కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 17

చెడ్డదూతలతో పోరాడడానికి యెహోవా సహాయం తీసుకోండి

చెడ్డదూతలతో పోరాడడానికి యెహోవా సహాయం తీసుకోండి

“మనం పోరాడుతున్నది . . . పరలోకంలోని ఎంతోమంది చెడ్డదూతలతో.”—ఎఫె. 6:12.

పాట 55 శత్రువులకు భయపడకండి!

ఈ ఆర్టికల్‌లో . . . *

1. ఎఫెసీయులు 6:10-13 ప్రకారం, యెహోవా మనపట్ల శ్రద్ధ చూపించే ఒక మార్గమేమిటి? వివరించండి.

యెహోవా తన సేవకులమైన మనపట్ల శ్రద్ధ చూపించే ఒక మార్గమేమిటంటే, శత్రువులతో పోరాడేలా మనకు సహాయం చేయడం. మన ప్రధాన శత్రువులు ఎవరంటే సాతాను, చెడ్డదూతలు. వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండమని యెహోవా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు వాళ్లతో పోరాడడానికి కావాల్సినవాటిని కూడా ఆయన మనకు ఇస్తున్నాడు. (ఎఫెసీయులు 6:10-13 చదవండి.) మనం యెహోవా సహాయాన్ని అంగీకరించి, ఆయనపై పూర్తిగా ఆధారపడితే అపవాదిని ఎదిరించడంలో విజయం సాధిస్తాం. కాబట్టి అపొస్తలుడైన పౌలుకు ఉన్నలాంటి నమ్మకాన్నే మనమూ కలిగివుండవచ్చు. ఆయనిలా రాశాడు, “దేవుడు మనతో ఉండగా, ఎవరు మనకు వ్యతిరేకంగా ఉండగలరు?”—రోమా. 8:31.

2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

2 నిజ క్రైస్తవులముగా మనం సాతాను మీద, చెడ్డదూతల మీద ఎక్కువ మనసుపెట్టం గానీ యెహోవా గురించి నేర్చుకోవడం మీద, ఆయన సేవ చేయడం మీదే మనసుపెడతాం. (కీర్త. 25:5) అయినప్పటికీ, సాతాను చేసే పనుల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే, అలా తెలుసుకుంటేనే మనం సాతాను చేతిలో మోసపోకుండా ఉంటాం. (2 కొరిం. 2:11; అధస్సూచి.) ఈ ఆర్టికల్‌లో, సాతాను అలాగే చెడ్డదూతలు ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించే ఒక ముఖ్యమైన మార్గమేమిటో తెలుసుకుంటాం. అంతేకాదు, వాళ్లతో మనమెలా విజయవంతంగా పోరాడవచ్చో పరిశీలిస్తాం.

చెడ్డదూతలు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు?

3-4. (ఎ) మంత్రతంత్రాలు అంటే ఏంటి? (బి) మంత్రతంత్రాలకు ఉన్న శక్తిని ప్రజలు ఎంత ఎక్కువగా నమ్ముతున్నారు?

3 సాతాను, చెడ్డదూతలు ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించే ఒక ముఖ్యమైన మార్గం, మంత్రతంత్రాలు. మనుషులు సాధారణంగా తెలుసుకోలేని వాటిని తాము తెలుసుకోగలమని, వాళ్లు అదుపుచేయలేని వాటిని తాము అదుపు చేయగలమని మంత్రతంత్రాలు చేసేవాళ్లు చెప్తుంటారు. ఉదాహరణకు, కొంతమంది సోదె లేదా జ్యోతిష్యం ద్వారా భవిష్యత్తు తెలుసుకోగలమని చెప్తారు. ఇంకొంతమంది, చనిపోయినవాళ్లతో మాట్లాడుతున్నట్లుగా మనల్ని నమ్మిస్తుంటారు. మరికొంతమంది మంత్రవిద్య లేదా మ్యాజిక్‌ చేస్తారు, వాళ్లు ఇతరుల మీద మంత్రాలు కూడా ప్రయోగిస్తారు. *

