కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 15

యేసును అనుకరిస్తూ మనశ్శాంతిగా ఉండండి

యేసును అనుకరిస్తూ మనశ్శాంతిగా ఉండండి

“మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు . . . కాపలా ఉంటుంది.” —ఫిలి. 4:7.

పాట 113 మనకు అనుగ్రహించబడిన శాంతి

ఈ ఆర్టికల్‌లో . . . *

1-2. యేసు ఎందుకు ఆందోళనపడ్డాడు?

యేసుక్రీస్తు భూమ్మీద గడిపిన చివరి రోజు ఆందోళనపడ్డాడు. ఆయన ఇంకాసేపట్లో, ధర్మశాస్త్రం తెలియనివాళ్ల చేతుల్లో క్రూరంగా చంపబడతాడు. అయితే, యేసు ఆందోళనపడింది కేవలం తన మరణం గురించి మాత్రమే కాదు. ఆయన తన తండ్రిని ఎంతో ప్రేమించాడు, ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకున్నాడు. ఒకవేళ రాబోయే పెద్ద పరీక్షలో తాను నమ్మకంగా ఉంటే, యెహోవా పేరుమీద పడిన నిందల్ని తీసివేయడంలో తోడ్పడతానని యేసుకు తెలుసు. అంతేకాదు, యేసు ప్రజల్ని కూడా ప్రేమించాడు, తాను చనిపోయే వరకు యెహోవాకు నమ్మకంగా ఉంటే, మనుషులందరూ శాశ్వత కాలం జీవించే నిరీక్షణను పొందుతారని యేసుకు తెలుసు.

2 యేసు అంత తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ మనశ్శాంతిని కాపాడుకోగలిగాడు. ఆయన తన అపొస్తలులకు ఇలా చెప్పాడు, “నా శాంతినే మీకు ఇస్తున్నాను.” (యోహా. 14:27) ఆయన ‘దేవుని శాంతిని,’ అంటే ఒకవ్యక్తికి యెహోవాతో ఉన్న అమూల్యమైన సంబంధాన్ని బట్టి కలిగే నెమ్మదిని, ప్రశాంతతను అనుభవించాడు. దానివల్లే యేసు మనశ్శాంతితో ఉండగలిగాడు.—ఫిలి. 4:6, 7.

3. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 యేసు అనుభవించిన లాంటి ఒత్తిడి మనలో ఎవ్వరం అనుభవించం. కానీ యేసును అనుసరించే వాళ్లందరికీ కష్టాలు ఎదురౌతాయి. (మత్త. 16:24, 25; యోహా. 15:20) యేసులాగే కొన్నిసార్లు మనం కూడా ఆందోళనపడతాం. అయితే మనం అతిగా ఆందోళన పడకుండా, మన మనశ్శాంతిని కోల్పోకుండా ఉండడానికి ఏం చేయవచ్చు? యేసు తన భూపరిచర్యలో చేసిన మూడు పనుల్ని ఇప్పుడు పరిశీలించి, కష్టాలు వచ్చినప్పుడు మనం ఆయన్ని ఎలా అనుకరించవచ్చో తెలుసుకుందాం.

యేసు పదేపదే ప్రార్థించాడు

ప్రార్థన చేయడం ద్వారా మనశ్శాంతిని కాపాడుకోవచ్చు (4-7 పేరాలు చూడండి)

4. యేసు భూమ్మీద గడిపిన చివరి రోజంతటిలో చాలాసార్లు ప్రార్థించాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. 1 థెస్సలొనీకయులు 5:17⁠లో క్రైస్తవులకు ఏ సలహా ఇవ్వబడింది?

