కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 14

మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తున్నారా?

మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తున్నారా?

“మంచివార్తను ప్రకటిస్తూ ఉండు; నీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేయి.”—2 తిమో. 4:5, అధస్సూచి.

పాట 57 అన్నిరకాల ప్రజలకు ప్రకటిద్దాం

ఈ ఆర్టికల్‌లో . . . *

యేసు పునరుత్థానమైన తర్వాత, తన శిష్యుల్ని కలుసుకొని వాళ్లకు ఈ నిర్దేశం ఇచ్చాడు, ‘మీరు వెళ్లి శిష్యుల్ని చేయండి’ (1వ పేరా చూడండి)

1. దేవుని సేవకులందరూ ఏం చేయాలి? ఎందుకు? (ముఖచిత్రం చూడండి.)

యేసుక్రీస్తు తన అనుచరులకు ఇలా ఆజ్ఞాపించాడు, “మీరు వెళ్లి అన్ని దేశాల ప్రజలను శిష్యుల్ని చేయండి.” (మత్త. 28:19) దేవుని నమ్మకమైన సేవకులందరూ తమకు అప్పగించిన పరిచర్యను “పూర్తిస్థాయిలో” ఎలా చేయాలో నేర్చుకోవాలి. (2 తిమో. 4:5) ఎందుకంటే, జీవితంలో మనం చేసే వేరే ఏ పని కన్నా పరిచర్యే చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది, అత్యవసరమైనది. అయినప్పటికీ, కొన్నిసార్లు పరిచర్యలో మనం అనుకున్నంత ఎక్కువ సమయం గడపడం కష్టంగా ఉండవచ్చు.

2. మనం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుండవచ్చు?

2 మనం మన సమయాన్ని, శక్తిని వెచ్చించాల్సిన వేరే ముఖ్యమైన పనులు కూడా ఉంటాయి. ఉదాహరణకు మనల్ని, మన కుటుంబాల్ని పోషించుకోవడానికి చాలా గంటలు పనిచేయాల్సి రావచ్చు. మనకున్న కుటుంబ బాధ్యతలన్నిటినీ నిర్వర్తించడం కష్టంగా ఉండవచ్చు; మనం అనారోగ్యంతో, కృంగుదలతో బాధపడుతుండవచ్చు, లేదా వయసు పైబడడం వల్ల వచ్చే సమస్యలు మనకు ఉండవచ్చు. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా మన పరిచర్యను పూర్తిస్థాయిలో ఎలా చేయవచ్చు?

3. మత్తయి 13:23⁠లోని యేసు మాటల్నిబట్టి మనకు ఏ విషయం అర్థమౌతుంది?

3 మన పరిస్థితులవల్ల మనం యెహోవా సేవలో ఎక్కువ సమయం గడపలేకపోతుంటే నిరుత్సాహపడకూడదు. రాజ్య పనిలో మనందరం ఒకే స్థాయిలో ఫలించలేమని యేసుకు తెలుసు. (మత్తయి 13:23 చదవండి.) మనం దేవుని సేవలో చేయగలిగినదంతా చేస్తున్నంత కాలం, మనం చేసే ప్రతీ పనిని యెహోవా విలువైనదిగా చూస్తాడు. (హెబ్రీ. 6:10-12) అయితే, మన పరిస్థితుల్ని బట్టి ఇంకా ఎక్కువ చేయగలమని మనకు అనిపించవచ్చు. మన జీవితంలో పరిచర్యకు మొదటిస్థానం ఎలా ఇవ్వవచ్చో, మన జీవితాన్ని సాదాసీదాగా ఎలా ఉంచుకోవచ్చో, ప్రకటనా పనిలో, బోధనా పనిలో మన నైపుణ్యాలు ఎలా మెరుగుపర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూద్దాం. ముందుగా, మన పరిచర్యను పూర్తిస్థాయిలో చేయడం అంటే ఏంటో పరిశీలిద్దాం.

4. పరిచర్యను పూర్తిస్థాయిలో చేయడమంటే ఏంటి?