4 మంత్రతంత్రాలకు ఉన్న శక్తిని ప్రజలు ఎంత ఎక్కువగా నమ్ముతున్నారు? లాటిన్‌ అమెరికాకు, కరీబియన్‌కు చెందిన 18 దేశాల్లో నిర్వహించిన ఒక సర్వేలో ప్రతీ ముగ్గురిలో ఒకరు మ్యాజిక్‌ని, మంత్రవిద్యను, లేదా క్షుద్రవిద్యను నమ్ముతున్నారని తేలింది. అంతేకాదు, ఆత్మలతో మాట్లాడడం సాధ్యమేనని కూడా దాదాపు అంతేమంది నమ్ముతున్నారు. ఆఫ్రికాలోని 18 దేశాల్లో మరో సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో, సగంకంటే ఎక్కువమంది తాము మంత్రవిద్యను నమ్ముతున్నామని చెప్పారు. నిజానికి మనం ఎక్కడ జీవిస్తున్నప్పటికీ, మంత్రతంత్రాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే సాతాను, “లోకమంతటినీ మోసం” చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.—ప్రక. 12:9.

5. మంత్రతంత్రాల గురించి యెహోవా ఎలా భావిస్తున్నాడు?

5 యెహోవా “సత్య” దేవుడు. (కీర్త. 31:5) ఆయన మంత్రతంత్రాల గురించి ఎలా భావిస్తున్నాడు? ఆయన వాటిని అసహ్యించుకుంటున్నాడు! యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు, “తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునముచెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు.” (ద్వితీ. 18:10-12) యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నేడు క్రైస్తవులు పాటించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, మంత్రతంత్రాల విషయంలో యెహోవాకున్న భావాలు మారలేదని మనకు తెలుసు.—మలా. 3:6.

6. (ఎ) ప్రజలకు హానిచేయడానికి సాతాను మంత్రతంత్రాల్ని ఎలా ఉపయోగిస్తాడు? (బి) ప్రసంగి 9:5 ప్రకారం, చనిపోయినవాళ్ల స్థితి గురించిన సత్యం ఏంటి?

6 మంత్రతంత్రాలు ఉపయోగించుకుని సాతాను ప్రజలకు హాని చేస్తాడని యెహోవాకు తెలుసు కాబట్టే ఆయన వాటిగురించి మనల్ని హెచ్చరిస్తున్నాడు. సాతాను అబద్ధాల్ని వ్యాప్తిచేయడానికి మంత్రతంత్రాల్ని ఉపయోగిస్తాడు. చనిపోయినవాళ్లు ఏదోక స్థలంలో బ్రతికేవున్నారు అనేది ఆ అబద్ధాల్లో ఒకటి. (ప్రసంగి 9:5 చదవండి) ప్రజల్ని భయపెట్టి, వాళ్లను యెహోవా నుండి దూరం చేయడానికి కూడా సాతాను మంత్రతంత్రాల్ని ఉపయోగిస్తాడు. ప్రజలు మంత్రతంత్రాలు అభ్యసిస్తే, వాళ్లు యెహోవాను కాకుండా చెడ్డదూతల్ని నమ్ముతారనేది సాతాను ఉద్దేశం.

చెడ్డదూతలతో ఎలా పోరాడవచ్చు?

7. యెహోవా మనకు ఏం చెప్తున్నాడు?

7 ఇంతకుముందు ప్రస్తావించినట్లు, సాతాను చేతుల్లో అలాగే చెడ్డదూతల చేతుల్లో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలో యెహోవా మనకు చెప్తున్నాడు. సాతానుతో, చెడ్డదూతలతో పోరాడడానికి మనం చేయగల కొన్ని పనుల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

8. (ఎ) చెడ్డదూతలతో పోరాడడానికి చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి? (బి) చనిపోయినవాళ్ల గురించి సాతాను చెప్పే అబద్ధాన్ని కీర్తన 146:4 ఎలా బట్టబయలు చేస్తుంది?