4 మొదటి థెస్సలొనీకయులు 5:17 చదవండి. యేసు భూమ్మీద గడిపిన చివరి రోజంతటిలో చాలాసార్లు ప్రార్థించాడు. ఉదాహరణకు, తన మరణాన్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలో శిష్యులకు చూపించినప్పుడు ఆయన రొట్టె, ద్రాక్షారసం గురించి ప్రార్థించాడు. (1 కొరిం. 11:23-25) పస్కాను ఆచరించిన తర్వాత, అక్కడి నుండి వెళ్లిపోయేముందు తన శిష్యులతో కలిసి ప్రార్థించాడు. (యోహా. 17:1-26) ఆ రాత్రి యేసు తన శిష్యులతో గెత్సేమనే అనే చోటుకు వెళ్లినప్పుడు పదేపదే ప్రార్థించాడు. (మత్త. 26:36-39, 42, 44) యేసు చనిపోయే ముందు చెప్పిన చివరి మాట కూడా ప్రార్థనలో చెప్పిందే. (లూకా 23:46) యేసు తన జీవితంలోని చివరి రోజున జరిగిన ప్రతీ విషయం గురించి యెహోవాకు ప్రార్థించాడు.

5. అపొస్తలులు ఎందుకు భయపడిపోయారు?

5 యేసు తనకు ఎదురైన పరీక్షను సహించగలగడానికి ఒక కారణం ఏంటంటే, ప్రార్థన ద్వారా తన తండ్రి మీద ఆధారపడడం. కానీ అపొస్తలులు మాత్రం ఆ రాత్రి మెలకువగా ఉండి ప్రార్థించలేకపోయారు. ఫలితంగా, పరీక్ష ఎదురైనప్పుడు వాళ్లు భయపడిపోయారు. (మత్త. 26:40, 41, 43, 45, 56) మనకు పరీక్షలు ఎదురైనప్పుడు యేసును ఆదర్శంగా తీసుకుని, “ప్రార్థన చేస్తూ” ఉంటేనే మనం నమ్మకంగా ఉండగలుగుతాం. ఇంతకీ మనం దేనికోసం ప్రార్థించవచ్చు?

6. మనశ్శాంతిగా ఉండడానికి విశ్వాసం ఎలా సహాయం చేస్తుంది?

6 “ఇంకా బలమైన విశ్వాసం కలిగివుండేలా” సహాయం చేయమని మనం యెహోవాకు ప్రార్థించవచ్చు. (లూకా 17:5; యోహా. 14:1) మనకు విశ్వాసం అవసరం, ఎందుకంటే యేసును అనుసరించే ప్రతీఒక్కరిని సాతాను పరీక్షిస్తాడు. (లూకా 22:31) సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండడానికి విశ్వాసం ఎలా సహాయం చేస్తుంది? ఏదైనా కష్టాన్ని సహించడానికి మనం చేయగలిగినదంతా చేసిన తర్వాత, ఆ విషయాన్ని యెహోవాకు విడిచిపెట్టేలా విశ్వాసం మనకు సహాయం చేస్తుంది. ఒక సమస్యను ఎలా పరిష్కరించాలో మనకన్నా బాగా యెహోవాకు తెలుసని మనం నమ్ముతాం, దానివల్ల మన హృదయం, మనసు ప్రశాంతంగా ఉంటాయి.—1 పేతు. 5:6, 7.

7. రాబర్ట్‌ మాటల నుండి మీరేం నేర్చుకున్నారు?

7 మనకు ఎలాంటి పరీక్షలు ఎదురైనా మన మనశ్శాంతిని కాపాడుకోవడానికి ప్రార్థన సహాయం చేస్తుంది. 80 ఏళ్లు దాటిన రాబర్ట్‌ అనే నమ్మకమైన సంఘపెద్ద ఉదాహరణ పరిశీలించండి. ఆయనిలా చెప్పాడు, “నాకు ఎదురైన ఎన్నో కష్టాల్ని తట్టుకోవడానికి ఫిలిప్పీయులు 4:6, 7⁠లో ఉన్న సలహా ఉపయోగపడింది. నేను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొంతకాలంపాటు సంఘపెద్దగా సేవచేసే అవకాశాన్ని కోల్పోయాను.” మరి రాబర్ట్‌ తన మనశ్శాంతిని ఎలా కాపాడుకోగలిగాడు? “నాకు ఆందోళనగా అనిపించిన వెంటనే ప్రార్థించేవాణ్ణి. నేను ఎంత తరచుగా, ఎంత పట్టుదలగా ప్రార్థిస్తే అంత ప్రశాంతంగా ఉండేవాణ్ణి.”