4 ఒక్కమాటలో చెప్పాలంటే వీలైనంత ఎక్కువగా ప్రకటనా పనిలో, బోధనా పనిలో భాగం వహించడం ద్వారా మనం పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తాం. కేవలం ఎక్కువ గంటలు ప్రీచింగ్‌ చేస్తేనే పరిచర్యను పూర్తిస్థాయిలో చేసినట్లు కాదు. మనం ఏ ఉద్దేశంతో ప్రీచింగ్‌ చేస్తున్నామో కూడా యెహోవా చూస్తాడు. మనకు యెహోవా మీద, సాటిమనిషి మీద ప్రేమ ఉంటే మన క్రైస్తవ పరిచర్యను * పూర్తి బలంతో సంతోషంగా చేస్తాం. (మార్కు 12:30, 31; కొలొ. 3:23) అంటే ఆయన సేవలో మన శక్తిసామర్థ్యాల్ని వీలైనంత ఎక్కువగా, సంతోషంగా ఉపయోగిస్తాం. ప్రకటనా పని చేయడం ఒక గొప్ప గౌరవమని మనం అర్థంచేసుకున్నప్పుడు, వీలైనంత ఎక్కువమందికి మంచివార్త ప్రకటించడానికి కృషిచేస్తాం.

5-6. సమయం ఎక్కువ దొరకనివాళ్లు కూడా పరిచర్యకు మొదటిస్థానం ఎలా ఇవ్వవచ్చో ఒక ఉదాహరణ చెప్పండి.

5 ఉదాహరణకు, గిటార్‌ వాయించడమంటే ఇష్టమున్న ఒక యువకుణ్ణి ఊహించుకోండి. అతనికి మ్యూజిక్‌ ప్లే చేయడం ఎంత ఇష్టమంటే, సమయం దొరికినప్పుడల్లా గిటార్‌ వాయిస్తాడు. అయితే, తనను తాను పోషించుకోవడానికి అతను ఒక షాపులో గుమస్తాగా పూర్తికాల ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. అతను ఎక్కువ సమయం ఆ షాపులో పనిచేస్తున్నప్పటికీ, అతని మనసంతా మ్యూజిక్‌ మీదే ఉంటుంది. అతను తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని, ఒక మంచి మ్యుజీషియన్‌ అవ్వాలని పరితపిస్తాడు. దానికోసం, అతను ఏ కాస్త సమయం దొరికినా మ్యూజిక్‌ ప్లే చేస్తూ తనకు తాను శిక్షణ ఇచ్చుకుంటాడు.

6 అదేవిధంగా, మీరు ప్రీచింగ్‌లో అనుకున్నంత ఎక్కువ సమయం గడపలేకపోతుండవచ్చు. కానీ మీకు ఆ పనంటే చాలా ఇష్టం. కాబట్టి మంచివార్త ప్రజల హృదయాల్ని చేరేలా మాట్లాడే మీ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి మీరు కృషిచేస్తారు. అయితే, మీకు చాలా బాధ్యతలు ఉండడంతో, పరిచర్యకు మొదటిస్థానం ఎలా ఇవ్వాలా అని మీరు ఆలోచిస్తుండవచ్చు.

పరిచర్యకు మొదటిస్థానం ఎలా ఇవ్వవచ్చు?

7-8. పరిచర్యకు మొదటిస్థానం ఇచ్చే విషయంలో మనం యేసును ఎలా అనుకరించవచ్చు?

7 పరిచర్యపట్ల సరైన వైఖరితో ఉండే విషయంలో యేసు అత్యుత్తమ ఆదర్శం ఉంచాడు. ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికే జీవితంలో మొదటిస్థానం ఇచ్చాడు. (యోహా. 4:34, 35) వీలైనంత ఎక్కువమందికి మంచివార్త ప్రకటించడానికి ఆయన వందల కిలోమీటర్లు నడిచాడు. ప్రజలకు బహిరంగంగా, ఇంటింటా ప్రకటించడానికి దొరికిన ప్రతీ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. యేసు జీవితమంతా పరిచర్య చుట్టే తిరిగింది.