8 దేవుని వాక్యాన్ని చదవండి, చదివినవాటిని లోతుగా ఆలోచించండి. చెడ్డదూతలు వ్యాప్తిచేసే అబద్ధాల్ని తిరస్కరించడానికి మనం చేయాల్సిన ముఖ్యమైన పని అదే. దేవుని వాక్యం పదునైన ఖడ్గం లాంటిది, అది సాతాను చెప్పే అబద్ధాల్ని బయటపెడుతుంది. (ఎఫె. 6:17) ఉదాహరణకు, చనిపోయినవాళ్లు బ్రతికివున్నవాళ్లతో మాట్లాడగలరనే అబద్ధాన్ని దేవుని వాక్యం బట్టబయలు చేస్తుంది. (కీర్తన 146:4 చదవండి) అంతేకాదు, కేవలం యెహోవా మాత్రమే భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పగలడని బైబిలు మనకు గుర్తుచేస్తుంది. (యెష. 45:21; 46:10) మనం క్రమంగా దేవుని వాక్యం చదివి, లోతుగా ఆలోచించినప్పుడు చెడ్డదూతలు చెప్పే అబద్ధాల్ని తిరస్కరించడానికి, అసహ్యించుకోవడానికి సిద్ధంగా ఉంటాం.

9. మంత్రతంత్రాలకు సంబంధించిన వేటిని మనం తిరస్కరించాలి?

9 మంత్రతంత్రాలకు సంబంధించిన దేన్నీ చేయకండి. నిజ క్రైస్తవులముగా, మనం మంత్రతంత్రాలకు సంబంధించిన దేన్నీ చేయం. ఉదాహరణకు, చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్ల దగ్గరకు మనం వెళ్లం, లేదా వేరే ఏ విధంగానూ చనిపోయినవాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించం. ముందటి ఆర్టికల్‌లో చర్చించుకున్నట్లు, చనిపోయినవాళ్ల ఆత్మలు బ్రతికే ఉన్నాయనే నమ్మకం ఆధారంగా చేసే అంత్యక్రియల ఆచారాల్లో మనం పాల్గొనం. అంతేకాదు, భవిష్యత్తు తెలుసుకోవడానికి జ్యోతిష్యుల దగ్గరకు వెళ్లం. (యెష. 8:19) అలాంటివన్నీ చాలా ప్రమాదకరమని, అవి సాతానుతో అలాగే చెడ్డదూతలతో నేరుగా సంబంధం పెట్టుకునేలా చేస్తాయని మనకు తెలుసు.

మంత్రతంత్రాలకు సంబంధించిన వాటన్నిటినీ పారేయడం ద్వారా, అలాంటి వినోదానికి దూరంగా ఉండడం ద్వారా మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని అనుకరించండి (10-12 పేరాలు చూడండి)

10-11. (ఎ) మొదటి శతాబ్దంలోని కొంతమంది సత్యం తెలుసుకున్నాక ఏం చేశారు? (బి) 1 కొరింథీయులు 10:21 ప్రకారం మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్ని మనం ఎందుకు అనుకరించాలి? ఎలా అనుకరించవచ్చు?

10 మంత్రతంత్రాలకు సంబంధించిన వస్తువులను పారేయండి. మొదటి శతాబ్దంలో ఎఫెసులో ఉన్న కొంతమందికి మంత్రతంత్రాలతో సంబంధం ఉండేది. కానీ వాళ్లు సత్యం తెలుసుకున్నాక పెద్ద మార్పు చేసుకున్నారు. “మంత్రతంత్రాలు చేసేవాళ్లలో చాలామంది తమ పుస్తకాల్ని ఒకచోటికి తీసుకొచ్చి అందరిముందు వాటిని కాల్చేశారు.” (అపొ. 19:19) చెడ్డదూతలతో పోరాడడానికి వాళ్లు చేయగలిగినదంతా చేశారు. వాళ్ల దగ్గరున్న పుస్తకాలు చాలా ఖరీదైనవి. అయినా, వాళ్లు ఆ పుస్తకాల్ని వేరేవాళ్లకు ఇచ్చే బదులు లేదా అమ్మే బదులు వాటిని కాల్చేశారు. వాళ్లు ఆ పుస్తకాల ఖరీదు కన్నా యెహోవాను సంతోషపెట్టడం గురించే ఎక్కువ ఆలోచించారు.

11 మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్ని మనమెలా అనుకరించవచ్చు? మంత్రతంత్రాలకు సంబంధించిన వస్తువులు ఏవీ మన దగ్గర ఉండకుండా చూసుకోవడం తెలివైన పని. చెడ్డదూతల నుండి తమను తాము రక్షించుకోవడానికి ధరించే తాయెత్తులు, రక్షక రేకులు లేదా ఇంట్లో పెట్టుకునే వేరే వస్తువులు కూడా వాటికి సంబంధించినవే.—1 కొరింథీయులు 10:21 చదవండి.