యేసు ఉత్సాహంగా ప్రకటించాడు

ప్రకటనా పని చేయడం ద్వారా మనశ్శాంతిని కాపాడుకోవచ్చు (8-10 పేరాలు చూడండి)

8. యోహాను 8:29 చెప్తున్నట్లు, యేసు మనశ్శాంతితో ఉండడానికి మరో కారణం ఏంటి?

8 యోహాను 8:29 చదవండి. హింసలు అనుభవిస్తున్నా, యేసు మనశ్శాంతిని కోల్పోలేదు. ఎందుకంటే హింసల్ని నమ్మకంగా సహించడం ద్వారా తన తండ్రిని సంతోషపెడుతున్నానని యేసుకు తెలుసు. కష్టంగా అనిపించిన సమయాల్లో కూడా ఆయన విధేయత చూపించాడు. ఆయన తన తండ్రిని ప్రేమించాడు, యెహోవా సేవకే జీవితంలో మొదటిస్థానం ఇచ్చాడు. యేసు భూమ్మీదకు రాకముందు, దేవుని ‘ప్రధానశిల్పిగా’ పనిచేశాడు. (సామె. 8:30) భూమ్మీదున్నప్పుడు తన తండ్రి గురించి ఇతరులకు ఉత్సాహంగా బోధించాడు. (మత్త. 6:9; యోహా. 5:17) ఆ పని యేసుకు ఎంతో సంతోషాన్నిచ్చింది.—యోహా. 4:34-36.

9. ప్రకటనా పనిలో బిజీగా ఉంటే, మన మనశ్శాంతిని ఎలా కాపాడుకోవచ్చు?

9 మనం యెహోవాకు విధేయత చూపించడం ద్వారా, “ఎప్పుడూ ప్రభువు సేవలో నిమగ్నమై” ఉండడం ద్వారా యేసును అనుకరించవచ్చు. (1 కొరిం. 15:58) మన “సమయాన్నంతా” ప్రకటనా పనికోసం వెచ్చించినప్పుడు, మన సమస్యల్ని సరైన దృష్టితో చూడగలుగుతాం. (అపొ. 18:5) ఉదాహరణకు, మనం ప్రీచింగ్‌లో కలిసే ప్రజలు తరచూ మనకన్నా ఘోరమైన సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. అయితే వాళ్లు యెహోవాను ప్రేమించడం నేర్చుకున్నప్పుడు, ఆయన సలహాలు పాటించినప్పుడు వాళ్ల జీవితాలు మెరుగౌతాయి, వాళ్ల సంతోషం రెట్టింపు అవుతుంది. అలా జరగడం చూసిన ప్రతీసారి, యెహోవా మనపట్ల శ్రద్ధ చూపిస్తాడనే నమ్మకం మనలో పెరుగుతుంది. ఆ నమ్మకం మనం మనశ్శాంతిగా ఉండడానికి సహాయం చేస్తుంది. ఈ విషయం నిజమని ఒక సహోదరి స్వయంగా రుచిచూసింది. ఆమె తన జీవితమంతా కృంగుదలతో, ఎందుకూ పనికిరానిదాన్ననే భావాలతో పోరాడింది. ఆమె ఇలా చెప్తుంది, “నేను పరిచర్యలో బిజీగా ఉన్నప్పుడు, నా భావాల్ని అదుపు చేసుకోగలుగుతాను, ఎక్కువ సంతోషంగా ఉండగలుగుతాను. ఎందుకంటే ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు నేను యెహోవాకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది.”