8 మనం కూడా యేసును అనుకరిస్తూ ఎప్పుడైనా, ఎక్కడైనా మంచివార్త ప్రకటించే అవకాశాల్ని కల్పించుకుంటాం. ప్రకటనా పని కోసం మన సొంత సౌకర్యాల్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాం. (మార్కు 6:31-34; 1 పేతు. 2:21) సంఘంలో కొంతమంది ప్రత్యేక పయినీర్లుగా, క్రమ లేదా సహాయ పయినీర్లుగా సేవ చేస్తున్నారు. ఇంకొంతమంది కొత్త భాష నేర్చుకున్నారు లేదా ప్రచారకుల అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లారు. అయినప్పటికీ, పరిచర్యలో తాము చేయగలిగినదంతా చేయడానికి కృషిచేసే ప్రచారకుల వల్లే ప్రకటనా పని ఎక్కువగా జరుగుతోంది. ఏదేమైనా, మనం చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేయాలని యెహోవా ఆశించడు. ‘సంతోషంగల దేవుడు అప్పగించిన మహిమగల మంచివార్త’ ప్రకటిస్తూ మనందరం తన సేవలో ఆనందించాలని యెహోవా కోరుకుంటున్నాడు.—1 తిమో. 1:11; ద్వితీ. 30:11.

9. (ఎ) డేరాలు కుట్టే పనిచేయాల్సి వచ్చినప్పటికీ పౌలు పరిచర్యకు ఎలా మొదటిస్థానం ఇచ్చాడు? (బి) పరిచర్య విషయంలో పౌలు వైఖరి గురించి అపొస్తలుల కార్యాలు 28:16, 30, 31 ఏం చెప్తున్నాయి?

9 పరిచర్యకు మొదటిస్థానం ఇచ్చే విషయంలో అపొస్తలుడైన పౌలు కూడా చక్కని ఆదర్శం ఉంచాడు. ఆయన తన రెండో మిషనరీ యాత్రలో భాగంగా కొరింథులో ఉన్నప్పుడు, తన దగ్గరున్న డబ్బులు సరిపోకపోవటంతో కొంతకాలం డేరాలు కుట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ, పౌలు ఆ పనికే మొదటిస్థానం ఇవ్వలేదు. ఆయన కొరింథులోని వాళ్లకు మంచివార్త “ఉచితంగా” ప్రకటించేందుకు డేరాలు కుట్టి తనను తాను పోషించుకున్నాడు. (2 కొరిం. 11:7) పౌలు డేరాలు కుట్టే పని చేసినప్పటికీ, ఎప్పటిలాగే పరిచర్యకు మొదటిస్థానం ఇస్తూ ప్రతీ విశ్రాంతి రోజున మంచివార్త ప్రకటించాడు. తన పరిస్థితులు మెరుగయ్యాక పౌలు పరిచర్య మీదే ఎక్కువ దృష్టిపెట్టాడు. ఆయన “తన సమయాన్నంతా వాక్యాన్ని ప్రకటించడంలోనే గడిపాడు. యేసే క్రీస్తని రుజువు చేయడానికి యూదులకు సాక్ష్యమిస్తూ” వచ్చాడు. (అపొ. 18:3-5; 2 కొరిం. 11:9) తర్వాత, రోములో రెండు సంవత్సరాలు గృహనిర్బంధంలో ఉన్నప్పుడు, పౌలు తనను చూడ్డానికి వచ్చినవాళ్లకు సాక్ష్యం ఇచ్చాడు, ఉత్తరాలు కూడా రాశాడు. (అపొస్తలుల కార్యాలు 28:16, 30, 31 చదవండి) తన పరిచర్యకు ఏదీ అడ్డు రాకూడదని పౌలు కోరుకున్నాడు. ఆయనిలా రాశాడు, “దేవుడు . . . మాకు ఈ పరిచర్య ఇచ్చాడు కాబట్టి మేము అధైర్యపడం.” (2 కొరిం. 4:1) ఒకవేళ మనం కూడా ఎక్కువ సమయం ఉద్యోగంలో గడపాల్సి వచ్చినప్పటికీ, పౌలులాగే మన జీవితంలో రాజ్య పనికే మొదటిస్థానం ఇవ్వవచ్చు.

మన పరిచర్యను పూర్తిస్థాయిలో చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి (10-11 పేరాలు చూడండి)

10-11. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మన పరిచర్యను పూర్తిస్థాయిలో ఎలా చేయవచ్చు?