12. వినోదం గురించి మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

12 మీ వినోదాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోండి. మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను మంత్రతంత్రాలకు సంబంధించిన పుస్తకాలు, పత్రికలు, లేదా ఇంటర్నెట్‌ ఆర్టికల్స్‌ చదువుతున్నానా? నేను వినే సంగీతం, చూసే సినిమాలు, టీవీ కార్యక్రమాలు, ఆడే వీడియో గేమ్స్‌ ఎలా ఉన్నాయి? నా వినోదంలో మంత్రతంత్రాలకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? దాంట్లో పిశాచాలు లాంటివి, లేదా మానవాతీత శక్తులకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? మ్యాజిక్‌, మంత్రాలు, లేదా శపించడం వంటివి కేవలం సరదా కోసం అన్నట్లు, వాటిలో ఏ హాని లేదన్నట్లు అది చూపిస్తుందా?’ నిజమే, కొన్ని కల్పిత కథలు లేదా ఊహించి రాసే కథలు మంత్రతంత్రాలకు సంబంధించినవి కాకపోవచ్చు. మీ వినోదాన్ని పరిశీలించుకుంటున్నప్పుడు, యెహోవా అసహ్యించుకునే దేన్నీ ఎంచుకోకూడదని నిశ్చయించుకోండి. మనం దేవుని ముందు, “మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానికి” చేయగలిగినదంతా చేయాలి.—అపొ. 24:16. *

13. మనం ఏం చేయకూడదు?

13 చెడ్డదూతల గురించిన కథలు చెప్పకండి. ఈ విషయంలో యేసు ఆదర్శాన్ని మనం పాటించాలి. (1 పేతు. 2:21) ఆయన భూమ్మీదికి రాకముందు పరలోకంలో జీవించాడు. ఆయనకు సాతాను గురించి, చెడ్డదూతల గురించి చాలా విషయాలు తెలుసు. కానీ ఆ చెడ్డదూతలు చేసినవాటి గురించి ఆయన కథలు చెప్పలేదు. యేసు ప్రజలకు యెహోవా గురించి బోధించాలనుకున్నాడు గానీ సాతాను గురించి కాదు. మనం యేసును అనుకరిస్తూ, చెడ్డదూతలు గురించి కథలు వ్యాప్తి చేయకుండా ఉందాం. బదులుగా, సత్యమనే ‘మంచి విషయంతో మన హృదయం ఉప్పొంగుతోంది’ అని మన మాటల ద్వారా చూపిద్దాం.—కీర్త. 45:1, NW.

మనం చెడ్డదూతలకు భయపడాల్సిన అవసరంలేదు. యెహోవా, యేసు, దేవదూతలు వాళ్లకన్నా చాలా శక్తిమంతులు (14-15 పేరాలు చూడండి) *

14-15. (ఎ) మనం చెడ్డదూతలకు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు? (బి) నేడు యెహోవా తన ప్రజల్ని కాపాడుతున్నాడని చెప్పడానికి రుజువు ఏంటి?

14 చెడ్డదూతలకు భయపడకండి. ఈ లోకంలో మనకు చెడు జరగవచ్చు. అనుకోకుండా యాక్సిడెంట్లు, జబ్బులు, ఆఖరికి మరణం కూడా సంభవించవచ్చు. అయితే, చెడ్డదూతలే వీటికి కారణమని మనం అనుకోకూడదు. అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు ఎవ్వరికైనా జరగవచ్చని బైబిలు చెప్తుంది. (ప్రసం. 9:11) చెడ్డదూతల విషయానికొస్తే, వాళ్లకన్నా యెహోవాయే చాలా శక్తిమంతుడని నిరూపించుకున్నాడు. ఉదాహరణకు, యోబును చంపడానికి ఆయన సాతానును అనుమతించలేదు. (యోబు 2:6) మోషే కాలంలో, ఐగుప్తులోని మాంత్రికుల కన్నా తనకే ఎక్కువ శక్తి ఉందని యెహోవా చూపించాడు. (నిర్గ. 8:18; 9:11) యెహోవా ఆ తర్వాత, పరలోకంలో యేసుకు సాతాను మీద, చెడ్డదూతల మీద అధికారం ఇచ్చాడు. దాంతో యేసు వాళ్లను అక్కడినుండి భూమ్మీదకు పడద్రోశాడు. అంతేకాదు ఆయన త్వరలో చెడ్డదూతల్ని అగాధంలో పడేస్తాడు, అప్పుడు వాళ్లు ఎవ్వరికీ హాని చేయలేరు.—ప్రక. 12:9; 20:2, 3.