10. బ్రెండా మాటల నుండి మీరేం నేర్చుకున్నారు?

10 బ్రెండా అనే సహోదరి ఉదాహరణ కూడా పరిశీలించండి. ఆమె, ఆమె కూతురు తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారు. బ్రెండా చక్రాల కుర్చీకి పరిమితమైంది, ఒంట్లో శక్తి కూడా తగ్గిపోయింది. ఆమె వీలైనప్పుడల్లా ఇంటింటి పరిచర్య చేస్తుంది, కానీ ఎక్కువ శాతం ఉత్తరాల ద్వారా సాక్ష్యమిస్తుంది. ఆమె ఇలా చెప్తుంది, “ఈ లోకంలో నా జబ్బు నయం కాదని అర్థంచేసుకున్నప్పుడు ఇక పరిచర్య మీదే దృష్టిపెట్టాను. పరిచర్య చేసినప్పుడు నా ఆందోళనల్ని మర్చిపోతాను. బదులుగా, నేను కలిసే వాళ్లకు సహాయం చేయడం మీదే దృష్టిపెడతాను. అంతేకాదు నేను ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు, నా భవిష్యత్తు నిరీక్షణ గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటాను.”

యేసు తన స్నేహితుల సహాయం తీసుకున్నాడు

మంచి స్నేహితులతో సహవసించడం ద్వారా మనశ్శాంతిని కాపాడుకోవచ్చు (11-15 పేరాలు చూడండి)

11-13. (ఎ) అపొస్తలులు అలాగే మరితరులు యేసుకు మంచి స్నేహితులుగా ఉన్నారని ఎలా చూపించారు? (బి) యేసు స్నేహితులు ఆయన మీద ఎలాంటి ప్రభావం చూపించారు?

11 యేసు భూపరిచర్య అంతటిలో, నమ్మకమైన అపొస్తలులు ఆయనకు నిజమైన స్నేహితులుగా ఉన్నారు. “సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు” అనే సామెతకు వాళ్లు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. (సామె. 18:24) యేసు అలాంటి స్నేహితుల్ని విలువైనవాళ్లుగా చూశాడు. యేసు పరిచర్య చేసినప్పుడు, ఆయన తమ్ముళ్లు ఎవ్వరూ ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. (యోహా. 7:3-5) ఒకానొక సమయంలో ఆయన బంధువులు ఆయనకు “పిచ్చి పట్టింది” అని కూడా అన్నారు. (మార్కు 3:21) అయితే వాళ్లకు భిన్నంగా, నమ్మకమైన అపొస్తలులు యేసుకు నిజమైన స్నేహితులుగా ఉన్నారు. అందుకే ఆయన చనిపోవడానికి ముందురోజు రాత్రి వాళ్లతో ఇలా చెప్పగలిగాడు, “నా పరీక్షల్లో నన్ను అంటిపెట్టుకొని ఉన్నవాళ్లు మీరే.”—లూకా 22:28.

12 అపొస్తలులు కొన్నిసార్లు యేసుకు బాధ కలిగించారు. కానీ ఆయన వాళ్ల పొరపాట్ల మీద మనసు పెట్టకుండా వాళ్లకు తనమీద ఉన్న విశ్వాసాన్ని చూశాడు. (మత్త. 26:40; మార్కు 10:13, 14; యోహా. 6:66-69) యేసు చనిపోవడానికి ముందురోజు రాత్రి, ఈ నమ్మకమైన పురుషులతో ఇలా అన్నాడు, “నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను, ఎందుకంటే నా తండ్రి దగ్గర విన్న వాటన్నిటినీ నేను మీకు తెలియజేశాను.” (యోహా. 15:15) యేసును ఆయన స్నేహితులు ఎంతో ప్రోత్సహించారని చెప్పడంలో ఏ సందేహం లేదు. వాళ్లు పరిచర్యలో తనకు చేసిన సహాయాన్ని బట్టి యేసు చాలా సంతోషించాడు.—లూకా 10:17, 21.