10 వయసు పైబడడం వల్ల లేదా తీవ్ర అనారోగ్యం వల్ల మీరు ఇంటింటి పరిచర్య చేయలేకపోతుంటే, ఇతర మార్గాల్లో పరిచర్య చేస్తూ ఆనందించవచ్చు. మొదటి శతాబ్దపు ప్రచారకులు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ప్రకటించారు. వాళ్లు సత్యం గురించి మాట్లాడడానికి దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు వాళ్లు ఇంటింటా, బహిరంగంగా ప్రకటించారు, రోజూవారి పనుల్లో కలిసేవాళ్లకు కూడా ప్రకటించారు. (అపొ. 17:17; 20:20) మనం ఎక్కువగా నడవలేని స్థితిలో ఉంటే, ప్రజలు వస్తూపోతూ ఉండే ప్రాంతాల్లో కూర్చొని వాళ్లకు ప్రకటించవచ్చు. లేదా మన రోజూవారి పనుల్లో కలిసే ప్రజలకు ప్రకటించవచ్చు, ఉత్తరాలు రాయవచ్చు, టెలిఫోన్‌ సాక్ష్యం ఇవ్వవచ్చు. అనారోగ్యం లేదా ఇతర సమస్యలవల్ల ఇంటింటి పరిచర్య ఎక్కువగా చేయలేని చాలామంది ప్రచారకులు ఇలాంటి మార్గాల్లో ప్రకటించడం ద్వారా ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని పొందుతున్నారు.

11 అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేయవచ్చు. అపొస్తలుడైన పౌలు ఉదాహరణను మళ్లీ పరిశీలించండి. ఆయనిలా అన్నాడు, “నాలో శక్తిని నింపే దేవుని వల్ల దేన్నైనా ఎదుర్కొనే బలం నాకుంది.” (ఫిలి. 4:13) మిషనరీ యాత్రల్లో ఉండగా పౌలుకు ఒకానొక సమయంలో ఆరోగ్యం పాడైనప్పుడు ఆ శక్తి అవసరమైంది. గలతీయులకు ఆయనిలా వివరించాడు, “మీకు మొదటిసారి మంచివార్త ప్రకటించే అవకాశం నాకు రావడానికి కారణం నా అనారోగ్యమేనని మీకు తెలుసు.” (గల. 4:13) అదేవిధంగా, మీ అనారోగ్యం కారణంగా ఇతరులకు మంచివార్త ప్రకటించే అవకాశాలు మీకు రావచ్చు. ఉదాహరణకు డాక్టర్లకు, నర్సులకు, హాస్పిటల్లో పనిచేసే ఇతరులకు ప్రకటించే అవకాశం మీకు రావచ్చు. ప్రచారకులు ఇంటింటి పరిచర్యకు వెళ్లినప్పుడు వీళ్లలో చాలామంది ఇంట్లో ఉండకపోవచ్చు.

మీ జీవితాన్ని సాదాసీదాగా ఎలా ఉంచుకోవచ్చు?

12. మన కన్ను “ఒకే దానిపై దృష్టి” నిలపడం అంటే ఏంటి?

12 యేసు ఇలా చెప్పాడు, “శరీరానికి దీపం కన్నే కాబట్టి, నీ కన్ను ఒకే దానిపై దృష్టి నిలిపితే [లేదా “సరళంగా ఉంటే,” అధస్సూచి] నీ శరీరమంతా ప్రకాశవంతంగా ఉంటుంది.” (మత్త. 6:22) యేసు మాటల భావమేమిటి? మన జీవితాన్ని సరళంగా ఉంచుకోవాలని, మన దృష్టి ఒకే లక్ష్యంపై లేదా ఉద్దేశంపై ఉండాలని, అది పక్కకు మళ్లకూడదని ఆయన చెప్తున్నాడు. యేసు తన జీవితంలో పరిచర్య మీదే దృష్టిపెట్టడం ద్వారా ఒక చక్కని ఆదర్శం ఉంచాడు. అంతేకాదు యెహోవా సేవ మీద, ఆయన రాజ్యం మీద దృష్టిపెట్టమని తన శిష్యులకు బోధించాడు. మనం “[దేవుని] రాజ్యానికి, నీతికి మొదటిస్థానం ఇస్తూ” పరిచర్యకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు యేసును అనుకరించిన వాళ్లమౌతాం.—మత్త. 6:33.

13. క్రైస్తవ పరిచర్య మీద దృష్టిపెట్టడానికి మనకేది సహాయం చేస్తుంది?

