కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

చనిపోవడానికి కాస్త ముందు కీర్తన 22:1లోని మాటల్ని యేసు ఎందుకు అన్నాడు?

యేసు తను చనిపోవడానికి కాస్త ముందు, మత్తయి 27:46 లో రాయబడిన ఈ మాటల్ని అన్నాడు: “నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?” అలా అనడం ద్వారా ఆయన కీర్తన 22:1 లోని దావీదు మాటల్ని నెరవేర్చాడు. (మార్కు 15:34) యేసు అలా అన్నాడంటే, ఆయన నిరుత్సాహపడ్డాడనో లేదా ఆ క్షణంలో ఆయన విశ్వాసం తగ్గిపోయిందనో మనం అనుకోకూడదు. తను ఎందుకు చనిపోవాలో యేసుకు బాగా తెలుసు, అంతేకాదు తన ప్రాణం అర్పించడానికి ఆయన ఇష్టపూర్వకంగా ముందుకొచ్చాడు. (మత్త. 16:21; 20:28) తను చనిపోయేటప్పుడు, యెహోవా తనను కాపాడడం ఆపేయాల్సి ఉంటుందని కూడా యేసుకు తెలుసు. (యోబు 1:10) అలా ఆపేయడం వల్ల, ఎంత కష్టమైన మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా నమ్మకంగా ఉంటానని నిరూపించుకునే అవకాశం యేసుకు దొరికింది.—మార్కు 14:35, 36.

మరైతే ఈ కీర్తనలోని మాటల్ని యేసు ఎందుకు అన్నాడు? ఆయన ఎందుకు అలా అన్నాడో మనకు ఖచ్చితంగా తెలీదు, కానీ బహుశా ఆయన ఎందుకు అలా అనివుంటాడో తెలిపే కొన్ని కారణాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. *

బహుశా తను చనిపోయేటప్పుడు యెహోవా సహాయం చేయడని యేసు స్పష్టం చేస్తుండవచ్చు. ఆయన యెహోవా సహాయం లేకుండానే విమోచన క్రయధనాన్ని అర్పించాలి. ‘ప్రతీ మనిషి కోసం మరణాన్ని రుచి చూసేందుకు’ ఆయన చనిపోవాలి.—హెబ్రీ. 2:9.

బహుశా వినేవాళ్లు ఆ కీర్తన అంతటి గురించి ఆలోచించాలని యేసు కోరుకుని ఉండవచ్చు. ఆ కాలంలో, యూదా ప్రజలు చాలా కీర్తనల్ని కంఠస్థం చేసేవాళ్లు. ఏదైనా కీర్తనలోని ఒక వచనం విన్నప్పుడు, వాళ్లకు సహజంగానే మొత్తం కీర్తన గుర్తొచ్చేది. ఒకవేళ యేసు ఉద్దేశం అదే అయితే, తన మరణం గురించి ఆ కీర్తనలో ఉన్న ఎన్నో ప్రవచనాల్ని తనను అనుసరిస్తున్న యూదులకు గుర్తుచేయాలన్నది ఆయన కోరిక అయ్యుండవచ్చు. (కీర్త. 22:7, 8, 15, 16, 18, 24) అంతేకాదు, ఆ కీర్తనలోని చివరి వచనాలు యెహోవా రాజరికం భూమంతటా విస్తరిస్తుందని చెప్తున్నాయి.—కీర్త. 22:27-31.

బహుశా తను నిర్దోషినని యేసు స్పష్టం చేస్తుండవచ్చు. యేసు చనిపోవడానికి ముందు, మహాసభ ఆయన్ని చట్ట వ్యతిరేకంగా విచారణ చేసి, దైవదూషకుడని తీర్పు తీర్చింది. (మత్త. 26:65, 66) మహాసభ సభ్యులందరూ రాత్రికిరాత్రే సమకూడి, చట్టానికి విరుద్ధంగా విచారణ చేశారు. (మత్త. 26:59; మార్కు 14:56-59) “నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?” అని అడగడం ద్వారా, తను ఏ తప్పూ చేయకపోయినా ఇలా అన్యాయంగా శిక్షిస్తున్నారనే వాస్తవాన్ని యేసు స్పష్టం చేస్తుండవచ్చు.