15 నేడు యెహోవా తన ప్రజల్ని కాపాడుతున్నాడని చెప్పడానికి ఎన్నో రుజువుల్ని మనం చూస్తున్నాం. దీనిగురించి ఆలోచించండి: మనం భూవ్యాప్తంగా సత్యాన్ని ప్రకటిస్తున్నాం, బోధిస్తున్నాం. (మత్త. 28:19, 20) ఫలితంగా, అపవాది చెడ్డపనుల్ని బయట పెడుతున్నాం. ఒకవేళ సాతానుకు దీన్ని ఆపే శక్తి ఉంటే, అతను మన పనంతటినీ ఆపగలిగేవాడు, కానీ అది అతని వల్ల కాదు. కాబట్టి మనం చెడ్డదూతలకు భయపడాల్సిన అవసరంలేదు. “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది” అని మనకు తెలుసు. (2 దిన. 16:9) ఒకవేళ మనం యెహోవాకు నమ్మకంగా ఉంటే, చెడ్డదూతలు మనకు శాశ్వత హాని చేయలేరు.

యెహోవా సహాయాన్ని అంగీకరించినవాళ్లు పొందే దీవెనలు

16-17. చెడ్డదూతలతో పోరాడడానికి ధైర్యం ఎందుకు అవసరమో ఉదాహరణ చెప్పండి.

16 చెడ్డదూతలతో పోరాడడానికి ధైర్యం కావాలి. ముఖ్యంగా, మన మంచి కోరే స్నేహితులు లేదా బంధువులు మనల్ని వ్యతిరేకించినప్పుడు ధైర్యం చాలా అవసరం. అయితే అలాంటి సందర్భాల్లో ధైర్యం చూపించేవాళ్లను యెహోవా దీవిస్తాడు. ఘానాకు చెందిన ఎరిక అనే సహోదరి ఉదాహరణ గమనించండి. ఎరికకు 21 ఏళ్లున్నప్పుడు బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆమె తండ్రి మంత్రతంత్రాలు చేసే పూజారి. దాంతో ఆయన, చనిపోయిన తన పూర్వీకుల ఆత్మలకు అర్పించిన మాంసాన్ని తినే ఆచారంలో పాల్గొనమని ఎరికను ఒత్తిడి చేశాడు. ఎరిక దాన్ని తిరస్కరించినప్పుడు, అది ఆ పూర్వీకులకు అవమానంగా ఆమె కుటుంబం భావించింది. ఆ పూర్వీకుల ఆత్మలు తమ కుటుంబాన్ని మానసిక, శారీరక రోగాలతో శిక్షిస్తారని వాళ్లు నమ్మారు.

17 ఆ ఆచారాన్ని పాటించాలని ఎరిక కుటుంబ సభ్యులు ఆమెను బలవంతం చేశారు. అయినా ఆమె ఆ ఆచారంలో పాల్గొనలేదు, దానివల్ల ఎరిక ఇంట్లో నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే కొంతమంది సాక్షులు ఆమెకు ఆశ్రయం ఇచ్చారు. ఆ విధంగా, యెహోవా ఆమెకు ఒక కొత్త కుటుంబాన్ని ఇచ్చి దీవించాడు. తోటి సాక్షులే ఆమెకు అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు అయ్యారు. (మార్కు 10:29, 30) ఎరికను ఆమె ఇంట్లోవాళ్లు కాదనుకున్నా, ఆమె వస్తువులన్నిటినీ కాల్చేసినా ఆమె మాత్రం యెహోవాకు నమ్మకంగా ఉంది. ఆమె బాప్తిస్మం తీసుకుని, ఇప్పుడు ఒక క్రమ పయినీరుగా సేవచేస్తోంది. ఆమె చెడ్డదూతలకు భయపడలేదు. ఆమె తన కుటుంబం గురించి ఇలా చెప్తుంది, “నా కుటుంబ సభ్యులు యెహోవాను తెలుసుకోవడమనే ఆనందాన్ని సొంతం చేసుకోవాలని, మన ప్రేమగల దేవుణ్ణి సేవించడం వల్ల వచ్చే స్వేచ్ఛను అనుభవించాలని నేను ప్రతీరోజు ప్రార్థిస్తున్నాను.”

