మీరేమి చేయవచ్చు? ఒత్తిడిని అధిగమించడం కష్టం చేసే పరిస్థితులకు దూరంగా ఉండండి. (సామె. 22:3) తప్పు చేయడం వల్ల ఎదురయ్యే బాధాకరమైన పర్యవసానాల గురించి ఆలోచించండి. (గల. 6:7) మీకు మంచి సలహా అవసరమనే నిజాన్ని వినయంగా ఒప్పుకోండి. మీ అమ్మానాన్నలు అలాగే సంఘంలో అనుభవమున్న సహోదరసహోదరీలు చెప్పే మాటను వినండి.—1 పేతురు 5:5, 6 చదవండి.

16. వినయంగా ఉండడం ప్రాముఖ్యమని క్రిస్టోఫ్‌ అనుభవం ఎలా రుజువు చేస్తుంది?

16 క్రిస్టోఫ్‌ అనే యువకునికి, మంచి సలహాను స్వీకరించేందుకు వినయం సహాయం చేసింది. అతను బాప్తిస్మం తీసుకున్న కొంతకాలానికి క్రమంగా జిమ్‌కి వెళ్లడం మొదలుపెట్టాడు. అక్కడ తోటి యౌవనులు అతన్ని తమతోపాటు స్పోర్ట్స్‌ క్లబ్‌లో చేరమని పిలిచారు. క్రిస్టోఫ్‌ ఆ విషయం గురించి సంఘపెద్దతో మాట్లాడాడు. అయితే అందులో చేరడం వల్ల పోటీతత్వం లాంటి చెడ్డ స్ఫూర్తి ఏర్పడే ప్రమాదాల గురించి ఆలోచించమని ఆ సంఘపెద్ద క్రిస్టోఫ్‌కు చెప్పాడు. అయినాగానీ క్రిస్టోఫ్‌ ఆ స్పోర్ట్స్‌ క్లబ్‌లో చేరాడు. కొన్నిరోజులు గడిచేసరికి, వాళ్లు ఆడే ఆటలు ఎంత క్రూరంగా, ప్రమాదకరంగా ఉన్నాయో క్రిస్టోఫ్‌ గ్రహించాడు. ఈసారి మళ్లీ సంఘపెద్దలతో మాట్లాడాడు, వాళ్లు అతనికి బైబిలు నుండి సలహా ఇచ్చారు. ఆ సందర్భం గురించి క్రిస్టోఫ్‌ ఇలా చెప్పాడు, “యెహోవా నాకు మంచి సలహాలు ఇచ్చేవాళ్లను పంపించాడు. మొదట్లో నిర్లక్ష్యం చేశాను గానీ, చివరికి నేను యెహోవా మాట విన్నాను.” మంచి సలహాను స్వీకరించేంత వినయం మీకుందా?

17, 18. (ఎ) యౌవనుల విషయంలో యెహోవా ఏమి కోరుకుంటున్నాడు? (బి) మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో పెద్దయ్యాక బాధపడకూడదంటే ఏమి చేయాలి? ఒక అనుభవం చెప్పండి.

17 బైబిలు ఇలా చెప్తుంది, “యౌవనుడా [లేదా యౌవనస్థురాలా], నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము.” (ప్రసం. 11:9) మీరు మీ యౌవనాన్ని ఆనందించాలని యెహోవా కోరుకుంటున్నాడు. దానికొక మార్గం ఆధ్యాత్మిక లక్ష్యాలపై మనసుపెట్టడమనీ; మీ ప్రణాళికల్లో, నిర్ణయాల్లో యెహోవా సలహాను పాటించడమనీ ఈ ఆర్టికల్‌లో తెలుసుకున్నారు. దీన్ని మీరు ఎంత త్వరగా చేస్తే, యెహోవా నడిపింపును, సంరక్షణను, దీవెనల్ని అంత త్వరగా ఆనందిస్తారు. ఆయన తన వాక్యం ద్వారా మీకిచ్చే మంచి సలహాలన్నిటి గురించి ముఖ్యంగా ‘నీ యౌవనకాలంలోనే నీ మహాగొప్ప సృష్టికర్తను గుర్తుచేసుకో’ అనే సలహా గురించి ఆలోచించి, పాటించండి.—ప్రసం. 12:1-2, NW.

18 యౌవనస్థులు ఇట్టే పెద్దవాళ్లు అయిపోతారు. అయితే వాళ్లలో చాలామంది తప్పుడు లక్ష్యాలు పెట్టుకున్నందుకు లేదా యౌవనంలో ఉండగా అసలు లక్ష్యాలే పెట్టుకోనందుకు బాధపడుతుంటారు. కానీ మీరు మీ ఆధ్యాత్మిక లక్ష్యాలపై మనసుపెడితే మీ నిర్ణయాల విషయంలో పెద్దయ్యాక బాధపడరు. మిర్జానా విషయంలో అదే నిజమైంది. టీనేజీలో ఉన్నప్పుడు ఆమె స్పోర్ట్స్‌ బాగా ఆడేది. వింటర్‌ ఒలింపిక్‌ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం కూడా ఆమెకు వచ్చింది. కానీ ఆమె మాత్రం పూర్తికాల సేవ చేయాలని నిర్ణయించుకుంది. 30 కన్నా ఎక్కువ ఏళ్లు గడిచిపోయాయి, ఇప్పటికీ ఆమె భర్తతో కలిసి పూర్తికాల సేవ చేస్తోంది. పేరు, ఘనత, అధికారం, డబ్బు వెంట పరుగులు తీసేవాళ్లు ఎప్పటికీ సంతోషంగా ఉండరని ఆమె అంది. యెహోవా సేవ చేయడం, ఆయన గురించి ఇతరులకు నేర్పించడమే అన్నిటికన్నా మంచి లక్ష్యాలని కూడా ఆమె చెప్పింది.

19. యౌవనంలో ఉండగానే ఆధ్యాత్మిక లక్ష్యాలపై మనసుపెట్టడం ఎందుకు మంచిది?

19 యౌవనులారా, మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా యెహోవా సేవమీదే మనసుపెడుతున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాం. మీరు ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుంటున్నారు, ప్రకటనా పనికే అత్యంత ప్రాముఖ్యమైన స్థానం ఇస్తున్నారు. పైగా మీ లక్ష్యాల్ని మర్చిపోయేలా చేసే అవకాశాన్ని ఈ లోకానికి ఇవ్వట్లేదు. మీ ప్రయాస వృథా అవ్వదనే నమ్మకంతో ఉండండి. మిమ్మల్ని ప్రేమించి, మద్దతిచ్చే సహోదరసహోదరీలు మీకు అండగా ఉన్నారు. కాబట్టి ‘మీ పనుల భారము యెహోవామీద ఉంచండి, అప్పుడు మీ ఉద్దేశాలు సఫలమౌతాయి.’