ఈ కీర్తనను రాసిన దావీదు కూడా బాధలు అనుభవించాడు, అంతమాత్రాన ఆయన యెహోవా ఆమోదం కోల్పోయినట్టు కాదని యేసు గుర్తు చేస్తుండవచ్చు. దావీదు అలా అడిగాడంటే ఆయన విశ్వాసం కోల్పోయాడని కాదు. ఆ ప్రశ్న అడిగిన తర్వాత, యెహోవా రక్షణ శక్తి మీద తనకున్న నమ్మకాన్ని దావీదు తెలియజేశాడు, యెహోవా కూడా ఆయన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. (కీర్త. 22:23, 24, 27) అదేవిధంగా, ‘దావీదు కుమారుడైన’ యేసు హింసాకొయ్య మీద బాధను అనుభవిస్తున్నంత మాత్రాన, యెహోవా ఆమోదం కోల్పోయినట్టు కాదు.—మత్త. 21:9.

తన యథార్థతను పూర్తిగా నిరూపించుకోవడం కోసం యెహోవా తనను కాపాడడం ఆపేయాల్సి ఉంటుంది, ఆ వాస్తవాన్ని బట్టి తనకు ఎంత బాధగా ఉందో యేసు తెలియజేస్తుండవచ్చు. యెహోవా తన కుమారుణ్ణి సృష్టించింది బాధలు అనుభవించి, చనిపోవడం కోసం కాదు. కానీ, ఆదాముహవ్వలు తిరుగుబాటు చేసిన తర్వాత ఆయన అలా చేయాల్సి వచ్చింది. యేసు ఏ తప్పూ చేయలేదు. అయినా, సాతాను లేవదీసిన ప్రశ్నలకు జవాబివ్వడానికి, అలాగే మనుషులు కోల్పోయిన దాన్ని తిరిగి కొనడానికి యేసు బాధలు అనుభవించి, చనిపోవాల్సి వచ్చింది. (మార్కు 8:31; 1 పేతు. 2:21-24) యెహోవా కొన్ని క్షణాల పాటు యేసును కాపాడడం ఆపేస్తేనే అది సాధ్యం అవుతుంది. యెహోవా యేసును అలా విడిచిపెట్టడం ఇదే మొట్టమొదటిసారి.

ఈ విధంగా చనిపోవడానికి యెహోవా ఎందుకు అనుమతిస్తున్నాడో తన అనుచరులు అర్థం చేసుకునేలా యేసు సహాయం చేస్తుండవచ్చు. * తను నేరస్తునిలా హింసాకొయ్య మీద చనిపోవడం చాలామందికి అడ్డురాయిగా ఉంటుందని యేసుకు తెలుసు. (1 కొరిం. 1:23) ఆయన మరణానికి అసలు కారణం ఏంటో తెలుసుకుంటే, ఆయన అనుచరులు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. (గల. 3:13, 14) అప్పుడు వాళ్లు ఆయన్ని నేరస్తునిలా కాకుండా, రక్షకునిలా చూడగలుగుతారు.

యేసు ఈ మాటలు అనడానికి కారణం ఏదైనా, తను అనుభవిస్తున్నది యెహోవా ఇష్టంలో భాగమని ఆయనకు తెలుసు. కీర్తనలోని ఆ మాటలు అన్న కాసేపటికి, “అంతా పూర్తయింది!” అని యేసు అన్నాడు. (యోహా. 19:30; లూకా 22:37) అవును, కొన్ని క్షణాల పాటు యెహోవా తనను కాపాడడం ఆపేసినందు వల్లే, తను భూమ్మీదికి వచ్చిన పనిని యేసు పూర్తిగా నెరవేర్చగలిగాడు. అంతేకాదు తన గురించి “ధర్మశాస్త్రంలో, ప్రవక్తల పుస్తకాల్లో, కీర్తనల పుస్తకంలో రాసినవన్నీ” ఆయన నెరవేర్చగలిగాడు.—లూకా 24:44.

^ పేరా 2 ఈ పత్రికలోని “యేసు చివరి మాటల నుండి ఏం నేర్చుకోవచ్చు?” ఆర్టికల్‌లో 9, 10 పేరాలు కూడా చూడండి.

^ పేరా 4 పరిచర్య చేసేటప్పుడు, యేసు కొన్నిసార్లు అన్న మాటల్లో లేదా అడిగిన ప్రశ్నల్లో ఉన్నవి నిజానికి ఆయన అభిప్రాయాలు కావు. తన అనుచరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం ఆయన అలా మాట్లాడేవాడు.—మార్కు 7:24-27; యోహా. 6:1-5; కావలికోట, అక్టోబరు 15, 2010, 4-5 పేజీలు చూడండి.