13 పరిచర్య మీద దృష్టిపెట్టడానికి ఒక మార్గమేమిటంటే, మన జీవితాన్ని సాదాసీదాగా ఉంచుకోవడం. అప్పుడే, ఇతరులు యెహోవా గురించి తెలుసుకుని, ఆయన్ని ప్రేమించేలా సహాయం చేయడానికి మనం ఎక్కువ సమయం వెచ్చించగలం. * ఉదాహరణకు, వారం మధ్యలో ఎక్కువ పరిచర్య చేసేలా మన పని గంటల్లో ఏమైనా మార్పులు చేసుకోగలమా? ఎక్కువ సమయాన్ని వృథా చేసే కొన్ని ఉల్లాస కార్యక్రమాల్ని మనం తగ్గించుకోగలమా?

14. పరిచర్యకు మొదటిస్థానం ఇవ్వడానికి ఒక జంట ఎలాంటి మార్పులు చేసుకున్నారు?

14 ఇలయస్‌ అనే సంఘపెద్ద, ఆయన భార్య అదే చేశారు. ఆయనిలా చెప్పాడు, “మేము అనుకున్న వెంటనే పయినీరు సేవను మొదలుపెట్టలేకపోయాం, కానీ ప్రీచింగ్‌లో ఎక్కువ సమయం వెచ్చించేలా కొన్ని మార్పులు చేసుకోగలమని అనిపించింది. దాంతో ఎక్కువ పరిచర్య చేసేలా చిన్నచిన్న మార్పులు చేసుకున్నాం. ఉదాహరణకు, మేము మా ఖర్చుల్ని తగ్గించుకున్నాం. ఉల్లాస కార్యక్రమాలకు వెచ్చించే సమయాన్ని తగ్గించుకున్నాం. మా పని గంటల్లో మార్పులు చేయమని మా బాస్‌లను అడిగాం. ఫలితంగా మేము సాయంత్రాలు ప్రీచింగ్‌ చేయగలుగుతున్నాం, ఎక్కువ బైబిలు స్టడీలు చేయగలుగుతున్నాం, నెలలో రెండుసార్లు వారం మధ్యలో ప్రీచింగ్‌ చేయగలుగుతున్నాం. ఇలా చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.”

ప్రకటనా పనిలో, బోధనా పనిలో మీ నైపుణ్యాల్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు?

వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో నేర్చుకున్నవాటిని పాటిస్తే, మనం పరిచర్యలో ప్రగతి సాధిస్తూ ఉండవచ్చు (15-16 పేరాలు చూడండి) *

15-16. మొదటి తిమోతి 4:13, 15 ప్రకారం, ప్రచారకులముగా మన నైపుణ్యాల్ని ఎలా మెరుగుపర్చుకుంటూ ఉండవచ్చు? (“ నా పరిచర్యను పూర్తిస్థాయిలో చేయడానికి సహాయపడే లక్ష్యాలు” అనే బాక్సు కూడా చూడండి.)

15 మన పరిచర్యను పూర్తిస్థాయిలో చేయడానికి మరో మార్గమేమిటంటే, ప్రకటనా పనిలో మన నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవడం. కొన్నిరకాల ఉద్యోగాలు చేసేవాళ్లు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, శిక్షణ తీసుకుంటూ ఉండాలి. రాజ్య ప్రచారకుల విషయంలో కూడా ఇది నిజం. మన పరిచర్యను మరింత నైపుణ్యవంతంగా ఎలా చేయాలో నేర్చుకుంటూనే ఉండాలి.—సామె. 1:5; 1 తిమోతి 4:13, 15 చదవండి.