13 అపొస్తలులే కాకుండా యేసుకు ఇంకొంతమంది స్త్రీపురుషులు కూడా స్నేహితులుగా ఉన్నారు. వాళ్లు యేసు పరిచర్య చేసిన కాలంలో ఆయన అవసరాల్లో సహాయపడ్డారు. వాళ్లలో కొంతమంది యేసును భోజనానికి తమ ఇంటికి ఆహ్వానించారు. (లూకా 10:38-42; యోహా. 12:1, 2) ఇంకొంతమంది యేసుతో పాటు ప్రయాణించారు, తమ దగ్గరున్న వాటిని ఆయనతో పంచుకున్నారు. (లూకా 8:3) యేసుకు మంచి స్నేహితులు దొరికారు, ఎందుకంటే ఆయన వాళ్లకు మంచి స్నేహితునిగా ఉన్నాడు. ఆయన వాళ్లకోసం మంచిపనులు చేశాడు, వాళ్లు చేయగలిగిన దానికన్నా ఎక్కువ వాళ్లనుండి ఆశించలేదు. యేసు పరిపూర్ణుడు అయినప్పటికీ తన అపరిపూర్ణ స్నేహితులు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞత చూపించాడు. ఆయన మనశ్శాంతిని కాపాడుకోవడానికి వాళ్లు ఖచ్చితంగా సహాయపడివుంటారు.

14-15. మనం మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవచ్చు? వాళ్లు మనకెలా సహాయం చేస్తారు?

14 మనం యెహోవాకు నమ్మకంగా ఉండడానికి మంచి స్నేహితులు సహాయం చేస్తారు. మంచి స్నేహితుల్ని సంపాదించుకునే శ్రేష్ఠమైన మార్గమేమిటంటే, మనం వాళ్లకు మంచి స్నేహితులుగా ఉండడం. (మత్త. 7:12) ఉదాహరణకు మన సమయాన్ని, శక్తిని ఇతరుల కోసం ముఖ్యంగా “అవసరంలో” ఉన్నవాళ్ల కోసం ఉపయోగించమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (ఎఫె. 4:28) మీ సంఘంలో ఎవరికి మీ సహాయం అవసరమో ఆలోచించగలరా? వృద్ధాప్యం వల్ల లేదా అనారోగ్యం వల్ల ఇల్లు కదల్లేని వాళ్లకోసం కావాల్సిన వస్తువులు తెచ్చిపెట్టగలరా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని మీ ఇంటికి భోజనానికి ఆహ్వానించగలరా? jw.org® వెబ్‌సైట్‌ అలాగే JW లైబ్రరీ యాప్‌ ఎలా ఉపయోగించాలో మీకు తెలిస్తే, సంఘంలోని ఇతరులకు వాటిని ఉపయోగించే విషయంలో సహాయం చేయగలరా? మనం ఇతరులకు సహాయం చేయడంలో బిజీగా ఉంటే సంతోషంగా ఉంటాం.—అపొ. 20:35.

15 మనం కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మన స్నేహితులు మనకు అండగా ఉంటారు, అలాగే మన మనశ్శాంతిని కాపాడుకోవడానికి సహాయం చేస్తారు. యోబు తన కష్టాల గురించి చెప్పుకుంటున్నప్పుడు ఎలీహు విన్నట్లే, మన బాధల్ని చెప్పుకుంటున్నప్పుడు కూడా మన స్నేహితులు ఓపిగ్గా వినడం ద్వారా మనకు సహాయం చేస్తారు. (యోబు 32:4) మన కోసం మన స్నేహితులు నిర్ణయాలు తీసుకోవాలని మనం ఆశించకూడదు. కానీ వాళ్లు ఇచ్చే బైబిలు ఆధారిత సలహాల్ని వింటే తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. (సామె. 15:22) రాజైన దావీదు తన స్నేహితుల సహాయాన్ని వినయంగా అంగీకరించినట్లే, మనం కూడా అవసరంలో ఉన్నప్పుడు మన స్నేహితులు చేసే సహాయాన్ని వినయంగా అంగీకరించాలి. (2 సమూ. 17:27-29) నిజానికి అలాంటి మంచి స్నేహితులు యెహోవా ఇచ్చే బహుమానమే.—యాకో. 1:17.