18. యెహోవాపై నమ్మకం ఉంచడం వల్ల ఎలాంటి దీవెనలు పొందుతాం?

18 బహుశా మనందరి విశ్వాసానికి అలాంటి పరీక్షలే ఎదురుకాకపోవచ్చు. కానీ మనందరం చెడ్డదూతలతో పోరాడాలి, యెహోవా మీద నమ్మకం ఉంచాలి. మనం అలాచేస్తే ఎన్నో దీవెనలు పొందుతాం, సాతాను అబద్ధాల వల్ల మోసపోకుండా ఉంటాం. అంతేకాదు, మనం చెడ్డదూతలకు భయపడి యెహోవా సేవ ఆపేయం. అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవాతో మనకున్న స్నేహాన్ని బలపర్చుకుంటాం. శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు, “మీరు దేవునికి లోబడి ఉండండి; అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు. దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.”—యాకో. 4:7, 8.

పాట 150 మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి

^ పేరా 5 చెడ్డదూతల గురించి, వాళ్లు చేసే హాని గురించి యెహోవా మనల్ని ప్రేమతో హెచ్చరించాడు. ఈ చెడ్డదూతలు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు? వాళ్లతో పోరాడడానికి మనం ఏం చేయవచ్చు? వాళ్ల చేతుల్లో మనం మోసపోకుండా ఉండడానికి యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

^ పేరా 3 పదాల వివరణ: మంత్రతంత్రాలు, చెడ్డదూతలకు సంబంధించిన నమ్మకాల్ని, పనుల్ని సూచిస్తున్నాయి. మనుషులు చనిపోయాక వాళ్ల ఆత్మలు బ్రతికే ఉంటాయని, అవి మనుషులతో మాట్లాడతాయని, ముఖ్యంగా ఒక వ్యక్తి (ఒక మాధ్యమం) ద్వారా మాట్లాడతాయని చెప్పే నమ్మకం కూడా మంత్రతంత్రాల్లో ఒక భాగం. అంతేకాదు మంత్రవిద్య, సోదె చెప్పడం కూడా ఆ కోవకే చెందుతాయి. ఈ ఆర్టికల్‌లో మ్యాజిక్‌ అని ప్రస్తావించినప్పుడు, మానవాతీత శక్తుల్ని ఉపయోగించి చేసే పనుల్ని సూచిస్తుంది. అందులో శపించడం, మంత్రాలు ప్రయోగించడం లేదా విడిపించడం ఉన్నాయి. అయితే, కొంతమంది వినోదం కోసం తమ చేతులతో చేసే ట్రిక్స్‌ను అది సూచించట్లేదు.

^ పేరా 12 వినోదం విషయంలో నియమాలు పెట్టే అధికారం సంఘపెద్దలకు లేదు. బదులుగా వేటిని చదవాలో, చూడాలో, లేదా ఆడాలో ఎంచుకునేటప్పుడు ప్రతీ క్రైస్తవుడు తన బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించాలి. తెలివైన కుటుంబ పెద్దలు, తమ కుటుంబం ఎంచుకునే వినోదం బైబిలు సూత్రాలకు తగ్గట్టు ఉందో లేదో చూసుకుంటారు.—jw.org® వెబ్‌సైట్‌లో మా గురించి కింద తరచూ అడిగే ప్రశ్నలు అనే సెక్షన్‌లో “ యెహోవాసాక్షులు కొన్ని సినిమాలను, పుస్తకాలను, పాటలను నిషేధిస్తారా?” ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 54 చిత్రాల వివరణ : పరలోకంలో శక్తిమంతుడైన రాజుగా యేసు తన దూతల సైన్యాన్ని నడిపిస్తున్న చిత్రం. వాళ్ల పైన యెహోవా సింహాసనం ఉంది.