16 పరిచర్యలో మనమెలా ప్రగతి సాధిస్తూ ఉండవచ్చు? క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌లో ఇచ్చే సూచనల్ని శ్రద్ధగా వినడం ద్వారా మెరుగుపర్చుకోవచ్చు. ప్రీచింగ్‌లో మన నైపుణ్యాల్ని అంతకంతకూ మెరుగుపర్చుకోవడానికి కావాల్సిన విలువైన శిక్షణ ఈ మీటింగ్‌లో దొరుకుతుంది. ఉదాహరణకు, విద్యార్థి నియామకాలు చేసినవాళ్లకు ఛైర్మన్‌ ఇచ్చే సలహాల నుండి మన నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడే విషయాల్ని నేర్చుకోవచ్చు. మనం ఈసారి మంచివార్త ప్రకటించేటప్పుడు వాటిని పాటించవచ్చు. అంతేకాదు మన క్షేత్రసేవా గుంపు పర్యవేక్షకుని సహాయం అడగవచ్చు లేదా ఆయనతో, అనుభవం ఉన్న వేరే ప్రచారకునితో, పయినీరుతో, లేదా ప్రాంతీయ పర్యవేక్షకునితో కలిసి ప్రీచింగ్‌ చేయవచ్చు. బోధనా పనిముట్లలో ఉన్న ప్రతీ పనిముట్టును నైపుణ్యంగా ఉపయోగించడం నేర్చుకునే కొద్దీ ప్రకటనా పనిని, బోధనా పనిని ఇంకా ఆనందిస్తాం.

17. మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తే ఏ ప్రతిఫలం పొందుతారు?

17 యెహోవా మనల్ని తన ‘తోటి పనివాళ్లుగా’ అంగీకరించడం మనకు దొరికిన గొప్ప గౌరవం. (1 కొరిం. 3:9) మీరు ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకుంటూ’ క్రైస్తవ పరిచర్యపై దృష్టిపెడితే, యెహోవాను సంతోషంగా సేవిస్తారు. (ఫిలి. 1:10; కీర్త. 100:2) మీరు దేవుని సేవకుల్లో ఒకరు కాబట్టి ఎలాంటి సమస్యల్లో, పరిస్థితుల్లో ఉన్నా మీకు కావాల్సిన శక్తిని దేవుడు ఇస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. (2 కొరిం. 4:1, 7; 6:4) మీ పరిస్థితుల్ని బట్టి మీరు ప్రీచింగ్‌ ఎక్కువ సమయం చేసినా లేదా తక్కువ సమయం చేసినా, దాన్ని మనస్ఫూర్తిగా చేస్తే సంతోషంగా ఉంటారు. (గల. 6:4) మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేసినప్పుడు యెహోవా మీద, సాటిమనిషి మీద మీకున్న ప్రేమను చూపించిన వాళ్లౌతారు. ‘అలాచేస్తే మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు, మీరు బోధించేది వినేవాళ్లను కూడా రక్షిస్తారు.’—1 తిమో. 4:16.

పాట 58 శాంతిని ప్రేమించేవాళ్ల కోసం వెతుకుదాం

^ పేరా 5 దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించి, శిష్యుల్ని చేయమని యేసు మనకు ఆజ్ఞాపించాడు. అయితే, మన పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నప్పటికీ పరిచర్యను పూర్తిస్థాయిలో ఎలా చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అలాగే మనం నైపుణ్యంగల ప్రచారకులుగా ఎలా తయారవ్వవచ్చో, ప్రకటనా పనిలో మరింత సంతోషాన్ని ఎలా పొందవచ్చో కూడా చూస్తాం.

^ పేరా 4 పదాల వివరణ: మన క్రైస్తవ పరిచర్యలో ప్రకటించడం, బోధించడం, రాజ్యమందిరాల్ని, అసెంబ్లీ హాళ్లను, బెతెల్‌ గృహాలను, అనువాద కార్యాలయాలను నిర్మించడం, వాటికి మరమ్మతులు చేయడం, విపత్తు సహాయక పనులు చేయడం వంటి చాలా పనులు ఉన్నాయి.—2 కొరిం. 5:18, 19; 8:4.

^ పేరా 13 2016, జూలై కావలికోట 10వ పేజీలో “సాదాసీదాగా జీవించాలంటే . . . ” అనే బాక్సులో ఉన్న ఏడు మార్గాల్ని చూడండి.

^ పేరా 62 చిత్రాల వివరణ : వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో ఒక సహోదరి రిటన్‌ విజిట్‌ ప్రదర్శన చేస్తోంది. ఆ తర్వాత, ఛైర్మన్‌ సలహా ఇస్తున్నప్పుడు బోధిద్దాం బ్రోషురులో రాసుకుంటోంది. ఆ రోజు మీటింగ్‌లో నేర్చుకున్నవాటిని వారాంతంలో చేసే పరిచర్యలో ఉపయోగిస్తోంది.