మనశ్శాంతిని ఎలా కాపాడుకోవచ్చు?

16. ఫిలిప్పీయులు 4:6, 7 ప్రకారం, మనం మనశ్శాంతిని ఎవరి ద్వారా పొందగలం? వివరించండి.

16 ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి. తానిచ్చే శాంతిని మనం “క్రీస్తుయేసు ద్వారా” పొందగలమని యెహోవా ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే, మనం యేసుక్రీస్తు పాత్రను అర్థంచేసుకుని, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మన హృదయాల్లో, మనసుల్లో శాశ్వతమైన శాంతిని పొందగలుగుతాం. ఉదాహరణకు, యేసు విమోచన క్రయధనం ద్వారా మన పాపాలన్నీ క్షమించబడతాయి. (1 యోహా. 2:12) ఆ ఆలోచన మనకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది! యేసు దేవుని రాజ్యానికి రాజుగా సాతాను, అతని వ్యవస్థ మనకు చేసిన నష్టాన్నంతా పూరిస్తాడు. (యెష. 65:17; 1 యోహా. 3:8; ప్రక. 21:3, 4) అది మనకు అద్భుతమైన నిరీక్షణను ఇస్తుంది! యేసు మనకు కష్టమైన నియామకం ఇచ్చినప్పటికీ, ఆయన మనతో ఉన్నాడు, ఈ వ్యవస్థ చివరిరోజుల్లో మనకు మద్దతిస్తున్నాడు. (మత్త. 28:19, 20) అది మనలో ఎంతో ధైర్యాన్ని నింపుతుంది! ఉపశమనం, నిరీక్షణ, ధైర్యం ఇవి మన మనశ్శాంతిని కాపాడుకోవడానికి సహాయం చేస్తాయి.

17. (ఎ) ఒకవ్యక్తి తన మనశ్శాంతిని ఎలా కాపాడుకోవచ్చు? (బి) యోహాను 16:33⁠లో ఉన్న యేసు మాటల్ని బట్టి, మనం ఏం చేయగలం?

17 కాబట్టి, తీవ్రమైన కష్టాల వల్ల మీరు బాధపడుతున్నప్పుడు మీ మనశ్శాంతిని ఎలా కాపాడుకోవచ్చు? అందుకోసం మీరు యేసు చేసిన పనులే చేయాలి. మొదటిగా ప్రార్థించండి, పట్టుదలగా ప్రార్థిస్తూనే ఉండండి. రెండోదిగా, కష్టమైన పరిస్థితుల్లో కూడా యెహోవాకు లోబడండి, ఉత్సాహంగా ప్రకటించండి. మూడోదిగా, కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్నేహితుల సహాయం తీసుకోండి. అప్పుడు, దేవుని శాంతి మీ హృదయాలకు, మనసులకు కాపలా ఉంటుంది. యేసులాగే మీరు కూడా ఏ పరీక్షలోనైనా విజయం సాధించగలుగుతారు.—యోహాను 16:33 చదవండి.

పాట 41 దయచేసి నా ప్రార్థన ఆలకించు

^ పేరా 5 మనశ్శాంతిని కోల్పోయేలా చేసే ఎన్నో సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాం. ఈ ఆర్టికల్‌లో యేసు చేసిన మూడు పనుల గురించి చూస్తాం. మనం తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండడానికి ఆ మూడు పనులు ఎలా సహాయం చేస్తాయో పరిశీలిస్తాం.